Site icon Sanchika

సంస్కారం

[dropcap]”ఆ[/dropcap]నంద్! తాతగారి ఇల్లు ఈమధ్య వచ్చిన వరదలకు కూలిపొయింది. వంద ఏళ్ళనాటిది. ఆ స్థలం అమ్మకానికి పెడదామని అక్క, నేను, అన్న అనుకుంటున్నాము. భుజంగరావుగారు కోటిరూపాయలు ఇస్తాను అన్నారు. అంతకూడా రాదు ఆయనకి కలసి వస్తుందని ఇంటిపక్క స్థలమని అడుగుతున్నారు. ఇంతకాలంగా ఆయనే మంచీ చెడూ చూస్తూ వచ్చారు. కనుక ఆయనకే ఇద్దాం అనుకుంటున్నాము.

నువ్వు కూడా అంగీకరిస్తావనే అనుకుంటున్నాను. పవరాఫ్ అటార్నీ పంపితే ఆ పని పూర్తి అవుతుంది. మరొక విషయం….. మన కోసం అన్న చాలా కష్టపడ్డాడు. ఏనాడూ నాకు ఇది తక్కువ అనుకోలేదు. మనకి చదువులు చెప్పించాడు. అక్క పెళ్ళి చేసాడు. వదిన తల్లికి మించి మనలను ప్రేమగా చూసింది. ఇప్పుడు వాళ్లకి అక్క నేను మావాటా డబ్బు ఇవ్వాలి అనుకుంటున్నాం.. అన్న కొడుకు రంగడి చేత కిరాణా షాపు పెట్టిస్తే అన్న,వదిన ఈ వృద్ధాప్యంలో సుఖపడతారు. ఏమంటావు? నీ అభిప్రాయం చెప్పు.” అంటూ అమెరికాలో ఉన్న ఆనంద్‌కి ఫోన్లో వాట్సాప్ మెసేజ్ పంపాడు కృష్ణ.

చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోతే, కుటుంబ భారాన్ని భుజాలమీద పెట్టుకుని….. గుడిలో పూజారిగా శుభకార్యాలు చేస్తూ, ఇద్దరు తమ్ముళ్ళని చదివించాడు రామనాధం. చెల్లికి పెళ్లి చేసాడు. మేనమామ కూతురే సీత అర్థాంగి. కనుక అందరినీ ఆదరంగా చూసింది. కానీ మేనరికం కారణంగా వాళ్ళ కొడుకు రంగడికి కాళ్ళు చచ్చుపడిపోయాయి. వాళ్ళ స్తోమతకి తగిన వైద్యం చేయించారు కానీ ఫలితంలేదు. అందరిలోకి బాగా చదువుకుని అమెరికాలో స్థిరపడ్డాడు ఆనంద్. అక్కడే అమెరికా డాక్టర్ని పెళ్లిచేసుకున్నాడు. మళ్ళీ ఇండియా రాలేదు. బుధ్ధి కుదిరితే ఒకసారి ఎలా వున్నారని అడుగుతాడు. లేదంటేలేదు. తన బాధ్యతగా ఇంటి విషయాలు చెబుతూ ఉంటాడు కృష్ణ. అంతే తప్ప పిల్లలు ఎలా చదువుతున్నారు? నా వలన ఏమి సాయం కావాలి? అక్క పెళ్లికి ఈ గిఫ్టు పంపుతున్నా, పిల్లలకు డ్రస్ పంపుతున్నా… అని పంపడు సరికదా తనకుటుంబం అని చెప్పుకోడానికి నామోషీ. అతడి గుణం అర్థమై ఎవరూ ఏది ఆశించలేదు. ఆడపిల్ల అక్క అనే మమకారంతో శాంతి ఒకసారి మాటాడబోతే ముభావంగా సమాధానం చెప్పేడు.

అప్పుడు దులిపేసింది ”…ఏరా…మాటాడితేనే తప్పు అనుకునే పని మేము ఏం చేసాం? నీకు ఇంటి బాధ్యత అప్పగించలేదు. ఒక్క డాలరు అడగలేదు. ఇంటికి రావడం మానుకున్నావు…… నువ్వెలా ….పుట్టావు మా కుటుంబంలో! గుర్తుపెట్టుకో….. మేము అభిమానం వున్నవాళ్ళం. నిన్నుఎప్పుడూ ఏమీ అడగం, భయపడకు. నీకు ఏదైనా కష్టం వస్తే సానుభూతి ప్రేమ చూపించేది నీ తోడబుట్టినవాళ్ళే. వాళ్ళ విలువ పోగొట్టుకున్నావ్….. నీకు ఎన్ని మిలియన్లు ఇచ్చినా అది దొరకదు….” అంటూ. ఇది జరిగి పాతికేళ్ళు గడిచింది.

కృష్ణ మెసేజి చూసేక కూడా ఆనంద్ మనసు కరగలేదు. అతనికి ఇక్కడ లోటు లేదు. ఒక్క కూతురు. భార్య క్రిస్టీనాకంటే భారతీయ కుటుంబాలు మమకారాలు పద్ధతులు తెలియవు. వాళ్ళ జీవన విధానం వేరు. ఆనంద్‌కే ఉండాలి. అయితే ఆనంద్ ప్రతి డాలరు కూడబెడతాడు, నాలుగు ఇళ్లున్నాయి. వేసవి విడిదికి ఒకచోట రిసార్ట్, విహారానికి మరో రిసార్ట్ వున్నాయి.. పెళ్లి కూడా గ్రీన్‌కార్డు కోసం బాగా సంపాదించే అమెరికన్‌ని చేసుకున్నాడు. నా భార్య, నా కూతురు నేను.. అంతే మిగిలిన వాళ్ళ గురించి నాకు అవసరంలేదు. ఏం జరగనీ అనే బుద్ధి అతడిది. అందుకే తాతగారి ఆస్తిలో వాటాని అది చాల తక్కువే అయినా వదులుకోదల్చుకోలేదు.

అందుకే…. అసలు దాని ధర ఎంత అని భుజంగరావుని అడిగి తెలుసుకుని…. కృష్ణతో చెప్పేడు. “మీరిద్దరూ ఏమి చేసుకున్నా నా వాటా నాకు డాలర్లలో పంపు” అన్నాడు…..పవరాఫ్ అటార్నీ పేపర్స్ పంపుతూ….

‘ఓరి పీనాసివాడా ….ఛీ’ అంటూ శాంతి చీదరించుకుంది. కృష్ణ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఒక్కకొడుకు. అతని భార్య స్కూల్ టీచరు. ఒక ఫ్లాటు కొనుక్కున్నాడు. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. శాంతికి ఒక కూతురు. భర్త పోస్టల్ డిపార్టుమెంటులో పనిచేస్తాడు. పెద్ద ఉద్యోగాలు కాకపోయినా లోటులేదు. అన్నగారికే ఏ ఆధారంలేదని మంచిమనసుతోనూ, తండ్రిలేని లోటు తెలియకుండా చేసిన కృతజ్ఞతతో కృష్ణ, శాంతీ ఆమె, భర్త – ఆస్తి వదులుకున్నారు.

రామనాధం కదిలిపోయాడు. స్వంత పిల్లలే పట్టించుకోని ఈరోజుల్లో తమ్ముడు చెల్లి ఆమె భర్త చూపిన ఔదార్యం అతడికి చాల ఆనందం కలిగించింది… ఆవూళ్ళోనే చిన్న ఇల్లు కొని అందులోనే రోడ్డు వైపుకి షాపు పెట్టించి., భుజంగరావుకి కాస్త కనిపెట్టి ఉండమని అప్పగించాడు కృష్ణ.

అందరితో దివ్యంగుడు రంగాకి చేయూత ఇమ్మని మంచి చేసుకున్నాడు. మీకు మా అన్న కొత్త కాదు. ఎప్పటిలా ఆదరణ చూపండి. నాకు వీలున్నప్పుడు వచ్చి చూస్తాను. ఏ అవసరం వున్నా ఫోను చేయమని చెప్పేడు. కృష్ణ రామనాధంలా నెమ్మదైన వాడు. సహనవంతుడు.

”కృష్ణా…. వయసులో చిన్నవాళ్లు నువ్వు శాంతీ…. మీ అభిమానాన్ని మరచిపోలేము. చల్లగా వుండండి.” అంటూ దీవించి, “శాంతీ!… నువ్వీ ఇంటి ఆడబిడ్డవి నీకు పెట్టాలి, కానీ మేము తీసుకోకూడదు. కానీ మా దురవస్థకి తీసుకోవాల్సి వచ్చింది. చూడమ్మా మా పుట్టింటి వారికి ఆస్తులంటూ లేవు కానీ తరతరాలుగా వచ్చిన కొంత బంగారం వుంది. అందులో ఈ హారం ఇస్తున్నా… కాదనకు…!” అంటూ పసుపూ, కుంకుమలతోబాటు శాంతికీ భర్తకీ బట్టలు పెట్టింది. మెడలో గొలుసు వేసింది సీత ఆదరంగా ఆమెను గుండెలకు హత్తుకుంటూ….

వదిన ఆప్యాయతకూ ప్రేమకూ శాంతికి కనీళ్ళు వచ్చాయి.

”అన్నా, వదినా మీరిద్దరూ మాకు అమ్మానాన్న లేని లోటు తీర్చారు. అంతకంటే ఏమికావాలి? వదినా నీ మాట మాకు శిలాశాసనం. అందుకు తీసుకుంటున్నా. నాకు అమ్మ తెలీదు నువ్వే అమ్మవి.” అంది ఇద్దరికీ నమస్కరించి.

”ఇంతేకాదమ్మాయి. ప్రతి సంక్రాతి పండగకి నీ పుట్టింటికి రావాలి…. ఫోను చేస్తాను.”

”తప్పకుండా వస్తా వదినా” అంది శాంతి.

”మరి నేనో…..నన్ను మర్చి పోయావు” అన్నాడు కృష్ణా అలిగినట్టు ముఖంపెట్టి.

”నువ్వు నా పెద్ద కొడుకువి. నీకు పిలుపు కావాలా నాన్నా ….. ఎప్పుడైనా రావచ్చు” అంటూ ఆప్యాయంగా కృష్ణ తల నిమిరింది సీత.

రంగడిని దగ్గిరకి తీసుకుని చెరో అయిదువేలు ఇచ్చి కృష్ణ, శాంతా…. వాళ్ళ ఊళ్ళకి బయలు దేరారు.

”ఈ ఆనందాన్నీ ప్రేమనీ ఎన్ని డాలర్లతో కొనగలడు పిచ్చి ఆనందు. వాణ్ణి చూసి ఇరవై ఏళ్లు గడిచాయి. అంత మమకారం లేని మనిషయ్యాడు. …. నీకా బదిలీలు ఎక్కువ… మళ్ళీ ఎన్నాళ్లకు రాగలమో” అంది శాంతి… వూరు దాటిపోతున్న బాధతో.

”కొందరు కావాలని దూరం చేసుకుంటే ఏమి చేయగలం?…జాలిపడాలంతే…” అన్నాడు శాంతి భర్త.

విననట్టు మౌనంగా వుండిపోయాడు కృష్ణ.

Exit mobile version