సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-21

1
1

[dropcap]బే[/dropcap]దర్దీ బాల్‌మా తుఝ్ కో మేర మన్ యాద్ కర్తా హై

బరస్‍తా హై జో ఆంఖోం సే, వో సావన్ యాద్ కర్తా హై

హిందీ సినిమా పాటలలో విరహ గీతాలలో అత్యున్నత స్థానం ఆక్రమిస్తుంది ‘ఆర్జూ’ సినిమాలోని ఈ లత విరహ గీతం. హస్రత్ జైపురి రాసిన ఈ పాటను రూపొందించింది శంకర్ జైకిషన్.  ఈ పాట లతా స్వరానికి, సాక్సోఫొన్‌కూ నడుమ జుగల్బందీలా పోటీ పాటలా అనిపిస్తుంది.  లత మంగేష్కర్ స్వరాన్ని అత్యంత తీవ్రమైన స్థాయిలో పరీక్షకు గురిచేసిన వారు శంకర్ జైకిషన్. శంకర్ జైకిషన్‍లు లతతో పాడించినన్ని విభిన్నమైన, విశిష్టమైన గీతాలు మరే సంగీత దర్శకుడూ పాడించలేదు. ఒక రకంగా చెప్పాలంటే, బంగారంతో ఎన్నిరకాల రూపాలు ఎంత విశిష్టంగా చేసే వీలుందో లత స్వరాన్ని అంతగా విశిష్టమైన రీతిలో విస్తృతంగా వాడేరు శంకర్ జైకిషన్. ఇతర సంగీత దర్శకులు రూపొందించిన పాటలను ఎంతగా మెచ్చుకున్నా, శంకర్ జైకిషన్ లత కోసం రూపొందించిన పాటలను విస్మరిస్తే, లత తన జీవితంలో పాడిన అమోఘమైన పాటలను విస్మరించినట్టే.

శంకర్ జైకిషన్‍ల కెరీరు లత పాటతో ఆరంభమయింది. వారు సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘బర్సాత్’లో అన్ని పాటలూ లతతోనే పాడించారు. ప్రతి ఒక్క పాట విభిన్నమైనది. విభిన్నమైన భావాలను ప్రకటించేది. తీగలాగా సాగే లత స్వరాన్ని విభిన్నమైన భావాలు పలికేందుకు రాగాలు తీసేందుకు ఎంతో గొప్పగా వాడుకున్నారు శంకర్ జైకిషన్. ‘బర్సాత్’ సినిమా పాటల వల్ల హిట్ అయిందనటం అనృతం కాదు. సినిమాను ఈనాటికీ పాటల వల్లే గుర్తుంచుకుంటారు. ‘బర్సాత్’ తరువాత   సూపర్ హిట్ పాటలను అందిస్తూ 1956వ సంవత్సరం వచ్చేసరికి నెంబర్ వన్ సంగీత దర్శకులుగా ఎదగటమే కాదు, మొత్తం హిందీ సినిమా పాటల రూపు రేఖలను మార్చేశారు శంకర్ జైకిషన్. సూపర్ హిట్ పాటల సృజనకు పెట్టింది పేరుగా నిలిచారు. శంకర్ జైకిషన్ అనే ‘బ్రాండ్ నేమ్’ను సృజించారు వీరు. వీరి సృజన ఎంత అమోఘమైనదంటే, శంకర్ జైకిషన్ పాట ఉంటే, సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న నమ్మకం సినీరంగంలోనే కాదు, ప్రేక్షకులలో కూడా స్థిరపడింది. ఆర్కెస్ట్రాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, అత్యంత ఆకర్షణీయమైన బాణీలను రూపొందిస్తూ, సినిమా భవిష్యత్తుతో పాటు నాయికా నాయకులు, గాయనీ గాయకుల భవిష్యత్తును తమ గీతాల రూపకల్పనతో నిర్దేశించగలిగే వారు శంకర్ జైకిషన్. ఈనాటికి కూడా ప్రతి సినిమాలో ప్రతిపాటనూ సూపర్ హిట్‍గా రెండు దశాబ్దాల పాటుగా సృజించిన ఏకైక సంగీత దర్శకులు శంకర్ జైకిషన్. వీరి సృజనకు ఆత్మగా నిలిచింది లత స్వరం. శైలేంద్ర, హస్రత్ జైపురిలతో కలసి శంకర్ జైకిషన్‍లు లత స్వరంతో సృజించిన మాయాజాలం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఎప్పటికీ కొనసాగుతుంది కూడా. 1949 నుంచి 1956 వరకు శంకర్ జైకిషన్‍లు తమ సినిమాలలో లత స్వరాన్ని వాడిన వివరాలు పరిశీలిస్తే లత కెరీరు రూపొందిన విధానం స్పష్టమవటమే కాదు 1950 దశకంలో లత తిరుగులేని గాయనిగా ఎదగటంలో శంకర్ జైకిషన్ ప్రాధాన్యం స్పష్టమవుతుంది.

1949- 56 శంకర్ జైకిషన్ – లతల పాటలు

సినిమాల సంఖ్య లత సోలో యుగళ గీతాలు మొత్తం రఫీతో యుగళగీతాలు
1949 1 8 3 11 0
1951 4 17 7 24 3
1952 3 18 6 24 1
1953 7 37 6 43 1
1954 2 8 3 11 2
1955 2 7 6 12 2
1956 7 35 14 49 3
మొత్తం 26 130 45 174 12

1949 నుండి 1956 వరకూ శంకర్ జైకిషన్‍లు లతతో పాడించిన పాటల వివరాలు చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. లత కెరీర్లో శంకర్ జైకిషన్‍ల ప్రాధాన్యం ఎంత అధికంగా ఉందో, మహమ్మద్ రఫీ ఆమె కెరీర్‍లో అంత అప్రధానం అన్నది. శంకర్ జైకిషన్‍లు లత కోసం రూపొందించిన 174 పాటలలో రఫీతో కలసి పాడిన పాటలు పన్నెండు మాత్రమే. 26 సినిమాలలో 174 పాటలంటే దాదాపుగా శంకర్ జైకిషన్‍ల అంతవరకూ సంగీత దర్శకత్వం వహించిన ఇరవై ఆరు సినిమాలలో ప్రతి సినిమాలో దాదాపుగా 61 శాతం పాటలు లతవే! అంత అధిక స్థాయిలో లతను వాడేరు శంకర్ జైకిషన్. అంటే, వారి సృజనలో లతకు అంత అధికమైన ప్రాధాన్యం ఉందన్నమాట.

శంకర్ జైకిషన్‌ల కెరీరును గమనిస్తే, మొదటి సినిమాతోటే వారు సూపర్ హిట్ సంగీత దర్శకులుగా నిలిచారు. ఆ తరువాత ప్రతి సినిమా పాటలతో తమ స్థితిని పదిల పరచుకుని 1956 వచ్చేసరికి సుస్థిరం చేసుకున్నారు. ప్రతి ఇతర సంగీత దర్శకుడు శంకర్ జైకిషన్‍ను అనుకరిస్తూ పాటలను రూపొందించి హిట్ చేయాలని తపన పడ్డాడు. ప్రతి నిర్మాత శంకర్, జైకిషన్ లాంటి సంగీతం కావాలని కోరుకునేవాడు. 1956 కల్లా శంకర్ జైకిషన్‍ను అనుకరిస్తూ కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ వంటి యువ సంగీత దర్శకులు తెరపైకి వచ్చారు. అప్పటికే ప్రసిద్ధి పొందిన సంగీత దర్శకులు కూడా శంకర్ జైకిషన్ పాటలను రూపొందించాలని తపనపడ్డారు.

సినీ పరిశ్రమకు ఓ ప్రధాన లక్షణం ఉంది. అదేమిటంటే ఎవరైనా ఎదిగి పైకి పోతున్నారంటే, ఎలాగైనా వారిని పడగొట్టి, క్రిందకు లాగటం, ఇందుకోసం ఎలాంటి పనికైనా సిద్ధపడతారు. లత కెరీరు ఆరంభంలోనే ఇది గ్రహించింది. అందుకని ఎవరేం చెప్పినా నమ్మటం, దానికి స్పందించటం మానేసింది. మాటలు మోసేవారు, మార్చేవారు, సృష్టించేవారు సినీ పరిశ్రమలో అధికం అనీ, వీరి వల్ల జరిగే నష్టం అపరిమితం అనీ లత అర్థం చేసుకుంది. ఈ విషయం శంకర్ జైకిషన్‍కు కూడా తెలుసు. శంకర్ జైకిషన్‍లలో శంకర్ లోకం రీతి తెలిసినవాడు. సినీ పరిశ్రమ అంతరంగం లోతుల్లోని చీకటి కోణాలను గ్రహించినవాడు. అందుకే జైకిషన్‍ను తన సంగీత ప్రపంచంలో భాగస్వామిగా నిర్ణయించుకున్నప్పుడు ఓ నియమం విధించాడు. అదేమిటంటే ఏ పాటను ఎవరు రూపొందించారో, ఎవరికీ తెలియకూడదు. అది గోప్యంగా ఉండాలి. వారిద్దరి నడుమనే ఉండాలి. శంకర్ విధించిన ఈ నియమం, శంకర్ జైకిషన్‍ల ఆకర్షణను మరింతగా పెంచింది. ఎందుకంటే సాధారణంగా ఈ  ప్రపంచం ఇద్దరు ప్రతిభావంతులుంటే ఇద్దరిలో ఎవరు గొప్పనో తెలుసుకోవాలని తపన పడుతుంది. ఆ తపనలో వారిద్దరి నడుమ వైషమ్యాలను సృష్టిస్తుంది. క్రికెట్‍లో గవాస్కర్‌కూ, కపిల్ దేవ్‍కూ నడుమ పోలికలు తెచ్చి ‘ఎవరు గొప్ప?’ అని చర్చించి అనేక అనవసర వైషమ్యాలకు దారి తీసింది. అలాగే సచిన్ టెండూల్కర్, రాహూల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ ఇలా… ఇద్దరు ప్రతిభావంతులుంటే, వారిని పోల్చటం విభేదాలు సృజించటం సాధారణం. సినీ పరిశ్రమలో కూడా ఇది సర్వసాధారణం. దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్‍లను పోల్చి వారి నడుమ స్పర్ధను సృజించారు. మహమ్మద్ రఫీని, తలత్ మహమూద్‍తో పోల్చి ఉద్విగ్నతలు సృజించారు. తరువాత కాలంలో రఫీ, కిషోర్ కుమార్‍లలో ఎవరు గొప్ప అని చర్చిస్తూ ఈనాటికీ ఆ ఇద్దరి అభిమానులు వీరావేశాలకు గురవుతూనే ఉన్నారు. సినీ పరిశ్రమలోని ఈ లక్షణం వల్ల కలసి పనిచేస్తున్న వారెందరో విడిపోయారు. కెరీర్లు నాశనమయిపోయాయి. ఇలా తగవులు పెట్టటం, కూలద్రోసి ఆనందించటం సినీరంగంలో సర్వసాధారణం. అందుకని ఏ పాట ఎవరు రూపొందించారో రహస్యంగానే ఉంచాలన్న నియమం ఏర్పాటు చేశాడు శంకర్. దాంతో ఇప్పటికి కూడా శంకర్ జైకిషన్ అభిమానులు ఏ పాట ఎవరు రూపొందించారో ఊహిస్తూ, వాదించుకుంటూ, తగవులాడుకుంటూనే ఉన్నారు. ఇద్దరు విభిన్నమైన వ్యక్తిత్వాలు, సృజనశైలి కలవారు కలసి ఇంత మధురమైన గీతాలను సృజించటం ఎలా వీలైందో ఈనాటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది.

శంకర్ జైకిషన్ పాటలు హిట్ అవటం ఆరంభమవగానే శంకర్ జైకిషన్ నుంచి వేరు పడాలనుకుంటున్నాడు, రాజ్‌కపూర్ శంకర్ కు నచ్చచెప్పాడనీ ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.శంకర్ జైకిషన్‍ అన్న జంట ఏర్పడటానికి కారణం శంకర్. రాజ్‍కపూర్ శంకర్‍ను సంగీత దర్శకత్వం వహించమని కోరినప్పుడు జైకిషన్‍ను కూడదీసుకున్నది శంకర్. అలాంటి శంకర్, సినిమాలు హిట్ కాగానే వేరుపడిపోవాలని కోరుకుంటాడన్నది అనౌచిత్యం. కానీ ఈ నీలి వార్తలకు శంకర్ జైకిషన్ ప్రాధాన్యం ఇవ్వలేదు. వారిద్దరూ పనిని విభజించుకుని ఒకరితో ఒకరు సంప్రదిస్తూ ఒక జట్టుగా కలసి పనిచేస్తూ సూపర్ హిట్ సంగీతం సృజిస్తూ పోయారు. కానీ వారిని పడగొట్టాలన్న ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. మరింత వేగవంతం, తీవ్రం అయ్యాయి. సినీరంగంలోని దుష్ట శక్తులు శంకర్ జైకిషన్ల ప్రతిభను వేరు చూసి వారినడుమ గొడవలు సృష్టించాలన్న ప్రయత్నంలో విఫలమయ్యాయికానీ, ఈనాటికీ శంకర్‌జైకిషన్ అభిమానులు ఎవరు ఎక్కువ ప్రతిభావంతుడన్న విషయంపై వాదించుకుంటూనేవున్నారు.

శంకర్, హస్రత్, రాజ్, ముకేష్, జైకిషన్, శైలేంద్ర

శంకర్‌కు సంగీతం తప్ప మరేమీ పట్టదు. నియమబద్ధమైన జీవితం క్రమశిక్షణతో గడిపేవాడు శంకర్.  శంకర్ జైకిషన్‍లలో శంకర్‌కి కోపం ఎక్కువ.   మాట ముందు అనేసినా తరువాత ప్రేమ కురిపించేవాడు. అతని సృజనాత్మకతకు, సంగీత పాండిత్యానికి అందరూ ముగ్ధులయ్యేవారు. జైకిషన్ పనితీరు శంకర్ నియమబద్ధమైన పనితీరుకు భిన్నం. కోపం అనే కన్నా సృజనాత్మక ప్రతిభను అంటి పెట్టుకుని ఉండే ‘అసహనం’ అనవచ్చు. ఒక ప్రతిభావంతుడికి సగటు ప్రతిభాశాలి పట్ల ఉండే అసహనం అది. జైకిషన్ అలా కాదు. అందరితో కలసి మెలసి తిరుగుతాడు. అందగాడు. శంకర్ కన్నా దాదాపుగా పది ఏళ్ళు చిన్నవాడు.  హాయిగా అందరితో తిరిగేవాడు, అందగాడు, యువకుడు కావటం, సూపర్ హిట్ సంగీత దర్శకుడు కావటంతో వెంట పడేవారికి కొదువ లేదు. ఇప్పటికీ ‘గేలార్డ్స్’ రెస్టారెంట్‍లో జైకిషన్ టేబిల్ అలాగే ఉంది. దాంతో శంకర్ ముక్కుసూటి, బల్ల గుద్దినట్టుండే వ్యవహారం కన్నా నవ్వుతూ, అందరితో స్నేహంగా ఉండే జైకిషన్‍తో వ్యవహరించేందుకే అందరూ ఇష్టపడేవారు. శంకర్‍ను ఒక్క గేయ రచయిత శైలేంద్ర, రాజ్ కపూర్‍లు మాత్రమే నియంత్రించగలిగేవారు. శంకర్ జైకిషన్‍లు శైలేంద్ర, హస్రత్ జైపురిలను తమ గేయ రచయితలుగా నిశ్చయించుకున్నారు. శంకర్ జైకిషన్, శైలేంద్ర, హస్రత్ జైపురిలది ఒక జట్టు. అత్యంత విజయవంతమైన ప్రతిభావంతుల జట్టు అది. శంకర్  జైకిషన్‌లలో శంకర్ అంటే అందరికీ భయం, భక్తి. జైకిషన్ దగ్గర చనువు ఎక్కువ. జైకిషన్ అంటే ప్రేమ. అందుకని, శంకర్ జైకిషన్లలో జైకిషన్ ఎక్కువ ప్రతిభావంతుడని, హిట్ పాటలన్నీ జైకిషన్‌వి అని పదే పదే ప్రకటిస్తూ వారిద్దరి మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నించారు. ఇద్దరి సృజననూ వేర్వేరుగా చూపుతూ  ఒకరు ఇంకోకరిన్నా ప్రతిభావంతులని చూపి ఇద్దరిమధ్య గొడవలు సృష్టించాలనుకునేవారి ప్రయత్నాలు శంకర్ విధించిన నియమంవల్ల ఫలించలేదు.  ఇద్దరి సృజనను వేర్వేరుగా చూపి, ఇద్దరి నడుమ భేదాలు సృష్టించాలనుకునే ప్రయత్నాలు విఫలమవటంతో లత, జైకిషన్‍ల నడుమ ఏదో నడుస్తోందన్న వార్తలు సృష్టించి శంకర్ జైకిషన్‍ల నడుమ, జైకిషన్ లతల నడుమ విభేదాలు సృష్టించాలని ప్రయత్నించారు.

 లత, జైకిషన్‍లు దాదాపుగా సమ వయస్కులు. జైకిషన్ కన్నా లత మూడేళ్ళు పెద్ద. దాంతో సమ వయస్కులవటం వల్ల స్నేహంగా ఉండేవారు. దానికి పలు రంగులద్ది ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయంలో శంకర్, జైకిషన్‍ను హెచ్చరించాడు కూడా. శంకర్‍కు ప్రపంచ రీతి తెలుసు. లత ఎవ్వరినీ ప్రేమించలేదని, శంకర్‍కు తెలుసు. లతకు ‘పాట’ తప్ప మరొకటి పట్టదనీ శంకర్‍కు తెలుసు. ముఖ్యంగా లతతో అనవసర సాన్నిహిత్యం ప్రదర్శించిన సి. రామచంద్రను లత నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టింది.  లత పాటలుపాడకపోవటం వల్ల సీ రామచంద్ర కేరీర్ పతనమవటం శంకర్ అతి దగ్గరనుంచి చూశాడు. సీ రామచంద్ర శంకర్లు మంచి మిత్రులు. అందుకనీ శంకర్ ముందే జైకిషన్ ను   లతకు సన్నిహితంగా వెళ్ళకూడదని, వారి స్నేహం కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కావాలనీ హెచ్చరించాడు. లతకు కూడా వివాహంపై, ప్రేమలపై ఎలాంటి ఆసక్తిలేదు. కానీ, ఈనాటికి కూడా లతా జైకిషన్ ల నడుమ ఏదో వుండేదనీ, జైకిషన్ పల్లవిని పెళ్ళిచేసుకోవటంలో సీ రామచంద్ర ప్రధాన పాత్ర వహించాడనీ వ్యాఖ్యానించేవారున్నారు. ఇంకొందరు ఊహాశాలురు, లత కూ జైకిషన్ తో పెళ్ళికాకుండా శంకర్ అడ్డుపడ్డాడనీ, అందుకని లతకు శంకర్ పై కోపమనీ ఈనాటికీ ఊహిస్తున్నారు. అయితే శంకర్ జైకిషన్ లత వాడకాన్ని తగ్గించేందుకు రెండు పరిస్థితులు దారితీశాయి. ఒకటి సినిమాలలో పెరుగుతున్న హీరోల   ఆధిక్యం. రెండవది ‘రసిక్ బల్‌మా’ పాటను ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సభలో లత పాడ నిరాకరించటం, ‘నా స్వరం లేకుండా వాయిద్యాలతో వాయించి ప్రజలను మెప్పించమనండి’ అని లత బహిరంగంగా వ్యాఖ్యానించటం శంకర్ జైకిషన్ ఆహాన్ని దెబ్బతీసింది. దాంతో 1957  తరువాత కూడా లతతో పాడిస్తున్నా, ఇతర గాయనిలతో పాడించటం ప్రారంభించారు  శంకర్ జైకిషన్. ఇది 1956 నుండి 1960 నడుమ సినిమాలలో లత పాటల సంఖ్య స్పష్టం చేస్తుంది.

1957 – 60 లలో శంకర్ జైకిషన్ లతల పాటలు

సినిమాలు సోలో యుగళ మొత్తం రఫీతో
1957 2 8 2 10 0
1958 2 9 3 12 0
1959 7 20 11 31 2
1960 5 13 15 28 7
మొత్తం 16 50 31 81 9

ఈ గణాంక వివరాలు పరిశీలిస్తే 1956 వరకూ సినిమాలో 61 శాతం పాటలు లతతో పాడించిన శంకర్ జైకిషన్ 1957-60 నడుమ యాభైశాతం పాటలు మాత్రమే లతతో పాడించారని తెలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం గాయకుడి పాటలు పెరగటంతో పాటు, శంకర్ జైకిషన్ ఆశా భోస్లే, ఆర్తీ ముఖర్జీ, గీతాదత్ వంటి గాయనిలతో కూడా పాడిస్తూండటం.

‘బేగునాహ్ ‘ సినిమాలో ‘ఆజా రాత్ బీతీ జాయే’ అన్న యుగళ గీతాన్ని కిశోర్, గీతాదత్‍లతో పాడించారు శంకర్ జైకిషన్. అలాగే ‘బాఘీ సిపాహీ’లో ‘చిక్ చన్ పపులు’ అనే యుగళ గీతాన్ని, ‘సమా యే ప్యార్‍కా’ అనే యుగళ గీతాన్ని ఆశా, మన్నాడేలతో పాడించారు. ‘ఛోటీ బహెన్’ లో కూడా ‘ఓ కలీ అనార్ కీ’ ఆశా, మన్నాడేలతో పాడించారు. ‘షరారత్’లో రెండు యుగళ గీతాలు ఆశా, మన్నాడేలతో పాడించారు. ‘లవ్ మేరేజ్’లో రఫీ, గీతాదత్‍లతో టైటిల్ యుగళ గీతం పాడించారు. ఈ రకంగా లత తప్పించి మరో గాయనితో పాడించని శంకర్ జైకిషన్,  1960 కల్లా లత కాక ఇతర గాయనిలతో కూడా పాడించటం ప్రారంభించారు. ఇంతలో అప్పుడప్పుడే లత, రఫీల యుగళ గీతాలు ఉచ్చస్థాయికి చేరుకుంటున్న తరుణంలో లత రఫీతో కలసి పాడకూడదని నిశ్చయించుకుంది. నిజానికి ఇది 1963లో బహిరంగం అయినా, 1961లో ‘మాయ’ సినిమా పాట ‘తస్వీర్ తేరే దిల్ మే’ విషయంలో వివాదం వచ్చినప్పటి నుంచీ లత, రఫీలు కలసి పాడటం మానేశారు. లత, పాటను మహేంద్ర కపూర్‍తో రికార్డు చేసింది. తరువాత రఫీ మహేంద్ర కపూర్ స్వరంపై తన స్వరాన్ని నిలిపేవాడు. అందుకే 1960 నుండి 1967 వరకూ శంకర్ జైకిషన్లు లతతో పాడించిన పాటలు, యుగళ గీతాల గణాంక వివరాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.

1960 – 65 నడుమ శంకర్ జైకిషన్ లతల పాటలు

సినిమాల సంఖ్య సోలో యుగళ మొత్తం రఫీతో
1961 7 15 12 27 4
1962 6 9 15 24 8
1963 3 6 3 9 3
1964 8 15 8 23 3
1965 3 2 2 4 0
మొత్తం 27 47 40 87 18

1949 నుండి 1956 వరకూ ప్రతి సినిమాలో సగటున 61శాతం పాటలు లతకు ఇచ్చిన శంకర్ జైకిషన్ 1956 నుండి 1960 నడుమ యాభైశాతం పాటలు మాత్రమే పాడిస్తే 1961 నుండి 1965 నడుమ అది మరింత తగ్గి ముఫ్ఫై శాతానికి చేరింది. అంటే లత మొండి ప్రవర్తన, వివాదాలు ఆమె కెరీరును దెబ్బ తీస్తున్నాయన్న మాట. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, లత పాడే పాటల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నా, ఆమె పాటలు హిట్ కావటం, పాటల వల్ల సినిమా విలువ పెరగటం మాత్రం తగ్గలేదు. ఎందుకంటే 1960 నుండి 1965 నడుమ లత అత్యద్భుతమైన పాటలు పాడింది. ‘అజీబ్ దాస్తాన్  హై యే’, ‘వొ భూలీ దాస్తాన్’, ‘ప్యార్ కియా తో డర్ నా క్యా’, ‘తేరా మేరా ప్యార్ అమర్’, ‘జుర్మ్-ఎ-ఉల్ఫత్ కే’, ‘కభీ తో మిలేగీ’ వంటి ఎవర్ గ్రీన్ పాటలు ఈ కాలంలోనే లత పాడింది. దాంతో లత కెరీరు దెబ్బ తిననట్టు , ఆమె ఉచ్చస్థాయిలో ఉన్నట్టు అనిపించినా, ఈ సమయంలో కెరీరు పరంగా లత దెబ్బ తిన్నది. ఇదే 1960 – 65 నడుమ శంకర్ జైకిషన్‍లు రఫీతో పాడించిన పాటల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది.

1960- 65 నడుమ శంకర్ జైకిషన్, రఫీల గీతాలు

సినిమా సంఖ్య సోలో యుగళ మొత్తం లతతో ఇతరులతో
1960 5 7 7 14 7 0
1961 7 12 8 20 4 4
1962 6 8 9 17 8 1
1963 3 5 5 10 3 2
1964 8 18 16 34 3 13
1965 3 9 8 17 0 8
మొత్తం 32 59 53 112 25 28

పై గణాంక వివరాలను పరిశీలిస్తే లత ఎంతగా నష్టపోయిందో స్పష్టమవుతుంది. ఈ కాలంలో రఫీ పాడిన 53 యుగళ గీతాలలో 25 లతతోటి, మిగతా 28 ఇతరులతోటీ. శంకర్ జైకిషన్ పనితీరును గమనిస్తే రఫీ, ఇతరులతో పాడిన 28 పాటలలో కనీసం 20 పాటలు లత ఖాతాలలో జమ అయ్యేవన్నది నిర్ద్వందం. రఫీ పాడిన 28 యుగళ గీతాలలో తొమ్మిది ఆశాతో, ఆరు సుమన్‍తో పాడేడు. ఆశాతో అధికంగా పాడించటం వెనుక 1964లో ‘సంగం’ విడుదలైన తరువాత లత, శంకర్ జైకిషన్‍కు పాడకూడదని తీసుకున్న నిర్ణయం ప్రధాన పాత్ర పోషించింది. ఈ విశ్లేషణ కోసం శంకర్‌జైకిషన్ పాటలను ఎంచుకోవటం ఎందుకంటే, ఆ కాలంలో అత్యంత విజయవంతమయిన సంగీత దర్శకులవటమేకాక, అధిక సంఖ్యలో పాటలను రూపొందించిన సంగీత దర్శకులు శంకర్‌జైకిషన్ కావటం.

‘సంగం’ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత రాజ్ కపూర్ ఇరాన్ వెళ్ళాడు. అక్కడ అతడికి శారదా రాజన్ పరిచయం అయింది. పాటలు పాడలన్న ఆమె ఉత్సహం చూసి బొంబాయి రమ్మన్నాడు రాజ్ కపూర్. రాజ్ కపూర్ మాట పట్టుకుని శారదా రాజన్ బొంబాయి వచ్చింది. ఆమెను శంకర్ జైకిషన్‍కు పరిచయం చేశాడు రాజ్ కపూర్. సినిమాల పాటలు పాడటంలో శిక్షణ నివ్వమన్నాడు.

రాజ్ కపూర్ మాటను శంకర్ సీరియస్‍గా తీసుకున్నాడు. ఎందుకంటే వ్యక్తులలో ప్రతిభను రాజ్ కపూర్ గుర్తిస్తాడు. వారి ప్రతిభను ఉపయోగించుకుంటాడు. శంకర్ జైకిషన్‍ల జట్టు లోని అనేకుల ప్రతిభను గుర్తించి వారి ప్రతిభను వాడుకున్నాడు రాజ్ కపూర్. సంగీతానికి సంబంధించిన ఏ విషయమైనా రాజ్ కపూర్ నిర్ణయాన్ని శంకర్ గౌరవిస్తాడు. శంకర్ అభిప్రాయానికి రాజ్ కపూర్ విలువనిస్తాడు. కాబట్టి రాజ్ కపూర్ శారదను పరిచయం చేయగానే భవిష్యత్తులో ఆమెతో రాజ్‍కపూర్ పాటలు పాడించాలనుకుంటున్నాడని శంకర్ భావించటం స్వాభావికం. అప్పటికి నిర్మాతలందరూ ఏదో ఓ రకంగా లతతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త గాయనిలను వెతికి   అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి శారదా రాజన్‍కు శిక్షణ నివ్వమని రాజ్ కపూర్ అన్నప్పుడు ఆమెకు అవకాశాలివ్వాలని రాజ్ కపూర్ అనుకుంటున్నాడని శంకర్ పొరపడటంలో ఆశ్చర్యం లేదు. వెంటనే శారదకు సంగీతంలో, పాడటంలో శిక్షణ నివ్వటం ప్రారంభించాడు శంకర్.

శంకర్, శారద,లత, రఫి, జైకిషన్,

శారదకూ శంకర్‍కూ నడుమ సాన్నిహిత్యం ఏర్పడింది. శారదా రాజన్‍ను ఉచ్చస్థాయి గాయనిగా తయారు చేయగలనని శంకర్ విశ్వసించాడు. తన ప్రతిభ మీద శంకర్‍కు ఉన్న విశ్వాసం అది. సంగీత దర్శకుడే పాట హిట్ అవటంతో ప్రధాన పాత్ర పోషిస్తాడని నమ్ముతాడు శంకర్. గేయ రచయిత తాను మెచ్చేటు రాయాలి. గాయనీ గాయకులు తాను ఎలా నిర్దేశిస్తే అలా పాడాలి. వాయిద్యకారులు సంగీత దర్శకుడి ఆదేశం ప్రకారమే వాయించాలి. కాబట్టి సంగీత దర్శకుడు అధికుడు అని భావిస్తాడు శంకర్. తన ప్రతిభతో శారదా రాజన్‍ను ఉచ్చస్థాయి గాయనిగా తీర్చిదిద్దగలనని నమ్మాడు శంకర్. రాజ్ కపూర్ మామూలుగా అన్న  మాటలను శిరసావహించాడు. శారదా రాజన్‍ను గాయనిగా తీర్చిదిద్దటం ప్రారంభించారు. శారదా రాజన్ విద్యావంతురాలు. ఆమె స్వరం విభిన్నమైనది. కానీ హిందీ సినీ పరిశ్రమలో నేపథ్య గాయనిగా నిలదొక్కుకోవాలంటే గాయని స్వరం ఎవరో ఓ నటికి సరిపోవాలి. కానీ శారద స్వరం ఎంత విభిన్నమైనదంటే, ఏ నటికి కూడా అమె స్వరం సరిపోదు. దీనికి తోడు ఆమె పదాలను పలికే తీరు అస్పష్టంగా ఉంటుంది. స్వరం భావాలను పలకదు. దీర్ఘాలు, రాగాలు తీయలేదు. విభిన్నంగా ఉండటం వల్ల ఒకటి రెండు పాటలు బాగా అనిపిస్తాయి కానీ కాసేపైతే ఆమె స్వరం వినటం కష్టంగా ఉంటుంది. హైపిచ్ పాడలేదు. క్లిష్టమైన బాణీలు పాడలేదు. అయితే శంకర్ ఇవేమీ పట్టించుకోకుండా ఆమెను గొప్ప గాయనిగా నిలపాలని నిశ్చయించాడు.

శంకర్ జైకిషన్‍లలో జైకిషన్, శంకర్‍లా మొండి పట్టు పట్టడు. ఆయన గాయనీ గాయకులకే కాదు వాయిద్యకారులకు కూడా స్వేచ్ఛనిస్తాడు. శంకర్‍లా త్వరగా ఆవేశానికి గురై మాట తూలడు. అందరికీ ఇష్టుడు. ప్రతి ఒక్కరి మాట వింటాడు. కానీ తాను చేయాలనుకున్నది ఎదుటి వాడు నొచ్చుకోకుండా చేస్తాడు. శారద స్వరం జైకిషన్ సరిగ్గా అంచనా వేశాడు. ఆమె పాటలు పాడగలదు కానీ చాలా పరిమితులున్నాయి ఆమె స్వరానికి అని అర్థం చేసుకున్నాడు. ముబారక్ బేగమ్ లానే ఒకటి రెండు పాటలకైతే బాగానే ఉంటుంది కానీ విభిన్నమైన భావాలను, సంవేదనలను పలికే విశిష్టమైన బాణీలను ఆమె స్వరం పాడలేదని గ్రహించాడు. కానీ శంకర్ ఒక్కసారి నిర్ణయించుకున్నాడంటే ఎవ్వరి మాట వినడు. పైగా రాజ్ కపూర్ పరిచయం చేశాడు కాబట్టీ ఆమెను గొప్ప గాయనిగా చేయాల్సిందే అని పట్టుబట్టాడు శంకర్. ఈ విషయంలో శంకర్, జైకిషన్ నడుమ అభిప్రాయభేదం నెలకొని ఉంటుంది. కానీ శంకర్ కానీ, జైకిషన్ కానీ తమ భేదాభిప్రాయాన్ని బహిరంగం చేయలేదు. శారదతో మర్యాదగా, అభిమాన పూర్వకంగా వ్యవహరించారు.

శంకర్ జైకిషన్ జోడీని దెబ్బతీయాలని ఎదురు చూస్తున్న సినీ పరిశ్రమలోని వారికి శంకర్ జైకిషన్‍ల నడుమ శారద ప్రవేశించటం ఒక అవకాశాన్నిచ్చింది. జైకిషన్ శారదను విమర్శించలేదు. ఆమె గొంతు పనికి రాదు అని అనలేదు. ఆమెతో స్నేహంగానే ఉన్నాడు. ఆమెకు పాటలు పాడటంలో మెళకువలు చెప్పాడు. కానీ ఆమెకు పాడే అవకాశాలు ఇచ్చేందుకు ఉత్సాహం చూపలేదు. ఇంతలో ఇతరులెంతగా ప్రయత్నించినా వీలవని భేదాభిప్రాయాలు శంకర్‌జైకిషన్ మధ్య ఏర్పడటానికి జైకిషన్ కారణం అయ్యాడు.

 ‘సంగం’ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ పాటలయినా మహమ్మద్ రఫీ పాడిన ‘యే మేరా ప్రేమ్ పత్ర్ పఢ్ కర్’, ముకేష్ పాడిన ‘దోస్త్ దోస్త్ న రహా’ పాటలు పోటా పోటీగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సమయంలోనే పల్లవితో జైకిషన్‍కు వివాహమయింది. ఆ సందర్భంగా ఫిల్మ్‌ఫేర్ పత్రికలో ఓ వ్యాసంలో ‘యే మేరా ప్రేమ్ పత్ర్ పఢ్ కర్’ పాటను తాను పల్లవి కోసం రూపొందించానని రాశాడు. అది తుఫాను సృష్టించింది.

శంకర్ జైకిషన్ ఓ జట్టుగా ఏర్పడినప్పుడే శంకర్ ఒక నియమం ఏర్పాటు చేశాడు. ఎవరు ఏ పాట రూపొందిస్తున్నారో ఎవరికీ తెలియకూడదు. పాటను శంకర్ రూపొందించినా, జైకిషన్ రూపొందించినా బయట ప్రపంచానికి అది శంకర్ జైకిషన్ పాటగానే తెలియాలి. ఇద్దరూ సూపర్ హిట్ పాటలు రూపొందిస్తూండటం వల్ల, ఏ పాట ఎవరు రూపొందించారో తెలిస్తే, అప్పుడు ఇద్దరినీ పోల్చి, ఎవరు గొప్ప, ఎవరు ప్రతిభావంతుడు, ఎవరు ఎక్కువ హిట్ పాటలు రూపొందించారు వంటి చర్చలు ఆరంభించి ఇద్దరి మధ్య తగవులు పెడతారు. చక్కటి స్నేహాలు కూడా ఇలాంటి పోలికలు, విశ్లేషణల వల్ల దెబ్బతింటాయి. కాబట్టి ఏ బాణీ, ఎవరిది, ఏ పాట ఎవరు రూపొందించారో ఎవ్వరికీ తెలియకూడదన్న నియమం విధించాడు శంకర్. కేవలం గేయ రచయితలే కాదు, శంకర్ జైకిషన్ జట్టులో పనిచేసిన టీ అందించే వాడి దగ్గర నుంచి రీ-రికార్డింగ్ చేసే వారి దాకా ఎవ్వరు కూడా ఎప్పుడూ ‘ఇది శంకర్ బాణి’, ‘ఇది జైకిషన్ బాణి’ అని బహిరంగంగా వెల్లడించలేదు. దాంతో ఏ బాణీ ఎవరు రూపొందించారు? ఇద్దరు విభిన్నమైన వ్యక్తిత్వాలు, సృజనాత్మక ప్రతిభ కలవారు కలసి ఎలా అత్యద్భుతమైన పాటలను రూపొందిస్తున్నారో అన్న విషయంపై సినీ పరిశ్రమలో సామాన్యులలో, అభిమానులలో నిరంతరం చర్చలు, వేడిగా వాడిగా సాగుతూండేవి. ఇది కూడా శంకర్ జైకిషన్‍ల పట్ల ఆకర్షణను పెంచిన అంశం. ఒక స్థాయిలో 1954- 56 నడుమ శంకర్ జైకిషన్‍లు విడివిడిగా పాటలను రూపొందించటం ప్రారంభించారు. కొన్ని పాటలు జైకిషన్, మరికొన్ని రకాల పాటలను శంకర్ పంచుకుని బాణీలు కట్టేవారు. కానీ ప్రతి పాటను చర్చించి, సంప్రదించి రూపొందించేవారు. దాంతో ఎవరు ఏ పాట కట్టారో తెలిసేది కాదు. ఇద్దరూ కలసి ఒకే పేరు మీద వేర్వేరుగా పాటలను సృజిస్తున్నారని తెలిసినా, ఎవరు ఏది సృజిస్తున్నారో తెలియక తలలు బద్దలు కొట్టుకునేవారు. ‘ఫిల్మ్‌ఫేర్’ లో ‘యే మేరా ప్రేమ్ పత్ర్ పఢ్ కర్’ పాటను తాను రూపొందించి పల్లవికి అంకితం ఇచ్చానని జైకిషన్ వెల్లడించటంతో, ఇంతకాలం శంకర్ జైకిషన్‍లను వేరుచేసి చూపాలని తలలు బ్రద్దలు కొట్టుకుంటున్న వారికి ఓ ఆధారం లభించింది. శంకర్ జైకిషన్‍ల పెట్టని కోట వంటి స్నేహం బద్ధలు కొట్టేందుకు చిన్న బలహీనత దొరికింది.

అంతవరకూ శంకర్ జైకిషన్‍ల పాట అని బినాకా గీతామాలాలో ప్రకటించే అమీన్ సయానీ , ‘జైకిషన్ కా ప్రేమ్ పత్ర్’, ‘శంకర్ కా దోస్త్ దోస్త్ న రహా’ అంటూ ప్రకటించటం ప్రారంభించాడు. విమర్శకులు ‘యే మేరా ప్రేమ్ పత్ర్ పఢ్ కర్’ ఆధారంగా శంకర్ జైకిషన్‍ల ఇతర బాణీలను విశ్లేషించి, ‘ఇది జైకిషన్ బాణీ, ఇది శంకర్ బాణీ’ అని వేరుచేసి చూపటం ప్రారంభించారు. అప్పటికీ నిశ్చయంగా ఏది ఎవరి బాణీయో తెలియకున్నా, ఎవరికి వారు తమకే అంతా తెలిసినట్టు తాము చూసినట్టు జైకిషన్, శంకర్‍ల బాణీలంటూ ప్రస్తావించసాగారు. రాజు భరతన్ వంటి జర్నలిస్టులు శంకర్ జైకిషన్‍లకు అస్సలు పడదని, ఆరభంలోనే శంకర్ వేరు పడదామనుకుంటే రాజ్‍కపూర్ అడ్డుపడ్డాడని రాశాడు. ఇంకొందరు ఉత్తమ బాణీలు, హిట్ పాటలు అన్నీ జైకిషన్‍వేనని ప్రకటించటం ప్రారంభించారు. ఒక చిన్న చిల్లు ఆధారంగా నీరు పడవలోకి ప్రవేశించి మొత్తం పడవనే ముంచెత్తినట్టు అయింది.

ఇంతకాలం నుంచీ శంకర్ భద్రంగా నిర్మించిన శంకర్ జైకిషన్ సంగీత భవంతి బీటలు వారసాగింది. ఎప్పుడైతే అమీన్ సయానీ ‘జైకిషన్ కా ప్రేమ్ పత్ర్’ అని ప్రకటించి శంకర్ ‘దోస్త్ దోస్త్ న రహా’ని తక్కువ చేసి జైకిషన్ పాటకు ఎక్కువ మార్కులు ఇచ్చాడో అప్పుడు శంకర్ విచక్షణను మరచిపోయి రంగంలోకి దూకాడు. ‘జైకిషన్‍తో ఉన్న దోస్తీని పురస్కరించుకుని అమీన్ సయానీ జైకిషన్ పాటకు ప్రాధాన్యం ఇస్తూ తన పాటని తక్కువ చేస్తున్నాడ’ని కోర్టును ఆశ్రయించాడు శంకర్. దాంతో శంకర్ జైకిషన్‍ల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమయింది. ఇద్దరూ రెండు మ్యూజిక్ రూమ్‍ల నుండి పనిచేయటం ఆరంభించారు. శంకర్ స్టూడియోకు వస్తే, జైకిషన్ ఇంట్లోంచే పనిచేయటం ప్రారంభించాడు. దాంతో వారిద్దరినీ వేరు చేయాలని ప్రయత్నిస్తున్న వారి రొట్టెని విరిచి నేతిలో పారేసినట్టయింది. ఇంతకాలం దుష్టుల ప్రభావం జైకిషన్‌పై పడకుండా శంకర్ రక్షణ కవచంలా నిలిచాడు. ఎప్పుడైతే జైకిషన్ ఇంటి నుంచి పనిచేయటం ప్రారంభించాడో అప్పుడే అతని చుట్టూ చెప్పుడు మాటలగాళ్ళు, దుష్టులు, పొగిడి పబ్బం గడుపుకునే వాళ్ళు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు, మాయమాటల మాయగాళ్ళు చేరారు. జైకిషన్‍కు ఉన్న తాగుడు అలవాటుని వ్యసనంలా మార్చారు. ఇలాంటి పరిస్థితులలో శంకర్ జైకిషన్‍ల నడుమ శారద ప్రవేశించింది. శారదను మరో లత చేస్తానని శంకర్ అన్నాడన్న వార్త పరిశ్రమలో వ్యాపించింది. ఫలితంగా ‘మై కాకరూ రామ్’ అనే అసభ్యమైన పాటను తనతో పాడించినందుకు శంకర్ జైకిషన్‍కు పాటలు పాడనని లత ప్రకటించింది. అంతటితో ఆగక ‘ప్రేమ గుడ్డిదే కాదు, చెవిటిది కూడా’ అని శారదపై ఓ విసురును కూడా విసిరింది.

అప్పటికే లతకు ప్రత్యామ్నాయం వెతుకుతున్న శంకర్, శారదను లతకు ప్రత్యామ్నాయంగా భావించాడు. జైకిషన్ ఆశాను, సుమన్‍ను వాడటం తీవ్రతరం చేశాడు. దాంతో సినిమాలో అన్ని పాటలూ లతతోనే పాడించిన శంకర్ జైకిషన్ సినిమాల్లోంచి లత నెమ్మదిగా అదృశ్యం అవటం వేగవంతమయింది. అప్పటికే ఇతర సంగీత దర్శకులు కూడా ఇతర గాయనిలతో పాడిస్తూండటంతో లతకు పాటల అవకాశాలు గణనీయంగా తగ్గేయి. ఇది గమనించిన లత శంకర్ పాటలు పాడను, జైకిషన్ పాటలు పాడతానని ప్రకటించింది. ఇది పరిస్థితిని జటిలం చేసింది.

శారద స్వరం పట్ల జైకిషన్‍కు అసంతృప్తి ఉన్నదని  ఎన్నడూ జైకిషన్ ప్రత్యక్షంగా అనకపోయినా అందరికీ తెలిసిన విషయం. శారదను గాయనిగా వాడేందుకు జైకిషన్ ఇష్టపడలేదు. ఆశా భోస్లే, సుమన్, ముబారక్ బేగమ్, కృష్ణ కళ్ళె వంటి వారితో సైతం పాడించేందుకు జైకిషన్ ఇష్టపడ్డాడు కానీ శారదతో పాడించేందుకు ఇష్టపడలేదు. రఫీ, లత కలసి పాడకపోవటంతో సినిమాలలో యుగళ గీతాలు తగ్గేయి. ఇప్పుడు లత శంకర్ జైకిషన్‍కు పాడననటంతో సినిమాలలో గాయనిల పాటలు తగ్గించారు శంకర్ జైకిషన్. ఎందుకంటే లత కాక ఇతర గాయనిలతో హిట్ పాటలు రూపొందిస్తున్నా, లత స్థాయిలో ఇతర గాయనిలు పాడలేక పోవటంతో పాటల బాణీల సృజనలో స్వేచ్ఛ లేకపోవటం శంకర్ జైకిషన్‍ల సృజనపై ప్రభావం చూపించింది. మహమ్మద్ రఫీ శంకర్ జైకిషన్‍ల నడుమ సయోద్య కుదిర్చాడు. వారిద్దరూ కలసి ఉంటేనే నాణ్యమైన పాటలు రూపొందుతాయని నచ్చచెప్పాడు. దాంతో శంకర్, జైకిషన్‍లు ఎవరు సినిమాకు సంగీత దర్శకత్వం వహించేందుకు ఒప్పుకున్నా, ఆ సినిమాలో మరొకరి పాటలు కనీసం రెండయినా ఉండాలన్న నియమం పాటించాలని నిశ్చయించుకున్నారు. అంటే అంతవరకూ ఇద్దరూ కలసి సినిమాలు ఒప్పుకునేవారు. ఇప్పుడు ఎవరికి వారు వేర్వేరుగా సినిమాలు ఒప్పుకోవటం ప్రారంభించారు. సినీ పరిశ్రమలో ప్రతిభావంతుడైన జైకిషన్ ఆధారంగా శంకర్ లాభం పొందుతున్నాడన్న ప్రచారం వేగవంతమైంది. శంకర్‍ని వదలి జైకిషన్ ఒక్కడే స్వతంత్రంగా సంగీత దర్శకత్వం వహించాలని జైకిషన్‍కు నూరిపోయసాగారు అతని చుట్టూ చేరిన దుష్టగణం. ఈలోగా లత పడిపోతున్న తన కెరీర్‍ను నిలబెట్టేందు కోసం జైకిషన్ పాటలు పాడతానని ప్రకటించింది. దాంతో అంతవరకూ శంకర్ జైకిషన్‌ల నడుమ కనబడని విభజన రేఖ ఇప్పుడు స్పష్టంగా కనబడసాగింది. 1964 తరువాత శంకర్ జైకిషన్ సంగీత దర్శకర్వంలో లత పాడిన పాటలు జైకిషన్‍వి అని ఊహించే వీలు చిక్కింది. శంకర్ జైకిషన్‍ల నడుమ విభేదాలు స్పష్టమయ్యాయి. శంకర్ పాట రూపొందించే పద్ధతిని, జైకిషన్ బాణీ సృజించే పద్ధతితో పోల్చి చూపే వీలు చిక్కింది. ఇది జైకిషన్ పాట, ఇది శంకర్ పాట అని నిర్ధారించే వెసులుబాటును లత జైకిషన్ కు పాడతాను, శంకర్ కు పాడను అనటం ఇచ్చింది. కావాలనో, తెలియకో లత తీసుకున్న ఈ నిర్ణయం సినీ సంగీత జగత్తులో స్వర్ణయుగం పై తెర తీసి మణిమయమయిన పాటలను సరస్వతీదేవికి అర్పించిన శంకర్ జైకిషన్ దెబ్బతినేందుకు, సినీ సంగీతంలో స్వర్ణయుగం అంతమయ్యేందుకు దారిని సుగమం చేసింది.

శంకర్ జైకిషన్‍లను దెబ్బ తీయాలనుకున్న వారిలో కొందరు నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ నిర్మాతల ఆరంభ సినిమాలను తన సంగీతం ద్వారా హిట్ చేసి, వారికొక సుస్థిరతను, ప్రామాణికతను శంకర్ జైకిషన్ సాధించిపెట్టారు. సినీ పరిశ్రమలో ఒక హిట్ తరువాత   రేటు పెంచటం సర్వ సాధారణం. అలా పెరుగుతూ శంకర్ జైకిషన్‍ల రేటు అయిదు లక్షలు దాటింది. గతంలో శంకర్ జైకిషన్‍తో పనిచేసిన నిర్మాతలు, తమ పూర్వ స్నేహం దృష్ట్యా తమకు తక్కువ రేటుకి పనిచేయాలని వారు శంకర్ జైకిషన్‍లను అభ్యర్థించారు. అందుకు శంకర్ జైకిషన్‍లు ఒప్పుకోలేదు. దాంతో అయిదు లక్షలు చెల్లించలేక శంకర్ జైకిషన్‍లను వదలుకోలేక సతమతమైన నిర్మాతలు శంకర్ జైకిషన్‍లను దెబ్బతీయాలని కంకణం కట్టుకున్నారు. ఇదే సమయానికి లక్ష్మీకాంత్, ప్యారేలాల్‍లు రంగ ప్రవేశం చేశారు.

లక్ష్మీకాంత్ ప్యారేలాల్ శంకర్ జైకిషన్ పంథాలో సంగీతం రూపొందిస్తూ అందరినీ ఆకర్షించారు. బాల్యం నుంచీ లత వారికి పలు రకాలుగా సహాయం చేస్తూ వచ్చింది. వివిధ సంగీత దర్శకుల ఆర్కెస్ట్రాల్లో వారికి పని ఇప్పించింది. విడుదలైన లక్ష్మీప్యారేల తొలి సినిమా ‘పారస్మణి’లో లత అద్భుతంగా పాడింది. పాటల వల్ల సినిమా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా కమల్ బారోత్‍లో కలసి పాడిన ‘హస్త హువా నూరానీ చెహెరా’ , రఫీతో పోటా పోటీగా పాడిన ‘వో జబ్ యాద్ ఆయే’ యుగళ గీతాలు తుఫాను సృష్టించాయి.

‘దోస్తీ’ సినిమా పాటలు ‘సంగం’ తో తలపడ్డాయి. రఫీ దోస్తీలో పాడిన ‘చాహుంగ మై తుఝే’ పాట ఉత్తమ పాటగా ఎంపికైంది. లో-బడ్జెట్ సినిమా పాటలు హై-బడ్జెట్ సినిమా పాటలను మించిపోవటం కళాకారుడి ప్రతిభకు తిరుగులేని తార్కాణం. శంకర్ జైకిషన్‍ను అనుకరిస్తూ, శంకర్ జైకిషన్ పంథాలో వారికన్నా తక్కువ ధరకు అంత నాణ్యమైన సూపర్ హిట్ పాటలను అందిస్తున్న ‘లక్ష్మీ ప్యారే’ ల వైపు శంకర్ జైకిషన్‍ల పట్ల అసంతృప్తితో ఉన్న నిర్మాతల దృష్టి మళ్ళింది. లత సైతం వీలున్నప్పుడు ‘లక్ష్మీ ప్యారే’ను సంగీత దర్శకుడిగా ఎంచుకోవచ్చని పరోక్షంగా సూచించేది. లక్ష్మీ ప్యారేలు లత భక్తులు. కాబట్టి వారి సినిమాలో లత పాటలు తప్పనిసరి. వారు పైకి ఎదుగుతున్న ప్రతిభావంతులైన సంగీత దర్శకులు, యువకులు కావటంతో ఎంతో భవిష్యత్తుంది. వారి పాటలు సూపర్ హిట్‍లు అవుతున్నాయి. వారి పాటల ద్వారా లత సూపర్ హిట్ పాటలను అందిస్తూంటే, పాటల సంఖ్య తగ్గి దిగజారుతున్న ఆమె కెరీరు మెరుగు పడుతుంది. కాబట్టి లత లక్ష్మీ ప్యారే వైపు మొగ్గు చూపింది. అందువల్ల ఒకప్పుడు శంకర్ జైకిషన్ వల్ల లాభపడి పెద్ద నిర్మాతలుగా గుర్తింపు పొందిన వారంతా లక్ష్మీప్యారే వైపు మళ్ళారు. ఈ సమయంలో లత జైకిషన్ పాటలు పాడతానని, శంకర్ జైకిషన్‍లను వేరుచేసి చూపటమే కాదు, మారుతున్న సినీ సంగీత పరిస్థితుల కనువుగా తన నియమాలను సడలించి పాట పాడే సంవిధానాన్ని రూపాంతరం చెందించింది. అంతవరకూ ఆమె స్వరంలో అంతగా కనిపించని కవ్వింపు (Seduction) ఇప్పుడు ఆమె స్వరం ప్రదర్శించసాగింది.

1960 దశకంలో హిందీ సినిమా పాటలలో కేబరే పాటలు, కవ్వింపు నృత్యాల పాటలు అధికమయ్యాయి. హెలెన్ ప్రధాన నృత్యగత్తెగా తెరపైకి వచ్చిన తరువాత ఇలాంటి పాటల ప్రాధాన్యం పెరిగింది. లత ఇలాంటి పాటలు పాడదు. అలాంటి పాటలు అధికంగా ఆశా భోస్లే పాడేది. ఇది ఆశా డిమాండ్‍ను పెంచింది. 1965 దశకం వచ్చేసరికి నాయికలు కూడా కవ్వింపు పాటలు పాడటం ఆరంభించారు. తానింకా అలాంటి పాటలు పాడనంటే, తన డిమాండ్ మరింత పడిపోతుందని లత అర్థం చేసుకుంది. అప్పటికే పలు వివాదాల కారణంగా లత పాటల సంఖ్య తగ్గుతోంది. అందుకని నియమం కొంత సడలించి, అసభ్యత లేకుండా, మర్యాద పూర్వకంగా ఉన్న కవ్వింపు పాటలను, శృంగార గీతాలను పాడటం ప్రారంభించింది. కళ్యాణ్ జీ, ఆనంద్ జీ సంగీత దర్శకత్వంలో ‘జబ్ జబ్ పూల్ ఖిలే’ సినిమాలో నంద కోసం పాడిన ‘యే సమా, సమా హై యే ప్యార్ కా’ పాటలో అంతవరకూ కనబడని కొత్త లత కనిపిస్తుంది. పెద్దగా శృంగారం చిలికించలేని నంద ‘శృంగార రసాధి దేవతలా’ అనిపించేంత అత్యద్భుతమైన రీతిలో, ఎక్కడా వెకిలితనం లేకుండా, అత్యంత ప్రామాణికమైన రీతిలో శృంగార రస ప్రవాహాన్ని ప్రవహింప చేసింది లత ఆ పాటలో. నెమ్మదిగా అలాంటి పాటలు పాడుతూ తానూ శృంగార గీతాలను అత్యంత ప్రామాణికంగా, క్లాసిక్ పాటలుగా ఎదిగే రీతిలో పాడగలనని నిరూపించింది లత. ముఖ్యంగా ఇలాంటి పాటలు యువ సంగీత దర్శకులకు పాడటం వల్ల, యువ సంగీత దర్శకులకు ఇలాంటి పాటల కోసం మరో స్వరాన్ని వెతుక్కునే ఆలోచన కలగనీయలేదు.

ఓ వైపు జైకిషన్ పాటలు మాత్రం పాడతానన్న లత, మరోవైపు రఫీతో సంధి చేసుకుంది. రఫీతో సంధి విషయంలో వివాదాలున్నాయి. ‘జైకిషన్’ లతకు, రఫీకి నచ్చచెప్పి వారిద్దరూ మళ్ళీ పాడేట్టు చేశారంటారు. అలా వారు చాలా ఏళ్ళ తరువాత కలసి పాడిన పాట విడుదల కాకపోవటంతో, ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో ‘జువెల్ థీఫ్’ సినిమాకు పాడిన ‘దిల్ పుకారే ఆరె ఆరె ఆరె’ అనే పాట వారిద్దరూ సంధి తరువాత పాడిన ప్రథమ పాటగా చెప్తారు. పలు ఇంటర్వ్యూల్లో లత, ఎస్డీ బర్మన్ తమ మధ్య సంధి కుదిర్చినట్టు చెప్పింది. అంతేకాదు, రఫీ తనకు క్షమార్పణ పత్రం ఇచ్చాడని కూడా చెప్పింది. ఇది కూడా వివాదానికి దారితీసింది. ఎందుకంటే, ఆ సమయంలో రఫీ ఉచ్చస్థాయిలో ఉన్నాడు. లత కెరీరు దిగజారుతుంది. అలాంటి సమయంలో రఫీ ఎందుకని క్షమార్పణ పత్రం ఇస్తాడు, లతతో పాడేందుకు అని వాదిస్తారు. కానీ రఫీ స్వభావం తెలిసిన వారికి ఇందులో ఆశ్చర్యం ఏమీ కలగదు. రఫీ సౌమ్యుడు. వాదాలు, వివాదాలకు దూరం. ‘పడ్డ వాడెప్పుడూ చెడ్డవాడు కాద’ని నమ్మేవాడు. కాబట్టి సన్నిహితులు ఒత్తిడి చేస్తే, క్షమార్పణలు రాసి ఇచ్చినా ఇచ్చి ఉంటాడు. కానీ రఫీ మరణీంచిన 39 ఏళ్ళ తరువాత లత ఇలా మాట్లాడటం, లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. లతను విమర్శించేందుకు వీలు కల్పిస్తుంది. ఏం జరిగిందో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది కల్పననో తెలియదు కానీ లత, రఫీ కలసి పాడటం మళ్ళీ 1966 నుంచి ఆరంభమయింది. ఇప్పటికీ ఇద్దరి పాటలలో మాధుర్యం తగ్గలేదు కానీ, వారిద్దరితో యుగళ గీతాలు పాడించటం తగ్గింది. 1966 తరువాత లక్ష్మీ ప్యారే వారిద్దరితో అధికంగా యుగళ గీతాలు పాడించిన సంగీత దర్శకులు. వారికి లత దేవత, రఫీ దైవం!

లత జైకిషన్ పాటలు మాత్రం పాడటంతో సినీ పరిశ్రమలో శంకర్ జైకిషన్‍ల నడుమ వివాదాలు సృష్టించే వారి పని సులువయింది. ప్రతి హిట్ పాటను జైకిషన్‍కి ఆపాదించి, శంకర్‌ను తక్కువ చేయటం ఆరంభించారు. శంకర్ ఇదేదీ పట్టించుకోకుండా, శారదతో పాడిస్తూ పోయాడు. ‘సూరజ్’లో శారద పాడిన ‘తిత్లి ఉడి’ పాట, ఆ సినిమాలోని రఫీ పాట ‘బహరో ఫూల్ బర్సావో’తో పోటీ పడి, దాని సరసన నిలిచిందంటేనే శంకర్ ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. శారద గొంతులోని బలహీనతలను గమనించి, వాటిని తన ఆర్కెస్ట్రాతో కప్పిపుచ్చి, అత్యద్భుతమైన రీతిలో పాటను రూపొందించాడు శంకర్ జైకిషన్. కానీ అదే సినిమాలో శారద పాడిన మరో పాట ‘దేఖో మేర దిల్ మచల్ గయా’ వినటానికి పరవాలేదనిపించినా, తెరపై చూస్తుంటే నచ్చదు. శారద పాడిన రెండు పాటలు వైజయంతి మాలకు నప్పలేదు. సినిమాలో ఈ రెండు పాటలు అభాసు పాలయ్యాయి. కానీ శంకర్, ఇవేవీ పట్టించుకోలేదు. శారద కోసం ప్రత్యేకంగా సులువైన బాణీలు కడూతూ, అత్యద్భుతమైన ఆర్కెస్ట్రేషన్ జతపరుస్తూ పాటలను హిట్ చేయాలని ప్రయత్నించాడు. పాటలు అకర్షణీయంగా ఉంటాయి వినే వరకూ. కానీ చూసేందుకు బాగుండవు. వినేప్పుడు కూడా పలు పదాలు అస్పష్టంగా పలకటం, కంఠం చెవిని బాధించేలా ధ్వనించటంతో శంకర్ ఎంత ప్రయత్నించినా శారద, పరిమిత పరిధిలోనే మిగిలిపోయింది. కానీ ఇందువల్ల శంకర్ ప్రతిభకు మచ్చ తగిలింది. ఇద్దరు ప్రతిభావంతులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం వల్ల వారి సృజన ఉచ్చస్థాయిలో ఉంటుంది. కానీ ఒక ప్రతిభావంతుడైన కళాకారుడు, పరిమిత ప్రతిభ కల కళాకారుడికి తగ్గట్టు తన ప్రతిభను కుదించుకోవటం వల్ల పరిమిత ప్రతిభ కల కళాకారుడికి లాభం లేకపోగా, ప్రతిభావంతుడు కూడా నష్టపోతాడు. లత మంగేష్కర్ కోసం సంక్లిష్టమైన బాణీలు రూపొందించిన శంకర్ శారదకు తగ్గట్టు బాణీలు రూపొందిస్తూ తనకు తాను అన్యాయం చేసుకున్నాడు. మరోవైపు శంకర్ జైకిషన్‍ల విభేదాలు వారి సృజనపై ప్రభావం చూపించటంతో వారి పాటల నాణ్యత తగ్గటం మొదలైంది. పెద్ద బ్యానర్లన్నీ శంకర్ జైకిషన్‍లను వదలి వెళ్ళటంతో, నాణ్యమైన నిర్మాణ సంస్థలు కరువయ్యాయి. దీనికి తోడు శంకర్ జైకిషన్‍లు విచక్షణారహితంగా, ప్రతి సినిమా అవకాశానికీ ఒప్పేసుకోవటంతో, వారి సినిమాల నాణ్యత దెబ్బతిన్నది. సినిమా నిర్మాణం ఆలస్యం అవటం వల్ల సినిమాల విలువ దెబ్బతిన్నది. దీనికి తోడు శారద పాడిన ప్రతి సినిమా శంకర్ సినిమాగా, లత పాడిన ప్రతి సినిమా జైకిషన్‍దిగా వేరు చేసి విశ్లేషకులు పోలుస్తుండటం కూడా శంకర్ జైకిషన్‍ల సృజనను దెబ్బతీసింది. ఇంతలో 1966లో శైలేంద్ర మరణించాడు. దాంతో శంకర్ జైకిషన్ సంగీత భవంతిని నిలిపిన నాలుగు స్తంభాలలో ఒక స్తంభం కూలిపోయింది.

తమ నడుమ విభేదాల వల్ల బాధతో, సరైన సినిమాలు లభించటం లేదన్న వేదనతో, చుట్టూ చేరిన మిత్రుల సలహాలు, సూచనలు, వ్యాఖ్యాలతో మానసికంగా జైకిషన్ క్రుంగిపోయాడు. తాగుడుకి బానిస అయ్యాడు. చివరికి 1971 లో అతను రూపొందించిన ‘జిందగీ ఏక్ సఫర్ హై సుహానా’ అన్న పాట దేశమంతా మార్మోగుతున్న సమయంలో ‘సిర్రోసిస్ ఆఫ్ లివర్’ తో అతి చిన్న వయసులో జైకిషన్ మరణించాడు. శంకర్ జైకిషన్ భవంతి మరో స్తంభం కూలిపోయింది. ఇదే సమయానికి సినీ రంగంలో పలు మార్పులు సంభవించాయి. కొత్తతరం నాయకులు, నిర్మాతలు రంగ ప్రవేశం చేశారు. సినీ నిర్మాణ రూపురేఖలు మారసాగాయి. శంకర్ , జైకిషన్ మరణం నుంచి తేరుకునేలోగా పరిస్థితులు మారిపోయాయి.

ఆర్డీ బర్మన్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వంటి యువ సంగీత దర్శకులు ముందుకు వచ్చారు. రాజేష్ ఖన్నా, వినోద్ మెహ్రా, రాజేష్ రోషన్, రణధీర్ కపూర్ వంటి యువ నటులు తెరపైకి వచ్చారు. ‘మేరా నామ్ జోకర్’, ‘కల్ ఆజ్ ఔర్ కల్’ సినిమాలు విఫలమవటంతో రాజ్ కపూర్ ‘బాబీ’ కోసం లతతో సంధి చేసుకుని లక్ష్మీ ప్యారేను సంగీత దర్శకులుగా ఎన్నుకున్నాడు. దాంతో శంకర్ జైకిషన్ సంగీత భవంతి కుప్పకూలింది. హిందీ సినీ సంగీత ప్రపంచం స్వర్ణయుగం అంతమయింది. శంకర్ జైకిషన్‍‌ను పడగొట్టడానికి మొత్తం సినీ పరిశ్రమ ఏకమవ్వాల్సి వచ్చింది. అయినా శంకర్ జైకిషన్‍ ఆగిపోలేదు. తన దగ్గర ఏ పెద్ద బ్యానర్ లేకపోయిన తన ప్రతిభపై విశ్వాసంతో శంకర్, శంకర్ జైకిషన్ పేర సంగీతం ఇస్తూ పోయాడు. లతతో రాజీపడి ‘సన్యాసి’ సినిమాను కేవలం తన సంగీతంతో సూపర్ హిట్ చేశాడు. కానీ విచక్షణా రహితంగా అంతకు ముందు ఒప్పుకున్న తక్కువ స్థాయి నిర్మాతల సినిమాల బరువు క్రింద శంకర్ జైకిషన్ అదృష్టం నలిగిపోయింది. తరువాత శంకర్ ఒంటరిగా ఎన్ని అద్భుతమైన పాటలను రూపొందించినా, ఆయన పనిచేసిన సినిమాలు తక్కువ స్థాయివి కావటం, అవి చాలా ఆలస్యంగా విడుదలవటం వల్ల పాటలు ప్రజాదారణ పొందలేదు. ఒక అత్యద్భుతమైన సంగీత దర్శకుడు అనామకంగా మరణించాడు. శంకర్ మరణించిన తరువాత రోజు కానీ ప్రపంచానికి అతని మరణవార్త తెలియలేదు.

లత శంకర్ జైకిషన్‍కు పాడనని, తరువాత జైకిషన్‍కు మాత్రమే పాడతానని పంతం పట్టడం వల్ల కాదు శంకర్ జైకిషన్ దెబ్బతిన్నది. వారిద్దరి నడుమ విభేదాల వల్ల, అహంకారం వల్ల, విధి ఆడిన వింత నాటకం వల్ల శంకర్ జైకిషన్‍లు దెబ్బతిన్నారు. శంకర్ అధికంగా గేయ రచయిత శైలేంద్రతో పనిచేసేవాడు. జైకిషన్ అధికంగా హస్రత్ జైపురితో పనిచేసేవాడు. విధి శైలేంద్రను, జైకిషన్‍ను తీసుకుని పోయి శంకర్‍నూ, హస్రత్‍నూ మిగిల్చింది. శైలేంద్ర మరణం తరువాత శంకర్ దాదాపుగా నలభై పైగా గేయ రచయితలతో కలసి పనిచేశాడు. కానీ ఎవ్వరితోనూ శైలేంద్రతో కుదిరినట్టు కుదరలేదు. ఇది కూడా శంకర్ సృజనపై ప్రభావం చూపించింది.

శంకర్ జైకిషన్‍లకు పాడకపోవటం వల్ల లత కూడా నష్టపోయింది. శంకర్ జైకిషన్‍ల స్థాయిలో, అంత నాణ్యంగా, అంత అద్భుతంగా, అలౌకికానందం కలిగించే రీతిలో పాటలను రూపొందించే సంగీత దర్శకుడు మరొకరు లేకపోవటంతో మళ్ళీ తన కెరీర్‍లో లతకు శంకర్ జైకిషన్‍ల స్థాయి పాటలు లభించలేదు. హిట్ పాటలు పాడింది కానీ , శంకర్ జైకిషన్ పాటలతో పోలిస్తే, నాణ్యత విషయంలో ఓ మెట్టు పాడింది తక్కువనే ఉంటాయి ఈ పాటలు. ఒకటా రెండా, శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో 457 పాటలు పాడింది లత. ఇంతకన్నా ఎక్కువ 662 పాటలు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వంలో పాడింది. కానీ ‘ఘర్ ఆయా మేర పర్దేశీ’, ‘యే షామ్ కీ తన్హాయియాన్’, ‘రసిక్ బల్‌మా’, ‘చంద్రమా మద్ భరా’, ‘తెరా జానా’, ‘తేరా మేరా ప్యార్ అమర్’, ‘బేదర్దీ బాల్‌‌మా’, ‘ముఝే తుమ్ మిల్ గయా హమ్‌దమ్’, ‘మేరే తుమ్హారే బీచ్ మే’, ‘ఆజ్ రూఠ్ కర్ ఆబ్’, ‘తేరే బినా జియ జాయెనా’, ‘ఏక్ చెహెరా’ మన్ రే తూహి బతా క్యా గావూన్, హం తేరే ప్యార్ మె సారా ఆలం, జీనా ముఝ్ కో రాస్ న ఆయా, తన్ మన్ తేరే అంగ్ రంగూంగీ, మన్ మోహనా బడే ఝూఠే, మిటీ సె ఖేల్ తే హో, కిసీ నె అప్నా బనాకే ముఝ్ కో,  తుం ముఝే యూన్ భులా న పావోగే, తో సహా ఇంకా పలు పరమాద్భుతమైన పాటలు లతకు మరో సంగీత దర్శకుడు రూపొందించలేదు. శంకర్ జైకిషన్‍తో విభేదించి వారికి పాడకపోవటం వల్ల శంకర్ జైకిషన్ నష్టపోయారు, లత నష్టపోయింది, శ్రోతలు నష్టపోయారు, హిందీ సినీ సంగీత పరిశ్రమ అమూల్యమైన రత్నాల్లాంటి పాటలను కోల్పోయింది. 1970 దశకం వచ్చేసరికి స్వర్ణయుగంపై తెర దిగుతోంది. లత అందుకు తగ్గట్టు తన తన గాన సంవిధానాన్ని మార్చింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here