Site icon Sanchika

సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 18

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]

హర్షీస్ చాక్లెట్ వరల్డ్

[dropcap]డి[/dropcap]సెంబర్ 26, 2022

మా ప్రయాణం నార్త్ బ్రౌన్స్విక్ నుంచి పెన్సిల్వేనియాలో ఉన్న హర్షీస్ చాక్లెట్ టౌన్‌కి రెండు కార్లలో ప్రారంభమైంది. చెల్లి కామేశ్వరి కారులో సాధన, రాజేష్, సౌరవి, సుచిర్ ఉన్నారు. శైలు కొడుకు కోడలు (స్నేహిత్ రక్షిత)తో నేను, అమ్మ, శైలూ ఉన్నాం.

అందమైన అడవులు, కొండలు ఎత్తుపల్లాల విశాలమైన దారిలో ప్రయాణం.. మధ్యలో పలకరించిన డెలావేర్ నది.. దానిపై తేలియాడే మంచు పలకలు.. ముందురోజు పడిన మంచు అలా తేలుతున్నదో లేక నీరు మంచుగా మారిందో..!

కొండ రాళ్ల మధ్య, మట్టి మధ్య పేరుకుపోయి తెల్లగా మిలమిలా మెరిసే మంచు కనులకింపుగా అగుపిస్తూ.. ఇంకాస్త ముందుకు పోతే ఖాళీ పొలాలు.. ఎండిపోయిన పొలాలు, ఆకు రాలిపోయిన తోటలూ.. మధ్య మధ్యలో మేమున్నామంటూ చెప్పే చిన్న చిన్న పట్టణాలు.. ఫిలడెల్ఫియా నగరం.. లాంకాస్టర్, హారిస్ బర్గ్, యూనివర్సిటీలు.. దాటుకుంటూ హైవేలో సాగిపోయాం.

మేం హర్షీస్ చాక్లెట్ టౌన్ చేరేసరికి 11.30 అయింది. విశాలమైన పార్కింగ్ స్థలంలో ఫర్లాంగు దూరంలో పార్కింగ్ దొరికింది.

హర్షీస్ చాక్లెట్ వరల్డ్ లోకి ప్రవేశించే ముందు రకరకాల కామిక్ చాక్లెట్ బొమ్మలు మమ్మల్ని ఆహ్వానం పలుకుతూ నిల్చున్నాయి.

పిల్లలు, పెద్దలు అటు పరుగులు పెట్టి ఫోటోకి ఫోజులు ఇవ్వడం మొదలైంది.

లోపలికి వెళ్ళేసరికి ఓ పక్క పెద్ద క్రిస్మస్ ట్రీ, కిట్ కాట్ చాక్లెట్ మాన్, హర్షీస్ కిస్సెస్ దగ్గర ఫోటోలు తీస్తున్న ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు.. మరో పక్క చాక్లెట్ ఇల్లు. ఆ ఆవరణ అంతా నక్షత్రాలు, క్రిస్మస్ అలంకరణతో వెలిగిపోతున్నది. అనేక చాక్లెట్ దుకాణాలు ఎక్కడికక్కడ ఫోటోలు తీసే ప్రొఫెషనల్స్.. హర్షీస్ చాక్లెట్ టౌన్ స్మృతులను భద్రం చేసి ఇస్తూ.. కావలసిన వాళ్ళు డాలర్లు చెల్లించి తీసుకుంటున్నారు.

మేం మాత్రం మా మొబైల్ ఫోన్ లకు పని చెప్పాం. మేమంతా ఆ బిజీలో ఉంటే చెల్లి కామేశ్వరి, అల్లుడు రాజేష్ క్యాండీ ఎక్సపెడిషన్ షో కి టికెట్ కొనుక్కుని వచ్చారు. ఆ షో కి ఇంకా చాలా సమయం ఉంది.

దగ్గరలో హర్షీస్ పార్క్ ఉంది. దానికి డే ప్యాకేజీ, నైట్ ప్యాకేజీ టిక్కెట్లు అమ్ముతున్నారు. డే ప్యాకేజీ టిక్కెట్లు అయిపోయాయి. నైట్ ప్యాకేజీ మాత్రం కొద్దిగా ఉన్నాయి. మేము తిరిగి వెళ్ళిపోవాలి కాబట్టి మేము తీసుకోలేదు.

ఈ లోగా హర్షీస్ చాక్లెట్ వరల్డ్ వారు ఏర్పాటు చేసిన హర్షీస్ చాక్లెట్ టూర్ కి వెళ్లాం. చాలా పెద్ద వరుసల్లో జనం. చూడడానికి వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఆ వరుసలో వెళ్తూ హర్షీస్ చరిత్ర చూస్తూ ముందుకు కదిలాం.

ఆరు కేబిన్స్ ఉన్నట్టున్నాయి ఒక్కొక్క ట్రైన్‌లో.. మా వంతు రాగానే మేం ఎక్కేసాం. దాంట్లో కూర్చుంటే చాలు అదే మనని తిప్పి తీసుకొచ్చి ఎక్కిన చోటే దింపేస్తుంది. ఇది ఉచితం. టికెట్ కొనాల్సిన పనిలేదు. ఎన్నిసార్లయినా వెళ్లి చూసిరావచ్చు. వీల్ చైర్ సదుపాయం కూడా ఉంది.

చాలా ఆసక్తి కలిగిస్తూ మొదట కోకోతో ఉన్న ఆఫ్రికన్ మహిళలు, కోడి కూసే వేళ పాలివ్వడానికి సిద్ధంగా ఉన్న ఆవులు, పచ్చిక బయళ్లు.. పాల సేకరణ, ఫ్యాక్టరీకి చేరిన కోకో గింజలను శుభ్రం చేయడం, వాటిని వేయించడం, పెద్ద పెద్ద వాన్ లలో వచ్చిన పాలు, పైపులో నుంచి వచ్చి పెద్ద పెద్ద గిన్నెల్లో మరిగి వచ్చే కమ్మని వాసన, రకరకాల మిశ్రమాలు ఎన్నింటినో కోకో, పాలలో కలిపే యంత్రాలు, చిక్కని పాకంలా యంత్రాలు, పాకంగా తయారైన దాన్ని ఆరబెట్టడం, తర్వాత పెద్ద పెద్ద షీట్స్ గా గిరగిరా తిరుగుతూ తర్వాత చిన్న చిన్న ముక్కలయ్యే చాక్లెట్, కన్వేయర్ బెల్టులపై కదిలే చాక్లెట్లు, వివిధ ఆకారాల్లోకి ఒదిగిపోయి కవర్ తొడుక్కుని అమ్మకానికి సిద్ధమయ్యే చాక్లెట్లు చూసాం. అంతా కలిపి అరగంటలో అయిపొయింది.

అదంతా పూర్తి చేసుకుని వచ్చేసరికి విజిటర్స్ ఫొటోలు అక్కడ స్క్రీన్ లపై వచ్చి పోతూ ఉన్నాయి. కావాలంటే ఆ ఫోటోల్లోంచి మనం మన ఫోటో కొనుక్కోవచ్చు. ఒక మంచి జ్ఞాపకంగా దాచుకోవచ్చు. బయటికి వచ్చే గేట్ దగ్గర అందరికీ ఉచితంగా తలా ఒక చాక్లెట్ ఇచ్చారు.

ఈ హర్షీస్ చాక్లెట్ కంపెనీ 1894 లో మొదలైంది. 1900 సంవత్సరంలో మొదటి చాక్లెట్ బార్ అమ్మారు. పూర్తి స్థాయిలో హర్షీస్ చాక్లెట్ ఫ్యాక్టరీగా ప్రారంభమైంది 1903లో. ఇప్పుడు హర్షీస్ మిల్క్ చాక్లెట్ తెలియని చాక్లెట్ ప్రియులు లేరేమో!

దీన్ని మిల్టన్ హర్షిస్ ప్రారంభించాడు. మొదట్లో తయారైన హర్షీస్ మిల్క్ చాక్లెట్ బార్ ఖరీదైనది. అందరూ కొనుక్కుని తినలేరు. అందుకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల చాక్లెట్లు తయారు చేయాలని తలపెట్టారు.

అలా తయారైన వాటిలో చాక్లెట్ కిస్సెస్,రీసెస్ కాండీ, హర్షీస్ ట్రాపికల్ చాకోలెట్, షుగర్ ఫ్రీ చాకోలెట్, 2007 హర్షిస్ 100 వందేళ్ల పండుగకు హర్షీస్ కిస్సెస్ అలా పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం 32 రకాల చాకోలెట్ ఉత్పతులు అందిస్తున్నది హర్షీస్.

అమెరికాలో మంచి గుర్తింపు పొందిన హర్షీస్ 2012 -16 మధ్య కాలంలో అంతర్జాతీయంగా వ్యాపించింది. ప్రస్తుతం తన ఉత్పత్తులను చైనా, ఇండియా, బ్రెజిల్, కెనడా, మెక్సికో వంటి దేశాలలో కూడా ప్రారంభించింది. మన దేశంలో హర్షీస్ ఫ్యాక్టరీ మధ్యప్రదేశ్‌లో ఉంది.

ప్రపంచంలో కోకో పంట ఎక్కువగా అంటే 70% పండేది పశ్చిమ ఆఫ్రికాలో. అందుకే హర్షీస్ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యురాలిగా హర్షీస్ పశ్చిమ ఆఫ్రికాలో కోకో రైతులకు, కోకో వ్యవసాయంపై పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టింది.

మనం చాక్లెట్ తింటూ ఉంటాం. కానీ అవి వేటితో తయారవుతాయో మనకు తెలియదు.

మనం తినే హర్షీస్ చాకోలెట్‌లో ఏమి వాడారో తెలుసుకుందాం. ప్రజల జీవన శైలి, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందరినీ సంతోషపెట్టడానికి హర్షిస్ చూస్తుందట. ఈ చాక్లెట్లలో ప్రధానంగా వాడేది కోకో, పామ్ ఆయిల్, పాలు, చక్కర. ఇవే కాకుండా రకరకాల పండ్ల గుజ్జు, జ్యూస్, బాదం, వేరుశనగ, నువ్వులు, క్రోనోల, సన్ ఫ్లవర్ వంటి గింజలు, వాటి నూనెలు, గోధుమ, మొక్కజొన్న, ఆలుగడ్డలపిండి, కొన్ని రకాల కృత్రిమ రంగులు, తేనె, వెనిగర్, ఈస్ట్ వంటివెన్నో చాక్లెట్లలో వాడతారు.

హర్షీస్ చాక్లెట్ తయారీ గురించి అక్కడ ఉన్న పోస్టర్ల ద్వారా చాలా సమాచారం తెలుసుకున్నాం. బోలెడన్ని చాక్లెట్‌లు కొన్నాం. అక్కడ రెస్టారెంట్లు కిక్కిరిసి ఉన్నాయి. క్యూ లైన్లలో నించుని తెచ్చుకోవాల్సిన స్థితి. ఒక్క ఆర్డర్ రావాలంటే కనీసం అరగంట పైనే సమయం పట్టింది. అందుబాటులో ఉన్న భోజనం చేసాం.

రకరకాల చాక్లెట్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీం, బేకరీ, బీర్, వైన్ వంటి వాటితో పాటు పిజ్జా, బర్గర్, చిప్స్ వంటివన్నీ అందుబాటులో ఉన్నాయి.

తయారీకి సంబంధించిన షో చూడడానికి అదే హర్షీస్ ఎక్సపెడిషన్‌కి మా సమయం ప్రకారం వెళ్ళాం. మేము లోనికి వెళ్ళేటప్పుడు మేము చాక్లెట్ తయారు చేస్తాం కావచ్చు అనుకున్నాం. కానీ అదేం లేదు. వెళ్ళేటప్పుడు అందరి చేతిలో ఒక బాక్స్ పెట్టారు.

ఆ బాక్స్ లో రకరకాల ఆకారాలు, సైజులు, రుచులలో ఉన్న హర్షీస్ చాక్లెట్లు ఉన్నాయి. ఒక చిన్న హాల్ లో కుర్చీలు బల్లలు, ఒక స్క్రీన్ ఉన్నాయి.

ఒక్కొక్క చాక్లెట్ ఎలా తయారవుతుందో, అవి తయారవడానికి ఏమి వాడతారో చరిత్ర అంతా స్క్రీన్ మీద చూపించారు. మధ్య మధ్యలో ఒకావిడ హర్షీస్ చాక్లెట్ పజిల్స్ ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ చెప్పింది. ఆ తర్వాత మరొకరు వచ్చి మరో గదిలోకి తీసుకుపోయారు. అక్కడ మొదట చాక్లెట్ తయారీ ప్రారంభించినప్పుడు వాడిన పరికరాలు చూపారు. అవి ఎలా పనిచేస్తాయో చెప్పారు. అలా ఒక అరగంట గడిచిపోయింది.

సినిమాటిక్‌గా చెప్పాలని ప్రయత్నించారు కానీ నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. ఒక్కొక్కరికి $ 20 డాలర్ల టికెట్ అనవసరం అనిపించింది.

మా అమ్మాయి సాధన మాత్రం అప్పుడప్పుడు ఫోన్‌లో బిజీగా.. కారణం దాదాపు మేము బయలుదేరిన సమయంలో మేనల్లుడు వాసు కుటుంబంతో పాటు, డల్లాస్‌లో ఉండే మరో మేనల్లుడు శశిధర్ భార్య స్వాతి పిల్లలతో వర్జీనియా వచ్చింది. వాళ్లంతా అదే రోజు హర్షీస్‌కి బయలు దేరారు. ఆ విషయం మాకు తెలుసు. కానీ స్వాతికి తెలియదు. తనను సర్ప్రైజ్ చేయాలని సాధన, వాసు భార్య అలేఖ్య అనుకున్నారు. స్వాతి, సాధన ఒకరికొకరు 2009 తర్వాత చూసుకోలేదు చెరొక దేశంలో ఉండడం వలన. అందుకే సాధన చాలా ఎక్సైట్ అవుతూ ఉంది.

సందర్శకులు చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారోనని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంది. అంతలో వాసు ఫోన్ చాకోలెట్ టూర్ నుంచి బయటకు వస్తున్నాం అని.

సరిగ్గా వాళ్ళు బయటికి వచ్చే చోటకు వెళ్లి నిలుచున్నారు సాధన, రాజేష్. మేమంతా కూడా అక్కడకు సమీపంలోనే ఉండి చూస్తున్నాం. ఆ క్షణాలను బంధించాలని.

హాయ్ అంటున్న సాధనని చూడగానే స్వాతి తెల్లబోయింది. తన కళ్లను తానే నమ్మలేకపోయింది. తర్వాత పక్కనే ఉన్న రాజేష్‌ని మొదటి సారి చూసింది. మరుక్షణంలోనే తేరుకుంది. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. నిజానికి మా అమెరికా పర్యటనలో వాళ్ళ ఇంటికి డల్లాస్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆరోగ్య కారణాల వల్ల వెళ్లలేక పోయాం. అది మాకు చాలా బాధగా, కొరతగా ఉంది. కారణం శశి చిన్నప్పటి నాతో చాలా దగ్గరగా పెరిగినవాడు. చనువుగా ఉంటాడు. సాధన, శశి వరుసకు బావమరదళ్ళు కానీ అన్నాచెల్లెళ్లలా పెరిగారు. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్లలేకపోయామని వెలితిగా ఉంది. అనుకోకుండా స్వాతిని పిల్లల్ని చూడగలిగాం. కానీ శశిని చూడలేదనే ఫీలింగ్ మమ్మల్ని వదల్లేదు.

నిజానికి సాధన మొదట హర్షీస్‌కి రాను అని చెప్పింది. ఎప్పుడైతే స్వాతి వాళ్లతో హర్షీస్ వెళ్తున్నట్టు అలేఖ్య చెప్పిందో అప్పుడే నిర్ణయించుకుంది తన ఆరోగ్య సమస్యను పక్కన పెట్టి బయలుదేరడానికి.

పిల్లలు అంతా ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ.. వాసు వాళ్ళు ఆ రోజు అక్కడే ఉంటున్నారు. సాయంత్రం హర్షీస్ పార్కుకి వెళ్తున్నారు. నైట్ ప్యాకేజీ బుక్ చేసుకున్నారు. కాబట్టి వాళ్లకు ఇబ్బంది లేదు. మేము తిరిగి వెళ్ళిపోవాలి. అంతలో స్వాతి పిల్లల్ని తీసుకుని షాపుల్లో చొరబడింది. సౌరవి, సుచిర్ లకు క్రిస్మస్ బహుమతులు ఏవో కొనిచ్చింది.

చూడాలనుకున్న వాళ్ళు నైట్ ప్యాకేజీ ఆఫ్టర్ డార్క్ టికెట్ ఒక్కొక్కరికి 65 డాలర్లు, పగలు రాత్రి ఎప్పుడైనా వెళ్ళడానికి 85 డాలర్లు. రెండు రోజులైతే 120 డాలర్లు.

హర్షీస్ పార్క్ రెండు రోజులకు 50 డాలర్లు, ఇలా రకరకాల ప్యాకేజీలు ఏవేవో ఉన్నాయి. పిల్లలతో వచ్చి రెండు రోజులు సరదాగా గడిపి, జేబులు ఖాళీ చేసుకోవడానికి పోవడానికి మంచి ప్లేస్. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల లోపు పిల్లలకి ప్రవేశం ఉచితం.

హర్షీస్ చాక్లెట్ వరల్డ్ 360 రోజులు తెరిచే ఉంటుంది. సాధారణంగా ఉదయం 9 నుంచి రాత్రి 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. అయితే సెలవు దినాల్లో సమయం మారుతూ ఉంటుంది. సెలవు రోజుల్లో రద్దీ చాలా ఎక్కువ.

మొత్తానికి చాక్లెట్ లాంటి తీయని జ్ఞాపకాలతో వెనుదిరిగాం.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

Exit mobile version