[dropcap]అ[/dropcap]జీ సోణియా చ దిను , వర్షే అమృతా చ ఘన్!
హరి పాహిలారే, హరి పాహిలారే, హరి పాహిలారే!
భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన సమయంలో దేశం నలుమూలలా, భారతీయ ధర్మాన్ని సామాన్యులకు చేరువ చేసి, ధర్మం పట్ల గౌరవం, విశ్వాసం కలిగించే ఉద్యమం స్వచ్ఛందంగా సంభవించింది. ఆ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన మహానుభావుడు సంత్ జ్ఞానేశ్వర్. భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించి ప్రజలకు చేరువ చేశారాయన. భగవధ్యానానుభూతి వల్ల కలిగే అలౌకికానందాన్ని ‘అమృతానుభవం’ రూపంలో సామాన్యులకు ధర్మాన్ని చేరువ చేశారు. ‘అభంగ్’ (కీర్తనల) రూపంలో అత్యంత క్లిష్టమైన తాత్త్విక సిద్ధాంతాలను, అత్యంత గహనమైన సత్యాలను, లోతైన ఆధ్యాత్మిక అనుభూతులను ప్రజలకు చేరువ చేశాడు సంత్ జ్ఞానేశ్వర్. ఆయన రాసిన అనేక అభంగ్‍లను ‘జ్ఞానేశ్వర్ మౌళి’ పేరుతో లతామంగేష్కర్ పాడింది. సంత్ జ్ఞానేశ్వర్ ‘అభంగ్’లను మరాఠా సరిహద్దులను దాటించి సమస్త భారతీయులకు చేరువ చేసింది లతా మంగేష్కర్. సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీత రచన చేయగా లతా మంగేష్కర్ తన ఆత్మతో గానం చేసిన అమృత వర్షపు బిందువుల మాలికలు ఈ అభంగులు . ఇవి సినిమా పాటలు కావు. లత ప్రైవేటుగా పాడిన పాటలు. 1970 దశకంలో మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా లతా మంగేష్కర్ తన గాన సంవిధానాన్ని రూపాంతరం చెందించిన విధానం గురించి చర్చించే కన్నా ముందు సినిమాలో పాటలు పాడుతూ అత్యున్నత స్థానం చేరిన తరువాత కూడా లతలో రగులుతున్న అసంతృప్తి ఆమెను – సాధించిన ఉన్నత స్థానంతో, పొందుతున్న గౌరవంతో, లభిస్తున్న ఆదరణతో సంతృప్తిగా ఉండనీయలేదు. తన గాన తృష్ణను లత ప్రైవేటు పాటల ద్వారా సంతృప్తి పరచుకునే ప్రయత్నం చేసింది.
‘విభేందు తివారి’ ప్రకారం 1947లో ఆచార్య సీతారామ్ చతుర్వేది గేయ రచనకు హరేంద్రనాథ్ నంది సంగీతం కూర్చిన భగవాన్ బుద్ధ అనే ‘బాలే’లోని పాటలు లత పాడిన తొలి సినిమాయేతర పాటలు. ఆ తరువాత లత సినిమా పాటలు పాడటం, సినీ రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవటంలో నిమగ్నమయింది. కానీ లతకు సినిమా పాటల పట్ల ఆరంభం నుంచీ అసంతృప్తి ఉంది. ఆమెకు శాస్త్రీయ సంగీత విద్వాంసురాలుగా నిలవాలన్నది ఆకాంక్ష. కానీ పరిస్థితుల ప్రభావంతో ఆమె సినిమా పాటలు పాడటం పైనే దృష్టిని కేంద్రీకరించాల్సి వచ్చింది. కనీసం శాస్త్రీయ సంగీత సాధన చేసే సమయం కూడా ఆమెకు ఉండేది కాదు. దాంతో వివిధ రాగాల ఆధారంగా తయారైన సినిమా పాటలు పాడుతూ అదే సంగీత సాధనగా భావించి సంతృప్తి చెందేది. కానీ సినిమా పాటల పట్ల లతకు తీవ్రమైన అసంతృప్తి ఉండేది.
సినిమా పాటలు సందర్భానికి తగ్గట్టు ఉండాలి. పాటలను పాడే సమయంలో పాత్ర వ్యక్తిత్వాన్ని నటి హావభావాలను గుర్తుంచుకుని పాడాలి. అంటే సినిమా పాట పాడటంలో గాయనీ గాయకులకు పలు పరిమితులుంటాయి. కొన్ని పరిధులలో ఒదిగి పాడాల్సి ఉంటుంది. మూడు, నాలుగు నిమిషాల్లో సందర్భోచితమైన భావాలు ప్రదర్శిస్తూ ప్రజలను మెప్పించాల్సి ఉంటుంది. కానీ ప్రైవేటు పాటల్లో ఇలాంటి పరిమితులుండవు. గాయనీ గాయకులకు స్వేచ్ఛ ఉంటుంది. అందుకని సినిమా పాటలు పాడుతూ కూడా, లత, సమయం సమయం చిక్కినప్పుడల్లా సురదాసు భజనలు, కబీర్ గీతాలు, మీరా భజనలు పాడి రికార్డు చేస్తూ వచ్చింది. సినిమా పాటల వల్ల కలిగిన ప్రజాదరణ వల్ల ఈ పాటల పట్ల ప్రజలకు ఆకర్షణ కలిగింది. పాటలు విన్న తరువాత లత స్వరం సృజించిన మధుర సుధారస ప్రవాహంలో ఓలలాడుతూ ధార్మిక అనుభూతుల ప్రపంచంలోకి అడుగు పెడతారు శ్రోతలు.
1954లో వసంత ప్రభు సంగీత దర్శకత్వంలో ‘మై నహి మాఖన్ ఖాయో’ అనే సూరదాసు భజన, కబీర్ భజన ‘దిల్ ధార్వే సో ఏక్ న్యారీ హై’ లను లత అద్భుతంగా పాడింది. ఈ పాటలు ఎంతో సంతృప్తి నివ్వటంతో లత దృష్టి ఇలాంటి భక్తి గీతాలు, భజన గీతాల వైపు మళ్ళింది.
తాను పాడే భజనలు, కీర్తనలకు సంగీత దర్శకత్వం వహించే బాధ్యతను సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్‍కు అప్పగించింది లత. హృదయనాథ్ మంగేష్కర్‍కు ఆరంభం నుంచి సంగీతం పట్ల ఆసక్తి. ఆయన బాణీలు శాస్త్రీయ సంగీత ఆధారితం. అతను సృజించే బాణీలు అద్భుతంగా ఉంటాయి. కానీ సినిమా పాటలకు అంతగా పనికి రానివిగా ఉంటాయి. సినిమా పాటల బాణీలు ఆకర్షణీయంగా ఉండాలి. శరీరాన్ని తప్పనిసరిగా ఊపాలి. హృదయనాథ్ బాణీలు ఆత్మను స్పందింప చేసేంత శక్తిమంతంగా ఉంటాయి. శరీరాన్ని విస్మరించి ఆత్మ ఆనందనాట్యాలుచేసే రీతిలో వుంటాయి. హృదయనాథ్ మంగేష్కర్‍కు సినీ సంగీత దర్శకులందరితో సత్సంబంధాలు ఉండేవి. ఆయన శాస్త్రీయ సంగీత విద్వాంసులతోనూ సన్నిహితంగా ఉండేవాడు.
‘బైజు బావరా’ సినిమాలో ఆరంభంలో వచ్చే ‘దాసోతేరే రామ్’ పాటలో కోరస్‍గా పాడేడు. 1957లో 18 ఏళ్ళ వయసులో లతా మంగేష్కర్ కోసం ఆయన మీరాబాయి, సూరదాసు భజనలకు అత్యంత సుందరమైన బాణీలను కూర్చాడు. మీరా భజన ‘బర్సే బూందియాన్ సావన్ కీ’ లత స్వరంలో వింటుంటే ప్రేమ బిందువులు మనస్సనే ఆకాశంలో కురిసిన భావన కలుగుతుంది. సూరదాసు భజన ‘నిస్ దిన్ బర్సత్ నైన్ హమారీ’ పాటను పలువురు పాడేరు. కానీ లత పాడిన పాట వింటుంటే భగవద్దర్శనం కోసం మనసు పడే తపన అశృవుల రూపం ధరించి కళ్ళనుండి ప్రవహిస్తాయి.
ఇలా భజనలు అతి సుందరంగా పాడుతూ లత తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజిని సాధించింది. సినిమా పాటలు పాడటంలో కూడా తక్కువ స్థాయి పాటలు, ద్వంద్వార్థ పాటలు పాడకుండా ‘లత పాడాలంటే ఒక స్థాయి ఉండాలి పాటలకు’ అన్న ఇమేజిని స్థిరపరచుకుంది. లత అత్యుత్తమంగా ఉన్న పాటలే పాడుతుంది అన్న భావన సినీ కళాకారులలోనే కాదు, సామాన్య ప్రజలలో కూడా స్థిరపడింది. దాంతో సంగీత దర్శకులు లత తమ పాట పాడేందుకు ఒప్పుకోవటమే ఒక గౌరవంగా భావించటం ఆరంభించారు. లతా మంగేష్కర్‍ను మెప్పించే బాణీని సృజించి లతతో పాడించేందుకు ప్రతి సంగీత దర్శకుడు తపన పడ్డాడు. ఆరంభం నుంచీ చివరి వరకూ లత కోసం బాణీలను ప్రత్యేకంగా రూపొందించేవారు. ఆ బాణీ లతనే పాడాలి అని లతను ఒప్పించేవారు. లత కెరీరు ఆరంభ దశలో సంగీత దర్శకులు లత ప్రతిభను గౌరవించారు. లతతో తమ కెరీరును ఆరంభించిన సంగీత దర్శకులు లత ప్రతిభకు, తమ ప్రతిభను జోడించి తమ కెరీర్లను ఉచ్చస్థాయిలో నిలుపుకున్నారు. లతను అగ్రస్థానంలో నిలిపేరు. ఆ తరువాత వచ్చిన సంగీత దర్శకులు లతను దైవంలా కొలిచారు. లత తమ పాట పాడటమే భాగ్యంగా భావించారు. 1950 నుండి 1960 నడుమ లత తన కెరీరును నిర్మించిన తీరు, ఒక పద్ధతి ప్రకారం తనకు ఇమేజిని ఏర్పరచుకున్న తీరు ఇందుకు కారణం.
లత స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళి చదువుకోకున్నా, ఇతరుల కన్నా వెనుకబడి ఉండకూడదన్న పట్టుదల ఆమెతో హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీ సాహిత్యం శ్రద్ధగా పఠించేట్టు చేసింది. పాటలకూ కవితలకూ దగ్గర సంబంధం ఉండటంతో లత కవితలను అత్యంత జాగ్రత్తగా, శ్రద్ధగా అధ్యయనం చేసింది. గజళ్లను ఆకళింపు చేసుకుంది. ఫలితంగా పాటలలో కవులు చేసే చమత్కారాలను అర్థం చేసుకోవటమే కాదు, పాటలను పాడే సమయంలో కీలకమైన భావాలు మరింత ప్రస్ఫుటమయ్యే రీతిలో పాడి గేయం విలువను మరింత పెంచేది. అందుకని కూడా గేయ రచయితలు లత కోసం ప్రత్యేకంగా అందమైన పదాలు ఏరి కూర్చి దేవతకు పూల మాలలర్పించినట్టు అత్యుత్తమ భావాల మాలికల కవితలు అర్పించేవారు. ఈ రకంగా అత్యుత్తమ కళాకారుల అత్యుత్తమ సృజన లత అత్యున్నత శిఖరాలు అతి సునాయాసంగా అధిరోహించటంలో తోడ్పడింది. లత పాడిన ప్రైవేటు గీతాలు కూడా ఈ నిజాన్ని నిరూపిస్తాయి.
1961లో ఉస్తాద్ ఫయ్యాద్ అహ్మద్ ఖాన్, ఉస్తాద్ నియాజ్ అహ్మద్ ఖాన్‍లు లత కోసం ప్రత్యేకంగా గాలిబ్ గజళ్ళకు బాణీలు రూపొందించారు. ‘హర్ ఏక్ బాత్ పే’, ‘దో హర్ మె నక్ష్ -ఎ – వఫా’ అనే ఈ రెండు గజళ్ళు లత మనసుతో పాడిందనిపిస్తుంది. అతి క్లిష్టమైన ఉర్దూ పదాలను లత ఎంతో విస్పష్టంగా, అత్యంత సుందరంగా ఆ పదాల సౌందర్యం ఇనుమడించే విధంగా పలుకుతుంది.
1962లో లత ప్రస్తుతం మంగేష్కర్ కుటుంబం నివసిస్తున్న ‘ప్రభుకుంజ్’ ఇంటిని కొన్నది. “నేను అంతవరకూ కొన్న ఫ్లాట్లను అమ్మేసి అంతవరకూ జమ అయిన సొమ్మును కలిపి ప్రభుకుంజ్ ఇంటిని కొన్నాను’ అని చెప్పింది లత ఓ ఇంటర్వ్యూలో. 1962 కల్లా లత చెల్లెళ్ళు, తమ్ముడు ఒక స్థాయికి వచ్చారు. ఉషా, మీనా మంగేష్కర్లు సినిమాల్లో పాటలు పాడటం ఆరంభించారు. ముఖ్యంగా ఉషా మంగేష్కర్ మరాఠీ సినిమాల్లో చక్కటి పాటలు పాడుతూ మంచి పేరును సాధించింది. హృదయనాథ్ మంగేష్కర్ సంగీత ప్రపంచంలో గౌరవ స్థానం సాధించాడు. అంటే 1944 నుంచి లత ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని సినిమా పాటలు పాడడం ద్వారా కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకు వచ్చిందన్నమాట.
ఈ సమయంలో ఆమె దృష్టి సంఘసేవ వైపు మళ్ళింది. వీర సావర్కర్‍ను కలసి తన ఉద్దేశాన్ని బహిర్గతం చేసి సలహా అడిగింది. “నువ్వు పుట్టింది పాటలు పాడటం కోసం. భగవంతుడిచ్చిన ప్రతిభను ఉపయోగించి ప్రజలను ఆనందిపచెయ్యి. అలా సంపాదించిన ధనాన్ని సమాజ సేవకు వినియోగించు” అని సావర్కర్ సలహా ఇచ్చారు. ఆమె ఆ సలహాను తూ.చ. తప్పకుండా పాటించింది. తాను సంపాదించిన ధనాన్ని ప్రజోపయోగ కార్యకలాపాల్లో వినియోగించింది. ఈ సమయంలోనే ఆమె ‘హే హిందూ నృసింహా’ అన్న సావర్కర్ గీతాన్ని పాడింది. ఈ పాట గురించి చెప్తూ లత ‘వీర సావర్కర్ ఈ పాటను ఛత్రపతి శివాజీకి నీరాజనం అర్పిస్తూ రచించారు. ఈ పాట నాకు చాలా ఇష్టమైనది. ఎందుకంటే నేను ఛత్రపతి శివాజీ జీవితం వల్ల అత్యంత ప్రేరణ పొందాను. ఈ పాటలో సావర్కర్ శివాజీ జీవితాన్ని ఎద ఉప్పొంగే రీతిలో వర్ణించారు. నేను మరాఠీలో, సంపూర్ణ శివాజీ గీతాలతో ‘శివ్ కళ్యాణ్ రాజా’ అనే అల్బమ్‍ను విడుదల చేశాను. ఈ ఆల్బమ్‍లో సమర్థ గురు రామదాసు (శివాజీ గురువు) పదాలు కూడా ఉన్నాయి. మిగతా పాటలలో అధిక భాగం సావర్కర్, కుసుమాగ్రజ్‍లు రాసినవి ఉన్నాయి. మరాఠీలో శివాజీ జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసిన చరిత్రకారుడు, రచయిత ‘బాబా సాహెబ్ పురంధరీ’. ఆయన ఈ సావర్కర్ పాట ‘హే హిందూ నృసింహ’ పై ఈ ఆల్బమ్‍లో వ్యాఖ్యానించాడు” అని చెప్పింది లత. తనకు ‘అత్యంత సంతృప్తిని ఇచ్చిందీ ఆల్బమ్’ అని కూడా చెప్పింది.
హే హిందూ శక్తి-సంభూత-దీప్తితం తేజా
హే హిందూ తపస్యా పూత ఈశ్వరీ ఓజా
హే హిందూ సౌభాగ్యభూతిచ్యా సాజా
హే హిందూ నృసిమ్హ ప్రభో శివాజీ రాజా , అంటూ సాగే ఈ పాటలో లత అత్యంత ఉద్వేగ భరితంగా, ఆవేశంగా దేశభక్తి ప్రేరేపితంగా పాడి ప్రజలను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా శివాజీరాజా అంటూ లత రాగయిక్తంగా హైపిచ్‌లో పాడుతూంటే హృదయం ఉప్పొంగుతుంది. లతా మంగేష్కర్ జీవితంలో ఇక ఏపాట పాడకున్నా, ఈ ఒక్కపాటతో మరాఠీ ప్రజలు లతకు జీవితాంతం నీరాజనాలర్పిస్తారు. అంతగా ప్రజాదరణ పొందిందీపాట. లత పాటపాడే ఏ మరాఠీ పాటల కార్యక్రమమైనా, ఈ పాట లేనిదే సంపూర్ణం కాదు. “జయోస్తు తే శ్రీ మహాన్మంగళే” అన్న సావర్కర్ పాటకు బాణీకట్టటం వల్ల, హృదయనాథ్ మంగేష్కర్ దూరదర్శన్లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కానీ, ఇదేపాటను లత దూరదర్శన్లో పాడి అందరినీ మెప్పించింది. సావర్కర్ మరోపాట “సాగరా ప్రాణ్ తళ్మళాళ “సైతం హృదయనాథ్ బాణీలో, లత స్వరంలో ప్రాణం పోసుకుని స్వతంత్ర వీర సావర్కర్‌ను మరాఠీ సాహిత్య ప్రపంచంలో అత్యున్నత స్థానానికి చేర్చాయి. ప్రజల గుండెలోతుల్లో సావర్కర్ రగిలించిన దేశభక్తి జ్వాలలను సజీవంగా వుంచాయి.
లత మంగేష్కర్ వ్యక్తిత్వంలో కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది దైవభక్తి, సాంప్రదాయ భక్తితో పాటు దేశభక్తి కూడా. లతకు శివాజీ, రాణా ప్రతాప్ లంటే అమితమైన గౌరవం, భక్తి. వారి జీవితాల నుంచి తానెంతో ప్రేరణను పొందేనని లత పలు సందర్భాలలో స్పష్టం చేసింది. అందుకే ఆమె సినిమాల్లో దేశభక్తి పాటలను ప్రత్యేక ఉత్సాహంతో, ఆవేశంతో పాడుతుంది. ఆనంద్ మఠ్‍లో ‘వందేమాతరం’ పాట ఇందుకు చక్కని ఉదాహరణ. ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ సినిమాలో ‘ఓ పవన్ వేగ్ సే ఉడ్ నే వాలే ఘో డే’ పాటను లత ఎంత ఆవేశంతో, ఉద్వేగంతో పాడిందంటే ఆ సినిమా పేరు తెలియని వారికి కూడా పాట తెలుస్తుంది. ఈ రకంగా దేశభక్తి గీతాలు, భజనలు, అభంగ్‍లు పాడుతూ లత ఇతర గాయనీ గాయకుల కన్నా ప్రత్యేక ఇమేజ్‍ని సాధించింది. ఆమె సినిమా పాటల్లోని శాస్త్రీయ రాగ ఆధారిత పాటలను పాడిన తీరుకు ముగ్ధులై పలువురు సంగీత విద్వాంసులు కూడా లతను అభిమానించటం ప్రారంభించారు.
ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ తన అభిమాన గాయని లత మంగేష్కర్ అని నిర్ద్వందంగా ప్రకటించటమే కాదు, ఆమె ‘అస్మాన్ పే ఆయి హూవీ పరి’ (ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవదూత) అని అన్నాడు. ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ కూడా తనకు లత స్వరం నచ్చుతుందని ప్రకటించటమే కాదు తాను సంగీత దర్శకత్వం వహించిన సినిమాల్లో లతతో పాడించాడు.
అలీ అక్బర్ ఖాన్, అల్లావుద్దీన్ ఖాన్‍ల గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అల్లావుద్దీన్ ఖాన్‍కు తన కొడుకు అలీ అక్బర్ ఖాన్ సినిమాల్లో పనిచేయటం ఇష్టం లేదు. 1952లో ‘అంధియాన్’ అన్న ఆలీ అక్బర్ ఖాన్ సంగీత దర్శకత్వం వహించిన సినిమా విడుదలయింది. అతి బలవంతం మీద ఆ సినిమా చూసేందుకు వెళ్ళాడు అల్లావుద్దీన్ ఖాన్. సినిమాలో ఆరంభమే లత పాడిన ‘హై కహీన్ పర్ షాద్‌మానీ’ అన్న పాట వస్తుంది. ఆ పాట విని సంతృప్తిగా నవ్వుతూ “సినిమా సంగీతం ఇంత స్థాయిలో ఉంటే నువ్వు సినిమాల్లో పని చేస్తే నాకు అభ్యంతరం లేదు” అన్నాడట అల్లావుద్దీన్ ఖాన్. లత ప్రతిభ అలాంటిది.
లత సినీరంగంలో ఉచ్చస్థాయి చేరక ముందు నుంచి కూడా లత గాన సంవిధానంలోని శాస్త్రీయ సంగీత పోకడలను గుర్తించి పలువురు శాస్త్రీయ సంగీత విద్వాంసులు లతను ఆదరించారు, గౌరవించారు. 1950-51లో లత సంగీత సభలో పాడేందుకు వారణాసి వెళ్ళింది. ఆ సమయంలో లతను వారాణాసికి చెందిన సిద్ధేశ్వరీ దేవి అమితంగా ఆదరించింది. వారణాసికి చెందిన ప్రత్యేక గీతాలను లతకు పాడి వినిపించింది. ఆ సమయంలో సిద్ధేశ్వరీ దేవి, గిరిజాదేవిలతో లతకు ఏర్పడిన స్నేహం జీవితాంతం కొనసాగింది.
ఉస్తాద్ గులామ్ ఆలీఖాన్‍తో లత స్నేహం అపురూపమైనది. తాను సినిమా నేపథ్య గాయని కాకుండా ఉంటే ఉస్తాద్ గులామ్ ఆలీఖాన్ సాహెబ్‍లా పాడాలని ప్రయత్నించేదాన్నని లత పలు సందర్భాలలో చెప్పింది. ఆయన పాడిన ఠుమ్రీలంటే లతకు ప్రాణం. ఖాన్ సాహెబ్‍కు కూడా లత పాటలంటే ఎంతో ప్రీతి. లత పాటలు పాడే విధానాన్ని ఆయన ఎంతో ప్రశంసిస్తారు. 1962లో కలకత్తాలో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో పాడేందుకు లత కలకత్తా వెళ్ళింది. అక్కడ సభలో ఖాన్ సాహెబ్ పాడాలి. ఆయన లతను తన సరసన కూర్చుని పాడమని ఆహ్వానించారు. కానీ ఖాన్ సాహెబ్ పక్కన కూర్చుని పాడే అర్హత తనకు లేదని, ఆయనతో కలసి పాడేకన్నా ఆయన పాట వినేందుకే తాను ఇష్టపడతానని ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించింది. బొంబాయిలో అవకాశం దొరికినప్పుడల్లా ఖాన్ సాహెబ్ ఇంటికి వెళ్ళి ఆయన సాధన చేస్తుంటే చూసేది. బడే గులామ్ అలీఖాన్ సాహెబ్ కూడా లతను అమితంగా గౌరవించి, ఆదరించేవాడు. అభిమానించేవాడు. ఈ రకంగా సినీ ప్రపంచంలోనే కాదు, శాస్త్రీయ సంగీత ప్రపంచంలో కూడా లత అందరి గౌరవ మన్ననలందుకుంది. కేవలం సినిమా పాటలకు మాత్రమే పరిమితం కాకుండా లతా మంగేష్కర్ శాస్త్రీయ సంగీత ప్రపంచంతో కూడా సత్సంబంధాలు నెరపి వారి గౌరవ మన్ననలు పొందటంతో లత సినిమా పాటల ఇమేజిని దాటింది. దీనికి తోడుగా లత ప్రైవేటు పాటలు, భజనలు, గజళ్ళు పాడి సినిమాతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన ఇమేజిని సాధించుకుంది . ముఖ్యంగా మీరా భజనలు పాడటంలో లత చూపిన భక్తి శ్రద్ధలు, పాటలు తన్మయమైన భావాన్ని ఉద్దీపింపచేస్తూ పాడిన విధానం లతకు ‘మీరా’ ఇమేజిని సాధించాయి. ఎల్లప్పుడూ శ్వేత వస్త్రాలు ధరించటం, వివాహం తలపెట్టక పోవటం కూడా లతకు మీరా ఇమేజ్‍ను స్థిరపరిచాయి.
మహమ్మద్ రఫీ సైతం తాను పాడుతున్న రొటీన్ పాటలపట్ల అసంతృప్తితో ఖయ్యాం తో కలసి సూరదాసు భజనలను, కబీర్ కీర్తనలను పాడేడు. గజళ్ళు పాడేడు. దేశభక్తి గీతాలు పాడేడు. ముకేష్ సైతం ప్రైవేట్ పాటలు పాడేడు. రామచరితమానస్ ను గానం చేశాడు. మన్నాడే, ఆశాభోస్లేలతో సహా గాయనీ గాయకులు ప్రైవేట్ పాటలు పాడేరు. 1990 దశకంలో లతాకు పోటీగా అనూరాధా పౌఢ్వాల్ భజనలు, ముఖ్యంగా వైష్ణోదేవి భజనలతో ప్రత్యేక ఇమేజీని సాధించాలని ప్రయత్నించింది. కానీ, సినీ నేపథ్య గాయనీగాయకులెవరుకూడా లతామంగేష్కర్ లా సినిమా పాటల ఇమేజీని అధిగమించి విభిన్నమయిన ఇమేజీని సాధించలేకపోయారు.
హృదయనాథ్ మంగేష్కర్ అత్యంత సుందరంగా కుదిర్చిన బాణీలను లత అంతే ఆప్యాయంగా, భక్తి భావంతో గానం చేసింది. మీరా భజనలు పాడాలంటే లతనే పాడాలి అనే స్థాయి నుంచి ‘లతనే మీరాబాయి’ అనిపించే స్థాయికి ఎదిగింది లత మీరా భజనలతో. ఈ పాటలు రికార్డు చేసే సమయంలో లత సినిమా పాటలు పాడలేదు. పూర్తిగా దృష్టిని మీరా భజనపైనే కేంద్రీకరించింది. నిరంతరం మీరా భజనలనే స్మరిస్తూ, సాధన చేస్తూ తానే మీరా అయి కృష్ణుడిని తన భర్తగా, ప్రియుడిగా భావిస్తూ ఆ విరహావేదనలో తపిస్తూ మీరా భజనలను పాడింది లత. రోజుకు ఒక పాట మాత్రమే రికార్డు చేస్తూ మనసా వాచా కర్మణా మీరా భజనే తానయి పోయింది లత. ‘చలా వాహి దేస్’ పేరుతో విడుదలైన ఈ మీరా భజనల ఆల్బమ్, ప్రైవేట్ రికార్డులకు అంతగా ప్రచారం లభించని ఆ కాలంలోనే అత్యంత ప్రజాదారణ పొందింది. సినిమా పాటల కన్నా అధికంగా అమ్ముడు పోయిందీ ఆల్బమ్. ప్రజలలో లతకు మీరా ఇమేజీని స్థిరపరచింది. ఈ పాటల రికార్డింగ్ సందర్భంలో లత అనారోగ్యంతో బాధపడింది. పాటలు పాడటం కోసం నిరంతర శ్రమించటం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. తీవ్రమైన జ్వరంతో బాధపడింది. అయినా సరే, ఎనిమిది రోజులు లత, వదలకుండా మీరా భజనలను తన్మయత్వంతో పాడింది. శారీరకంగా తీవ్రమైన బాధను అనుభవిస్తూ, మానసికంగా మీరా భక్తి భావనను, కృష్ణ దర్శన తపననూ అనుభవిస్తూ, ఆ అనుభూతిని తన స్వరం ద్వారా ప్రకటిస్తూ, మీరా భజనలలోని పదాల భావాన్ని శ్రోతల మనస్సులలో తన స్వర ప్రకంపనల ద్వారా జాగృతం చేస్తూ లత పరమాద్భుతంగా పాడటానికి ప్రత్యక్ష సాక్షి పండిత నరేంద్ర శర్మ. లత చివరి మీరా భజన పాడి రికార్డింగ్ స్టూడియో నుండి బయటకు వచ్చేసరికి పండిత నరేంద్ర శర్మ కళ్ళు తుడుచుకుంటూ కనిపించారు. లత కారణం అడిగింది. “నువ్వెంత బాధను అనుభవిస్తూ మీరా భజనలు పాడావో, ఈ పాటలను వింటూ భక్తి భావ సముద్రంలో మునకలేసే ప్రజలు గుర్తించలేరు” అన్నాడాయన. ఈ సంఘటన సంగీతం పట్ల లతకు ఉన్న శ్రద్ధా భావననే కాదు, సంగీతాన్ని దైవంగా భావించే లత మనస్తత్వాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. తన కళలో లత అన్ని బాధలను, వేదనలను మరచిపోతుంది. ఒక కళాకారుడు తన కళను దైవంలా భావిస్తూ, కళ ప్రదర్శనను దైవార్చనలా భావిస్తూ కళా సాధననే మోక్ష మార్గంలా భావించటం, అందులో బ్రహ్మానందం పొందటం అన్నది సంగీతం పట్ల లత నిబద్ధత నిరూపిస్తుంది. అందుకే పండిత నరేంద్ర శర్మ కళను సృజించే కళాకారుడినీ, ఆ కళ ఒదిగి ఉన్న శరీరంతో ఉన్న మనిషినీ వేరు చేసి చూడాలంటాడు. కళను సృజించే సమయంలో కళాకారుడు తనలో ఒదిగిఉన్న దైవాంశను గుర్తించి, ప్రకటిస్తూంటాడు. ఆ సమయంలో కళాకారుడు దైవం ప్రేరేపితుడు. కళను సృజించిన తరువాత కళాకారుడు మామూలు మనిషి. మామూలు మనుషుల లాగే అసూయ ద్వేషాలు, సంతోష విషాదాలు అతనిలో కనిపిస్తాయి. కాబట్టి కళాకారుడు సృజించిన కళను అనుభవించి ఆనందించే సమయంలో ఆ కళాకారుడిని మనిషిలా చూడవద్దు్, మనిషిని చూస్తున్న సమయంలో అతడి కళను గుర్తు చేసుకోవద్దు అంటాడు నరేంద్ర శర్మ.
1960 దశకంలోనే లత సంగీత దర్శకుడు చిత్రగుప్తతో కలసి లాల్ బహదూర్ శాస్త్రి సతీమణి లలితా శాస్త్రి రచించిన గేయాలను పాడింది. లతా మంగేష్కర్‍ను అత్యంత అభిమానించి, గౌరవించే సంగీత దర్శకుడు చిత్రగుప్త. లత కోసం ప్రత్యేకమైన బాణీలను సృజించి పాటలు పాడించేవాడు చిత్రగుప్త.
చిత్రగుప్త 1946 లోనే స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఎదిగినా ఆయన అధికంగా సి గ్రేడ్ స్టంట్ సినిమాలూ, లేకపోతే పౌరాణిక భక్తి సినిమాలకూ పరిమితమయ్యాడు. 1957లో ‘భాభీ’ సినిమాతో వ్యాపార పరంగా గుర్తింపు పొందాడు. ఆ తరువాత ఎన్నో మంచి పాటలను అత్యుత్తమ స్థాయిలో రూపొందించినా, ఆయన పనిచేసే నిర్మాతలందరూ తక్కువ శ్రేణికి చెందిన వారవటంతో అతడి ప్రతిభను అందరూ గుర్తించి ఆమోదించినా, ప్రతిభకు తగ్గ గుర్తింపు రాలేదాయనకు. కానీ అతని ప్రతిభను గుర్తించి గౌరవించింది లత. చిత్రగుప్త సంగీత దర్శకుడైతే అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పాటలు పాడేది. అందుకే 1963-64 సమయంలో లత సినిమా పాటలతో ఎంత బిజీగా ఉన్నా చిత్రగుప్త సంగీత దర్శకత్వం వహిస్తున్నాడని తెలియగానే లత ఎంతో ఆనందంగా, అద్భుతంగా పాటలు పాడింది. లలిత శాస్త్రి, రచించిన ‘బతాదే కోయీ మోహే’ ‘భోలా భోలా రట్‌తే రట్‌తే’ అనే ఈ రెండు భజనలు ఆ కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన భజనలు.
లత పాడిన ప్రైవేట్ గీతాలను పరిశీలిస్తే కూడా లత తాను పాడే పాటలను ఎంతో శ్రద్ధతో, జాగ్రత్తగా, ఎంచుకున్నదని అర్థమవుతుంది. తాను ఎంతో గౌరవించే స్వతంత్ర వీర సావర్కర్ పాటలను పాడటం ద్వారా ఆయనను గౌరవించినట్టవటమే కాక ఆయన పాటలను కేవలం మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా అందరికీ చేరువ చేసింది లత. మరో వైపు మీరా భజనలు, సూరదాసు కీర్తనలను పాడటం ద్వారా ఈ భజనలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభించేటట్టు చేయటమే కాక తనకంటూ ప్రత్యేక ఇమేజిని సాధించుకుంది. లలితా శాస్త్రి(మాజీ ప్రధానిలాల్ బహదూర్ శాస్త్రి భార్య) భజనల ద్వారా ఆ ఇమేజిని స్థిరపరచుకుంది. అంటే సంగీత పరంగా, సాహిత్య పరంగా అత్యుత్తమ గీతాలను, అత్యుత్తమ స్థాయిలో పాడుతూ తనలోని కళాకారుడిని సంతృప్తి పరచుకుంటూ, తనకు భగవంతుడు ఇచ్చిన కళను సదుపయోగపరుస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహించింది లత.
సూరదాసు, మీరా భజనల ద్వారా లత తన కృష్ణభక్తిని చాటుకుంది. ముఖ్యంగా మీరా భజనలు లతా పాడినవి విన్న ప్రతివారూ లత పూర్వ జన్మలో మీరా బాయి అని నమ్ముతారు. ఈ తరంవారికోసం మీరా మళ్ళీ లతా రూపంలో వచ్చి భజనలతో మరోసారి సమాజాన్ని భక్తి రస ప్రవాహంతో పునీతులను చేసిందని భావిస్తారు.
లతాకు ఉదయపూర్ మహారాణా భాగవత్ సింహ, అతని పుత్రుడు అరవింద సింహలతో సత్సంబంధాలున్నాయి. ఒకసారి లత, సోదరుడు హృదయనాథ్, సోదరి మీనాలతో కలసి ఉదయపూర్ వెళ్ళింది. అప్పుడే మీరా భజనల ఆల్బం విడుదలయి శ్రోతలను కృష్ణభక్తి తరంగాల తాకిడితో అలరిస్తున్నది. లతను సాదరంగా ఆహ్వానించిన రాణా ఉదయ సింఘ్ లతను ఒక అద్భుతమయిన గాయనిగా, ఆధ్యాత్మ అనుభూతి పొందిన గాయనిగా అభివర్ణించి” మీరు కృష్ణుడి అనన్యభక్తులు. మీరు పాడిన మీరా భజనలు నన్నెంతో అలరించాయి. మీ మీరా భజనలు విన్నతరువాత మీకు మా పూర్వీకులు పూజించిన శ్రీకృష్ణ విగ్రహాన్ని చూపించకపోతే నేను ఎంతో నేరం చేసినచేసినవాడినవుతాను” అంటూ, పూజ గదిలోకి తీసుకువెళ్ళి అందమయిన కృష్ణ విగ్రహాన్ని చూపించాడు. “ఇది మీరాబాయి పూజించిన కృష్ణ విగ్రహం. ఈ విగ్రహాన్ని ఎత్తుకునే మీరా భజనలు పాడింది. పూజించింది” చెప్పాడు. ఆరోజు ఆ విగ్రహాన్ని చూస్తూంటే తన కంట నీరు పొంగిందనీ, ఆ దివ్యానుభూతిని ఎప్పటికీ మరచిపోలేనని లతా జతీంద్ర మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సంఘటన లతా పాడిన సూరదాసు, మీరా భజనల ప్రభావాన్నీ, ఆ భజనలు పాడటం వల్ల లతాకు సినీ నేపథ్యగాయని అన్న ఇమేజీని మరపించే ఇమేజీ లభించటాన్నీ స్పష్టం చేస్తుంది.
కళాకారుడు అత్యుత్తమ కళా ప్రదర్శన ద్వారా కళను ఉత్తమ స్థాయిలో నిలపటమే కాదు ఉత్తమ ఆలోచనలను ప్రజలకు చేరువ చేస్తూ నైతికంగా, ధార్మికంగా సమాజోన్నతిలో తనవంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించగలడని లత తన సంగీత జీవితం ద్వారా నిరూపించింది. విజయం సాధించి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే కళాకారుడు తప్పుదార్లు పట్టనవసరం లేదు. నీచమైన కళను ఆశ్రయించి ప్రజలలో పశుత్వ భావనలను ప్రకోపింపచేస్తూ, సమాజాన్ని నైతికంగా, ధార్మికంగా దిగజార్చనవసరం లేదు. చిత్తశుద్ధితో, నిబద్ధతతో అత్యుత్తమమైన కళను సృజిస్తూ తానే కాదు తనతో పాటు సమాజాన్ని సైతం ఉన్నత పథంలో ప్రయాణింప చేయవచ్చు అని లత తాను పాడేందుకు ఎంచుకునే గీతాలలో ఉన్నత ప్రామాణికాలను పాటించటం ద్వారా నిరూపించింది. తన కళా ప్రతిభ పట్ల ఆత్మవిశ్వాసం ఉన్న కళాకారుడు కళతో ఏ మాత్రం రాజీపడడు. కళా దిశనే నిర్దేశించగలడని నిరూపించింది లత.
1962లో భారత్ చైనా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ స్నేహితుడిగా భావించిన చైనా దేశం చేతిలో అవమానకరమైన పరాజయాన్ని అనుభవించాల్సి వచ్చింది. శాంతి కాముక దేశమైన భారతదేశం ఈ ద్రోహాన్ని జీర్ణించుకోలేకపోయింది. అందరినీ గౌరవించి, నమ్మి, అందరినీ ఆత్మీయులుగా భావించే భారతీయ ప్రజలు ఈ ద్రోహాన్ని క్షమించలేకపోయారు. కానీ తమ బలహీనతలను, నిస్సహాయత్వాన్ని గుర్తించి, అవమానంతో రగిలిపోతూ కుమిలిపోయారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. భారతీయ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. దేశం మొత్తం పరాజయ భావన, అవమాన భారాలతో కుమిలి పోసాగింది. ఈ సమయంలో ప్రజలలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని నింపి, తిరిగి వారిని చైతన్యవంతులను చేసి, కార్యోన్ముఖులుగా చేసే బాధ్యతను భారత ప్రభుత్వం కళాకారులకు అప్పగించింది. దేశ రాజధాని కొత్త ఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో నిధుల సేకరణ కోసం మహబూబ్ ఖాన్ సినీ కళాకారులతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. దేశంలోని అత్యుత్తమ కళాకారులంతా కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కవులు కవితలు సిద్ధం చేసుకున్నారు. గేయ రచయితలు, గాయనీ గాయకులు, సంగీత దర్శకులతో కలసి దేశభక్తి గీతాలు, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవ ప్రేరేపిత గీతాలు సిద్ధం చేసుకున్నారు.
సినీ కళాకారులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశాధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, క్యాబినెట్ మంత్రులు, ఇందిరాగాంధీ వంటి వారితో పాటు సినీ ప్రముఖులు దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్‌తో సహా అనేకులు హాజరవుతారు. దేశ ప్రజలంతా ఎంతో ఉత్సహంతో కార్యక్రమం కోసం సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు నౌషాద్, శంకర్ జైకిషన్, మదన్ మోహన్, సి. రామచంద్రలకు పాటలు సిద్ధం చేసుకోమన్న విజ్ఞప్తులందాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కళా ప్రదర్శన ద్వారా దేశ ప్రజలను ఉత్తేజితులను చేసి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాలను ఇనుమడింపజేసే గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కళాకారులు అత్యుత్సాహంతో తయారీలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో లత పాడిన పాట లతను భారతరత్నగా ఎదిగించింది. ఈనాటికీ దేశభక్తి పాటలలో తలమానికంగా నిలచి, బంకించంద్ర వందేమాతర గీతం తరువాత అంతగా దేశ ప్రజలందరి హృదయాలలో నిరంతరం ప్రతిధ్వనించే గీతంగా నిలుస్తోంది.
(ఇంకా ఉంది)