[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]
డ్యూల్స్ సౌత్ రిక్రియేషన్ & కమ్యూనిటీ సెంటర్
ప్రీ స్కూల్
[dropcap]ఆ[/dropcap] రోజు డిసెంబర్ 16, 2022.
మేనల్లుడు వాసు చిన్నకూతురు ఇషాన్విని ప్రీ స్కూల్‌లో దింపడానికి వెళ్తూ – వస్తారా అని అడిగాడు. చూద్దామని బయలుదేరాను. వాళ్ళింటి నుంచి ఐదు నిమిషాల్లో డ్యూల్స్ సౌత్ రిక్రియేషన్ & కమ్యూనిటీ సెంటర్ ముందు కారు ఆగింది.
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొస్తున్నారు. ఇండియన్స్ ఎక్కువ కనిపించారు.
లోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. కార్డు స్క్రాచ్ చేసి లోనికి వెళ్ళాలి.
సీతాకోకచిలుకల్లా రంగురంగుల పిల్లలు.. యూనిఫామ్ ఏమీ లేదు. చలి దుస్తుల్లో ఉన్నారు. ఆరు గదులు పిల్లల కోసం ఉన్నాయి. ఆ గదులన్నీ పెయింటింగులు, బొమ్మలు, బెలూన్‌లు, బల్లలు, కుర్చీలలో పిల్లలతో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
తరగతి గది ముందు గోడకు ఆ తరగతి పిల్లల ఫామిలీ ట్రీ, పిల్లల ఫోటోలు, వారి పెయింటింగ్స్‌తో తీర్చిదిద్దారు. అంతే కాకుండా పిల్లలు ఎవరి బాగ్ వాళ్ళు పెట్టుకోవడానికి పేరు రాసిన షెల్ఫ్‌లు.
నేను గతంలో ఆస్ట్రేలియాలో చూసిన ప్రీ స్కూల్ కూడా ఇంతే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అమ్మ ఒడి వీడి చదువుల తల్లి ఒడిలోకి చేరిన పిల్లలు ఉత్సాహంగా సంతోషంగా వెళ్లే విధంగా ఉన్నాయి.
మన దేశంలో ప్రభుత్వ/ప్రైవేట్ ఆధ్వర్యంలో నడిచే ప్రీ స్కూల్ ఈ విధంగా చూసిన జ్ఞాపకం లేదు. కార్పొరేట్ కల్చర్ పెరిగిన నగరాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉంటే ఉండొచ్చేమో!
డ్యూల్స్ సౌత్ సీనియర్ సెంటర్
ప్రీ స్కూల్ లోంచి బయటకు రాగానే అదే భవనంలో మరో వైపు ఉన్న డ్యూల్స్ సౌత్ సీనియర్ సెంటర్‌కి తీసుకెళ్లాడు వాసు. మేం వెళ్లేసరికి ఇద్దరు వృద్ధులు పేపర్ చదువుకుంటూ కనిపించారు. వారు తప్ప ఎవరూ కనిపించలేదు. అంతా తిరిగి చూసాం. ఇంటర్నెట్ సౌకర్యంతో కంప్యూటర్ ల్యాబ్ ఉంది. లైబ్రరీ ఉంది. టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి, కార్డ్స్ వంటి ఆటలు ఆడుకోవడానికి సౌకర్యంగా ఏర్పాట్లున్నాయి. వేడి వేడి కాఫీ, టీ కెటిల్ లో ఎదురుచూస్తున్నాయి.
సీనియర్ సిటిజన్స్ పెట్టుకోవడానికి లాకర్లు ఉన్నాయి.
కొడుకు కోడళ్ళు, లేదా కూతురు అల్లుడు ఆఫీసు పనుల్లో ఉంటే మాట్లాడే మనిషి లేక మానసికంగా కుంగిపోయే పెద్దలు కొల్లలు. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే ఈ సెంటర్.
మేం చూస్తుండగా దాదాపు ఎనభై ఏళ్ల వృద్ధురాలు లోనికి వస్తూ కనిపించింది. ఆమెను చూస్తూనే మేం కలసిన వృద్ధులలో ఒకరు మా దగ్గరకు వచ్చి ఇందిరాజీ వచ్చారు. ఆవిడ ఇండియన్ అంటూ పరిచయం చేశారు.
ఆవిడ మమ్మల్ని చాలా అభిమానంగా పలకరించింది. గుజరాతీ మహిళ. తన కొడుకు దింపి వెళ్లాడని చెప్పింది. గత నాలుగేళ్లుగా వస్తున్నానని చెప్పింది. ఈ ప్రదేశం అంటే తనకెంతో ఇష్టం అన్నది. రండి కప్పు కాఫీ తాగుదాం అంటూ ఇంటికి వచ్చిన చూట్టాలాగా చూస్తూ ఎంతో ప్రేమగా మాట్లాడింది. ఇండియాలో ఎక్కడి నుండి వచ్చామని అడిగింది. హైదరాబాద్‌లో తమకు బంధువులు ఉన్నారని, తాను ఎప్పుడు హైదరాబాద్ చూడలేదని చెప్పింది.
ఇంట్లో ఒంటరిగా ఉండలేని నాలాంటి వాళ్ళను వారి పిల్లలు ఈ సెంటర్‌కి తీసుకొచ్చి దింపి వెళుతుంటారు. మేం సాయంత్రం వరకు కాలక్షేపం చేసి ఇంటికి పోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న పిల్లలు బడికి పోయినట్లు, పెద్దలు ఆఫీసుకు పోయినట్లు మేం సీనియర్ సెంటర్‌కి వస్తాం అంటూ భళ్ళున నవ్వేసింది. ఇక్కడకు వచ్చిన వాళ్ళు కబుర్లు చెప్పుకుంటారు. ఆటలు ఆడుకుంటారు. పాటలు పడుకుంటారు. కుట్లు అల్లికలు చేస్తారు. పుస్తకాలు చదువుకుంటారు. కంప్యూటర్‌లో పని చేసుకుంటారు. పాడుకుంటారు. కాసేపు రెస్ట్ తీసుకుంటారు. కాఫీ టీ తాగుతారు. సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరికి ఎలా ఉండాలనిపిస్తే అలా మరొకరికి ఇబ్బంది కలిగించకుండా ఉంటారు అంటూ తన బ్యాగ్ లోంచి సగం అల్లిన స్వేట్టర్ తీసింది.
వాసుకి పని ఉండడంతో అక్కడి నుంచి ముందుకు కదిలాం.
రిక్రియేషన్ సెంటర్
మరుసటి రోజు సెలవు రోజు. పిల్లలందరినీ డ్యూల్స్ సౌత్ రిక్రియేషన్ & కమ్యూనిటీ సెంటర్‌కి తీసుకొచ్చాము. ఇక్కడ ఉన్న రిక్రియేషన్ సెంటర్ ఎంట్రీ కోసం నలుగురు పిల్లలకు డబ్బులు చెల్లించి లోనికి తీస్కోచ్చారు వాసు, రాజేష్ . వాళ్ళతో నేను.
ఒక్కసారి ఎంట్రీ అయితే ఆ రోజంతా ఏ ఈవెంట్‌లో అయినా పాల్గొనవచ్చు. పిల్లలకు, పెద్దలకు రకరకాల ఆటలు ఉన్నాయి. టెన్నిస్ ఆడవాళ్లు టెన్నిస్ ఆడుకుంటున్నారు. బాస్కెట్ బాల్ ఆడేవాళ్లు, ఈత కొట్టేవాళ్ళు, టేబుల్ టెన్నిస్ , జిమ్ చేసే వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా..
పిల్లలు క్లైమ్బింగ్ వైపు దారి తీశారు. నడుముకి బెల్టు కట్టుకుని, తలకు హెల్మెట్ పెట్టుకుని తాడు పట్టుకుని పైకి ఎగబాకడానికి మొదట సౌరవి, సుచిర్, ఇషాన్వి భయపడ్డారు. సన్సిత మాత్రం భయం లేకుండా పైకి ఎగబాకడం మొదలు పెట్టింది. కొద్దిసేపటి తర్వాత భయం పోయి ఎవ్వరూ అక్కడ నుంచి కదలలేదు.
పిల్లలకు ప్రతిదీ తెలుసుకోవాలన్న ఉత్సుకత, కొత్తది నేర్చుకోవాలన్న ఉత్సాహం సహజంగా ఉంటుంది. దాంతో పాటు భయం కూడా ఉంటుంది. ఆ భయాన్ని పోగొడుతూ ధైర్యమిస్తూ అనేక రకాల ఆటలు ఆస్ట్రేలియాలో, అమెరికాలో అందుబాటులో ఉండడం చూసాను. అదే విధంగా పెద్దలు కూడా పిల్లలను ప్రోత్సహిస్తూ ఉండడం కనిపిస్తుంది. మనదేశంలో పిల్లలకు అది చేయొద్దు, ఇది చేయొద్దు, పడిపోతావు, దెబ్బ తగులుతుంది వద్దు అంటూ ఆంక్షలు విధించడం కనిపిస్తుంది.
దేశం మారే సరికి పిల్లల విషయంలో మనవాళ్ళ ఆలోచనల్లోనూ, దృక్పథంలో కొంత మార్పు కనిపించింది.
మా పిల్లలతో పాటు అక్కడికి వచ్చిన పిల్లలను, పెద్దలను గమనిస్తూ గడిపాను.
మా వాళ్ళు మిగతా ఆటల వైపు చూడలేదు. మధ్యాహ్నం నుండి వేరే చోటుకు వెళ్లాల్సి ఉండడంతో వెనుదిరిగాం.
వి. శాంతి ప్రబోధ
వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.