సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 14

0
2

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]

స్మిత్ సనియన్ ఎయిర్ & స్పేస్ మ్యూజియం

[dropcap]గ[/dropcap]గన తలంలో వీర విహారం చేసే లోహ విహంగాలు అదేనండీ విమానాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు దగ్గరగా చూస్తే..

చల్లని వెన్నెల పంచే చందమామ మీదకు మనిషిని మోసుకెళ్లిన అంతరిక్ష నౌక మన ముందు ఉంటే.. వావ్ కదా!

అవును, అటువంటి అరుదైన, అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది.

డిసెంబర్ 14, 2022 స్పేస్ మ్యూజియం చూస్తారా అడిగాడు మేనల్లుడు వాసు.

అంతలో చాలా బాగుందమ్మా. అస్సలు మిస్ కాకూడదు. విమానాలు, మిస్సైళ్లు, శాటిలైట్, స్పేస్ షటిల్స్ ఉన్నాయ్. నీకు నచ్చుతుంది అన్నది మా అమ్మాయి సాధన. అవును ఆంటీ మీకు నచ్చుతుంది అని వంత పాడింది మేనల్లుడి భార్య అలేఖ్య.

మా అమ్మాయి వాళ్ళు పదిహేను రోజుల క్రితమే చూశారు. అయినా నా కోసం పిల్లల్తో బయలు దేరింది.

వాసు ఆఫీసు వర్క్‌లో ఉన్నాడు. కాల్స్ అటెండ్ చేస్తూనే మమ్మల్ని చాంటిలీలో ఉన్న స్మిత్ సనియన్ ఎయిర్ & స్పేస్ మ్యూజియం దగ్గర ఉదయం పదిగంటలకు దింపి వెళ్ళాడు.

Steven F. Udvar – Hazy Center కి మేం వెళ్లేసరికి ఖాళీగా ఉంది. సందర్శకులు తక్కువగా ఉన్నారు.

మేం అలా చూస్తూ కారిడార్‌లో ముందుకు నడుస్తున్నాం.

స్మిత్ సనియన్ విమాన, అంతరిక్ష మ్యూజియం ప్రపంచంలోనే పెద్దది అని అక్కడ ఉన్న బోర్డు చెప్పింది.

లోనికి వెళ్ళగానే కుడివైపు ఎయిర్బస్ ఐమాక్స్ థియేటర్, ఇన్ఫర్మేషన్ సెంటర్, ఎడమవైపు షాప్, ఫుడ్ కోర్ట్ కనిపించాయి.

గ్యాలరీల్లో ఎన్నెన్నో విషయాలు వెల్లడించే ఎయిర్ క్రాఫ్ట్‌లు మనని రా రమ్మని ఆహ్వానిస్తుంటే, ఎదురుగా కొద్దిగా ముందుకు వెళ్ళగానే కుడి ఎడమల హాంగర్‌లకు వేలాడుతూ కనిపించే చారిత్రాత్మకమైన ఎయిర్ క్రాఫ్ట్‌లు, స్పేస్ క్రాఫ్ట్‌లు పలకరించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అనిపించింది.

స్పేస్ సైన్స్ గురించి చదివే విద్యార్థులు, చూడడానికి వచ్చే పిల్లలు కనిపించారు.

రాకెట్ బొమ్మ దగ్గర డొనేషన్స్ అని రాసి ఉంది.

కొన్ని విమానాలు నిజమైనవి. కొన్ని వాటి లాగా తయారు చేసినవి. పాతవైతే కొత్తగా మెరవకుండా ఉంటాయి.

ఒకతను కనిపించి మమ్మల్ని పలుకరించాడు.

ఎక్కడనుండి వచ్చారు అని అడిగితే నేను ఇండియా అని చెబుతుంటే మా సౌరవి ఐ ఆమ్ ఫ్రొం ఆస్ట్రేలియా అని టక్కున చెప్పింది. ఆస్ట్రేలియాలో ఎక్కడ అని అడిగితె సిడ్నీ అని చెప్పింది. ఆ రోజే కాదు అంతకు ముందు కూడా వాసు వాళ్ళ ఫ్రెండ్స్‌కి అదే విధంగా చెప్పింది. తాను ఇండియన్ అని చెప్పడానికి అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళమ్మ నాన్న ఇండియన్ ఆస్ట్రేలియాన్స్ కానీ తాను మాత్రం ఆస్ట్రేలియన్ అని చెప్పటం విని ఆశ్చర్యపోయా. ఇప్పుడు మరోసారి. పెద్దలు కాదు పిల్లలు కూడా తమ గుర్తింపుకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అనుకున్నాను.

నీకు ఎన్నేళ్లు అని అడిగాడతను. ఆరేళ్ళు అని చెప్పింది. నువ్వు ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతావా అని అడిగితే నో అని సౌరవి సమాధానం.

ప్రపంచంలో వేగవంతమైన జెట్ విమానం బ్లాక్ బర్డ్ నడిపిన వ్యక్తి, అమెరికా విమానయానం & అంతరిక్ష విభాగంలో కీలకమైన వ్యక్తి అయిన అతను నడిపిన రకరకాల ఎయిర్ క్రాఫ్ట్‌ల గురించి, తన అనుభవం నుంచి ఎన్నెన్నో విషయాలు దాదాపు ఇరవై నిమిషాలు ఎంతో ఉత్సాహంగా వివరించారు. పదవీ విరమణ తర్వాత ఈ మ్యూజియంలో సందర్శకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వాలంటరింగ్ చేస్తున్నాడట. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అన్నాడు. ఇంకా ఏమీ చూడకుండా మా దగ్గర ప్రశ్నలేమి ఉంటాయి? మ్యూజియం చూసిన తర్వాత మా సందేహాలు అడుగుతాం అని చెబితే మరో 20 నిమిషాల్లో తాను వెళ్ళిపోతున్నానని అతని సమాధానం (అతని పేరు గుర్తు రావడం లేదు).

అతని షర్ట్ పై అతని విజయానికి గుర్తుగా ముప్పై మెడల్స్ కొలువై ఉన్నాయి. మా ప్రశ్నకు వాటి గురించి వివరించాడు. ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అతి సామాన్యమైన వ్యక్తులతో స్నేహంగా మాట్లాడుతుంటే ఫిదా అయిపోయి ఒక ఫోటో అడిగాను.

ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం మొత్తం వివిధ సమయాల్లో తయారైన రకరకాల ఎయిర్ క్రాఫ్ట్స్ అవి చేసిన సేవలు, అంతరిక్షయానంలో సాధించిన పురోభివృద్ధిని తెలిపే అంతరిక్ష నౌకలు ఎటు చూడాలో తెలియని అయోమయంలో పడేస్తాయి.

నా అయోమయాన్ని గమనించిందేమో, అమ్మా ఇటు నుండి చూస్తూ వెళ్దాం అన్నది మా అమ్మాయి. అంతలో సౌరవి, సుచిర్ నిలిపివున్న హెలికాఫ్టర్ వైపు పరిగెత్తి ఎక్కి కూర్చున్నారు. గతంలో వచ్చినప్పుడు ఎక్కిన అనుభవం ఉన్నది కదా..

మీట నొక్కుతూ అది కదులుంటే తానే నడుపుతున్నట్లు సుచిర్.

అమెరికాలో విమానయానం మొదలైనప్పటి నుంచి అంటే తొలి తరం విమానాల నుంచి ఇప్పటి వరకు తయారైన, వాడిన విమానాల నమూనాలు, అసలైనవి, తిరిగి తయారు చేసినవి అక్కడ మనకు దర్శనమిస్తాయి.

ప్రతి విమానానికి ఆ విమానం ఎవరు తయారు చేశారు. ఎన్ని గంటలు ఎగిరింది, ఎప్పుడు తయారయింది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు వాడారు, ఎన్నేళ్లు సేవలు అందించింది, స్మిత్ సనియన్‌కి ఎప్పుడు వచ్చింది తెలిపారు. ఎయిర్ రిక్రియేషన్ వెహికల్, రెక్కల పొడవు, ఎత్తు, బరువు, స్పీడ్ ఇంజిన్, బిల్డర్, కిట్ మ్యానుఫ్యాక్చరర్ వగైరా వివరాలున్నాయి.

ప్రతి చోట మీట నొక్కితే ఆడియో విజువల్‌గా సమాచారం అందుకునే సౌలభ్యం ఉంది. సుచిర్, సౌరవి లకు అది సరదాగా ఉండి బటన్ది నొక్కి వినేవాళ్ళు. ఎయిర్ క్రాఫ్ట్స్, స్పేస్ క్రాఫ్ట్స్ చూస్తూ మధ్యలో ఆడియో విజువల్స్ ఆన్ చేసేవారు.

విమానయానం, అంతరిక్ష అన్వేషణకు సంబంధించి 3000 పైగా యుద్ధ విమానాలు, వాటి నమూనాలు అక్కడ పదిలపరిచారు. ఆ విమానాల్లో ఎన్ని రకాల విమానాలో.. మానవ మేధస్సు ఎంత గొప్పది. ఎన్ని రకాల ఆవిష్కరణలు అచ్చెరువొందుతూ చూస్తున్నాను.

వర్టికల్ ఫ్లైట్స్, స్పోర్ట్ విమానయానం, మాములు విమానయానం, వ్యాపార విమానయానం, వాణిజ్య పరమైన విమానయానం, రెండో ప్రపంచ యుద్ధ విమానయానం,

భూమినే కాదు స్పేస్‌ని కూడా వశపరుచుకుందుకు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వాడిన యుద్ధ విమానాలు, వాటి లాగా తయారు చేసిన మోడల్ విమానాలు, శక్తివంతమైన ఇంజిన్లు,

రెండో ప్రపంచ యుద్ధ జర్మన్ విమానయానం, 1920 ముందు విమానయానం, కొరియా & వియాత్నం కోల్డ్ వార్ విమానయానం, ఆధునిక మిలిటరీ విమానయానం,

అల్ట్రాలైట్ ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ సైన్స్, మానవ సహిత స్పేస్ ఫ్లైట్, శాటిలైట్స్, రాకెట్స్ & మిస్సైల్స్, ఏరోబాటిక్ విమానయానం.. చూస్తే కానీ తెలియదు విమానయానంలోని వైవిధ్యం.

ప్రదర్శనలు

2018 నుంచి ఎప్పటికప్పుడు కొత్తగా ఊహిస్తూ దాదాపు 23 ప్రదర్శనలు, మొదటి తరం విమానాలు, అమెరికాలో విమానయానం, చందమామ దగ్గరకి వెళ్లడం వాటి చరిత్ర ఎయిర్ మెయిల్ నుంచి ఎయిర్ లైన్స్ వరకు సాగిన అమెరికన్ ఎయిర్ రవాణా వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు.

జేమ్స్ ఎస్. మెక్డొనెల్ స్పేస్ హాంగర్‌లో ఉన్న అంతరిక్ష నౌక డిస్కవరీ చూడడం నన్ను చాలా ఉద్వేగానికి గురిచేసింది. స్పేస్ షటిల్ డిస్కవరీ గురించి విన్నాను. చాలా విన్నాను. కానీ చూస్తానని, చూడాలని ఎప్పుడు అనుకోలేదు. అనుకోనిది జరిగినప్పుడు వచ్చిన ఉద్వేగం అది.

అంతరిక్ష పరిశోధన మానవుడు సాధించిన గొప్ప విజయం. వాతావరణంలోకి, అంతరిక్షంలోకి వెళ్లాలనే ఆలోచన రావడమే అన్ని ఆవిష్కరణలకు కారణం, భవిష్యత్ పై దూరదృష్టితో ఎంతమంది శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు అందుకోసం కృషి చేసారో..

1961లో అంతరిక్షంలోకి వెళ్లిన రష్యన్ వ్యోమగామి యూరిగాగారిన్, ఆ తర్వాత వెళ్లిన వందల మంది వ్యోమగాములు, అక్కడ నెలల తరబడి ఉండి చేసిన ప్రయోగాలు, స్పేస్ స్టేషన్ నిర్మాణం అంటే సామాన్య విషయమా.. మానవ మేధకు అంతులేదని నిరూపించే స్పేస్ షటిల్ డిస్కవరీ, మెర్క్యూరీ క్యాప్సూల్ 15బి ఆవిష్కరణలు కళ్ళముందు.

అమెరికా రాకెట్ టెక్నాలజీలో చారిత్రాత్మక గుర్తింపు పొందిన ముఖ్యమైన రెడ్ స్టోన్ మిస్సైల్ ఒకటి.

దీన్ని మొదట 1953లో తయారు చేశారు. దీన్ని1958 లో ప్రయోగించారు. 320-400 కిలోమీటర్ల పరిధి.

జూపిటర్ సి ఆ రెడ్ స్టోన్ కొంత మార్పులు చేసి కృత్రిమ గ్రహం కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం, తర్వాత 1961లో మెర్క్యూరీ రెడ్ స్టోన్ మళ్ళీ మాడిఫై చేసారు

నీల్ ఆమ్ స్ట్రాంగ్ పేరు చిన్నప్పుడు విన్నాను. అతను అంతరిక్షంలోకి అందులో చంద్రమండలంలోకి వెళ్లిన మొదటి వ్యక్తిగా తెలుసు. అతన్ని చూడలేం కానీ అతను ధరించిన సూట్ పక్కన నుంచొని ఫోటో దిగడం నాకైతే గొప్ప అనుభవం.

విమానయానం, అంతరిక్షానికి సంబంధించి సందర్శకులకు వచ్చే సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని ఒక చోట చూసి అక్కడ ఆగాము. మా ముందు ఉన్నవాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చాలా ఓపికగా, వివరంగా చెప్బుతున్నారు ఆన్‌లైన్‌లో. మా వంతు రావడానికి చాలా సమయం పట్టేలా ఉందని మేం ముందుకు కదిలాం. అప్పటికే మా సుచిర్‌కి ఆకలి మొదలైంది.

సిములేటర్ రైడ్స్ కి వెళ్లాం

రైడ్ సిమ్యులేటర్‌కి వెళ్ళాం. 13 ఏళ్ల లోపు లేదా 122 cm కంటే తక్కువ ఎత్తు ఉన్న పిల్లలను అనుమతించం అని చెప్పడంతో సాధన పిల్లలను తీసుకుని ఫ్లైట్ సిమ్యులేటర్‌కి టికెట్ తీసుకుంది. నేను వర్చ్యువల్ రైడ్ ట్రాన్స్ పోర్టార్‌కి వెళ్లాను.

నేను వెళ్లిన రైడ్‌లో నలుగురు వెళ్ళవచ్చు. కానీ నేనొక్కదాన్నే వెళ్ళాను.

VR గాగుల్స్ ఇచ్చారు. అవి పెట్టుకుని బెల్ట్ పెట్టుకుని సిములేటర్ లో కూర్చున్నా.

భూమి మీద నుంచి స్పేస్ షటిల్‌లో అంతరిక్షంలోకి, చందమామ మీదకు ప్రయాణం భలే ఉంది. ఆ దోవలో ఇతర గ్రహాలను చూస్తూ, పలుకరిస్తూ.. నిజంగా వెళ్ళిన అద్భుతమైన అనుభూతి మిగిల్చింది ఆ రైడ్.

మూడు అంతస్తులుగా ఉన్న మ్యూజియం గబగబా పైపైన చూస్తే దాదాపు రెండు గంటలు పడ్తుంది. లేదంటే కనీసం నాలుగు గంటలు పడుతుంది. ఒక రోజంతా అయితే మంచిది.

స్త్రీలు, పురుషులకు వాష్ రూమ్స్ చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. పసిపిల్లల స్ట్రోలర్, వీల్ చైర్ లతో కూడా మ్యూజియం మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి చూడొచ్చు.

టికెట్ లేదు. ఫ్రీగా ఎంతసేపైనా చూడొచ్చు. కారు పార్కింగ్‌కి మాత్రం 15 డాలర్లు చెల్లించాల్సిందే. సాయంత్రం నాలుగు గంటల తర్వాత కారు పార్కింగ్ ఫ్రీ అట.

ఫెయిర్ ఫాక్స్ నుంచి, డ్యూల్స్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ నుంచి రవాణా సదుపాయం అందుబాటులో ఉంది.

ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదున్నర వరకు తెరిచి ఉంటుంది.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here