సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో… 5

0
2

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]

ఇల్వర్రా ఫ్లై ట్రీ టాప్ వాక్

[dropcap]ఏ[/dropcap]పుగా పెరిగి చిలువలు పలువలుతో ఆకాశం కేసి సాగిపోయిన చెట్లు తలెత్తి చూసి ఏమంటాం?

అబ్బా… ఎంత పెద్ద చెట్టో.. అని అలా అబ్బురంగా చూస్తాం కదా..

మరి, అలాంటి చెట్లకు పైన మనం ఉంటే?!

అవి మరుగుజ్జుగా కనిపిస్తే?!

అదెలా సాధ్యం? అని ఆశ్చర్యపడకండి

సాధ్యమే… అవును నిజం.

ఇదిగో ఇలాంటి ట్రీ టాప్ వాక్ ద్వారా..

అది 2018, నవంబర్ ఒకటవ తేదీ.

నేను మా అమ్మాయి సాధన, అల్లుడు రాజేష్, వాళ్ళ పిల్లలు సౌరవి (2yrs), సుచిర్ (2 months) తో కలిసి ట్రీ టాప్ వాక్ చేశాం.

ఫారెస్ట్ నేలకు 45 మీటర్ల ఎత్తులో (దాదాపు 150 అడుగులు), సముద్ర ఉపరితలానికి 750 మీటర్ల (2460 అడుగులు)ఎత్తులో నడిచాం.

అదో అద్భుతమైన సమయం.

సిడ్నీ నగరానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నైట్ హిల్స్ చేరాం.

ముందుగా దట్టమైన చిక్కని అడవిలో దాదాపు కిలోమీటరున్నర నడిచాం. అప్పటి వరకు మండుతున్న భానుని వెచ్చదనం మాత్రమే తెలిసిన మాకు, చిక్కని పచ్చటి అడవిలోకి అడుగు పెట్టిన మరుక్షణం చల్లని చిరు గాలులు పలకరిస్తూ. మా హృదయాన్ని మీటుతూ పులకరింపు కలిగిస్తూ..

దట్టంగా అలుముకున్న చెట్ల కొమ్మల ఆకుల మధ్య నుంచి నేనున్నానంటూ సూర్యుడు తోసుకొస్తూ..

సూర్య తాపాన్ని చల్లపరుస్తూ ఆకులు కొమ్మలు రెమ్మలు పూలూ.. మాకు అలుపు రాకుండా కాచుకుంటూ..

కళ్ళ నిండుగా కనిపిస్తున్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పోతుంటే మార్గం మధ్యలో ఆ రైన్ ఫారెస్ట్‌లో ఉన్న జంతుజాలం, పక్షుల గురించి వివరాలు, పాములున్నాయి జాగ్రత్త అంటూ బోర్డులు.

ఒక పెద్ద వృక్షం నన్ను చాలా ఆకర్షించింది. ఆ వృక్షానికి నాలుగు బోర్డులు. ఆ చెట్టుకు కొట్టిన ఒక బల్లపై బొమ్మరిల్లు లాంటివి. ఆ పైన ఏడురంగుల ఇంద్రధనుస్సు లాగా పెట్టిన లావాటి ప్లాస్టిక్ తాడు ముక్కలు.

అన్నిటికంటే చివర కింద వైపు ఉన్న లేత ఆకుపచ్చ రంగు చెక్క పై ఎరుపు పసుపు రంగులో. THE ELF INN అని ఎర్ర అక్షరాలు. ఆ అక్షరాలకు పైన నలుపు రంగు బోర్డు పై తెల్లటి అక్షరాలు.. మాజిక్ పుడ్డింగ్, బెర్రీ జ్యూస్… ఇంకా ఏవేవో ఆహార పదార్ధాల పేర్లు. అక్కడ ఎందుకు పెట్టారో తెలియలేదు. బహుశా అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్ పేరేమో.!

నాకైతే ఆ చెట్టును చూస్తే పోశమ్మ, ఎల్లమ్మ వంటి గ్రామదేవతలను ప్రతిష్ఠించుకునే వృక్షం కళ్ళముందు కదలాడింది.

అది దాటి ఇంకా ముందుకు పోయిన తర్వాత మొదలయింది లోయ.

అక్కడక్కడ కనిపిస్తున్న మెలివేసిన ఇనుప తీగల మోకుతాళ్లు బలమైన చెట్లకు కట్టి..

వాటిని దాటుకుంటూ ఇంకా ముందుకు పోతే ఇనుప తీగల వంతెన.

ఒక వైపు వెళ్తే అక్కడ వ్యూ పాయింట్. ఇంకో వైపు మరో వ్యూ పాయింట్. మధ్యలో స్పైరల్‌గా ఉన్న మెట్లతో నైట్ టవర్.

30 మీటర్ల ఎత్తులో 1500 మీటర్ల పొడవున్న ఇల్వర్రా ఫ్లై ట్రీ టాప్ వాక్ ఆస్ట్రేలియాలో పెద్దదట. ఎత్తైనదట.

ఇనుప తీగలతో అల్లిన వంతెన పై కాలు పెట్టగానే అది ఊగుతూ.

కిందకు చూస్తే మా కాళ్ళ కింద అడవి, లోయ.

ఆకాశం కేసి ఎగిసిన ఎత్తైన చెట్లు మరుగుజ్జు లైనట్లుగా అగుపిస్తూ.

ఎండ పడుతున్నా నేల కన్పించకుండా.. చిక్కగా పరుచుకున్న చీకటి పైన ఎండకు మెరిసే చెట్లు, కొమ్మలు, పూవులు..

దూరంగా ఎత్తుపల్లాల పచ్చిక బయళ్లు.. పిట్టగూళ్ళలా కనిపించే ఇళ్ళు ఊళ్లు.. సముద్రం..

ఆ మిట్ట మధ్యాహ్నం వేళ మసక మసకగా అగుపిస్తూ.. విహంగ వీక్షణం లాగా చూసాం.

45 మీటర్ల ఎత్తున్న నైట్స్ టవర్ పైకి వెళితే 5 బైనాక్యులర్స్.. వాటిలోంచి స్పష్టంగా కనిపించే దృశ్యాలు..

ఆకాశం, సముద్రం, ఇళ్ళు, ఊళ్లు, పచ్చిక బయళ్లు, అడవులు, రాతి కొండలు కదలనీయకుండా కట్టిపడేస్తూ..

ఆ దృశ్యాలను స్కాన్ చేసుకుని మదిలో పదిల పరుచుకుంటూ చేతిలో ఉన్న ఫోన్‌తో ఫోటో తీయడం మర్చిపోయాను..

ఆ తర్వాత తీసినా ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా మా అమ్మాయి అల్లుడు బహుమతిగా ఇచ్చిన కొత్త ఐఫోన్ ఇల్వారా మౌంటెన్ రీజియన్‌కి అంకితం చేయాల్సొస్తుందని చాలా జాగ్రత్తగా తీసా.

మాలాగే వచ్చిన కొందరు టవర్ పైకి ఎక్కకుండా వెనుదిరిగారు. వాక్ వే మీద నడుస్తుంటే కళ్ళు తిరిగినట్లు ఉందని.

సముద్ర మట్టానికి 710 మీటర్ల ఎత్తులో ఉండే ట్రీ టాప్ వాక్ 280 కిమీ వేగంతో వీచే బలమైన గాలులు తట్టుకునే విధంగా నిర్మించారు. 160 టన్నుల బరువు తట్టుకోగలదు. ఈ ట్రీ టాప్ వాక్ నిర్మించడానికి ఆరుగురు సాంకేతిక నిపుణులు, ఆరు నెలల పాటు కష్టపడి నిర్మించారట.

విశేషం ఏంటంటే ట్రీ టాప్ వాక్ కోసం తలపెట్టిన పనిలో ఒక్క వృక్షానికి కూడా హాని కలగకుండా నిర్మించడం చాలా గొప్పగా అనిపించింది.

ఇక్కడే zipline టూర్ కూడా ఉంది. నడుముకు బెల్టు కట్టుకుని తాడు ద్వారా ప్రయాణం. ఒక చెట్టు నుండి మరో చెట్టుకి ప్రయాణించిన తర్వాత అక్కడ నుండి 100 మీటర్లు కంటిన్యూగా వెళ్లడం. నేలకు 35 మీటర్ల ఎత్తులో సాగే జిప్ లైన్ టూర్‌లో స్థానికంగా ఉండే అటవీ జంతువులైన వమ్బాట్స్, ఎచిడ్నస్, షుగర్ గ్లిడెర్స్ , రకరకాల పక్షులు కనిపిస్తాయట.

మేము కూడా వెళ్లాలనుకున్నాం. కానీ నాలుగేళ్ల లోపు పిల్లలకు అనుమతి లేదు. దానికి తోడు మధ్యాహ్నం 2.15 కి లాస్ట్ zipline వాక్. లేకపోతే పెద్ద వాళ్ళం ముగ్గురు ఒకేసారి కాకుండా పిల్లల్ని చూసుకునే ఏర్పాటు చేసుకుని ఆ అడ్వెంచర్ చేసే వాళ్ళం.

సవాలక్ష ఒత్తిడులతో సతమతమయ్యే మనిషికి ఓ మత్తు గుళిక ప్రకృతితో సహవాసం. మరచిపోలేని అద్భుతమైన అనుభవాన్ని మూటకట్టుకుని వెనుదిరిగాం. ఒక రాత్రి అక్కడ ఉండగలిగితే ఎంత అద్భుతమైన స్మృతులు మూటగట్టుకునే వాళ్ళమో అనిపించింది.

కియామా బ్లో హోల్.. లైట్ హౌస్ బీచ్‌ల కేసి సాగింది మా ప్రయాణం.

షార్ప్ కర్వ్స్, స్టీవ్ రోడ్స్.. దట్టమైన మహారణ్యం.. సాధన అద్భుతమైన డ్రైవింగ్.. కొండల నుంచి బయటికొచ్చాం.

దాదాపు అడవి మార్గం దాటేశాం. పొలాల పక్కనుండి పోతున్నాం.

కారులో రబ్బరు కాలిన వాసన మా ముక్కుపుటాలను తాకుతూ .. కారు ఓ పక్కగా ఆగింది. సన్నని పొగ కనిపిస్తూ..

ముందు వైపు డోర్ తీయగానే అది మరింత పెరిగింది. పిల్లల్ని తీసుకుని కారు దిగాం.

ఏం చేయాలి ఆలోచిస్తున్నారు అమ్మాయి అల్లుడు. ఫోన్ సరిగ్గా కనెక్ట్ అవ్వడం లేదు సిగ్నల్ అందడం లేదు.

నేను పిల్లలను తీసుకుని నీడ వెతుకుతున్న. అప్పటి వరకు తెలియలేదు కానీ, పైన ఎండ మండిపోతోంది. లోన ఆకలి మంటలు షూరూ ..

మా ముందు నుంచి హై స్పీడ్ లో వాహనాలు కొండపైకి వెళ్ళేవి వచ్చేవి సాగిపోతున్నాయి.

ఎవరి పనిలో వాళ్ళు. మేం ఎందుకు ఆగామో పట్టించుకునే వాళ్లే లేరు.

ఎక్కడి నుంచి వచ్చాయో.. పెద్ద పెద్ద ఈగలు వచ్చి మా చుట్టూ మూగుతున్నాయి. వాటిని చూస్తుంటే రాక్షస ఈగల్లా కనిపించాయి. పసిపిల్లవాడు ఉన్నాడు మా చేతుల్లో.

అవి ఏ మాత్రం మీద వాలినా మంచిది కాదు అనిపించింది. నెమ్మదిగా కారులోకి చేరాం.

అప్పటికి ఇంజన్ వేడి కొద్దిగా తగ్గింది.

తక్కువ వేగంతో మళ్ళీ మా ప్రయాణం మొదలు. ఓ గ్రామం దగ్గర దగ్గర లోకి వచ్చాక ఫోన్ ఇంటర్నెట్ మా అందుబాటులోకి వచ్చాయి.

దగ్గరలో ఉన్న మెకానిక్‌కి మెసేజ్ పెట్టారు మా వాళ్ళు. ఫోన్‌లో మాట్లాడారు. వాళ్ళు కారు తీసుకుని రమ్మన్నారు.

మొత్తానికి నిదానంగా మెకానిక్ షెడ్‌కి చేరింది కారు.

అతను చూసి ఏమీ పర్వాలేదు. హిల్ ఏరియాకి మాత్రం ప్రయాణించవద్దు అని చెప్పడంతో మా మూడు రోజుల ట్రిప్ రెండురోజులకే కుదించుకుని వెనుదిరిగాం.


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు) ప్రచురణ. బతుకుసేద్యం, నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here