[box type=’note’ fontsize=’16’] శ్రీమతి గోటేటి లలితాశేఖర్ రచించిన ‘సంగమం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు అల్లూరి గౌరీలక్ష్మి. [/box]
[dropcap]లో[/dropcap]కంలో ఎంత కాపట్యం ఉన్నా అధైర్యపడకుండా భారతంలో ధర్మరాజు సదా ధర్మాన్నే పట్టుకున్నట్టుగా, మానవ సంబంధాల పటుత్వానికి అన్నిటికన్నా ప్రేమ, ఆప్యాయత, బాధ్యత మాత్రమే ముఖ్యావసరాలని రచయిత చెప్పారీ కథల్లో.
విదేశాల్లో ఉన్నా స్వదేశంలో ఉన్నా సామాజిక, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా జీవితం ఎవరికీ స్థిమితం ఇవ్వడం లేదు. ఈనాటి బిజీ ప్రపంచంలో ఎవరికి వారు ఒంటరైపోతున్నారు. స్త్రీలు కూడా ఉద్యోగం చెయ్యకపోతే ఖరీదైన స్కూల్స్‌లో పిల్లల్ని చదివించలేరు. మునుపటిలా స్త్రీలు ఇంటి పట్టునే ఉండి ఇంటికి వచ్చిన అతిథులను ఆదరిస్తూ వృద్ధులకు ఆసరా ఇచ్చే స్థితి లేదు. పిల్లలు కూడా భారమైన చదువులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మనుషుల మధ్య అనుబంధాలకు తీరిక లేదు. యాంత్రిక జీవనం పెరుగుతోంది. ఇలా మనకు నిరాశ కలిగిస్తున్న ఆ యా సందర్భాల్ని పట్టుకుని తన కథల్లో చిత్రిస్తూ చేసిన లలిత గారి కథాసూచనలు పాఠకులకు గొప్ప ఊరటనిస్తాయి. భవిష్యత్తు ఆశాజనకంగా తోస్తుంది. మనసు నిమ్మళిస్తుంది.
సమాజంలోని మనుషులంతా ధనవంతులైనా, గొప్ప పదవిలో ఉన్నవారైనా, సామాన్యులైనా ఇంట్లోంచే బయలుదేరతారు కదా! ఇంట్లో ఇతర సభ్యులతో ఆప్యాయతానుబంధాలు బావుంటేనే మనుషులు సంస్కారవంతులవుతారు. సర్దుబాటు, సామరస్య భావన, సహానుభూతి, సహనం కలిగి ఉంటేనే మంచి పౌరులై, ఆపై మంచి మనుషులై సమాజం సక్రమ మార్గంలో సాగడానికి సహాయపడతారు. మానవ జీవితంలో ఇది ప్రాథమిక సూత్రం. రచయిత అటువంటి అంశాలను ‘అమ్మతనం’, ‘మేం కాదు మనం’ వంటి కథల్లో చక్కగా వివరించారు. లలిత గారు పాజిటివ్ దృక్పధంతో సమస్యలను క్రిస్టల్ క్లియర్‌గా చూపించి అవి విప్పలేని చిక్కుముళ్లు కావు అని మనల్ని ఒప్పిస్తూ అలా నమ్మినవారికి మనుషుల మధ్య అనుబంధాల్లో తప్పక విజయం వరిస్తుంది అని ఈ కథల ద్వారా నిరూపించారు.
అనుభవంలోంచి వచ్చిన కథలే మనసుకు హత్తుకుంటాయి. ఉత్తుత్తి అల్లికలు మనసు పైనుంచి పక్కకి పోతాయి తప్ప లోపలిపోవు. ఈ కథలన్నీ చిక్కని అనుభవంలోంచి వచ్చాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో అనుభవ సారాల్లా తోస్తాయి. ఆధునిక మెకానికల్ జీవనం, మార్కెట్ మనస్తత్వం, సమయ వినియోగం ఇలా అనేకానేక విషయాలు సంసారం బంధాల్లో పని చేస్తాయి. కోడళ్ళు అత్తగారితో కలిసి ఉండడం లేదా అలా ఉండలేకపోవడం అనేవి వారి మనస్తత్వాలపై ఆధారపడి ఉంటాయి. అత్తనే అమ్మనుకుంటే కోడలికి సహనం వస్తుంది. అత్తకి వయసురీత్యా విశాల మనస్తత్వం వచ్చినా కోడళ్ళకి రావడానికి సమయం పడుతుంది. ఆ సంస్కారం కోడలికి రావడానికీ, రాకపోవడానికీ వెనుక ఎన్నో విషయాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ‘గమనం’ కథలో ఇవన్నీకనబడతాయి. మనలో ఆలోచనలు రేపుతాయి.
ప్రియమైన దానిలో సత్యాన్ని గుర్తించి, సత్యాన్ని ప్రియం చేసుకున్న ‘సంగమం’ ప్రతీకాత్మకంగా మలచిన చక్కని కథ. ‘బాడ్ హస్బెండ్’ కథ చదివి కొందరైనా భార్యల కోణంలోంచి ఆలోచించి గుడ్ హస్బెండ్ లయ్యేఅవకాశం ఉంది. లోటుపాట్లను అధిగమించి పూర్ణత్వం సంతరించుకున్న ఒక స్త్రీమూర్తి ‘అన్నపూర్ణ’ కథ హృదయాన్ని తాకుతుంది.
ఈ సంపుటిలో అందరినీ అలరించే చక్కని సారమున్న రెండు హాస్యకథలున్నాయి. ‘దమయంతీ స్వయంవరం’ అంటూ జీవిత భాగస్వామిలోని గొప్పతనం గుర్తించలేని అలసత్వం మీద హాస్యంగా చురక వేశారు లలిత. ‘మృత్యుంజయుడు’ నవ్విస్తున్నట్టు కనబడి చివరికి ‘దేహమే దేవాలయంగా చేసుకుని గుండెనిండా ప్రేమే పెట్టుకుని ఉండాలని’ అనగలిగిన సంస్కారవంతునిగా కనబడతాడు. చాలా గొప్ప కథ ఇది.
ఈ మార్కెట్ సంసృతిలో మనుషులు యాంత్రికంగా తయారవుతున్న మాట నిజమే. అయితే రచనలలో సైతం, ‘కాలం మారిపోయింది రోమ్‌లో రోమన్‌లా మారిపోండి. విలువలంటూ వేళ్ళాడకండి. ఈ రోజుల్లో అందరూ వాటిని వదిలేసుకున్నారు. మీరు కూడా బాగా ఆలోచించుకోండి. జీవితంలో విజయం, స్వీయానందం ముఖ్యం’ అంటూ మెసేజ్‌లు అనేకం వస్తున్నాయి. ఇటువంటి గందరగోళ పరిస్థితులున్న ఈ రోజుల్లో లలిత గారి కథలు చెవుల్లో అమృతం పోసినంత హాయిగా అనిపిస్తాయి. లోకం నేడు ఎన్నో మార్పులు చెందుతున్నా, మానవ జీవనాలు సంక్లిష్టంగా చిక్కుముడిపోతున్నా ఒక ఆశావహమైన ఆలోచనలూ, భరోసా ఊహలూ మనసుకు ధైర్యాన్నీ, నమ్మకాన్నీ కలిగిస్తాయి. చివరాఖరికి అదే కదా రచనల పరమార్థం! అది సాధించారీ రచయిత.
మన పెరట్లో ఎరువులు వెయ్యకుండా పూయించిన బొండుమల్లెల సుగంధవు స్వచ్ఛత ఈ కథలన్నిట్లోనూ గుబాళిస్తూ చదువరుల మనసులకు ఆహ్లాదాన్నిస్తుంది. కుటుంబం దాటి బైటికొచ్చిన యువత ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పైన కూడా రచయిత దృష్టి సారించి కథలుగా మలిచి తనదైన నిష్పాక్షిక విశ్లేషణ చేయగలరని ఆశిద్దాం.
~~
సంగమం (కథల సంపుటి)
రచన: శ్రీమతి గోటేటి లలితాశేఖర్
పేజీలు:130, వెల: Rs.125/-
ప్రతులకు:
విశాలాంధ్ర బుక్ హౌస్ బ్రాంచీలు,AP
నవచేతన బుక్ హౌస్ బ్రాంచీలు, Telangana
నవోదయ బుక్ హౌస్, కాచిగూడ,హైదరాబాద్.
Mobile :9394793921