[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా ఈ నెల ఆస్ట్రేలియా నుంచి శ్రీ మనస్వి తన అనుభూతులు, అనుభవాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
పయోధరంతో పయనం-1
పదవ తరగతిలో వానా కాలం చదువుల వలన ఎండాకాలం పరీక్షలో, ఫలితం తారుమారు అవడంతో, చుట్టు పక్కల వారి ముందు బయటకు తల వంచినా, పోయిన పరీక్ష నాది కాని భాష (ఆంగ్లము) అని సరిపెట్టుకున్నాను.
కొందరు అన్నదానం చేస్తారు. మరికొందరు వస్త్రదానం చేస్తారు. నాకంటూ ప్రత్యేకత ఉండాలనో ఏమో, ఆ దైవం నాచేత కాలాన్నే దానంగా చేయించాడు (నా చిన్నతనంలో పదవ తరగతి పరీక్ష పోతే ఒక సంవత్సరం చక్క భజనే కదండి), అయినా నేను చేసిన తప్పుకు వారిని ఎందుకులేండి మధ్యలో తీసుకు రావడం.
అది, అలా ఉంచితే, ఇలాంటి పరిస్ధితిలో ఉన్న ఒక మధ్య తరగతి మనసుకి, ఆ రోజుల్లో, విదేశాలు వెళ్ళాలనే ఆలోచన రావడం సాధ్యం కాని పని. ఏమంటారు?
సరే, ఇక లాభం లేదని, డబ్బులు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కనీసమాత్రం చదువు రాకపోతే జీవితానికే నష్టం అని, మా నాన్నగారు, నన్ను ఊరు చివర, నివాస కళాశాల (శ్రీ కృష్ణవేణి రెసిడెన్షియల్) లో ఇంటర్ చదివించారు.
అక్కడ, అదృష్టమా అని ఒక మంచి స్నేహితుడి (రత్న కుమార్ చారుగుళ్ళ) సావాసంతో నాకూ చదువు బాగానే అబ్బింది. సెకండ్ ఇయర్ Mathematics ఎక్సామ్ రోజు స్కూల్ యాజమాన్యానికి, నా స్నేహితుని గూర్చి, ఫోన్ వచ్చింది! జన్మనిచ్చిన తండ్రికి, శాశ్వతంగా భౌతిక చలనం ఆగిపోయిందని తెలిసి, నా స్నేహితుడు, వాళ్ళ ఊరుకి పరీక్షలయిపోయిన సందర్భంగా, ఆనందంగా వెళ్ళవలసినది పోయి, విషాదంతో వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. ‘నరుని దిష్టికి నాపరాయైనా పగులుతుంద’ని మా స్నేహానికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో, నాతో పాటు డిగ్రీ చదవలేకపోయాడు నా స్నేహితుడు.
ఇక్కడ చెప్పుకోవలసింది ఒకటుంది. రత్న కుమార్, మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రీ ఎక్సామ్ స్కూల్ ఏనివర్సరీ ఫంక్షన్‌లో, నాచే రాయబడిన పాట (రావుగారి పిల్లరా రావు.. బహు డేంజరైన పిల్లరా రావు…), మ్యూజికల్ నైట్ వాళ్ళతో నేను పాడిన పెర్ఫామెన్స్‌ని ఇప్పటికీ గుర్తు చేస్తుంటాడు 😁
ఆ తర్వాతనుంచి, ఒక పక్క స్వచ్ఛంద సహాయం చేస్తూ మరో పక్క ఉద్యోగ ప్రయత్నం చేస్తూండగా, హైదరాబాద్‌లో ఒక మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ‘Software Engineer’ ఉద్యోగం వచ్చింది. ఒక పక్క ఉద్యోగం చేస్తూండగా, నాకున్న విద్యా ఉద్యోగార్హతల వల్ల, ఆస్ట్రేలియాలో Permanent Residency వచ్చింది. దీనికి మూలకారణం నా రెండో అన్నయ్య (రవి కుమార్) సహాయమే, ఎందుకంటే, నేను MCA చదివే రోజుల్లోనే, అతను ఆస్ట్రేలియాలో చదివి, కొంతకాలం ఉద్యోగం చేసి, అమెరికా వెళ్ళిపోయిన అనుభవంతో, నాకు ఆస్ట్రేలియాలో మంచి భవిష్యత్తు ఉంటుందని, PR కి apply చెయ్యమని ప్రోత్సహించాడు.
ఇలా పదవ తరగతి ఫెయిల్ అయిన రోజుల్లో ఊహించని విధంగా ‘పయోధరంతో పయనం’ చేసే అవకాశం వచ్చి, ఆస్ట్రేలియా నా జీవితంలో మరో అలుపెరుగని జీవన ప్రస్థానానికి నాంది పలికింది.
ఇట్లు,
మీ మనస్వి
(Surya Ayyalasomayajula)
(సశేషం)