[box type=’note’ fontsize=’16’] ప్రకృతెప్పుడూ సమ్మోహనమేననీ, మనిషికే సవాలక్ష కోరికలంటున్నారు సి.ఎస్.రాంబాబు “సమ్మోహనంగా సవాలక్ష” కవితలో. [/box]
[dropcap]గ్రీ[/dropcap]ష్మానికి రోషమొచ్చినట్టుంది
‘చరిష్మా’ చూపిస్తోంది
మధ్యాహ్న మార్తాండుడు
యుద్ధప్రకటన చేసినట్టు
కిరణాలను నిప్పుకణికలుగాచేసి
నగరకుంపటిని రాజేస్తున్నాడు
రాజయినా బంటయినా
ఇంటిబాటపడుతున్నారు
పడుతూలేస్తూ
పస్తులున్న పేదమారాజులు
పట్టెడన్నానికి
మస్తుగున్న ధనమారాజులు
చల్లదనపు కలుగుల్లోకి
పగబట్టిన గాలి
పండువెన్నెలను వదలనంటోంది
కర్మసాక్షి కోపానికి
తథాగతుడు మౌనంగా
లోలోపల నవ్వుకుంటున్నాడేమో
ఋతుమోహనమెప్పుడూ సమ్మోహనమే
మనిషికే సవాలక్షకోరికలంటూ.