Site icon Sanchika

యువభారతి వారి ‘సంస్కృత సాహితీ లహరి’ – పరిచయం

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

సంస్కృత సాహితీ లహరి

[dropcap]యు[/dropcap]వభారతి సంస్థ – ప్రాచీన కావ్యాలలోనుండి మంచి పద్యాలను ఎన్నుకొని, వాటికి సరళ వ్యాఖ్యానాలు వ్రాయించి వెలయించింది. నన్నయనుంచీ నేటివరకూ గల సాహితీమూర్తుల సాహిత్య వ్యక్తిత్వాలతో పరిచయాన్ని కలిగించే ఉపన్యాసాలు చెప్పించి, వాటిని పుస్తకాలుగా మలచి ప్రచురించింది. అలాంటి అత్యుత్తమ సాహితీ సేవ చేస్తున్న యువభారతి 100 వ ప్రచురణ – ‘సంస్కృత సాహితీ లహరి’ గురించి ఈ వారం ముచ్చటించుకుందాం.

విశ్వ సాహిత్యంలోనే నిత్య నూతన భావ సృష్టికి, తాత్త్విక సృష్టికి, జీవిత పరమార్థానికి, కవితా పారమ్యానికి, భారతీయ ఆలోచనా ఫణితికి, సౌందర్యానుభూతికి ప్రతీకలుగా నిలచిన ఆరు సంస్కృత నాటకాలపై ఉపన్యాసాల గుచ్ఛమే – ఈ ‘సంస్కృత సాహితీ లహరి’.

ఈ నాటకాలలోని ఇతివృత్తాలలో వైవిధ్యం ఉంది. మహాభారతం, రామాయణం, కథాసరిత్సాగరం వంటి ప్రఖ్యాత గ్రంథాల్లోని ఇతివృత్తాలతో పాటు, బౌద్ధ వాఙ్మయాన్ని, చారిత్రిక సంఘటనలనూ, సమకాలీన సాంఘిక పరిస్థితులను ఆధారంగా చేసుకున్న ఇతివృత్తాలు ఈ ఆరింటిలో ఉన్నాయి. నాటకం కేవలం కథనం కాదు. వ్యక్తిత్వ దర్పణం. జీవితానుభూతికి అనుకృతి. నాటకకర్త ప్రజ్ఞా చక్షువుతో సమకాలిక సంఘంలోని వ్యక్తులను సందర్శిస్తాడు. వారి దైనందిన జీవిత సరళికి సమీపంగా తన నాటకాన్ని మలుస్తాడు. అందుకే గొప్ప గొప్ప నాటకాల్లోని ఇతివృత్తాలు, సంభాషణలు, పద్యాలు, సన్నివేశాలు ఇప్పటికీ రససృష్టికి కారణమౌతున్నాయి.

‘స్వప్న వాసవదత్తం’ నాటక కళా ప్రయోగంలో సమున్నత శిఖరాలనందుకున్న నాటకం. నాటకాన్ని చూసినా, చదివినా రసలోక విహారం అనివార్యం.  భాసుని వాసవదత్తం నాటకాన్ని గురించి శ్రీ మానాప్రగడ శేషసాయి గారి ఉపన్యాస పాఠం ఈ పుస్తకంలో ఉంది.

“దుష్పరిపాలనను ప్రజలు నేడే కాదు ఏనాడు భరించరు” అన్న సత్యాన్ని చాటి చెబుతుంది ‘మృచ్ఛకటికం’. వేశ్యలలోనూ ఉత్తమరాండ్రు ఉంటారనే సత్యాన్ని నిత్యనూతనంగా ప్రకటిస్తున్నది మృఛ్ఛకటికం. శరత్ బాబునూ, గురజాడనూ ప్రభావితం చేసిన నాటకం ఇది. శూద్రకుని ‘మృచ్ఛకటికం’. నాటకాన్ని గురించి డా. పుల్లెల శ్రీరామచంద్రుడు గారి ప్రసంగ పాఠం ఈ పుస్తకంలో ఉంది.

తాను నిరీహుడైనా, తనకు సంతానం లేకపోయినా, పెంచి పెద్ద చేసిన అమ్మాయి తనకు తెలియకుండా గర్భం దాల్చిన సంగతిని తెలుసుకున్న కణ్వుడు వ్యవహరించిన తీరు ఎంత సముదాత్తంగా ఉన్నదో, సహృదయులు పరిశీలించడానికి వీలు కల్పించాడు కాళిదాసు తన ‘అభిజ్ఞాన శాకుంతలం’లో.  ఈ నాటకం గురించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు ప్రసంగించారు.

‘ఉత్తర రామచరితం’ భారతీయ సాహిత్య సృష్టిలో సమున్నత ప్రమాణాలను అందుకున్న నాటకం. వివాహ వ్యవస్థనూ, స్త్రీపురుషుల సంబంధాన్నీ, ధర్మ దృష్టినీ, అంత తాత్వికంగా వ్యాఖ్యానించిన కావ్యం మరొకటి లేదు.  భవభూతి ‘ఉత్తర రామచరితం’ నాటకాన్ని గురించి డా.ధూళిపాళ శ్రీరామమూర్తి గారు ప్రసంగించారు.

తన ప్రజలకోసం నాయకుడు తను ముందుగా ఆహుతి కావాలనే సముదాత్తమైన ఆదర్శానికి ప్రతీకగా నిల్చిన ‘నాగానందం’ నాటకం నేటికీ ఆచరణీయంగా, అనుసరణీయం గా ఉంది. శ్రీహర్షుని ‘నాగానందం’ నాటకాన్ని అద్భుతంగా విశ్లేషించారు శ్రీ కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు గారు.

‘ముద్రారాక్షసం’ రాజకీయాల నాటకం. ఎంతో అద్భుతమైన నాటకం. ఇప్పటి రాజకీయ జీవితాన్ని భ్యంగ్యంతరంగా చిత్రించిన నాటకం. విశాఖ దత్తుని ‘ముద్రారాక్షసం’ నాటకం గురించి ప్రసంగించిన వారు శ్రీ అవధానం చంద్రశేఖర శర్మ గారు.

ఈ ఆరు సంస్కృత నాటకాల గురించి, సంపూర్ణమైన అవగాహన రావాలంటే – ‘సంస్కృత సాహితీ లహరి’ పుస్తక పఠనం – అత్యంత ఆవశ్యకం, అనివార్యం.  క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%20%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%E0%B0%B2%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

Exit mobile version