సంచిక విశ్వవేదిక – పరిచయ వాక్యం

0
2

మన అనుభూతి మనదే – అది మనమే రాయాలి!

[dropcap]తె[/dropcap]లుగువారు శతాబ్దాల క్రితమే, మారిషస్, మలేసియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఫిజీ వంటి ప్రాంతాలకు వలసపోయినా, 1960ల తరువాత సంపన్న దేశాలకు ప్రయాణం, వలసలు ఎక్కువ అయ్యాయని అనుకోవచ్చు. ఈ వలసలు చదువు కోసం, తదుపరి ఉద్యోగం కోసం ఆ తదుపరి వ్యాపార నిమిత్తం – అంది పుచ్చుకున్నాయి. వలస దేశాలలో భిన్న సంస్కృతి, ఆహార వ్యవహారాలు, జీవన విధానాలు- బ్రతుకు తెరువు సంపాదించి నిలదొక్కుకోవడం, వాటికోసం ఆరాటం, ప్రతి మనిషిని ఒక్కొక్క విధంగా ప్రభావితం చేశాయి. చేస్తున్నాయి. చేస్తాయి కూడా! కొన్ని దేశాలలో తెలుగువారి వలసలు అర్థ శతాబ్దం దాటాయి కూడా! ఈ ప్రస్థానంలో వారు ఏవిధంగా తమ జీవనాన్ని నిలదొక్కుకుని, వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా చేసిన కృషి ఏమిటి; మాతృదేశ పరిస్థితితో బేరీజు వేస్తే లోతుపాతులు ఏమిటి; నేర్చుకొన్న పాఠాలు ఏమిటి; తెలుగు, తెలుగువారు ప్రపంచ వేదికలో తమ మనుగడ సాధించడానికి, ఉన్నతి చాటడానికి ఏమి చేయవచ్చు? సాధించిన విజయాలు పదిమంది దృష్టికి ఎలా తీసుకొనిరావాలి? అటువంటి అనేకానేక భావాలను వ్యక్త పరచడానికి, ఈ విశ్వవేదిక ఒక వేదిక కావాలని మా ఆకాంక్ష.

నిజమే, ప్రవాసంలో వందలుగా సంస్థలు, నడిపే పత్రికలు, వేదికలు ఉన్నా, ‘ఎల్లలు లేని తెలుగుదనం’ వినిపించలేక పోతున్నాయి. అందునా ‘తెలుగువారి ప్రస్థానం’కి తగిన వసతి చూపలేకపోయాయి అనేది వాస్తవం. ఆ లోటును భర్తీ చేయాలని, తెలుగువారు వివిధరంగాలలో సాధించిన ప్రగతిని, అనుభవాలని ఒకచోట నిక్షిప్తం చేయాలనే అభిలాషతో ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాము. మీ మీ అనుభూతులు, అనుభవాలు తెలియచేయండి. తెలుగు నేలతో వాటి అవినాభావ సంబంధం కూడా పరరిశీలించవచ్చు. క్లుప్తంగా సాంస్కృతిక సంస్థల విషయాలు, మీ గురించి, మీ స్నేహితుల గురించి తెలియ చేయండి. ఇది నిరంతరం కొనసాగేది కావున, మీ రచనలను, క్రమం తప్పక ప్రతీ నెల మూడవ వారం లోపు పంపితే, వాటిని వచ్చే నెల సంచికలో పొదుపరుస్తాము. మీ రచనలు తెలుగులో ఉండాలనేది  ముఖ్యమైనా, English లో ఉన్నవాటిని కూడా  పరిశీలిస్తాము. అలాగే ఈ వేదికను మరింత ఉపయుక్తంగా మలచడానికి, విస్తృత పరచడానికి మీ మీ సలహాలు అందించండి.

ఈ వేదిక మనది. మన అనుభూతి మనదే – అది మనమే రాయాలి!

ఈ శీర్షికకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడి: viswavedika@outlook.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here