[dropcap]తు[/dropcap]మ్ ఆగయే హో నూర్ ఆగయా హై
నహీతో, చరాగోంసే, లౌ జా రహీ థీ
‘ఆంధీ’ సినిమాలో గుల్జార్ అత్యంత సృజనాత్మకంగా రచించగా, అంతే సృజనతో ఆర్.డి. బర్మన్ అత్యంత అద్భుతంగా రూపొందించిన పాట ఇది. కిషోర్ కుమార్, లతల స్వరాల మేళనంలో ప్రాణం పోసుకుని కళాకారులకు అమరత్వం ఆపాదించటమే కాదు, హిందీ సినీ గేయ ప్రపంచంలో తనకంటూ విశిష్టమైన స్థానాన్ని ఏర్పరచుకున్నదీ గీతం.
‘నీ రాకతోనే వెన్నెల వెలుగులు వచ్చాయి. నువ్వు లేనప్పుడు జ్వాల లేని దీపంలావుండేది’ అన్న అర్థం ఇస్తాయీ పల్లవిలోని పాదాలు. నాయకుడి ఈ భావానికి సమాధానంగా నాయిక ఇంకా అర్థవంతంగా పాడుతుంది.
జీనేకి తుమ్ సే వజే మిల్‍గయీ హై
బడీ బేవజే జిందగీ జా రహీ థీ
‘నీ వల్ల జీవించేందుకు కారణం లభించింది. లేకపోతే కారణరహితంగా అంటే అర్థరహితంగా జీవితం సాగుతోంది’ అంటుంది నాయిక. ఆమె వల్ల అతని చీకటి జీవితంలో వెలుగు వస్తే, అతని వల్ల ఆమెకు జీవించేందుకు కారణం, లక్ష్యం లభించాయి. ఈ పాట వింటున్నప్పుడల్లా హిందీ సినీ సంగీత దర్శకులు, సంగీత ప్రేమికులు లత మంగేష్కర్ గురించి ఈ పాటనే పాడుకుంటున్నారేమో అనిపిస్తుంది.
“The Voice of Latha has opened door to unlimited possibilities for music directors. Here was singer with thorough training in classical music and gifted with a divine voice, without any obvious angularities’ అని లత స్వరం ఆగమనంతో సంగీత దర్శకులకు అనంతమైన స్వేఛ్ఛ లభించిందని వ్యాఖ్యానించాడు అనిల్ బిశ్వాస్.
ప్రతి దీపావళి పండుగ రోజు ఉదయమే లత ఇంట్లోంచి బయలుదేరి సంగీత దర్శకులకు స్వీట్ బాక్స్ ఇచ్చేది. ఓసారి ఉదయమే నౌషాద్ ఇంటికి వెళ్ళింది. ప్రొద్దున్నే వచ్చిన లతను చూసి నౌషాద్ “ఇవాళ రిహార్సల్స్ లేవు ఇంత ప్రొద్దున్నే వచ్చేవేమిటి?” అనడిగాడు ఆశ్చర్యంతో.
“మీరు నా కోసం అత్యద్భుతమైన బాణీలు రూపొందించి అమరగీతాలు పాడిస్తున్నారు. అందుకని దీపావళి పర్వదినాన మీ ఆశీస్సులు కోరుతున్నాను” అంటూ మిఠాయి డబ్బాను అతనికి అందజేసింది.
మిఠాయి డబ్బావైపు చూస్తూ – ‘ఈ మిఠాయిలు నోటిని తీపి చేస్తాయి. నీ స్వర మాధుర్యం ఆత్మను సంతృప్తి పరుస్తుంది. ఆనందపరవశను చేస్తుంది. మేము రూపొందించే బాణీలు శిశువుల్లాంటివి. ఆ శిశువుల్లాంటి బాణీలకు వ్యక్తిత్వం ఇచ్చి ఉత్తమ మానవుడిలా తీర్చిదిద్ది దైవం స్థాయికి చేరుస్తుంది నీ స్వరం. నీకు మేము కృతజ్ఞులం అయి ఉండాలి’ అన్నాడు నౌషాద్.
ఇదీ ప్రఖ్యాత సంగీత దర్శకులకు లత స్వరం వల్ల లభించిన సృజనాత్మక స్వేచ్ఛ. ఒక బాణీని రూపొందిస్తే ‘ఎవరు ఈ బాణీని పాడగలరు?’ అన్న ఆలోచన అప్రస్తుతం అయింది లత రంగప్రవేశంతో.
‘లత కంఠంలో సరస్వతి నివసిస్తుంది’ అన్నాడు ప్రఖ్యాత సంగీత దర్శకుడు సలిల్ చౌదరీ.
‘తాన్‌పురాలోని శుద్ధ గాంధారం వినాలంటే లత స్వరం వినాలి’ అన్నాడు కుమార్ గంధర్వ.
‘తాజ్‍మహల్ ప్రపంచంలో ఎనిమిదవ అద్భుతం అయితే లత స్వరం తొమ్మిదవ పరమాద్భుతం’ అన్నాడు ఉస్తాద్ అంజద్ అలీఖాన్.
‘లత వల్లనే ఈనాడు సామాన్యులలో శాస్త్రీయ సంగీతం పట్ల ఆదరణ పెరిగింది’ అన్నాడు పండిత్ భీమ్‍సేన్ జోషి.
‘లత మంగేష్కర్ పాటను అందరిలా మామూలుగా పాడదు. పాట పల్లవిలోనే తాను మాత్రమే చేయగల ప్రత్యేకతను పాటలో పొందుపరుస్తుంది. ఇది ఆ పల్లవిని ఆకర్షణీయం చేస్తుంది. దాంతో పాట లత పాట అవుతుంది. సూపర్ హిట్ అవుతుంది’ అన్నాడు లత తొలిపాటకు సంగీత దర్శకత్వం వహించిన దత్తా డావజేకర్. ఈయనను జీవితాంతం గౌరవించి ఈయన మాటను శిరసావహించింది లత మంగేష్కర్.
‘లత పాడటం ఆరంభించక ముందు పాటలు నాయికలు పాడటం వల్ల ప్రేక్షకులను ఆకర్షించేవి. కానీ లత నేపథ్యగానం ఆరంభించినప్పటి నుంచీ పాటలు పాటలు కాబట్టి ఆకర్షించాయి. లత స్వరం వల్ల నాయికలకు గుర్తింపు లభించింది’ అంది ప్రఖ్యాత నటి, గాయని కానన్ దేవి.
‘లత ఎంతగా పాడుతుందో, అంతగా సినీగీతాల ప్రపంచం ఐశ్వర్యవంతం అవుతుంది’ అన్నాడు సినీగీతాలకు వ్యాకరణం ఏర్పరచిన సంగీత దర్శకుడు, గాయకుడు పంకజ్ మల్లిక్.
‘లత పాటలు పాడుతుంది. మిగతా అంతా ఏడ్చినట్టు పాడతారు’ అంటాడు కుండలు బద్దలు కొట్టడంలో పేరుపొందిన సంగీత దర్శకుడు సజ్జాద్ హుస్సేన్.
‘లత మంగేష్కర్ నాకు సన్నిహితం. ఆమెను నేను తెరిచిన పుస్తకంలా చదువుతాను. కానీ మైక్రోఫోన్ ముందు నుంచుని ఆమె గళం విప్పినప్పుడు ‘ఎవరీ దేవత?’ అని ఆశ్చర్యపోతాను. ఆమె పాడుతున్నప్పుడు ఆమె పాదాలకు నమస్కరించాలనిపిస్తుంది’ అంటాడు సలీల్ చౌదరి.
‘నా వయోలిన్ లత స్వరంలా పలికితే నాకన్న అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు’ – ప్రఖ్యాత వయోలిన్ వాయిద్యకారుడు యెహుదీ మెన్యుహీన్.
అన్ని రంగాలలోనూ ప్రసిద్ధులు, నిపుణులు, ప్రతిభావంతులు లత స్వరంపై ప్రశంసలు కురిపించారు. లత ఆగమనంతో సినీ ప్రపంచంలో కొత్త వెలుగు వచ్చింది. సంగీత దర్శకులకు సంక్లిష్టమైన బాణీలు రూపొందించే విశ్వాసం ధైర్యం కలిగింది. ఇందుకు ఉదాహరణలుగా ఆరంభంలో లత పాడిన కొన్ని గీతాలను విశ్లేషించాల్సి ఉంటుంది. ఇతర గాయనీ గాయకులు మామూలుగా పలికే పదాలనే అలంకరణలు జోడించి అత్యంత సుందరము, మధురమైన గీతాలుగా లత తీర్చిదిద్దగలగటం అర్థమవుతుంది. ఎందుకని సినీ సంగీత ప్రపంచం లతకు దాసోహం అన్నదో, ఎందుకని ‘లతకు జలుబుచేస్తే, సినీ సంగీత ప్రపంచం తుమ్ముతుంది. సినిమాకు తలనొప్పి, ఒళ్ళునొప్పులు, జ్వరాలు వస్తాయి’ అని ప్రఖ్యాత సంగీత దర్శక జంట శంకర్ జైకిషన్‍లలో శంకర్ అన్నాడో అర్థమవుతుంది. ఎందుకని లత పాటలు పాడకపోతే సంగీత దర్శకుల కెరీర్లు ఖతం అయిపోయేవో, ఎందుకని ఎన్ని రోజులైనా లత కోసం సంగీత దర్శకులు, నిర్మాతలు ఎదురు చూసేవారో బోధపడుతుంది.
1947లో ‘ఆప్ కీ సేవామే’ సినిమాలో దత్తా డావజేకర్, పీలూ రాగంలో రూపొందించిన ఠుమ్రీ ‘పా లాగూ కర్ జోరీ రే’ అనే
‘పావ్ లాగూ’ అంటూ పాటను ఆరంభించటంలోనే ‘పా’ దగ్గర అసమానమైన ఆలాపన చేస్తుంది. మొదటి స్వరం వినటంతోటే హృదయం స్పందిస్తుంది. మోసే, జోరీ అన్న పదాల వద్ద వేసిన అలంకారాలు అలరిస్తాయి. ఇక శ్యామ్ వద్ద లత తీసిన రాగాలు ఎదను లాగదీసి స్వర్గ ద్వారాల వద్ద విడుస్తాయి. ఇతర గాయనిలు మామూలుగా పాడే పాటలో ఇన్ని అలంకారాలు వేసి, పాటను శోభాలంకృతను చేసింది లత. ఇది లతను ఇతర గాయనిలనుంచి వేరుచేసి ప్రత్యేకంగా నిలిపే అంశం. పీలూ రాగంలో రూపొందించిన ఈ పాటను ఆ కాలంలోని గాయనిలెవరూ పాడలేకపోయేవారనటం అతిశయోక్తి కాదు.
1948లో ‘జిద్దీ’ సినిమాలోది, ఖేమ్‌చంద్ ప్రకాశ్ రూపొందించిన ‘చందారే జారే జారె’ పాటను వినటం ఒక మధురానుభూతి. ఇది లత తొలి హిట్ పాట. సంగీత రత్నాకరం ప్రకారం నిర్దిష్ట వర్ణ సమూహాలను అలంకారాలంటారు. అలంకారాలను ’పల్టా’లని కూడా అంటారు. మధ్య సప్తక్ (సా) నుంచి తార్ సప్తక్ (సా) లను ఆరోహాణ అంటారు. వెనక్కు రావటం అవరోహణ అంటారు.
ఆరోహాణ – సారేగా, రెగమ, గమప, మపధ, పధనీ, ధనీసా
అవరోహణ – సానిధ, నిధప, ధమప, పమగ, మగరె, గరెసా
ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలా పలువర్ణాల సమూహాలు, ఆరోహణ అవరోహణలుగా ఉంటాయి. వీటిని పలకటంలో గాయకుడు ఒకోసారి కొన్ని వర్ణాలను దీర్ఘం తీసి పలుకుతాడు. ఒకోసారి ఒకో వర్ణాన్ని పలుకుతూ రెండో వర్ణాన్ని క్షణకాలం స్పృశించి మరో వర్ణంపైకి దూకుతాడు. ఇలాంటి అలంకారాలు నదిలో పరవళ్ళు తొక్కుతూ, గుడుసుల్లు తిరుగుతూ, నురగల్లు క్రక్కుతూ ప్రవహించే నీటిలాంటివి. అలంకారాలు లేని పాట నీరు లేని నదిలాంటిది. లత రంగ ప్రవేశం చేసేకన్నా ముందరి పాటలు అలంకారాలు లేని గీతాలు.
విశిష్ట సందర్భం అలంకారమ్ ప్రచక్షతే।
ఏకైక స్మూర్భ నాయాం త్రిష్టిరూదితా బుధై॥
వర్ణాలను పద్ధతి ప్రకారం పలకటం అలంకారం.
ఈ అలంకారాలలో సరళీజంట, దాటు మంద్రస్థాయి వరుసలుంటాయి. గమకాలుంటాయి. దీర్ఘాలుంటాయి. ఖట్కా, మీండ్, ముర్కి, కణ స్వరాలు ఇలా హిందుస్తానీ సంగీతంలో వీటికి పేర్లు.
భరతముని ప్రకారం అలంకారం స్థాయీ, ఆరోహ్, అవరోహి, సంచారీ వర్గాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తం 63 అలంకారాలున్నాయి. దలిత్ ముని ప్రకారం 18 అలంకారాలు, న్యాయదేవ్ ప్రకారం 56 అలంకారాలు, మాతంగముని ప్రకారం 33 అలంకారాలున్నాయి.
భరతముని ప్రకారం అలంకారాలు ఆరు వర్గాలు. ఉచ్చ, దీప్త, మంద్ర, నీచ (క్రింద), దృత విలమ్బిత్… పెద్దగా పాడటం, ఉచ్చస్వరమైతే దానికి రెండు రెట్లు దీప్త స్వరం. ఆక్షేపణ, కలషం, వివాదాల సమయంలో ఈ స్వరాలు వాడతారు. మెల్లిగా పాడితే మంద్రస్వరం, దానికన్నా ఇంకా క్రింది స్థాయిలో పాడితే క్రింద స్వరం. అంటే గాయకుడికి స్వరజ్ఞానం, లయజ్ఞానం, రాగలక్షణ గానం సంపూర్ణంగా తెలిసి ఉండటమే కాదు ఏ అలంకారం ఎక్కడ వేయాలో ఎంతవరకు వేయాలో తెలిసి ఉండాలి. లేకపోతే పాట అభాసు పాలవుతుంది.
సినీగీతాల రూపకల్పన పలు కళాకరుల సమ్మిశ్రిత కళా పదర్శన ఫలితం. స్క్రిప్టులో సందర్భం సరిగ్గా ఉండాలి. సినీ సంగీత దర్శకుడు ఆ సందర్భానికి తగ్గట్టు గేయ రచయిత రాసిన గేయానికి బాణీ కుదర్చాలి. అందుకు తగ్గ వాయిద్యాల కదలికలను రూపొందించాలి. అందరు వాయిద్యకారులు తమ సృజనను, ప్రతిభను ప్రదర్శించి పాటను ఆకర్షణీయం చేయాలి. పాటకు ప్రాణం పోసే గాయనీ గాయకులు లభించాలి. ఆపై పాట తెరపై తగ్గ రీతిలో చిత్రితమవ్వాలి. అప్పుడే ఒక పాట ప్రజల మనస్సులలో తిష్ట వేసుకుంటుంది. వీటిలో ఎక్కడ లోపం జరిగినా పాట సంపూర్ణంగా విజయం సాధించలేదు. కానీ ఎలాగైతే ఎంతోమంది కళాకారులు శ్రమపడితే కానీ రూపొందని సినిమాలో తెరపై కనబడే నటీనటులే ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తారో, అలాగే పాటలో కూడా ఎంతోమంది శ్రమించినా గాయనీ గాయకులు ప్రాధాన్యం వహిస్తారు. అందుకే పలు సంగీత దర్శకులు తామా బాణీని రూపొందించకపోతే గాయనీ గాయకులకు ఎంత ప్రతిభ ఉండీ లాభం లేదన్న అభిప్రాయం వ్యక్తపరుస్తారు. కానీ లతా మంగేష్కర్ విషయంలో తమ పాటలకు గాత్రంతో ప్రాణం పోసిన లతకు సంగీత దర్శకులు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే లత లాంటి గాయని లేకపోతే ఇలాంటి పాటలు రూపొందించే వీలు సంగీత దర్శకులకు లభించేది కాదు. ఈ విషయాన్ని 1949లో శ్యామ సుందర్ రూపొందించిన ‘బాజార్’ సినిమా పాట ‘సాజన్ కీ గలియా ఛోడ్ చలీ’ మరింత స్పష్టం చేస్తుంది.
యే జీనా భీ కోయి జీనా హై, హమ్ ఉన్ కో అప్‌నా కహ నా సకే
ఈ పల్లవిని లత పాడిన తీరు గురించి ఒక పుస్తకమే రాయవచ్చు. ఇదొక నిరాశాపూరితమైన విరహ విషాద గీతం. పహాడీ రాగంలో శ్యామ్ సుందర్ అత్యంత అద్భుతంగా దీపచంద్/చాచర్ తాళంలో పాటను రూపొందించాడు. పదాలను పలుకుతూ భావాన్ని ప్రకటితం చేయటం, పదాలను పలకటంలో ఒక శబ్దాన్ని సాగదీసి భావాన్ని విస్పష్టం చేస్తూ, శ్రోత మనస్సును పాట భావంతో మమేకం చేయటం, శబ్దాలను పలుకుతూ రాగాలు, దీర్ఘాలు తీస్తూ, నాయిక మనోభావాలతో శ్రోత స్పందించేట్టు చేయటం ఈ పాటలో స్పష్టంగా తెలుస్తూంటుంది. ఏడ్పు పాటను ఏడుస్తూ పాడనవసరం లేదని, పాటలో భావాన్ని స్వరంతో ప్రదర్శించటం ద్వారా శ్రోత హృదయాన్ని స్పందింపచేసి, విషాధ భావాన్ని అనుభూతికి తేవచ్చని ఈ పాట నిరూపిస్తుంది.
ఆరంభంలోనే లత ‘సాజన్’ అని పలకటంలోనే చమత్కారం చేస్తుంది. ‘సా’లోనే అలంకారం వేసి చిన్న ఆలాపన చేస్తుంది. ఇలా చేయటం వల్ల నాయకుడిపై ఫిర్యాదు చేస్తున్న భావన కలుగుతుంది. ‘కీ’ అన్న దగ్గర లత వేసిన అలంకారం నిరాశను సూచిస్తుంది. ప్రేమికుడు తనను దూరం చేస్తున్నాడన్న ‘షికాయత్’తో ఆరంభించి, అతడిని వదలి రావటం తప్పలేదన్న నిరాశను ‘కీ’ దగ్గర ప్రదర్శిస్తుంది. ‘చలే’ దగ్గర ‘ఖట్కా’ వేస్తుంది. ‘రోయా’ అని పలకటంలో ‘రో’ని మంద్రంగా పలికి ‘యా’ దగ్గర దీర్ఘం తీయటంలోనే ఏడుపు ధ్వనిస్తుంది. విషాదం ప్రకటితమవుతుంది. అంటే ‘సాజన్ కీ గలియా ఛోడ్ చలీ, దిల్ రోయా’ వరకూ వచ్చేసరికి శ్రోత విషాద సుడిగుండంలో చిక్కుకుంటాడు. లత స్వరం సృజించిన విషాద సుడిగుండం ఇది. ఇక ‘ఆసూ’ అనటంలో ‘ఆ’ దగ్గర క్షణమాత్రం ఆగి ‘సూ’ అని ‘లయ’ ఏమాత్రం చెదరకుండా సూ దగ్గర ‘మీండ్’ వేయటంతో వెక్కిళ్ళు తీస్తూ కన్నీళ్ళు కార్చటం అనుభూతికి వస్తుంది. అంటే ‘ఆసూ’ అన్న పదం పలకటంలో కళ్లముందు కన్నీరు కారే దృశ్యాన్ని తన స్వరంతో చిత్రిస్తోందన్న మాట లత. సంగీతం తెలిసిన వారు ఈ అత్యంత నిపుణవంతమైన సృజనాత్మక ప్రదర్శనకు ఆనందంతో కన్నీరు కారిస్తే, సంగీతం తెలియని మామూలు శ్రోతలు ఆ స్వర ప్రభావంతో విషాదానికి గురై కన్నీరు కారుస్తారు. వారి మనోభారం తగ్గి ఓ రకమైన ఉపశమనం కలుగుతుంది. విషాదంలోని ఆనందం అనుభవానికి వస్తుంది. ఇది లత గానంలోని గొప్పతనం. లత గాన సంవిధానం అనే సముద్రం వద్దకు ఎవరు ఎంత పాత్రతో వెళ్తే అంత ఆనందార్ణవాన్ని చేజిక్కించుకుంటారు. ఎవరు ఎలాంటి పాత్రతో వెళ్తే అంత ఆనందాన్ని పొందుతారు. ఇలా పాటలో ఒక్కో పదాన్ని, పదాన్ని పలికిన తీరు, ప్రదర్శించిన భావం, ఒక స్వరం నుంచి మరో స్వరాన్ని అందుకునేప్పుడు వేసిన అలంకారాలను చర్చిస్తూపోతే ఎన్ని పేజీలు రాసినా సంతృప్తి కలగదు. లత విజయ శిఖరాలను అందుకోవటమే కాదు, ఆ శిఖరంపై కొన్ని దశాబ్దాలు స్థిరంగా నిలబడిందంటే, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు కారణమని నమ్మేవారికి పాట అంటే అవగాహన లేదు. సంగీతం అంటే తెలియదు. పాటకు జీవం పోయడం అంటే తెలియదు. నదులెన్నో ఉన్నా గంగానది ఒక్కటే భారతీయత్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అన్ని నదులలో ప్రవహించేది నీరే. నీరు అంటే సాంకేతికంగా ఆక్సిజన్, హైడ్రోజన్ సంయోగం వల్ల ఏర్పడిన ద్రవం. కానీ గంగానది ప్రత్యేకత ఇతర ఏ నదికీ లేదు. లత స్వరం కూడా అంతే. స్వరం అంటే తరంగాలు. ఏ స్వరం అయినా తరంగాలే. పాడేందుకు ఉన్నవి సప్త స్వరాలు. ఎవరు పాడినా ఈ స్వరాలకు ఆ అలంకారాలను జోడించి అవే రాగాలను పాడాలి. కానీ ఎలా గంగానది ప్రత్యేకత గంగానదిదో, అలానే లత స్వరం ప్రత్యేకత లతదే! ఎంతమంది గాయనిలు, ఎంతెంత అందమైన మధురమైన గాత్రాలతో, అత్యంత నైపుణ్యం సంపాదించి, గానంలో శిక్షణ పొందివచ్చినా అన్ని దీపాలు సూర్యుడి ముందు వెలతెలబోయినట్టే లత స్వరం ముందు తేలిపోతాయి. ఇందుకు నిదర్శనమైన సంఘటన 1949 కన్నా ముందే జరిగింది.
‘బాజార్’లో లత ‘సాజన్ కీ గలియా’ పాట పాడటం విని ముగ్ధుడైన శ్యామ్‍సుందర్, తరువాత సినిమాలో లత కోసం ప్రత్యేకంగా బాణీని రూపొందించాడు. ‘ఈ పాట లత తప్ప మరెవరూ పాడలేరు’ అని ప్రకటించి లతను పాట పాడేందుకు పిలిచాడు.
లత వచ్చింది. కానీ శ్యామ్ సుందర్‍కు తాగుడు అలవాటు ఉండేది. రిహార్సల్స్ సమయంలో తాగి, రిహార్సల్స్ చేయించేవాడు. మత్తులో అరిచేవాడు, తిట్టేవాడు. ఇది లతకు నచ్చలేదు. పాట నేర్వటంలో లత చిన్న తప్పు చేయగానే ‘ఇది శ్యామ్ సుందర్ పాట, ఏ అల్లాటప్ప పాట కాదు. సరిగ్గా పాడు’ అని అందరి ముందు ఉచ్చరించకూడని పదాన్ని పలికాడు.
లతకు అప్పటికి పేరు లేదు. ఇంకా ఆమె పాడిన అద్భుతమైన పాటలు విడుదల కాలేదు. శ్యామ్ సుందర్ అప్పటికే పేరున్న సంగీత దర్శకుడు. కానీ లత స్వాభిమానం దెబ్బతిన్నది. అనవసరంగా మాటపడటం, అనటం ఆమెకు అలవాటు లేదు. దాంతో ఆమె రిహార్సల్స్ వదలి వెళ్ళిపోయింది. ఎవరెంత చెప్పినా రిహార్సల్స్‌కు రాలేదు. సరస్వతీ స్వరూపమైన సంగీతాన్ని తాగి సాధన చేయించే వాడికి పాడనని భీష్మించుకు కూర్చుంది.
శ్యామ్ సుందర్ ఆ పాటను వేరే గాయనిలతో పాడించే ప్రయత్నం చేశాడు. కానీ అతడికి నచ్చలేదు. లతలా ప్రతి పదాన్ని అర్థవంతం చేయటం, గాత్రంతో దృశ్యాన్ని చిత్రించటం, అనుభూతిని అవగాహనకు తేవటం అందరికీ సాధ్యం కావటం లేదు. ఎంత బ్రతిమిలాడినా లత పాట పాడేందుకు రావటం లేదు. ‘లత పాడకపోతే ఈ పాటను వదిలేద్దాం. సినిమాలో ఈ పాట లేకుండా తయారుచేయండి’ అని నిర్మాతతో చెప్పేశాడు శ్యామ్ సుందర్.
దాంతో నిర్మాత లత దగ్గరకు పరుగెత్తాడు. బ్రతిమిలాడేడు. “నేను పాడాలనే వచ్చాను. నాకు పాడాలనే ఉంది. పాడటంలో దోషాలు వస్తే ఎత్తి చూపమనండి. సరిచేయమనండి. అంతేకానీ అసభ్య పదజాలం వాడటం, దూషించటం నాకు నచ్చదు. నేను గాయనిని, దాసీని కాను” అంది లత.
నిర్మాత ఎంతో బ్రతిమిలాడగా ఆ పాట పాడేందుకు ఒప్పుకుంది. కానీ ఒక షరతు విధించింది. ‘నా ముందు అసభ్య పదజాలం వాడకూడదు. దుర్భాషలాడకూడదు. ఇందుకు మీరు పూచీ వుంటేనే పాడతాను” అంది.
నిర్మాత అందుకు ఒప్పుకున్నాడు. లత వచ్చి పాట పాడింది. సంగీత దర్శకుడు శ్యామ సుందర్ బుద్ధిగా ప్రవర్తించాడు. ఆ తరువాత అతడు సంగీత దర్శకుడిగా ఉన్న సినిమాలకు పాడనని ముందే చెప్పేసేది లతా మంగేష్కర్.
దాంతో శ్యామ్ సుందర్ తరువాత శంషాద్ బేగమ్, సులోచన కదమ్, పుష్ప హన్స్, ఉమాదేవి వంటి గాయనిలతో పాడించాడు. కానీ లాహోర్, బాజార్‍లో లత పాటలు అయినంత హిట్ కాలేదు శ్యామ్ సుందర్ పాటలు. చివరికి 1953లో ‘అలిఫ్ లైలా’ సినిమాలో పాటలు పాడమని లతను అభ్యర్థించాడు. లత తిరస్కరించింది. అప్పటికే శ్యామ్ సుందర్‍కు కేన్సర్ అని తెలిసింది. ఎక్కువ రోజులు బ్రతకడని తెలుస్తోంది. ఆ సమయంలో లత పాటలు పాడకపోతే సంగీత దర్శకుడిని మార్చేస్తానని నిర్మాత అన్నాడు. తన వల్ల అతని అవకాశం, అదీ మృత్యు ముఖంలో ఉన్న సంగీత దర్శకుడి అవకాశం పోవడం ఇష్టం లేని లత ఆ సినిమాలో పాడేందుకు ఒప్పుకుంది. శ్యామ్ సుందర్ అనగానే గుర్తుకు వచ్చే పాట ‘బహార్ ఆయీ ఖిలీ కలియాన్’ పాట పాడింది. ఈనాటికీ శ్యామ సుందర్‍ను, మహమ్మద్ రఫీని సినీ పరిశ్రమకు పరిచయం చేసినవాడిగా, లతతో అద్భుతమైన పాటలు పాడించిన వాడిగానే గుర్తుంచుకుంటుంది ప్రపంచం. అంతకుముందు నూర్జహాన్‍తో , విలేజ్ గర్ల్ (1945) సినిమాలో ‘బైఠీ హూ యాద్ క లేకర్ కే సహారా” అనే హిట్ పాటను పాడించినా, ప్రధానంగా శ్యామ్ సుందర్ లత పాటల ద్వారానే చిరంజీవి అయ్యాడు. శ్యామ్ సుందర్ సంగీత జీవితం, సంగీత దర్శకుల పాటలకు ప్రాణం పోయటంలో గాయనీ గాయకుల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుంది.
సంగీత దర్శకుడు ఎంత ప్రతిభావంతుడైనా, ఎంత అత్యద్భుతమైన బాణీని రూపొందించి, వాయిద్యాలతో ఎంతగా అలంకరించినా, ఆ పాటకు తన స్వరంతో ప్రాణంపోసి అమరగీతంలా మలచగలిగే గాత్రం లభించకపోతే ఎంత గొప్ప బాణీ అయినా వ్యర్థం అవుతుంది. అదే గాయకుడు ప్రతిభావంతుడైతే, తన గాత్రంతో తన ప్రతిభతో ఎలాంటి బాణీనైనా మరపురాని గీతంలా మలచగలడు. ఇది లతకు తెలుసు. తన గాత్రంపై ఆమెకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అందుకే ఆమె సంగీత దర్శకులను గౌరవించింది. కానీ ఎవరికీ దాసోహం అనలేదు. తనను గౌరవించిన వారికి పాడింది. గౌరవించని వారిని పట్టించుకోలేదు. ‘ఎలాంటి గాత్రం కోసమైతే సినీ సంగీత ప్రపంచం ఎదురుచూస్తోందో, అలాంటి దివ్య స్వరం లతా మంగేష్కర్‌ది’ అని అందుకే ఆ కాలంలో సంగీత దర్శకులు ముక్త కంఠంతో లతను ప్రశంసించారు. 1946 నుండి 1949 వరకూ లత కెరీర్ నిర్మాణం జరిగింది. 1949 నుంచీ సంగీత దర్శకులు లత స్వరం మెట్ల ఆధారంగా శిఖరారోహణం చేయటం ఆరంభమయింది. తద్వారా లత సంగీత ప్రపంచంలో అందనంత ఎత్తుకు చేరింది. ఎందుకంటే, 1949 నుంచి కొత్తనీరు, సినీ సంగీత ప్రపంచంలోకి రావటం మొదలయింది. సినీ సంగీత స్వరూపం సంపూర్ణంగా రూపాంతరం చెందింది. స్వర్ణయుగంపై తెర తొలగింది.
(ఇంకా ఉంది)