సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-16

5
1

[dropcap]గు[/dropcap]జ్‍రా హువా జమానా, ఆతా నహీ దొబారా

హాఫిజ్ ఖుదా తుమ్హారా, హఫీజ్ ఖుదా తుమ్హారా….

‘షీరీ ఫర్హాద్’ సినిమాలో తన్వీర్ నఖ్వీ రచించిన ఈ గేయం ఎస్. మొహిందర్ సంగీత దర్శకత్వంలో రూపొందింది. లతా మంగేష్కర్ పాడిన పాటలలో ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంతవరకూ లతా మంగేష్కర్ పాడిన ఉత్తమ పాటల సంకలనాలు ఎన్ని వచ్చాయో అన్నిటిలో తప్పనిసరిగా ఉన్న పాట ఇది. ఈ పాట గురించి లత మంగేష్కర్ స్వయంగా ఇదే వ్యాఖ్యానించింది.

“ఒక్కోసారి పాటలు పాడినప్పుడు అవి హిట్ అవుతాయని అనిపిస్తుంది. అలా అనిపించినవన్నీ హిట్ కావు. ఒక్కోసారి పాటలో ఎలాంటి ప్రత్యేకత లేదనిపిస్తుంది. కానీ ఆ పాట శ్రోతలను అలరించటమే కాదు కాలంతో సంబంధం లేకుండా తరతరాలను అలరిస్తూ చిరంజీవిలా నిలుస్తుంది. అలాంటి పాట ‘గుజ్‌రా హువా జమానా’ నేను పాడిన పాటల్లో అత్యుత్తమ పాటల జాబితాలు ఎన్ని తయారైనా ప్రతి దాన్లో తప్పకుండా ఉండే పాట ఇది” అంది లత.

నిజానికి ‘షీరీ పర్హాద్’ సినిమా ఈనాటికీ గుర్తుందన్నా, ఎస్. మోహిందర్ పేరు వినిపిస్తుండటానికి ఏకైక కారణం ఈ పాట. 1952 సంవత్సరం వచ్చేసరికి లత ఆత్మవిశ్వాసం అధికమవటమే కాదు, హిందీ సినీ సంగీత ప్రపంచంలో కొన్నేళ్ళ వరకూ తనకు ఉత్తమ గాయనిగా ఎలాంటి ప్రమాదం లేదని, ఇతరులెవరూ తన దరిదాపులకు రాలేరని లతకు విశ్వాసం కలిగింది. ఎందుకంటే 1951లో లత 223 పాటలు పాడింది. హిందీ సినీ సంగీత చరిత్రలో ఒకే సంవత్సరం ఇన్ని పాటలు పాడిన వారు లేరు. ఒక సంవత్సరంలో లత పాడిన అత్యధిక పాటల సంఖ్య ఇది. తరువాత ఎప్పుడూ ఒక సంవత్సరం ఇన్ని పాటలు లత పాడలేదు.

1951లో మొత్తం 98 హిందీ సినిమాలు విడుదలయ్యాయి. ఈ 98 సినిమాలలో లత పాటలున్న సినిమాల సంఖ్య 49.  అంటే ఆ సంవత్సరం విడుదలైన సినిమాలలో సగం సినిమాలు లత పాటలున్న సినిమాలే. అంతగా సినీ సంగీత ప్రపంచంపై పట్టును, ఇతర గాయనిలపై ఆధిక్యాన్ని సాధించింది లతా మంగేష్కర్ 1951 కల్లా.

1951లో లత 24మంది సంగీత దర్శకులతో పనిచేసింది. వీరిలో మదన్ మోహన్, సుధీర్ ఫడ్కే, రోషన్ వంటి వారితో తొలిసారిగా 1951లో పనిచేసింది. ఈ ముగ్గురు సంగీత దర్శకులు జీవితాంతం తమ సినిమాలలో లతతో పాడించారు. పరమాద్భుతమైన పాటలను రూపొందించారు.

1952వ సంవత్సరం వచ్చేసరికి లత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ సంవత్సరం ఆమె ఇంతకాలం ఉంటున్న ఇల్లు వదలి స్వంత ఇల్లు కొన్నది. అంతేకాదు సి. రామచంద్రతో కలసి ‘ఝాంఝర్’ అనే సినిమా నిర్మాణంలోనూ భాగస్వామ్యం స్వీకరించింది. సుధీర్ ఫాడ్కే, లతా మంగేష్కర్‍తో ‘బాబీకే చుడియా’ (1961) సినిమాలోని అమరగీతం ‘జ్యోతి కలష్ ఛల్‍కే’ పాటను పాడించాడు. ‘రోషన్’ లతకు అతి ఇష్టమైన సంగీత దర్శకుడు. అతడిని తొలగించారనే ఓ.పి.నయ్యర్ సినిమాకు లత పాడలేదు. మదన్ మోహన్ అయితే లతకు ‘భయ్యా’. ఈ రకంగా ఒక కొత్త సంగీత దర్శకుడు లతతో ఒక్కసారి పనిచేస్తే జీవితాంతం లతతోనే పనిచేయటానికి ఇష్టపడేవాడు. ఇది లత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

బాల్యం నుంచీ ఆమెకు తాను ప్రత్యేకం అన్న భావం ఉంది. తండ్రి ఆమె స్వరాన్ని పొగిడాడు. ఆమె గొప్ప వ్యక్తి అవుతుందని జాతకం చూసి చెప్పాడు. తరువాత జరుగుతున్న సంఘటలన్నీ ఆమె ఈ విశ్వాసాన్ని పెంచాయి. ఎవరైనా తన స్వరం బాగాలేదన్నా, పనికిరాదని తిరస్కరించినా లత బహిరంగంగా ఏమీ అనేది కాదు, కానీ తరువాత వారికి పాడేందుకు తిరస్కరించేది. అయినా సరే, ఆమె వెంట పడి మరీ పాటలు పాడించుకునేవారు.

‘షహీద్’ సినిమాలో లత గొంతు నాయికకు పనికిరాదని ఎస్. ముఖర్జీ తిరస్కరించిన తరువాత గులామ్ హైదర్ పట్టుబట్టి వేరే సినిమాలలో లతతో పాటలు పాడించాడు. ఆమె స్వరం విన్నవారు ముగ్ధులై ఆమెతో పాటలు పాడించేందుకు ఉత్సాహం చూపించారు. అలా 1946 నుంచి సన్నని చినుకుల్లా ఉన్న లత పాటలు 1949 వచ్చేసరికి తుఫానయి, 1950 దశకంలో అన్నింటినీ ముంచెత్తాయి. 1952లో విడుదలైన 105 సినిమాలలో 43 సినిమాల్లో 177 పాటలు పాడింది లత. అంటే లత 1946లో పాటలు పాడటం ఆరంభించి, 1952 వచ్చేసరికి మొత్తం 759 పాటలు పాడిందన్న మాట. అంతవరకూ హిందీ సినీ సంగీత ప్రపంచంలో అన్ని పాటలు ఎవ్వరూ పాడలేదు.

1952లో లత తొలిసారిగా పాడిన తొమ్మిది మంది సంగీత దర్శకులలో ప్రధానంగా చెప్పుకోవలసింది గాయకుడు, సంగీత దర్శకుడు హేమంత్ కుమార్ గురించి. హేమంత్ కుమార్ ప్రధానంగా గాయకుడు. తన అద్భుతమైన గానంతో బెంగాల్‍ను ఉర్రూతలూగించాడు. రవీంద్ర సంగీతంలో పంకజ్ మల్లిక్ తర్వాత అంత ఖ్యాతిని పొందాడు. దర్శకుడు హేమేన్ గుప్తతో చక్కని దోస్తీ ఉండటం వల్ల ఆయన దర్శకత్వం వహించిన భూలీ నై (1948), చియాలిష్ (1951) వంటి బెంగాలీ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు హేమంత్ కుమార్. ఇంతలో హేమేన్ గుప్తకు బొంబాయికి రమ్మని శశిధర్ ముఖర్జీ నుంచి పిలుపు వచ్చింది. శశిధర్ ముఖర్జీ హిందీలో బంకిమ్ చంద్ర ఛటర్జీ నవల ఆధారంగా ‘ఆనంద్ మఠ్’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. దానికి సంగీత దర్శకత్వం వహించేందుకు బొంబాయికి రమ్మని హేమెన్ గుప్తను పిలిచాడు శశిధర్ ముఖర్జీ. హేమేన్ గుప్త బొంబాయికి వస్తూ ‘ఆనంద్ మఠ్’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించేందుకు హేమంత్ కుమార్‍ను కూడా బొంబాయికి తీసుకువచ్చాడు. అలా బొంబాయిలో అడుగు పెట్టాడు హేమంత్ కుమార్.

బొంబాయిలో హిందీ పరిశ్రమకు హేమంత్ కుమార్, ఆనంద్ మఠ్ సినిమా కన్నా ముందు గాయకుడిగా పరిచయం. 1949 వరకూ హేమంత్ కుమార్ ఇరవై హిందీ సినిమా పాటలు పాడేడు. కానీ అతని కార్యక్షేత్రం కలకత్తానే. ఎప్పుడైతే హేమంత్ కుమార్ బొంబాయిలో స్థిరపడటానికి వచ్చాడో, ఇతర సంగీత దర్శకులంతా అతడితో పాటలు పాడించేందుకు ఉత్సాహం చూపించారు. ఎస్డీ బర్మన్ అతడీతో ‘సజా’ (1957) సినిమాలో సంధ్య ముఖర్జీతో ‘ఆ గుప్ చుప్ ప్యార్ కరే’ అనే హిట్ పాటను పాడించాడు. సంధ్య ముఖర్జీని కలకత్తా నుంచి బొంబాయి రప్పించాడు ఎస్డీ బర్మన్. కానీ ఆమె బొంబాయి పరిశ్రమలో ఇమడలేకపోయింది. కలకత్తా వెళ్ళిపోయింది. అక్కడ గొప్ప గాయనిగా పేరు తెచ్చుకుంది. లతా మంగేష్కర్ మరణించిన వారంలోగా ఆమె మరణించింది.

ఎస్డీ బర్మన్ హేమంత్ కుమార్‍తో ‘జాల్’లో ‘యే రాత్ యే చాంద్‍నీ ఫీర్ కహాఁ’ అనే అద్భుతమైన పాటను పాడించాడు. ఈ పాటను హేమంత్ సోలోగా పాడతాడు. లతతో యుగళ గీతం పాడతాడు. అప్పుడే లత స్వరంలోని మృదుత్వం, ఎలా అంటే అలా మెలికలు తిరిగే మార్దవం గమనించాడు హేమంత్ కుమార్. ఆనంద్ మఠ్ లో ‘జై జగదీశ్ హరే’ అనే జయదేవుని అష్టపది గీతారాయ్‍తో పాడించాడు హేమంత్ కుమార్. కానీ వందేమాతరం పాట బాణీ కుదిర్చిన తరువాత ఎవరు పాడాలన్న ప్రసక్తి వచ్చినప్పుడు ఆ పాటను లత ఒక్కర్తే పాడగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు హేమంత్ కుమార్. ఇక్కడ సమస్య వచ్చింది.

లతా మంగేష్కర్ గొంతు పనికిరాదని ఆమె స్వరాన్ని తిరస్కరించాడు శశిధర్ ముఖర్జీ గతంలో. అప్పటి నుండి ఫిల్మిస్తాన్ సినిమాలకు పాడనని లత పట్టుబట్టింది. లత స్వరం తనకు అవసరం లేదని శశిధర్ ముఖర్జీ కూడా గట్టి పట్టు బట్టాడు. ‘అనార్కలి’ సినిమాలో లత పాట ఉందకూడదన్న అతని నిబంధనను ఒప్పుకోని సి. రామచంద్ర ఆ సినిమా సంగీత దర్శకత్వం వదలుకున్నాడు. అలాంటి పరిస్థితులలో లతను ఫిల్మిస్తాన్ సినిమాకు పాట పాడమని అడగటం కుదరని పని. కానీ లత ఒక్కర్తే ఆ పాట పాడగలదని ఆ పాట ఇంకెవరు పాడినా ఆ ప్రభావం ఉండదని హేమంత్ కుమార్ విశ్వాసం. దాంతో ఆనంద్ మఠ్ సినిమాలో వందేమాతరం పాట పాడేందుకు లతను అడగటానికి ముందు శశిధర్ ముఖర్జీని ఒప్పించారు. ఆయన ఒప్పుకున్న తరువాత లతను ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఇలా ప్రయత్నించిన వారిలో హేమంత్ కుమార్ సహాయ సంగీత దర్శకుడు రవి కూడా ఉన్నాడు.

రవిగా ప్రఖ్యాతి గాంచిన రవిశంకర్ శర్మ గాయకుడవ్వాలని బొంబాయి వచ్చాడు. కానీ దిగ్గజాల వంటి గాయకుల నడుమ తాను గాయకుడిగా నెట్టుకు రావటం కష్టమని గ్రహించి సంగీత దర్శకత్వం వైపు మళ్ళాడు. హేమంత్ కుమార్ వద్ద సహాయ సంగీత దర్శకుడిగా చేరాడు. పాటలు పాడాలన్న అతని ఉత్సాహాన్ని గమనించిన హేమంత్ కుమార్ రవితో కోరస్‍లో పాడించాడు. హేమంత్ కుమర్ తరపున లతతో మాట్లాడేందుకు వెళ్ళిన రవి, లత భక్తుడైపోయాడు. తాను స్వతంత్ర సంగీత దర్శకుడైన తరువాత తన సినిమాలలో ప్రత్యేకమైన పాటలు, అద్భుతమైన పాటలు, ప్రధానమైన పాటలు లతతోటే పాడించాడు. రవి కోసం లత దాదాపుగా ఎనభై ఐదు పాటలు పాడింది.

హేమంత్ కుమార్‍కు కూడా లతతో పరిచయం ఉంది. ఇద్దరికీ ఒకరిపట్ల మరొకరికి గౌరవం ఉంది. కాబట్టి ఇందరు చెప్తూంటే కాదనలేక లత ఫిల్మిస్థాన్ వారి సినిమాలో పాట పాడటానికి ఒప్పుకుంది. ఇక్కడ మనం లతా మంగేష్కర్ స్వభావంలోని ఒక ప్రధానమైన విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఒక వజ్రాల వ్యాపారి మాత్రమే వజ్రం విలువను సరిగ్గా అంచనా వేయగలుగుతాడు. ఇతరులు పనికి రాదని అన్నా, బాలేదని అన్నా, వజ్రాల వ్యాపారి దాని విలువను గుర్తిస్తాడు. సినీ సంగీత ప్రపంచంలో లత అలాంటి వజ్రాల వ్యాపారి.

సంగీత దర్శకులు ఇంకా ఆరంభ దశలో ఉన్నప్పుడే వారి ప్రతిభను గుర్తిస్తుంది లత. గేయ రచయితలలోని గేయ రచనా నైపుణ్యాన్ని గ్రహిస్తుంది. అలాగే ఒక పాట రూపొందే సమయంలోనే ఆ పాట బాణీలోనో, గేయ రచనలోనో సందర్భంలోనో ఇమిడి ఉన్న గొప్పతనాన్ని,  ఆకర్షణను అర్థం చేసుకుంటుంది. అలాంటి పాటలు పాడటం వల్ల గాయనిగా తనకు లాభం ఉంటుందని అనిపించినా , ఆ పాట భవిష్యత్తులో ప్రామాణికమైన పాటగా ఎదిగి చిరంజీవిలా నిలుస్తుందనిపించినా లత తన నియమాలను సడలిస్తుంది. అయిష్టంగా పాడుతున్నట్టు చేసినా ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పాటలను వదులుకోదు. అలాంటి పాటలు పాడటం వల్ల ఉత్తమ గాయనిగా తన పేరు చిరకాలం నిలవటమే కాదు, అత్యుత్తమ గాయనిగా ఎదగటంలో తోడ్పడతాయన్నది లత గ్రహిస్తుంది. అన్ని నియమాలనూ త్రోసిరాజని ఆ  పాటలు పాడుతుంది.

సంగీత దర్శకుడు జయదేవ్ ‘హమ్ దోనో’ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న సమయంలో లతకు జయదేవ్‍తో మాటలు లేవు. ఆయన ‘అల్లా తేరో నామ్’ అనే అతి గొప్ప భజనను రూపొందించాడని , అది ఎమ్మెస్ సుబ్బులక్ష్మితో పాడించాలనుకుంటున్నాడనీ సినిమా పరిశ్రమలో వార్త తెలిసింది. అలాంటి పాట పాడితే అది అత్యుత్తమ భజనగా నిలవటమే కాదు, భజన కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాడతారు. రోజూ ఉదయం వినిపించే వీలుంది.  అందువల్ల చిరకీర్తి లభించటమేకాదు, లత ఒక పద్దతి ప్రకారం నిర్మించుకుంటూ వస్తున్న పవిత్ర ఇమేజీ మరింతగా స్థిరపడుతుంది.  అందుకని లత తిన్నగా జయదేవ్ వద్దకు వెళ్ళింది. పాటను ఆలాపించి చూపింది. లత పాడిన తరువాత ఆ పాటను ఇంకెవరి స్వరంలో ఊహించటం కష్టం. ఫలితంగా ‘అల్లా తేరో నామ్’ పాట లత పాడింది. అత్యద్భుతమైన పాటల్లో ఒకటిగా నిలుస్తుంది ఆ పాట ఈనాటికీ. ఇప్పటికీ హిందీ సినిమా భజన పాటలు అనగానే ‘ఏయ్ మాలిక్ తేరె బంద్ హమ్’ తరువాత వినిపించేదీ ‘అల్లా తేరో నామ్’ పాటనే. రెండూ లత పాడినవే.

అలాగే రాజ్ కపూర్ ‘సత్యం, శివం, సుందరం’ సినిమా తీసే సమయంలో ఆ సినిమా పాటలు పాడేందుకు అంత ఇష్టం ప్రదర్శించలేదు లత . ఎందుకంటే, సత్యం శివం సుందరం సినిమా ఆలోచన 1950 దశకం చివరలో రాజ్ కపూర్ చేశాడు. అందమైన స్వరం, వికారమైన రూపం వున్న స్త్రీ ప్రేమగాథను రూపొందించటంలో లత నే అతనికి ప్రేరణ. అప్పుడు ఆ సినిమాలో లతనే నాయిక అన్నాడు. కానీ, హీరోలయిపోవాలని బయలు దేరిన ముకేష్, తలత్ ల పరిస్థితి లత చూసింది. ఆమెకు పాటలు పాడటం ప్రధానం. నటన ఆమెకు ఇష్టంలేదు. పైగా, అందమయిన గాత్రం, వికారమైన రూపం అంటే తాను అందంగాలేనని ఒప్పుకోవాల్సివస్తుంది. అందుకని ఆ సినిమాలో నటించేందుకు లతా ఇష్టపడలేదు. రాజ్ కపూర్ ఆ ఆలోచనను వదిలేశాడు. మళ్ళీ 1970లలో బాబీ తరువాత ఆ ఆలోచన ఆధారంగా సినిమా ఆరంభించాడు. అందుకే లత ఆ సినిమాలో పాటలు పాడేందుకు అంత ఇష్టం చూపలేదు.  ఆమెని పాటలు పాడేందుకు ఆకర్షించాలని రాజ్ కపూర్ ‘సత్యం, శివం, సుందరం’ శీర్షిక గీతం పండిత్ నరేంద్ర శర్మ రచిస్తున్నాడని, అధిక శాతం పాటలు సంతోష్ ఆనంద్ రచిస్తున్నాడని చెప్పాడు. పండిత్ నరేంద్ర శర్మ రాసే పాట పాడే అవకాశం లత ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. అర్థవంతమైన గీతాలను చక్కటి పదాలతో బహు ప్రశంసనీయమైన భావాలతో రచిస్తారు పండిత్ నరేంద్ర శర్మ , సంతోష్ ఆనంద్. ఆ  పాటలు పాడే అవకాశం లత పోగొట్టుకోదు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా రాజ్ కపూర్ సినిమా ‘సత్యం శివం సుందరం’లో పాడింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్‍ను అసభ్యంగా చూపినందుకు ప్రతీకారం రాజ్‍కపూర్‍పై మరో రకంగా తీర్చుకుంది. అది భవిష్యత్తులో.

పై సంఘటనలను బట్టి చూస్తే, లత అతి శ్రద్ధతో, అత్యంత జాగరూకతతో తన కెరీరు నిర్మించుకోవటమే కాదు, ఆరంభం నుంచీ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ని సృష్టించుకున్నదని అర్థమవుతుంది. ఆరంభంలోనే ఇంకా పేరు రాక ముందే నచ్చని వారు ఎంత పెద్దవారయినా వారికి పాడనని లత అనటం మంచిది కాదని సలహా ఇచ్చిన వారితో ఆ కాలంలోనే లత “ఇది నా భుక్తి, ఇక్కడ దీర్ఘకాలం నేను ఉండాలి. కాబట్టి ఆరంభంలోనే అప్రియమైన విషయాలను స్పష్టం చేస్తే, నాతో పని చేయాలనుకునే వారు ముందే అన్నీ తెలుసుకుని ఇష్టమైతేనే వస్తారు. అనవసరమైన సమస్యలు తప్పుతాయి” అని స్పష్టంగా చెప్పింది.

దానికి తోడుగా ఆమె పాటల ఎంపికలో చక్కని విచక్షణ చూపింది. భారతదేశ చరిత్రలో వందేమాతరం పాటకు ప్రత్యేకత ఉంది. సామాజిక, ధార్మిక, రాజకీయపరంగా కూడా అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది వందేమాతరం గీతం. ఆ పాట పాడటం వల్ల లత కూడా ప్రత్యేకతను సాధిస్తుంది. వందేమాతరం పాటకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, పవిత్రతలు లతకు కూడా ఆపాదిస్తారు. ఆ రకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటమే కాదు, భవిష్యత్తులో జాతీయ సమైక్యతకు చిహ్నంగా కూడా ఎదగవచ్చు. ఇది అర్థం చేసుకున్న లత ఫిల్మిస్తాన్‍తో పనిచేయనన్న నియమాన్ని సడలించి హేమంత్ కుమార్ కోసం ‘ఆనంద మఠ్’ పాటలు పాడేందుకు ఒప్పుకుంది. లత పాడిన వందేమాతరం పాట ఈనాటికీ హిందీ సినీ దేశభక్తి పాటల్లో అగ్ర తాంబూలం అందుకుంటుంది. సినిమాలలో ప్రేమ పాటలు ఎలాగో ఉంటాయి. భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు వంటి ప్రత్యేకమైన గీతాలు ప్రామాణికంగా పాడి లత తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‍ని సాధించుకుంది. తెల్లచీర ధరించటం, నిరాడంబరంగా, ఎలాంటి అలంకరణలు లేకుండా ఉండటం, చక్కటి సాహిత్యం ఉన్న గీతాలనే పాడటం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక పవిత్ర ఇమేజ్‍ని ఏర్పాటు చేసుకుంది లత.

లత స్వరం పనికిరాదన్న ఎస్. ముఖర్జీకి ఆనంద మఠ్ సినిమా కోసమే కాదు అనార్కలి, నాగిన్ వంటి సూపర్ డూపర్ హిట్ పాటలున్న సినిమాల్లోనూ లతతోనే పాడించాల్సి వచ్చింది. ఫిల్మిస్థాన్ నిర్మాణ సంస్థకు వ్యాపారపరంగా అత్యధిక లాభాలనార్జించి పెట్టిన సినిమాల్లో అనార్కలి, నాగిన్‌లు అగ్రస్థానంలో ఉంటాయి. ఎస్. ముఖర్జీ లత స్వరం బాగాలేదని తిరస్కరించినప్పుడు భవిష్యత్తులో అందరూ ఈమెతో పాటలు పాడించాలని క్యూలు కడతారని గులామ్ హైదర్ అన్నమాటలు ఈ రకంగా నిజమయ్యాయి.

ఇలా ఒకరి తరువాత ఒకరుగా బొంబాయి వస్తున్న అత్యంత సృజనాత్మక ప్రతిభగల సంగీత దర్శకులను తన స్వర మాధుర్యంతో సమ్మోహన పరుస్తూ లత ఎదురులేని గాయనిగా ఎదిగింది. 1953లో 44 సినిమాల్లో 194 పాటలు పాడింది లత. ఈ సంవత్సరం లత పాడిన పాటల్లో సి. రామచంద్ర రూపొందించినవి 40 పాటలు; శంకర్ జైకిషన్‌వి 44 పాటలు. 1954లో లత 117 పాటలు పాడింది. దీంతో పాటలు పాడటం ఆరంభించిన ఎనిమిది సంవత్సరాలలో వెయ్యి పైగా పాటలు పాడిన ఘనత సాధించింది లత. హిందీ సినీ సంగీతచరిత్రలో వెయ్యి పాటలు ప్రథమంగా పాడిన గాయనిగా చరిత్రలో తన పేరు సుస్థిరం చేసుకుంది లత. గాయకులలో లతకు కనీస సమీపంలో కూడా ఎవరూ లేరు. 1955 పూర్తయ్యేసరికి 326 సినిమాల్లో 1344 పాటలు పాడింది లత. అంటే 1956-57 వచ్చేసరికి లతకు ఎదురులేని పరిస్థితి వచ్చింది. కనుచూపు మేరలో లతతో పోటీపడే గాయని ఎవరూ లేరు. ఇది కూడా  ఎస్డీ బర్మన్‍కు పాటలు పాడనని ప్రకటించే ధైర్యం లతకు ఇచ్చింది.

ఎస్డీ బర్మన్ చక్కటి సంగీత దర్శకుడే కానీ సంవత్సరానికి నాలుగు అయిదు సినిమాలకన్నా ఎక్కువగా పనిచేయడు. అదే సమయంలో శంకర్ జైకిషన్, సి. రామచంద్ర వంటి వారు అలాంటి నియమ నిబంధనలు ఏమీ లేకుండా అవకాశం దొరికినన్ని సినిమాలకు పనిచేస్తున్నారు. చక్కటి హిట్ పాటలను రూపొందిస్తున్నారు. ఇతర సంగీత దర్శకులు కూడా లతకి విధేయులు. లత లేకుండా తమ పాటలను రూపొందించలేని పరిస్థితిలో ఉన్నారు. లత లేని పాటలను ఊహించలేరు వారు. కాబట్టి ఒక్క ఎస్డీ బర్మన్ పాటలు పాడకపోతే పెద్దగా నష్టం ఉండదనుకుంది లత. అందుకే తను పాడిన పాటను ఆశాతో మళ్ళీ పాడించాడని ఎస్డీ బర్మన్ పాటలు పాడనని ప్రకటించింది.

ఇతర సంగీత దర్శకులలా లత లేకపోతే పాటను ఊహించలేను అనే సంగీత దర్శకుడు కాదు ఎస్డీ బర్మన్. ఆయన పలువురు గాయనిలతో హిట్ పాటలను పాడించాడు. లత తన పాటలు పాడనంటే ఆయన బెదరలేదు. ఆశాతో పాడించటం ప్రారంభించాడు. ఆశా భోస్లే పాట పాడే విధానం ఎస్డీ బర్మన్‍కు అంతగా నచ్చదు. ఆయనకు పాటల్లో మృదుత్వం ఉండాలి. స్వరంలో హొయలు ప్రత్యక్షంగా కనిపించకూడదు. గీతాదత్, లతా మంగేష్కర్‍ల గాన సంవిధానం ఎస్డీ బర్మన్‍కు ఎంతో ఇష్టం. కానీ 1950 ప్రాంతాల కల్లా గీతాదత్ కెరీర్ క్షీణ దశలో ఉంది. అయితే గురుదత్ సినిమా ప్యాసాకు, కాగజ్ కే పూల్‍లకు సంగీత దర్శకుడు అవటం వల్ల గీతాదత్‍తో సులువుగా పాడించాడు. కానీ ఇతర సినిమాలకు ఆశా భోస్లేతో పాటలు పాడించాడు. ఐతే ఏ పాటకోసమైతే  మరోసారి లతను పాడమని పిలిస్తే ఆమె రాకపోవటం వల్ల ఆశా భోస్లేతో పాడించాడో ఆ పాట ఆశా పాడినప్పుడు ఎస్డీ బర్మన్‍కు సంతృప్తి కలుగలేదు. చివరికి సినిమాలో లత పాడిన పాటనే ఉంటుంది. అయినా సరే, లత తన పాటలు పాడనన్నందుకు ఎస్డీ బర్మన్ ఆమె పేరు తలవనే లేదు. ఆశా భోస్లే స్వరానికి తగ్గ బాణీలను రూపొందిస్తూ ముందుకు సాగాడు.

1952 నుండి 1957 నడుమ ఆశా భోస్లే తో 34 పాటలు పాడించాడు ఎస్డీ బర్మన్. ఇదే సమయంలో 1950 నుండి 1957 నడుమ లతతో 74 పాటలు పాడించాడు. 1957 నుండి 1962 వరకూ లత పాట ఒక్కటి కూడా ఎస్డీ బర్మన్ సినిమాల్లో లేదు. ఈ సమయంలో ఆశాతో 59 పాటలు పాడించాడు. ‘ఫంటూష్’, ‘చల్తీ కా నామ్ గాడీ’, ‘కాలా పానీ’ ‘లాజవంతి’, ‘బొంబాయి కా బాబూ’, ‘బేవకూఫ్’ వంటి సినిమాల ఏకైక గాయని ఆశా భోస్లే. అంటే పాడనని అన్నందుకు లతపైన కసిని చూపేందుకు ఆశాతో అధికంగా పాడించాడన్నమాట ఎస్డీ బర్మన్. ఇదే సమయానికి ఓపీ నయ్యర్ కూడా ఆశాను ప్రధాన గాయనిగా ఎంచుకోవటంతో ఆశా అచిర కాలంలోనే లత తరువాత ద్వితీయ గాయని స్థాయికి చేరుకుంది.

లత పాటలు పాడనని అన్న ఎస్డీ బర్మన్‍కు పెద్ద నష్టం కలగకపోవటానికి అతని వెంట అండగా నిలబడిన నవకేతన్ సంస్థ ప్రధాన కారణం. ఈ సమయంలో ఫంటూష్, నౌదోగ్యారా, కాలాపానీ, కాలాబజార్, వంటి సూపర్ హిట్ సినిమాలు నవకేతన్ సంస్థ నిర్మించిన సినిమాలే. ఇవి కాక సోల్హా సాల్, బాత్ ఏక్ రాత్ కీ, ఏక్ కే బాద్ ఏక్, బొంబాయి కా బాబూ వంటి సినిమాలలో హీరో దేవ్ ఆనంద్. ఏలాగైతే రాజ్ కపూర్ సినిమాలకు శంకర్ జైకిషన్ అధికంగా సంగీత దర్శకుడో, అలాగే దేవ్ ఆనంద్ ఎస్డీ బర్మన్‍తో ఉన్న అనుబంధం తెలిసిన వారు అతని సినిమాలలో అధికంగా ఎస్డీ బర్మన్‍ను సంగీత దర్శకుడిగా వాడేరు. ఇంకా బిమల్ రాయ్, గురుదత్ వంటి వారు కూడా ఎస్డీ బర్మన్‍కు ప్రాధాన్యం ఇచ్చేవారు. దాంతో లత పాటలు పాడకున్నా ఎస్డీ బర్మన్ వ్యాపార విలువ ఏ మాత్రం తగ్గలేదు. పైగా ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ సినిమాలు కావటంతో వ్యాపారపరంగా ఎస్డీ బర్మన్‍కు ఎలాంటి నష్టం కలగలేదు. కానీ ఎస్డీ బర్మన్ అధికంగా ఇష్టపడే మెత్తని, మృదువైన పాటలు అతని సినిమాలలో కనబడలేదు ఈ అయిదు సంవత్సరాలు.

‘జాల్’లో లత పాడిన ‘యే రాత్ యే చాంద్‍నీ ఫిర్ కహాఁ’, ‘టాక్సీ డ్రైవర్’ సినిమాలో ‘దిల్ సే మిలాకె దిల్’, ‘దేవదాసు’లో ‘జిసె తూ కబూల్ కర్ కే’, హౌస్ నెం 44 లో ‘ఫైలీ హూయీ హై’, ‘మునింజీ ‘ లో ఘాయల్  హిరణియా, ‘పేయింగ్ గెస్ట్’ లో చాంద్ ఫీర్ నిక్‍లా వంటి మనోహరమూ, మధురము అయినటు వంటి గీతాలు 1957- 62 నడుమ ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో రూపొందలేదు. ‘ప్యాసా’, ‘కాగజ్ కే పూల్’ సినిమాలలో గీతాదత్ పాటలను వదిలేస్తే, ‘బాత్ ఎక్ రాత్ కీ’ లో సుమన్ కళ్యాణ్‌పూర్ స్వరంలో ‘న తుమ్ హమె జానే’ లాంటి మధురమైన పాటలు అతి తక్కువగా వినిపించాయి. సుమన్ కళ్యాణ్‌పూర్ స్వరం లత స్వరాన్ని పోలి ఉంటుందన్న నిజాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఎస్డీ బర్మన్ గేయ సృజనలో లత స్వరం ప్రాధాన్యం స్పష్టం అవుతుంది. ఆశా స్వరంలో ‘సుజాత ‘ సినిమాలో ‘కాలీఘాటా ఛాయ్’, ‘కాలా బజార్’లో ‘సచ్ హువే సప్నే తేరే’ వంటి పాటలు సృజించినా గాయనిల స్వరాలలో ఎస్డీ బర్మన్ సృజించే మధురమైన పాటల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ.

లతా మంగేష్కర్ సైతం ఈ అయిదేళ్ళలో అత్యద్భుతమైన పాటలు పాడినా, ఎస్డీ బర్మన్ రూపొందించేటటు వంటి మృదుమధురమైన పాటలు అతి తక్కువ సంఖ్యలో పాడిందనటం సత్యదూరం కాదు. అంటే, పంతాలకు పోయి ఒకరితో ఒకరు పని చేయటం మానేసినా, ఈ అయిదేళ్ళలో తమ కెరీర్ అభివృద్ధిలో, సృజనాత్మక కళా ప్రదర్శనలో లత, ఎస్డీ బర్మన్‍లకు ఒకరి ప్రాధాన్యం మరొకరికి అర్థమయింది.

పంతానికి వచ్చి పట్టు బట్టటం ఒక ఎత్తు. ఆ పట్టును విడిచేందుకు అహాన్ని వదలటం మరో ఎత్తు. ఈ విషయంలో సినీ ప్రపంచంలో మహమ్మద్ రఫీని అందరూ మెచ్చుకుంటారు. తన రికార్డింగ్‍కు ఆలస్యంగా వచ్చాడని ఓపి నయ్యర్ కోపంతో తన రికార్డింగ్ స్టూడియోలో అడుగుపెట్టవద్దని రఫీని బయటకు నడిపాడు. ఆ తరువాత మహేంద్ర కపూర్‍తో పాడించాడు. కానీ ఓపి నయ్యర్ పాటలలో అంతకు ముందున్న ఆకర్షణ తగ్గింది. ఆ సమయంలో రఫీ తనంతట తానుగా ఓపి ఇంటికి వెళ్ళి ఆ రోజు ఆలస్యం కావటానికి కారణం వివరించాడు. “నేను ఆహాన్ని చంపుకోలేకపోయాను. నువ్వు అహాన్ని జయించినవాడివి. నువ్వు నన్ను ఓడించావీ రోజు” అంటూ ఓపి నయ్యర్ రఫీని కౌగలించుకున్నాడు. ఈ సంఘటన రఫీ ప్రసక్తి వచ్చినప్పుడల్లా చెప్పి ఓపి కంటనీరు పెట్టుకుంటాడు. ‘అహం లేని గొప్ప వ్యక్తి’ అని రఫీని పొగడుతాడు. అయితే అలాంటి అహం రహిత ప్రవర్తనను లతనుంచి ఊహించటం కుదరని పని. తనంతట తాను వెళ్ళటానికి ఎస్డీ బర్మన్‍కు అహం అడ్డొస్తుంది. కానీ ఇద్దరూ అవకాశం దొరికితే ఎలాగైనా తమ పట్టుదలకు స్వస్తి చెప్పి పంతాలు విడచి కలసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారు. వారికి ఎస్డీ బర్మన్ తనయుడు ఆర్డీ బర్మన్ ఆ అవకాశాన్నిచ్చాడు.

ఎస్డీ బర్మన్ ఒక పద్ధతి ప్రకారం తన కొడుకు ఆర్డీ బర్మన్ గొప్పగా బాణీలు రూపొందించగలడన్న విషయానికి ప్రచారం ఇస్తూ వచ్చాడు. ఈ రకంగా దర్శక నిర్మాతలకు ఆర్డీ బర్మన్ ప్రతిభ పట్ల నమ్మకం కలగాలనీ, అతడు స్వతంత్ర సంగీత దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఎదగాలన్నది ఎస్డీ బర్మన్ లక్ష్యం. అందుకని ఫంటూష్ సినిమాలో ‘ఏయ్ మేరె టోపి పలట్ కె ఆ’ అన్న పాట బాలుడైన ఆర్డీ బర్మన్ రూపొందించినది అన్న దానికి ప్రచారం వచ్చింది. అలాగే ‘చల్తీ కా నామ్ గాడీ’ సినిమాలో నేపథ్య సంగీతానికి ఎస్డీ బర్మన్ అధికశాతం క్రెడిట్ ఆర్డీ బర్మన్‍కే ఇచ్చాడు. అలాగే ప్యాసా సినిమాలో వినిపించే మౌత్ ఆర్గాన్ వాయించింది ఆర్డీ బర్మన్ అన్న విషయానికి చక్కని ప్రచారం వచ్చింది. అంతేకాదు, గురుదత్ నిర్మించే రాజ్ అనే సినిమాకు ఆర్డీ బర్మన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడన్న వార్తకూ చక్కని ప్రచారం లభించింది. రెండు పాటలు రికార్డయిన తరువాత సినిమా మధ్యలో ఆగిపోయింది. ఈలోగా ఆర్డీ బర్మన్‍తో చక్కటి స్నేహం కల మహమూద్ సినీ నిర్మాణం తలపెట్టాడు. తొలిసారిగా నిర్మిస్తున్న ‘ఛోటా నవాబ్’ సినిమాకు సంగీత దర్శకుడిగా ఆర్డీ బర్మన్‍ను ఎన్నుకున్నాడు. ‘రాజ్’ సినిమా కోసం ఆర్డీ రూపొందించిన పాట మహమూద్‍కు నచ్చింది. ఆ పాట గురుదత్ అనుమతితో ఛోటా నవాబ్‍లో వాడేందుకు నిశ్చయించారు. కానీ ఆ పాట లత తప్ప మరొకరు పాడితే బాగుండదు. కాబట్టి లతతో పాడించాలని నిశ్చయించారు. కానీ లతకు ఎస్డీ బర్మన్‍కు నడుమ మాటలు లేవు. కాబట్టి ఆర్డీ ముందుగా ఎస్డీ బర్మన్ అనుమతి తీసుకున్నాడు. తాను సంగీత దర్శకత్వం వహించే తొలి సినిమాలో తొలి పాటను లతతో పాడించేందుకు ఎస్డీ బర్మన్ అనుమతి లభించింది. ఎస్డీ బర్మన్‍కు లత పంతాలు పట్టింపులు వదలి పాడించాలని ఉన్నదన్న సూచన అందింది. తరువాత ఆర్డీ బర్మన్ లత దగ్గరకు వెళ్ళాడు.

లతకు ఆర్డీ బర్మన్ పరిచయం. ఎస్డీ బర్మన్ కొడుకుగా.  సంగీత దర్శకుడుగా అవ్వాలన్న కోరిక ఉన్నవాడిగా ఆర్డీ ప్రతిభను గుర్తించింది. భవిష్యత్తులో ఆర్డీ లెక్కించదగ్గ సంగీత దర్శకులలో ఒకడిగా ఎదుగుతాడన్న సత్యాన్ని లత గ్రహించింది. అందుకే ఆర్డీ తన తొలి సినిమాలో, రికార్డయ్యే తొలి పాటను లత పాడాలని అభ్యర్థించగా ఒప్పుకుంది. ఎవరినైతే అణచివేయలేమో వారితో స్నేహం చేయటం ఉత్తమం అంటారు. లత అదే పద్ధతిని అనుసరించింది. అయిదేళ్ళు లత పాడుకున్నా ఎస్డీ బర్మన్ కెరీర్‍లో ఎలాంటి మార్పు రాలేదు.

పైగా, ఆశా భోశ్లేకు ఓ వైపు ఎస్డీ బర్మన్ మరోవైపు ఓపి నయ్యర్‍లు పెద్దపీట వేయటం వల్ల ఆశా భోస్లే అగ్రశ్రేణి గాయనిగా ఎదుగుతోంది. మరోవైపు నుంచి సుమన్ కళ్యాణ్‌పూర్ లాంటి లత స్వరాన్ని పోలిన గాయనిలు రంగప్రవేశం చేసి గుర్తింపు పొందుతున్నారు. ‘న తుమ్ హమ్ జానో’ పాట విన్నవారిలో అధికులు అది లత పాడిన పాట అని పొరపడుతారు. ఇది కూడా ఎస్డీని అణచివేసే పరిస్థితి లేదు కాబట్టి స్నేహం చేయటమే ఉత్తమం అన్న భావన లతలో కలిగించి ఉండవచ్చు. లతకు సినీ పరిశ్రమలోని మనుషుల మనస్తత్వం బాగా తెలుసు. సుమన్ కళ్యాణ్‌పూర్ కూడా లత లాగే హిట్ పాటలు పాడగలదు. అదీ లత కన్న తక్కువ ధరకు పాడుతుంది అని నిరూపితమయితే నిర్మాతలు, సంగీత దర్శకులకు లతను వదలి సుమన్ కళ్యాణ్‌పూర్ వైపు మళ్ళటానికి ఒక్క సెకను కూడా పట్టదని లతకు తెలుసు. అందుకని ఎస్డీ బర్మన్ మరిన్ని హిట్ పాటలు సుమన్‍తో పాడించక ముందే ఇతర సంగీత దర్శకుల దృష్టి సుమన్ వైపు మళ్ళక ముందే ఎస్డీతో తిరిగి స్నేహం చేయాలని లత అనుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సినిమా పాటలు ఎంత కళ అయినా ఆ కళను ముందుకు నడిపేది వ్యాపారమే! గాలివాలును గ్రహించి తన గమన దిశను నిర్ణయించుకున్నవాడే గమ్యం చేరతాడు.

ఎస్డీ బర్మన్ సైతం లతతో మళ్ళీ స్నేహం చేయాలని, పంతాలు పట్టింపులు వదిలేయాలని అనుకోవటానికీ పలు కారణాలున్నాయి. పాటలు హిట్ అవుతున్నా ఎస్డీ బర్మన్‍కు తాను సృజిస్తున్న పాటల పట్ల అసంతృప్తి ఉంది. సుమన్ కళ్యాణ్‌పూర్ పాడిన ‘న తుమ్ హమ్ జానో’ పాట హిట్ అయినా జాగ్రత్తగా వినేవారికి సుమన్ ఊపిరి నియంత్రణ లోపం, హైపిచ్‍లో స్వరంలో కంపనం రావటం, భావాలు పలకటంలో లోపం వంటివి సులభంగా గ్రహిస్తారు. కాబట్టి సుమన్ పాడటంలో నాణ్యత విషయంలో ఏ రకంగానూ లతకు పోటీ రాదు. వీటికి తోడు 1960‌-61 ప్రాంతాలలో ఎస్డీ బర్మన్‍కు గుండెపోటు వచ్చింది. ఈ సమయంలో ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వం వహించాల్సిన సినిమాలన్నీ వేరే సంగీత దర్శకులకు వెళ్ళిపోయాయి. 1961లో ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. తరువాత సినిమాలే లేవు, ఎందుకంటే ఎస్డీ బర్మన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇది ఎస్డీ బర్మన్‍లో అభద్రతా భావాన్ని కలిగించింది. రాహుల్ దేవ్ బర్మన్ ఇంకా స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఎదగలేదు. ఎస్డీ బర్మన్ దగ్గర సినిమాలు లేవు. అత్యంత బాధాకరమూ, భవిష్యత్తు పట్ల అభద్రతాభావాన్నీ కలిగించగల పరిస్థితి ఇది.

ఈ పరిస్థితిని వివరిస్తూ ఆర్డీ బర్మన్ “1961లో నాన్నకు గుండెపోటు వచ్చినప్పుడు సినీ పరిశ్రమలోని స్నేహాలన్నీ గాలివాటు స్నేహాలే అని అర్థమయింది. గుండెపోటు వచ్చే సమయానికి గురుదత్ సినిమా ‘బహరే ఫిర్ బి ఆయేంగీ’ సినిమాకు అయిదు పాటలను నాన్న రూపొందించారు. ఆ పాటలను నేను రికార్డు చేయగలనని నాన్న అమ్మ గురుదత్‌కు చెప్పారు. గురుదత్ నాన్నకు ఎంతో సన్నిహితుడు. నవకేతన్ సంస్థ ఆరంభం కాక ముందరి నుంచీ పరిచయం. కానీ గురుదత్ నాన్న మాట వినలేదు. ఓపి నయ్యర్‍ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఇలా ఒకరొకరుగా సినిమా నిర్మాతలు నాన్నను కాదని వేరే సంగీత దర్శకులను ఎంచుకున్నారు. ఆ సమయంలో దేవ్ ఆనంద్ దేశంలో లేడు. ఆయన ఒక్కడే నాన్నకు అండగా నిలబడ్డాడు. ఎంత కాలం అయినా ఫర్వాలేదు నేను ఎదురుచూస్తాను, మీరు ఆరోగ్యవంతులయ్యే వరకూ అన్నాడు. అలాగే ఎదురు చూశాడు. దేవ్ ఆనంద్ నాన్న కోసం ఎదురుచూసి నాన్న సంగీత దర్శకత్వంలో రూపొందించిన సినిమా గైడ్” అని చెప్పాడు ఓ ఇంటర్వ్యూలో.

ఇదే సంఘటన జయదేవ్ మరో రకంగా చెప్తాడు. నవకేతన్ నిర్మాణ సంస్థలో చాలాకాలం ఎస్డీ బర్మన్ అసిస్టెంట్‍గా పనిచేసిన జయదేవ్ ప్రతిభను గుర్తించిన దేవ్ ఆనంద్ నవకేతన్ నిర్మించే సినిమాల్లో ఒక సినిమాకు ఎస్డీ బర్మన్ సంగీత దర్శకుడు  అయితే తరువాత సినిమాకు జయదేవ్ సంగీత దర్శకుడిగా పని చేయాలని నిర్ణయించాడు. అలా ‘హమ్ దోనో’ సినిమాకు జయదేవ్ సంగీత దర్శకత్వం వహించాడు. సినిమాలో పాటలు ఈనాటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. దేవ్ చెప్పిన ప్రకారం ‘గైడ్’ సినిమాకు జయదేవ్ సంగీత దర్శకత్వం వహించాలి. జయదేవ్ రెండు ‘రఫీ’ పాటలను రికార్డు చేశాడు కూడా. కానీ అనారోగ్యంతో బాధపడుతూ, చేతిలో సినిమాలు లేక భవిష్యత్తు గురించి భయపడుతున్న ఎస్డీ బర్మన్‍కు ఆత్మవిశ్వాసం కలిగించేందుకు ‘దేవ్’ జయదేవ్‍కు ఇచ్చిన మాట తప్పి ‘గైడ్’ సినిమాకు ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వం వహిస్తాడని, జయదేవ్ అతని సహాయకుడుగా ఉండాలని కోరాడు. జయదేవ్ అందుకు ఇష్టపడలేదు. నవకేతన్ నిర్మాణ సంస్థను వదిలేశాడు. దాంతో ఎదుగుతున్న జయదేవ్ కెరీర్ దిగజారింది. దాదాపుగా అంతమయ్యే స్థితిలో ఉన్న ఎస్డీ బర్మన్ కెరీర్ ఊపందుకుంది. అందుకే ఎంత ప్రతిభ ఉన్నా, ఏదో ఒక పెద్ద నిర్మాణ సంస్థ అండ ఉండటం కళాకారుడికి భధ్రతనిస్తుంది సినీ పరిశ్రమలో.

తండ్రి అనారోగ్యం పాలయి, భవిష్యత్తు డోలాయమానంగా ఉన్న సమయంలో ఆర్డీ బర్మన్‍కు సినిమా అవకాశం వచ్చింది. దానిలో తొలి పాటను లతతో పాడించాలని ఆర్డీ బర్మన్ నిశ్చయించాడు. అందుకు వెంటనే అనుమతినిచ్చాడు ఎస్డీ బర్మన్. లతతో చెడిన సంబంధాన్ని సరిచేసేందుకు ఇదే సరైన అవకాశం అన్న భావన ఎస్డీకి కూడా కలిగి ఉండవచ్చు. లతతో బంధం గట్టి పడటం కూడా ఒక రకంగా సంగీత దర్శకుడికి అవసరం. అతడికి సృజన స్వేచ్ఛ ఉంటుంది. పైగా లతతో హిట్ పాటలు సృష్టించగలగటంలో ఎస్డీ బర్మన్‍కు ఎలాంటి సందేహం లేదు. అంటే ఆర్డీ బర్మన్ తొలి సినిమా అవకాశం ఎస్డీ, లతలకు ఎదురుచూస్తున్న అవకాశాన్నిచ్చింది.

ఆర్డీ బర్మన్ తొలిసారిగా లతను ‘ఠండీ హవాయే’ పాట రికార్డింగ్ సమయంలో కలిశాడు. తరువాత ఎస్డీ బర్మన్‍కు సహాయకుడిగా లతతో పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని లతను తన సినిమాలో పాడమని అడిగాడు. ఆమె ఒప్పుకున్న వెంటనే రిహార్సల్స్‌కు ఇంటికి రమ్మన్నాడు. లత ఒప్పుకుంది. రిహార్సల్స్ కోసం సంగీత దర్శకుడి ఇంటికి వెళ్లటం అనవాయితీ. శంకర్ జైకిషన్ వంటి సంగీత దర్శకులకు రిహార్సల్స్ కోసం ప్రత్యేకంగా గదులుండేవి. కానీ ఎస్డీ బర్మన్, నౌషాద్ వంటి వారు ఇంటిలోనే పాట పాడటం నేర్పేవారు. అప్రస్తుతమైనా ఇక్కడ ఓ సంఘటన గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.

‘సాహిర్ లాథియాన్వీ’కి తన పాటలకు బాణీలు కట్టి సంగీత దర్శకులు పేరు తెచ్చుకుంటున్నారనిపించింది. కాబట్టి తాను సంగీత దర్శకుల ఇంటికి వెళ్ళటం ఏమిటి, సంగీత దర్శకులే హార్మోనియం, తబలాలు తీసుకుని తన ఇంటికి రావాలని నియమం విధించాడు. అలా వచ్చిన వాళ్ళకే తాను పాటలు రాస్తానన్నాడు. అలా ఇంటికి వెళ్ళేందుకు నిరాకరించిన జయదేవ్‍కు పాటలు రాయలేదు. తబలా, హార్మోనియం పట్టుకుని ఇంటికి వచ్చిన సంగీత దర్శకుడు ‘రవి’కి పాటలు రాశాడు. తన పాటలతో రవిని ఉచ్చస్థాయిలో నిలిపాడు.

లత కానీ, రఫీ కానీ సంగీత దర్శకుడి వయసుతో అనుబంధంతో సంబంధం లేకుండా సంగీత దర్శకుడిని గురువుగా భావించి గౌరవించేవారు. వారు రమ్మన్న సమయానికి ఇంటికి వెళ్ళేవారు. లత కూడా చెప్పిన సమయానికి ఆర్డీ బర్మన్ ఇంటికి వెళ్ళింది. ఆర్డీ బర్మన్, ఎస్డీ బర్మన్‍లది ఒకటే ఇల్లు. లత రాగానే ఆర్డీ తండ్రిని పిలిచాడు. ఎస్డీ బర్మన్ వచ్చి లతను ఆప్యాయంగా పలకరించాడు. లత ఆప్యాయంగా ఎస్డీని పలకరించింది. మళ్ళీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. అంతే ఎస్డీ బర్మన్ సృజన విజృంభించింది. అంతవరకూ తన సినిమాల్లో ప్రధాన గాయనిగా వాడిన ఆశా భోస్లేను క్షణంలో మరచిపోయాడు. ఆమెను కేబరే పాటలకు, క్లబ్బు పాటలకు పరిమితం చేసి, తన సృజనాత్మక ప్రతిభను సర్వం లత స్వర ప్రతిభను ఇనుమడింపచేసే బాణీల సృజనలో కేంద్రీకరించాడు. ఆర్డీ బర్మన్ కు లత పాడిన ఆర్డీ తొలిపాట ఘర్ ఆజా ఘిర్ ఆయీ, బద్రా సావారియా, మాల్గుంజి రాగంలో రూపొందిన పాట. అత్యద్భుతమయిన పాట. సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ పాట లత స్వరంలో వింటూంటే, స్వర్గ ద్వారం వద్ద నిలచి ఒక్కొక్క తేనే చుక్కనూ ఆప్యాయంగా ఆస్వాదిస్తున్న భావన కలుగుతుంది.

ఎస్డీ బర్మన్, లత, ఆశాలను తన పాటలు పాడేందుకు ఉపయోగించిన విధానం, ఎస్డీ సృజనకు లత ప్రాధాన్యం అర్థం కావాలంటే, 1950 నుండి 57 వరకూ ఎస్డీ సంగీత దర్శకత్వంలో లత, ఆశా, గీతాలు పాడిన పాటలను, 1957 నుండి 62 వరకూ ఆశా భోస్లే పాడిన సంఖ్యను, మళ్ళీ 1962 లో సయోధ్య కుదిరినప్పటి నుంచీ ఎస్డీ మరణం వరకూ లత, ఆశాలు పాడిన పాటల సంఖ్యను పోల్చి చూడాల్సి ఉంటుంది.

గాయని సంవత్సరాలు

 

 

1950‌-57 1957-62 1962-75 మొత్తం
గీతా దత్ 40 11 31 82*
ఆశా భోస్లే 34 59 27 120
లత 77 104 181

**1950 కన్నా ముందు గీతా దత్‍తో పన్నెండూ పాటలు పాడించాడు ఎస్డీ బర్మన్. అవి కలుపుకుంటే ఎస్డీకి గీతా పాడిన మొత్తం పాటలు 94 అవుతాయి.

ఎస్డీ బర్మన్ ప్రధాన గాయనిలను వాడిన విధానాన్ని పరిశీలిస్తే లత తనకు పాటలు పాడినంత కాలం మరో గాయని వైపు ఎస్డీ చూడలేదు. అతని సృజనను ఎత్తులకు తీసుకువెళ్ళేందుకు లత స్వరంపై ఆధారపడినా ఆమె లేకపోతే ఇతరులను కూడా సమర్థవంతంగా వాడేడు ఎస్డీ బర్మన్ అని, లత పాటలు పాడని కాలంలో ఆశాతో పాటలు పాడించి హిట్ పాటలను రూపొందించటం స్పష్టం చేస్తుంది. అందుకే లత తన సినీ జీవితంలో అత్యంత గౌరవించిన సంగీత దర్శకుడు.,  ఎస్డీ బర్మన్. ఎస్డీ బర్మన్  సృజనలో లతది ప్రధాన స్థానం అన్న విషయం, ఎస్డీ మరణించే ముందు రూపొందించిన ‘మిలి’ పాటలలో కిషోర్ కుమార్ హిట్ పాటల నడుమ అత్యంత ఆకర్షణీయంగా నిలిచిన లత పాట ‘మై నే కహా పూలోం సే” నిరూపిస్తుంది.

ఎస్డీ బర్మన్ స్వభావంలోని ఈ లక్షణం మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్‍లను వాడిన విధానంలోనూ తెలుస్తుంది. ఆరంభంలో ముకేష్, తలత్ మహమూద్‍లతో పాడించినా ఎస్డీకి వారి స్వరం అంతగా నచ్చలేదు. రఫీ స్వరంతో పరిచయం అయిన తరువాత రఫీకి ప్రాధాన్యం ఇచ్చాడు. ఒక్కసారి కిషోర్ కుమార్ నటన వదలి గాయకుడిగా స్థిరపడ్డాడో అప్పటినుంచీ కిషోర్ కుమార్‍నే అధికంగా వాడేడు. రఫీ, కిషోర్‍లు పాడిన ఎస్డీ బర్మన్ పాటల సంఖ్య  ఈ నిజాన్ని స్పష్టం చేస్తుంది.

1956లో ‘ప్యాసా’ సినిమా విడుదలయ్యే వరకూ ఎస్డీ బర్మన్ రఫీని కేవలం ఎనిమిది పాటల కోసమే వాడేడు. ప్యాసా పాటలు హిట్ అయిన తరువాత నుంచి 1969లో ఆరాధన పాటలు హిట్ అయి కిషోర్ కుమార్ యుగం ఆరంభమయ్యే వరకూ రఫీతో యాభై ఎనిమిది పాటలు పాడించాడు. కిషోర్ ప్రభంజనం శక్తివంతం అయిన 1969‌-75 కాలంలో రఫీతో కేవలం పదకొండు పాటలు మాత్రమే పాడించాడు. అదే కిషోర్ కుమార్ విషయానికి వస్తే ఆరంభం నుంచి 1969 వరకు కిషోర్‌తో 47 పాటలు పాడించాడు. 1969 నుంచి 75 నడుమ 62 పాటలు పాడించాడు.  అయితే ఎలాగైతే తన  ఉత్తమ సృజనను లతతో పాడించేవాడో, అలాగే రఫీ కోసం కూడా ఉత్తమ బాణీలను సృజించాడు ఎస్డీ బర్మన్.

1956లో ఎస్డీ బర్మన్ పాటలు పాడనని లత నిశ్చయించుకోవటం వెనుక 1953 కల్లా లత అగ్రశేణి గాయనిగా స్థిరపడటం, అందరూ సంగీత దర్శకులు తమ అత్యుత్తమ బాణీలు లతతో పాడించటం, లత ఆధారంగా బాణీలు సృజించటం వల్ల కలిగిన విశ్వాసం కారణాలుగా భావించవచ్చు. అయితే 1953 నుంచి లత ఒకొటొకటిగా డిమాండులు చేయటం, వాటిని సాధించటం కనిపిస్తుంది. సినీ పరిశ్రమలో సుస్థిరత్వం సాధిస్తూనే లత సినీ సంగీతంలో కళాకారుల పట్ల ఉన్న చిన్నచూపునూ, ఉదాసీనతనూ మార్చాలని ప్రయత్నించటం ఆరంభించింది.

గాయనీ గాయకుల పేర్లు రికార్డులపై తప్పనిసరిగా ఉండాలని పోరాడి సాధించింది. ఈలోగా సినీ సంగీతం పాపులారిటీకి కొలబద్దల్లాంటి ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆరంభమయ్యాయి. మరోవైపు శ్రీలంక రేడియో ‘సిలోన్’ లో ‘బినాకా గీత్ మాలా’ కార్యక్రమం ఆరంభమయింది. ఈ రెండూ పాటల ప్రజాదరణను గాయనీ గాయకుల పట్ల శ్రోతల ఆదరణకూ కొలబద్దల్లా మారేయి.

‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డులు ఆరంభమయ్యాయి కానీ వాటిల్లో గాయనీగాయకుల కోసం ప్రత్యేకంగా అవార్డును ఏర్పాటు చెయ్యలేదు. సంగీత దర్శకులకు అవార్డులు ఇచ్చేవారు. ‘మేము పాటలు పాడకపోతే సంగీత దర్శకుల బాణీలు ఎవరు వింటారు? కాబట్టి పాటలు పాడేవారికి అవార్డులుండాలని లత డిమాండ్ చేసింది. తన వాదనకు బలాన్ని ఆపాదించేందుకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల స్టేజీపై పాటలు పాడేందుకు నిరాకరించింది. ‘గాయనీ గాయకులకు కూడా అవార్డు ఇవ్వండి, అప్పుడు మీ స్టేజీ మీద పాడతాను” అని ప్రకటించింది. లత పోరాటం ఫలితంగా పాటలు పాడేవారికి కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఇవ్వటం మొదలయింది. తరువాత మళ్ళీ లత డిమాండ్ చేయటంతో గాయనీ గాయకులలో ఎవరు ఉత్తమంగా పాడారో ఎంచుకోవటం కష్టమవటంతో గాయనీగాయకులు వేర్వేరుగా  అవార్డులు ఇవ్వటం మొదలయింది. ఇంతలో గాయనీ గాయకులకు కూడా సంగీత దర్శకులకు ఇచ్చే రాయల్టీలో భాగం ఇవ్వాలన్న డిమాండ్ ఆరంభించింది లత. నిర్మాతలతో సంగీత దర్శకులతో ఉద్విగ్నతలకు దారితీసే ఇలాంటి డిమాండ్ చేయటం వెనుక లత ఆత్మవిశ్వాసం స్పష్టం కావాలంటే 1950 దశకంలో లత పాడిన సూపర్ హిట్ పాటలను స్మరించాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here