[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]
అమెరికా పెళ్లి..
[dropcap]అ[/dropcap]మెరికా పెళ్లి అంటే అమెరికన్ల పెళ్లి అనుకునేరు. కాదు కాదు.
అచ్చమైన తెలుగు పెళ్లే. తెలంగాణలో పుట్టి అమెరికాలో పెరిగిన అమెరికన్ సిటిజన్ అమ్మాయికీ ఆంధ్రాలో పుట్టి పెరిగి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేసే అబ్బాయికీ పెళ్లి.
అసలు పెళ్లంటే ఏంటి? ఏంటీ పిచ్చి ప్రశ్న అని విసుక్కోకుండా అర్థం చేసుకుంటారు కదూ..
సాధారణంగా పెళ్లనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఏంటి.. మూడు ముళ్లు, ఏడడుగులు, తలంబ్రాలు, మంగళ వాయిద్యాలు, పట్టు చీరల గరగరలు, బంగారు నగల ధగధగలు, ఇల్లంతా పచ్చని తోరణాలు, బంధువు మిత్రుల సందడి ఇలా ఎన్నెన్నో ప్రత్యేక హంగులు ఆర్భాటాలు.. అంతే కదూ..
రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టి, వేర్వేరు చోట్ల పెరిగి, వేర్వేరు అలవాట్లలో, ఆలోచనల్లో, ఆచార వ్యవహారాల్లో ఉన్న ఇద్దరు పెళ్లి నుంచి ఒకటి అవడం ఒకటిగా జీవించడం అంటే.. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు ప్రపంచాలు ఒకటే ప్రపంచంగా మారడం అనవచ్చేమో..
రెండు ప్రపంచాలు ఒకటే అవడానికి జరిగే తంతు విధానం ఏదైనా కావచ్చు అది సంప్రదాయంగా వేదమంత్రాల మధ్య జరిగేది కావచ్చు, దండలు మార్చుకునే అభ్యుదయ వివాహం కావచ్చు లేదా రిజిస్టర్ పెళ్లి కావచ్చు లేదా సహజీవనం కావచ్చు మరేదైనా పద్ధతి పెట్టుకోవచ్చు.
పెళ్లంటే.. ఆడా మగా ఇద్దరూ కలిసి ఒక కుటుంబంగా ఏర్పడటం. ఒకరికొకరు తోడునీడగా జీవితాంతం కలిసి ఉండడం. సమాజం ఆమోదించిన ఆ బంధాన్ని ఆమోదిస్తూ ఆశీర్వదిస్తూ బంధు మిత్రులంతా కలవడం, వేడుకలు జరుపుకోవడం. అదే కదా!
ఇద్దరు కలిసి జీవించడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక తతంగం కోసం లేదా ఈ రోజు నుంచి ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి ఒక కుటుంబంగా మారుతున్నారు అని చేసే ఒక ప్రకటన కోసం మనం ఎంత ఆర్భాటం చేస్తున్నాం! ఎంత వ్యయం, ఎంత శ్రమ, ఎంత సమయం ఖర్చు చేస్తున్నాం!
మా అమ్మానాన్నల పెళ్లి దగ్గరి బంధువుల మధ్య దండలు మార్చుకోవడంతో అయిపోయింది. మా అమ్మల తరంలో అందరిదీ అదే విధంగా చేసారు. ఆనాడు చైతన్యం క్రమేణా తగ్గుముఖం పట్టిందా..
మా పెళ్లి ఇప్పటిలా పెద్ద హడావిడి లేకపోయినా సంప్రదాయ పెళ్లి అంటే ముందుకు వెళ్లాల్సిన మేం వెనక్కి వచ్చామన్నమాట. మా అత్తవారి వైపు నుండి ఉన్న ఒత్తిడి వల్ల అలా జరిగింది.
ఇక మా అమ్మాయి పెళ్లి ఆర్భాటపు పెళ్లి అనే చెప్పాలి.
జీవితమంతా రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా పోగుచేసి, రూపాయికి రూపాయి మూడేసి సంపాదించిన సొమ్మంతా ఆ నాలుగురోజుల్లో మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నాం. ఎందుకంటే.. అంతస్తు, స్థాయి చూపించడం కోసం. నలుగురూ గొప్పగా చెప్పుకోవడం కోసం.. ఇదంతా అవసరమా? ఈ ప్రశ్న మొదటిసారి కాదు చాలాసార్లు నాలో తలెత్తేదే..
చెల్లెలు కూతురు పెళ్లికి అయిన ఖర్చు చూశాక ఇప్పుడు మరోసారి ఆ ప్రశ్న నాలో..
హైదరాబాద్‌లో పెళ్లి జరిగితే మెడిసిన్ చదివే పెళ్లికూతురు చెల్లెలు రావడానికి వీలు కాదు. పెళ్ళికొడుకు కు వీసా స్టాంపింగ్‌కి వెళ్ళాలి. ఒక వేళ ఏదైనా ఇబ్బంది వస్తే తిరిగి వెళ్లడం కష్టం అని అమెరికాలో పెళ్లి చేయాలని నిర్ణయమైంది.
మాట్రిమోని ద్వారా పరిచయమైన ఇద్దరి కులాలు, ప్రాంతాలు, అలవాట్లు, సంప్రదాయాలు అన్నీ వేరువేరుగా. కానీ అబ్బాయికి అమ్మాయికీ మాత్రం ఒకరంటే ఒకరికి నచ్చారు. అభిరుచులు, ఆలోచనలు కలిసి జీవించొచ్చు అని చెప్పాయి. ఇద్దరూ వృత్తి జీవితంపై ప్రత్యేక శ్రద్ధ ఉన్నవారే.. చిన్న వయసులోనే పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్నవారే. చేతిలో డాలర్లకు కొదువలేదు. ఎక్కడా తగ్గేదిలే.. అనే మనస్తత్వం.
అమెరికా సమాజం పద్ధతిలో అక్కడ జరిగే భారతీయ పెళ్లిళ్లలో కూడా సాధారణంగా పెళ్లి ఖర్చు అమ్మాయి, అబ్బాయి చెరిసగం పంచుకుంటారు. కానీ ఇక్కడ భిన్నం. ఖర్చంతా అమ్మాయి వాళ్ళదే.
మనదేశంలో మాట్లాడుకున్నట్లు అబ్బాయి ఆస్తిపాస్తులు గురించి, అమ్మాయి ఆస్తిపాస్తులు గురించి, పెట్టుపోతలు గురించి ఏమీ మాట్లాడకుండా పూర్తిగా అమ్మాయి, అబ్బాయిల ఇష్టప్రకారం పెళ్లి కుదిరింది.
అమ్మాయి వాళ్ళ పద్ధతి ప్రకారం లగ్నపత్రిక పంపడం, పెళ్లి పనులు మొదలు పెట్టడం, షాపింగ్ అంతా ఇండియాలో జరిగింది. అబ్బాయి తల్లిదండ్రులు కూడా తమ పద్ధతి ప్రకారం పనులు మొదలు పెట్టారు. అంతా శ్రావణ మాసంలో జరిగింది.
పెళ్లి డిసెంబర్ 8న అయితే ఆన్లైన్ ఆహ్వాన పత్రిక ఆగస్టు చివరినాటికి సిద్ధమైపోయింది. అమ్మాయి అబ్బాయి కలిసి సిద్ధం చేశారు. అప్పటి నుంచి అమెరికాలో ఆన్లైన్‌లో పంపించే బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు వెళ్లిపోయాయి. కనీసం మూడు నెలల ముందే ఆహ్వానం పంపడం అక్కడ పద్ధతి.
పెళ్ళికి ఎవరు వచ్చేది రానిది ముందే తెలిసిపోతుంది. దాని ప్రకారం ఏర్పాటు చేసుకుంటారు.
అలా బంధు మిత్రుల రాక కంఫర్మ్ చేయడం మొదలైంది. వచ్చే బంధు మిత్రులు హోటల్ బుకింగ్ కూడా అప్పటి నుంచి చేసుకోవడం మొదలుపెట్టారు. ఇండియాలో ఉన్నట్లు వధువు వైపు నుంచి మగ పెళ్ళి వాళ్ళకి, ఆడపిల్ల వైపు బంధువులకు వసతి సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన పనిలేదు. ఎవరి వసతి వారు చూసుకోవలసిందే. అది అమెరికన్ సంప్రదాయం. అదే పాటించారు.
కాలిఫోర్నియాలో ఉండే అబ్బాయి వాళ్ళు న్యూజెర్సీలో జరిగే పెళ్లి కోసం పది రోజుల ముందే వచ్చారు. ఏడు పడక గదుల పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడినుంచే పెళ్లి కార్యక్రమాలన్నీ జరిగాయి.
అమ్మాయి వాళ్ళు అంటే చెల్లి వాళ్ళు కూడా వారం కోసం పెద్ద భవంతిలోకి మకాం మార్చారు. ఆ ఇల్లు మా పెద్ద మేనత్త మనవరాలిది. మేమంతా అక్కడే బస. అక్కడి నుంచి పెళ్లి కార్యక్రమాలు నిర్వహించారు.
ఆరు రోజుల పెళ్లి. డిసెంబర్ ఐదు నుంచి పది వరకు ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం. సంప్రదాయం ఆచారం పేర సరదా.. సందడి, హంగు ఆర్భాటం.
డిసెంబర్ 5న హల్దీ..
అబ్బాయి వాళ్ళున్న ప్లైన్ ఫీల్డ్‌లో జరిగింది. పసుపు పెట్టి స్నానం చేయించి పెళ్లి పెళ్ళికూతుర్ని/పెళ్లి కొడుకుని ఎవరింట్లో వాళ్ళు జరుపుకోవడం సంప్రదాయం. కానీ అక్కడ ఇద్దరూ ఒక దగ్గరే జరుపుకోవాలని అమ్మాయి అబ్బాయి నిర్ణయించారు. అందరూ కలిసి హోలీ ఆడాలని ఉత్సాహపడ్డారు. లివింగ్ స్టన్ నుంచి అమ్మాయి తరపున అంతా వెళ్లి పసుపు పెట్టడం వరకు జరిగింది. మిగతా కార్యక్రమానికి, ఉత్సాహానికి బ్రేక్ వేసింది చలి పులి.. చేసేది లేక అక్కడే భోజనం ముగించుకుని వెనక్కి వచ్చాము. ఇంటికి వచ్చాక అమ్మాయిని పెళ్లి కూతురిగా తయారు చేశాం. అప్పటి నుంచి పెళ్లి వరకు ప్రతి పూట ఎవరో ఒకరు అమ్మాయిని పెళ్లి కూతురిగా చేసాం.
మరుసటి రోజు సాయంత్రం అబ్బాయి వాళ్ళింటి దగ్గర మెహందీ ఫంక్షన్.
ఏడో తేదీ ఉదయం అబ్బాయి వాళ్ళ బంధువర్గం అంతా అమ్మాయి ఇంటికి చేరారు, ప్రధానం అని. నిజానికి ఆ పద్ధతి మాకు లేదు అంటే మా చెల్లికి పుట్టింటి వైపు అత్తింటి వైపు లేదు (వాళ్లిద్దరిది వర్ణాంతరం) అబ్బాయి వాళ్ళకి ఉంది కాబట్టి ఆ పద్ధతిలో ప్రధానం జరిగింది. అమ్మాయికి పెట్టే బట్టలు, నగలు పెట్టారు వాళ్ళు. వచ్చిన అబ్బాయి తరపు బంధువులందరికీ మా చెల్లి బట్టలు పెట్టింది.
అలా ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం ముగించుకుని వెళ్లారు.
అదే రోజు సాయంత్రం సంగీత్.
రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగింది. ఉత్తరభారత సాంప్రదాయ పద్ధతిలో ఉన్న హాల్ అది. హాల్ డిజైన్, కార్పెట్స్ అన్నీ ..న్యూజెర్సీలో భారతీయులు ఎక్కువ కాబట్టి వారినుద్దేశించి కట్టినట్లు ఉన్నారు. ఒకసారి వెయ్యి మంది పట్టే హాల్స్, నాలుగు వందల మంది పట్టే మహారాజా హాల్ ఉన్నాయి. మండపం ఉన్న హాల్ రెండు రెండున్నర వందల పడతారేమో.. సంగీత్ కోసం మండపం ఉన్న హాల్ బుక్ చేశారు. విశాలమైన పార్కింగ్.
వెజ్, నాన్ వెజ్ స్నాక్స్, డ్రింక్స్.. ఆ తర్వాత వెజ్, నాన్ వెజ్ భోజనం ఎన్ని వెరైటీలో.. తినటం కంటే వేస్టేజ్ ఎక్కువ.
మేము ఆరు గంటల సమయంలో వెళ్లేసరికి అబ్బాయి వాళ్ళు వచ్చారు. మా బంధువులు కూడా కొందరు వచ్చారు. వస్తూ ఉన్నారు. హాల్‌లో సంగీతం మంద్రంగా వినిపిస్తున్నది. అలంకరణ చాలా రిచ్‌గా డీసెంట్‌గా ఉంది. బంగారు రంగులో మెరిసిపోతూ కుర్చీలు.
పెళ్లి కూతురు-పెళ్లి కొడుకుల, వారి కుటుంబాలతో కొంత ఫోటో షూట్ జరిగింది.
పెళ్లికూతురు, పెళ్ళికొడుకు, వారి మిత్రులు ఎన్నాళ్ళ నుండి ప్రాక్టీస్ చేస్తున్నారో తెలియదు చాలా డాన్సులు చేశారు. అన్నీ హిందీపాటలే. వాళ్ళ డాన్సులు చూస్తూంటే వీళ్లకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది. ఉద్యోగాలు చేసుకుంటూ, పెళ్లి పనులు చూసుకుంటూ ఇంత సమయం ఎలా వెచ్చించగలిగారో.. అని నాలో ప్రశ్నలు .
అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా డాన్స్ ప్రదర్శన ఉందని మాకు పెళ్లి కూతురు ద్వారా తెలిసింది.
మాలో ఎవరికీ డాన్స్ అలవాటు లేదు. కాస్తో కూస్తో మా మేనత్త మనవరాళ్లకు మాత్రమే ఉంది.
మనం కూడా చేద్దాం అని సోనిక, సాధన, మోనిక ముందుకొచ్చారు. మెహందీ నుండి వచ్చాక ఆ అర్ధరాత్రి పూట సోనిక డైరెక్షన్‌లో మాతో రిహార్సల్ చేయించారు.
అలసిపోయిన మా పెద్దలకేమో నిద్ర వస్తున్నది, రేపటి పని కనిపిస్తున్నది. మా పిల్లలు మాత్రం చేయాల్సిందేనని పట్టు. మొత్తానికి ఒక రిహార్సల్ చేసాం. ఆ మధ్యలో బోలెడన్ని జోక్స్, కామెంట్స్.. నవ్వులు.. పెద్దల తర్వాత మా పిల్లలు రిహార్సల్ మొదలు పెట్టారు.
సంగీత్‌లో ప్రదర్శనకు ఒక ఆర్డర్ ముందే ఈవెంట్ మేనేజర్‌కి ఇచ్చారు. ఆ ఆర్డర్‌లో మాది వెనక్కి ఉండేలా చూసారు.
ఈవెంట్ మేనేజర్ మధ్య మధ్య ఇచ్చే అనౌన్స్‌మెంట్, డాన్సులు చూస్తూ వెజ్ -నాన్ వెజ్‌లో రకరకాల స్నాక్స్, డ్రింక్స్ తెచ్చుకుని రౌండ్ టేబుల్స్ చుట్టూ వేసిన కుర్చీల్లో కూర్చొని లాగిస్తున్నారు జనం. కొందరేమో డెకొరేషన్ ముందు ఫోటోలు తీసుకుంటూ.
శృతి ఫ్రెండ్స్, అబ్బాయి తరపు వాళ్ళ డాన్స్ తర్వాత నా మనవరాలు సౌరవి పేరు అనౌన్స్ చేశారు. ఆరేళ్ల పిల్ల అంతమంది ముందు ఎటువంటి సంకోచం లేకుండా నిర్భయంగా చాలా చక్కగా డాన్స్ చేస్తుంటే జనం లోంచి ఈలలు, చప్పట్లు. ఒకటి కాదు రెండు డాన్స్‌లు చేసి చివరికి అభి బాబాయ్ మా శృతి పిన్ని మా ప్రిన్సెస్. నువ్వు బాగా చూసుకోవాలి అని చెప్పి ఆహుతుల మనసు దోచేసింది.
ఆ తర్వాత అమ్మాయి తరపున డాన్స్/పెర్ఫార్మెన్స్. చివరికి 80 ఏళ్ల అమ్మతో సహా అంతా సంగీత్ డాన్సుల్లో భాగమై సరదాగా సంతోషంగా గడిచిపోయింది ఆ రోజు.
పెళ్లి రోజు వచ్చేసింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మేకప్ వాళ్ళు వస్తారు. అమ్మాయి తల్లికి ఒకటిన్నరకు మేకప్ సమయం ఇచ్చారు. ముందే ఎవరెవరికి మేకప్ కావాలో, ఎవరెవరికి సారీ డ్రేపింగ్ కావాలో, హెయిర్ డ్రెసింగ్ కావాలో చెప్పేశారు. వాళ్ళకిచ్చిన సమయం ప్రకారం వెళ్లి చేయించుకోవాలి.
తెలుగునాట ఉండి రోజూ చీర కట్టుకునేవాళ్ళకి కూడా అమెరికాలో ఉండే ఉత్తర భారతీయురాలైన డ్రేపర్ చీర కట్టడం విడ్డురంగా లేదూ..
ఎంత సొమ్ము తనది కాకపొతే మాత్రం.. మరీ ఇంత ఇదా.. అది గొప్పా .. అనుకున్నా.
పెళ్లి సంబరం
లివింగ్ స్టన్ లోని క్రిస్టల్ ప్లాజాలో పెళ్లి. ఇంటికి దగ్గరే 10 నిముషాల దూరం.
అలరించే చెర్రీ బ్లూసమ్ డేకరేషన్ అద్భుతంగా ఉంది. కానీ, ఇంచి మందాన మెత్తిన మేకప్, హెయిర్ స్టైల్ చాలా మందికి నప్పలేదు.
మగపెళ్లి పెళ్ళివారి విడిదిలో పానకాలు ఇవ్వడం తెలుసు. ఇక్కడేమో అబ్బాయి తరపు మగవాళ్ళకి అమ్మాయి తరపు మగవాళ్ళు పానకం ఇస్తే వాళ్ళు ఆ ఇచ్చిన అతనికి కండువా కప్పారు. సంప్రదాయాలు కలగలిసిపోయి, ఎవరికి తెలిసినట్లు వాళ్ళు..
సాంప్రదాయ పెళ్లి పేరుకే. ఎందుకంటే ఎవరి సంప్రదాయం ఏదో, పాటించే పద్ధతులు ఏవో ఇరువైపులా పెద్దలకు సరిగా తెలియదు. ఎవరో పెద్దవాళ్ళు ఉండి చెబితే అలా చేస్తున్నారు ఇండియాలో కూడా. ఇక అమెరికాలో అంత చెప్పేవాళ్ళేవరు? ఆచార పట్టింపు లేని నాలాటి వాళ్ళకి అసలే తెలియదు.
పెళ్లికొడుకును అమ్మాయి అన్నలు ముగ్గురు చేతుల్లో ఎత్తుకు వెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. ఆ తర్వాత బ్రైడ్ మైడ్స్ అంతా ఒకేవిధమైన దుస్తుల్లో వచ్చారు. ఆ వెనుక అమ్మాయి నడిచే మార్గంలో గులాబిరేకలు వేస్తూ పూబాలలు, ఆ వెనుకే అన్నలు గొడుగు పట్టుకుంటే అమ్మాయి చేత కొబ్బరిబోండం, మేలి ముసుగుతో మండపానికి నడచి రావడం, తర్వాత పూజ..
జీలకర్ర బెల్లం అయిపోయింది. వధూవరులకు బట్టలు అంటున్న బ్రాహ్మడు.. అమ్మాయి వాళ్ళు అబ్బాయికి తలంబ్రాల బట్టలు ఇచ్చారు. అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఇవ్వాలి.
వాళ్ళ వాళ్లంతా మొహాలు చూసుకుంటున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు చలనం లేకుండా.. తీరా తేలిందేమిటంటే వాళ్ళు మర్చిపోయి వచ్చారట..
ప్చ్.. అమ్మాయి మొహం చిన్నబోయింది. కళ్ళలోంచి ఉబికి వచ్చే దుఃఖాన్ని అదుపులో ఉంచడానికి యత్నిస్తున్నది.
ఆ చీర కోసం హైదరాబాద్ అంతా గాలించి ప్రత్యేకంగా ఉన్న సిల్వర్ జరీ చీర అంచులో లేతాకుపచ్చ గోల్డ్, సిల్వర్ జరీతో ఉన్న కంచిపట్టు చీర ఏరికోరి తీసుకుంది. ఆ చీరకు మ్యాచ్ అయ్యేవిధంగా వజ్రాల హారం, చెవి బుట్టలు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంది. జాకెట్ పై ప్రత్యేకంగా వర్క్ చేయించుకుంది. అదంతా నాకు బాగా తెలుసు. వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళతో పాటు నేనూ షాపులకు తిరగడం వలన.
ఎంతో ప్రత్యేకంగా వెతికి వెతికి డబ్బు, సమయం వెచ్చించి కొన్న చీరను పెళ్లి ముందు రోజు ప్రధానం తర్వాత పెళ్ళికొడుకు తల్లికి అప్పగించారు. ఆవిడ పెళ్లి రోజు మేకప్ చేయించుకోవడానికి వచ్చే తొందరలో ఇది మర్చిపోయారో లేకపోతే తమకు ఆ పద్ధతి లేదని వదిలేసి వచ్చారో తెలియదు. మొత్తానికి తలంబ్రాల చీర లేకుండానే పెళ్లి జరిగిపోయింది. జీలకర బెల్లం పెట్టారుగా కాస్త ఆగితే చీర తెస్తారనడానికి వీల్లేకుండా ఉన్నది సమయం. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. రాత్రి పదిన్నరకు హాల్ ఖాళీ చేయాలి. ఇంకాస్త సమయం తీసుకున్న ఒక అరగంట ఇస్తారేమో.. అంతకు మించి కుదరదు. దాంతో పెళ్లి కూతురు చాలా అప్సెట్.
అప్పటికే జలుబుతో, అలసటతో ఉన్న అమ్మాయి మరింత డీలా పడిపోయింది. ఆరోజు అట్లాగే పెళ్లి కొడుకు వాళ్ళింటికి పసుపు బట్టలతో వెళ్లి కొద్దిసేపటి తర్వాత ముందే బుక్ చేసుకున్న హోటల్‌కి వెళ్లిపోయారు.
మరుసటి రోజు రిసెప్షన్.
అది కూడా క్రిస్టల్ ప్లాజా లోనే. పెళ్లి, రిసెప్షన్ రెండూ కూడా బాలీవుడ్ సినిమా సెట్టింగ్‌లా చాలా రిచ్‌గా. ఇరువైపులా వచ్చిన బంధువులను కొన్ని గ్రూప్‌లుగా విభజించి టేబుల్స్ అలాట్ చేశారు. అదే విధంగా మిత్రులకు, ఎవరికి కేటాయించిన టేబుల్ దగ్గర వాళ్ళు కూర్చోవడం..
పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు డాన్స్ చేస్తూ హాల్ లోకి వచ్చే ముందు అమ్మాయి తల్లిదండ్రులు జంటగా అందరికీ అభివాదం చేస్తూ వచ్చారు. ఆ వెనుక అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు.
కొత్త జంట డాన్స్, ఆ తర్వాత బ్రైడ్ మైడ్స్, గ్రూమ్ మైడ్స్ డాన్స్, ..డయాస్‌పై కూర్చున్న పెళ్లి కూతురు గురించి, పెళ్లి కొడుకు గురించి సన్నిహితులు ఆత్మీయ వాక్యం పలికారు.
ఆ తర్వాత హోరెత్తించే వాయిద్యాల మధ్య జనం చిందులేస్తూ.. తినేవాళ్లు తింటూ.. తాగే వాళ్ళు తాగుతూ.. ఊగిపోతూ.. తూగిపోతూ.. చిన్న పెద్ద ఆడ మగ వ్యత్యాసం లేకుండా.. నా లాంటి వాళ్ళు వాళ్ళని ఫోటోలు తీస్తూ..
ఇక తెల్లవారే సరికి పెళ్లికూతురుకి గొంతు పూడుకుపోయింది. ఆరో రోజు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో వ్రతం.
వ్రతం అవడం ఆలస్యం భోజనాలు చేసి ఎవరికి వాళ్లు బయలుదేరారు. ఓ వారం రోజుల పాటు సందడి చేసి అంతా వెళ్లిపోయారు. మరుసటి రోజు ఇల్లంతా శుభ్రం చేసి పెళ్ళికొడుకు పెళ్లికూతురు ఇల్లు ఖాళీ చేశారు.
ఇక్కడ పెళ్లి కూతురు వైపు అంతే. ఎక్కడివారక్కడ వెళ్లిపోయారు. ఆ ఇంట్లో వాళ్ళు తప్ప.
పెళ్లి కూతుర్ని చేసినప్పుడు, పెళ్లి రోజు ఉదయం చేసిన దీపారాధన, పెళ్లి వ్రతం అన్నింటికీ పురోహితుడికి బాగానే ముట్టచెప్పారు. ఆ సొమ్ము కాష్ ఇవ్వడం వల్ల వాళ్ళకి దానిపై టాక్స్ ఉండదు. పెళ్లి తేదీ పెట్టుకోగానే బ్రాహ్మడిని కూడా బుక్ చేసుకున్నారు. అతను న్యూజెర్సీలో ఉన్న వెంకటేశ్వరాలయంలో ఉద్యోగి కాబట్టి ఆ గుడికి అతని సేవలకు సంబంధించిన సొమ్ము చెల్లించాలి. అలాగే చెల్లించారు.
అయినా అతనికి డబ్బుతో కలిపి సంభావన మళ్ళీ సమర్పించుకున్నారు. అక్కడి పురోహితులు చాలా రిచ్ అట. ఆ విషయాలన్నీ దేవాలయాన్ని గురించి రాసినప్పుడు చెప్పుకుందాం సరేనా..
ఇప్పటికి సెలవ్. అమెరికా నుంచి చాలా విశేషాలు, విషయాలు మోసుకొచ్చాను. అవన్నీ ముందు ముందు చెప్పుకుందాం సరేనా..
వి. శాంతి ప్రబోధ
వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.