సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో… 6

0
2

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]

బ్లూ మౌంటైన్స్ – ట్రావెలాగ్

[dropcap]అ[/dropcap]ది 2018

14వ తేదీ ఏప్రిల్ నెల

ఉదయం 7.30

సిడ్నీ నగరానికి పశ్చిమ దిశగా ఉన్న బ్లాక్ టౌన్ నుండి మా ప్రయాణం గ్రేట్ వెస్ట్రన్ హైవేలో బ్లూ మౌంటైన్స్ నేషనల్ పార్క్‌కి మొదలైంది. సిడ్నీ నుంచి బ్లూ మౌంటైన్స్ దాదాపు 50 కిలోమీటర్లు.

నేపియన్ నది దాటిన తర్వాత దార్లో చూడడానికి ఏమైనా ఉన్నాయా అని గూగుల్‌లో చెక్ చేసుకున్నాం. ఈము ప్లేయిన్స్ దగ్గర ఒక వాటర్ ఫాల్, ఆ తర్వాత హార్స్ షూ వాటర్ ఫాల్, వెంట్ వర్త్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అయితే అప్పటికే ఈము ప్లేయిన్స్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్ దాటేశాం కాబట్టి దాన్ని వదిలేసి హార్స్ షూ వాటర్ ఫాల్ కి వెళ్లాలని అక్కడికి GPS పెట్టుకున్నాం.

వ్యూ పాయింట్ దగ్గర పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసుకుని కొందరు లోయలోని అందాలను ఆస్వాదిస్తున్నారు. మేం తిరుగు ప్రయాణంలో అక్కడ ఆగాలని అనుకున్నాం.

ఆ తర్వాత లేవురా వ్యూ పాయింట్ చేరుకున్నాం. అప్పటికి దాదాపు పది కావచ్చింది. అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదించడానికి ఉన్న రెండు కళ్ళు చాలడం లేదు. ప్రపంచంలోని ప్రకృతి సోయగాలన్నీ అక్కడే కుప్పపోసినట్లుగా.. నీలాకాశంతో పోటీపడుతున్నట్లుగా కనిపిస్తున్న కొండల నుంచి కిందికి సాగుతున్న నీలిసోయగం. కొన్ని చోట్ల లోయ అంతా పరుచుకున్న ఆకాశవర్ణం. అక్కడ నుండి త్రీ సిస్టర్స్‌గా ప్రఖ్యాతిగాంచిన కొండలను చూసి గుళ్ళు ఉన్నాయా ఇక్కడ అని ఆశ్చర్యపోయాను. తర్వాత తెలిసింది అవి దేవాలయాలు కాదు దేవాలయాన్ని పోలిన సున్నపురాతి కొండలు అని. ఆ కొండల కింద ఉన్న లోయ జామసన్ వాలీ, వెంట్ వర్త్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. చాలా ఎత్తునుండి ఎగిసిపడుతున్న ఆ జలపాతం దగ్గరకు వెళుతున్న సాహస యాత్రికులు చీమలు కదులుతున్నట్లుగా చాలా చిన్నగా.. లోయలోకి వెళ్ళడానికి సన్నని దారి.. చిలువలుపలువలుగా చీలిపోతూ మళ్ళీ కలుస్తూ..

ఆ దారి తీసుకుపోయిన దగ్గరికి పోవాలని బలమైన కోరిక నా లోపల చేరి ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. మా వాళ్లకు చెబితే ఒప్పుకుంటారా.. నడకదారిలో వెళ్లబోతుంటే మా అమ్మాయి వారించింది. అమ్మా చాలా కష్టం కొండవాలులో నడక అంటూ.. నన్ను నేను సర్ది చెప్పుకుంటూ పిల్లల వెంట నడిచా.

అక్కడ, ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర, దద్దోజనం తిని మళ్ళీ మా ప్రయాణం కొనసాగించాం.

బ్లూ మౌంటైన్స్‌కి సమీపంలోనే ఉన్న హజెల్బ్రూక్ క్రీక్ గ్రామం చేరుకున్నాం. అది చాలా అందమైన చిన్న గ్రామం.

కొండ వాలులో ఉన్న ఇళ్లు. పాములా మెలికలు తిరిగిపోతూ నల్లటి రోడ్డు. తలెత్తి చూస్తే నిటారుగా ఎదిగిన కనుచూపు చివరిదాకా కనిపించే యూకలిఫ్టస్, ఓక్ వృక్షాలతో కూడిన దట్టమైన అడవి.

హార్స్ షూ వాటర్ ఫాల్స్‌కి వెళ్లాలని మా ఉత్సాహం. మేము చూడాల్సిన ప్రదేశం అదేనని గూగుల్ చెప్పింది. కార్ పార్కింగ్ కోసం చూసాం. ఇక్కడ పబ్లిక్ పార్కింగ్ ప్లేస్ ఖాళీగా కన్పించలేదు. చివరికి ఓక్ ల్యాండ్స్ రోడ్డులో కారు పార్క్ చేసుకున్నాం.

రోడ్డుకు ఓ పక్కగా ఒక చిన్న బోర్డు. వాటర్ ఫాల్స్ పేర్లు ఉన్నాయి. వాటిలో హార్స్ షూ వాటర్ ఫాల్ కిలోమీటర్ దూరంలో ఉన్నట్లు రాసి ఉంది. కిలోమీటరే కదా అని బయలుదేరాం. అక్కడకు దగ్గరలోనే ఓక్ ల్యాండ్స్ ఫాల్స్, ఫెయిరీ ఫాల్స్, బర్గెస్ ఫాల్స్ కూడా ఉన్నాయి.

ఆ గ్రామంలోకి ఆహ్వానిస్తూ చల్లటి గాలి ఆహ్లాదాన్ని పంచుతున్నది.

పచ్చని చిక్కని చెట్ల మధ్యలో అక్కడక్కడా అధునాతనంగా కనిపించే ఇళ్లు ఎంత బాగున్నాయో..

అలా నడుస్తూ ఉంటే రకరకాల పక్షులు చేసే మ్యూజిక్ మనసును మరో లోకంలోకి తీసుకుపోతున్నాయి. మరో లోకంలోకి వచ్చినట్లు ఉంది.

నడుస్తూ ఉంటే మమ్మల్ని చూసి ‘హలో’ అంటూ స్థానికుల స్నేహపూర్వక పలకరింపులు.

ఆ కుగ్రామపు రోడ్డు దాటి అడవిలోని ఫాల్ వైపుగా సన్నని ఎగుడుదిగుడు కాలిబాటలో మా నడక లోయకేసి సాగింది. కాస్త మెత్తటి మట్టి పొడిపొడిగా..

ఒక్కో చోట జారుడుగా నేల.. నాచుపట్టిన నేల.. రాళ్లు. అల్లుకుపోయిన చెట్ల వేళ్ళు కాళ్లకు అడ్డు తగులుతూ.. నడక ముందుకు సాగకుండా అలా కొద్ది దూరం నడిచాం.

సౌరవికి చెట్ల కొమ్మలు గీసుకుపోతాయని, ఎత్తుకుని నడవడం కష్టం అనే కారణంతో రాజేష్ మధ్యలో ఆగిపోయి ఓ చెట్టు నీడన కూర్చుందామనుకున్నాడు. నేను సాధన ముందుకు కదిలాం.

మరో వంద మీటర్లు వెళ్లేసరికి బాట మరింత క్లిష్టంగా.. కష్టంగా.. దారి చూపుతూ బాణం గుర్తులు.

ఎక్కువగా ఎవరు వెళ్తున్నట్టుగా లేదు. మేం మొత్తం 200 మీటర్లు నడిచామో లేదో.. ఇంకో 800 మీ పైనే నడవాలి.

మార్గంలో రాళ్ల సందుల్లోంచి జాలువారే సన్నటి నీటి ఊటలు తప్ప వేరే కనిపించలేదు. కానీ జలపాతపు సవ్వడి మాత్రం హృదయాన్ని తాకి ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేస్తున్నది.

నడక బాగా ఎత్తు పల్లాలలో.. జారుడు మట్టి నేల, గులక రాళ్లు మామూలు షూ తో ఉన్న మాకు సవాళ్లు విసురుతున్నాయి. హైకింగ్ షూ ఉంటే వెళ్లిపోవచ్చు.

మాకు ఆ అడవిలో నడక సాహసమే కానీ కష్టం కాదు. సాధన ఏడు నెలల గర్భవతి. తన పరిస్థితి రీత్యా అది ఎంత భద్రమో అర్థం కాలేదు. అడవి మాత్రం చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని కారడవి లాగా అనిపించింది. ఫోన్ సిగ్నల్ కూడా అందడం లేదు. అన్నీ చర్చించుకుని మేం ఇక ముందుకు వెళ్ళలేదు. వెనక్కి మళ్ళాము.

ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా ప్రాం ఫ్రెండ్లీ, వీల్ చైర్ ఫ్రెండ్లీ పాత్‌లు చూసిన నాకు ఇక్కడ మాత్రం అటువంటిదేమీ కనిపించలేదు. అదే విధంగా టూరిస్ట్‌ల కోసం మంచినీరు, టాయిలెట్స్, కేఫ్ వంటి సదుపాయాలు ఏమీ లేవు. కానీ హాజల్బ్రూక్ క్రీక్ గ్రామం మాత్రం నాకు చాలా నచ్చింది.

ముఖ్యంగా గ్రామంలో కారు పార్కింగ్ చేసి నడుస్తుంటే నవ్వుతూ స్నేహపూర్వక పలకరింపులు.. ఆ గ్రామంలాగే స్వచ్ఛంగా అగుపించారు ఆ మనుషులు. కొత్తగా గ్రామంలోకి ఎవరు వచ్చినా నవ్వుతూ ఎవరింటికి అని మర్యాదగా పలకరించే నా చిన్ననాటి పెద్దల లాగా అనిపించారు ఆ గ్రామస్తులు. వాళ్ళు హలో అనడం తప్ప వేరే ఏమీ మాట్లాడక పోయినా రోడ్డు మీద నడుస్తూ, కారులో వెళ్తూ కూడా చేయి ఊపుతో పలకరించడం మనసుకి ఎంతో నచ్చింది.

బ్లూ మౌంటెన్స్ నేషనల్ పార్క్ లోనే ఉన్న హాజల్బ్రూక్ క్రీక్ నుండి మా ప్రయాణం బ్లూ మౌంటైన్స్ వైపుకి సాగింది. పది పన్నెండు నిమిషాలు డ్రైవ్. ఎటు చూసినా అద్భుతమైన సౌందర్యం. యూకలిఫ్టస్ అడవులు, జలపాతాలు.. లోయలో కమ్మేసిన మేఘం.. వాటి మధ్యలో అక్కడక్కడ కనిపించే గెస్ట్ హౌస్‌లు, ఉద్యానవనాలు, మన తిరుపతి కొండల లాగే బ్లూ మౌంటైన్స్ అంచులు కూడా ఎవరో అద్భుతంగా మలిచినట్లుగా.. శిల్పం చెక్కినట్లు కనిపించే మూడు కొండల వరుస త్రీ సిస్టర్స్.. ఒకటేమిటి ప్రతిదీ అద్భుతమే.. సీనిక్ వరల్డ్ ప్రతి వాళ్ళు చూసి తీరవలసిందే. ఆ అనుభవాలు మదిలో పదిల పరుచుకోవలసిందే.

కారు పార్కింగ్ చేసి దిగేసరికి చల్లటి గాలి మమ్మల్ని పలకరించింది. వెంటనే చలి గాలిని తట్టుకోవడం కోసం జాకెట్స్ తగిలించుకున్నాం.

రాజేష్ వెళ్లి మేం సీనిక్ వరల్డ్ లోకి వెళ్ళడానికి టికెట్ కోసం వెళ్ళాడు. టికెట్ ధర 45 డాలర్లు. అది ఎక్కువ అనిపించినా ఆ తర్వాత అందుకు తగిన ఆనందం పొందామని తృప్తిగా వెనుదిరుగుతాం.

3- 15 ఏళ్ల వరకు పిల్లల టికెట్ తీసుకోవాలి. కొంత డిస్కౌంట్ ఉంటుంది. మూడేళ్ళ లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. ఒక టికెట్‌తో సీనిక్ రైల్వే, కేబుల్ కార్, స్కై వే అన్నిట్లో ఎన్ని సార్లయినా తిరిగి రావచ్చు. టికెట్ తేవడం కొద్దిగా సమయం తీసుకుంది. జనం కూడా ఎక్కువగా ఉన్నారు.

ఈ లోగా అక్కడ కనిపించే జనాన్ని చూస్తూ కూర్చున్నాం. తెలుపు, ఎరుపు, నలుపు, బ్రౌన్ లేత ముదురు రంగులో ప్రపంచంలో ఉన్న జాతులన్నీ అక్కడ ఉన్నట్లు ఉంది. వాళ్లలో భారతీయులు కూడా చాలా మంది కనిపించారు. తెలుగు మాటలు కూడా వినిపించాయి.

టికెట్ తీసుకుని సీనిక్ వరల్డ్‌లో ప్రవేశించాం. మొదట ఎటు వెళ్లాలా అని ఆలోచిస్తుండగా కేబుల్ కార్ దగ్గరకు చేరాం. కేబుల్ కార్ నిండి పోయింది. క్యూ లో ఉన్నాం. ఆ తర్వాతి రైడ్ తీసుకున్నాం. 1958లో ఆస్ట్రేలియా లోనే మొదటి కేబుల్ కార్ సీనిక్ వరల్డ్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత దానిని అప్ గ్రేడ్ చేశారట. కేబిన్‌ని అదే సంవత్సరం కొత్తగా ప్రారంభించినట్లు (2018 లోనే) అక్కడ రాసి ఉన్న బోర్డ్స్ చెబుతున్నాయి. ఒకసారి 84 మందిని మోసుకుపోతుంది కేబుల్ కార్. ప్రతి పది నిముషాలకు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.

అద్దాల కేబుల్ కార్లో ఒక పర్వతం నుండి మరో పర్వతం మీదకు 545 మీటర్ల ఎత్తులో ప్రయాణం. జమిసన్ వాలీ లోని నిలువెత్తు వృక్షాల పై నుండి వెళ్లడం గొప్ప అనుభవం. కేబుల్ కార్ లోంచి దిగి కొండ వాలులో సన్నని బాటలలో నడక. జారిపడిపోకుండా స్టీల్ రాడ్స్‌తో ఫెన్సింగ్. కానీ గాలికి ఎగిరిపోయేంత గాలి. చాలా జాగ్రత్తగా నడిచాం. వ్యూ పాయింట్ నుండి జమిసన్ వాలీ, త్రీ సిస్టర్స్ చూశాం. కొందరు ఔత్సాహికులు త్రీ సిస్టర్స్ కేసి నడక కొనసాగించారు. కొందరు మరో వైపునుండి కుటుంబా వాటర్ ఫాల్స్ వైపు వెళుతున్నారు.

సాండ్ స్టోన్‌తో తయారయిన త్రీ సిస్టర్స్ శిల్పులు చెక్కిన శిలలు గా కనపడడానికి కారణం గాలి కావచ్చు. గాలి రాపిడికి అవి ఆ రూపం సంతరించుకున్నాయేమోనని అనిపించింది. అలా కొంత దూరం నడిచి వెనక్కి తిరిగాం. ఎక్కడ కేబుల్ కార్ దిగామో అక్కడికి చేరాం. పది నిముషాల తర్వాత వచ్సిన కేబుల్ కార్‌లో సీనిక్ వరల్డ్ కెఫెటేరియాకి చేరాం.

సీనిక్ వరల్డ్ లో రెండ్ ఫుడ్ కోర్ట్‌లు ఉన్నాయి. టెర్రేస్ పైన ఉన్నదానికి మేం వెళ్లాం.

కేఫ్‌లో ఫుడ్ ఆర్డర్ చేసాం. మా ఫుడ్ తెచ్చి తిందామని అవుట్ డోర్టేబుల్ వెతుక్కుని కూర్చున్నాం. ప్రకృతిని ఆస్వాదిస్తూ తినాలని మా ఆశ. అందుకు అనుగుణంగా ఉన్న టేబుల్ కోసం కొంత సమయం వేచి ఉన్నాం. మొత్తానికి మేం కోరుకున్న టేబుల్ మాకు అందుబాటులోకి వచ్చింది. పలచని ఎండ కూడా పడుతున్నది. చుట్టూ చూస్తుంటే మేఘాల నీడలు లోయలోని అడవిపై పడి లోయంతా మరింత చిక్కని నిండైన పచ్చదనం నింపుకున్నది. త్రీ సిస్టర్స్ పర్వత వాలు ఆకాశం నుంచి నీలం రంగు తెచ్చుకుందేమో నీలి రంగులో మెరిసిపోతున్నది. ఒక్కోచోట లోయలోని అడవిపై దట్టంగా పరుచుకున్న మేఘం పాల సముద్రపు అలలు తలపిస్తున్నది. ఓ చోట కొండ అంచుల నుంచి లోయలోకి దూకే వాటర్ ఫాల్స్.

ఒకే దగ్గర కూర్చున్న చోటే చూస్తుంటే చాలా విచిత్రంగా ఎంతో వైవిధ్యం.

ప్రకృతి ఎంతో అందమైనది. ఎప్పటికీ అర్థం కాని ప్రకృతి ముందు ఎంత సాధించినా మనిషి తెలివితేటలు దిగదుడుపే.

చల్లటి గాలులు మాత్రం వేగంగా అటు ఇటు ప్రయాణిస్తున్నాయి.. అదో వింతైన అనుభవం. అనుభవించి తీరాలి మాటల్లో చెప్పడం కష్టం.

మేం తింటూ ఉండగా తుఫాన్ వేగంతో వచ్చిన గాలి ఇతర టేబుల్స్‌తో పాటు మా టేబుల్ పై ఉన్న ఆహార పదార్థాలు కూడా తనతో తీసుకుపోయింది. ఆ గాలి చూస్తే మమ్మల్ని కూడా తీసుకు పోయి ఆ లోయల్లోనో.. పర్వతాల్లోనో విసిరేస్తుందేమో.. ఏదో చెట్టు కొమ్మకు వేలాడేస్తుందేమో అన్న అనుమానం వచ్చింది ఆ క్షణాన.

ప్రపంచంలోనే నిటారుగా ఉన్నట్లున్న ప్యాసింజర్ రైల్వే రైడ్ బ్లూ మౌంటైన్స్ లో ఉంది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్యలో సీనిక్ వరల్డ్ ఉన్న కొండపై నుండి నిటారుగా కొండను తొలుచుకుంటూ సొరంగ మార్గంలో కొంత వివిధ వృక్ష జాతులు, పక్షుల మధ్య నుంచి అమాంతం లోయలోకి వెళ్ళిపోతే.. ?!

అదే జరిగింది ఈ రైలు ప్రయాణంలో.

310 మీటర్ల లోతులోకి అంటే 1020 అడుగుల లోతు లోయలోకి తీసుకుపోతుంది ఈ రైలు.

ఈ రైలు మార్గాన్ని 1878లో బొగ్గు గని లోని బొగ్గు పైకి తీసుకుపోవడం కోసం ఏర్పాటు చేశారట. ఆ తర్వాత ఆవిరితో నడిచే 12 మంది ప్రయాణికులను చేరవేసే విధంగా ఉండేదిట. 1935లో ఎలక్ట్రిక్ ఇంజనుతో 23 మంది ప్రయాణికులను తీసుకుపోవడం మొదలు పెట్టింది. 1952 నాటికీ ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని 23-28 ప్రయాణికులను తీసుకుపోయే బోగీ ఉంటే ఇప్పుడు 84 మంది టూరిస్టులను నాలుగు బోగీలలో తీసుకుపోతున్నది.

మొత్తం 310 మీటర్ల ప్రయాణం.

1928 -45 మధ్యకాలంలో వారం రోజుల్లో మొదటి ఐదురోజులు బొగ్గు మోసుకుపోయే రైలు వారాంతంలో టూరిస్టులను వాలీలోకి తీసుకుపోయేది.

బొగ్గు గనులు మూసేసాక 1945 నుండీ టూరిస్టుల కోసం నడుస్తోందీ బండి. దాదాపు 25 మిలియన్ల మంది ఈ రైలు ప్రయాణాన్ని అనుభూతి చెందారట. 5 జనరేషన్స్ ట్రైన్ ట్రాక్ పై నడుస్తోందట.

ఒకసారి 84 మంది ప్రయాణికులను మోసుకుపోతోంది. ప్రతి పది నిమిషాలకు పైకో కిందకో వెళ్తూనే ఉంటుంది స్కై రైల్. ప్రపంచంలో ఏటవాలుగా మనుషుల్ని మోసుకుపోతున్న రైలు ఇది.

కొండను తొలిచి ఏటవాలుగా చేసిన సొరంగ మార్గంలో ప్రయాణం. చిమ్మ చీకటిగా మారిపోవడంతో పాటు కిందకు వెళుతున్న రైలు ప్రయాణం. జనం భయంతో అరుపులు.. ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్లు ఉగ్గబట్టుకుని ఉత్కంఠతో చూస్తుండిపోయా.

ఆ రైలు పైన, చుట్టూ గ్లాస్‌తో ఉన్న పెట్టెలు. ఒక వరుసకు ముగ్గురు లేదా నలుగురు కూర్చోగలిగే విధంగా.. ఎటుచూసినా చుట్టూ దట్టంగా పరుచుకున్న పచ్చదనంతో కూడిన రెయిన్ ఫారెస్ట్ మధ్య నుండి జామీసన్ వ్యాలీ లోకి మా ప్రయాణం అత్యద్భుతం.

మేం పైనుండి కిందకు దిగేటప్పుడు ముందు వరుసలో కూర్చున్నాం. అదే విధంగా పైకి వెళ్ళేటప్పుడు చివరి వరుసలో కూర్చున్నాం. అందుకోసం రైలు రావడానికి కొద్దిగా ముందు అక్కడ చేరి మా ప్లేస్ రిజర్వు చేసుకున్నాం. ముందు, వెనుక కూర్చున్న వాళ్ళకి ఆ అద్భుత సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం మరింత ఎక్కువ.

ఒకసారి వాక్ వే లో తిరిగి వచ్చాము. ఆ దారుల్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడే నిమిత్తం, వాటిపై అవగాహన కలిగించే విధంగా ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చిన ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణ. నాకైతే చాలా చాలా నచ్చేశాయి. ఆ విద్యార్థులు ఏర్పాటు చేసిన వాటిలోంచి ఎంపిక చేసి మొదటి మూడు బహుమతులు పెద్ద మొత్తంలో ఇస్తారట.

ఆ నడకదారుల్లో నడిచేటప్పుడు అబ్బురపరుస్తూ, ఆసక్తి కలిగిస్తూ ఏర్పాటు చేసిన విద్యార్థులు ప్రయోగాలు.. అవి ఎందుకు అక్కడ ఏర్పాటు చేశారో అర్థం కాలేదు. ప్రతి చోట వాళ్ళ ఆర్ట్‌తో పాటు బ్రీఫ్‌గా వివరణ ఉండడంతో అర్ధమయింది. వారి ఆర్ట్ వర్క్ వారం రోజులపాటు జామిసన్ వ్యాలీలో ప్రదర్శనలో ఉంటుంది.

జమిసన్ వాలీ లో దిగాక చాలా వాక్ వే లున్నాయి. 2. 4 కిలోమీటర్లు జురాసిక్ రెయిన్ ఫారెస్ట్ లో తిరగొచ్చు. ఆ నడక దారులన్నీ ప్రామ్స్ కి, వీల్ చైర్ కి అనుకూలంగా ఉన్నాయి.

సీనిక్ రైల్వే పదాన్ని మొదట 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వాడారంట.

మేం సీనిక్ రైల్‌లో రెండుసార్లు పైకి కిందకి తిరిగాం. అక్కడ మూసేసిన బొగ్గు గని చూసాం. నలుగురు వ్యక్తుల చేతులు బార్లా చాపి చుట్టినా పట్టనంత లావుగా ఉన్న వృక్షాలు.. అతి పురాతనమైన పర్యావరణ చరిత్రకు, మానవ జీవనానికి సజీవ సాక్ష్యాలైన వృక్షాలు కనిపిస్తాయి జేమిసన్ వాలీలో.

బ్లూ మౌంటైన్స్ ఆ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా గుండుంగుర్ర తెగకు చెందిన వారివి. ఈ ప్రాంతంలో చుట్టూ పట్ల కనిపించే ఏ నివాస ప్రాంతానికి వెళ్లినా గుండుంగుర్ర తెగకు చెందిన అబోరిజినల్ తెగవారు కనిపిస్తారు. కుటుమ్బ, బ్లూ మౌంటైన్స్ పర్వత సానువుల్లో ఈ జాతి వారు ఎక్కువ.

ఆదివాసీ తెగలకు చెందిన అనేక మంది కూలీలు ప్రతి రోజు బొగ్గుగనిలోకి వచ్చి బొగ్గు తీసేవారట. వారిని మనుషుల్లా చూసేవారు కాదట బ్రిటిష్ వలస వాదులు. తమ నేలలో బానిసలుగా బతికే వారట స్థానిక తెగల ప్రజలు. బ్రిటిష్ వారి చెరలో చిదిమిపోయిన జీవితాలు, వారి ఆకృత్యాలకు బలైన జీవితాలకు ఆ లోయ సాక్ష్యమై నిలిచిందట. అదే విధంగా స్థానిక తెగల మధ్య పరస్పరం జరిగే దాడులు, యుద్ధాలు వాటి కథలు అక్కడి ప్రజల మౌఖిక సాహిత్యంలో, జానపద సాహిత్యంలో కనిపిస్తాయట.

త్రీ సిస్టర్స్ రాక్ ఫార్మేషన్స్‌కి కూడా స్థానిక తెగల వారు రకరకాల కథలు చెబుతారట. గుండుగుర్రా. తెగ ప్రకారం మీహ్ని, విమ్లాహ్, గున్నెండో అనే ముగ్గురు అందమైన అక్కాచెల్లెళ్లు జేమిసన్ లోయలో నివసించేవారట. ఆ అక్కాచెల్లెళ్లు ముగ్గురు పొరుగు ప్రాంతంలో దారుక్ జాతీయులతో ప్రేమలో పడ్డారట. ఆదివాసీ చట్టాల ప్రకారం మరో జాతీయులతో ప్రేమలో పడడం నేరం.

కానీ యుద్ధం చేసి తాము ప్రేమించిన యువతులను తీసుకుపోవాలని దారుక్ అన్నదమ్ములు ప్రయత్నించారని అప్పుడు ఆ యువతులు పారిపోయి శిలలుగా మారిపోయారని ఆ విధంగా త్రీ సిస్టర్స్ ఏర్పడ్డాయని కథలుగా చెప్పుకుంటారు అక్కడి ప్రజలు.

అద్భుతమైన అందాలు, ఆనందాలు పంచే ఆ లోయ సౌందర్యం వెనుక దాగిన విషయాలు విషాదాలు మనసును మెలిపెట్టేశాయి.

సీనిక్ వరల్డ్‌లో ఉన్న గిఫ్ట్ షాప్‌లో ఉన్న స్వచ్ఛమైన తేనె కొనుక్కుని తిరుగు ప్రయాణం అయ్యాం.

బ్లూ మౌంటైన్స్ వెళ్లాలనుకునే ఔత్సాహిక టూరిస్ట్ లకు సిడ్నీ నుండి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉంది. సిడ్నీ నుంచి బస్సులు, రైలు సదుపాయాలున్నాయి. కారులో వచ్చినవారికి పార్కింగ్ సదుపాయం ఉంది. ఒకటి రెండు రోజులు అక్కడే ఉండదలచిన వారికి హోటళ్లు, వసతి సదుపాయాలు ఉన్నాయి. హైకింగ్, రాక్ క్లైమ్బింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు) ప్రచురణ. బతుకుసేద్యం, నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here