[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]
దూరపు కొండలు నునుపే..
[dropcap]అ[/dropcap]మెరికా అంటే పేదరికం తెలియని విలాసవంతమైన దేశం. డాలర్లు పండించే కలల ప్రపంచం. ఆ దేశంలో బిచ్చగాళ్ళు ఉంటారని అస్సలు ఊహించరు.
అందరు ఏమో కానీ నేనయితే న్యూయార్క్ నగర వీధుల్లో అంటే నగర ప్రధాన ప్రాంతం టైం స్క్వేర్‌లో బిచ్చగాళ్ళని అస్సలు ఊహించలేదు.
వాళ్ళని చూడగానే అమెరికా దేశ అధ్యక్షులు వచ్చినప్పటి విషయాలు మదిలోకి వచ్చి కొంత అయోమయంలో పడేశాయి.
2020లో అమెరికన్ మాజీ ప్రధాని ట్రంప్ వచ్చినప్పుడు పేదరికాన్ని కూల్చలేని పాలకులు పేదరికం, పేదలు, బిచ్చగాళ్ళ ఆకలి కేకలు, దైన్యపు చూపులు కనిపించకుండా ఆవలికి గెంటేసి రాచ మార్గమంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సంఘటన ఇంకా మరపు మడతల్లో పడలేదు కదా! అదే విధంగా ఇరవై ఏళ్ల క్రితం ఎప్పుడో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీధుల్లో బిచ్చగాళ్ళు కనిపించకుండా నగరం ఆవలికి తరలించడం కూడా కళ్ళ ముందుకు పరుగుపరుగున వచ్చింది.
డిసెంబర్ 21, 2022 న మా అమ్మాయి సాధన, అల్లుడు రాజేష్, పిల్లలు సౌరవి, సుచిర్ లతో కలసి న్యూయార్క్ నగర సందర్శనకు వెళ్ళాను. నగర సందర్శనకు ఓపెన్ టాప్ బస్సుకు టికెట్ తీసుకుని బస్సు టాప్ పైన కూర్చున్నాం. అలా వెళ్తున్నప్పుడు ఆకాశాన్ని అంటే హర్మ్యాల నడుమ, విద్యుత్ దీపాల ధగధగల మధ్య రోడ్డు పక్కన న్యూయార్క్ నగరానికి గుండెకాయ వంటి ప్రదేశం టైం స్క్వేర్‌లో కనిపించిన దృశ్యం నాకు అమితమైన ఆశ్చర్యం కలిగించింది. ఫోటో తీయడానికి ప్రయత్నించాను. కదిలే బస్సులోంచి సరిగ్గా రాలేదు. కానీ ఆ ఆతర్వాత ఓ వీధిలో నడుస్తున్నప్పుడు కనిపించిన దృశ్యాన్ని కెమెరాలో బంధించాను.
అది రోడ్డు మీద కూర్చుని అడుక్కునే వ్యక్తిది. అక్కడ అడుక్కోవడం మన దగ్గర లాగా చేయి చాచి అడుక్కోరు. అమ్మా రూపాయి అయ్యా రూపాయి అని అరుస్తూ అడగరు. చక్కగా ఏవో స్లొగన్స్ లాగా రాసుకొని కూర్చున్నారు.
ఆ విలాసవంతమైన, వ్యాపార నగరమైన న్యూయార్క్‌లో బిచ్చగాళ్లనే కాదు మత్తుపదార్ధాలు తీసుకుని రోడ్డుపై సీసాలు పగలకొట్టి గొడవపడే వాళ్ళను కూడా అదే రోజు మాన్హట్టన్ లో చూశాను.
అప్పుడు అర్థమైంది మన దేశంలో లాగే అగ్రరాజ్యంలోనూ ప్రజల మధ్య అంతరం చాలా ఎక్కువ ఉందని. పేదరికం ఆకలి అగ్ర రాజ్యంలోనూ తక్కువేం కాదని.
సిటీ హాల్, టైం స్క్యేర్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, రాక్ ఫిల్లర్ సెంటర్ లలో మన సుల్తాన్ బజార్, అమీర్ పేట్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్ బజార్లలాగే కనిపించాయి. జనంతో రద్దీగా ఉండే రోడ్లు, అక్కడి రోడ్డుపై రకరకాల వస్తువులు, తినుబండారాలు పెట్టి జరిగే చిన్న చిన్న వ్యాపారంలాగే కనిపించాయి. ట్రేడ్ సెంటరు, హడ్సన్ స్క్యేర్ లలో కూడా అదే పరిస్థితి.
అది క్రిస్మస్ సమయం కావడంతో భవనాలు, రోడ్లు పెళ్లికూతుర్లాగా ముస్తాబయ్యాయి. ఆ బజార్లలో రిక్షాలు మన మూడు చక్రాల రిక్షాలు.. ఆ రిక్షాల్లో చిద్విలాసంగా తిరిగే జనం.. చూసి మొదట గుడ్లప్పగించి చూశాను. ఆ తర్వాత ఫోటోలు తీశా. అయితే ఆ రిక్షాలు ఎక్కినా వాళ్ళు ఖరీదైన వాహనాలు లేక కాదు ఆ రిక్షాల్లో తిరిగేది.
ఆ ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ పెద్ద లగ్జరీ. అందుకే లోకల్ ట్రైన్‌లో తిరుగుతారు. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ఆ ప్రాంతాల్లో టూరిస్టులు నాలుగు రోడ్లు సరదాగా తిరగడానికి సైకిలు రిక్షా ఎక్కుతారట. గంటకి యాభై డాలర్లపైనే ఇచ్చి రైడ్ బుక్ చేసుకుని న్యూయార్క్ అందాలను ఆస్వాదిస్తూ గగనాన్ని అంటే భవనాలను తమ కెమెరాల్లో బంధిస్తూ చాలా ఆనందిస్తారట టూరిస్టులు. వాటిని పెడికాబ్ అంటారట.
మొత్తానికి న్యూయార్క్ నగరాన్ని చూస్తే దూరపు కొండలు నునుపు అన్న సామెత గుర్తొచ్చింది.
వి. శాంతి ప్రబోధ
వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.