Site icon Sanchika

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-18

[dropcap]అం[/dropcap]తర్ మంతర్ జంతర్ సే మైదాన్ లియాహై మార్

హాథ్ మె హై తక్దీర్ క నక్షా హోగయా బేడా పార్

‘రాజ్ హఠ్’ (1956) సినిమాలో లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్‍లు పాడిన ఈ అత్యంత వినోదాత్మకమైన అద్భుతమైన పాటను రాసింది హస్రత్ జైపురి. సంగీత దర్శకులు శంకర్ జైకిషన్.

1956వ సంవత్సరం వచ్చేసరికి హిందీ సినీ ప్రపంచంలో లతా మంగేష్కర్ ఎదురులేని గాయనిగా, నెంబర్ వన్ గాయనిగా స్థిరపడింది. లత స్వరం ఆధారంగా చేసుకుని అనేక సృజనాత్మకమైన గీతాలు సృజిస్తూ శంకర్ జైకిషన్ హిందీ సినీ సంగీత ప్రపంచంలో నెంబర్ వన్ సంగీత దర్శకులలా స్థిరపడ్డారు. ఉచ్చస్థాయిలో ఉన్న నౌషాద్, సి. రామచంద్ర, అనిల్ బిశ్వాస్, ఎస్డీ బర్మన్ వంటి వారందరినీ దాటుకుని ‘పట్టిందల్లా బంగారం, పాడించిందల్లా గంధర్వ గానం’ అన్న రీతిలో శంకర్ జైకిషన్   హిందీ సినీ గీతాలను సంపూర్ణంగా రూపాంతరం చెందించారు.

శంకర్ జైకిషన్ తొలి సినిమా ‘బర్సాత్’ (1949) నుంచి వీరికి లతకు నడుమ చక్కని స్నేహం ఏర్పడింది. లత, జైకిషన్‍లు దాదాపుగా సమ వయస్కులు. శంకర్ వయసులో పెద్దవాడు.  దాంతో జైకిషన్ తో లత సన్నిహితంగా వుండేది. వాదించేది. శంకర్ దగ్గర గురుభావం ప్రదర్శించేది.  శంకర్ జైకిషన్‍ల జోడీ, ‘బర్సాత్’లో ఒక్క పాట తప్ప మిగతా అన్నీ పాటలు లతతో పాడించారు. అప్పటి వరకూ సినిమాల్లో విభిన్నమైన నటులకు విభిన్నమైన గాయనిల స్వరాలను వాడేవారు. ఆ పద్ధతిని వదలి శంకర్ జైకిషన్‍లు సినిమాలో మహిళల పాత్రధారులందరికీ లత గొంతుతోనే పాడించారు. ‘బర్సాత్’ పాటలు సినీ ప్రపంచాన్ని తుఫానులా చుట్టుముట్టాయి. ఈ అద్భుతమైన సంగీత సంజనిత తుఫానులో భారతీయ సినీ ప్రేమికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. విభిన్నమైన భావనలను లత స్వరం అద్భుతంగా ప్రదర్శించింది. గమనించాల్సిందేమిటంటే నర్గీస్, నిమ్మితో సహా ఇతర పాత్రలన్నిటికీ పాడటంతో పాటూ, పాటల్లో లత రాగాలను తీసింది. ఒకే పాటలో ఆనందం, ఆశలతో పాటు నిరాశనూ, దుఃఖాన్ని ప్రదర్శించింది. ‘బర్సాత్ మే హమ్ సె మిల్ తుమ్’ పాటలో ముందంతా ఆనందాన్ని, ఆశను ప్రదర్శిస్తూ ‘యే సమా హై జా రహే హో’ అంటూ హఠాత్తుగా విషాదాన్ని ధ్వనింపచేస్తుంది. ‘దేర్ న కర్ నా కహియే అస్ టూట్ జాయే’ అంటూ నిస్పృహను ప్రదర్శిస్తుంది. చివరలో ఆలాపన అద్భుతంగా ఉంటుంది. ఇలా పాటలో పదాలు సూచించే భావాన్ని స్వరంలో ధ్వనింపచేయటం రాగాలు ఆలాపించటం, ఉచ్చస్థాయిలో స్వరాన్ని తీగలాగా సాగిస్తూ, రాగం చెడకుండా భావాన్ని పలకటం హిందీ సినిమాలలో అది తొలిసారి. అంతకు ముందు గాయనిలెవరికీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ లేకపోవటంతో ఇలా పాడగలిగేవారు కారు. దాంతో ఇతరులకన్నా తాను భిన్నం అని నిరూపించుకోవటమే కాదు , సరిలేరు తనకెవ్వరూ , సాటిరారు తనకెవ్వరూ , పోటీలేరు తనకెవ్వరూ అని బర్సాత్ పాటలతో లత ప్రకటించింది. ‘ఆవారా’ (1951) సినిమాలో కూడా శంకర్ జైకిషన్‍లు లత స్వరాన్ని అత్యంత సృజనాత్మకంగా వాడేరు.

‘ఆజావో తడప్‌తే హై అర్మాన్’ పాటలో పాట చివరలో నిద్రమత్తులోకి జారుతూ ‘అబ్ రాత్ గుజార్‌నే వాలీ హై’ అంటూ నర్గీస్ పాత్ర నిద్రలోకి జారుకోవటాన్ని తెరపై నర్గీస్ ప్రదర్శిస్తే, పాటలో లత ప్రదర్శించింది. వింటుంటే పాట పాడుతూ లత నిద్రలోకి జారుకున్నదేమో అన్న భ్రమ కలుగుతుంది. ‘దమ్ భర్ జో  ఉదర్ మూ ఫెర్’ పాటలోని చిలిపితనం నర్గీస్ వదనంలో ప్రతిఫలిస్తుంది. పాట వింటుంటే లత పాట తుళ్ళుతూ పాడిందేమోననిపిస్తుంది. ‘ఘర్ ఆజా మెరె పర్‍దేశీ’ పాట అయితే లత స్వరానికి మణిమాల లాంటి పాట. ప్రతి పదం లత పలికిన విధానం చిలికిన భావం అనుభవించి తీరాల్సిందే. నర్గీస్‌కు గుర్తింపు గీతంలా ఎదిగింది ఈ పాట. తరువాత కాలంలో పలువురు సంగీత దర్శకులు ఇలాంటి పాటను లతతో పాడించారు.

‘బర్సాత్, ఆవారా’ సినిమాలతో శంకర్ జైకిషన్‍లు లత స్వరంలోని వైవిధ్యాన్ని, ఔన్నత్యాన్ని ఉత్తమత్త్వాన్ని తమ పాటల ద్వారా ప్రదర్శించారు. ఇది ఇతర సంగీత దర్శకులకు లత స్వర వైశిష్ట్యాన్ని విస్పష్టం చేసింది. సంగీత దర్శకులు లత స్వరం వాడితే బాణీలను విభిన్నంగా, విశిష్టంగా, వైవిద్యభరితంగా సృజించవచ్చు, ఎలాగైతే సంగీతం అనంతమైనదో, లత స్వర వైశిష్ట్యం అవధులు లేనిదని శంకర్ జైకిషన్‍లు తమ పాటల ద్వారా నిరూపించారు. ‘ఆవారా’లో లత కాక మరో గాయని ‘శంషాద్ బేగమ్’ ఒక పాట పాడింది. అది ‘ఏక్ దో తీన్, ఆజా మౌసమ్ హై రంగీన్’ అనే క్లబ్బు పాట. క్లబ్బులో ఎవరి గొడవలో వారు టీలు, మాదక ద్రవ్యాలు తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ మాట్లాడుతూ ఎవరూ పట్టించుకోని క్లబ్బు పాట ఇది. పాట మధ్యలో గాయని పాడిన కొన్ని పదాలను మింగేస్తూ సంభాషణలు వినిపిస్తాయి కూడా. అంటే అంతగా ప్రాధాన్యం లేని పాట అన్నమాట. ఈ పాట లత పాడకపోవటం రెండు విషయాలను స్పష్టం చేస్తుంది. సినిమాలో అప్రధానమైన పాటలు లత పాడదు. క్లబ్బుల్లో పాడే విలువలేని తక్కువ స్థాయి పాటలు లత పాడదు. లత పాట పాడాలంటే పాటకు ఒక స్థాయి ఉండాలి. పాటకు సినిమాలో విలువ ఉండాలి. ఇది లతతో పాడించాలనుకున్న ఇతర సంగీత దర్శకులకు మార్గదర్శకంగా పనిచేసింది. అల్లాటప్ప పాటలు లత పాడదు. లత సంగీత సరస్వతి. ఆమెతో ఉత్తమము, ఉన్నత స్థాయికి చెందిన పాటలు మాత్రమే పాడించాలి. ఎలాగంటే అలాంటి పాటలు ఆమె పాడదు. ఇది లతకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఇచ్చింది. లత పాడిన పాటలను, ఇతరులు పాడిన పాటల నుంచి ప్రత్యేకంగా నిలిపాయి.

శాస్త్రీయ సంగీతం లతకు తెలిసి ఉండటంతో పాశ్చాత్య బాణీల ఆధారంగా పాటలను సృజిస్తున్నా, లత కోసం ప్రత్యేకంగా శాస్త్రీయ రాగ ఆధారిత పాటలను సృజిస్తూ తమ సృజనతో చిరంజీవులయ్యారు సంగీత దర్శకులు. లతను సరస్వతీ అంశ గళంలో కల సరస్వతి వీణా నిస్వనానికి  ప్రతినిధిగా నిలిపారు. ఇతర గాయనిలకు భిన్నంగా లత తన గానాన్ని ఏ కొందరు సంగీత దర్శకులకో, క్యాంపులకో పరిమితం చేయలేదు. పెద్ద సంగీత దర్శకుడు, చిన్న సంగీత దర్శకుడు అన్న తేడా చూపలేదు. పెద్ద బ్యానర్, చిన్న బ్యానర్ అన్న తేడా చూపలేదు. కేవలం పాట నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చింది. బాణీకి, బాణీలో ఒదిగిన పదాలు పలికే భావానికి ప్రాధాన్యం ఇచ్చింది. దాంతో సంగీత దర్శకులే కాదు, గేయ రచయితలు కూడా లతకు సన్నిహితులయ్యారు. లత తమ పదాలకు జీవం పోసి పదాలలో ఒదిగిన బీజశక్తిని మహా వృక్షంలా ఎదిగించి ప్రపంచానికి ప్రదర్శిస్తూంటే ఏ రచయిత సంతోషించడు! తమ రచనకు తన గాత్రంతో ప్రాణం పోసి పాటతో పాటు తమను కాలం ప్రభావానికి లోను కాని చిరంజీవిలా తమ పాట ద్వారా నిలుపుతున్న గాయనికి దాసోహం అవని గేయ రచయితలు అరుదు. దాంతో ప్రతి గేయ రచయిత తన గేయాన్ని లత గానం చేయాలని తపన పడేవాడు. లత మెచ్చేటటు వంటి అత్యుత్తమ గేయ రచన చేయాలని కృషి చేసేవారు గేయ రచయితలు. లత సైతం ఉత్తమ గేయ రచనను మెచ్చుకోవటంతో పాటు, గేయ రచయితకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, పాటలోని పదాల అర్థాలను తెలుసుకుంటూ, ఆయా పదాలే ఎందుకు వాడారో ప్రశ్నిస్తూ, రచయిత పొందుపరచిన భావాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని పాట పాడేది. దాంతో సంగీత దర్శకులు, గేయ రచయితలు లతతో పని చేసేందుకు పోటీపడేవారు. తమ అత్యుత్తమ సృజనను లత గళానికి సమర్పించాలని ఉత్సాహపడేవారు. ఇది కూడా లత ఉచ్చస్థాయి గాయనిగా ఎదగటంలో తోడ్పడింది. ఎప్పుడైతే ఉన్నతస్థాయి కళాకారులు, పోటీపడి ఉత్తమ సృజన వైపు దృష్టి పెడతారో, ఫలితంగా అత్యుత్తమ సృజన రూపొందుతుంది. 1950 దశకంలో జరిగింది ఇదే.

ప్రపంచ నిర్మాణంలో ఒక కీలకమైన అంశం ఉంది. ప్రతిభ అన్నది అందరిలో సమానంగా ఉంటుంది. కానీ అనేక కారణాల వల్ల ప్రతిభ ప్రదర్శితమవటం,  అణిగి పోవటం సంభవిస్తుంది. ఒకోసారి అత్యంత ప్రతిభ కల కళాకారులు ఒకేసారి వేదికపైకి వచ్చి పోటీ పడతారు. ఒకరిని తీయలేం. మరొకరిని పెట్టలేం. అలాంటి పరిస్థితిలో పరమాద్భుతమైన కళ సృజితమవుతుంది. కాని వారిలో ఎవరో ఒకరు ఇతరులకన్నా ముందుంటారు. అలా వారు ముందుండటంలో అదృష్టం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పైకి చూసేవారికి వీరేదో మాయమంత్రాలు చేసి విజయం సాధించినట్టు అనిపిస్తుంది. కానీ వారి చేతిలో అదృష్టరేఖ ఉంటుంది. ఈ అదృష్టరేఖ సమానమైన ప్రతిభ కలవారిలో ఒకరిద్దరిని ఉన్నత స్థాయిలో నిలుపుతుంది. అలాంటి వారి ప్రతిభ ప్రదర్శనకు, ప్రయోగాలకు లత స్వరం సాధనం అయింది. అందుకే 1946 నుండి 1950 నడుమ లత పాడిన పాటలు లత స్వరాన్ని అధికంగా ఉపయోగించిన సంగీత దర్శకులు, లతకు అధికంగా పాటలు రాసిన గేయ రచయితల పట్టికను పరిశీలిస్తే ఏయే కళాకారులనైతే అత్యుత్తమ స్థాయి కళాకారులుగా భావిస్తామో, వారు లతతో అత్యధికంగా పనిచేయటం కనిపిస్తుంది. అందరూ అత్యుత్తమ కళాకారులు కలసి ఒకరికొకరు ఉత్సహ ప్రోత్సహమిచ్చుకుంటూ ఆనందంగా ఉత్తమ సృజనకు రాజీపడకుండా కంకణం కట్టుకుంటే, ఫలితంగా పరమోత్తమమైన కళ సృజితమవుతుందనటంలో సందేహం లేదు. అయితే కళను సృజిస్తున్న వారు పలువురు. కానీ వారు తమ కళకు ప్రాణం పోసి సజీవంగా ప్రపంచానికి అందించేందుకు ఎంచుకున్నది ఒకే ఒకరిని, లతా మంగేష్కర్‍ని!

1946 నుండి 1950 వరకూ లతతో అధికంగా పాటలు పాడించిన సంగీత దర్శకులు

సంగీత దర్శకుడు సినిమాల సంఖ్య లత పాటల సంఖ్య
అనిల్ బిశ్వాస్ 8 43
సి. రామచంద్ర 14 52
గులామ్ మహమ్మద్ 6 22
హన్స్‌రాజ్ బహల్ 6 17
ఖేమ్‌చంద్ ప్రకాశ్ 3 14
నౌషాద్ 4 19
పండిత గోవిందరామ్ 5 14
శంకర్ జైకిషన్ 1 10
శ్యామ్ సుందర్ 6 16
వసంత దేశాయ్ 4 15
వినోద్ 3 19

1946 నుండి 1950 వరకు లతకు అధిక సంఖ్యలో పాటలు రాసిన గేయ రచయితలు

గేయ రచయిత సినిమాల సంఖ్య పాటల సంఖ్య
ఎహ్సాన్ రిజ్వి 3 11
మజ్రూహ్ సుల్తాన్‌పురి 3 13
ముల్క్‌రాజ్ భక్రి 5 19
నక్షాబ్ 5 13
పి.ఎల్. సంతోషి 9 31
ప్రేమ్ ధావన్ 4 13
పండిత నరేంద్ర శర్మ 2 11
కమర్ జలాల్ ఆబాది 5 20
రాజేందర్ క్రిషన్ 6 19
సర్దార్ సైలాని 5 11
షకీల్ బదాయూని 7 28

 

1951 1952 1953 1954 1955 1956
సంగీత దర్శకులు 24 24 22 25 31 24
గేయ రచయితలు 37 29 27 35 32 27
మొత్తం పాటలు 223 177 194 172 177 204

1951 నుండి 1956 వరకూ లతతో అధిక సంఖ్యలో పాటలు పాడించిన సంగీత దర్శకులు

సంగీత దర్శకుడు సినిమాల సంఖ్య లత పాటల సంఖ్య
అనిల్ బిశ్వాస్ 13 59
సి. రామచంద్ర 32 193
ఎస్.డి. బర్మన్ 15 64
శంకర్ జైకిషన్ 23 146
నౌషాద్ 7 36
హుస్న్‌లాల్ భగత్ రామ్ 10 35
రోషన్ 17 79
మదన్ మోహన్ 8 40
హేమంత్ కుమార్ 11 47

1946 నుంచి 1950 వరకూ, 1951 నుంచి 1956 వరకూ లతామంగెష్కర్ తో అధికంగా పాటలు పాడించిన సంగీత దర్శకుల జాబితా పరిశీలిస్తే, ఒక తరం వెనక్కువెళ్ళిపోతూంటే నూతన తరం తెరపైకి రావటం కనిపిస్తుంది. అనిల్ బిశ్వాస్, హుస్న్‌లాల్ భగత్‌రాం వంటి వారి సినిమాల సంఖ్య తగ్గటం కనిపిస్తుంది. అలాగే, నౌషాద్ సినిమాల సంఖ్య ఆయన కావాలని తగ్గించుకున్నాడు. సీ రామచంద్ర 1951-56 నడుమ అధిక సంఖ్యలో లతతో పాటలు పాడించాడు. కానీ, శంకర్‌జైకిషన్ తమ సినిమాల్లో లతతోనే పాడించారు. సంవత్సరం వారీగా చూస్తే నెమ్మదిగా సీ రామచంద్ర సినిమాల్లో లత పాటలు తగ్గటం కనిపిస్తుంది. కానీ, అదే సమయానికి శంకర్‌జైకిషన్‌ల సినిమా సంఖ్యలు, సినిమాల్లో లత పాటలు పెరగటం కనిపిస్తుంది. హేమంత్ కుమార్ సినిమాల సంఖ్యతో పాటూ లత పాటలూ పెరుగుతున్నాయి. రోషన్ సినిమాల సంఖ్య తగ్గుతూ ఒక దశలో సినిమాలు లేని పరిస్థితి తెలుస్తుంది. సీ రామచంద్ర , శంకర్‌జైకిషన్‌లు లతతో సంవత్సరం వారీగా పాటలు పాడించటం పరిశీలిస్తే అత్యంత ఆసక్తికరమయిన విషయం తెలుస్తుంది.
1951లో రామచంద్ర 5 సినిమాల్లో లతతో 32 పాటలు పాడించాడు. ఆసంవత్సరం శంకర్‌జైకిషన్లు 3 సినిమాల్లో 16 పాటలు పాడించారు. 1952లో రామచంద్ర 6 సినిమాల్లో 35 పాటలు పాడించాడు. అదే సంవత్సరం శంకర్‌జైకిషన్ 3 సినిమాల్లో 21 పాటలు పాడించారు. 1953లో రామచంద్ర 8 సినిమాల్లో 56 పాటలు పాడించాడు. శంకర్‌జైకిషన్ 6 సినిమాల్లో 37 పాటలు పాడించారు. ఇక్కడినుంచీ నెమ్మదిగా రామచంద్ర సినిమాల సంఖ్య తగ్గటం, శంకర్‌జైకిషన్ సినిమాల సంఖ్య పెరగటం చూస్తాం. అంటే, నెమ్మదిగా సినిమా పాటల ప్రపంచంలో శంకర్‌జైకిషన్ల ప్రాబల్యం పెరుగుతున్నదన్నమాట. 1954లో రామచంద్ర 5 సినిమాల్లో 25పాటలు లతతో పాడిస్తే, శంకర్‌జైకిషన్2 సినిమాల్లో 10 పాటలు పాడించారు. 1955లో రామచంద్ర 5 సినిమాల్లో 30 పాటలు పాడిస్తే, శంకర్‌జకిషన్ 2 సినిమాల్లో 11 పాటలు పాడించారు. 1956లో రామచంద్ర 3 సినిమాల్లో 15 పాటలు పాడిస్తే, శంకర్‌జైకిషన్ 7 సినిమాల్లో 51 పాటలు పాడించారు. ఈ సంవత్సరం నుంచీ లతా రామచంద్ర పాటలు పాడటం మానేసింది. దాంతో రామచంద్ర పతనం, శంకర్‌జైకిషన్ శిఖరారోహణం 1957నుంచీ వేగవంతమయింది.లత పాడటం పాడకపోవటంపై ఉన్నత స్థాయి సంగీత దర్శకుల భవిష్యత్తు ఆధారపడటం స్పష్టమవుతుంది. ఏయే సంగీత దర్శకులు లత ప్రతిభ  ఆధారంగా సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారో వారంతా ఏదో ఒక సందర్భంలో లత పాడకపోవటం వల్ల దెబ్బతిన్నారు, సీ రామచంద్ర అయినా, శంకర్‌జైకిషన్ అయినా!!!

1956వ సంవత్సరం పూర్తయ్యే సరికి లతా మంగేష్కర్ మొత్తం 1548 పాటలు పాడింది. 375 సినిమాలలో 85 మంది సంగీత దర్శకులతో, 109 మంది గేయ రచయితలతో కలసి పనిచేసింది. పాటలు విని ఆనందించే విషయం పక్కనపెట్టి ఈ గణాంక వివరాలు చూస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక గాయని పదేళ్ళలో 85 మంది సంగీత దర్శకులతో, 109 మంది గేయ రచయితలతో కలసి పనిచేయటం అంటే మామూలు విషయం కాదు. ఇది విభిన్నమైన సృజనాత్మక ప్రతిభ, విభిన్నమైన ఆలోచనా రీతులు, విరుద్ధమైన పనితీరులు, అహంకారాలు, అభిప్రాయాలు కల విశిష్టమయిన  కళాకారులంతా ఒక వ్యక్తిని ఆమోదయోగ్యంగా భావించారన్న విషయాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. ఇది అత్యద్భుతమైన విషయం! ఇది అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన ఆ వ్యక్తి ప్రతిభ ఔన్నత్యానికి నిదర్శనం.

వ్యక్తిగతంగా లతా మంగేష్కర్ అంటే అందరికీ పడకపోవచ్చు. ఆమె పద్ధతులు, ప్రవర్తనలు అందరికీ నచ్చకపోవచ్చు. కానీ అందరూ ఆమెతో కలసి పనిచేసేందుకు తహతహలాడింది కేవలం ఆమె స్వరం వల్లనే అన్నది నిర్వివాదాంశం. లత అందరితో స్నేహంగా ఉండేది తప్ప సన్నిహితంగా ఉండేది కాదు. సంగీత దర్శకుడు ఎలాంటి బాణీ సృజించినా ఆమోదించేది. ‘ఈ బాణీ బాగుంది, బాలేదు, ఇలా చేస్తే బాగుంటుంది’ అన్న సూచనలు ఇవ్వలేదు. ఎంతో సన్నిహితంగా ఉన్న సంగీత దర్శకులకు తప్ప ఆమె సలహాలు, సూచనలు ఇచ్చేది కాదు. పాట నచ్చింది, నచ్చలేదు అన్న విషయం చెప్పేది కాదు. కానీ పాట సందర్భం, పదాలను మాత్రం జాగ్రత్తగా పరిశీలించేది. సందర్భంలో ఎలాంటి అసభ్యత, అశ్లీలానికి తావున్నదనిపించినా, పాట పాడేందుకు నిరాకరించేది. పాటలో పదాలలో ఏమాత్రం ద్వందార్థం ఉందనిపించినా, అశ్లీలంగా ధ్వనిస్తున్నాయనిపించినా ఆమె పాట పాడ నిరాకరించేది. పాటలో పదాలు మార్చమని పట్టుబట్టేది. గేయ రచయితలు ఆమెకు పదాలు వివరించేవారు. వాటి అర్థాలు వివరించి వాదించేవారు. పాటలో మరో అర్థం ధ్వనించటం లేదని విశ్వసించిన తరువాతనే లత పాట పాడేందుకు ఒప్పుకునేది. లేదా గేయ రచయిత పదాలు మారిస్తేనే ఆమె పాట పాడేది. అయినా సరే సంగీత దర్శకులు ఆమెతో పాడించాలని, గేయ రచయితలు ఆమెకు తగ్గ పాటలు రాయాలని పోటీ పడేవారు. ఇందుకు కారణం, లతకు పాటలు రాయటం వల్ల, బాణీలు కుదర్చటం వల్ల కళాకారులకు చిరజీవత్వం లభిస్తుంది.

ఈ విషయం గురించి లతా మంగేష్కర్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పింది. “నేనెప్పుడు సంగీత దర్శకుల సృజనలో జోక్యం చేసుకోలేదు. ఎప్పుడైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనిపిస్తే, వినయ పూర్వకంగా, గౌరవంగా ‘ఇలా చేస్తే బాగుంటుందేమో’ అనేదాన్ని. వాళ్ళకి నచ్చితే ఒప్పుకునేవారు లేకపోతే లేదు. అంతా స్నేహపూరిత వాతావరణం లోనే జరిగేది. అది మాకు ఒకరిపట్ల ఒకరికి ఉన్న గౌరవం, విశ్వాసం, అభిమానం వల్లనే సాధ్యమయింది. అది ఒక అద్భుతమైన కాలం. గేయ రచయితలలో శైలేంద్ర, హస్రత్, సాహిర్‌‍లు తమ పాటలు ఇచ్చి  ‘దీనిలో ఏదైనా పదం పట్ల అభ్యంతరం ఉందా?’ అని అడిగేవారు. నేను ఏదైనా అభ్యంతరం చెప్తే ఓపికగా వివరించేవారు. నేను ఒప్పుకోకపోతే పదం, భావాలు మార్చేవారు. ఇదంతా మేమంతా కలసి కూర్చుని, చర్చించేవాళ్ళం. నవ్వుతూ, తుళ్ళుతూ, ఒకరినొకరు ఏడ్పించుకుంటూ సృజన సాగేది. పాట నిర్మాణం పూర్తి అయ్యాక అందరం టీ తాగేవాళ్ళం.”

దీన్ని బట్టి తెలిసేదేమిటంటే ఆ కాలంలో కళాకారులంతా లతకు అత్యంత గౌరవాన్నిచ్చేవారు, అభిమానించేవారు. ఆమె అభిప్రాయానికి విలువనిచ్చేవారు. ‘టాక్సి డ్రైవర్’ సినిమాలో లత   క్లబ్బులో పాడే పాటలు పాడింది. కానీ ఆ పాటలకు సాహిర్ కూర్చిన పదాలు, పొదిగిన భావాలు అత్యంత తాత్వికమైనవి. జీవన విధానాన్ని నేర్పించేవి తప్ప సాధారణమైన రెచ్చగొట్టే, తక్కువ స్థాయి భావాల పాటలు కావు. లత కోసం పాట రాస్తున్నారంటే, అది క్లబ్బు పాటయినా జాగ్రత్తగా ఎలాంటి ద్వంద్వర్థాలు, చవకబారు భావాలు లేకుండా రాసేవారు. అందుకే 1951 లోనే లత తొలిసారి క్లబ్బులో డాన్సు చేసే పాట పాడినా, 1970లో ‘ఇంతెకామ్’ సినిమాలో ‘ఆ జానే జా’ పాటనే లత పాడిన తొలి క్లబ్బు కేబరే పాట అన్న అపోహ అనేకులలో నెలకొంది. ‘ఆ జానే జా’ పాట కూడా క్లబ్బు పాటే అయినా లత పాట పాడిన విధానం, స్వరంలో చిలికించిన హోయలు, స్వరం పలికిన అలంకారాలు ఆ పాటను క్లాసిక్ కేబరే పాటగా నిలుపుతాయి.

‘కాలిఘటా’ (1951) సినిమాలో తొలిసారిగా లత క్లబ్బు పాట పాడింది. హెలెన్ కన్నా ముందు క్లబ్బు నృత్యాల నటిగా పేరుపొందిన కుక్కు ఈ పాటకు నృత్యం చేసింది. ‘దిల్ మే తూ మెరె దిల్ మే తూ’ అంటూ సాగే పాటలో భావం సరళంగా వుంటుంది. ఎలాంటి అభ్యంతరకరమైన భావాలూ, పదాలు ఉండవు.

’టాక్సి డ్రైవర్’ (1954) సినిమాలో షీలా రమణి పాత్ర క్లబ్ డాన్సర్ పాత్ర. ఆమె పాడిన పాటలన్నీ లత పాడింది. పాటలు రాసింది సాహిర్ కావటంతో పాటల్లో తాత్త్వికత తప్ప రెచ్చగొట్టటం కనబడదు. ‘ఏయ్ మేరీ జిందగీ ఆజ్ రాత్ ఝామ్ లే’ అనే పాటలో ‘ఆజ్ రాత్ ఝామ్ లే అస్మాన్ కో చూమ్ లే/ కిస్కో పతాహై కల్ ఆయే కీ న ఆయే’ అంటుంది డాన్సర్. చరణంలో ‘ఏక్ ఏక్ కట్‌తీ జాయే, సాస్‍ కీ నాజుక్ డోరీ’ అంటుంది. అంటే ప్రాణం లేక జీవం వంటి వాటిని ఈ శరీరంలో బంధించి ఉంచిన సున్నితమైన పాశం ఏ క్షణంలో తెగిపోతుందో చెప్పలేం. ఇలాంటి భావాలు క్లబ్బు నృత్యాల్లో ఉండవు. కానీ ఆ క్లబ్బు పాట లత పాడితే ఇలాంటి భావాలే ఉంటాయి. అందుకే సంగీత దర్శకుడు నౌషాద్ “లత క్లబ్బు పాటలు పాడినా అవి పవిత్రంగా ఉంటాయి” అంటాడు. ఇంకా ‘గెస్ట్ హౌస్’ లో ప్రేమ్ ధావన్ రాసిన ‘తెరా జాదూ న చలేగా’, ‘ఖైదీ నెం 911’ లో హస్రత్ రాసిన ‘యే ఖిల్ ఖిల్ తారే’, పాకెట్ మార్ (1956) లో రాజేందర్ క్రిషన్ రాసిన ‘ఛోటీ సీ జిందగీ’, ‘బర్మా రోడ్’ (1962) లో మజ్రూహ్ రాసిన ‘హమ్ నే తో యే దిల్ తుమ్హే దియా’, మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే (1964) లో ఆనంద్ బక్షి రాసిన ‘అల్లాహ్ కరే తూభీ ఆజాయే’, స్మగ్లర్ (1966) సినిమాలో ఇందీవర్ రాసిన “దిల్ కా లగానా ఇస్ దునియామే’, ‘మేరే హమ్‍దమ్ మేరే దోస్త్’ (1968) లో మజ్రూహ్ రాసిన ‘హమ్ తో హోగయా హై ప్యార్’ వంటి క్లబ్బు పాటలు లత పాడింది. ఇవన్నీ అసభ్యం అన్నది దరిదాపులకు కూడా రాని క్లబ్బు పాటలే. క్లబ్బు పాటలే కాదు, క్లబ్బు పాటలకు పరిమితమైన హెలెన్ వంటి నటి ఇతర సందర్భంలో పొట్టి దుస్తులు వేసి పాట   పాడితే – ఆ పాట లత పాడితే ఆ పాట మధురంగా, గౌరవప్రదంగా ధ్వనించటమే కాదు, వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పుతుంది. ‘గుమ్‍నామ్’ సినిమాలో బీచ్ ఒడ్డున పొట్టి ఫ్రాక్ వేసుకుని హెలెన్ పాడిన పాట ‘ఇస్ దునియామే జీనా హై తో సున్‍లో మేరీ బాత్’ కూడా ఇలా ఆనందంగా జీవించడం నేర్పే పాటనే. ఈ పాటలు లత కాక వేరే ఏ గాయని పాడినా అవి రెచ్చగొట్టే పాటలే అయి ఉండేవి. కానీ లత వల్ల ఆ పాటలు చక్కని పాటలుగా రచించాల్సి, చిత్రించాల్సి వచ్చింది. ఎందుకంటే తాను పాడిన పాటల చిత్రీకరణ అసభ్యంగా ఉన్నా లత అభ్యంతరాలు చెప్పేది. మళ్ళీ ఆ కళాకారులతో కలసి పనిచేసేది కాదు. మహిళలను అసభ్యంగా చూపించటం పట్ల లత పట్టుదల ఎలాంటిదో 1959లో లతకు తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చినప్పుడు ప్రపంచానికి తెలిపింది.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆరంభించినప్పుడు సంగీత దర్శకుడికి తప్ప గాయనీ గాయకులకు ప్రత్యేకంగా అవార్డు ఉండేది కాదు. గాయనీ గాయకులు లేకపోతే సంగీత దర్శకుల పాటలెవరు వింటారు? అని వాదించింది లత. గాయనీ గాయకులకు అవార్డులివ్వకపోతే అవార్డు వచ్చిన సంగీత దర్శకులకు అవార్డు ప్రదానోత్సవాలలో స్టేజిపై తాను పాడనని ప్రకటించింది లత. ఎవరెంత బ్రతిమిలాడినా పట్టు వదలలేదు. ‘రసిక్ బల్మా’ పాట పాడమంటే “గాయకుల అవసరం ఏముంది? వాయిద్యాలతో వాయించి ప్రజలను మెప్పించమనండి” అంది. చివరికి లత పట్టుదలకు లొంగి గాయనీ గాయకులకు వేరువేరుగా గాక కలిపి ఉత్తమ గానానికి ఒక అవార్డును ఏర్పాటు చేసింది ఫిల్మ్‌ఫేర్ సంస్థ. ఆ తొలి అవార్డు 1959లో లతా మంగేష్కర్‍కు దక్కింది. ‘మధుమతి’ సినిమాలో ‘అజారే పర్‌దేశీ’ పాటకు దక్కిన ఆ అవార్డు అందుకునేందుకు స్టేజ్ ఎక్కిన లత, వారు అందించిన శిల్పాన్ని అందుకునేందుకు నిరాకరించింది. అది స్త్రీ నగ్న శిల్పం అవటం లతకు అభ్యంతరంగా తోచింది. ఎవరెంత చెప్పినా లత వినలేదు. చివరికి శిల్పం శరీరాన్ని చక్కని గుడ్డతో కప్పి అందిస్తేనే అందుకుంది లత. అయితే గాయనీ గాయకులకు కలిపి ఒకే అవార్డు కాదు వేర్వేరు అవార్డులు ఇవ్వాలని మళ్ళీ పట్టుబట్టింది లత. 1967లో గాయనీ గాయకులకు వేర్వేరుగా అవార్డులివ్వడం ఆరంభమయింది. 1969లో “నాకిక అవార్డులు అవసరం లేదు. కొత్త గాయనిలకు అవార్డులిచ్చి ప్రోత్సాహించండి” అని ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పోటీ నుంచి లత తప్పుకుంది. ఇలా అడుగడుగునా లత అనేక విషయాలకు  అభ్యంతరాలు పెడుతూ, పట్టుబట్టి సాధించుకుంటూన్నా ఆమెతో పని చేసేందుకే అధిక సంఖ్యలో సీనియర్, జూనియర్ సరికొత్త సంగీత దర్శకులు తహతహలాడటం కేవలం లత స్వర మాధుర్యం, గాన ప్రతిభలు తప్ప ఇంకో కారణం కనబడదు.

1956 కల్లా లత తిరుగులేని, ఎదురులేని గాయనిగా ఎదిగింది. ఆమెకు పోటీగా నిలవగలిగి ద్వితీయ స్థానాన్ని భర్తీ చేయగల గాయని కనుచూపు మేరలో లేదు.  1952లో ‘బైజు బావరా’ సినిమాతో గాయకులలో మహమ్మద్ రఫీ అందరినీ ఆకర్షించాడు. ఆ సినిమాలో కూడా లత ‘మోహే భూల్ గయే సావరియా’, ‘బచ్‌పన్‍కి మొహబ్బత్ కో’ వంటి పాటలతో శ్రోతలను మెప్పించినా తొలిసారిగా ఓ సినిమాలో లత పాటలకు కాక మరో గాయకుడి పాటలకి ప్రాధాన్యం లభించటమే కాదు, లత పాటల వల్ల కాక మరో గాయకుడి పాటల వల్ల సినిమా హిట్ అవడం అన్న అద్భుతం సంభవించింది. ఇది హిందీ సినీ సంగీత ప్రపంచంలో సమీకరణాల మార్పుకు కారణం అయింది. లతలానే నటులకు తగ్గట్టు పాడుతూ, పాటలో తనదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ, పాటకు ప్రాణం పోస్తూ,  నటుడికి ఇమేజినిస్తూ తన పాటల ద్వారా సినిమా వ్యాపార విలువను పెంచుతూ, రఫీ అగ్రశ్రేణి గాయకుడిగా 1956 కల్లా స్థిరపడ్డాడు. అందుకే, రెండు మూడేళ్ళలో అగ్రస్థానానికి చేరుకుని, ఆపై యాభై ఏళ్ళు అక్కడే లత స్థిరంగా వుండటం, ఏ మంత్ర తంత్రాల వల్లనో సాధ్యం అయిందనిపిస్తుంది. ముఖ్యంగా అంతే ప్రతిభకల గాయకుడు మహమ్మద్ రఫీ లత కన్నా ముందు సినీ రంగంలో అడుగుపెట్టినా, 1952 వరకూ సరయిన గుర్తింపు సాధించలేకపోవటం, 1956 వరకూ నంబర్ వన్ గాయకుడిగా ఎదగలేకపోవటం అదృష్టం ప్రభావమే అనిపిస్తుంది.  దాంతో అప్పటివరకూ గాయనీగాయకుల ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న  లత మంగేష్కర్‍కు పోటీ గాయకుడిగా మహమ్మద్ రఫీ నిలిచాడు. వారిద్దరి నడుమ పరోక్షంగా,  వారి ప్రమేయం లేకుండా నెలకొన్న  ప్రచ్ఛన్న పోటీ హిందీ సినీ సంగీత ప్రపంచ గమన దిశను నిర్దేశించింది.

(ఇంకా ఉంది)

Exit mobile version