రాత్ భర్ ధువాన్ చలే, జానూన జానూన జానూనా సఖీరే…
‘దిల్ సే’ సినిమాలో గుల్జార్ రాయగా ఎ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ పాట నటి ప్రీతీ జింటాకు గుర్తింపు పాటగా నిలుస్తుంది. 1998లో విడుదలయిన ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ పాట పాడినప్పుడు లతా మంగేష్కర్ వయసు 69. నటి ప్రీతీ జింటా వయసు 23. నటీమణులు వస్తున్నారు. అలరిస్తున్నారు. తెరమరుగై పోతున్నారు. కానీ లత స్వరం వయసుతో సంబంధం లేకుండా నాయికల స్వరంగా నిలవటం, మధురంగా ధ్వనించటం, వయసుతో, తరంతో సంబంధం లేకుండా శ్రోతలను అలరిస్తూండటమనే అద్భుతం లత పాటలకే సాధ్యం.
లతా మంగేష్కర్ కెరీర్‍లో ఈ విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కొత్తగా పరిచయం అవుతున్న నాయికల స్వరం లతనే. అప్పటికే స్థిరపడి ఉన్న నాయికల స్వరం లతనే. సినిమాలో వయసు మళ్ళిన పాత్ర వేసే నటి స్వరం లతనే. పిల్లవాడి స్వరం కూడా లతనే. మిమిక్రీ చేస్తున్న భావన రాకుండా, ఎవరికి తగ్గట్టు వారికి పాడుతూ, పాడుతున్నది తెరపై నటి అనిపించే రీతిలో పాడటం ఒక్క లతకే సాధ్యం. సినీ నేపథ్య గానం ఆరంభించిన కొత్తల్లోనే లత ఒక చక్కని పాఠం నేర్చుకుంది.
గాయనీ గాయకుల స్వరం ఎంత మాధురీమయం అయినా, వారు ఎంత గొప్పగా పాడినా, వారి స్వరం, తెరపై కనిపించే
‘మామూలు పాటలు పాడే సమయంలో సందర్భాన్ని, నటి రూపాన్ని, ఆమె నటనను, పదాలు పలికే విధానాన్ని దృష్టిలో ఉంచుకుని పాడాల్సి ఉంటుంది. కానీ ఆత్మలు పాడే పాటలు, నేపథ్యంలో వచ్చే పాటలు, లేక లాంగ్ షాట్‍లో నటి రూపం అస్పష్టంగా కనిపించే పాటలు పాడటం సులభం. ఆ పాటలు నేను నాకోసం పాడుకున్నట్టు పాడతాను. ఎంతో హాయిగా పాడతాను. ఎందుకంటే, తెరపై ప్రేక్షకుడికి నటి రూపం కనబడదు. హావభావాలు కనబడవు.’
లత పేరు దేశం నలుమూలలా మారుమ్రోగేందుకు కారణమయిన ‘ఆయేగా ఆనేవాలా’ పాట ఇలాంటి ఆత్మ పాడే పాట. పాట చిత్రీకరణలో నటి పాట పాడుతూ స్పష్టంగా కనబడనే కనబడదు. ‘బీస్ సాల్ బాద్’ సినిమాలో ‘కహీన్ దీప్ జలే, కహి దిల్’, ‘వో కౌన్ థీ’ సినిమాలో ‘నైనా బర్సే’, గుమ్నామ్ సినిమాలో ‘గుమ్నామ్ హై కోయీ’ వంటి పాటలు ఇలాంటి నటి రూపం సరిగ్గా కనబడని పాటలే. ఇవన్నీ సూపర్ హిట్ పాటలు.
తాను పాడిన పాట ఏ నటిపై చిత్రితమవుతుందో దృష్టిలో ఉంచుకుని, ఆ నటికి నప్పేలా పాడటం వల్ల లత, ఏ నటికి గొంతు అరువు ఇస్తే, పాట ఆ నటి పాడిన భ్రమను ప్రేక్షకులు అనుభవిస్తారు. అందుకే అనేక నాయికల గుర్తింపు పాటలు లతా మంగేష్కర్ పాడినవే. అందుకే కొత్త నటిని సినిమాలో పరిచయం చేస్తే ఆమె పరిచయం పాట లతదే అయి ఉండేది. అలా ఉన్న నాయికలకు లత పాటలు గుర్తింపు పాటలుగా నిలిచాయి. ఆయా నటీమణుల ఇమేజ్‍ని పెంచాయి. వారి నట జీవితానికి ఊపునిచ్చాయి.
‘సైరా బాను’ను పరిచయం చేసిన సినిమా ‘జంగ్లీ’. ‘జంగ్లీలో ‘జా జా జా మేరే బచ్‌పన్’ సైరాబాను పరిచయం పాట. ‘కాశ్మీర్ కీ కలీ హు మై’ ‘సైరాబాను గుర్తింపు పాట. ఆ తరువాత ఇతర గాయనిలు ఎవరు సైరాబాను పాట పాడినా లత స్వరాన్ని మరపించలేకపోయారు. సైరాబాను అనగానే ఈనాటికీ కాశ్మీర్ కీ కలీ హు మై పాట గుర్తుకువస్తుంది. ‘సాధన’కు తొలి సినిమాలో ఆశా భోస్లే పాడింది. కానీ సాధన గుర్తింపు పాటలు అనగానే గుర్తుకు వచ్చే ‘లగ్ జాగలే’ ‘నైనోమే బద్రా ఛాయే’, ‘తేరా మేరా ప్యార్ అమర్’ వంటి పాటలు పాడింది లతనే. ఇతర ఏ హీరోయిన్ కైనా ఇది వర్తిస్తుంది. చివరికి కాజోల్ విషయంలో కూడా, ఎన్ని హిట్ పాటలున్నా ‘మేరే ఖ్వాబోమే జో ఆయే’ అన్న ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలోని పాట ఆమె గుర్తింపు పాటగా నిలుస్తుంది.
ఇలా ఎన్నెన్నో పాటలు ఎంతోమంది నాయికలకు పాడినా ‘జియా జలే’ పాట రికార్డింగ్ మాత్రం లత తనకు ప్రత్యేకంగా గుర్తుంటుందని చెప్పింది. ఎ.ఆర్. రెహమాన్ దక్షణాది సంగీత దర్శకుడైనా, హిందీ సినిమాల్లోనూ అగ్రశేణి సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్న ‘దిల్ సే’ సినిమాలో పరిచయం అవుతున్న ప్రీతీ జింటా కోసం లతతో పాడించాలని నిర్మాత, దర్శకులు నిర్ణయించారు. ఎ.ఆర్. రెహమాన్‍కు గాయని గొంతుతో పనిలేదు. అతనికి భిన్నమైన స్వరాలంటే ప్రీతి. పాట ఎలా పాడినా సాంకేతిక పరిజ్ఞానంతో ఆ స్వరాన్ని అందంగా వినిపింపచేయగలడు ఎ.ఆర్. రెహమాన్. కానీ లతతో పాట అనగానే బాణీని ప్రత్యేకంగా తయారు చేశాడు. పాటలో అందమైన పదాలతో భావాన్ని కూర్చాడు గుల్జార్. పాట, ఓ యువతి తొలిరాత్రి అనుభవాల్ని ప్రకటించేదే అయినా పదాలు గుల్జార్ ఎలాంటివి వాడేడంటే, భావం ఎలా పొదిగేడంటే అసభ్యం అన్నది దరిదాపులకు కూడా రాదు. పాడాల్సింది లత అయితే మరింత జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది.
లత ‘దిల్ సే’ సినిమాలో పాట పాడేందుకు ఒప్పుకున్నది కానీ, పాట రికార్డు చేసేందుకు మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. ఎ.ఆర్. రెహమాన్ మద్రాసు నుంచే పనిచేస్తాడు. ఎవరూ తెలీనప్పుడు ఎలా వెళ్ళాలని ఆలోచించింది లత. కానీ గుల్జార్ ఉంటాడని తెలియగానే సంతోషంగా ప్రయాణమయింది. లతను అభిమానించి, గౌరవించే గేయ రచయితలలో గుల్జార్ ఒకరు. లత అభిమానించే గేయ రచయిత గుల్జార్. పాట రిహార్సల్స్‌కి వచ్చిన లత ఆశ్చర్యపోయింది. వాయిద్యకారులెవరూ లేరు. పాట రాసిన గుల్జార్, సంగీత దర్శకుడైన రెహమాన్, పాడే లత తప్ప స్టూడియోలో ఎవ్వరూ లేరు. రిహార్సల్స్ ఉన్నాయో లేవో అనుకుందిట లత. రిహార్సల్స్ అవసరం లేదు అని బాణీని వినిపించాడు రెహమాన్. పదాలు వివరించాడు. లయను చూపించాడు. పాట పాడమన్నాడు.
‘ఇదేం రికార్డింగ్? ఇదేం పాట?’ అనుకుంది ఆమె. పాట పాడటం లతకు ఇబ్బంది అయింది. ఎందుకంటే పాట పాడేటప్పుడు సూచలనిచ్చేందుకు ఆమెకు ఎ.ఆర్. రహమాన్ కనబడటం లేదు. ఆర్కెస్ట్రా లేదు, అరేంజర్ లేడు. ఎవ్వరూ లేకుండా ఒంటరిగా తనకు తానే పాడుకుంటున్నట్టు అనిపించిందామెకు. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న గుల్జార్ ఆమెకు కనిపించేట్టు కూర్చున్నాడు. పాడే సమయంలో లతకు సందేహాలు వస్తే, వాటిని రహమాన్‍కు వివరించి, లతకు పరిష్కారం చెప్పేందుకు వయా మీడియంలా గుల్జార్ వ్యవహరించాడు. లత పాట పాడింది. ఎ.ఆర్. రెహమాన్ ‘వండర్‌ఫుల్’ అన్నాడు. లత బొంబాయి వచ్చేసింది.
కొన్నాళ్ళకు లతకు అభినందనలు అందసాగాయి. అందరూ ‘జియా జిలే’ పాట అద్భుతంగా పాడినందుకు అభినందిస్తూంటే లత ఆ పాట తెప్పించుకుని విన్నది. అంత అత్యద్భుతమైన ఆర్కెస్ట్రాతో ఆ పాట ఎప్పుడు పాడిందో ఆమెకు అర్థం కాలేదు. తరువాత ఆమెకు అర్థమయింది . ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందంటే గతంలోలా, పాట మొత్తం, ఆర్కెస్ట్రాతో సహా ఒకేసారి రికార్డు చేయాల్సిన అవసరం లేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ మొదటి నుంచి రికార్డు చేయాల్సిన అవసరం లేదు. అనేక వాయిద్యాలు, కోరస్ ఉన్న పాటను లత ఒంటరిగా పాడి వచ్చింది. మిగతావన్నీ తరువాత జోడించి పాటను సంపూర్ణం చేశారు.
ఒక రకంగా చెప్పాలంటే, సినీ పాటలోని ఆర్కెస్ట్రాతో లతకు అవినాభవ సంబంధం ఉంది. ఆర్కెస్ట్రా అన్నది లత రంగప్రవేశం చేసిన తరువాత సినిమా పాటలో పెద్ద ఎత్తున ప్రవేశించింది. లత ఉచ్చస్థాయికి చేరుకోవటంలో ఉచ్చస్థాయికి చేరిన ఆర్కెస్ట్రా ఎంతగానో తోడ్పడింది. పలు వాయిద్యాలకూ లత స్వరానికీ నడుమ పోటాపోటీ జుగల్బందీ నడిచింది (అయితే తెలుగులో జానకి పాడిన ‘నీ లీల పాడెద దేవా’ అన్న పాటలాంటి వాయిద్యంతో జుగల్బందీ పాట మాత్రం ఇతర ఏ గాయనీ పాడలేదు).
ఆరంభంలో హిందీ సినీ గీతాలలో వాయిద్యాలంటే తబలా, ప్లూటు, హార్మోనియం వంటివి మాత్రమే. కానీ పాశ్చాత్య బాణీల ప్రభావం హిందీ పాటలపై పడటం మొదలైన తరువాత పాశ్చాత్య వాయిద్యాల అవసరం పెరిగింది. అంతకుముందు సంగీత దర్శకుడు ఏ ప్రాంతానికి చెందినవాడైతే ఆ ప్రాంతానికి చెందిన వాయిద్యానికి ప్రాధాన్యం ఉండేది. నౌషాద్ ‘ఢోలక్’కు ప్రాధాన్యం ఇచ్చేవాడు. పంజాబీ సంగీత దర్శకులు, పంజాబీ వాయిద్యాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు.
స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీష్ వారు రిలాక్సయ్యేందుకు క్లబ్బులు, రెస్టారెంట్లుండేవి. వాటిలో పాటలు పాడేవారు. వాయిద్యాకారులుండేవారు. వీరు అధికంగా ఆంగ్లేయులు, యూరోపియన్లతో పాటు ఆంగ్లో ఇండియన్లు, గోవాన్లు ఉండేవారు. హిందీ సినిమాలపై హాలివుడ్ సినిమాల ప్రభావం పెరగటంతో ఇలా క్లబ్బుల్లో పనిచేసే వాయిద్యకారులను సినిమా పాటల్లో వాడటం మొదలయింది. వారు సినిమా పాటలకు వాయిద్య సహకారం అందించటమే కాదు ఆర్కెస్ట్రేషన్ అన్న ప్రక్రియనూ పాట రూపకల్పనలో భాగం చేశారు.
ఇదే సమయానికి స్టూడియో వ్యవస్థ పోయి పంపిణీదారులు పెట్టుబడి పెట్టే వ్యవస్థ వచ్చింది. స్టూడియో వ్యవస్థలో ప్రతి స్టూడియో తనకు అవసరం అనిపించిన కళాకారులను నియమించుకునేది. జీతం ఇచ్చేది. స్టూడియో వ్యవస్థ దెబ్బతిన్న తరువాత ఈ కళాకారులు ఫ్రీలాన్సర్లయ్యారు. ఎవరు పాటకు వాయిద్య సహకారం అందించమంటే వారి దగ్గరకు వెళ్ళేవారు. నిర్దిష్టమైన రుసుం చెల్లించాలని ఉండేది కాదు. కొందరు డబ్బులు ఎగ్గొట్టేవారు. కొందరు పేరున్న వాయిద్యకారులకు అధిక మొత్తం అందేది. ఇంకా పేరులేని వారు, అప్పుడప్పుడే రంగంలో అడుగుపెడుతున్న వారూ దెబ్బతినేవారు. చేసిన పనికి కూడా డబ్బు లభించేది కాదు. దాంతో వాయిద్య కళాకారులంతా కలసి ఓ సంఘంగా ఏర్పడ్డారు. నిర్మాతలతో వీరు చర్చలు జరిపి, వాయిద్యకారుల్లో గ్రేడ్లను నిర్ణయించి, వారికి ఇవ్వాల్సిన సొమ్ము నిర్ణయించేవారు. వాయిద్యకారులు పనిచేసే కాలాన్ని, ఓవర్ టైమ్‍లను కూడా ఈ సంస్థ నిర్ణయించింది. ఇది లతా మంగేష్కర్‍లో ఆలోచనలు కలిగించింది.
వాయిద్యకారులు ఎలాగైతే ఒక సంస్థలా ఏర్పడి తమ డిమాండ్లను సాధించుకున్నారో అలాగే గాయనీ గాయకులంతా ఒక సంస్థలా ఏర్పడి తమ హక్కుల కోసం పోరాటం చేయాలని లత ప్రతిపాదించింది. ఆలోచనను ఆచరణలో పెట్టాలని ప్రయత్నించింది. 1952లో ఆరంభమైన సినీ మ్యాజీషియన్స్ అసోసియేషన్స్ ఏ రకంగా వాయిద్యకారులకు ఒక భద్రతను ఇస్తోందో, అలా గాయనీ గాయకులకు కూడా భద్రత ఉండాలని ఆమె వాదించింది. 1953 నాటికల్లా లత అగ్రశేణి గాయనిగా గుర్తింపు పొందింది. కానీ ఆమె పలు విషయాలలో మొండి పట్టుదల పట్టటం, తన మాట నెగ్గించుకోవాలని ప్రయత్నించటంతో, ఆ కాలం నుంచీ లత మంగేష్కర్ వ్యతిరేకత సినీ పరిశ్రమలో పలువురు ప్రదర్శించటం ఆరంభించారు. లతకు ప్రత్యామ్నాయ గాయని కోసం వెతకటం ఆరంభించారు. వారికి లతకు ప్రత్యామ్నాయంగా నిలవగల ఏకైక గాయనిగా ఆశా బోస్లే కనిపించింది. దాంతో లత వద్దనుకున్న వారు, లతను దెబ్బ తీయాలనుకున్న వారు ఆశా వైపు మళ్ళారు. లత ఎప్పుడైతే సి. రామచంద్రతో అన్ని సంబంధాలు తెంచుకుందో, సి. రామచంద్ర పాటలు పాడేందుకు ఆశాను ఆశ్రయించాడు. లతను కాదనుకున్న ఓపి నయ్యర్, గీతాదత్, శంషాద్ బేగం వంటి వారితో పాటలు పాడించినా, చివరికి సంపూర్ణంగా ఆశాపై ఆధారడ్డాడు. లతకు ఎస్డీ బర్మన్‍కు నడుమ వివాదం చెలరేగినప్పుడు, ఎస్డీ బర్మన్ కూడా ఆశాపై ఆధారపడ్డాడు. ఈ నడుమ ఇంకెందరు గాయనిలు వచ్చినా వారికి ఆశాకున్న గాత్ర విస్తృతి, సంగీత పరిజ్ఞానం లేకపోవటంతో వారు ప్రత్యామ్నాయాలుగా మిగిలారు తప్ప ప్రధాన గాయనిలుగా ఎదగలేకపోయారు. దాంతో హిందీ సినీ గేయ ప్రపంచంలో లత, ఆశాలు ప్రధాన గాయనిలుగా నిలిచారు. ఇది వారిద్దరిపై దుమ్మెత్తి పోసే వీలు కల్పించింది.
అక్కాచెల్లెళ్ళిద్దరూ కలసి సినీ గేయ ప్రపంచంపై పట్టూ బిగించారని కొందరు వ్యాఖ్యానిస్తే, అక్కాచెల్లెళ్ళు కుమ్మక్కయి
ఇలాంటి ఆరోపణలు ఆరంభంలో లతను బాధించేవి. ఒకరు తనవైపు వేలెత్తి చూపించటం లతకు నచ్చదు. కానీ శిఖరం పైన ఉన్నవాడి వైపు అందరి దృష్టి ఉండటమే కాదు, వాడి వైపు వేలెత్తి చూపించటం కూడా సులభం. ఇలాంటి ఆరోపణలను పట్టించుకోవటం, వాటికి స్పందించటం వల్ల తన మనసు పాడవటం తప్ప మరొక లాభం లేదని లత తొలి రోజుల్లోనే గ్రహించింది. ఇలాంటి దూషణలు, ఆరోపణలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు తన ఉన్నతిని చూసి అసూయపడే వారు వాడుతున్న ఆయుధాలు తప్ప మరొకటి కావని అర్థం చేసుకుంది లత. అలాంటి ఆరోపణలకు స్పందించటం మానేసింది. తన దృష్టిని పూర్తిగా పాటలపై కేంద్రీకరించింది.
హరీష్ భీమానీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఎంతో వ్యంగ్యంతో, హాస్యంగా తేల్చి పారేసింది లత.
“ఇలాంటి నిరాధారమైన ఆరోపణలను విన్నప్పుడు ఇప్పుడు నవ్వు కూడా రావటం లేదు. ఎవరైనా వేరే గాయికతో పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడు నేను, ఆశా వెళ్ళి రికార్డింగ్ యంత్రాన్ని పాడు చేస్తామని కొందరు ఆరోపించటం కూడా విన్నాను. ఈ దృశ్యాన్ని ఊహించండి. నేను, ఆశా కారు మెకానిక్‍ల దుస్తులు వేసుకుని తలపై టోపీ పెట్టుకుని, చేతుల్లో రిపేరు సామాన్లు పెట్టుకుని, పిల్లిలా మెల్లగా నడుస్తూ, రహస్యంగా రికార్డింగ్ స్టూడియోల్లో అడుగుపెట్టి, ఓ వైపు ఆశా, మరోవైపు నేను వైర్లు కత్తిరించే దృశ్యాన్ని ఊహించండి…. కానీ రికార్డింగ్ సమయంలో బోలెడంతమంది స్టూడియోలో ఉంటారు, వారందరి కళ్ళు కప్పి వైర్లు కత్తిరించి యంత్రాన్ని పాడుచేయటం కుదరని పని అన్నది వీరికి అర్థం కాదు. బహుశా రికార్డింగ్ అంతా అయిన తరువాత రాత్రిళ్ళు వెళ్ళి వైర్లు కోస్తామనుకున్నారేమో” అంది.
ఇక్కడ ఆలోచించాల్సి విషయం ఏమిటంటే, పాటను ఎవరితో పాడించాలన్న నిర్ణయం సంగీత దర్శకుడిది, దర్శక నిర్మాతలది. కొన్ని సందర్భాలలో నాయికలు, నాయకులు తమకు ఫలానా గాయని, గాయకుల స్వరాలే కావాలని పట్టుబడతారు. అంతే తప్ప గాయనీ గాయకులు ఏ పాటను ఎవరు పాడాలో నిర్ణయించరు. ఒకోసారి ఒక పాటను ఒక గాయకుడితో రిహార్సల్స్ చేయించిన తరువాత కూడా సంతృప్తి కలగకపోతే గాయనీ గాయకులను మార్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
‘సారంగ’ సినిమా కోసం సర్దార్ మాలిక్ ‘సారంగా తేరీ యాద్ మే’ పాటను రూపొందించిన తరువాత ముకేష్‍తో పాడించాలని నిర్ణయించాడు. కానీ నిర్మాత రఫీతో పాడించాలన్నాడు. రఫీతో పాడించి రికార్డు చేశారు. కానీ సర్దార్ మాలిక్‍కి సంతృప్తి కలుగలేదు. పట్టుబట్టి ముకేష్‍తో పాడించాడు. రఫీ పాడిన పాటలో కొంతభాగం సినిమాలో ఉంచారు. ముకేష్ పాడిన పాట సూపర్ హిట్ అయింది. రఫీ పాడిన పాట ముక్క కలెక్టర్స్ ఐటమ్‍గా నిలిచింది.
‘ప్యాసా’ సినిమాలో ‘కహా హై’ పాటను ముందు మన్నా డేతో పాడించాడు ఎస్డీ బర్మన్. కానీ గురుదత్‍కు మన్నా డే పాడింది నచ్చలేదు. రఫీనే పాడాలని పట్టుబట్టాడు. దాంతో ఆ పాటను రఫీ పాడేడు. పాట సూపర్ హిట్ అయింది. మన్నాడే పాడిన పాట కలెక్టర్స్ ఐటమ్ అయింది.
‘సుజాత’ సినిమాలో ‘జల్తే హై జిస్కే లియే’ పాటను ఎస్డీ బర్మన్ రఫీతో పాడించాలనుకున్నాడు. రిహార్సల్స్ అయ్యాయి కూడా. కానీ బిమల్ రాయ్ మాత్రం తలత్ మహమూద్ ఆ పాటను పాడాలని పట్టుబట్టాడు. తప్పనిసరిగా తలత్ మహమూద్ స్వరంలో పాటను రికార్డు చేశాడు ఎస్డీ బర్మన్. పాట సూపర్ హిట్ అయింది. ఇలా అనేకానేక సందర్భాలు ఉన్నాయి, ఒక గాయకుడిని అనుకుని మరో గాయకుడితో పాటలు పాడించిన సందర్భాలు.
‘లాల్ పత్థర్’ సినిమాలో రఫీ కోసం ‘గీత్ గాతా హూ మై’ పాటను శంకర్ జైకిషన్ రూపొందించారు. కానీ పాట రికార్డింగ్ సమయం వచ్చేసరికి సినీ పరిశ్రమలో కిషోర్ కుమార్ హవా నడుస్తోంది. దాంతో నిర్మాత రఫీ బదులు కిషోర్ కుమార్‍తో పాటను పాడించాలన్నారు. చేసేది లేక రఫీ అంటే అమితంగా అభిమానించే శంకర్ జైకిషన్ కూడా పాటలో కిషోర్ కుమార్‍కు తగ్గట్టు మార్పులు చేసి ‘గీత్ గాతా హు మై’ పాటను కిషోర్ కుమార్‍తో పాడించారు. ఆ పాట శంకర్ జైకిషన్ కిషోర్ కుమార్‍ల కలయికలో వచ్చిన అతి గొప్ప పాటల్లో ఒకటిగా నిలుస్తుంది.
‘గాంబ్లర్’ సినిమాలో ‘దిల్ ఆజ్ షాయర్ హై’ పాటను రఫీతో పాడించాలని అనుకున్నాడు ఎస్డీ బర్మన్. కానీ ‘ఆరాధన’ పాటలు హిట్ అయిన తరువాత ఉద్దేశం మార్చుకుని కిషోర్ కుమార్‍తో పాడించాడు.
పై ఉదాహరణలు కొన్ని మాత్రమే. ఇలాంటివి సినీ ప్రపంచంలో అనేకం జరుగుతాయి. చివరిక్షణం వరకూ ఏ పాట ఎవరి
వీరుకాక,ఇంకా ఎంతోమంది సంగీత దర్శకులున్నారు. ఎన్నో సినిమాలలో ఇతర గాయనిలు పాడేరు. అయినా లతా మంగేష్కర్ పాడిన పాటలు అధిక సంఖ్యలో సూపర్ హిట్‍లుగా నిలిచి, సినిమాలు విజయం సాధించటంలో ప్రధాన పాత్ర వహించాయి. పాటలు సూపర్ హిట్ కావటం అన్నది ఎవరి చేతుల్లో లేదు. అది ప్రజల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. మరో గాయని పాటలు హిట్ అయివుంటే లతాను వదలి ఆ గాయనిని ఆశ్రయించివుండేవారు. సినీ పరిశ్రమ, జాలి, దయ లేనిది. ఇక్కడ మానవ సంబంధాలకన్నా డబ్బే ప్రాధాన్యం. విజయం సాధించినవాడు అప్పటికి దేవుడు. కాబట్టి సంగీత దర్శకులు పిలిచి పాడమంటే పాటలు మనస్ఫూర్తిగా పాడింది లత. అవి హిట్టవటంతో అగ్రశ్రేణి గాయనిగా ఎదిగింది. అంతే తప్ప కుట్రలు, కుతంత్రాలు, ఎన్ని చేసినా పాటలను హిట్ చేయటం, అగ్రశ్రేణి గాయనిగా ఎదగటం వీలు పడదన్న సత్యం లతపై ఆరోపణలు చేసేవారు గ్రహించాలి.
సినీ పరిశ్రమలో విశ్వాసం, విధేయత అన్నవి విజేతకు మాత్రమే పరిమితం. విజేతగా నిలవలేని వాడి వెంట నీడ కూడా ఉండదు. ఎవరెంత గొప్ప కళాకారుడైనా, ఎంతెంతమంది స్నేహం సంపాదించినా దుర్దినాలు ప్రాప్తిస్తే, సినీ ప్రపంచం అతడిని పట్టించుకోదు. మహమ్మద్ రఫీ కన్నా ఈ విషయంలో మరో ఉదాహరణ అవసరం లేదు.
1970 ప్రాంతాలలో కిషోర్ కుమార్ దూసుకు వచ్చినప్పుడు హఠాత్తుగా మహమ్మద్ రఫీకి పాటలు లేని పరిస్థితి వచ్చింది. అంతవరకూ రఫీ చుట్టూ తిరిగిన నిర్మాతలు, నటులు కిషోర్ కుమార్ చుట్టూ తిరగటం ఆరంభించారు. తన పాటను రఫీ పాడితేనే తమ జీవితం ధన్యం అనుకునే సంగీత దర్శకులు రఫీని చులకన చేయటం మొదలు పెట్టారు. రఫీ స్వరం ఆధారంగా తమ కెరీర్ నిర్మించుకున్న సంగీత దర్శకులు రఫీకి సరిగ్గా పాడటం రాదని బహిరంగంగా ప్రకటించటం ప్రారంభించారు. అలా ఉంటుంది సినీ ప్రపంచం. ఈ సినిమా ప్రపంచంలో ఒకరికి మహర్దశ పట్టటం మరొకరు దుర్దశ అనుభవించటం ఎవరూ నిర్ణయించలేరు. ఏ వ్యక్తీ నిర్దేశించలేడు. లత అగ్రశ్రేణి గాయనిగా కొన్ని దశాబ్దాలు నిలబడిందంటే ఆమె ప్రతిభ, ప్రతిభకు అదృష్టం తోడవటమే కారణం తప్ప, కుట్రలు, కుతంత్రాలు కారణాలు కావు. కుట్రలు, కుతంత్రాలతో ఎవరూ అగ్రస్థానం చేరుకోలేరు. చేరినా నిలవలేరు. ప్రతిభ లేని వారు ఎంత ప్రయత్నించినా ప్రజలను మాయచేయలేరు. ఈ విషయం 1950 దశకంలో లత పాడిన పాటలు నిరూపిస్తాయి. ఆమెకు ప్రత్యామ్నాయంగా ఎదగగలిగిన ప్రతిభ కలిగిన గాయని ఆ దశకంలోనే కాదు, ఇంకెన్ని శతాబ్దాలైనా లేదన్నది ఆ పాటలు వింటే స్పష్టం అవుతుంది.
(ఈ పాటలు వచ్చే వారం)