సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 16

1
2

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]

కళాత్మకమైన లూరే కెవరిన్స్

[dropcap]ప్ర[/dropcap]కృతిలోకి ప్రయాణం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అందరికీ ఆసక్తి, ఉత్సాహమే. కదా!

అందులోనూ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలోకి వెళ్లి చూడటం అంటే మరింత ఉత్సాహం. ముందు రోజు సాయంకాలం ట్రిప్ ప్లాన్ చేశారు. ఉదయం అందరం ప్రయాణానికి సిద్ధ మై పోయాం.

అది డిసెంబర్ 17, 2022

ఉదయం దాదాపు తొమ్మిది గంటల సమయంలో వర్జీనియాలోని సౌత్ రైడింగ్ నుండి మా ప్రయాణం లూరే కెవరిన్స్‌కి ప్రారంభమైంది.

మేనల్లుడు వాసు డ్రైవింగ్ లో నేను, మా అమ్మాయి పిల్లలు సౌరవి, సుచిర్, మేనల్లుడి పిల్లలు సన్సిత, ఇశ్విత ఒక కారులో, రాజేష్ డ్రైవింగ్‌లో మా అమ్మాయి సాధన, మేనల్లుడి భార్య అలేఖ్య మరో కారులో బయలుదేరాం. ఆస్ట్రేలియాలో ఉండే మా అమ్మాయి వాళ్ళకి అమెరికా డ్రైవింగ్ కొత్త. కుడి ఎడమల పొరపాటు జరిగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ముందు రోజు కొద్దిగా ప్రాక్టీస్ చేసిన రాజేష్ స్టీరింగ్ తీసుకున్నాడు.

పిల్లలు తమ ఆటపాటలతో వాళ్ళను వాళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు.

నేను వాసు ముచ్చట్లలో అమెరికా, ఇండియాకు చక్కర్లు కొడుతూ సాగుతున్నాం. మమ్మల్ని అనుసరిస్తూ రాజేష్ వాళ్ళ కారు.

ఆకాశాన్ని పలకరిస్తూ ఎదిగిన వృక్షాలు నేలకేసి ఆకుల్ని విదిల్చిన ప్రకృతి కొన్ని చోట్ల పచ్చగా, చాలా చిక్కగా.. విశాలమైన రోడ్లలో జుయ్ప అంటూ సాగిపోతున్న కారు.. మధ్యలో రోడ్డుతో పాటు సాగిన రైలు పట్టాలు, పట్టాల మీదుగా వెళ్తున్న రైలు.. ఆ చల్లని వేళ. అక్కడక్కడ, అప్పుడప్పుడు పులకరించిపోయే భానుడు. పులకరించిన ఆకులూ అలములు బంగారు వర్ణంలో మెరుస్తూ..

షానండోవా రివర్ స్టేట్ పార్క్ , షానండోవా లోయలోకి వచ్చేసాం.

ముందు రోజు కురిసిన మంచు దుప్పటి కప్పుకున్న శిఖరాగ్రాలపై ఎండపొడ పడి తళతళ మెరుస్తూ కనిపిస్తున్నాయి. చిక్కదనం నింపుకున్న అడవులు.. పచ్చని పచ్చని విశాలమైన పచ్చిక బయళ్లు.. అక్కడక్కడ కనిపించే కోత యంత్రాలు, మొక్కజొన్న, గోధుమ కోసిన ఆనవాళ్లు.. చూస్తూ సాగుతున్నాం.

ఆ చేలల్లో ఎక్కడైనా ఒకటి నిలువుగా పొడవుగా ఆకాశంలోకి చూసే కట్టడాలు చూపుతూ అవేంటి అడిగాను. పాత కాలంలో మనం వెదురుతో తయారు చేసిన గుమ్ములు, ఇళ్ల ముందు కట్టే పురులు లాగే ఇక్కడ ధ్యానం నిల్వ చేసుకోవడానికి కట్టుకున్న కట్టడాలు.. అని చెప్పాడు.

షానండోవా నేషనల్ పార్క్‌కి వేసవి వారాంతాల్లో హైకింగ్ చేయడానికి, క్యాంపింగ్‌కి తాను నాలుగైదు సార్లు వచ్చానని చెప్పాడు వాసు. ఇక్కడికి రావడానికి ఔత్సాహికులు చాలా ఇష్టపడతారనీ. ఏ సీజన్‌లో వచ్చినా కొత్త కొత్త అందాలను ప్రదర్శించే లోయ అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. రహదారి నుండి పర్వతాల వైపుగా సాగిపోవడానికి చీలికలు అయిన అనేక ట్రయల్స్ కనిపిస్తూ ఉన్నాయి.

షానండోవా లోయలో చూడాల్సినవి చాలా ఉన్నాయనీ ఆ పర్వతాలను బ్లూ రిడ్జ్ మౌంటైన్స్ అంటారనీ చాలా విషయాలు చెప్పాడు. ఈ ప్రాంతంలో చాలా గుహలు ఉన్నాయట. వాటిలో లూరే కెవరిన్స్, స్కైలైన్ కెవరిన్స్ ముఖ్యమైనవి. పేరు పొందినవి.

లూరే కెవరిన్స్ వర్జీనియాలో పెద్దవి. తూర్పు అమెరికాలో భూమి లోపల ఉన్న కెవరిన్స్‌లలో లూరే కెవరిన్స్ పొడవైనవి, పెద్దవి. స్కైలైన్ కెవరిన్స్ లూరే కెవరిన్స్ కంటే చిన్నవి. ఇంకా పురాతనమైనవి. 60 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడినవి. కానీ వెనుక వెలుగులోకి వచ్చినవి.

ప్రకృతి ఎంత అందమైనదో అంత వింతైనది. ప్రశాంతంగా కనిపిస్తుంది.

నిజంగా ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందా.. మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని చెర పెడుతూనే ఉన్నాడు. తనలోని అనేకానేక సంఘర్షణలు, సంవేదనలు లోలోనే దాచిపెట్టి పైకి అలా కనిపిస్తుందా..

కనిపించే శిఖరాల్లా పచ్చని ప్రకృతి ఎద లోయల్లో మనిషి గుచ్చే గునపాలు దాచేసి నవ్వుతూ జీవకోటితో సహజీవనం చేస్తుంది. ఎప్పుడో తప్ప ఆగ్రహించదు.

అదంతా ఏమో గానీ, నాకైతే ఎంతో ప్రశాంతంగా హాయిని ఆహ్లాదాన్ని పంచుతూ..

పచ్చని పర్వతాలు, అందమైన లోయలు, అక్కడక్కడా నీళ్లు చిలకరిస్తూ, కొన్ని చోట్ల దూది పింజ లాంటి మంచు తునకలు వదులుతూ కొండకేసి సాగిపోయే మేఘమాలలను పలుకరిస్తూ, ఆ సౌందర్యం ఆస్వాదిస్తూ, అద్భుతమైన అనుభూతులతో.. నార్త్ వెస్ట్రన్ వర్జీనియాలోని లూరే కేవరిన్స్‌కి దాదాపు పన్నెండున్నర సమయంలో చేరుకున్నాం.

కారులో ఉన్నంత సేపూ తెలియలేదు కానీ కారు దిగగానే చల్లటి గాలులు చర్మాన్ని కోసేస్తున్నట్లుగా.. వాటికి తోడు చినుకులు..

ఆ ఉదయమో, ముందు రోజో కురిసిన మంచు లేక గడ్డకట్టిన నీరో తెలియదు కానీ అక్కడక్కడా మంచు ముద్దలు పక్కకు తోసేసి కనిపిస్తున్నాయి.

టికెట్స్ తెచ్చారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి సందర్శకులను లోపలికి పంపిస్తారు. వెళ్లి వరుసలో నించున్నాం. అందరం చలి దుస్తుల్లోనే ఉన్నప్పటికీ మొహాన్ని కప్పలేం కదా..

అడవుల, చెట్లు, సముద్రం ఇలా ప్రకృతిలోకి ప్రయాణం అంటే నాకెంతో ఇష్టం. గుహలు చూడాలన్న కుతూహలం కూడా ఉంది. కానీ, గుహల లోపల ఎలా ఉంటుందో అన్న భయం నాది. గుహ లోపలికి నేను సాధారణంగా వెళ్ళను. కారణం అక్కడ ఉండే గబ్బిలాలు, ఒకలాంటి వాసన వల్ల నాకు ఊపిరి అందదు. చాలా ఇబ్బంది కలుగుతుంది. కొంచెం భయం భయంగానే లోనికి బయలుదేరాను.

నా ఊహల్ని తలకిందులు చేస్తూ లోపల.. వెళ్లక పోతే ఎంత కోల్పోయేదాన్నో..

లోపల అడుగు పెట్టగానే అదో అద్భుత ప్రపంచం. ఓ మాయా ప్రపంచంలా అగుపిస్తూ..

అసలు ఎటు చూడాలో ఏది కళ్ళలో పదిలపరుచుకోవాలో తెలియని అయోమయం మొదట మొబైల్ తీసి క్లిక్ మనిపించడం కూడా మరచిపోయా.

ఆ గుహల గోడల, పై కప్పు, అంతా ఎంతో నైపుణ్యం ఉన్న కళాకారుడు అందంగా అలంకరించినట్లుగా.. స్పటికల్లా మెరిసిపోతున్న ఆకృతులు.

మనిషి ఎంత నైపుణ్యంతో చేసిన అలంకరణ అయినా, ప్రకృతి చేసే అలంకరణ ముందు దిగదుడుపే అనిపించింది. ప్రకృతి నైపుణ్యం ముందు మనిషి ఎంత..

ఖరీదైన పెళ్లిలోనో మరేదో ఫంక్షన్‌లో చేసిన అలంకరణ ఏమాత్రం పనికిరాదు ఈ ఆకృతుల ముందు అంటూ మా పిల్లలు. కొన్ని వింత వింత ఆకృతులను విస్మయంతో చూస్తూ కొన్ని చోట్ల మొబైల్‌లో బంధిస్తూ..

గుహలు ఏర్పడడానికి కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాలు పడుతుంది. అనేక భూగర్భ ప్రక్రియల వలన ఏర్పడతాయని చదువుకున్నాం. భూగర్భంలో జరిగే రసాయన చర్యలు, నీటి కోత, ఒత్తిడి, టెక్టోనిక్ బలాలు, వాతావరణ ప్రభావం, సూక్ష్మక్రిములు వంటి అనేక అంశాలు గుహలు ఏర్పడడానికి కారణం అవుతాయని తెలుసు.

కానీ ఇంత అద్భుతమైన గుహలు ఉంటాయని అస్సలు ఊహించలేదు. షానండోవా లోయలో 40 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడిన గుహలు లూరే కెవరిన్స్. భూగర్భంలో 64 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.

వీటిలో ఉన్న పగుళ్ల గుండా ప్రవహించే నీరు రాతిని కరిగించుకుంటా పోవడంతో పగుళ్లు విస్తరించి గుహలు ఏర్పడతాయి. ఈ గుహలు కూడా నీటి ప్రవాహాల కోతల వలన ఏర్పడినవే.

భూమి లోపల ప్రవహించే నదులు, సున్నపురాయి, బంకమట్టి పొరలతో ఏర్పడిన గుహల్లో కొంతకాలానికి మట్టి కొట్టుకుపోయి సున్నపురాతి ఆకృతులు మాత్రమే మిగిలాయి.

స్టాలగమైట్స్, స్టాలక్టైట్స్ లవణాలతో కూడిన నీళ్లు చుక్క చుక్క గుహల పై భాగం నుండి, గోడల నుండి జారుతుంటే వింత వింత ఆకృతులు సంతరించుకున్నాయి. మన ఊహకు పరీక్ష పెడుతూ.. వివిధ ఆకృతుల్లో శిలా స్పటికాలు, ఆకృతులు అలంకరణ చేసుకున్నాయి.

ఒక గుహ నుండి మరో గుహ లోకి వెళ్ళడానికి గుహలను అనుసంధానం చేస్తూ ఎక్కడికక్కడ చక్కటి దార్లు, వంతెనలు. వీల్ చైర్‌తో, బేబీ స్ట్రోలర్‌తో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లోపలంతా తిరిగే విధంగా బాటలు.

భూ ఉపరితలానికి 80 -120 అడుగుల లోతులో ఉన్న గుహలు అంటే దాదాపు పది పన్నెండు అంతస్తుల ఎత్తులో కనిపించే లోపలి సీలింగ్. గుహ లోపల సీలింగ్ నుంచి వేలాడే ఆకృతులకు, నేలపై నిలిచిన ఆకృతులకు ఆధునిక దీపాలంకరణ.. ఆ వింత వింత ఆకృతులు కొన్ని దీప స్తంభం లాగా, రకరకాల షాండ్లియర్స్ లాగ, పూలమాలలు వేలాడుతున్నట్లుగా.. ఎన్ని రకాల ఆకృతులో.. ఎన్నెన్ని ఆకృతుల్లో.. వాటిని ఎలా వర్ణించాలో మాటలు తెలియడం లేదు.

ఎవరికి తోచినట్టు వారు ఆ ఆకృతులకు రూపం ఇచ్చుకుంటూ మా వాళ్ళు ముందుకు సాగుతున్నారు. నాకు అసలు అక్కడ నుండి కదలాలని అనిపించడం లేదు.

ఎక్కడికక్కడ రాళ్లపై, ఆకృతులపై వాటిని ఫోకస్ చేస్తూ అమర్చిన దీపకాంతులతో.. అత్యద్భుతంగా అగుపిస్తూ..

సిల్వర్ సీ నీటి ప్రవాహం, డ్రీం లేక్ గుహలలో కనిపించాయి. స్వచ్ఛంగా పారదర్శకంగా కనిపించే ఆ నీటి ప్రవాహాల లోతు 18 నుంచి 20 ఇంచుల లోపే. ఆ నీటిలో చుట్టుపక్కల పరిసరాలు స్పష్టంగా ప్రతిబింబిస్తూ..

అలా చూస్తూ జైంట్స్ హాల్ లోకి వచ్చాము. అందరిని నిశ్శబ్దంగా ఉండమని, నిశ్శబ్దంగా ఉంటే మీకు సంగీతం వినిపిస్తుంది అంటూ ఓ ప్రకటన వినిపించింది.

చిన్నా పెద్ద సందర్శకులంతా మౌనం.. అప్పుడు కనిపించింది ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్. అది stalace pipe ఆర్గాన్ ప్రపంచంలో అతిపెద్ద మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ అని ఓ గొంతు వినిపించింది. ఆ తర్వాత స్టాలక్టైట్స్ పాడుతున్నట్టుగా.. చెవులకు వింత సంగీతం మంద్రంగా.. అక్కడున్న అందరం చెవులప్పగించి ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాం. ఆ సంగీతం ఆగిన తర్వాత కెవరిన్‌లో మూడు ఎకరాల్లో వినిపిస్తుందని చెప్పారు.

పుణ్య నదులు అని పిలుచుకునే గోదావరి, కృష్ణ వంటి నదులు లేదా పుణ్య తీర్థాలు, పవిత్ర స్థలాల్లో కోనేటిలో భక్తి శ్రద్ధలతో చిల్లర పైసలు వేయడం మనవాళ్లకు అలవాటు. కానీ అమెరికాలో కూడా ఈ అలవాటు ఉండటం ఆశ్చర్యమే.. అక్కడ చిన్న నీటి సరస్సులో కొందరు చిల్లర పైసలు వేయడం చూశా. పరికించి చూస్తే ఆ నీటి అడుగు నుండి కనిపించే చిల్లర నాణేలు.. కుప్పలు కుప్పలుగా.. ఇంకా రెండడుగులు వేయగానే ఒక బోర్డు. ఆ నాణేలను ఏడాదికొకసారి తీసి మెడికల్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్‌గా స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారని రాసి ఉంది. 1954 నుండి 2017 వరకు ప్రతి పదేళ్లకు వచ్చిన సొమ్ము, అది ఎవరికి ఇచ్చారో ఎందుకు ఇచ్చారో రాసి ఉంది.

ప్రతి పదేళ్లకు జనం వేసే సొమ్ము చాలా పెరిగిపోతున్నది. ఉదాహరణకి చూడండి. 1991-2000లో $163,500 అయితే 2001- 2010 నాటికి అది $486,194.

అది చూస్తే మనుషులు ఎక్కడున్నా ఒకటే. అది భారతదేశం కావచ్చు. అమెరికా కావచ్చు. మరో దేశం కావచ్చు. తన మీదకంటే, ఎదుట ఉన్న మనిషి మీద కంటే కనిపించని శక్తులపై జనం ఎక్కువ నమ్మకం ఉంచుతారని అర్థమైంది. అదే కాకుండా లూరే కేవరిన్స్‌ని సందర్శించే సందర్శకుల సంఖ్య పెరుగుతూ ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ఏదేమైనా ఆ సొమ్ము ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తూ చాలా ముందు ఉన్న మా వాళ్ళ దగ్గరకు వడివడిగా నడిచా.

గుహలు ఏర్పడడానికి లక్షలాది సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ సజీవంగా అంటే పెరుగుతూ ఉన్నాయి గుహలోని ఆకృతులు. కొత్తగా ఒక క్యూబిక్ ఇంచి పెరగడానికి దాదాపు 120 ఏళ్లు పడుతుంది. అంటే ఈ గుహాలలోని విభిన్న ఆకృతులు ఏర్పడడానికి ఎన్ని లక్షల ఏళ్లు పట్టిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రకృతి అందంగా అలంకరించిన పెద్ద పెద్ద ఆకృతులు కొన్ని నిలువుగా పై నుండి వేలాడుతున్నట్టు ఉన్నాయని ముందే చెప్పాను కదా. అలా పై నుంచి కిందకి వేలాడే వాటిని స్టాలక్టైట్స్ అనీ, నేల నుంచి పైకి పెరిగే ఆకృతులను స్టాలగ్మైట్స్ అంటారు. కొన్ని చోట్ల స్టాలక్టైట్స్, స్టాలగ్మైట్స్ రెండూ కలిసి పోవడం కూడా కనిపిస్తుంది. అట్లాగే గోడలకు పెరిగి కూడా కనిపిస్తుంది.

బయట ఉన్న చలి, చల్లదనం లోపల లేదు. 54 ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత అంటే మన 12 డిగ్రీలు ఉంది.

ఆ చీకటి గుహల్లో ఎక్కడికక్కడ అమర్చిన విద్యుత్ దీపాల నడుమ ఊహకు అందని ప్రకృతి వింతలు ఆస్వాదిస్తూ దాదాపు రెండు గంటల సమయం తెలియకుండా గడచిపోయింది. నాలుగేళ్ల పిల్లలు కూడా కాళ్ళ నొప్పి అనకుండా, విసుగు, అలసట లేకుండా కుతూహలంతో ఆసక్తిగా తిరిగి చూశారు.

హిస్టరీ & మిస్టరీ

1878లో ఈ గుహలను కనుగొన్నారు. బెంటోన్ పిక్సలి స్టెబ్బిన్స్ చల్లటి గాలి వస్తున్న ఒక బిలం చూశాడు. అతనితో పాటు విలియం క్యాంబెల్, ఆండ్రూ జె. క్యాంబెల్, అతని మేనల్లుడు 13 ఏళ్ల జాన్ క్విన్ట్ క్యాంబెల్ ఉన్నారు.

బెంటోన్ పిక్సలి స్టెబ్బిన్స్ ఫోటోగ్రాఫర్. బిలంలో ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలంతో దాని చుట్టూ తవ్వడం మొదలు పెట్టారు. అలా ఓ నాలుగు గంటలు తవ్విన తర్వాత ఒక కొవ్వొత్తి ఇచ్చి చిన్నగా ఉన్న ఆండ్రూ, క్విన్ట్ లను తాడు సహాయంతో లోపలికి దించారు. పెద్ద పెద్ద గదులుగా, విశాలంగా ఉన్న సున్నపు రాతి గుహలు , కొవ్వొత్తి వెలుతురులో మెరిసే ఆకృతులు కనిపించాయి.

తాము ఏదో కనుక్కున్నామనీ, అది తమను ధనవంతులను చేస్తుందని సంబరపడిపోయారు. తాము చూసిన బిలం గురించి ఎవరికీ చెప్పకుండా ఆ భూములు ఆండ్రూ, స్టెబ్బిన్స్ కొనుక్కున్నారు. తమకు తెలిసిన విషయాన్ని చెప్పకుండా దాచి కొన్నారని వర్జీనియా సుప్రీంకోర్టు 1881లో తప్పుపట్టింది.

ఈ గుహలను స్థానిక యువకులు కనుక్కోవడానికి ముందు నేటివ్ అమెరికన్లు వాడినట్లు ఆధారాలున్నాయి. 500 ఏళ్ల క్రితం నాటిదని భావించే నేటివ్ అమెరికన్ అమ్మాయి అస్థిపంజరం ఆ గుహల్లో దొరికింది.

గుహలు ప్రజలు చూడడం కోసం సిద్ధమయ్యాయి. కానీ ఆ గుహలపై రకరకాల ప్రచారాలు కూడా పెరిగాయి.

అలెగ్జాండర్ జె. బ్రాండ్ జూనియర్, అనే ట్రావెల్ రైటర్ న్యూ యార్క్ టైమ్స్‌లో సహజ సిద్ధంగా ఏర్పడిన లూరే గుహల గురించి రాశాడు. అందులో అతను ‘నేను ఇంతకు ముందెప్పుడూ ఇంత అందమైన, అద్భుతమైన గుహలు చూడలేదు’ అని స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ గుహల్లోని అందాలను పొగిడారు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో అరకేజీ ఈ గుహల గురించి రాస్తూ డిస్కవరీ ఆఫ్ సెంచరీ అని రాశారు.

ప్రపంచంలో ఎక్కడా ఏ గుహలోనూ పూర్తిగా స్టాలక్టైట్, స్టాలగ్మైట్ ఆకృతులు గుహ అంతా ఆక్రమించి లూరేలో ఉన్నట్టు లేవని స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ రిపోర్టులో 1880లో చెప్పింది

1981లో విద్యుదీకరణ చేశారు. ప్రపంచంలో కరెంట్ ఉన్న మొదటి గుహ, మొదట ఫోటోలు తీసిన గుహ కూడా ఇదే కావడం విశేషం.

అమెరికాలో ఉన్న గుహలన్నిటిలో యాత్రికులు ఎక్కువగా సందర్శించే గుహలు లూరే కెవరిన్స్. ప్రపంచంలోని ప్రైవేట్ కెవరిన్స్‌లో అతి ఎక్కువ సందర్శకులను ఆకర్షించే కెవరిన్స్ లూరే కెవరిన్స్ తూర్పు అమెరికాలో పెద్ద కెవరిన్స్. ప్రముఖమైన స్థలంగా మారింది. అంతర్జాతీయంగా దర్శనీయ స్థలాల లిస్టులో చేరింది.

ఇప్పుడు ఏటా లక్షలాది మంది యాత్రికులు/సందర్శకులు లూరే కెవరిన్స్‌కి వెళ్తున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతిగా కూర్చుని తినడానికి రెస్టారెంట్లు ఉన్నాయి.

3 ఎకరాల్లో మ్యూజియం ఉంది. ఆట వస్తువుల దుకాణం, గిఫ్ట్ షాప్ ఇంకా చాలా ఉన్నాయి.

పెద్దలకు 32$

పిల్లలు 6 -12 – 16డాలర్లు

సీనియర్ సిటిజన్స్ కి 29 డాలర్లు

ఈ టికెట్‌తో లూరే వాలీ మ్యూజియం, కార్ & క్యారెజ్ కార్వాన్ మ్యూజియం, టాయ్ టౌన్ జంక్షన్ కూడా చూడొచ్చు.

ఇంకా అక్కడ రోప్ అడ్వెంచర్ పార్క్, గార్డెన్ మేజ్ లకు టికెట్ కొనుక్కోవాలి.

మేం కార్ & క్యారేజ్ కార్వాన్ మ్యూజియం లోకి వెళ్లాం. ఇక్కడ 1725 నుంచి 1941 వరకు వాడిన 140 వాహనాలు, గుర్రపు బగ్గీలు ఉన్నాయి.

అట్లా చూస్తున్నప్పుడు 1875లో తయారైన బోట్ ఆకారంలో ఉన్న బేబీ బగ్గీ నన్ను ఆకర్షించింది. బహుశా దాని నుంచే ఇప్పటి స్ట్రోలర్ అభివృద్ధి చెంది ఉంటుంది.

1898 నాటి నాలుగు చక్రాల రిక్షా, 1920 నాటి మూడు చక్రాల గుర్రపు బండి, జీప్‌లు రకరకాల కార్లు, అమెరికన్ రోల్స్ రోయ్స్, ఎలక్ట్రిక్ మోటార్ చాలా రకాల మోడల్స్ చూశాం.

వాటి మధ్య 1909లో భారతీయులు వాడిన సైకిల్ తొక్కుతున్న వ్యక్తి ఫోటో అక్కడ ఉండడం విస్మయపరిచింది.

జెమ్ స్టోన్స్ మైనింగ్ కంపెనీ దాని చరిత్ర, బ్రిటిష్ కాలనీలు ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత ఆ కాలంలో వాడిన వస్తువులను పరిచయం చేసే మ్యూజియంకి వెళ్లాం.

అక్కడకు వెళ్ళగానే పిల్లలను ఓ గంట ఆకర్షించింది. శాంతి, స్వేచ్ఛలను కోరుతూ ఏర్పాటు చేసిన గంట అది. పిల్లలు దాన్ని మోగించడానికి సరదా పడ్డారు.

లోనకు వెళ్ళగానే యూరోపియున్ ల రాకకు ముందు షానేండోవా లోయలోని నేటివ్ అమెరికన్ మోడల్ పలకరించింది. జింక చర్మంతో చేసిన ఆనాటి సాంప్రదాయ దుస్తులతో, మెడలో లోయలో దొరికే ఎముకలు, గవ్వలు, రాళ్లు కలిపి తయారు చేసిన దండ, ముఖంపై, చేతులపై రంగులతో (పెయింటింగ్స్) అలంకరణ..

ఆ కాలంలో నేటివ్ అమెరికన్ తెగలు వాడిన రకరకాల రాతి పనిముట్లు, ఫర్నిచర్, టెర్రకోట, పింగాణీ వస్తువులు, ఇనప ఉపకరణాలు, ఆయుధాలు ఇలా చాలా చూసాం.

షానేండోవా లోయలో 1802 నాటి సిగార్, పత్రిక, 1780 నాటి లెదర్ హ్యాండ్ బ్యాగ్, వంట సామాగ్రి, కుట్టు మిషన్, పనిముట్లు, చెక్క దువ్వెన, పలక, సంగీత పరికరాలు, కుట్టుమిషను, కత్తెర, చెక్క రోలు, లేసులు, చరఖా ఇలా చాలా చూశాం.

ఇక్కడ ఆశ్చర్యపరిచిన ఓ విషయం గురించి చెప్పాలి. మనం బర్త్ సర్టిఫికెట్ గురించి ఈ మధ్య కాలంలో ఆలోచిస్తున్నాం. తీసుకుంటున్నాం. అంటే విదేశీ చదువులు, సిటిజెన్షిప్ అవసరాల కోసం. అదొక తప్పనిసరి అవసరంగా మారింది. కానీ 1813లో అందంగా డిజైన్ చేసిన ప్రింటెడ్ ఫార్మాట్‌లో అందమైన చేతి రాతతో రాసిన బర్త్ సర్టిఫికెట్ చూసి చాలా ఆశ్చర్యం. దాన్ని అప్పటి వాళ్ళు ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టుకునేవారని తెలుస్తున్నది.

షానేండోవా లోయలో దాదాపు రెండు వందల ఏళ్ల క్రితపు క్విల్ట్ పని చూసి అచ్చెరువొందాను. బేసిక్ రంగుల్ల మేళవింపుతో అందమైన డిజైన్ లతో చాలా కళాత్మకంగా ఉన్నాయి.

రంగు రాళ్ల మైన్ చూద్దామనుకునే సరికి సమయం అయిపోయింది. అక్కడ మైన్‌లో లభ్యమయ్యే రంగురాళ్ల దుకాణం కూడా మూసేసారు. లూరే కెవరిన్స్ ఉదయం 9 గం. నుండి సాయంత్రం 5 వరకు ఉంటుంది.

ఈ చుట్టుపక్కల చాలా చారిత్రాత్మక ప్రదేశాలున్నాయి. సమయాభావం వల్ల లూరే టౌన్ లోకి మేం వెళ్ళలేదు. దానికి తోడు పిల్లలు కూడా అలసిపోయారు. ఆకలి మీద ఉన్నారు. లూరే కెవరిన్స్ కళాత్మకతని, మనిషికి అంతు చిక్కని ప్రకృతి రహస్యాలని తలుచుకుంటూ మేం వెనుదిరిగాం.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here