Site icon Sanchika

సందిట్లో సడేమియా

అటు వైపు ఇటు వైపు
ఏ వైపు చూడు మన సడేమియా
రిక్షా రాములికి జొరమొచ్చినా
మేయర్ బాబుకి దగ్గొచ్చినా
మన సడేమియా రయ్యమని
వస్తాడు, పరామర్శ చేస్తాడు

అంతా తనకే తెలుసంటాడు
కాదు కూడదు అన్నావంటే
వెర్రి వెంగళప్పవి నువ్వు అంటాడు
అణు సిధ్ధాంతం తెలుసంటాడు
అర్థ శాస్త్రం పూర్తిగా తెలుసంటాడు
వైద్యం వెన్నతో పెట్టిన విద్యంటాడు
సేద్యం చిన్నప్పుడే చేసానంటాడు

నలుగురు కలిసి మాట్లాడుతుంటే
నా మాటే వేద వాక్కు అంటాడు
ఔరా అంటే రంకెలేస్తాడు పళ్ళు కొరుకుతాడు

ఈ ఊరికి పెద్దమనిషిని నేనే అంటాడు
సలహాలు తీర్పులు అడక్కుండా ఇస్తాడు

మన సందిట్లో సడేమియా ఎవరతను
రంగుల జెండా చేత పట్టి
హంగుల కండువా భుజాన పెట్టి
పార్టీ పేరుతో పార్టీలు చేసుకొనే
మన సగటు రాజకీయ నాయకుడు
ఏ పార్టీకా జెండా ఏ ఎండకా గొడుగు
వేసుకు తిరిగే తిరగలి బాహుబలి

Exit mobile version