సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 15

0
54

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]

ఆ పద్ధతి అనుసరణీయం

నేను న్యూ జెర్సీ వెళ్లిన రెండో రోజు జరిగిన సంఘటన.

అంటే డిసెంబర్ 2 తేదీన, 2022.

ఆ రోజు చెల్లి కామేశ్వరి మొబైల్‌కి ఒక మెసేజ్ వచ్చింది.

అది వాళ్ళ ఏరియా కౌన్సిల్ నుంచి వచ్చింది. అంటే స్థానిక ప్రభుత్వం నుంచి అన్నమాట.

అదేంటి అంటే గత పదిహేడు గంటల్లో గంటకు ఏడు లీటర్ల చొప్పున 123 గ్యాలన్ల నీళ్లు వాడారు. ఉదయం ఐదు గంటల నుండీ వాడకం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడైనా నీళ్లు లీక్ అవుతున్నాయేమో చెక్ చేసుకోండి. ఒక వేళ లీకేజీ వల్ల కాకపోతే కారణం తెలుపుతూ సమాచారం ఇవ్వండి అని ఆ మెసేజ్ సారాంశం.

ఇంట్లో పెళ్లి ఉండడం వల్ల నీటి వాడకం పెరిగింది.

ఆశ్చర్యంగా లేదూ..!

అక్కడ మనలాగా ఎవరికి వారు వ్యక్తిగతంగా బోర్ వేసుకునే పద్ధతి లేదు. ప్రజలకు నీటి సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుంది.. ఆ నీరే మంచి నీరుగా తాగడానికి, ఇతర అవసరాలకు వాడతారు.

అక్కడి పద్ధతి ప్రకారం మనం ఎన్ని నీళ్లు వాడుకుంటే అంత బిల్ వస్తుంది. ప్రతి ఇంటికి నీటి వాడకానికి సంబంధించిన మీటర్లు ఉంటాయి. ఇదే పద్ధతి ఆస్ట్రేలియా లోను, స్వీడన్, ఫిన్లాండ్ లోను చూశాను.

మన దగ్గర ప్రభుత్వం తాగునీరు సరఫరా చేసి మీటర్లు పెడుతుంది కదా అలా అన్నమాట. కాకపోతే అన్ని అవసరాలకు అదే నీరు.

ఇంత వరకు ఒకే.

అసలు విషయం ఏమిటంటే, మన నీటి వాడకం అకస్మాత్తుగా పెరిగితే వినియోగదారుని అప్రమత్తం చేయడం.

ఈ పద్ధతి నన్ను చాలా ఆశ్చర్యమనిపించింది. ఇలా అలర్ట్ చేసే పద్ధతి ఆయా దేశాల్లో ఉందో లేదో తెలియదు. కానీ, ఎంతో విలువైన ప్రకృతి వనరు నీటిని వృథా కానీయకుండా అప్రమత్తం చేసే, వారు అనుసరించే పద్ధతి అందరికీ అనుసరణీయం కదా..

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here