సముద్రపు ఇసుక

0
2

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి యద్ధనపూడి సులోచనారాణి స్మృతిలో లేఖిని సంస్థ నిర్వహించిన కథల పోటీలలో మొదటి బహుమతి ₹ 10,000/- గెలుచుకున్న కథ ఇది. రచన రాధిక నోరి. [/box]

[dropcap]సొ[/dropcap]రుగులో అతి భద్రంగా దాచిన తన పుస్తకాన్ని బయటికి తీసి ఒక్కసారి గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు చకోర్. హుషారుతో ఒళ్ళంతా జలదరించింది. మెల్లిగా పుస్తకాన్ని తెరిచి తను రాసిన లిస్టుని చదవటం మొదలెట్టాడు. ఇన్నేళ్ల నుండి వుంటున్న ఈ దేశాన్ని వదిలేసి ఇండియాకి శాశ్వతంగా వెళ్ళిపోవాలంటే ఏమి చేయాలో వరసగా తను రాసుకున్న లిస్టు అది. ఇక్కడా, ఇండియాలో కూడా ఎవరెవరిని కలవాలో, ఏమేమి మాట్లాడాలో, ఇంకా ఏమేమి పనులు చక్కబెట్టుకోవాలో మరిచిపోతానేమో అన్న భయంతో అన్ని వివరంగా రాసుకున్నాడు తను. లిస్టు అంతా చదువుతోంటే అతని మనసు గబగబా గతంలోకి ఎగిరి వాలింది.

కాలేజ్ రోజులనుండీ తనకు అమెరికా పిచ్చి బాగా వుండేది. ఇప్పుడంటే ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్కరైనా అమెరికాకు వెళ్తున్నారు కానీ ఆ రోజుల్లో అమెరికాకు వెళ్ళటం చాలా అరుదుగా వుండేది. ఎవరైనా వెళ్లే గొప్పగా కూడా వుండేది. అందుకే తనకు ఎలా అయినా సరే అమెరికాలో పై చదువులు చదవాలి, ఫారిన్ రిటర్న్ అనిపించుకోవాలి, తన అమెరికా డిగ్రీ ఆధారంగా అతి పెద్ద పదవి చేబట్టాలి, తన వలన తన కుటుంబం స్థాయి పెరగాలి, అనుక్షణం ఇలా ఆలోచించేవాడు తను. ఆ కోరికలకు తగ్గట్లుగా కష్టపడి పరిశ్రమ చేసి అమెరికాకు వచ్చాడు పై చదువులకి. చదువవైపోగానే ఇండియా వెళ్ళిపోయి మంచి వుద్యోగం సంపాదించి భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవటమే తన గోలు. ఎవరితో మాట్లాడినా చదువైపోగానే ఇండియా వెళ్ళిపోతాను అని చెప్పేవాడు.

కాని లాస్ట్ సెమిస్టర్‌లో వున్నప్పుడు ఒకసారి యథాలాపంగా తండ్రితో మాట్లాడుతున్నప్పుడు రియాలిటీ మెల్లిమెల్లిగా అర్థం అవటం మొదలయింది. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో వుండే డబ్బు సమస్యలే! తన అమెరికా చదువులకీ, ప్రయాణాలకి చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. అవన్నీ ఇంకా పెరగకముందే చకచకా తీర్చగలగాలి అంటే కనీసం రెండు మూడేళ్ళన్నా తను ఇక్కడ వుద్యోగం చెయ్యాలి. తన ఉత్సాహం కొంచెం చెప్పబడినా ఒక్క రెండు, మూడేళ్ళేగా, ఆ తర్వాత ఇంకా అడ్డేమీ వుండదు అని సరిపెట్టుకున్నాడు.

చదువు, వుద్యోగం, ఇంక ఆ తర్వాత పెళ్లి పర్వమే కదా! సరే, అమెరికాలో చదువు, మంచి వుద్యోగం, ఇంక కొదవేముంది? మంచి మంచి సంబంధాలు వచ్చాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అబ్బో, ఇండియాలో ఆడపిల్లలు చదువులో ఎవ్వరికీ తీసిపోరు. అందుకే అన్నీ విషయాల్లోనూ అందరికీ నచ్చిన, అందరూ మెచ్చిన పిహెచ్‌డి అమ్మాయి దిశతో తన పెళ్లి అతి వైభవంగా జరిగిపోయింది.

అమెరికా సంబంధం అని ఎంతో మోజుపడిన దిశని, అత్తమామల్ని నిరాశ పరచటం ఇష్టం లేక కనీసం కొన్ని రోజులయినా ఇక్కడ వుండాలని తన ఇండియా కోరికను తాత్కాలికంగా పక్కకు నెట్టాడు. కోటి కోర్కెలతో దిశ కొత్త పెళ్లికూతురిగా అమెరికా వచ్చింది. అతి మధురంగా ముగిసిన హనీమూను మత్తు ఇంకా వదలకముందే తన ఇండియా ప్లాను మెల్లిగా దిశలో చెప్పేద్దామనుకున్నాడు.

ఇంతలో ఎవ్వరూ వూహించని ఇంకో మంచి మలుపు తన జీవితంలో సంభవించింది. దిశ తల్లి కాబోతోంది అన్న శుభవార్త తమ రెండు కుటుంబాల మీద పన్నీటి జల్లులను కురిపించింది. కనీసం పురుడన్నా అయ్యేదాకా తన ఇండియా ప్లానుని మళ్ళీ తను వెనక్కి నెట్టక తప్పలేదు. ప్రసవం సమయానికి అత్తమామలు వచ్చారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత తన మనసులోని మాటని దిశతో మెల్లిగా చెపుదామనుకున్నాడు.

ఇంతలో ఏ ప్లాను లేకుండా దిశ మళ్ళీ తల్లి కాబోతున్నాను అన్న వార్తని అందించింది. అయినా ఈసారి తను మౌనంగా వుండదలుచుకోలేదు. అందుకే ధైర్యం చేసి ఆ విషయం ప్రస్తావన ఎత్తాడు. అమెరికా పౌరసత్వం వుంటే పిల్లలిద్దరికీ ముందు ముందు భవిష్యత్తులో మంచిది కదా, అప్పుడు ఎక్కడుండాలో ఛాయిస్ వాళ్ళకే ఉంటుంది కదా అన్నారు దిశ, అత్తమామలు కూడా. కాదనలేకపోయాడు తను. తన కోరికలు తన పిల్లల భవిష్యత్తుకి ఆటంకం కాకూడదు అన్న విషయం తనెప్పుడూ మరిచిపోలేదు. దిశకి ఈసారి కొడుకు పుట్టాడు. మొదట కూతురు, ఇప్పుడు కొడుకు, తన ఆనందానికి అవధులు లేవు. తన ఫామిలి పూర్తి అయింది. చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయాయి. ఎడాపెడా చంటిపిల్లలవటం చేత తనకి అసలు కాలగమనమే తెలియలేదు.

కానీ తన గమ్యాన్ని మరిచిపోలేదు తను. ఒకరోజు మెల్లిగా దిశ దగ్గర ఇండియా ప్రస్తావన తీసుకొచ్చాడు. దిశ తనవైపు అదోలాగా చూసింది. “ఇంత చదువు చదివాను. ఈ దేశంలో పోస్ట్-డాక్టోరల్ రీసెర్చ్ చేద్దామని వుందండి. ఏ దేశం వెళ్లినా అప్పుడు మంచి ఉద్యోగానికి ఎటువంటి ఢోకా వుండదు” అన్నది గోముగా. తనేమంటాడు? ఏం అంటే ఏం అర్థాలు తీస్తారో ఈ ఆడవాళ్ళు? అసలు వాళ్ళ మాటని కాదని బతికి బట్ట కట్టిన మగవాడెవడన్నా వున్నాడా ఈ ఇలలో? ఇంకేముంది? మళ్ళీ తన ఇండియా ప్లానుకి ఇంకోసారి ఆనకట్ట పడింది.

చూస్తూండగానే ఇంకో మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు కూతురికి ఏడేళ్లు, కొడుక్కి ఆరేళ్ళు. ఇద్దరూ స్కూళ్లలో చేరారు. అసలు ఈ రోజుల్లో పిల్లలే అలా వున్నారేమో! ఇద్దరూ విపరీతమైన తెలివితేటలు కలవాళ్ళు. కూతురు kindergarten skip చేసి డైరెక్టుగా ఫస్టు గ్రేడులో చేరింది. ఆ తర్వాత కూడా థర్డ్ గ్రేడు మళ్ళీ స్కిప్ చేసి సెకండ్ గ్రేడు తర్వాత ఫోర్డు గ్రేడులో చేరింది. కొడుకు కూడా ఏమీ తీసిపోలేదు. వాడు కూడా సెకండ్ గ్రేడు తర్వాత ఫోర్తు గ్రేడులో చేరాడు. ఇలా కళ్ళు మూసి తెరిచేంతలో ఎలిమెంటరీ స్కూలు పూర్తి చేసి పిల్లలిద్దరూ మిడిల్ స్కూలులో చేరారు. పాదరసంలాగా చదువులో రాకెట్టు వేగంతో ముందుకు దూసుకుపోయారు. ఏనాడూ తల్లితండ్రుల సహాయం, నియంత్రణల అవసరమే వాళ్ళకి రాలేదు. మిడిల్ స్కూలులో వున్నప్పుడే హైస్కూలు కోర్సులు పూర్తి చేసేసారు. మనసాగక ఒకరోజు మెల్లిగా తన ఇండియా వెళ్లిపోదామన్న కోరిక ఎత్తాడు వాళ్ళ దగ్గర. తన ప్రస్తావన విని ఇద్దరూ విడ్డురంగా చూసారు తన వైపు. ఉన్నత విద్య కోసం అందరూ ఇండియా నుండి అమెరికా వస్తారు. అంతేకానీ ఎవరైనా అమెరికా నుండి ఇండియా వెళ్లారా? పైగా ఈ డబుల్ ప్రమోషన్స్ అవీ అక్కడ ఉంటాయా? నిజమైన తెలివితేటలకు ఏ విధమైన ఇతర విషయాలతో ప్రమేయం లేకుండా గుర్తింపు వుంటుందా అక్కడ? అంటూ అడగకనే అడుగుతున్నట్లుగా వున్న వాళ్ళ తీక్షణ దృక్కులని ఎదుర్కోలేకపోయాడు తను.

ఈ లోపల తను రీసర్చ్ చేసే యూనివర్సిటీలోనే దిశకు faculty position కు ఆఫర్ వచ్చింది. ఏవిధమైన ప్రయత్నం చేయకుండానే కాళ్ళ దగ్గరకు వచ్చిన అవకాశం, వద్దనటం కేవలం అవివేకమంటూ దిశ ఆ జాబ్‌లో చేరిపోయింది. వద్దని, మనం ఇండియా వెళ్ళిపోదామని అనాలనుకున్న తన అభిమతం అలా గుప్తంగా గుండె లోతులలో సమాధి అయిపొయింది. ఇన్నాళ్లూ ఓపిక పట్టి ఇప్పుడు సరిగ్గా నా వుద్యోగం సమయం వచ్చేసరికి ఇండియా వెళ్లిపోదామన్న మీ కోరిక గుర్తొచ్చిందా అని పోట్లాడుతుందేమో అన్న సందేహం కలిగింది. ఒకవేళ దిశ నిజంగానే అలా అడిగితే ఏం సమాధానం చెప్పాలో తనకి అస్సలు తెలీదు. పెళ్ళాం అభివృద్ధిని అణిచేసి, ఆమె కోరికలని అశ్రద్ధ చేసి, తన పురోగమనం మాత్రమే చూసుకునే స్వార్థపరుడు, సంకుచిత స్వభావం కలవాడుగా అనిపించటం, కనిపించటం తనకేమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అసలు తన అభిమతం అది కానే కాదు. అయినా తన చిరకాల వాంఛ గుర్తొచ్చినపుడల్లా గుండెలు కలుక్కుమనేవి. తగిన అవకాశం కోసం ఎదురుచూస్తూ మౌనంగా వుండటం తప్ప తను ఏమీ చేయలేకపోయాడు. మనిషి ఆశాజీవి కదా! అందుకే తన ఆశ మాత్రం ఇంకా పూర్తిగా చావలేదు.

ఇంతలో ఎవ్వరూ ఎన్నడూ వూహించని ఒక విచిత్రం జరిగింది. వుద్యోగం మానేసి తానే సొంతంగా ఒక కంపెనీ పెట్టాలన్న ఆలోచన మెరిసింది తనలో. ఇతరుల కొరకు పడే కష్టం, వెచ్చించే సమయం సొంత కంపెనీ కొరకే వాడుకుంటే ఆదాయం ఇంకా ఎక్కువవుతుందికదా! ఏదో కాస్త ఇలా పది రాళ్ళు వెనకేసుకుంటే రేపెప్పుడైనా ఇండియా వెళ్ళిపోయినప్పుడు అప్పటి అవసరాలను ఆదుకుంటుంది కదా! ఇలా ఆలోచించి ఏదో తెలీని ఉత్సాహంతో ఒక సొంత కంపెనీ మొదలెట్టాడు తను. కొంచెం అటు ఇటు అయి అనుకోనిది ఏమన్నా అయినా చప్పున ఆదుకోవటానికి దిశ స్టడీ జాబ్ వుంది కదా అన్న ధిలాసా కూడా లేకపోలేదు. క్రమేపీ కంపెనీ బాగా పుంజుకుంది. ఈ కొత్త అనుభవం తనకి కూడా చాలా నచ్చింది. ఆదాయం ఆశించినదానికంటే వంద రెట్లు పెరిగింది. దాంతో బాధ్యతలు కూడా వెయ్యి రెట్లు పెరిగాయి. కానీ సమయం మాత్రం పూర్తిగా కొరవైపోయింది. అయినా ఇండియా ప్లాను గుర్తొచ్చినప్పుడు మాత్రం మనసు బాధగా మూలగటం మానలేదు. ఈ ప్రయత్నాలన్నీ ఆ గోల్ అందుకోవటం కోసమే కదా అనుకోని సరిపెట్టుకొనేవాడు తను.

పిల్లల చదువులు బ్రహ్మండంగా సాగాయి. హైస్కూలులో వున్నపుడే కాలేజీ కోర్సులు చాలామటుకు పూర్తి చేసేసారు. కూతురు హైస్కూలు తర్వాత బ్రౌను యూనివర్సిటీలో మెడికల్ ప్రోగ్రాంలో సీటు తెచ్చుకుని చేరిపోయింది. కొడుకు కూడా ఏల్ యూనివర్సిటీలో లా లో చేరాడు. బాగా కృషి చేసి భవిష్యత్తులో సుప్రీం కోర్టు జడ్జ్ అవుతాడట. బాగానే వుంది. ఏదో ఒక మంచి గమ్యాన్ని నిర్ణయించుకోవటం, దానికోసం నిజాయితీగా కృషి చేసి దాన్ని సంపాదించటం మంచిదే! తను కూడా అలాగే ఏదో తనకి నచ్చిన ఒక గమ్యాన్ని పెట్టుకున్నాడు. కానీ దాని కోసం ఎంత తాపత్రయపడుతున్నా అది అందటంలేదు. మరి దానికి తను చేస్తున్న ప్రయత్నాలు దాలటంలేదా? తన నిజాయితీలో ఏదన్నా లోపం వుందా? తను ఇంకా పరిశ్రమ చేయాలా? పోనీ తన పద్ధతి ఏమన్నా మార్చుకోవాలా? ఏం చెయ్యాలో తెలియటం లేదు తనకి. ఈలోపల ఎప్పుడు ఇండియా వెళ్లినా అందరితో ఇండియా వచ్చేసేయాలన్న తన చిరకాల వాంఛ ఏమీ చెక్కు చెదరలేదని, కేవలం తగిన సమయం కోసం మాత్రమే ఎదురుచూస్తున్నానని చెప్పేవాడు. అన్న మాట తప్పే బూటకారిగా అందరి ముందు కనిపించటం తనకి ఇష్టం లేదు.

కాలం ఎవరి కోసం ఆగదు. పిల్లలిద్దరికీ పెళ్లీడు వచ్చింది. కూతురు తనతో పాటే చదువుతున్న ఇంకో డాక్టరుని ఎంచుకుంది. కొడుకేమో, ఏదో లా కాన్ఫరెన్సులో కలుసుకున్నాడుట, ఇంకో లాయరు అమ్మాయిని ఇష్టపడ్డాడు. అదృష్టవశాత్తు ఇద్దరూ ఇండియన్స్ అవటం తన భాగ్యం. ఇంక మిగిలిన విషయాల గురించి తను పట్టించుకోలేదు. ఇద్దరి పెళ్ళిళ్ళు అతి వైభవంగా ఇండియాలో జరిగిపోయాయి. అందరూ అమెరికా వాళ్ళే కదా, మరి ఇండియాలో ఎందుకు చేస్తున్నారు పెళ్లి అని అడిగినవారందరికి ఇండియాని తాము ఎప్పుడూ మర్చిపోలేదని, ఎప్పటికైనా అక్కడికి వళ్ళవయ సెటిల్ అవ్వాల్సిన వాళ్ళమే అని చెప్పాడు. ఏది ఏమైనా విద్యార్థి దశ నుండి ఇప్పటిదాకా తన జీవితం అంతా ఒక రెప్పపాటులో గడిచిపోయినట్లుగా అనిపించింది తనకి. నిన్న మొన్న అమెరికా వచ్చినట్లు వుంది తనకి. అప్పుడే పిల్లలకి పెళ్లిళ్లు అయిపోయి తను మామగారిగా కూడా మారిపోయాడు. కాలం నడకలు, పరుగులు మాని ఎగరటం మొదలెట్టినట్లుగా వుంది.

“ఏమిటి చకోర్ గారూ! పిల్లలిద్దరి పెళ్ళిళ్ళు కూడా చేసేసారు. బాధ్యతలన్నీ పూర్తయ్యాయి. ఇంక ఇప్పుడన్నా వుత్త కబుర్లు మాని మీ మాటలని ఆచరణలో పెట్టి చూపిస్తారా? లేక మాటల్ని అలా అమ్మేస్తూ వుంటారా?” అని కొందరు వేళాకోళాలాడితే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒక వెర్రి నవ్వు నవ్వేవాడు. తనకి తెలుసు, తన మాటలకి, చేతలకి పొంతన లేకపోవటంతో తను అందరికీ హాస్యాస్పదంగా మారాడు. అందుకే అందరూ తన వెనక వ్యంగ్యంగా నవ్వుకుంటున్నారు. తనని ఒక వుత్త మాటలవాడే కానీ చేతలవాడు కాదు అని జమ కట్టేసారు. కానీ వాళ్లకి తెలీని విషయం ఏమిటంటే ఇదంతా కేవలం పరిస్థితులు చేస్తున్న గారడీ. అంతేకానీ తన నిజాయితీలో, నిర్ణయాల్లో, ప్రయత్నాల్లో ఏమాత్రము లోటు లేదు. కానీ ఈ విషయం ఎంతమంది నమ్ముతారు? ఎదురుగా కనిపిస్తున్నదే నిజం అనుకుంటారు కానీ తన ఆంతర్యం ఎంతమందికి అర్థం అవుతుంది? అయినా ఇతరులతో తనకేమిటి? ఎవరేమనుకుంటే తనకెందుకు? తన మనసులోని నిజాయితీ తనకు తెలుసుకదా! అయినా ఇప్పుడు నిజంగానే తన లైనంతా క్లియర్ అయిపోయింది. ఇంక తను ప్రయాణ సన్నాహాలు మొదలెట్టచ్చు. తన చిత్తశుద్ది ఋజువు చేసుకోవచ్చు.

ఆలోచనలలో గాఢంగా లీనమైన చకోర్ ఫోను మోగటంతో ఈ లోకం లోకి వచ్చిపడ్డాడు.

“ఏమిటండీ, ఇందాకటి నుండీ ఫోను మోగుతోంటే కూర్చున్న చోటు నుండి కదలరేం?” అంటూ దిశ విసుక్కుంటూ ఫోను ఆన్సర్ చేస్తోంది. చకోర్ అదేమీ పట్టించుకోలేదు. అతని పెదవులపై అప్రయత్నంగా చిరునవ్వు కదలాడుతోంది. మనసు గాలిలో తేలిపోతోంది. అప్రయత్నంగా చేతిలో వున్న పుస్తకాన్ని మూసేసి గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. ఇంక సమయం వచ్చేసింది అనుకున్నాడు తన్మయంగా.

ఇంతలో దిశ హడావిడిగా వచ్చింది అక్కడికి. “ఏమండీ, ఈ శుభవార్త విన్నారా? మీరు తాత కాబోతున్నారు. నేను అమ్మమ్మని కాబోతున్నాను. అమ్మాయి చెప్పింది ఇప్పుడే” అంది సంభ్రమంగా. చకోర్ ఒక్కసారి వులిక్కిపడ్డాడు. దిశ ఏం చెప్పిందో అర్థం అయిన వెంటనే అతనికి చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడీ కొత్త పదవి ఎన్నో కొత్త అనుభూతులని తీసుకొస్తుంది అనుకుంటూ నవ్వుతూ దిశ వైపు చూసాడు.

“అంతే కాదు. ఈ ఆనందం రెట్టింపయే ఇంకో విశేషం కూడా వుంది. అమ్మాయికి కవలలట. అల్ట్రాసౌండ్ చేసి డాక్టరు కన్‌ఫర్మ్ చేసిందట. అమ్మా, ముందే చెప్తున్నాను, ఈ హాస్పిటల్ డ్యూటీతో పాటు కవల పిల్లలంటే ఎంత కష్టమో నువ్వు తేలికగా వూహించగలవు. నీ సహాయం నాకు చాలా కావాలి అమ్మా. నువ్వు నా దగ్గర వుండాల్సి వస్తుంది. ఇప్పటి నుండీ అన్ని విధాలా సిద్ధంగా వుండు అంటూ పాపం, పిచ్చి తల్లి, ఎంతో ప్రాధేయపడింది” అంది దిశ ఎంతో ఉత్సాహంగా. ఆమె ఎక్సయిటుమెంటు ఇంకా తగ్గలేదు. కూతురి పురిటి సమయం తన సెమిస్టర్ మధ్యలో వస్తుందేమోనని లెక్కలు వేసుకుంటోంది.

చకోర్ ఇంకోసారి వులిక్కిపడ్డాడు. ఈసారి అతనికి ఎక్సయిటుమెంటు తగ్గి జరగబోయే భవిష్యత్తు, రియాలిటీ కళ్ళముందు కదలాడటం మొదలెట్టింది. కవలలంటే ఇంక దిశ పూర్తిగా అక్కడే వుండచ్చు. మరి తను? తనెక్కడ వుంటాడు? కంపెనీ పనులన్నీ మెల్లిగా వేరేవారికి అప్పచెప్పి తను దీతో పాటు ఇండియా వెళ్లిపోదామనుకుంటున్నాడు కదా! మరి ఆ ప్లాను మాటేమిటి? దిశ ఇక్కడ వుండిపోతే తనొక్కడే ఇండియా వెళ్ళాలా? మరి దిశ లేకుండా తను వుండగలడా? తన బాగోగులు ఎవరు చూస్తారు? అసలు తమ కుటుంబంలోని వారందరు ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తారా? పైగా మనవలో, మనవరాళ్ళో, ఎవరైనా సరే, వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూడాలని తనకు మాత్రం అనిపించదా? ఇంకో అది ఇప్పటి దాకా కూతురోక్కత్తే ఈ శుభవార్త అందించింది. రేపు కొడుకు కూడా ఇలాంటి వార్త అందించవచ్చు. అప్పుడు దిశ కూతురి దగ్గర అంది తను కొడుకు దగ్గర వుండాలా చంటిపిల్లలను చూసుకోవటానికి? అయితే ఇంక తన ఇండియా కోరికని శాశ్వతంగా మర్చిపోవాలా?

అయోమయంగా ఆలోచిస్తున్న చకోర్ మనసు బాధతో మూలిగింది. దిశ గట్టిగా కుదపటంతో ఒక్కసారి వులిక్కిపడి ఈ లోకం లోకి వచ్చాడు.

“ఏమిటి ఆలోచిస్తున్నారు?” అంటోంది దిశ, చకోర్ ఏమీ సమాధానం చెప్పలేదు. తన మనసులోని భావాలని ఎలా వ్యక్తపరచాలో తెలియక మౌనం వహించాడు. కానీ దిశ తెలివైనది. చకోర్ మనసులోని కల్లోలాన్ని చెప్పకుండానే చిటికెలో గ్రహించింది.

“మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఇండియా తిరిగి వెళ్ళిపోదామన్న మీ కోరికకి పరిస్థితులు ఎప్పటికప్పుడే అడ్డం వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు కదూ! నా మాటలు కొంచెం శాంతంగా వింటానంటే చెప్తాను. బీచ్‌కి వెళ్లి ఇంటికొచ్చిన తర్వాత చూసారా, మనం బట్టలు ఎంత దులుపుకున్నా ఏదో ఒక మూల ఆ సముద్రపు ఇసుక కాస్త వుండనే వుంటుంది. ఎంత గట్టిగా దులుపుకున్నా కూడా పోదు. అమెరికా రావటం కూడా అంతేనండి. ఒకసారి ఇక్కడికొచ్చిన తర్వాత ఎంత గాఢంగా కోరుకున్నా, ఎంత గట్టిగా ప్రయత్నించినా వెనక్కి శాశ్వతంగా తిరిగి వెళ్ళిపోవటం చాలా కష్టం. మీకు తెలుసు, ఒకవేళ అలా తిరిగి వెళ్ళిపోయినా, మళ్ళీ వెనక్కి వచ్చేసినవారు అనేకమంది మనకు తెలుసు. పర్మనెంటుగా వెనక్కి వెళ్ళటం అన్నది అనుకున్నంత తేలిక కాదు. పిల్లలుంటే ఇంకా అనేక రెట్లు అధికమైన కష్టం. వాళ్లేమో ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ పద్ధతులకు అలవాటు పడి వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడరు. పిల్లల్ని ఇక్కడ వదిలేసి ఇంక మనం తల్లితండ్రులం ఎలా వెళతాం? ఒకే వూళ్ళో లేకపోయినా కనీసం ఒకే దేశం లోనన్నా లేకపోతే పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే గభాల్న వెళ్లాలంటే వీలవుతుందా? నాకు తెలుసు, అంత అవసరమే వస్తే ఇండియానుండి అయితే మాత్రం ఏమైంది రావటానికి, కొన్ని నెలలు అక్కడా, కొన్ని నెలలు ఇక్కడా వుండచ్చు కదా అని అనుకుంటూ వుంటారు మీరు, అవునా? కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి. అలా అస్తమానూ అవలీలగా వస్తూ పోతూ వుండటానికి ఇదేమన్నా గుంటూరు నుండి విజయవాడ ప్రయాణమా? దూరాభారాలు ప్రయాణం చేయటం ఎంత కష్టం? ఎంత ఖర్చు? ఎంత శ్రమ? ఎంత ప్రయాస? పోనీ వీటన్నిటినీ ఓర్చి ఆ ప్లాను అమలుపరిచినా ఎన్నేళ్ళు అలా తిరగగలరు ఎవరైనా? ప్రకృతి సహజంగా వుండే జరాభారం మనిషిని బలహీనపరుస్తుంది కదా! పైగా వయసు క్రుంగిన తర్వాత మన సొంత సంతానానికి దూరంగా ఎంత స్వదేశమైనా ఒంటరిగా మనం ఎలా వుండగలమండీ? ఇంక ఆరోగ్యంలో ఏవైనా చికాకులుంటే ఇంక ఆ విషయం మరీ కష్టం. మరి వయసుడిగిన తర్వాత ఆరోగ్యంలో చిన్న, పెద్ద, ఏవో చికాకులు రావటం ఎవరికైనా సహజమే కదా! అంత గాఢంగా వెనక్కి వెళ్లిపోవాలని అనుకుంటే చిన్న వయసులో కాస్త సంభవమేమో కానీ ఆలస్యం అయినకొద్దీ ఇంచుమించు అసాధ్యమనే చెప్పాలి. ఇప్పుడు మీ విషయమే తీసుకోండి. ఈ దేశానికి వచ్చినప్పటినుండీ వెనక్కి వెళ్ళిపోదామని మీకు ఎంత గాఢంగా వున్నా ఎప్పటికప్పుడే ఏదో ఒక తెలీని అవాంతరం వల్ల మీ కోరికని తీర్చుకోలేకపోయారు. మీ ప్లానుని అమలులో పెట్టలేకపోయారు. చాలామందికి ఇలాగే అవుతుంది. ఇది చాలా సహజం. అందుకని మీరేమీ బాధపడకండి. నాకు తెలుసు, ఇప్పుడు మీరేం అనబోతున్నారో. మన సంతానం మాత్రమే మన బాధ్యత, వాళ్ళ సంతానం బాధ్యత మనది కాదు అంటారు, అవునా? కావచ్చు. కానీ వాళ్ళ సంతానానికి మనం ఏం చేసినా అది మన సంతానానికి మనం సహాయం చేసినట్లే. ఈ విషయం బహుశా మీరు మర్చిపోయినట్లున్నారు. సరే, పోనీలెండి. కొంచెం మీ ఆలోచనలలో ప్రాక్టికాలిటీ తెచ్చుకోండి. అప్పుడే మనస్తాపాలు వుండవు. ఇన్నాళ్లు కష్టపడ్డారు, సంపాదించారు, సంసార బాధ్యత వహించారు. ఇప్పుడు మనవలతో, మనవరాళ్లతో హాయిగా ఎంజాయ్ చెయ్యండి. మన కోరికలన్నీ ఆ భగవంతుడు తీర్చాడు. అనవసర ఆలోచనలతో మనసు అశాంతిపాలు చేసుకోకండి. మీరలా ఏదో పోగొట్టుకొన్నట్లు ముఖం పెడితే నాకు బాగుండదు” పక్కన కూర్చుని చకోర్ చేతిని మెల్లిగా నిమురుతూ ప్రేమగా అంది దిశ.

చకోర్ మౌనంగా అంతా విన్నాడు. ఇవన్నీ తనకు తెలిసిన చేదు నిజాలే! అయినా ఇవాళ దిశ ద్వారా అవన్నీ మళ్ళీ వింటోంటే మళ్ళీ ఇంకోసారి వేరే దృక్పథంలో ఇంకొంచెం ఎక్కువ ఆలోచించాలి అనిపిస్తోంది. ఇండియా వెనక్కి వెళ్ళిపోవాలి అన్న కోరిక తనది, దిశది కాదు, అందుకే దిశకి తనకున్నంత ఆశాభంగం లేదు. అడ్జస్ట్ అవ్వమని అందుకే అంత తేలిగ్గా చెప్పగలిగింది. అయినా తను మాత్రం అడ్జస్ట్ అవ్వక ఏం చేస్తాడు? ఇంక చాయిస్ ఏది లేదుగా! పరిస్థితులతో రాజీ పడకపోతే అశాంతిపాలయి నష్టపోయేది తనే! అయినా దిశ అన్నట్లుగా ఇక్కడ ఎన్నేళ్ళు వుంటే వెనక్కి వెళ్ళటం అంత ఎక్కువ కష్టం అవుతుంది. ఇంక పిల్లలు వుంటే మరీను. వాళ్ళ ఛాయిస్‌లు కూడా అడ్డు పడతాయి. తన విషయంలో అది కూడా జరిగింది. ఈ విషయాలన్నీ తను వూహించలేదు. పిల్లలు చిన్నగా వున్నప్పుడే వెళ్ళిపోతే అసలు ఈ చిక్కులన్నీ వుండేవి కాదు. ఇప్పుడు ఇక పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఇంక ఇప్పుడు తన కోరిక పూర్తిగా తీరే మార్గం ఎటూ లేదు కాబట్టి కనీసం తాత్కాలికమైన వుపశమనం కొసం మార్గాలు వెదకాలి తను. ఖర్చు, శ్రమ, ఏమైనా కానీ తరచుగా ఇండియా వెళ్తూవుండాలి. మరి ఓపిక వుడిగిన తర్వాత…. అప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యాలో ఇప్పుడైతే తనకి తెలీదు. ఆ సమయానికి తగ్గ మార్గం ఏదో ఆ దేవుడే చూపించాలి. అప్పటి సంగతి ఆలోచిస్తూ ఇప్పుడు తను ఆందోళన పడటం అవివేకం. తను మాత్రం ఎవరితోనూ సంబంధం లేకుండా తనిష్టమొచ్చినంత కాలం ఇండియాలో వుంటాడు. తన కోరిక తీర్చుకుంటాడు. తన సంతోషం తను వెతుక్కుంటాడు. ఇక్కడ పిల్లల అవసరాలు కనిపెట్టి చూడటానికి దిశ వుండనే వుంటుంది కదా!

ఇలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు కాబట్టి అతని మనసులో ఇప్పుడు ఎటువంటి అలజడి లేదు. ప్రశాంతంగా దిశ వైపు చూస్తూ నవ్వాడు చకోర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here