[ఈ ఉపోద్ఘాతం, కోవిడ్ ముగిసిన వేళ – పని జీవితంలో మార్పులు, అనే నా సిడ్నీ తెలుగు వారి తెలుగువాణి రేడియోలో, 17-జూన్-2023 తేదీన ప్రసారమైన కార్యక్రమం. పూర్తి రెండు గంటల నిడివిగల కార్యక్రమాన్ని, ఈ లింకు లో వినగలరు.
https://drive.google.com/file/d/1yG3GsSJAVwxGbAfBg_9I5xIPMVj1ev_R/view?usp=drive_link]
[dropcap]ఇం[/dropcap]చుమించు నవంబర్-2019లో బయటపడిన కోవిడ్, ఒక మహమ్మారి రూపందాల్చి, ప్రపంచ నలుమూలలకు వ్యాపించి, తన విషకోరలకు వందల, వేల మానవులను బలిచేస్తుండటంతో, ప్రపంచ దేశాలన్ని తమతమ ఉనికిని పరిరక్షించుకొనే క్రమంలో, ఎన్నో ప్రతిబంధకాలు తీసుకొనివచ్చి, మన నడకలు ఇండ్లకే పరిమితమైపోయాయి, ఇది అంతా ఆ చీకటి ఘడియల, మార్చి-2020 నాటి కథ!
మనిషి మనిషిని ఏదో విధంగా ప్రభావితం చేసిన, కోవిడ్, ఏ మనిషిని తట్టినా, ఏదో ఒక విషాద ఘటన వారి బంధుమిత్రుల, సహచరుల విషయమై చెప్పి, కన్నీరు కార్పించే, విషగురుతులే. ఇంచుమించు, గత సంవత్సరం మధ్యనుంచి, ప్రపంచం ఆ అల్పజీవి, కనుసన్నలనుంచి బయటపడుతూ ఉండటంతో, నెమ్మదిగా మానవాళి మొత్తం, తిరిగి ఒకేసారి జన్మ ఎత్తిన రీతిన, మనమందరం సంబరపడ్డాము! మనవారిని కలుసుకోవాలని, ఊరట మాటలు చెప్పాలని ఉవ్విళ్ళూరాము. తిరిగి జనజీవన స్రవంతి కోవిడ్ ముందటి రోజులకు నెమ్మదిగా చేరుకుంటుంది.
ఈ కొత్త వెలుగులో, ఒకసారి అంతఃపరిశీలన మానవాళి చేసుకోవలసిన అవసరం ఉంది, తమను తాము తరిచి తరిచి తమను తాము ప్రశ్నించుకోవలసిన అగత్యమూ ఉంది. తన మనుగడ, తనవారి మనుగడ, వెరసి మానవాళి మొత్తం, సమూలంగా సమసిపోయే, భయంకర వాస్తవంలో, మనషులలో ఒక నిర్వేదం, సాటి వారిపై సానుభూతి, అత్యంత దయనీయ స్థితిలో కూడా, తమకు జన్మనిచ్చిన వారి చివరి ఘడియలు కూడా చూడలేని, అంతిమ సంస్కారాలు కూడా జరుపలేని ఆవేదన, రెక్కాడితేగాని, డొక్కాడని దయనీయ స్థితిలో, బ్రతుకుతెరువు ప్రశ్నార్థకమై, ఎందరో మన తోటి మానవులు – వీటిని అక్షరాలలో నేను వెలిబుచ్చలేని గుండె గుండెలోని వేదన, కదిపితే ఉప్పెనలా- మానవచరితను ముంచెత్తే విషమయ స్థితిలో-
నిజం, ఒక మమతా ఉదయం జరిగింది! సాంఘిక మాధ్యమాలు, Information & Communications Technologies (ICT): ఏ ఆర్థికవేత్త, ఏ మానసిక శాస్త్రవేత్త ఊహించని విధంగా, ముందుకునెట్టి, విశ్వమంతా ఒకటే- మన అందరి భవిత ఒకటే – రేపు ఒక అపురూపమంటూ, మనుష్యులను ఒక వసుధైక భావనలో కలిపింది. దాని ప్రభావం, అనేక సంస్థల, ఆ రోజుల మనుగడకు, నిలకడకు కూడా దోహద పడింది!
కానీ, తిరిగి ప్రపంచ వాతావరణం కోలుకుంటున్న తరుణంలో, మనిషిని మనిషిని దాటాలనే యోచన, తానే ముందుండాలనే భావన, తానే మిగలాలనే ఇరుకు తపన, చూస్తున్నాము ఎల్లెడలా!!
అదే నా క్రింది ఉగాది కవితలోని ఆవేదన, ఆక్రందన!!
పనిజీవితంలో మార్పులు మనం చర్చించే ముందు, మనలను కాపాడిన శాస్త్ర జ్ఞానాన్ని, శాస్త్రజ్ఞులను ఉన్నతించే, సి నారాయణరెడ్డిగారి, ‘మానవుడు దానవుడు’ చిత్రంలోని, ‘అణువు అణువున, వెలసిన దేవా’ పాట వినండి.
2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఆవృతాల ఆవృతాల అవనిలో –
ఇరుసులేని విస్మృత కాలగమనలో..
కరోనాలు.. కల్లోలాలు.. ఎన్నెన్నో
ఎగసి ఉవ్వెత్తున ఎగసి..
చరితను.. నరజాతి నడకను –
సరళిని.. యోచనా పరిధిని ..
నిమేష మాత్రంగా కుదిపి
మంచికై ముందుకు నెట్టే!
అగుపించిన విశాల పథం
ఎలుగెత్తిన హృదయ సందడి..
మావిచిగురుగా సవరించిన కోకిల
అందిన ఆరురుచుల అనుభూతులు ..
పడమటకై వడివడిగా పరువులిడే!
విస్మయ సంజ రంగేళిలో –
వినయ విస్మిత యోచనలో చూస్తున్నా ..
ఇరులులేని శోభకృత్ ఉషఃకాంతికై !!