సంచిక విశ్వవేదిక –1

0
2

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా ఈ నెల ఆస్ట్రేలియా నుంచి శ్రీ రుద్ర తన అనుభూతులు, అనుభవాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

రుద్ర – అంతర్యాత్ర

స్థలం : కయామా సముద్రతీరం, సిడ్నీ, ఆస్ట్రేలియా

కాలం : కలిసొచ్చింది

ఆస్ట్రేలియాలో కాలుపెట్టడం, నా విషయంలో, తంతే బూరెల బుట్టలో పడ్డట్టయింది. ఎందుకంటే మహాసముద్రాలంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ సముద్రతీరాలకు కరువు లేదు. ఇసుకతిన్నెలకు, వాటిపై నడకలకు కొదువ లేదు. చంద్రుడు, ఏనుగు, సముద్రం. ఈ మూడింటి సమక్షంలో, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని ఎవరో చెప్పగా విన్నాను. సంద్రం విషయంలో, అది నూటికి నూరుపాళ్లు నిజమే అని చెప్పాలి.

కడలి భాష, హృదయఘోష నాకు కరతలామలకం కాకపోవచ్చు. కానీ, నా నుదుటిని నునుమార్దవంతో పలకరించే ఆ శ్వాస సుపరిచితమే! ఎడతెగని ఎన్నో కుశలప్రశ్నలు వేసి, నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునే అలలతో, నాకు ఆత్మబంధుత్వమేదో ఉందేమోనని అనిపిస్తుంటుంది. ఇంటికెళ్ళిన ప్రతీసారీ, నా అడుగుల సవ్వడి వినినంతనే, ఆఘమేఘాల కోసం ఆగకుండా, పరుగులెత్తుతూ పరవళ్ళు త్రొక్కుతూ, తీరం వాకిలిని చేరుకొని, వాటి కనుచూపుమేరల వరకూ కనిపించే విషయం తాలూకు ఊసులన్నీ, గలగలలాడుతూ నా కాళ్ళపై ఒలకబొయ్యడం కడలిహస్తాలకు పరిపాటే. ఎంతటి అతిథిమర్యాద! ఇలా ఎన్నిసార్లో. ఎన్నెన్ని తీపికబుర్లో!

కానీ, ఇవ్వాళ కడలిహస్తాలు కబుర్లు మానాయి. అవి నాకు చెప్పే కబుర్లు మారాయి. ఏదో క్రొత్త వృత్తాంతం మోసుకొచ్చిన ఆత్రుత స్పష్టంగా కనబడుతోంది. ఏదో అభినవపాఠం నాకు తెలియజెప్పాలనే నిబద్ధత కొట్టొచ్చినట్టుంది. అసలు, ఇంతకాలం ఎగసిపడే ప్రతీ అల, ఒడ్డుని చేరుకోవాలని ఉబాలాటపడుతోందని అనుకోవడం నా ఆరాటమేనేమో! నిజం చెప్పవలెనంటే, ఇప్పుడు నాకు అనిపిస్తోంది. కెరటానికి తీరం మజిలీ మాత్రమే! గమ్యం కాదని.

నిట్రాటలా నిలబడిపోయి, ఆలోచనల్లో మునిగిపోయి చూస్తున్న నాకు విషయం బోధపడలేదని, ఉస్సురని ఊరుకోలేదా అల. కొక్కురును మ్రోసుకుంటూ వెనుదిరిగి వెళ్ళిపోయిందది. మీనమేషాలకు తావులేక వడివడిగా వేషమొదిలింది. తనే తల్లి కడలయింది. తనకు తాను పురుడు పోసుకుని, తిరిగి తరంగితమయింది. పాతవేషమే. కానీ, క్రొత్త అవతారం! పాత బడే. క్రొత్త పాఠం. పాత గుడే. క్రొత్త దైవం. ఓహ్! కెరటానికి గమ్యం మళ్ళీ కెరటమేనా? ఈసారి, నన్ను తాకింది కడివెడు కడలినీళ్ళ సడులు కాదు.

నిత్యవిద్యార్థిగా నన్ను స్వీకరించిన వందల బడులు!

నిత్యశరణార్థిగా నన్ను ఆదరించిన వేల గుడులు!

రెక్కలు తెరిచి కట్టిన బయటి ప్రయాణాలు చాలని, కట్టిపెట్టాలని, రెప్పపాటులో ముగిసిపోయే లోతట్టుయాత్రలకు బయలుదేరాలని, నన్ను నేను కలుసుకుని తెలుసుకునే లోగుట్టుయాత్రలకు, శ్రీకారం చుట్టాలని, నన్ను తట్టిలేపింది, నా మూట కట్టింది ఒకే ఒక్క చిట్టి అల! నా కాలిపై నిలిచిన ప్రతి బిందువునూ, నా కన్ను సింధువులా తలుస్తోంది. ఆత్మబంధువులా కొలుస్తోంది. ఇప్పటికిప్పుడు, నిల్చున్న ఫళాన నా పాత్ర అంతమయింది. పాత్రధారిని కనుగొనే ‘అంతర్యాత్ర’ మొదలయింది.

***

స్థలం : స్వగ్రామం, పాల్వంచ, భారతదేశం

కాలం : కాలవ్రాసింది

భూమండలమంతా తిరిగి చూడలేదు కానీ, దేశాలు తిరిగాను. బహువిద్యావిశారదుడిని కాదు కానీ, బద్రుకా కళాశాలలో ఎం. బి. ఏ. పూర్తి చేసాను. అంతకు మునుపు బి. సి. ఏ., ఎం. పి. సి., ఎస్. ఎస్. సి; ఎక్కడా ఫక్తు సమకాలీన భారతీయ విద్యాసమీకరణాలకు లోటు రానివ్వలేదు. తరగతి తదితర పాఠశాల సంబంధిత చదువుల్లో, ప్రపంచవిషయజ్ఞానార్జనలో ముందంజలో ఉండేవాడిని. లౌక్యం తదితర జీవనవేదాల అధ్యయనంలో వెనుకంజలో ఉండేవాడిని.

దన్నా ఒక విషయాన్ని ఒక్కసారి చూసినా, చదివినా, ఇట్టే గుర్తుండిపోయేది. పదే పదే పునఃపఠనం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. చదువంతా అలాగే నెట్టుకొచ్చాను. పాఠశాల, కళాశాల, రాష్ట్రస్థాయిల్లో కూడా గుర్తింపులొచ్చిన సందర్భాలున్నాయి. జనమంతా ఏకసంథాగ్రాహిని అనేవారు. గురువుల దృష్టిలో, నేనొక సుఖాన్ని. సౌకర్యాన్ని. ఒక అంకెని. ఉధృతంగా ఎగసిపడాలి తప్ప, ఎప్పుడూ నేల రాలకూడని అలని. రంగురంగుల విజయోహల లోకాల్లో విహరించాలి తప్ప భగ్నం కాకూడని కలని. అంతా అనుకున్న విధంగానే, ప్రణాళిక ప్రకారమే, జయజయధ్వానాల మధ్య సాగిందేమో మరి!

ఈ ఊహ తెలియడం అన్నది ఉందే! ఆ అనుభూతి, మనిషి జీవితంలో లేకపోతే ఎంత బాగుండు. ఆ అనుభవాన్ని, మనిషి అందుకోలేకపోతే ఎంత బాగుండు. ప్రపంచం దృష్టిలో, అక్కడినుంచే మొదలవుతుంది పఠనం. నా దృష్టిలో, అక్కడినుంచే మొదలయింది నా పతనం. జనజక్కన్నలు చెక్కిన శిల్పంగా మారడం మొదలెట్టాను. ప్రజ గీచిన ప్రతిష్ఠాత్మక చిత్రంగా రూపుదిద్దుకోవడం మొదలుపెట్టాను.

ఊహ తెలిసిననాటి నుంచే, ప్రపంచం నాకన్నా ముందు నిద్రలేవడం మొదలెట్టింది. విషయాహార విషాహారాన్నంతా, గోరుముద్దలు చేసి తినిపించడం మొదలుపెట్టింది. ఆకలి తరిగి కరిగేదాకా ఆబగా తిని, తదుపరి ఆకలి పెంచుకుని మరీ తిని, అజీర్తిస్థాయికి నన్ను నేను చేర్చుకున్నాను. ఇక్కడే, ఇదే అమృతక్షణంలో, ‘నేను’ అనే ఊహాలోకంలో విహరిస్తున్న నేను, నా విజయపరంపరల తుంపరలను విశుద్ధగంగలా గ్రోలుతున్న నేను, మండే సూర్యుడు తన కాకకు బుధగ్రహాదులను బలిచేసినట్టు, నాకు ప్రాణప్రాయుల్ని తృణప్రాయంగా చూసి, వారి మనోభావాలను తొలిచేయడం మొదలుపెట్టాను.

నా కొలబద్దలకీ, కొలమానాలకీ సరితూగట్లేదని దూరం పెడుతున్నాననుకున్నాను కానీ దూరం పెట్టేస్తున్నానని గ్రహించలేకపోయాను. తెగేదాకా దారం విలువ, దూరమయ్యేదాకా బంధం విలువ తెలియదని ఈ మధ్య ఒక కవి వెల్లడించడం విన్నాను. ఎంత చక్కగా అతికింది నా ధోరణికి? ఎంత గట్టిగా తగిలింది నా చెంపలకి?

~

నా తెల్లని బ్రతుకుపేజీలో నల్లని సిరా మరకలన్నాను
తెలిసీతెలియక ఎవరో రాసిన పిచ్చిరాతలన్నాను
వ్రాసిన చేతిని తిట్టిపోసి వ్రాయడం రాదనుకున్నాను
మకిలిపట్టారని నా మనుషులను నేను కాదనుకున్నాను

మట్టిగొట్టుకుపోయాయని మనస్సులో రాళ్ళనుకున్నాను
మరుగున కడగాలనే మిషతో దాచి మిన్నకున్నాను
విప్పార్చి చూడకనే విసుగుతో విదిలించికొట్టాను
మకిలిపట్టారని నా మనుషులను నేను కాదనుకున్నాను

నేలరాలిన ముక్కలని కలిపితే మాత్రం అవుతుందా కాగితం
కళ్ళు నులమక కొనసాగించాను మునిచీకటి జీవితం
కోటిమార్లు ఏడ్చినా, తేలేను కోల్పోయినవాటి విలువ
రాశులకొద్దీ రాలాకగానీ, రాలేదు నాకు మెలకువ

మొద్దునిద్ర లేచి అనుకున్నాను నేను తుడిచింది నీళ్లని
నా కన్ను నాతో కలిపింది దోసిలి నిండా రతనాల రాళ్లని
నడిచింది నేనకున్నాను, నడిపింది మీరని చెబుతున్నాయి కాళ్ళు
మట్టిరతనాలంటి మనుషులారా! ఇవిగో కడుగుతున్నాయి కన్నీళ్లు!

ఒక్కసారి చూస్తే, చెబితే, చదివితే ఇట్టే పట్టేసే నేను, ఇంత ముఖ్యమైన జీవితపాఠాన్ని, ఎన్నిసార్లు వల్లెవేసినా ఒంటబట్టించుకోలేని ‘నేను’, ఏకసంథాగ్రాహినా? ఏకాకిరాయుడినా?

***

స్థలం : ఈస్ట్ హ్యామ్, లండన్, యూ. కె.

కాలం : బాధించి బోధించింది

ఉన్నతవిద్య ఒక నెపం మాత్రమే. రెక్కలు తొడిగి, తూరుపుతీరాలు వదలి పడమటి కనుమలకు ఎగిరి రావడం వెనుకనున్న అసలు కారణం, తిరిగే కాలు, సుడులు తిరిగే ఆలోచనలు ఆగకపోవడం. లండన్ మహానగరానికి వచ్చి 2 నెలలు అయింది. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. రొక్కం, ఎవడి రక్తసంబంధీకురాలు కాదు కదా. జేబుల్లో దాచుకుంటే మనదిగా ఉండడం, డాబులు కొడుతుంటే పరాయిది అయిపోవడం, చేతులు చాస్తుంటే చులకన అయిపోవడం, పైకపు అద్దంలో కొట్టొచ్చినట్టు కనిపించే ప్రతిబింబాలు.

వందల్లో ఉద్యోగాలు. ఒక్కడూ ఇవ్వలేదు. పదుల్లో స్నేహితులు. ఒక్కడూ ముందుకు రాలేదు. కలిసి చదువుకున్నాం, కలిసి బ్రతుకుదాం నేను అనుకున్నాను. కలిగి ఉంటేనే, కలిసి ఉందాం అని వాళ్ళు అనుకున్నట్టున్నారు. సరే కానీ! అధికారం ఇచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడే కదా, నా అనుకున్న వాళ్ళ అసలు స్వరూపం బయటపడేది. ఒక్కడు కూడా రూపాయిచ్చిన పాపాన పోలేదు. రుబాబుకు, ఉచిత సలహాలకు తక్కువ లేదు. నయవంచకులు! నమ్మకద్రోహులు! అన్న మాటలు వాళ్ళ విషపూరిత మనస్తత్వాల వర్ణనకు సరితూగే మాటలు కావేమో.

“ఇంట్లో ఒక్కడివి ఉండి ఏం చేస్తావ్? నాతోరా” అని స్నేహితుడొకడు ఈడ్చుకెళ్లాడు. ఇద్దరం ఒక పాడుబడిన ఇంటికి చేరుకున్నాం. మావాడు, నన్నక్కడే ఇంటి ముందు ఉండమని చెప్పి, ఇంటి యజమానితో మాట్లాడుతున్నాడు. ఎందుకో ఏ మాత్రం అవగాహన లేకపోయింది. యజమాని నన్ను ఎగాదిగా చూడడం నేను గమనించకపోలేదు. ఇప్పుడే వస్తా అని చెప్పి, మావాడు కదిలి వెళ్ళిపోయాడు. నన్ను లోపలికి రమ్మని సైగ చేసి, వెనుక పెరట్లోకి తీసుకెళ్లాడు అతను. దాన్ని పెరడు అనడం కన్నా కారడవి అనడం సబబుగా ఉంటుందేమో. చెట్లు, తుప్పలు, పొదలు, లతలు, మొక్కలు, గడ్డి ఒకటేమిటి? కలగాపులగంలా తన్నుకొస్తున్న నా ఆలోచనల్లాగే, అన్నీ కలగలిసిపోయాయి. అసలు నాకిక్కడేం పని? అతనొచ్చాడు. నా చేతికి ఒక యంత్రాన్ని అంటగట్టాడు. అరనవ్వు నవ్వాడు. చక్కా పోయాడు.

నా తల తిరిగిపోతుంది. కాళ్ళు వణకుతున్నాయి. నిలువెల్లా నిప్పులగుండంలా, పరాభవభారంతో రగిలిపోతున్నాను. అంటే? నేనిప్పుడు ఇది శుభ్రం చెయ్యాలా? మావాడు, నా గొంతుకోసి, నన్ను వీడికి తెగనమ్మి వెళ్ళిపోయాడా? నేను చదివిన చదువేంటి? ఈ అవమానమేంటి? ఇలాతలం చీలిపోయి, నన్ను అక్కున చేర్చేసుకుంటే బాగుండుననుకున్నాను. నన్ను ఎంచుకుని మరీ, పిడుగొకటి నా తలపై రాలితే బాగుండుననుకున్నాను. ఎలా పనిచేస్తుందో తెలియదు. ఈ పని ఎక్కడినుంచి మొదలుపెట్టాలో తెలియదు. ఎవరి పీకలు గుర్తొచ్చాయో, కసిగా మీటలు నొక్కడం ప్రారంభించాను. పెద్ద మోతతో మొదలయిందది.

ఆ మోతలో, నా మౌనరోదనలు ఎవరికీ వినిపించకుండా పోయాయి. ఆ అడవిలో, నా అరణ్యరోదన తాలూకు కన్నీటినదులు కనిపించకుండా కొట్టుకుపోయాయి. కన్నీటితో, యంత్రానికి పట్టిన దుమ్మును కడుగుతున్నానో, నా మనసుకి పట్టిన మకిలిని కడుగుతున్నానో తెలియట్లేదు. అమ్మ గుర్తొచ్చింది. ఒక్కనాడు, ఇంట్లో అమ్మచేతికి సాయంగా లేను. ఒక్కసారి, ఇలాంటి పనులు చేసిన అలవాటు లేదు. అలా ఎంతసేపు పనిచేసానో చూసుకోలేదు. తిండీతిప్పలు లేవు. నీళ్ళూ నిప్పులు లేవు. నిర్దయగా, కంటికి కనిపించినదంతా చెక్కుకుంటూ వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్లిన వెంటనే, ఇటువంటి అబద్ధపుకోరుల నుంచి దూరంగా, గది ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాను. చూస్తూ చూస్తుండగానే సాయంత్రమైంది. చెయ్యాల్సిన పని పూర్తయింది.

ఎప్పుడొచ్చాడో, ఎంతసేపటి నుంచి చూస్తున్నాడో, నవ్వుకుంటూ నా దగ్గరికి వచ్చాడు అతను. నల్లగా తుమ్మమొద్దులా, చూడడానికి శ్రీలంక దేశస్థుడిలాగా అనిపించాడు. చూడగానే పుట్టు పూర్వోత్తరాలూ, కులగోత్రాలూ విప్పి చెప్పేసే, ఈ అంజనం విద్య ఎక్కడిదో మరి? నా భుజం తట్టాడు. కళ్ళు తుడుచుకోమన్నాడు. సిగ్గుపడిపోయి కళ్ళు తుడుచుకున్నాను. ఏదో పళ్లరసం లాంటిది పోసి ఇచ్చి, బలవంతపెడితే త్రాగక తప్పలేదు. నా భుజాలు పట్టుకుని త్రిప్పి, అటు వైపు చూపించాడు. ఇప్పటివరకూ కోపోద్రిక్తుడినై నేను సరిగా చూడలేదు. అక్కడ అడవి లేదు. వసంతం నడిచి రావడానికి పరిచిన పూలదారిలా ఉంది ఆ ప్రదేశమంతా. అంతక్రితం ఉన్న చెత్తా చెదారమంతా ఏమైంది? నా పనితీరుకు నాకే ముచ్చటేసింది. ఇందాకటి నా కన్నీటివర్షానికి మొలకెత్తిందో ఏమో, ఆ వనంలో మొట్టమొదటి పూవు, నా మోహంలో పూసింది. ఇంతలో నా అరచేతులు తెరుచుకోవడం, అందులోకి కాగితాల గుత్తి చేరడం జరిగిపోయాయి.

డబ్బులు! నా డబ్బులు! లెక్కబెట్టుకోమన్నాడు. 80 పౌండ్లు. ఎక్కువో తక్కువో నాకు తెలీదు. కానీ, సున్నా కన్నా ఖచ్చితంగా ఎక్కువే అని మాత్రం తెలుసు. ఆ మాత్రం చదువుంది.

“నువ్వు ఇందాక యంత్రాన్ని గట్టిగా మోదడం చూసాను. నాకు కోపం రాలేదు. పని తెలియక, పిచ్చిమొక్కల్ని కసిగా నరుక్కుంటూ పోవడం చూసాను. నాకు నవ్వొచ్చింది. నీ కోపం కళ్ళలోంచి ధారాపాతంగా కారడం చూసాను. నాకు ఆనందమేసింది. నీకు ఆకలిదప్పులు వేయలేదు. నాకు ముచ్చటేసింది. అనుకోని పని ఎదురైనా, అనుభవం లేకపోయినా పూర్తి చేసావు. నాకు సంతోషమేసింది. అడవిని, వనంగా మార్చావు. నాకు సంతృప్తి కలిగింది. నీకు ఈ దేశంలో ఆకలుండదు, నీ బ్రతుకులో తిరుగుండదు. ఎందుకంటే, ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పదైన యంత్రాన్ని ఒడుపుగా నడపడం నేర్చుకున్నావు. అదే, నీ అహంకారం! నీకు మొట్టమొదటి సంపాదననిచ్చిన నన్ను మాత్రం మరువకు” అన్నాడు అతను.

అతను ఇంకా ఏదో చెబుతున్నాడు. నాకు లీలగా మాత్రమే వినిపిస్తోంది. నా అంతరాత్మలో, రెండు గంటలుగా సాగుతున్న కురుక్షేత్రం ముగిసింది. రెండు నిముషాల అతని భగవద్గీతా ముగిసింది. భగవానుడు, నల్లగా తుమ్మమొద్దులా కనిపించాడు. పొంగి పొరలుతున్న అహంకారపు సుడులలో నేను కొట్టుకుపోకుండా, నన్ను సురక్షితంగా ఆవలి ఒడ్డుకి చేర్చాడు. ఆత్మస్వరూపుడు అని జనం కొలిచేవాడు, నాలో ఆత్మవిశ్వాసమై వెలిసాడు. డబ్బులు జాగ్రత్తగా పొదివి పట్టుకుని, నడుచుకుంటూనే ఇంటికి బయల్దేరాను. దూరమే! కానీ, నెప్పి తెలియలేదు. ఒగరుస్తూ చెమటలు కక్కుతున్నాను. కానీ, నాలో నుంచి మార్పు తాలూకు సుగంధమే ప్రస్ఫుటంగా వస్తోంది.

ఇంటికి చేరుకొని తటాలున తలుపులు తీసాను. ఉద్యోగాలకు వెళ్లారనుకున్న నా స్నేహితులు! నాకోసం ఎదురుచూస్తున్నారు. నన్ను చూడగానే, ముందు భయపడినా, తడిసి పురివిప్పిన నా నెమలి కన్నులను చూడగానే, ఊపిరి పీల్చేసుకున్నారు. పన్నాగం పన్నిన బద్ధశత్రువులు, పన్నగభూషణులలా అగుపించారు. గర్జించిన మేఘంలా గట్టిగా నవ్వేసాను.

ఇప్పుడు కూడా నా చేయి చాచాను. అర్థించడానికి కాదు. అర్పించడానికి. నా కష్టార్జితాన్ని, నా తొలి సంపాదనని. అక్కడినుంచీ, నా భుజాలను నమ్ముకున్న ఏ రోజూ, నా చేతులు చాచాల్సిన ఖర్మ నాకు పట్టలేదు.

ఒక్కసారి చూస్తే, చెబితే, చదివితే ఇట్టే పట్టేసే నేను, ఈ పాఠాన్ని గట్టిగానే నేర్చుకున్నాను. గుర్తుపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏ దేశమేగినా, ఎందుకాలిడినా నా బాహువుల్ని ఝళిపిస్తున్నాను. నా భుజాల్ని నమ్ముకున్నన్ని రోజులు, నేను ఏకాకిరాయుడ్ని కాదు. ఏకసంథాగ్రాహినే!

ఎందుకంటే,

నేను దిగనంతవరకే!

బ్రతుకుబరి పొలిమేరలు పెడుతుంది.

బ్రతుకుబలి పొలికేకలు పెడుతుంది.

అందుకనే,

నాలో ‘నేను’ ఉబికేంతవరకూ, నా అంతర్మథనం సాగుతుంది.

నాకు ‘నేను’ దొరికేంతవరకూ. నా ‘అంతర్యాత్ర’ సాగుతుంది.

రుద్ర

***

రుద్ర కొట్టు గారి కవితలు:

1. ప్రవాసం
~
పరదేశంలో పైసల కోసం
ప్రవాసజీవనం మేలని ఎంచి
ఆప్యాయతలను తెంచుకొని
అనుభూతులను అణచుకొని
అన్న్యోన్యతలను అంతమొందించి
అహంకార సహకారాన
అవసరాలను పెంచుకొని
నూన్యతాభావమ్ నెత్తికెత్తుకొని

స్వార్ధం మెట్లతో మేడలు గట్టి
గౌరవ మర్యాదల గోడలుగట్టి
మనిషన్నోడిని మనీతొవెలగట్టి
కన్నుగానక మరి మిన్నుకెగిరి

వెతలలోనబడి, విషయం మరచి
ప్రవాసంలోన భారతీయుడు
భాషను విడిచి, భావం మరచి
వెలగబెట్టిని వింతేమిటంటే

పరాయి భాషపై పట్టుకుదరక
మాతృభాష మరుగున పడగా
భాషించడంలో అనుభూతిలేక
ఆత్మానందం కోరవడగా….

ప్రయత్నపూర్వకంగా అయినా, తన
మాతృభాషలో మాట్లాడడెన్దుకో?
అది అమృతతుల్యమైన తన
అమ్మభాషని ఆలోచించడెన్దుకో..?

>>>

2. ప్రవాసాన నా ప్రస్థానం
~
ప్రవాసంలో నా జీవన ప్రస్థానం
జీవితాన్ని నేర్పిన ఓ దృశ్యకావ్యమ్
మరువలేనిజ్ఞాపకాల సుమధురఘట్టమ్
ఈ వసంతంతో పూర్తి రమారమి పద్దెనిమిదో వసంతం.

యాదృచ్చికంగా ఎదురైన, నేస్తాల సాంగత్యంతో
నాజీవితాన జరిగిన సంఘటనల నేపధ్యంతో
నన్ను నేను తెలుసుకోన్నానన్నది, నిజం!
అందుకుపకరమైనది ఇక్కడి నా జీవనం

క్రొత్తలో కాస్త కంగారనిపించినా….!
పోను, పోను పరిచయమయి పాతపడిపోగా ..
పరికించి, పరిశీలనతో ఆలోచించగా
శీతాకాలం చలొక్కటే ..ఒణికిస్తు
ఒకింత, విపరీతమనిపించెనేకాని

మూల్యం ముందు అదికూడా మరుగైపోయి
అలవాటైనదిలే అనుకొని సర్దుకుపోవడం,
మూల్యమమకారాన ప్రతేటా పరిపాటైపోయే!
ఖర్చులు పెంచుకోవడమే స్టేటస్ అనుకోని
మరిద్దరం…సంపాదిస్తున్నంగా?
అద్దె ఇల్లు ఇరుకని,
క్రియేటివ్ అర్కిటెక్టులమనుకొని, నేలకొని ఇల్లునుగట్టి
గృహప్రవేసమిషతో గొప్పతనం నలుగురికిచూపి
మొదటినెలనుండే నెత్తిన మోర్టగేజ్ మోటెత్తుకొని
బతుకు భారమైనా..,
బయిటికి కనబడక
కుబేరునిలా ఫోజులతో, ఇంటిమోజుతీరేలోగా కాంట్రాక్టుజాబుకోతల్తో
కంగారెట్టి, కిమ్మనక తోకముడిచి తెలివిగ పర్మెనెంటయ్యి
పరుగెత్తి పాలకంటే,
నిలబడినీళ్ళు తాగుటమేలని
జీవితాన సంపదకన్నా ఆనందానుభూతులు మిన్నని
అర్థమయ్యే అదృష్టం..! అనర్ధాలేమీ జరుగకముందే.

ఇది
పద్దెనిమిది సంవత్సరాల
నా ఈ ప్రవాసజీవన పరమార్ధం
ఇక ముందేముందో ఎరుగని ప్రశ్నార్ధక భవితవ్యం!
జవాబులకై ఎదురుచూడక, జవాబుదారితనంతో
జీవితాన్ని గడపాలని ఎంచే సగటుమనిషి సంక్షిప్త గాథ!!🤣

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here