[dropcap]“ఏ[/dropcap]మోయ్ వసుధా, ఏమిటి నిన్నటి నుంచి తెగ ఇల్లు అలంకరిస్తున్నావు. చేగోడీలు, గులాబ్‌జామ్ అన్నీ చేశావు, ఏంటి సంగతి కూతురు, అల్లుడు వస్తున్నారా లేక ఇంకెవరైనా వి.ఐ.పి.లు వస్తున్నారా?” అని అడిగాడు శేఖరం.
“వస్తున్నారు మన కోడలి అమ్మ, నాన్న గారు, కార్తీక మాసం కదా! కూతురినీ అల్లుడినీ తీసుకుని తిరుపతి వెళ్తారంట” అంది వసుధ.
కొడుకు పెళ్ళయి ఆర్నెల్లు అయింది, కోడలు బాగా చదువుకున్న అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. మంచి పిల్ల. మామగారంటే గౌరవం, కానీ అత్తగారంటే మటుకు చిన్న చులకన భావం. ఎందుకంటే అత్తగారు ఎక్కువ చదువుకోలేదని, ఏమీ తెలియదని. అందుకే తను ఏదైనా అడిగితే సరిగ్గా సమాధానం చెప్పదు.
అటుగా వెళ్తున్న కోడలుని పిలిచింది వసుధ.
ఏంటి అన్నట్లు చూసింది శుభ.
“రేపు మీ అమ్మ, నాన్న వస్తున్నారు కదా! వాళ్లకి ఏమి ఇష్టమో చెప్పు అదే చేస్తానమ్మా” అంది వసుధ.
వాళ్లకు ఇష్టమైనవి చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది.
మర్నాటికి కావలసిన కూరగాయలు అవి కోసి ఫ్రిజ్‌లో పెట్టింది.
పాలు పొయ్యి మీద పెట్టింది.
***
కూతుర్ని చూడటానికి వచ్చారు సీతయ్య, రమణమ్మ.
అమ్మా అంటూ అమాంతం తల్లిని వాటేసుకుంది.
“ఏమ్మా బాగున్నావా?” అన్నారు సీతయ్య.
కానీ వాళ్లకు కూతుర్ని చూడగానే అర్థమైంది ఎంత బాగుందో. ఎందుకంటే మాసిన చీర, మొహం నిండా మసి సన్నగా పుల్లలాగా ఉంది.
“మీ పిల్లనేమి మేము రాచిరంపాన పెట్టడం లేదు. అయినా ఇప్పుడు ఎందుకు వచ్చారు” అని అడిగింది అత్తగారు అండాళమ్మ.
“అమ్మాయిని, అల్లుడిని పండక్కి పిలవడానికి వచ్చాము” అన్నారు సీతయ్య భయపడతూ.
“ఆ, వస్తే వచ్చారు, కట్నం బాకీ తెచ్చారా” అన్నది కంచు కంఠంతో
“లేదండి, సర్దుబాటు కాలేదు” అన్నాడు సీతయ్య.
“కట్నం బాకీ తేలేదు గాని ఇంకా పండక్కి నీ కూతుర్ని, అల్లుడిని తీసుకునిపోయి ఏం పెడతావు.. డబ్బులు తెచ్చి ఇవ్వండి మర్యాదగా. లేకపోతే ఇంకెప్పుడు కూడా మీ అమ్మాయిని మీ ఇంటికి పంపను” అంది అత్తగారు.
“మీ మామగారు, మీ ఆయన, మరుదులు వస్తారు. వాళ్ళు భోంచేశాక మీ అమ్మ, నాన్నకి భోజనం పెట్టు. నేను భోజనం చేసి సినిమాకి వెళ్తాను” అని చెప్పి దఢాలున తలుపు వేసేసింది.
అందరూ తినగా మిగిలిన కొంచెం అన్నం తల్లి, తండ్రికి వడ్డించింది.
“నువ్వు తిన్నావా అమ్మా” అని అడిగారు. “తరువాత తింటానులెండి నాన్నా” అంది.
ఆ రోజు నుంచి కూతురు ఇంట్లో భోజనం చేయలేదు వాళ్ళు. వచ్చి చూసి వెళ్ళి పోయేవారు. వెళుతూ “అభిమానం సంపాదించడానికి ఆస్తులు అవసరం లేదు. నీ అణుకువతో ఎలాగైనా మీ అత్తగారి అభిమానం సంపాదించు” అని చెప్పి వెళ్ళిపోయారు.
భర్త ఉద్యోగరీత్యా దూరంగా వచ్చేసారు.
అమ్మ, నాన్నని పిలుద్దామా అంటే వయోభారం వల్ల రాలేకపోయారు. తర్వాత కాలం చేశారు.
***
“ఏంటి పాలు పొయ్యి మీద పెట్టి ఆలోచిస్తున్నారు? పాలు పొంగిపోతున్నాయి” అన్న కోడలు శుభ మాటలకు ఈ లోకంలోకి వచ్చింది ఆనాటి కోడలు, ఈనాటి అత్తగారైన వసుధ.
“అమ్మ శుభా, రేపు బొబ్బట్లు, పులావు చేస్తున్నాను. మీకు ట్రైన్ లోకి చపాతీలు పన్నీర్ కూర చెయ్యనా” “సరే, ఏదో ఒకటి చెయ్యండి.”
అని తన గదిలోకి వెళ్ళి భర్త మధుతో “ఏంటి మీ అమ్మ? మా అమ్మ, నాన్నగారు వస్తుంటే ఈవిడ సొంత అన్నగారు, వదిన వస్తున్నట్లు ఎందుకు అంత హడావిడి? మరీ ఎక్స్‌ట్రాలు కాకపోతే? ఏదో ఒకటి రేపటికి ఆర్డర్ చేసేదాన్ని కదా!” అంది శుభ.
“ఎంత మాట అన్నావు శుభా. అమ్మ తన పెళ్లయ్యాక తన తల్లికి, తండ్రికి ఏనాడు తన చేత్తో వండి పెట్టలేదు. తనకు ఆ స్వాతంత్రం లేదు. మా నానమ్మకు అమ్మ తరపు వాళ్ళంటే ఇష్టం ఉండేది కాదు. ఆమెకు స్వాతంత్రం వచ్చేసరికి అమ్మమ్మ, తాతయ్య కాలం చేశారు. తనలా నువ్వు బాధపడకూడదని మీ అమ్మా, నాన్న ఫీల్ అవకూడదని తన సొంత అన్నయ్య, వదిన అనుకొని అన్నీ చేస్తుంది. నీ మనసుకు నచ్చింది చేయడంలో తప్పులేదు కానీ వేరొకరి మనసు నొప్పించి చేయడం పెద్ద తప్పు” అన్నాడు మధు శుభను దగ్గరకు తీసుకుంటూ.
ఆ మాటకు శుభ ఆశ్చర్య పోయింది.
‘తన అత్తగారి మనసులో ఇంత బాధ ఉన్నదా? తను బాధపడకూడదని తను ఎన్ని సూటిపోటి మాటలు అన్నా కూడా తనని ఏమీ అనలేదు, అత్తగారి హోదాలో ఉండి కూడా. ఆవిడ సంస్కారం ముందు నా చదువెంత నేనెంత’ అనుకుంది.
అత్తగారి దగ్గరికి వెళ్లి చేతులు పట్టుకుని “నన్ను క్షమించండి అత్తయ్యా” అంది శుభ.
“పర్వాలేదమ్మా” అని దగ్గరకు తీసుకుంది కోడలిని.
“నాకు నువ్వు వేరు, నా కూతురు వేరు కాదు. నాకు ఇద్దరూ సమానమే. మీరిద్దరూ నాకు రెండు కళ్ళలాంటి వారు” అంది వసుధ.
అత్తగారి సంస్కారానికి శుభ పొంగిపోయింది.