సంచారిణి

0
62

[స్వాతీ శ్రీపాద గారు రచించిన ‘సంచారిణి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

కాలానికి గుండెలో జోలపాడి
మేఘాల మధ్య విహరిస్తాను
వెలుగు రెక్కలను కంటి చూపుగా మార్చుకు
లోలోని అనంతాన్ని విస్మరించి
అనంతం నించి అనంతానికి సాగే
నిత్య సంచారం నాది.

శాశ్వత ఉనికిని అశాశ్వతంగా మార్చుకు
ఎల్లలు లేని ఏకాంతాన్ని వదిలి
సమూహాల మధ్యన సమయాన్ని చప్పరిస్తాను.
చివరికి దుఃఖోపశమనాల జడివానలో తడిసి
ఊహలు రాజేసుకున్న వేడిలో
చలి కాచుకోవాలని తపిస్తాను..

ఈ మూలనుండి ఆ మూలకు రెక్కలు లేకున్నా
కనురెప్ప పాటులో వెళ్ళగల స్థితిని తోసి రాజని
ఇష్టంగా రక్తమాంసాల పంజరంలో ఒదిగి
సుఖసౌఖ్యాల నావ అనే భ్రమలో జీవినై
బందీనవుతాను
మరుపు గుడ్డలో మూటకట్టి సమస్తం వదిలి
మళ్ళీ ఓనమాలు దిద్దుకుంటూ, పడి లేస్తూ
అయినదానికీ కానిదానికీ అహాన్ని అద్దుకు
పాకులాడుతాను.

అసాధ్యాలు సుసాధ్యం చేసేందుకు అహరహం
అరిగిపోతూ కరిగిపోతూ కసరత్తు చేసాక
కనిపిస్తుంది లోలోపల దాగిన ఒక
అనంతానంత విశ్వం.
అజ్ఞానంధకారంలో ఈదులాడుతూ
అహం బ్రహ్మస్మి అనుకుంటూ
అన్నీ నేనే అనుకునే గోరోజనం నుండి
చేతులు కట్టుకు మనసు
అన్నీ నువ్వనే నిర్వికారత చేరుకున్నాక
ఎటు చూసినా
కళ్ళు చెదిరే ఆత్మ సాక్షాత్కారానికి
సాష్టాంగపడినప్పుడు కదా తెలిసేది నువ్వే నేననీ
ఈ సంచారం ఒక రెప్పపాటు సాగే
నీ విలాసమనీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here