[dropcap]ఉ[/dropcap]గాది 2022 సందర్భంగా సంచిక వెబ్ పత్రిక నిర్వహించిన కవితల పోటీ ఫలితాలు వెల్లడిస్తున్నాము.
పత్రిక నిర్వహణలో ఉన్నత ప్రామాణికాలు పాటించాలని సంచిక తపన పడుతుంది. ఉత్తమ ప్రామాణికాలు ఏర్పరచాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా కవితల పోటీ పలితాలకు ముందు అందిన కవితలను రచయితల పేర్లతో సహా ప్రకటించి పంపిన కవితలన్నీ అందేయా లేదా అని నిర్ధారించుకున్నాము. సాధారణంగా పోటీలకు పంపే రచనలపై రచయితలు పేర్లు రాయకూడదనీ, అలా రాస్తే రచన ఎవరుచేసిందో న్యాయ నిర్ణేతలకు తెలిసి వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందనీ అంటారు. అంటే, పోటీలు నిర్వహించేవారికి, వారు నియమిస్తున్న న్యాయ నిర్ణేతల నిష్పాక్షికతపై నమ్మకం లేదన్నమాట. అలా నిర్వహించినా సరే వెలువడే ఫలితాలు నిష్పాక్షికమైనవన్న నమ్మకం, రచయితలకుండదు, పాఠకులకూ వుండదు. అందుకు భిన్నంగా, రచయితతో సంబంధం లేకుండా, రచన ఆధారంగానే దాని ఉత్తమత్వాన్ని నిర్ణయిస్తారని నమ్మకం వున్న న్యాయనిర్ణేతలనే సంచిక ఎంచుకుంది. వారి నిర్ణయంపై విశ్వాసం ప్రదర్శించింది. రచయితలు, పాఠకులు కూడా వారి ఎంపిక సమంజసమే అని భావిస్తారన్న విశ్వాసం సంచికకు వుంది.
అందిన రచనలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించిన తరువాత న్యాయనిర్ణేతలు బహుమానార్హంగా భావించిన రచనలు.
(అకారాది క్రమంలో)
- అభావ క్షేత్రంలో – దాకరపు బాబూరావు
- ఊరి చివర ఆ ఇల్లొకటి – బి. కళా గోపాల్
- భావోద్వేగాల వనిత – కె. లీలా కృష్ణ
- నా తెలుగు – నండూరి సుందరీ నాగమణి
- నేటి తండ్రి మాట – అన్నమరాజు ప్రభాకర రావు.
- పొద్దు పొడుపు – హరీష్ తాటి
- మిగిలిన ఆనవాళ్ళు – డా. చక్రపాణి యిమ్మిడిశెట్టి
- వస్త్రం – లలిత చండీ
- వెంటాడే పాట – గరిమెళ్ళ వి.ఎన్. నాగేశ్వర రావు
- సడి చేయని చేతులు – గూండ్ల వేంకట నారాయణ
***
బహుమతి పొందిన కవులందరికీ అభినందనలు. పోటీలో పాల్గొన్న కవులందరికీ బహు కృతజ్ఞతలు… ధన్యవాదాలు. కవితల పోటీకి అందిన కవితలన్నీ సంచికలో వీలువెంబడి ప్రచురితమవుతాయి. రాబోయే కవితల పోటీకి ముందుగానే బెస్ట్ విషెస్…
కవులు/కవయిత్రుల పరిచయాలు – స్పందనలు:
దాకరపు బాబూరావు:
నేను ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో తిరువూరులో నివాసం ఉంటున్నాను. పంచాయత్ రాజ్‍లో విస్తరణ అధికారిగా విధుల నిర్వహణ…. ఎక్కువగా చదువుతూ… తక్కువగా రాయడం అలవాటు…
2009లో పాదు, 2021లో మట్టిమొగ్గలు అనే కవితా సంపుటులు ప్రచురించాను….
కవితల కు అనేక బహుమతులు అందుకున్నాను.
అభావ క్షేత్రం లో నేపథ్యం:
కవిత రాయలేని సందర్భంలో హృదయ స్థితికి అక్షర రూపం ఇస్తే ఎలా ఉంటుందో చేసిన ప్రయత్నమే ఈ కవిత….
మరొక్కసారి సంచిక వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు…..
బి. కళాగోపాల్
గత దశాబ్ద కాలంగా కవితలు కథల్ని రాస్తున్నాను. నేను పుట్టింది నిజామాబాద్ జిల్లాలో. ఎం.ఎ ఇంగ్లీషు, బిఎడ్ చేసిన నేను ఆంగ్ల సహ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాను. ఇంతవరకు నావి 450కి పైగా కవితలు వివిధ వార, మాస సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. నా కవితా సంపుటి ‘మళ్లీ చిగురించనీ..’ 2015లో 74 కవితలతో ప్రచురించాను. అంతేగాక స్థానిక నిజామాబాద్ రేడియో ఎఫ్.ఎం.లో 20 కథానికలు ప్రసారమయ్యాయి. 25 వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. 50 కథలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి. వాటిల్లో 20 కథలు వివిధ సందర్భాల్లో అవార్డులను పొందాయి. నా కవితలు కూడా అనేక సందర్భాల్లో పలు అవార్డులను పొందాయి. రాధేయ, ఎక్స్ రే, భిలాయ్ వాణి, కలహంస, భూమిక, సాహితీకిరణం, ద్వానా, వాల్మీకి, మల్లెతీగ వారి కవితా పురస్కారాలు పొందాను. సోమేపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి, జలదంకి పద్మావతి కథా పురస్కారాలను పొందాను.
సంచిక వెబ్ పత్రిక వారికి శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు. అనుభూతికి పెద్ద పీట లేసే కవితలకు ప్రాధాన్యం ఇవ్వటం అత్యంత ముదావహం. ఒక నోస్టాల్జియా ప్రపంచంలోకి నన్ను లాక్కెళ్తాయి పాత ఇండ్లు…. అలాంటి ఇండ్లకు.. అందులో బతుకును పండించుకున్న మన పెద్దలకు నమస్సులతో…
సంచిక వెబ్ పత్రిక వారికి ఉగాది శుభాకాంక్షలతో…
కె. లీలా కృష్ణ:
నమస్తే .. నా పేరు లీలా కృష్ణ… సంచిక కవితల పోటీ 2022లో విజేతగా నిలిచిన అభ్యర్థిని.
భావోద్వేగాల వనిత అనే ఈ కవితని మనసారా ఆరాధిస్తూ వ్రాశాను..
వాస్తవంగా నేను కవిని కాను. నేను ఒక వ్యాపారవేత్తని. కళామతల్లి మీద ఉన్న భక్తితో వ్రాయటం మొదలు పెట్టాను.
ఆ తల్లి నా చెయ్యి పట్టుకుని రాయించింది🙏
మా తాతగారు స్వర్గీయులు దశరధ రామయ్య గారు మరియు స్వర్గీయులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నాకు స్ఫూర్తిదాతలు🙏
ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఒక నైపుణ్యత దాగి ఉంటుంది..
ఆ నైపుణ్యతను మెరుగుపరుచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి… దాని నిమిత్తం ఎన్ని కష్టాలు ఎదురైనా నవ్వుతూ ఆహ్వానించాలి..
నేడు నేను పొందిన విజయమే దానికి సరైన ఉదాహరణ🙏
నండూరి సుందరీ నాగమణి
నమస్తే. నా పేరు నండూరి సుందరీ నాగమణి. 1963 ఆగస్ట్14 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టాను. భీమవరం, కాకినాడ, నర్సాపురం లలో నా విద్యాభ్యాసం కొనసాగింది. చదువు బీకామ్, ఎంబీయే.
ప్రస్తుతం యూనియన్ బ్యాంకు (పూర్వం ఆంధ్రా బ్యాంకు), మహబూబ్‌నగర్‍లో మేనేజర్‌గా పని చేస్తున్నాను.
చిన్నప్పటి నుంచీ సాహిత్యం చదవటమంటే చాలా ఇష్టంగా ఉండేది. ఇంటర్ చదువుతున్నపుడే కాలేజ్ మేగజైన్‌కి కథలు, కవితలు వ్రాయటం ద్వారా నా రచనావ్యాసంగం మొదలైంది. పత్రికలకు వ్రాయటం 1990 నుంచి మొదలైనా ఎక్కువగా వ్రాయటం మాత్రం 2008 నుంచే.
ఇప్పటివరకూ 400 వరకూ కథలు, 3 నవలలు ప్రచురితమైనవి. వచన, పద్య కవిత్వం అంటే మక్కువ ఎక్కువ. ఇటీవల గజల్ రచన కూడా నేర్చుకున్నాను.
ఫిబ్రవరి 21 – అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా నేను వ్రాసుకున్న పద్యాలను సంచిక కవితల పోటీకి పంపటం, వాటికి బహుమతి రావటం చాలా ఆనందం కలిగించింది. సంచిక పత్రిక సంపాదక వర్గానికి, నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అన్నమరాజు ప్రభాకరరావు
నమస్కారములు. 🙏🙏🙏
నా “నేటి (తండ్రి) మాట” పద్యకవితకు బహుమతి ప్రకటించినందులకు బహుధా కృతజ్ఞుడను.
నా ఉద్దేశ్యము – కవిత ఏ రూపంలో ఉన్నా అది వెలువడిన నాటి సామాజిక సమస్యను స్పృశించాలనేది ఆర్యనిర్ణయము. నేటి సమాజంలో యువత అనేక విషయాల్లో వెఱ్ఱి పోకడలు పోతుండటం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటివాటిల్లో, తమకంటే ఎక్కువ లోకానుభవం కలిగి, తమ శ్రేయస్సు కోరే తల్లిదండ్రుల మాట వినకపోవడం. ఉదాహరణకు వివాహాది అతి ముఖ్యమైన, జీవితాన్ని జీవితాంతం ప్రభావితం చేసే విషయాల్లో. అందువలన ఈ అంశాన్ని ఎత్తి చూపాల్సి వచ్చింది.
- పేరు : అన్నమరాజు ప్రభాకర రావు
- తల్లిదండ్రులు : శ్రీమతి రమాదేవి, కీ.శే. జనార్దనరావు
- వృత్తి : విశ్రాంత ఉద్యోగి (మొదట భారతీయ వాయుసేన, తదుపరి భారతీయ జీవిత బీమా సంస్థ)
- పద్యగురువు : అవధానాచార్య, కళారత్న, పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు గారు
హరీష్ తాటి
నమస్తే. నా పేరు తాటి హరీష్. ప్రస్తుతం విద్యార్థిని. ఐటిఐ పూర్తి చేశాను.
పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, కవితలు, కథలు, పద్యాలు రాయడం, చదవడం నూతన తెలుగు సాహితీ పక్రియలు నేర్చుకోవడం నా అభిరుచులు.
మెరుపులు ద్విశతక ప్రక్రియలో – మెరుపు రత్న పురస్కారం, ముత్యాల పూసలు శతక ప్రక్రియలో మోతి శ్రీ పురస్కారం, హరివిల్లు ప్రక్రియలో త్రిశతకానికి, కవి భూషణ్ పురస్కారం, తేనియలు ప్రక్రియలో శతక పురస్కారం , 2020లో కవిసమ్మేళనంలో సేనా పత్రిక వారి జ్ఞాపిక, ప్రతిలిపిలో సారంగదరియా పోటీలో విజేత పత్రం, నవ భారత్ నిర్మాణ్ సంఘ్ ఆధ్వర్యంలో జూమ్ ద్వారా నిర్వహించిన కవి సమ్మేళనం లో మొదటి విజేతగా నిలవడం, వాగ్దేవి సాహీతీ కళా వేదిక వారి సంక్రాంతి పోటీలలో బాల వ్యాకరణం పుస్తకాన్ని విజేత బహుమతిగా అందుకోవడం నాకు లభించిన అభినందనలు.
ఇప్పటి వరకు దాదాపు 500 పైగా మినీ కవితలు పూర్తి చేశాను. పద్య పక్రియలో శతకం పూర్తి అయింది.
డా. చక్రపాణి యిమ్మిడిశెట్టి
నమస్కారం. నా పేరు చక్రపాణి యిమ్మిడిశెట్టి. నా తల్లిదండ్రులు: లక్ష్మీకాంతం,రాధాకృష్ణగార్లు.
పుట్టినది: విశాఖజిల్లా అనకాపల్లి లో 3.9.1954 న.
విద్య: ఎం.కాం.,ఎం.ఫిల్.,పి.హెచ్.డి, హిందీ సాహిత్యరత్న
వృత్తి : అనకాపల్లి వర్తకసంఘ లింగమూర్తి కళాశాల వాణిజ్యవిభాగంలో 1976 లో లెక్చరర్ గా ప్రవేశించి రీడర్‌గా పదోన్నతి పొంది 2012 సెప్టెంబర్‌లో శాఖాధిపతిగా పదవీవిరమణ.
ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నాను.
సాహిత్యం వైపు అడుగులు:
గ్రంథాలయాలపట్ల,పుస్తకాల పట్ల అభిరుచి పెరిగింది మా అన్నగారి వలన.
1970 నుంచి నా భావాలకు అక్షరరూపం యివ్వటం ప్రారంభమైంది. ఆ ఆసక్తి కవితలు,గేయాలు రాయటానికి దోహదమైంది. అందరిలాగే నన్నూ శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం ప్రభావితం చేసింది.
పదకొండేళ్ళ నుంచీ నేను కన్వీనర్ గా అనకాపల్లి సాహితీమిత్రులు సంస్థ కొనసాగుతూంది.
ప్రస్తుతం: అనకాపల్లి సాహితీమిత్రులు వాట్సాప్ సమూహం నిర్వహిస్తూ,వారం లో రోజుకొక సాహితీ ప్రక్రియతో అందరినీ ఉత్సాహపరచటం జరుగుతుంది.
లలిత చండీ (బి. లలిత కుమారి)
నా పేరు బి.లలితా కుమారి. విద్య… B.A, B.L. L.L.M, M.A జోతిష్యం (Phd). న్యాయవాద వృత్తిలో ఉన్నాను. నా ప్రవృత్తి సాహిత్యం.
‘సాహితీ రసజ్ఞ’ అనే పురస్కారం లభించింది.
పుస్తకాలు…. చిన్నీలు కవితా సంపుటి.. మరియు త్వరలో ప్రచురణకు సిద్ధంమవుతున్న రెండు కవితా సంపుటాలు
ప్రవృత్తి పరంగా – లలితా చండీ అనే కలం పేరుతో 1981లో డా. పోతుకూచి సాంబశివరావు గారి విశ్వసాహితీ సంస్థ ద్వారా కవిసమ్మేళనాల లోను అఖిల భారతరచయిత మహాసభలలో ఎన్నో సార్లు పాల్గొన్నాను. నేటి నిజం, గణేష్ పత్రిక మరియు సమాచార పత్రికలో పలు మార్లు నా కవితలు ప్రచురించ బడ్డాయి. లలితా భాస్కర దేవ్ అనే పేరుతో సాహితీ సిరికోన వాక్ స్థలిపత్రికలో గత మూడు సంవత్సరాలుగా రాయడం ఒక అద్భుతమైన అనుభవం.
వృత్తి పరంగా…… 1989 నుండి ఆకాశవాణిలో న్యాయ వేదిక వినిమయ వేదిక , స్త్రీల కార్యక్రమాల్లో కార్మికుల కార్యక్రమాలలో పలు అంశాలపై ఎన్నో టాక్స్ ఇవ్వడం ఇంటర్వ్యూ ల లో పాల్గనడం మరియు దూరదర్శన్లో లైవ్ ప్రోగ్రామ్స్ మరియు న్యాయ సలహాలు కార్యక్రమాల లో పాల్గొనడం ఇలా ఎన్నో ఎన్నెన్నో…
వస్త్రం కవితకు నేపథ్యం:
నా లోని తాత్విక చింతనే, చాల చిన్న వయస్సు నుండి నేను ఎవరు అనే ప్రశ్నే ప్రేరణ మరియు నేను శరీరం కాను అన్న అనుభవైక భావన …
నేను రాసే దాదాపు కవితలన్నిటి లోను అంతర్గతంగా బలమైన తాత్విక చింతనే నాకు తెలియకుండానే ప్రతిధ్వని స్తోంది.
గరిమెళ్ళ వి.ఎన్. నాగేశ్వర రావు
నా పేరు గరిమెళ్ళ వి.ఎన్. నాగేశ్వర రావు. నేను జవహర్ నవోదయ విద్యాలయ, విశాఖపట్నంలో ఉపాధ్యాయుడిని
300 పైగా కవితలు, 50 కథలు, 40 బాలల కథలు, గేయాలు,వ్యాసాలు వివిధ పత్రికలలో అచ్చయినవి.
జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారంతో పాటు విద్యారంగంలో సాంకేతికత మేళవించి రూపొందించిన అంశాలకు 9 సార్లు జాతీయ పురస్కారాలు, సాహిత్యరంగంలో ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 90 కి పైగా పురస్కారాలు పొందాను
ఈ కవిత రాయడానికి ప్రేరణ:
రైల్లో బిచ్చగాని పాట విని కదిలిపోయి, పాట రకరకాల సందర్భాలలో మన మీద ప్రభావాన్ని ఎలా చూపిస్తుంది అన్న ఆలోచనల్లోంచి వచ్చిన కవిత ఇది. నాకు పాటలంటే చాలా ఇష్టం మరి.
గూండ్ల వేంకట నారాయణ
మాది గుంటూరు జిల్లా, గరికపాడు గ్రామం. వ్యవసాయ కుటుంబం.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను.
2021 లో నా మొదటి పుస్తకం, ‘భూమి పతనం’ అనే నవల ప్రచురితం అయింది. త్వరలో కవిత్వం రాబోతుంది.
‘సడిచేయని చేతులు’ అనే కవిత నేపథ్యం:
పల్లెల్లో నిరంతరమైన శారీరిక శ్రమ ఉంటుంది. ఈ శ్రమలో ఎక్కువ అలుపేలేని మనిషి స్త్రీ. ఆమె విశ్రాంతిని గురించి చెప్పాలనిపించి రాసిన కవిత ఇది.
***
ఈ రచనలను ఎన్నుకోవటంలో పాటించిన ప్రామాణికాల గురించి వ్యాసం త్వరలో….
***
సంచిక 2022 కథలపోటీ న్యాయనిర్ణేతలు, కథలను పరిశీలించేందుకు మరికాస్త సమయం అడగడం వల్ల. 20 బహుమతులను నిర్ణయించాల్సి ఉండడం వల్ల, వారి కోరికను మన్నించి కథల పోటీ ఫలితాలను రామనవమి రోజు ప్రకటించాలని సంచిక నిర్ణయించింది.