సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-12

2
2

ఠండీ హవాయే లహెరా కె ఆయే

రుత్ హై జవాన్ , తుమ్ కో యహా, కైసే బులాయే?

[dropcap]’నౌ[/dropcap]జవాన్’ సినిమాలో ఎస్డీ బర్మన్ రూపొందించిన మధురమైన బాణీకి అంత ఆహ్లాదకరమైన, శృంగారపరమైన భావాలను సాహిర్  కూర్చాడు. ఆ భావాలకు ప్రాణం పోసి చిరకాలం శ్రోతల మనస్సులలో నిలచి, తరతరాలుగా యువతీ యువకుల సున్నిత శృంగార భావనలను ఉద్దీపితం చేసే రీతిలో పాటను గానం చేసింది లతా మంగేష్కర్. ఈ పాటను పాడే సమయానికి లత వయసు దాదాపుగా 21 అయి ఉంటుంది. వయసుకు తగ్గ పాట. ఆ వయసులో జనించే అందమైన శృంగార భావనలను అభివ్యక్తం చేస్తూ పాడింది లత. అయితే, ఆ సమయానికి లత ఎంత బిజీగా ఉండేదంటే ఆమెకు ఏ విషయం గురించి కూడా ఆలోచించే తీరిక ఉండేది కాదు. 1949లో 151 పాటలు పాడిన లత, 1950లో 152, 1951లో 218, 1952లో 171, 1953లో 189 పాటలు పాడింది. ఇవి విడుదలైన సినిమాలలోని పాటలు. ఇంకా రికార్డయి విడుదల కానివి ఎన్ని పాటలున్నాయో లెక్కలేదు. అలాగే రిహార్సల్స్ చేసిన తరువాత చివరి నిమిషంలో ఆ పాట వద్దనుకుని మరో పాటను తయారుచేసిన సందర్భాలు ఎన్నో. అవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఉదయం లేచినప్పటి నుంచీ రాత్రి పడుకునే వరకూ పాటలు నేర్వటం, రిహార్సల్స్ చేయటం, రికార్డు చేయటంతోటే సరిపోయేది. చిలిపి శృంగార భావాలకు కానీ, ప్రేమలాంటి బలహీనతలకు కానీ సమయం వుండేది కాదు. పైగా, ప్రేమ వివాహం చేసుకుని సోదరి ఆశా వెళ్ళిపోవటం కూడా ప్రేమంటేనే విముఖత, అసహ్యం కలిగించివుంటుంది. కాబట్టి, పాటలలో తన స్వరంలో శృంగారం చిలికించినా, నిజజీవితంలో లతకు దేనికీ సమయంలేదు, ఒక్క పాటకుతప్ప.

“ఆ కాలంలో నేను ఎంత బిజీగా ఉండే దాన్నంటే రోజులు ఎలా గడిచేవో తెలిసేది కాదు. నా రికార్డింగులు ఉదయం నుంచి, అర్ధరాత్రి వరకు సాగుతూండేవి. ఒక స్టూడియో నుండి రెండవ స్టూడియోకు, రెండవ స్టూడియో నుండి మూడవ స్టూడియోకు పరుగులు తీయడంలోనే నాకు రోజులు గడిచిపోయేవి. నాకు నా పాటల రికార్డింగ్‍లు తప్ప రెండవ విషయం పట్టించుకునే ఓపిక తీరికలుండేవి కావు” అంది లత గతాన్ని నెమరువేసుకుంటూ.

ఆ కాలంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. ప్రయాణ సాధనాలు అంతగా ఉండేవి కావు. రికార్డింగ్‍కు ఏసి గదులు లేవు.  పైగా రికార్డింగ్‍కు ఇప్పటిలాగా సౌకర్యవంతమైన స్టూడియోలుండేవి కావు. పాటల వల్ల సినిమాలకు వ్యాపార పరంగా లాభాలు ఎన్నో ఒనగూడుతున్నా సినీ ప్రపంచం సంగీతాన్ని ఒక లాభసాటి పరిశ్రమగా గుర్తించలేదు. సినీ సంగీత కళాకారులకు ఎలాంటి సౌకర్యాలుండేవి కావు. తరువాత రికార్డింగ్ కోసం ప్రత్యేకమైన స్టూడియోలుండాల్సిన అవసరం గుర్తించి ‘ఫేమస్’ ‘తార్‍దేవ్’ అనే స్టూడియోలను నిర్మించారు. తరువాత మరో స్టూడియోను కూడా ‘ఫేమస్’ స్టూడియో పేరుతోనే నిర్మించారు. వీటిల్లో క్యాంటిన్లు ఉండేవి కావు. ఉన్నా అవి ఎక్కడ ఉన్నాయో అడిగి తెలుసుకునే తీరిక లతకు ఉండేది కాదు. చాయ్‍లతోనే ఆమె సరిపెట్టుకునేది. స్టూడియోలు కూడా ఓ పెద్ద హాలులా ఉండేవి. అంతే. “ఫిల్మిస్తాన్ స్టూడియో నిర్మించే సినిమాల పాటలైతే దుమ్మూ దూళి కొట్టుకుపోయి పెయింటింగ్ వాసన నిండి షూటింగ్ పూర్తయిన హాళ్ళలోనే పాటలు రికార్డయ్యేవి. అందరూ వెళ్ళిన తరువాత ఆ దుమ్మూ ధూళిలోనే నేలపై కూర్చుండి, పరమాద్భుతమైన పాటలను పాడేవాళ్ళం” అంది లత ఆ కాలాన్ని గుర్తుచేసుకుని. ‘నాగిన్’, ‘అనార్కలి’ సినిమాలలో పాడిన పరమాద్భుతమైన పాటలన్నీ దుమ్మూ ధూళితో, సెట్ ప్రాపర్టీలతో నిండి, స్పాట్ లైట్ల వేడికి ఉడికిపోతున్న హాలులో రికార్డు చేసినవే. రికార్డింగ్ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అయ్యేది. అలసిసొలసి ఇంటికి వెళ్ళి నిద్రపోయి మళ్ళీ ప్రొద్దున్నే లేచి ఉరుకులు, పరుగుల మీద స్టూడియోలకు వెళ్ళాల్సి వచ్చేది. ఇలా రికార్డింగ్‍లు, రిహార్సల్స్  ఎన్ని ఉండేవంటే, ఆదివారాల స్పృహ ఉండేది కాదు. సెలవుల ఆలోచన ఉండేది కాదు. పండుగలు పబ్బాల ప్రసక్తి ఉండేది కాదు. తిండి ధ్యాస ఉండేది కాదు. కేవలం పాటలు, రికార్డింగ్ అంతే.

“నా మనసులో ఎంతసేపూ ఏ రకంగా నా కుటుంబ పరిస్థితి మెరుగుపరచగలను అన్న ఆలోచన తప్ప మరో ఆలోచన

ఉండేది కాదు. నా కుటుంబ సభ్యుల కోరికలు తీర్చి, వారి భవిష్యత్తును సుస్థిరం చేయటం కోసం ఎంత సంపాదించాలి అన్నది తప్ప మరొకటి గుర్తుండేది కాదు. ఎంతసేపూ ఓ సినిమా పాటల రికార్డింగ్ పూర్తవుతూనే మరో సినిమా పాటలు పాడే కాంట్రాక్ట్ దొరుకుతుందా లేదా అన్న దానిపైనే దృష్టి ఉండేది. నాకు రికార్డింగులో కష్టమూ, హాలులో దుమ్ము ధూళి, వేడి, ఆకలి ఏవీ మనసుకు ఎక్కేవి కావు. ఎంతసేపూ ఈ పాటను ఎంత అద్భుతంగా పాడాలంటే నాతో మళ్ళీ మళ్ళీ పాడించాలని నిర్మాత దర్శకులకు అనిపించాలి” అంది లత. ఆ కాలంలో అమె చాయ్, బిస్కట్లతో రోజులు గడిపేసేది.

ఇంత కష్టపడ్డా కొందరు నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టేవారు. ఇంకో సినిమా పాటలలో అడ్జస్టు చేస్తామనేవారు. డబ్బులిమ్మని గట్టిగా పట్టుబడితే రాబోయే అవకాశం పోతుందేమోనని భయం, పట్టుబట్టకపోతే అతడు మరో సినిమా తీయకపోతే ఈ డబ్బులు పోతాయని భయం. అయినా మరో సినిమాలో లతతోనే తప్పనిసరిగా పాడించాలన్న నియమం లేదు. వేరే ఎవరితోనైనా పాడిస్తే శ్రమ మిగులుతుంది తప్ప ఫలితం దక్కదు. ఈ రకమైన అనేక భయాలు, సందేహాలు ఆరంభ దినాలలో లతను పట్టి పీడించేవి.

అలాగని అవకాశాల కోసం లత ఎవ్వరినీ అభ్యర్థించలేదు. రాజీ పడలేదు. ఆరంభం నుంచీ తన చుట్టూ ఒక పరిధి గీసుకుని ఆ పరిధిలోనే పనిచేసింది. పరిధి దాటాలని ప్రయత్నించిన వారిని వారెంత గొప్పవారైనా విసిరికొట్టేది. ఉత్తమ స్థాయి బాణీలు, ఉన్నతమైన భావనలు, చక్కని పదాలున్న పాటలే పాడింది. ఎవరైనా నాసిరకం పాటలు, ద్వంద్వార్థాల పదాల పాటలు పాడమంటే నిర్మొహమాటంగా తిరస్కరించింది. అంతేకాదు లతకు ఓ నియమం ఉండేది. దాన్ని తు.చ తప్పకుండా పాటించింది. ఆ నియమం ఏమిటంటే, ఒక సినిమాలో పాటలు రూపొందించేముందు ఒక సంగీత దర్శకుడిని ఎన్నుకుంటే, ఏదైనా కారణాల వల్ల ఆ సంగీత దర్శకుడిని తొలగించి మరో సంగీత దర్శకుడిని నియమిస్తే, తొలగించిన సంగీత దర్శకుడి అనుమతితోనే అది జరగాలి. పలు సందర్భాలలో డబ్బులు ఎగగొట్టేందుకు సంగీత దర్శకులను మార్చేసేవారు. అందుకని అలా హఠాత్తుగా కారణం లేకుండా  మార్చేందుకు లత ఒప్పుకునేది కాదు. ఓ సినిమాలో ఓ సంగీత దర్శకుడిని తొలగించి సి. రామచంద్రను ఎంచుకున్నారు. ఆ సినిమాలో పాటలు పాడేందుకు లత నిరాకరించింది. 1954లో ఓ సినిమాకు రోషన్ సంగీత దర్శకత్వం వహించాల్సి ఉంది. అదే సమయానికి ‘ఆర్‌పార్’ సినిమా హిట్ కావడంతో ఓ.పి.నయ్యర్ పేరు మార్మోగుతున్నది. దాంతో సినిమా నిర్మాత అమర్‌నాథ్ రోషన్ పేరు తొలగించి ఓ.పి. నయ్యర్‍ను సంగీత దర్శకుడిగా నియమించాడు. మరో సినిమాలో ‘మహ్మద్ షఫీ’ ను సంగీత దర్శకుడిగా తొలగించి ఓ.పి.నయ్యర్ నియమించాడు.

ఆ సమయంలో ఓ.పి.నయ్యర్ ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాడు. దాంతో అందిన సినిమాను అందిపుచ్చుకున్నాడు. అంతకు ముందు ఓ.పి.నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన ఆస్మాన్, చమ్‍చమాచమ్, బాజీలు అంతగా విజయవంతం కాలేదు. ‘బాజీ’ సినిమా నిర్మించే సమయంలో గురుదత్‍తో పరిచయం అయింది. ఫలితంగా ‘ఆర్‍పార్’ సినిమాలో అవకాశం లభించింది . ఓ.పి.నయ్యర్ కు  ‘ఆర్‍పార్’ సినిమా అవకాశం లభించిన విధానాన్ని ఓ.పి.నయ్యర్ స్వయంగా వెల్లడించాడు.

గీతాదత్, గురుదత్, ఓపీ నయ్యర్

“నేను సంగీత దర్శకత్వం వహించిన మూడు సినిమాలు పరాజయం పాలయ్యాయి. పాటలు కూడా పెద్దగా హిట్ కాలేదు. నాకు రావాల్సిన డబ్బులు రాలేదు. సినిమాలు పరాజయం పాలవటంతో నాకు కొత్త అవకాశాలు రాలేదు. నా ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారయింది. బొంబాయి వదలి వెళ్ళిపోవాలనుకున్నాను. బాజీ సినిమాకు సంగీత దర్శకత్వం వహించినందుకు నాకు గురుదత్ నుంచి డబ్బులు రావాల్సి ఉంది. అవి వసూలు చేసుకునేందుకు నేను గురుదత్ దగ్గరకు వెళ్ళాను. నా డబ్బులిచ్చేస్తే  వెళ్ళిపోతానని చెప్పాను. గురుదత్ అప్పుడు టేబిల్ మీద కాళ్ళు పెట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. టేబుల్ మీదనుంచి కాళ్ళు తీయకుండానే ‘నా దగ్గర డబ్బుల్లేవు’ అని నిర్లక్ష్యంగా చెప్పాడు. ‘నేను ఆర్‍పార్ అనే సినిమా తీస్తున్నాను. దానికి సంగీత దర్శకత్వం వహించు. ఆ సినిమా నీ భవిష్యత్తు, నా భవిష్యత్తులను అటో ఇటో తేల్చేస్తుంది. హిట్ ఐతే నీ డబ్బులు నీకొస్తాయి. ఫెయిలైతే నీతోపాటు నేనూ మూటముల్లె సర్దుకుని పోతాను’ అన్నాడు గురుదత్.”

‘ఆర్‍పార్’ సూపర్ హిట్ అవటంతో ఓ.పి.నయ్యర్ కు  సినిమాల అవకాశాలు రావటం మొదలైంది. అర్థిక ఇబ్బందులు తగ్గించుకునేందుకు వచ్చిన అవకాశాలను స్వీకరించాడు ఓ.పి.నయ్యర్. అలా స్వీకరించినవే రోషన్, మహమ్మద్ షఫీలను తొలగించిన సినిమాలు.

ఆరంభం నుంచి ఇలాంటి పద్ధతికి లతా మంగేష్కర్ వ్యతిరేకి. పైగా లతకు ఇష్టమైన సంగీత దర్శకుడు రోషన్. అతడి అవకాశాన్ని కొత్త సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్ ఎత్తుకుపోవటం లతకు నచ్చలేదు. ఓ.పి.నయ్యర్ కు  పాడటానికి నిరాకరించటమే కాదు, ఓ.పి.నయ్యర్ అవకాశాలను అన్యాయ పద్ధతుల ద్వారా పొందుతున్నాడని ‘సినీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆసోసియేషన్‍’కు లత ఫిర్యాదు చేయించింది. అది చిలికి చిలికి గాలి వాన అయింది. ఆ కాలంలో సినీ మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ బిశ్వాస్. అనిల్ బిశ్వాస్ లత సమర్థకుడు. అతడూ ఓ.పి.నయ్యర్ వ్యతిరేకంగా తీర్చుఇచ్చాడు.  కానీ ఆ తీర్పును ఓ.పి.నయ్యర్ లెక్కచెయ్యలేదు. దాంతో అతని సంగీత దర్శకత్వంలో ఎవరూ పాడకూడదని తీర్మానించారు. కానీ శంషాద్ బేగమ్, ఆశాభోస్లే, గీతాదత్‍లు నయ్యర్‍తో పాడేందుకు ముందుకు వచ్చారు. నయ్యర్ సినిమాలు సూపర్ హిట్‍లు కావటంతో వివాదం అణిగిపోయింది.  కానీ ఓ.పి.నయ్యర్ మాత్రం లతతో పాడించనని శపథం పెట్టాడు. తనకు లత స్వరం అవసరం లేదని, తన పాటలను బలహీనమైన స్వరాలు పాడలేవని ప్రకటించి శంషాద్ బేగమ్, గీతాదత్, ఆశాభోస్లే లతో పాటలు పాడించాడు.

కొన్నేళ్ళ తరువాత,  ‘ఆస్మాన్’ సినిమాలో ఓ పాట పాడిన రాజకుమారి తాను పాడిన పాట లత మంగేష్కర్ కోసం తయారయిన పాట అనీ, లత పాడకపోవటం వల్ల తనతో పాడించారని వ్యాఖ్యానించింది. అది ఓ.పి.నయ్యర్ కోపం తెప్పించింది. “పాటలు పాడే ఆమెకు ఏ పాట ఎవరితో పాడించాలని అనుకున్నామో, ఎలా తెలుస్తుంది? రాజ్‍కుమారి అబద్దం చెప్తోంది. నిర్మాత విభిన్నమైన స్వరం కావాలని కోరాడు. ఆ పాటను రాజ్ కుమారితో పాడించాం అంతే. నా బాణీలకు లత స్వరం సరిపోదు” అని నొక్కి వక్కాణించాడు.

అయితే లత వ్యక్తిత్వాన్ని గమనిస్తే, ఎవరెంతగా రెచ్చగొట్టినా లత వారికి సమాధానం ఇవ్వటమో, లేక దూషించడమో ఎట్టి పరిస్థితులలో చేయదు. ఆమె ఎన్నడూ బహిరంగంగా “ఈ సంగీత దర్శకుడితో పాటలు పాడను” అని ప్రకటించదు. ఆమెకు ఆ సంగీత దర్శకుడి  పాటలు పాడేందుకు తీరిక దొరకదు. ఇతర పాటల రికార్డింగులతో బిజీగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆమె రికార్డింగ్ సమయానికి రాలేకపోతుంది. చివరి క్షణంలో రికార్డింగ్ కాన్సిల్ అయిపోతుంది. ఆమె ప్రవర్తనను బట్టి అర్థం చేసుకోవాలి తప్ప, ఆమె ప్రత్యక్షంగా ఒక్కమాట అనదు. భవిష్యత్తులో మళ్ళీ సయోధ్య కుదిరే వీలు కల్పించడం కోసం అన్నమాట ఈ ప్రవర్తన. ఎందుకంటే ఒకమాటకు సమాధానం ఇస్తే మరో పదిమాటలు తిరిగివస్తాయి. మాటలు పెరుగుతాయి. తిరిగి కలిపే వీలులేని విధంగా మనస్సులు దెబ్బతింటాయి. కాబట్టి మాటకు మౌనమే సమాధానం ఇవ్వటం మంచిది. లత అదే చేస్తుంది.

ఆవత్‌గారీ ఏక్ హై, ఉలటత్ హోయీ అనేక్
కహ కబీర్ నహీ ఉలటీయే, వహీ ఏక్ కీ ఏక్

అన్న కబీర్ సూక్తిని అక్షరాలా అనుసరిస్తుంది లత. మనలను ఏవరయినా విమర్శిస్తే, మనం తిరిగి ఒక్క మాట అన్నా ఒకమాట అనేక మాటల్లా మారిపోతాయి. కాబట్టి ఒక్క మాటకు సమాధానం ఇవ్వకపోతే, ఒకే మాట మిగిలిపోతుంది. కాబట్టి లత ఏవరేమన్నా మౌనం వహిస్తుంది. అందరికీ తన పాటతోటే సమాధానం ఇస్తుంది.

ఓ సంగీత దర్శకుడికో, నిర్మాతకో లత పాడటం ఇష్టం లేకపోతే ఎలా ప్రవర్తిస్తుందో కేదార్ శర్మ తన అనుభవాన్ని ఓ సందర్భంలో వివరించాడు.

“హమారీ యాద్ ఆయేగీ” సినిమాలో ‘కభీ తన్‌హాయియోమె” పాట కోసం లతా మంగేష్కర్‌ను పాడమని అడిగాము. లత ఒప్పుకుంది. ఆమెకు ఇతరులు ఎంత డబ్బు ఇస్తారో అంత డబ్బు ఇచ్చేందుకు నేను ఒప్పుకున్నాను. అయితే విధి, లత కారు డ్రైవర్ నా పథకాలన్నిటినీ తల్లక్రిందులు చేశాడు” అంటూ జరిగింది చెప్తాడు కేదార్ శర్మ.

మొదటిరోజు రిహార్సల్స్ తరువాత లత టేక్‍కి సిద్ధం అని చెప్పింది. కానీ లత డ్రైవర్ కేదార్ శర్మ దగ్గరకు వచ్చి  ‘నాకు 140 రూపాయలు ఇస్తేనే టేక్ వీలవుతుంది. లేకపోతే రికార్డింగ్ జరగదు.  నిర్మాతలంతా నాకు డబ్బులిస్తారు’ అన్నాడు. ‘నా ఆహం దెబ్బతిన్నది. నేను అందరి నిర్మాతల లాంటి వాడిని కాను’ అని అన్నాడు కేదార్ శర్మ. ఎందుకంటే డబ్బు విషయంలో చర్చలు జరుగుతున్నప్పుడు లత ఇలా డ్రైవర్ కి ఇవ్వాల్సిన సొమ్ము గురించి ప్రత్యేకంగా కేదార్ శర్మకు ఏమీ చెప్పలేదు. డ్రైవర్‍కి కేదార్ శర్మ డబ్బులు ఇవ్వలేదు. టేక్ తీసుకునే రోజు వచ్చింది. ఆ రోజు లత రికార్డింగ్ కాన్సిల్ అయింది. దానితో కేదార్ శర్మకు డబ్బు నష్టం అయింది. ఇలా రెండుసార్లు జరిగింది. లత కారు డ్రైవర్ టేక్‍లు కాన్సిల్ చేస్తున్నాడని కేదార్ శర్మకు తెలిసింది. దాంతో మరో డేట్ నిర్థారించుకుందాం అని లత అనగానే కేదార్ శర్మ కోపంతో ఇప్పటికే చాలా నష్టపోయాను. మళ్ళీ డబ్బులు జమ అయినప్పుడు ఫోన్ చేస్తాను” అన్నాడు. డ్రైవర్‍కు రూ. 140 ఇచ్చేయమని సంగీత దర్శకుడు స్నేహల్ భాట్కర్, కేదార్ శర్మను బ్రతిమిలాడాడు. కానీ ఇది డబ్బు సమస్య కాదు. నేను నిర్మాతను. ఎవరి దయాదక్షిణ్యాల మీద ఆధారపడి లేను. నేను ఎవరి సేవకుడను కాను” అని కేదార్ శర్మ ఆ పాటను పాడేందుకు ముబారక్ బేగమ్‍ను పిలిచాడు.

కభీ తన్‌హాయియోమే యూన్…

ముబారక్ బేగమ్, కేదార్ శర్మ ఆఫీసుకు వచ్చి అతనితో ఒంటరిగా ఓ మాట మాట్లాడాలని కోరింది. అందరూ ఆమె లత పాట పాడటానికి భయపడుతోందని అనుకున్నారు. కానీ ఆమె “నేను భోజనం చేసి రెండు రోజులైంది. నాకు బన్ను, బిస్కట్లు తెప్పిస్తారా” అని కోరింది. దాంతో ‘ఆకలితో ఉన్నవారి కడుపు నింపే అవకాశం దొరికిందని సంతోషించాన’ని అన్నాడు కేదార్ శర్మ. అలా ముబారక్ బేగమ్ పాడిన ‘కభీ తన్‌హాయియోమే యూన్, హమారీ యాద్ ఆయెగీ” పాట ఈనాటికీ మరపురాని గీతంలా మిగిలింది. (The one and only kedar Sharma, an anecdotal  biography,  Page No. 248-249)

లత మౌనంగా ఉండటం వల్ల అనేక సందర్భాలలో అపార్థాలు, వివాదాలు చెలరేగాయి. కేదార్ శర్మ విషయంలో డ్రైవర్‍కు డబ్బులు అదనంగా ఇవ్వకపోవటంతో అతను టేక్‍లు కాన్సిల్ చేశాడు. కానీ దోషం లతకు ఆపాదించారు. ఆమె ఎవరికీ ఎలాంటి విషయంలోనూ సంజాయిషీ ఇవ్వలేదు. ఓ.పీ.నయ్యర్ విషయంలో పలుమార్లు ప్రశ్నిస్తే ‘వేరే రికార్డింగ్‌లో ఆలస్యం అవటం వల్ల అనుకున్న సమాయానికి వెళ్ళలేకపోయాను. రెండుమూడు మార్లు ఇలా జరగడంతో వారు అపార్థం చేసుకున్నారు” అంది తప్ప ఓ.పి.నయ్యర్ కు  పాడటం ఇష్టం లేదన్న మాట లత అనలేదు.

డబ్బు విషయంలో లత ఖచ్చితంగా ఉంటుంది. ఆమె పాటలు పాడటం ఆరంభించిన రోజుల్లో ఎందరో నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టేరు. చివరికి ఆమెను బొంబాయికి తెచ్చిన మాస్టర్ వినాయక్ కూడా మరణించే నాటికి లతకు ఆరునెలల జీతం బాకీ ఉన్నాడు. అనుకున్న సమయానికి డబ్బు అందకపోవటం కష్టపడి పాటలు పాడిన తరువాత, పాటలు హిట్ అయి నిర్మాతలకు డబ్బులొస్తున్నా  పాడిన గాయనీ గాయకులకు డబ్బులు ఇవ్వకపోవటం వంటి చేదు అనుభవాలు లతకు పాఠాలు నేర్పాయి. 1949లో ఒకటి తరువాత ఒకటిగా హిట్ పాటలు రావటం, అల్బేలా, అనార్కలి, అవారా వంటి సినిమాల పాటలు సూపర్ హిట్‍లు కావటంతో  పెట్టుబడి పెట్టేవారు లత పాటలు తప్పనిసరిగా ఉండాలని పట్టుబట్టేవారు. కామినీ కౌశల్, మధుబాల, నళినీ జయవంత్, నర్గిస్ వంటివారు సినిమాలో నటించేందుకు ఒప్పందం జరిగే సమయంలోనే, తమకు లత నేపథ్యగానం అందించాలన్న నియమం విధించేవారు. దాంతో తప్పనిసరిగా లత షరతులకు ఒప్పుకుని పాటలు పాడించాల్సి వచ్చేది. కాబట్టి “1952 తరువాత నిర్మాతలు   డబ్బులు ఎగ్గొట్టే సమస్య ఎదురవలేదు” అంది లతా మంగేష్కర్.

1949 తరువాత సినిమాల వ్యాపార విలువను పెంచటంలో పాటల ప్రాధాన్యం స్పష్టమయింది. ముఖ్యంగా బర్సాత్ పాటలు దేశమంతా మార్మోగి రికార్డులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవటంతో సినిమాలలో పాటల విలువ తెలిసింది. పాటలు సినిమాను హిట్ చేయగలవన్న సత్యం స్పష్టమయింది. ఈ సమయంలోనే లత, రికార్డులపై గాయనీ గాయకుల పేర్లుండాలని పట్టుబట్టి సాధించింది. అంతేకాదు, ఒక పాట హిట్ అయితే సంగీత దర్శకుడి విలువ పెరుగుతుంది. నిర్మాతలకు పాటల ద్వారా అందే లాభాలలో సంగీత దర్శకులకు వాటా అందుతుంది. సంగీత దర్శకుడీకి వాటా లభించినప్పుడు, అతడి బాణీలకు ప్రాణం పోసిన గాయనీ గాయకులకు వాటా ఎందుకు లభించకూడదు? అన్న వాదనను ఆరంభించింది లత.

లత ఈ వాదన నిర్మాతలకు నచ్చలేదు. సంగీత దర్శకులకు నచ్చలేదు. “మేము బాణీలు సృజించకపోతే గాయనీ గాయకులు ఏం పాడతారు? కాబట్టి సంగీత దర్శకులకే ప్రాధాన్యం” అని కొందరు సంగీత దర్శకులు వాదించారు.  “మా పాటలకు వాయిద్యాలు వాయించేవారికి డబ్బిస్తాం. మేము చెప్పినట్టు వాయించి వాళ్ళువెళ్ళిపోతారు. లత కూడా అంతే. ఆమె స్వరం కూడా ఒక వాయిద్యం లాంటిదే”  అన్నారు ఇంకొందరు సంగీత దర్శకులు.  వారితో వాదించలేదు లత. వారిని ఒక్కమాటా అనలేదు.

 అయితే, ‘ఆవారా’ పాటలు సూపర్ హిట్ అయిన తరువాత లత రాజ్‍కపూర్‍ను ఓ రోజు నిలదీసింది. “మేము పాడిన పాటలు అమ్మి లాభాలు సంపాదిస్తారు. సినిమాలు మా పాటల వల్ల సూపర్ హిట్ అవుతాయి. అలాంటప్పుడూ మాకు రాయల్టీ ఇస్తే తప్పేమిటి?” అని. ఆమె వాదనను ఒప్పుకున్న రాజ్ కపూర్, ఆమెతో పాటలు పాడే ఒప్పందం చేసుకునేటప్పుడు  రాయల్టీ విషయంలో కూడా ఒప్పందం చేసుకుని రాయల్టీ చెల్లించేవాడు. అప్పటికి సినీగాయనీ గాయకుల హక్కుల కోసం పోరాడే ఓ సంస్థ   ఏర్పడలేదు. దాంతో లత ఒక్కర్తి ఒంటరి పోరాటం చేసింది. తనకు రాయల్టీ ఇచ్చేందుకు సిద్దపడే నిర్మాతలకే పాటలు పాడింది. లతకు రాయల్టీ అయితే ఇచ్చేవారు కానీ సంగీత దర్శకులకు ఇది కన్నెర్రగా ఉండేది. పలు సందర్భాలలో వారితో లత వివాదం వేదికలపై ప్రత్యక్షంగా కూడా కనిపించింది.

1954లో ఫిలింఫేర్  అవార్డులు ఆరంభమయ్యాయి. ఆరంభంలో కేవలం సంగీత దర్శకుడికి అవార్డు ఇచ్చేవారు. గాయనీ గాయకులకు కానీ, గేయ రచయితలకు కానీ బహుమతులుండేవి కావు. లతా మంగేష్కర్ ఈ విషయానికి కూడ అభ్యంతరం చెప్పింది. ‘గేయ రచయితలు పాట రాయకపోతే, గాయనీ గాయకులు పాడకపోతే సంగీత దర్శకులు ఏం చేస్తారు?’ అని వాదించింది. కానీ అప్పటికి గేయ రచయితలకు కానీ, గాయనీ గాయకులకు కానీ ఓ సంస్థ లేకపోవటంతో ఆమెది ఒంటది వాదన అయింది. కానీ లతా మంగేష్కర్ తన వాదనను వదలిపెట్టలేదు. ఈ సందర్భంగా గమనార్హమైన ఓ విషయాన్ని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.

సినీ పరిశ్రమలో ఏ కళాకారుడైనా కాస్త అహంకారంగా ప్రవర్తించినా, ఎవరినైనా వ్యతిరేకించినా, సినీ రంగంలో వారి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. కానీ లతా మంగేష్కర్ ఎంత వాదించినా, ఎన్ని విషయాలలో పట్టుబట్టినా, ఆమెని వ్యతిరేకించారు, వాదించారు, దూషించారు, విమర్శించారు. కానీ,  ఆమెతోనే పాటలు పాడించారు. ఇది లత మంగేష్కర్  గాత్రం గొప్పతనం. లత ఇలా మొండిగా ప్రవర్తిస్తూంటే, ఇతర గాయనిల వైపుకు కూడా ఎవ్వరూ మళ్ళలేదు. ఎందుకంటే లతతో పోటీపడగల గాత్రం, కనుచూపు మేరలో లేకపోవటం మాత్రమే కాదు, లత లాగా నిజాయితీగా,  చిత్తశుద్ధిగా పాటను పాడటం,  అతి త్వరగా బాణీని పట్టి, అతి తక్కువ టేకులతో పాటను ఓకే చేయించటం మరెవ్వరికీ సాధ్యం కాదు. ఇతరులు మామూలుగా పాడేపాటలకు తన స్వరంతో ప్రత్యేకతను ఆపాదించటం లతలా ఎవ్వరికీ సాధ్యమయ్యేది కాదు. దీనికి తోడు లతలా రాగాలు తీయగలగటం, హై పిచ్ లో పాడగలగటం కూడా అందరికీ సాధ్యమయ్యేది కాదు.  అందుకని లతకు రాయల్టీ ఇచ్చేందుకు సిద్ధమయి కూడా నిర్మాతలు ఆమెతో పాడించారు. ‘సంగీత దర్శకులదే గొప్పకాదు’ అని ఆమె వాదించినా సంగీత దర్శకులు తమ బాణీలకు లత స్వరదానం చేస్తేనే అవి అమరం అవుతాయని గ్రహించి, ఆమెతో కలిసి పనిచేస్తూ పోయారు.

1956లో ‘చోరీచోరీ’ సినిమా పాటలకుగానూ సంగీత దర్శకులు శంకర్ జైకిషన్‍లకు ఉత్తమ సంగీతదర్శకుల ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది. అవార్డు సభలో అందరూ ఆ సినిమాలోని సూపర్ హిట్ పాట ‘రసిక్ బల్‍మా’ పాడమని లతను అభ్యర్థించారు. లత పాడనంది. ఎవరెంత బ్రతిమిలాడినా ఆమె పాడనంటే పాడనని భీష్మించుకు కూర్చుంది. చివరకు శంకర్ జైకిషన్‍లలో ఆమెకు అత్యంత సన్నిహితుడైన జైకిషన్ కూడా బహిరంగంగా ఆమెను బ్రతిమిలాడేడు. పాట పాడమని అభ్యర్థించాడు. ససేమిరా అంది లత. మరీ అభ్యర్థిస్తే కారణం చెప్పింది.

“పాటను రూపొందించటంలో సంగీత దర్శకుడిదే ప్రాధాన్యం అంటారు కదా! నా గాత్రం లేకుండా వాయిద్యాల తోటే పాటను వాయించండి. అందరికీ వినిపించి మెప్పించండి. గాయనీ గాయకులను గుర్తించని అవార్డుకు నేను నా గాత్రాన్ని వాడను” అని నిర్మొహమాటంగా చెప్పింది. అయినా శంకర్ జైకిషన్‌లు లత స్వరంతో తను పాటలను చిరంజీవులను చేసుకుంటూనే పోయారు. చివరికి 1958లో గాయనీ గాయకులకు కలిపి ఒక అవార్డును ఆరంభించింది ఫిల్మిఫేర్. తొలి అవార్డు లతకే. ‘మధుమతి’ సినిమాలో ‘ఆజారే పరదేశీ’ పాటలకు లభించింది.

ఇలా ప్రతి విషయానికీ పోరాడుతూ, సాధించుకునే లతకు ప్రత్యామ్నాయం లభిస్తే సినీ పరిశ్రమ ఏనాడో లతను పక్కకు నెట్టేసేది. శంకర్ జైకిషన్‍లు సంగీత సామ్రాట్టులలా  ఎదురులేని మహారాజుల్లా వీర విహారం చేస్తున్న సమయంలో వారికి  ప్రత్యామ్నాయంగా లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍లు తెరపైకి రాగానే సినీ ప్రపంచం శంకర్ జైకిషన్‍ను వదలి లక్ష్మీప్యారే వైపు పరుగులు తీసింది. రాజేష్ ఖన్నా సూపర్ స్టార్‍గా ఉన్నప్పుడు అతడికి నీరాజనాలు పట్టిన సినీ ప్రపంచం, ప్రత్యామ్నాయంగా అమితాబ్ తెరపైకి రాగానే రాజేష్ ఖన్నాను వదలి అమితాబ్ వైపు పరుగులు తీసింది. కాబట్టి లతకు ఏమాత్రం ప్రత్యామ్నాయం లభించలేదు. దాంతో ఇష్టం ఉన్నా లేకున్నా, లత విధించిన నియమ నిబంధనలకు తలలు వంచి ఒప్పుకోక తప్పలేదు సినీ ప్రపంచానికి. సినీ ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవటంలో లతకు ఉన్న ఏకైక ఎదురులేని వజ్రాయుధం ఆమె ప్రతిభ. అందుకే లత తమకు అన్యాయం చేసిందనో,  తమను అణచివేసిందనో చేసే ఆరోపణలు అర్థం లేనివి. ‘ఆడరాని వాడు మద్దెల ఓటు’ అన్నట్టు చేసిన ఆరోపణలు తప్ప మరొకటి కావు. సినీ ప్రపంచంలో ‘ఒకరు లేకపోతే గడవదు’ అన్నమాట అర్థం లేనిది. అలల్లాగా బోలెడంత మంది కళాకారులు వస్తూంటారు. అల పైకెగిసినట్టు ఎగురుతారు తరువాత తిరిగి కరిగిపోతారు. అలా ఎందరో వచ్చారు. కాస్సేపు మురిపించి అదృశ్యమయి పోయారు. కానీ సినీ సంగీత ప్రపంచంలో దశాబ్దాలుగా అనంతమయిన సముద్రంలా ,  అగ్రస్థానంలో ధృవతారలా నిలిచింది లతా మంగేష్కర్ ఒక్కర్తే.

1949లో లతామంగేష్కర్ సి. రామచంద్రకు పాటలు పాడటానికి నిరాకరించింది. ఎందుకంటే, మరో సంగీత దర్శకుడిని తొలగించి సి. రామచంద్రను సినిమాకు నియమించారని. అప్పటికి లత,  సి రామచంద్ర సంగీత దర్శకత్వంలో పాటలు పాడింది. కానీ నియమం అంటే నియమమే. అయితే లత తనకు పాడనని అనటం, అదీ సిద్దాంతం కోసం సి. రామచంద్రకు నచ్చింది. లతపై కోపం తెచ్చుకునే బదులు ఆమెని అభినందించాడు. అప్పటి నుంచీ అతను తన సినిమాల్లో పాటలు పాడేందుకు లతను వాడటం పెరిగింది. సి. రామచంద్ర లత స్వరానికి ముగ్ధుడయ్యాడు. ఆమె పాటలను పాడే విధానానికి భక్తుడయ్యాడు. లతను తన ప్రధాన గాయనిగా నిర్ణయించాడు. లత గానంతో పాటు, లతతో కూడా ప్రేమలో పడ్డాడు. ఇక్క్డ గమనించాల్సిందేమిటంటే, సీ రామచంద్ర లతతో ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడింది లత కాదు. లత దృష్టిలో సీ రామచంద్ర చక్కని సంగీత దర్శకుడు. తన గానానికి ముగ్ధుడయినవాడు. అయినా, లత గానానికి సమస్త ప్రపంచం దాసోహం అంటున్నప్పుడు సీ రామచంద్ర ముగ్ధుడవటంలో ఆశ్చర్యం లేదు.

సి. రామచంద్ర, ఓ.పి. నయ్యర్, మదన్ మోహన్, ఖయ్యాం, జయదేవ్‍లు సినిమాలో హీరోలై పోదామని బొంబాయి వచ్చారు. వీరు అయిదుగురు నటులు కాలేకపోయారు కానీ సంగీత దర్శకులయ్యారు. వీరిలో అతి త్వరగా విజయం సాధించి, సినీ సంగీతంపై తన ప్రత్యేకమైన ముద్రవేసిన వాడు సి. రామచంద్ర.

రామచంద్ర నరహర్ చితల్కర్ జూన్ 10, 1910న అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన పంతంతే గ్రామంలో జన్మించాడు. బాల్యం నుంచీ సంగీతం పట్ల ఆసక్తి ఉండేది. సినిమాలంటే పిచ్చి. దాంతో సంగీతం నేర్చుకున్నాడు. సినిమాల్లో నటించాలని కోల్హాపూర్ వచ్చి చేరాడు. నాగానంద్ (1935) అనే సినిమాలో హీరోగా నటించాడు. సినిమా విఫలమయింది. తరువాత సోహ్రబ్ మోడి నిర్మించిన సినిమాల్లో నటించాడు. కానీ నటన తనకు నప్పదని తెలుసుకున్నాడు. హార్మోనియం వాయించటం ఆరంభించాడు. సోహ్రబ్ మోడీ నిర్మాణ సంస్థ మినర్వ టోన్‌లో సంగీత దర్శకుడూ ‘మీర్ సాబ్’ దగ్గర సహాయకుడిగా చేరాడు. అతి తక్కువ సమయంలో అందమైన ఆకర్షణీయమైన బాణీలు సృజించగలడన్న పేరు పొందాడు. 1942లో ‘సుఖిజీవన్’ అన్న సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుడయ్యాడు. సినిమా పరాజయం పాలయింది కానీ అతను బాణీలను కట్టే విధానాన్ని,  అతని బాణీలలోని వైవిధ్యాన్ని అందరూ గుర్తించారు. దాంతో అతనికి అవకాశాలు రావటం మొదలయింది. ఫిల్మిస్తాన్ సంస్థలో పదకొండు సినిమాలను సంగీత దర్శకత్వం వహించే అవకాశం అతనిదయింది.

సి. రామచంద్ర చాలా వేగంగా బాణీలను సృజిస్తాడు. అత్యంత సృజనాత్మకంగా ఉంటాయి అతని బాణీలు. వాయిద్యాల వాడకం కూడా అత్యంత సృజనాత్మకంగా ఉండి మధురమైన సంగీతాన్ని వినిపిస్తాయి. అయితే, ఆ కాలం నాటి ఇతర సంగీత దర్శకులలాగా  శాస్త్రీయ సంగీత ఆధారిత బాణీలనే సృజించాలన్న పట్టుదల లేదు సి. రామచంద్రకు. జానపద బాణీలకు శాస్త్రీయ సంగీతంతో ముడివేసి, పాశ్చాత్య వాయిద్యాలతో వినిపించేవాడు. సాహిత్యం కూడా ఉత్తమంగా ఉండాలన్న పట్టుదల లేదు సి. రామచంద్రకు. బాణీకి తగ్గ పదాలుంటే చాలు. పాట హిట్ అవటం ప్రధాన లక్ష్యం.

సంగీత దర్శకత్వం వహించటమే కాదు ‘చిత్తల్కర్’ పేరుతో పాటలు కూడా పాడతాడు సి. రామచంద్ర. ‘సఫర్’ సినిమాలో వీణాపాణి ముఖర్జీతో కలిసి ‘కభి యాద్ కర్‍కే, గలి పార్ కర్‍కే, చలి ఆనా హమారీ గలియాన్’ అన్న పాట ఆ కాలంలో పెద్ద హిట్. ఇలాంటి భావంతో వచ్చిన తొలిపాట ఇది. అంతవరకూ నాయికలు ప్రేమపాటలు, విషాద గీతాలు పాడేవారు. కానీ ఇలా అక్కడ కలువు, ఇక్కడ కలువు అంటూ పాడిన తొలిపాట ఇది. సి. రామచంద్రకు ‘అందరూ పాటించే నియమాలను భంగం  చేయటం, అందరూ నడిచే దారుల్లో కాకుండా విభిన్నమైన దారుల్లో ప్రయాణించటం అలవాటు. అందుకే ఆ కాలంలోని రొటీన్, మూస బాణీలకు భిన్నమైన బాణీలను సృజించాడు సి. రామచంద్ర. ఆ కాలంనాటి సూపర్ స్టార్ అశోక్ కుమార్, తన పాటలు తానే పాడుకునేవాడు. అశోక్ కుమార్‍తో పాటలు పాడటం మాన్పించాడు సి. రామచంద్ర.

అశోక్ కుమార్‍కు లలిత దావూల్కర్‍తో కలిసి యుగళగీతం పాడాలన్న కోరిక ఉండేది. అందుకోసం సినిమాలో పాటకు సందర్భాన్ని సృష్టించారు.  కానీ ఆ పాట మహమ్మద్ రఫీ పాడితే బాగుంటుందన్నది సి. రామచంద్ర అభిప్రాయం. కానీ ఆ పాట పాడతానని పట్టుబట్టాడు అశోక్ కుమార్. పాట రికార్డింగ్ రోజు అశోక్ కుమార్ స్టూడియోకు వచ్చేలోగా, రఫీతో ఆ పాటను రికార్డు చేసేశాడు సి రామచంద్ర. ‘హమ్ కో తుమ్హారా హీ ఆస్రా’ అన్న ఆ యుగళ గీతాన్ని రఫీ స్వరంలో విన్న తరువాత అశోక్ కుమార్, పాటలు పాడటం మానేశాడు. ఆ పాట  సూపర్ హిట్ అయి సి. రామచంద్ర కెరీర్‍కు ఊపునిచ్చింది.

ఫిల్మిస్తాన్ సంస్థ 1947వ సంవత్సరంలో ‘షహనాయి’ అన్న సినిమా నిర్మించాలని నిశ్చయించింది.   గులామ్ హైదర్‍ను సంగీత దర్శకుడిగా నియమించింది. కానీ ఆ సమయంలో ఇతర పనులలో మునిగి ఉన్న గులామ్ హైదర్ ‘షెహనాయి’ సినిమాకు సమయం కేటాయించలేకపోయాడు. దాంతో అత్యవసరమైన ఒక పాటను రూపొందించమని, సి. రామచంద్రను అడిగారు. “సినిమాలో మొత్తం పాటలు నేనే తయారు చేస్తాను. ఒక్కపాట కోసం పనిచేయను” అని నిష్కర్షగా చెప్పాడు సి. రామచంద్ర. అందుకు అతి అయిష్టంగా ఒప్పుకున్నారు. షెహనాయి సినిమా పాటలతో సి. రామచంద్ర అగ్రశేణి సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో అమీర్ బాయి కర్ణాటకి పాడిన ఠుమ్రీ ‘మార్ కతార్ మర్‍జానా’ శ్రోతలను ముగ్ధులను చేసింది. సితార్, తబలా, హార్మోనియంలతో సి.రామచంద్ర తుఫాను సృష్టించాడు. ఈ సినిమాలో మరో హిట్ పాట ‘జవానీకీ రేల్  చలీ జాయారే!”

జవానీకీ రేల్  చలీజాయేరే రైలు పాటల్లో అత్యద్భుతమైన పాట. రైలు లయ కనుగుణంగా బాణీని రూపొందించాడు సి. రామచంద్ర. ఈ పాటను స్వయంగా పాడేడు కూడా. ఈ పాటను శంషాద్ బేగం, లతా మంగేష్కర్‍లతో కలిసి పాడేడు. ఈ పాట సందర్భంగా సి. రామచంద్ర తొలిసారి లతా మంగేష్కర్‌ను కలిశాడు. అంతకు ముందు గులామ్ హైదర్ రికార్డింగ్‍ల సమయంలో లతను చూసినా, ప్రథమ పరిచయం ‘జవానీకీ రేల్  చలీ జాయీరే’ పాటను రూపొందిస్తున్న సమయంలోనే!

‘జవానీకీ రేల్’ పాటలో ప్రధాన గాయని శంషాద్ బేగమ్. లత మంగేష్కర్ మూడవ గాయని కానీ లత మంగేష్కర్ పాట పాడే విధానం సి.రామచంద్రకు నచ్చింది. అంతవరకూ ఆయన అమీర్‍భాయి కర్ణాటకి, లలిత దావూల్కర్, బీనాపాణి ముఖర్జీ, శంషాద్ బేగమ్, జోహ్రాబాయి అంబాలేవాలి, మోహన్‌తార తల్పాడే, సురీందర్ కౌర్, గీతారాయ్ వంటి గాయనిలతో పాడించేవాడు. లత పరిచయం అయిన తరువాత ఇతర గాయనిలందరినీ పక్కకు నెట్టేశాడు సి. రామచంద్ర. 1948లో ‘నదియా కే పార్’ సినిమాలో ‘దిల్ లేకే భాగా’ అనే పాట సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో లత పాడిన తొలి సోలో పాట. సి. రామచంద్ర సంగీత జీవితంలో ఇది తొలి సిల్వర్ జూబ్లీ హిట్ సినిమా . అంటే తన జీవితంలో అడుగు పెట్టడంతోటే సి. రామచంద్ర దశ తిరిగిందన్నమాట.

సినీ పరిశ్రమలో ఉన్నన్ని సెంటిమెంట్లు ఇంకెక్కడా ఉండవు. కోట్లతో వ్యాపారం చేసే సినీ పరిశ్రమలో అభద్రతా భావం అధికం. పరాజయ భయం పట్టి పీడిస్తూంటుంది. అభద్రతా భావం విస్తృతంగా చలామణిలో ఉన్నచోట అంధ విశ్వాసాలు, సెంటిమెంట్లు అధికంగా చలామణిలో ఉంటాయి. ఈ అంధ విశ్వాసాల గురించి లతా మంగేష్కర్ ఓ గమ్మత్తయిన కథ చెప్తుంది.

సంగీత దర్శకుడు చిత్రగుప్తకు ఓ సెంటిమెంట్  ఉండేది. ఆయన ఓ రకమైన చెప్పులు వేసుకుని పాట రికార్డు చేస్తే ఆ పాట సూపర్ హిట్ అవుతుందని నమ్మేవాడు. ఓ రోజు చిత్రగుప్త కుంటటం చూసింది లత. “ఏమైంది?” అని అడిగింది.

“కాలికేం కాలేదు. చెప్పులు తెగాయి. ఈ చెప్పులతో రికార్డింగ్ చేస్తే పాట సూపర్ హిట్ అవుతుంది. అందుకే చెప్పులు తెగినా వాటినే వేసుకుని వచ్చాను. తెగిన చెప్పులు కాబట్టి కుంటుతున్నాను” అని సమాధానం ఇచ్చాడు చిత్రగుప్త.

అతని సమాధానం విని లేని కోపం నటిస్తూ “మీకు మా గాన పటిమపై కన్నా మీ చెప్పుల మీదనే ఎక్కువ విశ్వాసం అన్నమాట” అంది లత.

అంతలా సెంటిమెంట్లుంటాయి సినీ ప్రపంచంలో.

అందుకే లతతో సోలో పాట పాడించగానే సినిమా సిల్వర్ జూబ్లీ అవటంతో లత తన అదృష్టం అనుకున్నాడు సి. రామచంద్ర. దీనికితోడు ఇతర గాయనీల్లా లత స్వరానికి ఎలాంటి పరిధులు, పరిమితులు లేకపోవటంతో తన సృజనను విశృంఖలంగా విహారం చేయిస్తూ, అద్భుతమైన బాణీలు రూపొందించవచ్చని సి. రామచంద్రకు అర్థమయింది. అందుకే సి. రామచంద్ర లతకు ప్రాధాన్యం ఇచ్చాడు. సిద్ధాంతం ఆధారంగా తన ఒక సినిమాలో లత పాడనన్నా, సాధారణంగా అహంకారం ప్రదర్శించే సి. రామచంద్ర పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే సి. రామచంద్ర తన సినీ సంగీత జీవితంలో సృజనాత్మక శిఖరాన్ని లత తన జీవితంలో అడుగుపెట్టిన తరువాతనే సాధించాడు. అంతవరకూ హిట్ పాటలిచ్చాడు. కానీ ఆ తరువాత సుమధురము, సుందరము, అత్యంత రమణీయమైన గీతాలను సృజించాడు సి. రామచంద్ర. కానీ, అదే సమయంలో ఇతర సంగీత దర్శకులంతా లత స్వరం ఆధారంగా అత్యంత సుందరమయిన పాటలను రూపొందిస్తూ తాము అగ్రస్థాయి సంగీత దర్శకులుగా పరిగణకుగురయ్యారు. అంటే, సీ రామచంద్ర అదృష్టం లత అయితే, అందరు సంగీత దర్శకులూ లత స్వరానికి దాసోహం అన్నవారే.  అందుకే, లత ఏ ఒక్క సంగీత దర్శకుడిపై ఆధారపడలేదు. సంగీత దర్శకులే లతపై ఆధారపడ్డారు.  లత స్వరం ఆధారంగా  అచిరకాలంలోనే ఆనాటి నెంబర్ వన్ సంగీత దర్శకుడు నౌషాద్ కన్నా ఒక్కరూపాయి ఎక్కువ డిమాండ్ చేసి సాధించే స్థాయికి ఎదిగాడు సి. రామచంద్ర.

లతతో మొత్తం 298 పాటలు పాడించాడు సి. రామచంద్ర. వీటిలో 200 పాటలు లత సోలోలు! గాయకులతో 76 యుగళ గీతాలు, గాయనిలతో 18 యుగళగీతాలు, ఇతర పాటలు నాలుగు , మొత్తంగా 298 పాటలు పాడించాడు.  తాను సంగీత దర్శకత్వం వహించిన 63 సినిమాలలో ఒక్కో పాటను తన హృదయంతో రూపొందించాడు. 1950 నుండి 1955 వరకు సృజనాత్మకంగా, వ్యాపారపరంగా సి. రామచంద్ర ఉచ్ఛదశలో ఉన్నాడు. సినీ సంగీత స్వర్ణ యుగానికి ఉద్దీపన నిచ్చిన సంగీత దర్శకులలో ప్రధాన పాత్ర వహించాడు సి. రామచంద్ర.

లత,సీ రాంచంద్ర

1950లో విడుదలైన ‘సమాధి’ సి. రామచంద్ర ఉచ్ఛస్థాయికి చేరుకోవడాన్ని వేగవంతం చేసింది. ఈ సినిమాలో లత అమీర్‍బాయి కర్ణాటకిల యుగళగీతం ‘గోరే గోరే ఓ బాన్కే ఛోరే’ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ పాటలో నాయిక ‘నళిని జయవంత్’కు లత స్వరం వాడటం, లత ఆధిక్యాన్ని సూచిస్తుంది. అంతేకాదు, 1950 తరువాత లత సినిమాల్లో పాటలు పాడేందుకు ఒప్పుకునే కన్నా ముందు ‘తాను నాయికలకు మాత్రమే పాడతాన’న్న నియమం విధించేది . లేదా,  సినిమాల్లోని అన్ని పాత్రలకు తానే పాడతాననేది. అందుకే 1949 వరకూ ఇతర గాయనిలు నాయికలకు పాడితే సహాయ పాత్రలకు పాడిన లత 1950 నుంచి ఆమె చివరి పాట వరకూ నాయికలకే పాడింది. లగాన్, రంగ్‍దే బసంతి,  వంటి సినిమాలలో, అప్పటికి ఆమె స్వరం దెబ్బతిన్నది, ఎలాబడితే అలా తీగలుగా సాగే గుణం తగ్గి స్వరం కఠినం అవడంతో ఇతర పాత్రలకు పాడింది. లేకపోతే ఇతర గాయని ఎవరైనా నాయికకు లతనే పాడుతుంది. ఇందువల్ల లత ఆధిక్యం స్పష్టమవుతుంది. సాధారణంగా ప్రధాన గాయని నాయికకు పాడుతుంది. నాయికకు తానే పాడడం వల్ల తానే ప్రధాన గాయని అని లత స్పష్టంగా ప్రకటిస్తున్నట్టవుతుంది.

1949 నుండి 1955 నడుమ అత్యద్భుతమైన పాటలను లత కోసం రూపొందించాడు సి. రామచంద్ర. లాటిన్ అమెరికన్ కారిబ్బీన్ బీట్స్ భారతీయ జానపద గీతాల లయతో జతపరచి శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగా మరపురాని మధురమైన గీతాలను లత కోసం సృజించాడు. లత, సి. రామచంద్ర కలయికలో వచ్చిన అత్యద్భుతమైన పాటల పూల గుచ్చాలలో అల్బేలా, యాస్మిన్, అనార్కలి, అజాద్,  నాస్తిక్, శారద, స్త్రీ వంటి సినిమాలుంటాయి. ఈ సినిమాలలో పాటలతో లత స్వర వైశిష్ట్యాన్ని, విభిన్నత్వాన్ని, అనంతమైన భావాలు పలుకగలిగే అద్భుతమైన లక్షణాన్ని సి. రామచంద్ర ప్రదర్శించాడు.

ఓవైపు అనిల్ బిశ్వాస్, మరోవైపు సి. రామచంద్ర, ఇంకోవైపు నౌషాద్ వంటి సీనియర్ సంగీత దర్శకులు లత స్వర విన్యాసాలతో సృజనాత్మక అంబరంపై చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూంటే, తరువాత తరం సంగీత దర్శకులు, ఎస్డీ బర్మన్, శంకర్ జైకిషన్‍ వంటివారు లత స్వర తరంగాలు చిలికే అమృత వర్షపు చినుకు చినుకులో అనంతమైన మధురామృత సాగరాలను దర్శింపచేస్తూ తాము ఉచ్ఛస్థాయికి ఎదిగారు. లతను ఎవ్వరూ అందుకోలేని అనంతాంబరపు శిఖరాలపై నిలిపారు.

సినీ పరిశ్రమను  తన కనుసన్నలతో శాసిస్తూ, ఇతరుల భవిష్యత్తును నిర్దేశించే వారి భాగ్య విధాతగా లత ఎదిగిన వైనం 1950 నుండి 1955 నడుమ లత పాడిన పాటలను పరిశీలిస్తే బోధపడుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here