సంచిక విశ్వవేదిక – సిడ్నీలో సౌరవి బడి

0
3

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా సిడ్నీలో తమ మనవరాలి బడి అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]

[dropcap]సి[/dropcap]డ్నీ,ఆస్ట్రేలియాలో ఉండే నా మనవరాలు సౌరవి బడి ముచ్చట చెప్పే ముందు దాని ఇంటర్వ్యూ గురించి చెప్పాలి.

ఇంటర్వ్యూ

గత మే నెలలో అరగంట పైనే దానికి ఇంటర్వ్యూ జరిగింది.

అంత చిన్న పిల్లకి ఇంటర్వ్యూ ఏమిటి ఏదో.. అక్షరాలు, అంకెలు, ఇంట్లో వాళ్ళ పేర్లు లాంటివేవో అడుగుతారేమో అనుకున్నా.. కానీ అలా అడగలేదు వాళ్ళు.

చాలా స్నేహంగా ముచ్చట్లు పెట్టారు. ఆ ముచ్చట్లలో వాళ్ళ పెట్టాలనుకున్న పరీక్షా పెట్టేశారు.

గత జనవరి నుంచి ప్రీ స్కూల్ కి వెళుతోంది చిన్నారి సౌరవి.

వచ్చే ఏడు ఫిబ్రవరిలో బడి తెరచాక కిండర్ గార్డెన్‌లో చేరాలి. ఆస్ట్రేలియాలో అకడమిక్ ఇయర్ పిబ్రవరిలో మొదలై డిసెంబరు పదిహేను నాటికి ముగుస్తుంది. వేసవి సెలవుల అనంతరం ఫిబ్రవరిలో తిరిగి బడులు ప్రారంభం అవుతాయి.

అందుకోసం సెంట్ ఎయిడెన్స్ ప్రైమరీ స్కూల్‌లో అడ్మిషన్ కోసం ఫిబ్రవరి 2021లో రిజిస్టర్ చేసుకున్నారు. మే 22న ఇంటర్వ్యూ ఉందని మెయిల్ వచ్చింది.

పాపకి ఇంటర్వ్యూ అంటే ఏమి అడుగుతారో తెలియక అమ్మ, నాన్న తికమక పడ్డారు. కూతురితో అక్షరాలు, అంకెలు చెప్పించారు. కొన్ని పళ్ళు, పక్షుల పేర్లు చెప్పారు. సౌరవి పేరులో ఉన్న అక్షరాలు రాయడం నేర్పారు.

సౌరవితో రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పింది అమ్మ.

ఇంటర్వ్యూ అంటే ఏంటి సౌరవి ప్రశ్న.

మనం పెద్ద స్కూల్‌కి వెళతాం. అక్కడ వాళ్ళు నీతో మాట్లాడతారు. కొన్ని ప్రశ్నలు అడుగుతారు. చెప్పింది అమ్మ.

భయంగా చూసింది సౌరవి.

మాతో ఇంట్లో మాట్లాడినట్లు వాళ్లతో మాట్లాడు. తెలిసిన వాటికీ జవాబు చెప్పు. తెలియకపోతే తెలియదని చెప్పు అంతే అన్నారు అమ్మ నాన్న.

ఓ అంతేనా అన్నది సౌరవి.

మరే మరే.. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. అది ఎలా ఉంటుందో తెలియట్లేదు తమ్ముడితో చెప్పింది

అది విన్న అమ్మానాన్న ఏదైతే అది అవుతుంది. కూతురు గాబరా పడకూడదని ఇక ఆ మాట ఎత్తలేదు.

అమ్మ నాన్న, తమ్ముడితో కలసి ఇంటర్వ్యూకి కొత్త స్కూల్‌కి వెళ్లింది.

సౌరవితో ఎవరైనా ఒకరే లోపలికి అనుమతిస్తాం అని చెప్పడంతో అమ్మతో కలిసి వెళ్లింది. నాన్న తమ్ముడు కారులోనే ఉన్నారు

లోపలికి వెళ్ళగానే ఒకావిడ హయ్ గుడ్ మార్నింగ్ అని పలకరించింది.

నా పేరు జూలియా అని తనను తాను పరిచయం చేసుకుంది. ఆవిడ ఆ స్కూల్ ప్రిన్సిపాల్.

సౌరవి, సాధన (అమ్మ) కూడా హాయ్ చెప్పారు.

మీ అమ్మతో ఐదు నిమిషాలు మాట్లాడతా. నీకు బొమ్మలు వచ్చా అని అడిగింది జూలియా

వచ్చని తలూపింది సౌరవి.

అయితే మీ ఫ్యామిలీ బొమ్మ వేయి అంటూ పేపర్, పెన్సిల్ ఇచ్చింది. సౌరవి శ్రద్దగా బొమ్మ వేస్తున్నది

లోపల గదిలో అమ్మతో జూలీ మాట్లాడుతున్నది.

మీరు ఈ స్కూల్ ఎందుకు ఎంపిక చేసుకున్నారు

డిసిప్లిన్ నచ్చి

మా స్కూల్ క్రిస్టియన్ స్కూల్. పిల్లలను చర్చికి తీసుకువెళతాం. మీకు ఓకేనా అంటూ అమ్మ మొహంలోకి చూసింది.

మాకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది

మీకు మతం లేదన్నారు. మరి.. ? అప్లికేషన్ చూస్తూ..

అవును, పుట్టుకతో మేం హిందూ. మాకు బుద్ధి తెలిసిన తర్వాత నాన్ రిలీజియస్‌గా మారాం. మా పిల్లలపై మా అభిప్రాయాలు రుద్దం. ఇప్పుడు మాత్రం వాళ్ళకు కూడా మా లాగే మతం లేదు. పెరిగిన తర్వాత వాళ్ళ ఇష్టం. వాళ్లకు కావాల్సిన మతం ఎంచుకునే స్వేచ్ఛ ఉంది.

అందుకు అభినందనగా చూసి నవ్వింది. అలా ఓ ఐదు నిమిషాలు సాధనతో మాట్లాడి సౌరవి దగ్గరికి వచ్చింది జూలియా.

సౌరవి తాను వేసిన బొమ్మ ఆవిడ చేతికి ఇచ్చింది.

అది తీసుకుని చూసి నవ్వుతూ మీ ఇంట్లో ఎవరికీ జుట్టు లేదా అని అడిగింది.

ఓ సారీ.. అంటూ జూలియా చేతిలో ఉన్న పేపర్ తీసుకుని నాన్నకి, తమ్ముడికి పొట్టి జుట్టు, అమ్మకి తనకి పొడవు జుట్టు వేసి ఇచ్చింది. ఇస్తూ ఇది మా కుటుంబం అన్నది

ఓ అలాగా.. మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అని అడిగింది జూలియా

మా అమ్మ, నాన్న, తమ్ముడు, నేను అని చెప్పింది.

వాళ్ళని చూపించు.. చూపింది. వాళ్ళ పేర్లు చెప్పింది సౌరవి.

నీ పేరు రాయమని అడిగింది ప్రిన్సిపాల్..

సౌరవి రాసింది.

నీ పేరు స్పెల్ చేయమని అన్నది. చెబుతూ అక్షరాలు చూసింది. అందులో ఒక అక్షరం ఎగిరిపోయింది. అది చూసి నవ్వుతూ ఎగిరిపోయిన అక్షరం రాసింది.

మీ ఇంట్లో అందరికన్నా ఎవరు పొడవు, ఎవరు చిన్నగా ఉన్నారు అని అడిగింది. చెప్పింది సౌరవి.

పొట్టి జుట్టు ఎవరిది, జుట్టు రంగు ఏది

మీ తమ్ముడి పేరేంటి? అతని వయసు ఎంత? నీ వయసెంత అని అడిగిన ప్రశ్నలన్నిటికీ చక్కగా జవాబిచ్చింది.

కొత్త పాత లేకుండా ఫ్రీ గా మెసులుతున్న కూతురుని అమ్మ కళ్ళతోనే అభినందించింది.

ఆ తర్వాత ఒక డబ్బా నిండా జెమ్స్ ఇచ్చింది జూలియా.

అందులో ఏ రంగువి ఆ రంగు వేరు చేయమని చెప్పింది.

సౌరవి వేరు చేసింది. ఆకుపచ్చ రంగువి ఒక దగ్గర, పసుపు రంగు, నీలం రంగు, తెలుపు, పర్పుల్, గులాబీ వేరు చేసింది. ఇక నాలుగు మిగిలాయి. అవి ఒకటి ఎరుపు, బ్రౌన్, నలుపు, ఆరెంజ్

ఎరుపు రంగు జెమ్ నాకు ఇవ్వు అని జూలియా అడిగింది. ఎరుపు రంగు పట్టుకొని ఆలోచిస్తున్నది. అది ఎరుపు అనిపిస్తుంది. కానీ ఎక్కువ ఎరుపు లేదు. వెలిసి పోయినట్లుగా ఉంది. ఇది రెడ్ కాదు పింక్ అంటుందేమో.. అని పింక్ వాటి వైపు చూసింది. ఉహు ఇది పింక్ కాదు రెడ్ అని చేతిలో ఉన్న జెమ్‌ని చూపింది.

నీ ఆలోచన నాకు అర్థమయింది. ఇది రెడ్ లాగా లేదు నిజమే. రంగు వెలిసిపోయింది అని నవ్వింది జూలియా.

ఆ తర్వాత అన్ని రంగులూ చెప్పింది. ఏ రంగు జెమ్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగింది జూలియా.

ఒకో కుప్పలో లెక్కపెట్టి చెప్పింది సౌరవి. వెరీ గుడ్ అని మెచ్చుకుంది జూలియా

కొన్ని వుడెన్ షేప్స్ ఇచ్చింది. సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, హెక్టా యాంగిల్ షేప్స్ చక్కగా చెప్పింది సౌరవి.

టీవీ టైం లో ఏం చూస్తావ్

రైన్ చూస్తున్నా, పెప్పా పిగ్, గేబీ అలెక్స్, బ్లిపి కూడా ఇష్టమే అని చెప్పింది

మరి కథలు..

ఓ చాలా కథలు చదువుకుంటాం.

అవునా.. ఎప్పుడు చదువుకుంటావ్.

బెడ్ టైంలో

ఎవరు చదువుతారు?

మా డాడీ చెప్తారు. డాడీకి కుదరకపోతే అమ్మ.

నీ ఫేవరెట్ స్టోరీ బుక్

పింకాలిషియస్

ఓ గుడ్. నేనొక బుక్ ఇస్తాను. స్టోరీ చెబుతావా..

ఎస్

బొమ్మల కథల పుస్తకం ఇచ్చింది ఆవిడ

సౌరవి ఏమి చెబుతుందా అని అమ్మ, జూలియా ఎదురుచూస్తున్నారు.

సౌరవి ఆ బుక్ తీసుకుని పుస్తకం ముందు వెనక బొమ్మల్ని చూసింది. ఆ తర్వాత లోపల పేజిలు తిప్పింది.

ఆ తర్వాత మొదటిపేజీలో బొమ్మను చూస్తూ కథ అల్లడం మొదలు పెట్టింది. అలా బొమ్మలు చూస్తూ కథ చెప్పేసింది.

జూలియా చప్పట్లు కొట్టింది.

సౌరవి మొహం వెలిగిపోయింది. పుస్తకంలో బొమ్మల్ని చూపుతూ ఇదేంటి, ఇదేంటి జంతువుల్ని, కూరగాయలు, పండ్లు, వస్తువులు చూపుతూ అడిగింది జూలియా. అడిగిన ప్రశ్నలకి చక్కగా జవాబు చెప్పింది

ఆహార పదార్థాలు చూపినప్పుడు వాటి పేరు చెబుతూ ఇది మంచిది. ఇది మంచిది కాదు అన్నది. పిజా, కేక్ ఇవన్నీ రోజు తినకూడదు. ఎప్పుడైనా ఒకసారి తింటే ఫర్వాలేదు అని చెప్పింది సౌరవి.

జూలియా నవ్వింది. పుస్తకాన్ని వెనక్కి తిప్పి ఇచ్చి ముందు పేజీ ఏదని అడిగింది.

బుక్ చేతిలోకి తీసుకుని సౌరవి ముందు కవర్ పేజీ చూపింది.

వెల్ డన్ అన్నది జూలియా

చిన్నదాని కళ్ళు మెరిసాయి.

కొన్ని అక్షరాలు చూపిస్తూ నీ పేరులో ఉన్నాయా అని అడిగింది. తన పేరులో ఉన్న అక్షరాలు చెప్పింది సౌరవి. ఇంకా కొన్ని అక్షరాలు చూపినప్పుడు ఇవి నా పేరులో లేని అక్షరాలు.. అన్నది టీజింగ్‌గా. ఆ మోహంలో సన్నటి చిరునవ్వు

అవునన్నట్టు తలూపింది జూలియా…

చొరవకి, హాయిగా కబుర్లు చెబుతున్న తీరుకి ఆశ్చర్యపోయింది అమ్మ

నీకు ఈ స్కూల్‌లో చదవాలని ఉందా అని అడిగింది జూలియా

అవునన్నట్లుగా తలూపింది సౌరవి.

అయితే స్కూల్ చూడు. ఇదిగో ఇది కిండర్ గార్డెన్ క్లాస్ అని చూపింది.

ఇప్పుడు వెళ్తున్న బడి కంటే ఇది పెద్దది అనుకుంది సౌరవి.

చాలా మంది పిల్లలు ఉంటారు అని అమ్మ చెప్పింది.

నాకు ఈ పెద్ద స్కూల్ నచ్చింది అని చెప్పింది.

అమ్మ జూలియాకి బై చెబుతుంటే సౌరవి కూడా చెప్పింది.

అమ్మా ఇంటర్వ్యూ అన్నావు కదా.. అదెప్పుడు అని అమ్మని చూస్తూ అడిగింది.

అరగంట నుంచీ జూలియా నీతో మాట్లాడింది కదా అదే ఇంటర్వ్యూ అని చెప్పింది అమ్మ

అవునా.. ఇంకా ఏంటో అనుకున్నా.. అంటూ నాన్న, తమ్ముడు దగ్గరికి పరిగెత్తింది.

నిన్ను చూసి గర్విస్తున్నాను రా బంగారం అన్నది అమ్మ. నాన్న ముద్దు పెట్టుకున్నాడు

రేపటి నుండి నేను ఈ పెద్ద స్కూల్‌ వెళతాను నాన్నా చెప్పింది సౌరవి.

ఈ స్కూల్‌లో సీట్ వస్తే వచ్చే ఏడు ఈ స్కూల్‌కి వెళతావు. అంత వరకు నువ్వు నీ ప్రీస్కూల్‌కి వెళ్తావు అన్నది అమ్మ.

తమ్ముడు?

వాడు డే కేర్ నుంచి ప్రీ స్కూల్‌కి వెళతాడు. ఆ తర్వాత నీ అంత అయిన తర్వాత నీ లాగే పెద్ద బడికి వస్తాడు అని చెప్పాడు నాన్న.

బడి మొదటి రోజు

సీటు వచ్చింది. అనుకున్న రోజు రానే వచ్చింది.

ఎప్పుడెప్పుడు స్కూల్ కి వెళతానా అని సౌరవి ఆత్రంగా ఎదురు చూసిన రోజు వచ్చేసింది

ఫిబ్రవరి 3 వ తేదీ నుండి సౌరవి సెంట్ ఎయిడెన్స్ స్కూల్ కి వెళుతున్నది.

మొదటిరోజు స్టూడెంట్‌తో పాటు ఇద్దరిని లోపలికి రానిస్తారు. వాళ్ళమ్మతో నేను కూడా వెళ్లాను.

కిండర్ గార్టెన్ పిల్లలకు స్వాగతం చెబుతూ బెలూన్స్ కట్టారు.

సౌరవి పేరుతో ఉన్న బ్యాడ్జ్ ఇచ్చారు.

మై ఫస్ట్ డే అని రాసి ఉన్నదాని ముందు నిలబడి ఫోటో తీసుకుని పిల్లలు క్లాసులోకి వెళ్తున్నారు. మా సౌరవి ఫోటో కూడా తీసుకున్నాం.

పిల్లలతో పెద్ద బాగ్ ఉంది. అది కూడా యూనిఫామ్ రంగే. ముదురు ఆకుపచ్చ. ఆ బ్యాగ్ లో లంచ్ బాక్స్, హాట్, ఫైల్, వాటర్ బోటిల్ పెట్టి పంపించాం. ఆ బాగ్ పెట్టుకోవడానికి క్లాసు బయట పిల్లల పేర్లతో హుక్స్ పెట్టి ఉన్నాయి. ఆడపిల్లల వన్నీ ఎరుపు రంగు స్టిక్కర్ ఉన్న వైపు, మగ పిల్లలవి నీలం రంగు ఉన్నవైపు పెట్టారు..

సౌరవి పేరు ఉన్నచోట సౌరవి బాగ్ పెట్టి తనకి చూపింది సాధన. అందరి బాగ్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి బాగ్ గుర్తించడం కోసం జిప్ దగ్గర ఒక టెడ్డీ బొమ్మ వేలాడేసింది.

పిల్లల్ని మన క్లాసు రూమ్స్ లో వరుసగా కూర్చో పెట్టినట్లు కాకుండా రౌండ్ టేబుల్ ముందు గుంపులు గుంపులుగా కూర్చున్నారు. ఒక్కో టేబుల్ పై ఒక్కో ఆక్టివిటీ. ఎవరికి ఏది నచ్చితే ఆ ఆక్టివిటీ చేసుకోవచ్చు. సౌరవి పెన్సిల్ కలరింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది.

ఉదయం 8. 40 నుంచి మధ్యాహ్నం 2,55 వరకు స్కూల్ టైమింగ్స్. మధ్యలో మూడు బ్రేక్స్. అందులో ఒకటి లంచ్.

భరోసా

మేం తిరిగి వస్తుంటే మాకు చిన్న టిష్యూ ప్యాకెట్ కాండీ తో పాటు ఒక లేఖ ఇచ్చారు

పిల్లల్ని మొదటిసారి బడికి పంపుతున్న తల్లిదండ్రుల కోసం ఆ లేఖ.

అందులో మీ పిల్లలు బాగుంటారు. ఇప్పటివరకు మీరు మీ పిల్లల చేయి పట్టి నడిపించారు. ఇప్పుడు ఆ పని మాది. వాళ్ళు ఎదగడం కోసం, ఆడడం కోసం, నేర్చుకోవడం కోసం మేం సహాయం చేస్తాం. అది మా బాధ్యత. ప్రపంచాన్ని వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూడడం నేర్చుకోవాలి. వాళ్ళకి ఆ సహకారం అందాలి.

 మీ కళ్ళకి నీళ్లు వస్తాయి. కానీ తప్పదు. మా దగ్గర పిల్లలు ఎలా ఉంటారోనని భయపడకండి. బాధ పడకండి.

వాళ్ళని మేం చూసుకుంటాం. వాళ్ళని ప్రేమిస్తాం. వాళ్ళకి సహకరిస్తాం. వాళ్ళకి నేర్పిస్తాం

ఇదిగో ఈ టిష్యూ పేపర్ మీ కళ్ళు తుడుచుకోవడం కోసం. ఈ చాకోలెట్ మీరు ఆనందంగా వెళ్ళిరండి

అని భరోసా ఇస్తున్న లేఖ నాకెంతో నచ్చింది.

బెంగ బెంగగా పిల్లల్ని వదిలి వెళ్తున్న ఆ తల్లిదండ్రులకి గొప్ప రిలీఫ్ అనిపించింది.

కొత్త నేస్తం

ఇక్కడ ఒక విషయం చెప్పడం మరచిపోయాను. డిసెంబర్‌లో క్రిస్టమస్‌కి కొద్దిగా ముందు సౌరవి పేరున ఒక లెటర్ వచ్చింది. స్కూల్ నుండి వచ్చిందని తెరచి చూసాం. ఆ ఉత్తరం రాసింది స్కూల్ యాజమాన్యం కాదు. ఐదో /ఆరో తరగతి చదివే అమ్మాయి.

నీ పేరు చాలా బాగుంది. బడి తెరవగానే నిన్ను కలవడం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. నేను నీ కొత్త మిత్రురాలిని. అంటూ గ్రీటింగ్ కార్డు పంపింది. దానిపై ఆమె ఫోటో.. కరీష అని ఆ అమ్మాయి పేరు.

స్కూల్ కి వెళ్ళగానే కరీష కోసం వెతికింది సౌరవి. అప్పటికే ఆ అమ్మాయి క్లాస్ సమయం అవడంతో తన క్లాసు కి వెళ్లిపోయిందట.

లంచ్ టైంలో, ఇంటర్‌వెల్ లోను సౌరవికి కరీష సహాయం చేసింది.

కిండి పిల్లలు చేసిన మెస్ అంతా పెద్ద పిల్లలు శుభ్రం చేయడం, వాళ్ళకి స్కూల్ పద్ధతులు నేర్పడం పెద్ద పిల్లల పని. చిన్న పిల్లలు, కొత్తపిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసిన ఆ ఏర్పాటు నాకు చాలా నచ్చింది.

సౌరవికి స్కూల్ కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు కొద్దిగా జలుబు వచ్చింది. బడికి వద్దులే అంటే నో.. నేను చాలా ఫన్ మిస్ అవుతానని వెళ్లాల్సిందే అని పట్టుపట్టింది. బడి అంటే కష్టం కాకుండా ఇష్టం పుట్టించడంలో యాజమాన్యం, లేదా అక్కడి విద్యావిధానం విజయం సాధించింది అనుకున్నాను. ఆడుతూ పాడుతూ చదివితే ఆ ఆనందమే వేరు కదా..

కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రతి వారం రెండు సార్లు కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి. తేడా ఉంటే స్కూల్‌కి రాకూడదు. టెస్ట్ కిట్ స్కూల్ యాజమాన్యం ఇస్తున్నది. టెస్ట్ చేస్తే కోవిడ్ నెగిటివ్ రావడంతో బడికి పంపించాం.

ఆ బడిలో అధిక శాతం ఆసియా దేశాలకు చెందిన వాళ్లే కనిపించారు.

పబ్లిక్ స్కూల్

పబ్లిక్ స్కూల్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బడులు. ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోని బడికి వెళ్ళాలి. వేరే ప్రాంతంలోని బడికి వెళ్ళడానికి కుదరదు. అదే ప్రైవేట్ బడులకు ఆ నిబంధన లేదు. ఎక్కడికక్కడ స్కూల్స్ ఉన్నాయి. తమ ఏరియాలో నివాసం ఉంటూ అడ్మిషన్ కోసం వస్తే నో అని చెప్పరట. తప్పని సరిగా అడ్మిషన్ ఇస్తారట.

కొన్ని పబ్లిక్ స్కూల్స్ టాప్ లెవెల్‌ ఉన్నాయి.

మా వాళ్ళు ఉన్న ఏరియా పబ్లిక్ స్కూల్ కి గొప్ప రేటింగ్ లేదని ప్రైవేట్ స్కూల్ లో వేశారు.

హోమ్ వర్క్

రంగు రంగుల బొమ్మలతో చిన్న చిన్న వాక్యాలు ఏడో ఎనిమిదో ఉండే ఆకర్షణీయమైన చిన్న పుస్తకం ఇచ్చారు. ఆ వాక్యాలను వేలు పెట్టి చదివించడం పెద్దలు చేయాల్సిన పని. వాళ్ళకి ఇచ్చిన హోం వర్క్. చదివిస్తే చదివించామని సంతకం చేయాలి తల్లిదండ్రులు. ఆ పుస్తకమే వారం రోజులు చదువుతారు. ప్రతి రోజు ఆ పుస్తకం బడికి తీసుకుపోవాలి. వారం తర్వాత మరో పుస్తకం చేతికి వస్తుంది.

పుస్తకాల బరువు లేదు. రాయాలన్న వత్తిడి లేదు. పెన్ను, పెన్సిల్ పట్టకుండా చదువు పిల్లలకు బాగుండక ఏమవుతుంది..?!

కథల పుస్తకం

బడి లైబ్రెరీ లోంచి ప్రతి వారం ఒక బొమ్మల కథల పుస్తకం ఇస్తున్నారు. ఆ కథ చదివాక ఆ పుస్తకాన్ని వెనక్కి ఇచ్చేయాలి. ఇంట్లో చదివించే అలవాటు లేకపోయినా పిల్లలకి లైబ్రెరీ, పుస్తకాలు ఆ విధంగా బడి అలవాటు చేస్తున్నది.

లాలీపాప్ వుమన్

స్కూల్ జోన్‌లో లాలీపాప్ విమెన్‌ని చూశాను. వాళ్ళు పిల్లల కోసం బడి సమయాల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ పిల్లలు రోడ్ దాటడానికి సహాయం చేస్తుంటారట. ఇద్దరు మహిళలు ఆ పని చేస్తున్నారు. వాళ్లిద్దరూ రిటైర్డ్. ఎండ వాన, చలి ఏదైనా సరే తమ డ్యూటీ చేస్తుంటారట. ఎల్లో జాకెట్ వేసుకుని ట్రాఫిక్ నియంత్రిస్తున్న ఆ మహిళలు చాలా గొప్ప సేవ చేస్తున్నట్లనిపించింది. నేను రిటైర్ అయ్యాక నేను కూడా ఇలా సర్వీస్ చేయాలనుకుంటున్నా అన్నది నా కూతురు సాధన.

ప్రోత్సాహకాలు

ఈ మధ్య రోజు ఒక బహుమతి తీసుకొస్తున్నది సౌరవి అవి చిన్న చిన్నవే కావచ్చు. పిల్లలని ఎంతో ప్రోత్సహించే విధంగా ఉన్నాయవి..

ఏదేమైనా మన తెలుగునాట బడులతో పోల్చుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపించింది.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తరతెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె( కథా సంకలనాలు) ప్రచురణ. బతుకుసేద్యం, నిష్కల, నీలాకాశంలో నిధి(బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here