[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]
కొలొంబోలో కొన్ని గంటలు
[dropcap]బం[/dropcap]డారు నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మాకు ఏర్పాటు చేసిన విడిది కాటమరాన్ పామ్ బీచ్‌కి చేరేప్పటికి తేదీ మారిపోయింది. 18వ తేదీ ముగిసి 19వ తేదీకి వచ్చేసాం.
నాకు ఇచ్చిన రూమ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. హమ్మయ్య మెట్లు ఎక్కి దిగే పని లేదు అని సంబరపడ్డాను. రూమ్ సౌకర్యంగానే ఉంది. కానీ ఎక్కడి నుంచో కీచురాళ్ళ రొద వినిపిస్తున్నది. నిద్ర పట్టడం లేదు.
బయట లైట్స్ తీసేసినట్లున్నారు. కిటికీ బయటికి చూస్తే అంధకారం. హోటల్ పేరులో పామ్ బీచ్ అని ఉంది అంటే దగ్గరలో బీచ్ ఉండొచ్చు అనుకుంటూ నిద్రకు ఉపక్రమించా. కానీ నిద్ర పట్టదే..
ఒక రోజంతా ఎలా కాలక్షేపం చేయడం.. బయటికి వెళ్లి దగ్గరలో చూడవలసినవి చూసి రావాలి అనుకుంటూ రేపటి గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నా..
ఓ గంట సేపు నిద్రపోయానో లేదో మెలకువ వచ్చేసింది. సమయం నాలుగున్నర గంటలు. బయటికి వెళితే అని ఆలోచిస్తూ కిటికీ తెరిచి చూశా .. ఎటువంటి సవ్వడి లేదు. చీకటి పొరలు వీడుతున్న జాడలు లేవు.
ఇంటర్నెట్ దోబూచులాడుతూ ఉన్నది.
ఎవరికీ మెసేజ్ పెట్టినా వెళ్లడం లేదు. రూమ్ నుండి బయటికి వచ్చి చూద్దామని బయటికి వస్తే ఆ నిశబ్దాన్ని చీలుస్తూ అలల సవ్వడి.
నేను ఊహించింది నిజమే.. సముద్రానికి సమీపంలో ఉన్నానని మనసు ఉరకలు వేసింది. కాళ్ళు సముద్ర ఘోష పసిగట్టాయి. అడుగులు అటుకేసి పడ్డాయి.
50 అడుగులు కారిడార్ లో నడిచాక స్విమ్మింగ్ పూల్ .. అక్కడి నుండి ఓ పది మెట్లు దిగితే కాళ్ళ కింద అంతా ఇసుక. అంతలో రాత్రి కాపలాదారు కనిపించాడు. అటు వెళ్ళొచ్చా అని అడిగాను. ఇంకా కొద్ది సేపు ఆగితే చీకటి విరిగిపోతుంది అని చెప్పాడు.
ఆ సవ్వడి వింటూ స్విమ్మింగ్ పూల్ గట్టుపైనే కాసేపు కూర్చుని సముద్రుడిని వింటున్నాను. వాతావరణం చలి కాకుండా ఇటు వేడి లేకుండా ఆహ్లాదకరంగా ఉంది. మన దేశంలో సముద్ర తీరాల్లో ఉన్నట్టుగానే తోచింది. రెక్కలు విప్పు కుంటున్న వెలుతురు జాడల్లో అల మెరుపులు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. సముద్రుడు రా రమ్మని పిలుస్తున్నాడు. నెమ్మదిగా అడుగులు అటుకేసి పడ్డాయి.
అప్పటికే జీవన వేటలో జాలర్లు లోపలికి వెళ్లిపోయారు. దూరంగా వారి పడవలు అగుపిస్తున్నాయి.
చిన్న ముత్యాలలాంటివి చెత్తా చెదారంతో కలసి అలలతో కొట్టుకొచ్చిన జాడలు. అవి ఏమిటో అర్ధం కాలేదు. పట్టుకుని చూసాను. ముత్యాలయితే కాదు. నున్నగా గట్టిగా ఉన్నాయి. గుండ్రంగా ఉన్నదానిని మధ్యలోకి కట్ చేస్తీలా ఉంటుందో అలా ఉన్నాయవి. ప్లాస్టిక్‌లా తేలికగాను ఉన్నాయి.
గతంలో నేను చూసిన సముద్ర తీరాల్లో ఎక్కడా, ఎప్పుడు ఇలాంటివి చూసిన జ్ఞాపకం లేదు.
ఇక్కడ ఏమైనా ప్రత్యేక సముద్ర జీవులు ఉన్నాయేమో.. లేక సముద్ర జీవుల విసర్జకాలేమో అని చేతిలోవి వదిలేసి చేయి కడుక్కున్నా..
మెత్తని, సన్నటి లేత గులాబీరంగు ఇసుకలో నేను నడచిన తీరం వెంబడి మొత్తం అవే కనిపిస్తున్నాయి. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడిచాను.
తన ఇష్టారాజ్యంగా వాడి తీరంలో పడేసిన చాకోలెట్, బిస్కెట్,చిప్స్ రేపర్లు, కూల్డ్రింక్ డబ్బాలు, ప్లాస్టిక్ వేస్ట్, కర్ర పుల్లలు .. అలలతో పాటు నీటిలో చేరి, మళ్ళీ అలలతో పాటు ఒడ్డుకు చేరాయి. వాటితో పాటే తెల్లగా మెరుపుతో ఆకట్టుకున్న ముత్యాల లాంటివి కానీ ముత్యాలు కాదు. నిజ్జంగా ముత్యాలైతే అలా అక్కడుంటాయా..? ఉండనిస్తారా?
వేటకు వెళ్లిన వాళ్ళు పోగా ఒకటి అరా జాలర్లు దూరంగా తప్పితే ఎవరు కనిపించడంలేదు.
మరి అవి ఏంటి? ప్రశ్న తొలుస్తూనే ఉన్నది. తెలుసుకోవాలని ఉత్సుకత పెరిగిపోతున్నది.
అంతలో ఓ జాలరి వైపుకి వస్తూ కనిపించాడు.
పలుకరించాను. అతనికి సింహళం తప్ప వేరే ఏమీ రాదట. అతను ఇంకా ఏదో చెప్పాడు. నాకు అర్ధం కాలేదు. అలలతో తీరానికి కొట్టుకొచ్చిన ముత్యాలవంటి వాటిని చూపిస్తూ అడిగాను. నడుస్తూనే ఏదో చెప్తూ వేగంగా వెళ్ళిపోయాడు. అతనేమన్నది నాకు బుర్ర అర్ధం చేసుకోలేకపోయింది.
అలా నడుస్తూ ఉండగానే పూర్తిగా తెల్లవారింది.
నాలాంటి ప్రయాణికులు, లేదా పర్యాటకులు వాకింగ్ కోసం వచ్చినట్లున్నారు. జన సంచారం కొద్ది కొద్దిగా మొదలవుతున్నది.
అంతలో నా సమీపంలోకి వచ్చాడు ఓ యువకుడు. అతని చేతిలో సంచితో. అతన్ని పలకరించాను ఇంగ్లీషులో. అతనికి కొద్దిగా ఇంగ్లీషు వచ్చు.
తమిళ యాసతో ఉన్న ఇంగ్లీషులో జవాబిచ్చాడు. అతనిపేరు అలీ. తమిళమా .. మద్రాసునుంచి వచ్చారా ప్రశ్నించాడు. కాదని చెప్పి నా సందేహం వెళ్ళగక్కాను.
అవి ప్లాస్టిక్ వ్యర్థాలు, అప్పుడయితే మోకాలు మునిగేంత వచ్చేవి అన్నాడతను.
అప్పుడంటే .. ఎప్పుడో ..
ఆశ్చర్యంలో ఉన్న నన్ను చూస్తూ ఎనిమిది నెలల క్రితం కొలొంబో తీరంలో మునిగిపోయిన నౌక గురించి తెలిసే ఉంటుందిగా అన్నాడతను.
నిజానికి ఆ నౌక గురించి నాకు ఏమి తెలియదు. అవునన్నట్టు కాదన్నట్లుగా తల ఊపాను.
అతనికి ఏమి అర్ధమైందో.. , గత జూన్‌లో కార్గో షిప్‌లో మంటలు వచ్చి నౌక మునిగిపోవడం గురించి చెప్పాడు.
ఆ షిప్ దాదాపు 1500 కంటైనర్లతో వస్తుండగా అగ్నిప్రమాదం జరిగి మునిగిపోయింది. అందులో ఉన్న వివిధ రసాయనాలు, ప్లాస్టిక్ దాదాపు రెండు వారాలపాటు మండి పోవడం వలన వాతావరణంతో పాటు సముద్ర జలాలు కూడా కలుషితం అయ్యాయి. జల సంపదకు పెద్ద విపత్తు వాటిల్లింది. సముద్రపు తాబేళ్లు , ఇతర జలచరాలు చచ్చిపోయి తీరానికి కొట్టుకొచ్చేవి. స్థానిక జాలర్ల జీవనంపై కోలుకోలేని దెబ్బ. వాళ్ళ జీవితం తెల్లారిలేస్తే సముద్రంలోనే వేటతోనే. సముద్రంపై తెట్టె కట్టిన ఆయిల్. రసాయనాలు మండిపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు అని చెప్పాడు.
ఇప్పటికి ఎనిమిది నెలలు గడచినా ఇంకా ఆ విధ్వంసం తాలూకు ఆనవాళ్లు పోలేదన్నమాట మనసు బాధగా మూలిగింది.
మేము ఉన్న ప్రదేశాన్ని నేగొమ్బో అంటారని అలీ చెప్పాడు. ఆ యువకుడు తమిళం, కొద్దిగా ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు.
ఇంత పొద్దున్నే వేటకు వెళుతూన్నారా అని అడిగినప్పుడు అసలు విషయం చెప్పాడు.
సూర్యోదయ సమయానికి బీచ్‌కి వచ్చేస్తాడట. బీచ్ లో తిరిగే పర్యాటకులకు/యాత్రికులకు తన వద్ద ఉన్న ముత్యాలు, సముద్రపు గవ్వలు, కొబ్బరి చిప్ప ముక్కలతో చేసిన రకరకాల ఆభరణాలు అమ్ముతూ ఉంటాడట. నన్ను తీసుకొమ్మని ముత్యాల దండలు చూపించాడు.
ముత్యాలు అన్నీ ఒకే షేప్‌లో లేవు. రంగులో కూడా తేడాలున్నాయి. తెలుపు గోధుమ మిశ్రమం, తెలుపు గులాబీ మిశ్రమం, ఊదారంగు, నలుపు ముత్యాలున్నాయి అతని దగ్గర. అవి చూస్తుంటే ఆర్టిఫిషియల్ కాదని అనిపించింది. పంటిమీద వేసి రాకితే గరుకుగా ఉంటే మంచి ముత్యాలని ఎప్పుడో ఎక్కడో చదివిన విషయం గుర్తొచ్చి వాటిని పరీక్షించాను. చూడడానికి నున్నగా మెరుస్తున్న ఆ ముత్యాలు పంటిమీద చాలా గరుకుగా ఉన్నాయి. అంటే మంచి ముత్యాలేనని నిర్ధారణకు వచ్చాను.
రామేశ్వరం వైపు సముద్రపు ముత్యపు చిప్పల లోంచి వచ్చిన ముత్యాలని చెప్పాడు.
కానీ వాటిని కొనడానికి నేను పర్స్ తేలేదు. అదే విషయం చెప్పాను. ఫర్వాలేదు తీసుకోండి. బోణీ మీదే. తర్వాత వచ్చి మీ దగ్గర డబ్బులు తీసుకుంటానని వెంట నాతో పాటు వస్తున్నాడు. మీ డబ్బులు నా దగ్గర లేవని చెప్పినా వినడు.
ఫర్వాలేదు అమెరికన్ డాలర్లు, ఆస్ట్రేలియన్ డాలర్, ఇండియన్ రూపాయి, శ్రీలంక రూపాయి ఏదైనా తీసుకుంటాను. లేదా కార్డు ఉన్నా హోటల్ వాళ్ళ ద్వారా కాష్ తీసుకోవచ్చు అని గబగబా చెప్పాడు.
సరేనని ముత్యాలు, మరో దండ తీసుకుని అతని బోణీ చేసాను. అప్పుడే అటుగా వస్తున్న నా తోటి ప్రయాణికులు ఢిల్లీ, పంజాబ్ వెళ్లాల్సిన వాళ్ళు ఇంట్లో వాళ్లకు వీడియో కాల్ చేసి చూపిస్తూ ఏవేవో తీసుకున్నారు.
ఆ తర్వాత డబ్బులు తీసుకుని అతని దగ్గరకు బయలు దేరాను.
అతనే మేమున్న చోటుకు వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న కొబ్బరి చెట్ల నీడన ఉన్నాడు. అతని చుట్టూ కొందరు గుమిగూడి బేరం చేస్తున్నారు. వాళ్ళకి నన్ను చూపిస్తూ శాంతి హైదరాబాదు బోణీ చేసింది. ఆమెకు మంచి ముత్యాల గురించి తెలుసు అంటూ చెబుతున్నాడు.
మాటలతో బాగానే వ్యాపారం చేస్తావు అంటే, నవ్వుతూ మీరు తీసుకున్నాక చూడండి ఎంత మంది కొన్నారో.. మంచి బోణీ అన్నాడు.
హైదరాబాద్ ప్రయాణం చేసే ప్రయాణికుల్లో సందీప్ కుటుంబం కూడా ఉంది. నా దగ్గరకి వచ్చి ఆంటీ మీరు చూడండి మా అమ్మ, మా ఆవిడ తీసుకుంటారు అని చెప్పాడు. అతను ఆస్ట్రేలియా పౌరుడు. హోటల్ బిజినెస్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా వదిలి మాతృదేశానికి శాశ్వతంగా వచ్చేస్తున్నాడు. హైదరాబాద్‌లో మామగారి వ్యాపారాలు చూసుకోవలసిన అవసరం ఉందని ఆ తర్వాత వాళ్ళమ్మ చెప్పింది.
వాళ్ళు కొన్నారు. అప్పుడు చూపించాడు నలుపు ముత్యాల దండ చూపించాడు. నేరేడు కాయల్లా భలే బాగున్నాయి. ఊదారంగు ముత్యాలు కూడా ఉన్నాయి అతని దగ్గర. కానీ వాటి ధర తెల్ల ముత్యాల ధరకంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంది. అంత రేటు పెట్టి కొన్నాక మా వాళ్ళు వద్దంటే.. ఆ సందేహంతో ఆగిపోయాను.
అవేవి నాకు నప్పవు. చెల్లెళ్లకి, మా అమ్మాయికి ఫోన్ చేసి వాళ్ళు కొనమంటే కొనాలని అనుకున్నా. నేను తీసుకుంటే సందీప్ వాళ్ళ అమ్మ కూడా తీసుకుంటానని చెప్పింది. సందీప్ భార్య శ్రీలక్ష్మి నా ఛాయ లోనే ఉంటుంది. కాబట్టి తనకు వద్దని చెప్పింది. వాళ్ళమ్మాయి పదేళ్ల శ్రేయ కోసం ముత్యాల దండ తీసుకుంది.
స్నానాదులు ముగించుకుని బ్రేక్ ఫాస్ట్ కోసం కాంటీన్ లోకి వచ్చేసరికి కొందరు పూర్తి చేసుకుని, కొందరు బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉన్నారు.
అన్నం, చేపల పులుసు, అట్టు, కొబ్బరి చెట్ని, సాంబారు, పూరీ, బన్, శాండ్విచ్, పళ్లరసాలు, పళ్లముక్కలు బ్రేక్‌ఫాస్ట్‌కు సిద్ధం చేశారు. ఇంత పొద్దున్నే అన్నం చేపల పులుసు ఏంటో అనుకుంటూనే తిన్నాను. చేపల పులుసు అదిరిపోయింది.
శ్రీలంక ప్రజలు మూడు పూటల అన్నం తింటారని. చేపలు బాగా తింటారని అక్కడి సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు తెల్సింది.
ఒక రోజంతా సమయం ఉంది. ఎటైనా బయటికి వెళ్లదామా అని సందీప్ వాళ్ళ అమ్మతో అన్నాను .
మాతోపాటే ప్రయాణం చేసిన ఇద్దరు చిన్న చిన్న పిల్లల తల్లి హైదరాబాదీ ముస్లిం యువతి. ఆవిడ కూడా మాతో వస్తానంది.
ఆ తల్లిని చూస్తే చాలా సానుభూతి కలిగింది. హోటల్‌కి చేరిన ఆ అర్ధరాత్రి పసిబిడ్డ పాలకోసం అల్లాడుతున్నారు. కొడుకు మూడేళ్ళవాడు. రెండురోజుల ప్రయాణంతో తిండి , నిద్ర సమయానికి లేక కొత్త మనుషుల మధ్య విసిగిపోయి ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోదామని గొడవ గొడవ చేసాడు. అదంతా గుర్తొచ్చి ఆవిడను చూసి పలకరింపుగా నవ్వి చిన్న పిల్లలతో ప్రయాణం చాలా కష్టం అన్నాను. అందుకు ఆవిడ కష్టం కాదు నరకం అంటే ఏంటో తెలుస్తున్నది. కానీ ఇది వాళ్లకు అర్థం కాదుగా.. నీ తిప్పలు నువ్వు పడాలి అంట. పిల్లలు నాకే గానీ తనకు కానట్టు అని ఇంటాయన గురించి చెప్పుకొచ్చింది. గోస వెళ్లబోసుకుంది.
డచ్ పోర్ట్ , (డచ్ వాళ్ళు వాడింది), ఫిష్ మార్కెట్ట్ దగ్గరలోనే ఉన్నాయని అలీ చెప్పిన విషయాలు గుర్తొచ్చి మొదట అటువెళ్లాలని అనుకున్నాను.
ఆంటీ మనందరం కలసి వెళదాం. మీరు ఉంటే మా అమ్మకు కూడా బాగుంటుంది అన్నాడు. సరే అన్నాను. వెహికల్ బుక్ చేశాడు అతను. మా ఎదురు చూపులోనే దాదాపు మూడుగంటల సమయం కరిగిపోయింది.
12 అవుతుండగా అప్పుడు వచ్చింది 10 సీటర్ వెహికల్. సందీప్ కుటుంబం ఐదుగురు, నేను,పిల్లలతో ముస్లిం యువతి అందరికీ సరిపోయే విధంగా పెద్ద వెహికల్ బుక్ చేశాడు. కానీ, వెహికల్ ఆలస్యం కావడంతో పిల్లల తల్లి తన ప్రయాణం విరమించుకుంది.
పెట్రోలు దొరకక ఆలస్యం అయిందని చెప్పాడు డ్రైవర్. శ్రీలంక దేశ ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయిందని, పెట్రోలు కొనలేని దుస్థితిలో దేశం ఉన్నదని అందువల్ల పెట్రోల్ కొరతగా ఉందని చెప్పాడు. దేశంలో ఉన్న కొద్ది పెట్రోలు ధర విపరీతంగా పెరిగిపోయిందని దాని ప్రభావంతో అన్ని వస్తువుల ధరలు ఆకాశానికి ఎగుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడతను.
రసాయనాల వల్ల జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని తీసుకున్న నిర్ణయం మంచిదేనంట కానీ అమలు చేసిన పద్ధతి బాగోలేదని ప్రజలు అనుకుంటున్నారని, కొందరయితే బాగా తిడుతున్నారని అన్నాడు.
విదేశీయులు తెల్లవాళ్లు ఆటోల్లో తిరగడం కనిపించింది. ఆటోలను టుక్ టుక్ అంటున్నారు
డ్రైవర్‌తో ముచ్చట్లు పెడుతూ నెగోమ్బో నుంచి కొలొంబో చేరుకున్నాం.. ప్రతి ఇంటి దొడ్లోనూ అరటి, పనస, కొబ్బరి వంటి మొక్కలు, ఇంటి పెరడంతా పచ్చదనంతో, ఇంటి ముందు అరుగులు వాటిపై కూర్చునే జనం.. కొలొంబో సబర్బ్ ఇళ్ళ వాతావరణం, బజార్లు, మార్కెట్లు చూస్తుంటే నాకు గ్రామీణ తమిళనాడు కనిపించింది.
నగరంలో సందులు గొందులు, గతుకుల రోడ్లు మన పాత హైదరాబాద్ నగరంలా ఉన్నట్లు తోచింది. సెంట్రల్ సిటీలో అపార్ట్మెంట్‌లు రెండు మూడు అంతస్తుల భవనాలు, విశాలమైన, శుభ్రమైన పుట్‌పాత్‌తో కూడిన రోడ్లు, రోడ్లపక్కన అక్కడక్కడా చెట్లు కనిపించాయి. వీధుల్లో తిరిగి అరుస్తూ అమ్ముకునే వాళ్ళు, రోడ్డు మీద పెట్టే కూరగాయలు, పళ్ళ అంగళ్ళు, ట్రాఫిక్, వాహనాల హారన్ చూస్తుంటే పరాయి దేశంలో ఉన్న భావనే కలుగలేదు.
ఇండిపెండెన్స్ హాల్, లోటస్ సిటీ టవర్, గంగరామయ బుద్దిస్ట్ టెంపుల్, బండారు నాయకే మెమోరియల్ హాల్, పాత పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసం, మీదుగా చైనా టౌన్ , న్యూ హార్బర్ , బీచ్ లు చూసాం.
తిరిగి వస్తున్నప్పుడు డచ్ కాలువను చూపించాడు. ఆ కాలువ మార్గంలో రవాణా జరిగేదని చెప్పాడు.
పాత కొలొంబోకి అంటే ప్రస్తుతం ఉన్న కొలొంబోకి, ఫోర్ట్ సిటీ అని పిలుస్తున్న ప్రాంతానికి వ్యత్యాసం నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. అధునాతనంగా నిర్మితమవుతూన్న కొత్తనగరానికి, న్యూ హార్బర్ తదితరులకు చైనా ఆర్ధిక సహాయం చేస్తున్నదని, సింగపూర్‌ని తలదన్నే లాగా మా కొలొంబో తయారవుతుందని, చూశారా .. బీచ్‌లు కూడా ఎంత సుందరంగా తయారయ్యాయో ఒక నవ్వు నవ్వేశాడు డ్రైవర్. అతనిది తమిళ మాతృభాష కానీ ఇంగ్లీషు బాగా మాట్లాడుతున్నాడు.
ఆ నవ్వులో ఏదో తెలియని బాధ ధ్వనించింది నాకు.
ఇంకేం మీకు పర్యాటకులు ఇంకా పెరుగుతారు అంటే మీకు బిజినెస్ పెరుగుతుంది అన్నాడు సందీప్.
ఒకప్పుడు మా దేశం పర్యాటకులతో కళకళలాడుతూ ఉండేది. మా దేశానికి మంచి ఆదాయం ఇచ్చేది. అంతా తారుమారైంది . జాతులమధ్య వైరం సమసిపోయిందనుకుంటే , మతాల మధ్య సమస్య, ఆ తర్వాత కోవిడ్ వచ్చి మమ్మల్ని బాగా దెబ్బ తీశాయి. ఇప్పుడు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నాం.
ఆకాశహర్మ్యాలు, ఏడు నక్షత్రాల హోటల్, నున్నటి విశాలమైన రోడ్లు, ఫ్లై ఓవర్లు, చూడ్డానికి అంతా అందంగానే కనిపిస్తుంది మీ బోటివాళ్లకు. కానీ మా బతుకులే ఏమైపోతాయో.. దేశ భవిష్యత్ ఏ రూపంలోకి పోతుందో అర్థం కావడం లేదన్నాడు.
మధ్యలో భోజనానికి మంచి హోటల్‌కి తీసుకుపొమ్మంటే ఇండియన్ రెస్టారెంట్‌కి తీసుకుపోయాడు. అక్కడ కూడా చేపల వేపుడు చాలా బాగుంది. తర్వాత షాపింగ్ చేద్దాం అనుకున్నారు సందీప్ వాళ్ళు. షాపింగ్‌కి తీసుకెళ్లమంటే ఆ డ్రైవర్ తీసుకువెళ్లిన ప్రాంతం అంతా మన చార్మినార్ ఏరియాని తలపిస్తూ సందులు గొందులుగా ఉంది. షాపింగ్ అంటే ఏ పెద్ద మాల్‌కో తీసుకుపోక ఇక్కడికి తీసుకొచ్చాడేంటి అని తిట్టుకున్నది సందీప్ భార్య శ్రీలక్ష్మి. వాళ్ళ పిల్లలు వర్షంతో తడిసిన ఆ రోడ్లలో నడవడానికి విసుక్కున్నారు. ఇండియా వెళ్తున్నంగా ముందే ఇక్కడ రిహార్సల్ అని నవ్వేసేవాడు. మొత్తానికి ఒక షాపులో కొన్ని బట్టలు కొని వెనక్కి తిరిగారు.
శ్రీలంకలో బాటిక్ ప్రింట్స్ ఫేమస్ కదా .. అవి కొనుక్కుంటారేమోనని ఇక్కడికి తీసుకొచ్చాను అదిగో .. ఆ షాప్ అదే అని ఒక చిన్న షాప్ చూపాడు.
అయ్యో .. కొనుక్కుంటే బాగుంటుంది అని మనసులో అనిపించినా ఆగి కొనే ఓపిక లేదు ఎవరికీ..
డ్రైవర్‌తో అప్పుడప్పుడు మాట కలుపుతూ ఏడున్నర గంటలకు మా వసతికి చేరుకున్నాం. భోజనాలు ముగించుకుని త్వరగా నిద్రకుపక్రమించాం. తెల్లవారుఝామున 4 గంటలకు ఎయిర్పోర్ట్ బస్ సిద్ధంగా ఉంటుందని ముందే చెప్పారు. అనుకున్నట్లుగానే నాలుగుకు ముందరే బస్ వచ్చింది. హోటల్ వాళ్ళు రూమ్ రూమ్‌కి బస్ వచ్చిందని చెప్పడంతో సిద్ధంగా ఉన్న అందరు బస్ ఎక్కడం మరో 40 నిముషాల్లో ఎయిర్పోర్ట్ చేరడం జరిగిపోయింది.
ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాక ఒకసారి సెక్యూరిటీ చెక్ ఇన్ అయిందంటే మరో సారి ఉండడం ఎక్కడ చూడలేదు. కొలొంబో ఎయిర్ పోర్ట్‌లో మాత్రం మొత్తం మూడు సార్లు సెక్యూరిటీ చెక్ చేయడం ఆశ్చర్యం అనిపించింది.
నిర్ణీత సమయానికి 7.30కి మా ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంది. గంటన్నర సమయంలో నిర్ణీత సమయానికి ఇరవై నిముషాల ముందు ఇండియా టైం 9. 00 ల్యాండ్ అయింది.
అలా మొత్తానికి అనుకోకుండా వచ్చిన అవకాశంతో శ్రీలంకను పలుకరించి మాతృదేశానికి చేరడం కొత్త అనుభవం.
వి. శాంతి ప్రబోధ
తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె( కథా సంకలనాలు) ప్రచురణ. బతుకుసేద్యం, నిష్కల, నీలాకాశంలో నిధి(బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.