[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]
ప్రయాణంలో పదనిసలు
[dropcap]సి[/dropcap]డ్నీ నుండి నా తిరుగు ప్రయాణం ఫిబ్రవరి 17 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఫ్లైట్ రాత్రి 10.30కి.
ఇంటి దగ్గర బయలుదేరడానికి కొద్దిగా ముందు వర్షం మొదలైంది. కొద్దిగా ముందుకు వెళ్లే సరికి వడగళ్ల వాన. ముందున్నవి కనిపించకుండా..
ఇక లాభం లేదు. కారు ట్రైన్ స్టేషన్‌లో పెడదామని పార్కింగ్ కోసం చూశాడు అల్లుడు రాజేష్. దగ్గరలో ఖాళీ లేదు. లగేజీ లిఫ్ట్ దగ్గర దించి నన్ను అక్కడ ఉండమని చెప్పి కారు పార్క్ చేయడానికి వెళ్లాడు.
నేను అక్కడ నుంచోవడం చూసి ఇద్దరు నా దాకా వచ్చి లిఫ్ట్ నాట్ ఇన్ కండిషన్ అని చెప్పి వెళ్లారు.
అప్పటికే ఆవిషయం గమనించిన నేను ఆ సమయంలో అగంతకులు నా పట్ల చూపిన కన్సర్న్‌కి థాంక్స్ చెప్పాను.
వర్షం కొద్దిగా శాంతించింది. కానీ ఏ క్షణమైనా మళ్ళీ కుమ్మరించడానికి సిద్ధంగా ఉంది.
రాజేష్ వచ్చాక మెట్ల మీదుగా వెళ్ళాలి. రాంపు ఉంటే బాగుండు. లగేజీతో మెట్లు ఎక్కడం చాలాకష్టం కదా అనుకుంటూ ఉన్నాను.
మా అమ్మాయి సాధన నాకు సెండాఫ్ ఇవ్వడానికి రావలసింది. కానీ చివరి నిమిషంలో ఆగిపోవాల్సి వచ్చింది. తను వస్తే 30 కె.జి సూట్ కేస్‌తో చాలా ఇబ్బంది అయేది. రాజేష్ సునాయాసంగా ఎక్కించేశాడు.
మరో ఐదు నిమిషాల్లో ట్రైన్ రావడం మేం ఎక్కడం దాదాపు గంట సేపటికి సెంట్రల్‌లో మరో ట్రైన్ ఎక్కి ఎయిర్‌పోర్టు చేరడం బాగానే ఉంది
అప్పటి నుంచి మొదలైంది అసలు కథ.
నా ఫ్లైట్ శ్రీలంక ఎయిర్ వేస్ వాళ్ళది.
కరోనా సమయంలో కూడా ఇండియాకి ఫ్లయిట్స్ బాగానే తిప్పింది. ట్రావెల్ సమయం తక్కువ. ఆ రోజు ఉన్న ధరను బట్టి టికెట్ కూడా ఫర్వాలేదు అనిపించింది. అందుకే ఆ ఎయిర్ పోర్టులో చాలా పెద్ద క్యూలో నించుని చివరికి వచ్చేసరికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫాం నింపాలని చెప్పారు. ఇదివరకు ఆ ఫారం లేదు. 14 తేదీ నుంచి రూల్స్ మారాయట. అది మాకు తెలియదు. సువిధ ఫారం తప్పనిసరిగా సబ్మిట్ చేస్తేనే ముందుకు కదిలేది. లేకపోతే భారత ప్రభుత్వం అంగీకరించదు అన్నారు.
అప్పటివరకు అందరు హడావిడి పడడం చూశాం. డాక్యూమెంట్స్ అన్ని సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారేమో అనుకున్నాం, కానీ ఈ విషయం తెలియదు.
QR కోడ్ స్కాన్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లి ఫారం నింపడానికి ప్రయత్నం చేసాం. ఇంటర్నెట్ చాలా స్లో గా ఉంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, పీసీ ఆర్ రిపోర్ట్, పాస్పోర్ట్ కాపీ pdf అటాచ్మెంటు ఇవ్వాలి. అవసరమైన వివరాలు నింపి pdf అటాచ్ చేయబోతే ఇంటర్నెట్ వీక్ అయిపోతున్నది. అటాచ్మెంటు చేయడం ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ మొదటికి వస్తున్నది. 9.30కి కౌంటర్ క్లోజ్. సమయం తగ్గిపోతున్నది. మా లాగే చాలా మంది ఆ పనిలో సతమతమవుతూ..
రాజేష్ సాధనకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇంటి దగ్గర సాధన, ఇక్కడ రాజేష్ ప్రయత్నం చేశారు. ఈ లోగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది కూడా సహాయం చేయడానికి ప్రయత్నించారు. చివరికి ఇంకో పది నిముషాల సమయం ఉండగానే సాధన దగ్గర పని పూర్తి అయింది. మొత్తం 50 నిముషాల సమయం పట్టింది ఆ పని పూర్తికావడానికి.
ఈ ప్రాసెస్ సమయానికి అవక కొందరు ఫ్లైట్ ఎక్కలేక పోతున్నారని చెప్పారు సిబ్బంది.
హమ్మయ్య నా పని పూర్తయింది అని గట్టిగా ఊపిరి పీల్చుకుని బాగేజ్ చెకిన్ కేసి నడిచా. రాజేష్ జాగ్రత్త చెప్పి వెళ్లాడు.
సెక్యూరిటీ చెక్ చేసుకుని 51వ గేట్ వైపు ముందుకు సాగాను. నిజానికి ఆ సమయానికి బోర్డింగ్ మొదలవాలి. కానీ కాలేదు.
రాజమండ్రి అమ్మాయి ఉండవల్లి కావ్య పరిచయం అయింది. ఆంటీ.. ఒక్కరే ప్రయాణం చేస్తున్నారా.. మీరు తరచూ ప్రయాణాలు చేస్తారా..అంటూ ప్రశ్నలు..
మా అమ్మ అలా చేయలేదు. భయపడుతుంది. పెళ్లయి సిడ్నీ వచ్చాననీ, ఒకసారి ఇండియా వచ్చి వెళ్లాక ఉద్యోగంలో చేరతానని, కోవిడ్ వల్ల ఆలస్యం అయిందని కొత్త పాత లేకుండా గలగలా మాట్లాడేసింది.
10.30 దాటింది. అంటే టేకాఫ్ సమయం దాటిపోయింది. ఇంకా అనౌన్స్ చేయరేంటి అనుకుంటూ ఉండగా సెక్యూరిటివాళ్లు లాంజ్ లో మా పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ చెక్ చేసి వెళ్లారు.
ఇంటి దగ్గర ఆకలి లేదని బయలుదేరే ముందు ఏమీ తినలేదు.
ఆకలవుతుంది ఏమైనా తిను అంటూ నా కూతురు ఫోన్. నాకైతే అస్సలు ఆకలి లేదు. ఆ మాట చెబితే ఊరుకోదుగా.. అందుకే సరే అంటూ బై చెప్పాను
శ్రీలంకన్ వేషధారణతో అమ్మాయిలు, సూట్‌తో అబ్బాయిల కేబిన్ క్రూ మా ముందు నుంచి చకచకా ముందుకు సాగింది.
ప్లైట్ డిలే అట. శ్రీ లంక నుండి రావలసిన ప్లైట్ ఇప్పుడే వచ్చిందట అని అనుకుంటున్నారు.
ఎట్టకేలకు మాకు బోర్డింగ్ అనౌన్స్మెంటు వచ్చింది. అప్పటికి పదకొండు. మరో అరగంటలో అంతా లోపలికి చేరడం, ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడం జరిగిపోయింది. ఇక టేక్ ఆఫ్ తీసుకోవడమే..
ఏదీ… ఎంతకీ టేక్ ఆఫ్ అవడం లేదు. ప్లైట్ అటెండెంట్స్ హడావిడిగా తిరుగుతున్నారు. అందరికీ మంచి నీటి బాటిల్ ఇచ్చారు..
ఒకావిడ ఎమర్జెన్సీ కిట్ తీసుకువెళ్లింది. ఎవరికో ఎమర్జెన్సీ ఉందనుకుంటా అనుకున్నాం.
వాటర్ బాటిల్ ఇచ్చినతన్ని అడిగితే రాత్రి 11 కి ఎయిర్‌పోర్టు మూసేశారు అని చెప్పి ముందుకు సాగాడు.
ఫ్లైట్ టేక్ ఆఫ్‌కి సిద్ధంగా ఉంది. ఎయిర్‌పోర్ట్ మూసేయడం ఏమిటో అర్ధం కాలేదు. అయోమయంగా మొహాలు చూసుకున్నాం పక్కన ఉన్నవాళ్ళం.
అంతలో అనౌన్స్ మెంట్.. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ.. కానీ విషయం ఏమిటో చెప్పలేదు.
ఈ లోగా భోజనాలు వచ్చాయి. అర్థరాత్రి 12 దాటాక తిండి తిన్నామనిపించా..
నాకు అటుపక్క ఇటుపక్క ఉన్నవాళ్లతో మాట కలిపా.. ఎడమ వైపు హైదరాబాద్ వెళ్లే కావ్యారెడ్డి, కుడివైపు భోపాల్ వెళ్ళవలసిన యువకుడు ఉన్నారు.
ఉదయం 7 గంటలకి ఎయిర్‌పోర్ట్ తెరిచే వరకూ ఇలాగే కాలక్షేపం చేయించేలా ఉన్నారు అనుకున్నాం.
రెండు గంటలు కావొస్తుండగా అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు అర్థం చేసుకుని సహకరించమని కోరుతూ ప్రకటన. మరో ఐదు నిముషాల్లో హోటల్‌కి పంపుతున్నట్లు మరో ప్రకటన వచ్చింది.
ఎవరికి వారు సరే ఏం చేస్తాం.. ఫ్లైట్ నుంచి బయటికొచ్చాం. లోపలికి వెళ్ళడానికి చేసే ఫార్మాలిటీస్ బయటికి పంపడానికి కూడా మొదలయ్యాయి. కస్టమ్స్, సెక్యూరిటీ, ఎయిర్‌లైన్ సిబ్బంది అంతా మళ్లీ వచ్చారు.
సెక్యూరిటీ చెక్ క్యూలో.. అక్కడ ఒక కార్డ్ ఇచ్చారు. అది తీసుకుని ముందుకు పోతే మా లగేజీ వచ్చి చక్కర్లు కొడుతూ.. దాన్ని తీసుకుని లిఫ్టులో పైకి కిందకు వెళితే మళ్లీ క్యూ…లగేజీ మొత్తం మాతోనే.. మొదట లగేజ్ చెక్ ఇన్ చేసిన చోటే క్యూలో అన్ చెకిన్ చేయడం.
హోటల్‌కి తీసుకెళ్లడానికి బస్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వస్తుంటే ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఒకతను నా లగేజీ ఒకటి తీసుకుని వేగంగా వెళుతున్నాడు. ఒక క్షణం నాకేమీ అర్థం కాలేదు. నేను వేగంగా అడుగులేస్తూ దట్స్ మై బాగేజ్ గట్టిగా అరిచాను. ఎవరో అతన్ని ఆపారు.
హెల్ప్ చేస్తున్నా.. అంటూ వెహికిల్ క్యూ దగ్గర ఆగాడు. అప్పటికే చాంతాడంత క్యూ..
బస్ హోటల్‌కి, ఎయిర్పోర్టుకి మధ్య షటిల్ చేస్తున్నది. నా వంతు వచ్చేసరికి రెండు సార్లు వెళ్లి వచ్చింది. సరే తెల్లవారజాము3.05 కి బయలుదేరి 3.25కి హోటల్ చేరాం.
ఆ రాత్రి పూట రోడ్ మరమ్మత్తు, తెలపు చారల పెయింటు వంటి పనులు జరుగుతున్నాయి.
సిడ్నీ CBD లోని జార్జి స్ట్రీట్ లో బస్ ఆగింది. ఎదురుగా హోటల్ మెర్క్యురీ. నాలుగు నక్షత్రాల హోటల్.
బిస్ దిగాక మా లగేజీ తీసుకుని రూం కోసం మళ్లీ క్యూ.. అప్పటికే మా కంటే ముందు వచ్చినవాళ్లు ఆ వరుసలో ఉన్నారు. చంటి పిల్లలతో ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, ఒక్కరే ప్రయాణం చేస్తున్న వీల్ చైర్ వాళ్ళకి హోటల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు.
పాస్పోర్టుతో పాటు, క్రెడిట్ కార్డ్ లేదా వంద డాలర్లు సెక్యూరిటీ డిపాజిట్ అడిగారు. హోటల్ ఖర్చు ఎయిర్ లైన్ వారు భరించాలి కదా అంటేఅవును. వాళ్లే భరిస్తారు కానీ మీరు డిపాజిట్ చేయాలి. చెక్ అవుట్ చేసేటప్పుడు తిరిగి ఇస్తాం అన్నారు. డబ్బులు, క్రెడిట్ కార్డ్ ఏదీ లేకపోతేనో… అడిగాను. తప్పదు అన్నారు.
$20 విలువ చేసే కంప్లీమెంటరీ బ్రేక్ ఫాస్ట్. కాదని ఎవరైనా రూం కి ఇంకా ఏమైనా తెప్పించుకుంటే అది మనమే కట్టాలి. అందుకోసమే ఆ డిపాజిట్.
నెక్సట్ ఫ్లైట్ ఎప్పుడో మెయిల్ వస్తుంది, ఫోన్ వస్తుంది అన్నారు. ఉదయం 7-10 గంటల మధ్య బ్రేక్ ఫాస్ట్.అని చెప్పి రూమ్ కీ అందించారు. 10 అంతస్తులో నా రూమ్.
మొత్తానికి రూం లోకి చేరేసరికి 4.35 దాటింది.
రూమ్ చాలా బాగుంది. కానీ నిద్ర ఏం పడుతుంది ఆ సమయంలో.. ఇంటర్నెట్ ఆక్టివేట్ చేసుకోవడానికి కోడ్ కీ తో పాటు ఇచ్చారు. ఇంటర్నెట్ యాక్టివేట్ చేసుకొని విషయమంతా తెలియజేస్తూ సాధనకి మెస్సేజ్ చేసాను.
రాత్రంతా నిల్చోవడం వల్ల, బ్యాగేజ్ ఈడ్చుకుంటూ తిరగడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు ఒళ్ళంతా నొప్పులు. కాళ్ళు లాగేస్తున్నాయి. చాలా అలసటగా ఉంది కానీ నిద్ర పట్టడం లేదు.
భాష తెలియక ఒంటరిగా ప్రయాణం చేసే వాళ్ళ పరిస్థితి ఏమిటి ? వయసు మళ్ళిన వాళ్ళు, పసిపిల్లలతో ప్రయాణం చేసే తల్లులు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అని ఆలోచనలు..
ఎప్పటికో నిద్ర పడుతుండగా మా అమ్మాయి ఫోన్. అప్పుడే మెసేజ్ చుసినట్లుంది అసలు ఏమైంది అంటూ..
శ్రీలంకన్ ఎయిర్వేస్ నుంచి తమకు ఎటువంటి ఈమెయిల్, మెసేజ్ లేదని చెప్పింది. ఎనిమిది దాటాక ఎయిర్ లైన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే కరెక్ట్ టైం కి ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసిందని చెప్పారట.
ఎనిమిది గంటలకు బ్రేక్ ఫాస్ట్ కోసం రెస్టారెంట్ వెళ్ళేప్పటికీ రాత్రి కొన్ని గంటల పాటు చూసిన మొఖాలు చాలా కనిపించాయి. ఎవరు ఎవరో తెలియదు. కానీ వాళ్ళు నాలాగే..
కొందరు పలకరింపుగా చిరునవ్వు..
20 డాలర్స్ కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటే బిల్ కట్టాలని మళ్లీ చెప్పారు. అది బఫెట్. ఎలా తెలుస్తుందో మరి? ఆ ఎక్కువతక్కువలు..!?
పళ్లరసాలు, పళ్ళు కాకుండా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. కంటికి బాగా కనిపించినవి పెట్టుకు తిన్నాను. కావ్యారెడ్డి కూడా వచ్చి నా దగ్గర కూర్చుంది. ఓ అరగంట అలా కాలక్షేపం చేశాం. అంతలో బస్ వచ్చిందని ప్రకటించారు.
కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తేమధ్యాహ్నం రెండు గంటలకు ఫ్లైట్ అని చెప్పారట. మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. మళ్ళీ నేను ఫ్లైట్ ఎక్కేవరకు ఆందోళన పడుతుంటారు.
మళ్ళీ క్యూలలో నించునే బదులు ముందే లగేజి బస్ లో పెట్టడం మంచిదని లగేజీ మొత్తం ఈడ్చుకుంటూ వచ్చి బస్ లో పడేసి హమ్మయ్య అనుకున్నా..
ఎయిర్ లైన్స్ రూం చెక్ అవుట్ చేయగానే ఇంటర్నెట్ కట్ అయింది. మళ్లీ కమ్యూనికేషన్ బంద్.
ఎక్కి కూర్చున్నాను కానీ బస్సు 10 గంటలకు కదిలింది. అందరినీ ఎక్కించుకుని.
మొత్తానికి 11 కి ఎయిర్ పోర్టు చేరి లగేజ్ తీసుకుని మా బతుకు మళ్ళీ క్యూలో.. మళ్లీ బాగేజ్ చెకిన్.. బోర్డింగ్ పాస్ కొలొంబో వరకే ఇచ్చారు. హైదరాబాదు కి ఇవ్వలేదు. అదేంటి నిన్న రెండు బోర్డింగ్ పాస్ లు ఇచ్చారు కదా.. అంటే కొలొంబో వెళ్ళాక అందుబాటులో ఉన్న ఫ్లైట్స్ ని బట్టి అక్కడ ఇస్తారని చెప్పారు. బహుశ 20 తేదీ వరకు ఫ్లైట్ ఉండకపోవచ్చు అని చూచాయగా చెప్పారు. లేదంటే మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అనడంతో కొందరు ఆలోచనలో పడ్డారు.
సరే ఏదైతే అదవుతుందని కొలొంబో బోర్డింగ్ పాస్ తీసుకుని సెక్యూరిటీ.. కస్టమ్స్… వగైరా పూర్తి చేసుకుని మా వాళ్ళకి ఫోన్ చేద్దామంటే నెట్ కనెక్ట్ కాలేదు. గతంలో ఎప్పుడూ లోకల్ సిమ్ ఉండేది నా దగ్గర. ఈ సారి నా ట్రిప్ తక్కువ సమయం కాబట్టి అనవసరంగా ఎందుకు వద్దని మా వాళ్ళని వారించాను.
56 గేట్ చేరి చార్జింగ్ పెట్టుకు కూర్చున్నా.
ఎట్టకేలకు సిగ్నల్ దొరికింది. పరిస్థితి తెలియక ఆందోళన పడుతున్న మా వాళ్ళకి నా ఫోన్ కొంత ఊరట నిచ్చింది.
మళ్లీ అదే తంతు. బోర్డింగ్‌కి పిలవరు. మళ్లీ ఎదురు చూపులు. ఫ్లైట్ మాత్రం మా కనుచూపులో కనిపిస్తూనే ఉంది. శుభ్రం చేయాలని ఒకసారి, భోజనం రాలేదని ఒకసారి కారణం చెబుతూ వస్తున్నారు. అందరికీ ఆకలి. ఓపిక నశించింది. ఒంట్లో శక్తి నశించింది. లోలోపల తిట్టుకుంటూనే సహనంగా ఉన్నారు.
మళ్లీ ఇరవై నిమిషాలు అని అనౌన్స్ చేశారు. జనానికి ఓపిక నశించింది. అందరూ గట్టిగా ఎయిర్పోర్ట్ సిబ్బందిని నిలదీశారు. తమ ఆక్రోశం వెళ్లగక్కారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవరి ఆపద వారిది. ఎవరి తొందర వారిది. ఎవరి ఇబ్బందులు వారివి.
హర్యానాలో తండ్రి చనిపోయి ఒకరు, మృత్యు వాకిట ఉన్న తల్లి చూపు కోసం ఒకరు, పెళ్లి కోసం ఒకరు, నాలుగు రోజుల కోసం అత్యవసరంగా ఇంకొకరు, ఎవరి కారణాలతో వారు గమ్యం చేరాలనే తొందరలో.. ఆతృతతో..అసహనంగా.. అలసి పోయి.. ఉండవల్లి లాంటి వాళ్ళు కొందరు టికెట్ కాన్సల్ చేసుకుని వెనక్కి వెళ్లిపోయారు.
చిలికి చిలికి గాలివానగా మారింది. రంగంలోకి కాప్స్ వచ్చారు. ఇద్దరు యువకుల్ని పాస్పోర్ట్, ఐడి తీసుకుని స్కాన్ చేశారు. బెదిరించారు. కానీ విషయం అంతా విన్న తర్వాత మా ఆవేశకావేశాలు తగ్గిస్తూ మాట్లాడి సహకరించాల్సిందిగా కోరారు.
ఇంత జరుగుతున్నా తమకేమి పట్టనట్టు చోద్యం చూస్తూ కొందరు సహా ప్రయాణికులు..
హైదరాబాద్ దిగవలసిన సమయంలో సిడ్నీలోనే… ఎట్టకేలకు మా ప్రయాణం ప్రారంభం అయింది.
పసిపిల్లలు, చిన్నపిల్లలు విసిగిపోయి అలసిపోయి ఉన్నారేమో ఫ్లైట్ దిగేద్దామంటూ ఏడుపులతో..
నేను నావిగేషన్ పెట్టుకుని మా ప్రయాణం ఏ దిశగా సాగుతున్నదో చూస్తూ కూర్చున్నా.
-50 డిగ్రీల వాతావరణంలో బ్రోకెన్ హిల్ మీదుగా పోతున్నప్పుడు ఊటుకూరి వెంకట్ అంకుల్‌తో మాట్లాడిన విషయాలు గుర్తొచ్చాయి.
ఎథేల్ నది, యన్నార్ నది మీదుగా.. 932కిమీ వేగంతో ప్రయాణం సాగుతున్నది.
మౌంట్ బ్రెస్నహా మ్మౌంట్ అలెక్సాండ్రయా, మౌంట్ హోలిస్టర్, పర్వతాలు దాటి ప్రయాణం ఇంకా 5.23 గంటలు ఉందనగా హిందూమహా సముద్రంపై ఎగరడం మొదలైంది. కుదుపులు.. దట్టమైన చిక్కని చీకటి రాత్రి 8.41 అని నా ఫోన్ చెబితే నావిగేటర్ స్క్రీన్ మాత్రం 7.41 అనిచూపింది. అంటే టైం జోన్ మారినట్లుంది. పెర్త్ వైపు ఉన్నామేమో..?
తంగల్లె దగ్గరలో సముద్రం ముగిసి నేల వచ్చింది. అక్కడ నుంచి 20 నిముషాల ప్రయాణంతో కొలంబో. నీలి సముద్రం పోయి ఆకుపచ్చ పూసింది.
హిందూ మహా సముద్రపు ఒడ్డునే ఎయిర్‌పోర్టు.
శ్రీలంక భూభాగంలో ప్రవేశించాక ఆడమ్స్ పీక్, మరికొన్నిచోట్ల తెల్లగా కనిపించింది. బహుశ మంచుకొండలేమో..అనుకున్నా. కానీ, కాదు కాదు మేఘం అని తర్వాత అర్ధమైంది.
అప్పటికి సిడ్నీ సమయం అర్ధరాత్రి రాత్రి 2 దాటింది.
స్థానిక కొలొంబో సమయం రాత్రి 8.35 కి లాండ్ అయింది. బయటకు చూస్తే వర్షం. మళ్లీ ఎదురుచూపులు తలుపులు తెరవడానికి. 9.40 కి తెరుచుకున్నాయి ప్లైట్ తలుపులు. షెడ్యూల్డ్ ఫ్లైట్ కాకపోవడంతో అన్నిటికి ఆలస్యమే. ఎదురుచూపులే..
ట్రాన్సిట్ కౌంటర్ దగ్గర మళ్లీ క్యూ.. ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఇలా వేరు వేరు కౌంటర్..
హైదరాబాద్ తప్ప మిగతా వాళ్లకు బోర్డింగ్ పాస్ సిడ్నీలో ఇచ్చారు. మాకు చెకిన్ లగేజీ అక్కడ కలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. మళ్లీ మోత.. అనుకున్నా కానీ లగేజీ అవసరం అయితే తీసుకోండి. లేదంటే హైదరాబాద్‌లో తీసుకొమ్మనడంతో వెంటనే హమ్మయ్య అనుకున్నా. 20వ తేదీ ఉదయం 7కి హైదరాబాద్ ప్లైట్. బోర్డింగ్ పాస్ తీసుకున్నా.
18 తేదీ రాత్రి పదిన్నర దాటింది.
ట్రాన్సిట్ వీసా కౌంటర్ లో ట్రాన్సిట్ వీసా కోసం అప్లికేషన్ ఇచ్చా. నా పాస్పోర్ట్, బోర్డింగు పాస్ తీసుకు చూసి 2రోజులకు శ్రీలంక వీసా స్టాంప్ పాస్పోర్టుపై వేశారు. ఇమిగ్రేషన్ ఫాం, భోజనానికి కూపన్ కూడ అక్కడే ఇచ్చారు.
ఎయిర్ లైన్స్ వాళ్ల కాంటీన్ లో భోజనం ముగించుకుని, ఇమిగ్రేషన్ పనులు పూర్తి చేసుకుని శ్రీలంకన్ ఎయిర్ వేస్ కౌంటర్ దగ్గరకు చేరా. మళ్లీక్యూ.. మా ఫ్లైట్ లో ప్రయాణించిన ప్రయాణికులకు ఐదు హోటళ్లలో బస ఏర్పాటు చేసారు.
హైదరాబాద్, ఢిల్లీ వెళ్ళేవాళ్ళు కొందరికి నెగొంబో లోని కాటమరాన్ బీచ్ లో వసతి ఇచ్చారు. కొలొంబో వరకు వచ్చిన కావ్యారెడ్డి సిడ్నీలో బయలుదేరే ముందే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి బుక్ చేసుకుంది. మరుసటి రోజు కజిన్ పెళ్లి ఉండడంతో. ఆ ఫ్లైట్ లో ఇంకో రెండు మూడు సీట్స్ ఉన్నాయని తెల్సుకుని షార్ట్ ట్రిప్ కోసం వచ్చిన మరో ఇద్దరు హైదరాబాదీ ప్రయాణికులు వెళ్లిపోయారు ఆ తెల్లవారు జామున ఉన్న విమానానికి.
మిగిలిన వాళ్లంతా బసకు చేరుకున్నాం. అప్పటికి అర్ధరాత్రి 12. 20.
ఎయిర్లైన్స్ వాళ్ళిచ్చిన లెటర్, పాస్పోర్ట్ తీసుకుని కొద్దిసేపటికి వైఫై పాస్వర్డ్ ఇచ్చారు. 12. 45 కి రూమ్ అలాట్ చేసి కీ ఇచ్చారు.
రూమ్‌కి వెళుతుంటే ఓ పెద్దాయన పలకరింపుగా నవ్వాడు, తమిళంలో ఆత్మీయంగా పలకరించాడు. నేను తమిళ్ కాదు తెలుగు, హైదరాబాదీ అని చెప్తే తమిళ్ అనుకున్నా సారీ చెప్పాడు.
2005లో స్వీడన్ వెళ్ళినప్పుడు కూడా కొందరు తమిళియన్, శ్రీలంకన్ అని నన్ను పలకరించడం గుర్తొచ్చి నవ్వొచ్చింది.
కొలొంబో విశేషాలతో మరో సారి కలుస్తా..
అంతవరకు సెలవ్.
వి. శాంతి ప్రబోధ
వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తరతెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె( కథా సంకలనాలు) ప్రచురణ. బతుకుసేద్యం, నిష్కల, నీలాకాశంలో నిధి(బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.