Site icon Sanchika

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-23

[dropcap]ఏ[/dropcap]  మేరే వతన్ కే లోగోం, తుమ్ ఖూబ్ లగాలో న్యారా,

యే  శుభ్ దిన్ హై హమ్ సబ్ కా, లహరాలో తిరంగా ప్యారా

పర్ మత్ భూలో సీమాపర్ , వీరోంనే హై ప్రాణ్ గవాయే

కుఛ్ యాద్ ఉన్హే భీ కర్ లో,  జో లౌట్ కే ఘర్ నా ఆయే

ఏయ్ మేరే వతన్ కే లోగోం, జర ఆంఖ్ మే భర్‌లో పానీ

జో షహీద్ హుయే హై ఉన్ కీ, జర యాద్ కరో కుర్బానీ…

జనవరి 27, 1963 న్యూఢిల్లీ నేషనల్ స్టేడియమ్.

భారతదేశ సంగీత చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన సంభవించింది ఆరోజు. భారతదేశ సంస్కృతిలో, సామాజిక చరిత్రలో విడదీయరాని భాగమైన ఒక గీతం అవతరించిన రోజు అది. భవిష్యత్తులో తరతరాలు విని దేశభక్తితో ఉత్తేజితులై పాడుకునే గీతం ప్రకటితమైన రోజు అది. సినీ నేపథ్య గాయని ఇమేజీ దాటి, లతా మంగేష్కర్ సమస్త భారతీయుల ‘ఆత్మస్వరం’గా ఎదిగిన రోజు అది. లతా మంగేష్కర్ ‘ఏ  మేరే వతన్ కే లోగోం’ పాటను తన స్వరంతో అమర గీతంగా ప్రతిష్ఠించిన రోజు. ‘వందేమాతరం’ గీతంతో సమానంగా దేశ ప్రజలలో తరతరాలుగా  దేశభక్తి రగిలించి, ఉత్తేజితులను చేసే మహత్తర గీతం భారతదేశ గాలులలో కలసి, ఆకాశానికి ఎగసి,  నీటిలో ప్రవహిస్తూ, దేశభక్తి అగ్నిని రగిలిస్తూ, ఈ మట్టిలో మట్టి అయి నిలిచేందుకు నాందీ ప్రస్తావన జరిగిన రోజు అది.

చైనాతో యుద్ధంలో ఘోర పరాజయం అనుభవించి ఆత్మవిశ్వాసం కోల్పోయిన భారత్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఉద్దీపితం చేసేందుకు, ‘జాతీయ భద్రతా నిధి’కి నిధులు సమకూర్చేందుకు సినీ కళాకారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. దేశ రాష్ట్రపతితో సహా ప్రధానమైన వ్యక్తులంతా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ఆరంభంలో షకీల్ బదాయుని రాసిన పాటను నౌషాద్ స్వరబద్ధం చేయగా, మహమ్మద్ రఫీ అత్యద్భుతంగా ‘ఆప్‌నీ ఆజాదీ కో హమ్ హర్‌గీజ్ మిటా సక్తే నహీ’ అనే పాట పాడాడు. ప్రజలను ఉర్రూతలూగిచింది ఆ పాట.   ఈ పాటను ‘లీడర్’ సినిమాలో వాడేరు. శంకర్ జైకిషన్ స్వరపరచగా శైలేంద్ర రచించిన ‘జిస్ దేశ్ మే గంగా బహతీ హై’ పాట ‘హోఠోంపె సచ్చాయీ రహెతీహై’ ను ముకేష్ పాడేడు. అప్పటికే ఆ పాట సుపర్ హిట్‌గా నిలవటంతో అందరినీ రంజింప చేసింది ఆ పాట. కైఫీ ఆజ్మీ రాయగా మదన్ మోహన్ రూపొంచిందిన ‘కర్ చలే హమ్ ఫిదా’ పాటను రఫీ పరమాద్భుతంగా పాడి అందరినీ ఉత్తేజితులను చేశాడు. ‘తోడ్ దో హాథ్ అగర్ హథ్ ఉన్ కీ లగే ’  అన్నప్పుడు అందరూ ఆవేశపూరితులయి పోయారు. ఆ తరువాత సంగీత దర్శకుడు సి.రామచంద్ర వంతు వచ్చింది. ఆయన ఏ పాట పాడిస్తున్నాడో ముందుగా ఎవరికీ చెప్పలేదు. పాట ఏంటో, పదాలు ఏంటో ఎవరికీ తెలియదు. పాటను రాసిన గేయ రచయిత ప్రదీప్‌కు ఈ కార్యక్రమంలో పాల్గోనేందుకు ఆహ్వానం లభించలేదు. పాట ఆశా భోస్లే పాడే గీతం అని మాత్రం అందరికీ తెలుసు. కానీ అనివార్య కారణాల వల్ల ఆశా భోస్లే ఢిల్లీ రాలేకపోయింది. అందరిలో కుతూహలం కలిగిస్తున్న మరో విషయం ఏమింటంటే, సంగీత దర్శకుడు సి.రామచంద్ర నాలుగు రోజుల ముందే వచ్చాడు. కానీ గాయని లతా మంగేష్కర్ ఆ రోజు ఉదయమే ఢిల్లీ వచ్చింది. వచ్చినప్పటి నుంచీ ఆమె హోటల్ గది వదిలి బయటకు రాలేదు. అంటే ఒక్కసారి కూడా రిహార్సల్ జరగలేదు. అందరికీ తెలుసు లత, సి.రామచంద్ర కలసి పని చేయటం మానేసి దాదాపుగా ఆరేళ్లు అవుతోందని. దాంతో మాట్లాడుకోని సంగీత దర్శకుడు, గాయనిలు కలసి రిహార్సల్స్ చేయకుండా పాటని ఎలా పండిస్తారోనన్న కుతూహలం అందరిలో తీవ్రంగా ఉంది. దీనికి తోడు రఫీ పాడిన ‘అప్‌నీ ఆజాదీ కో హమ్’  పాట అందరినీ అలరించింది. ఒక తుఫానులా ఉక్కిరి బిక్కిరి చేసింది. దాంతో, లత, రఫీల నడుమ ప్రచ్ఛన్నంగా సాగుతున్న పోటీలో రఫీ విజయం సాధించాడన్న నమ్మకం అందరిలో కలిగింది.

సి.రామచంద్ర వంతు వచ్చింది. ఆయన పేరు ప్రకటించారు. లయబద్ధమైన డ్రమ్ బీట్లతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. అందరూ నిశ్శబ్దమైపోయారు. ఇంతలో బాసు మనోహరి వేణువుల స్వరంతో అందరి హృదయాలు స్పందించాయి. లత స్వరం ఆ ప్రాంతాన్ని తన మాధుర్యంతో, నియంత్రితమైన, విషాదం, ఆవేశాలతో  ముంచెత్తింది.

ఆ స్వరం ప్రకంపనలు అనేక భావాలతో శ్రోతల హృదయాలను స్పందింపచేసి వారి ఆత్మలను కదిలించాయి.

అక్కడి వారందరి ఆత్మలకు  తాము వేర్వేరు కాదు అంతా ఒకటేనన్న గ్రహింపు వచ్చినట్టు అందరిదీ ఏక హృదయమై స్పందించింది.

 ‘ఏ  మేరే వతన కే లోగో’ అన్న  లత పిలుపు సమస్త భారతీయులను జాగృతం చేసింది.

‘జర ఆంఖ్ మే భర్ లో పానీ’ అన్న వెంటనే జలజల కన్నీళ్లు కారేయి.

‘జో షహీద్ హువే హై ఉన్ కీ జర యాద్ కరో కుర్బానీ’ అనగానే తమ ప్రాణాలు పణంగా పెట్టి, అనేక రకాల ప్రతికూల పరిస్థితులను సహిస్తూ కూడా దేశ రక్షణ కోసం, దేశ ప్రజల గౌరవం కోసం చివరి శ్వాస వరకూ పోరీడిన సైనికుల బలిదానం స్మరణకు  వచ్చి ప్రతి ఒక్కరూ రోమాంచితులయ్యారు.

‘జబ్ దేశ్ మే థీ దివాలీ, వో ఖేల్ రహే హోలీ’ అన్న వాక్యం వినగానే ప్రతి ఒక్కరి మనస్సాక్షి సిగ్గుతో తల వంచుకుంది. తాము తమ ఇళ్లళ్లో సుఖంగా నిద్రిస్తుంటే; పండుగలు, పబ్బాలు ఆనందంగా గడుపుకుంటుంటే తమలో ఒకరయిన సైనికులు సర్వ సౌఖ్యాలు త్యజించి దేశ రక్షణ కోసం సరిహద్దులు కాపలా కాస్తూ, శత్రువులతో పోరాడుతున్నారు, అందువల్లనే తాము సురక్షితంగా సంబరాలు చేసుకోగలుతున్నామన్న గ్రహింపు కలిగింది.

జబ్ హమ్ భైఠే థే ఘరోం మే, వో ఝేల్ రహే థే గోలీ…

ఈ వాక్యాలు అప్పటికే నేర భావనతో, సిగ్గుతో కుచించుకు పోతున్నవారికి వజ్రాయుధఘాతంలా తాకాయి . మనం ఇళ్లలో కూర్చున్నాం సుఖంగా. సరిహద్దుల వద్ద సైనికులు తుపాకీ గుళ్లను ఎదుర్కొంటున్నారు, మన రక్షణ కోసం! అంతే… సమస్త దేశం ‘ఏయ్ మేరే వతన్ కే లోగో’ పాటతో మమేకం అయిపోయింది. పాటలో పదాలు, పదాలు పలికే భావం, ఆ భావాన్ని హృదయంతో గానం చేస్తూ ఆత్మను స్పందింప చేస్తున్న లత స్వర మాయాజాలం ప్రతి ఒక్కరి మనోయవనికపై సరిహద్దు వద్ద సైనికుల వీరోచిత పోరాటాన్ని, వారి త్యాగాన్ని, వారి స్ఫూర్తిని, దేశభక్తిని స్పష్టంగా ప్రదర్శించాయి.

సర్‌హద్ పే మర్నే వాలా, హర్ వీర్ థా భారత్ వాసి

జో ఖూన్ గిరా పర్వత్ పర్, వో ఖూన్ థే  హిందుస్తానీ

దేశంలోని వైరుద్యాలు, వైషమ్యాలు అన్ని మరచి అందరూ భారతీయులలా కలసికట్టుగా నిలబడాలన్న సందేశం అంతర్లీనంగా కనిపించేట్టు చేస్తూ, సరిహద్దు వద్ద పోరాడిన వారందరూ తమ కులం, మతం, ప్రాంతం వంటి సంకుచితాలను  అధిగమించినవారు. వారంతా భారతీయులు, అక్కడ చిందినది భారతీయుల రక్తం అని అత్యంత ప్రతీకాత్మకంగా, ఎదకు హత్తుకునే రీతిలో ప్రదర్శించిన పాట వింటూ తమని తాము మరచిపోయి, అన్న రకాల భేదభావాలు, సంకుచితాలు వదలి అందరూ ఏకమై భారతీయుల్లా స్పందించారు.

థీ ఖూన్ సే లత్-పత్  కాయా

ఫిర్ భీ బందూక్ ఉఠా  కే

దస్ దస్ కో ఏక్ నే మారా

ఫిర్ గిర్ గయే హోష్ గవా కే

జబ్ అంత్ సమయ్ అయాతో కహ్ గయే కి అబ్ మర్తే హై

ఖుష్ రహెనా దేశ్ కీ ప్యారోం, అబ్ హం తో సఫర్ కర్తే హై

అన్న చరణం వింటూ కంట తడి పెట్టనివారు లేరు. సైనికుల వీరత్వ ప్రదర్శనకు ఉప్పొంగని ఎద లేదు. మరణిస్తూ కూడా దేశ ప్రజల సుఖసంతోషాలు వాంఛిస్తున్న వారి త్యాగానికి జోహార్లు అర్పించని వారు లేరు.  అక్కడ చిన్న పెద్ద, పేరున్న వారు అనామకులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భారతీయులయ్యారు. అక్కడ అశ్రువులు చిలకని నయనాలు లేవు. కరగని ఎద లేదు. ఉప్పొంగని హృదయం లేదు. దేశభక్తితో జాగృతం కాని ఆత్మ లేదు.

తుమ్ భూల్ న జావో ఉన్ కో, ఇస్ లియే కహీయే కహనీ

జో షహీద్ హువేహై ఉన్ కీ, జర యాద్ కరో కుర్బానీ…

జై హింద్, జై హింద్

జై హింద్ కీ సేనా

చివరికి కోరస్ ‘జై హింద్ కీ సేనా’  అని పాడేప్పుడు సి.రామచంద్ర ఒక చమత్కారం చేశాడు. కోరస్ పాడే వారిని, ఎవరికీ కనబడకుండా తెర వెనక ఉంచాడు. దాంతో అందరి ఎదురుగా, లత  ‘జై హింద్’  అంటుంటే, వెనుక నుంచి వినిపించే కోరస్ శబ్దం ఎటునుంచి  వస్తున్నదో తెలియక, సమస్త భారతీయులు నలువైపుల నుంచీ ముక్త కంఠంతో ‘జై హింద్’ అంటున్న అనుభూతుకి లోనయ్యారు. అప్రయత్నంగా అందరూ ‘ జై హింద్ కీ సేనా’ అన్న నినాదాలు చేశారు.

పాట పూర్తయ్యాక   సర్వత్రా నిశ్శబ్దం నెలకొంది. మరు క్షణం ఆ ప్రాంతం చప్పట్లతో, హర్షాతిరేక ధ్వానాలతో దద్దరిల్లింది.

తరువాత జరిగింది లత మాటల్లోనే ……

“నేను పాట పాడేను. పాట ఎలా పాడేనో అన్న భయం నన్ను వదలలేదు. రిహార్సల్స్ చేయలేదు. తిన్నగా పాట పాడేను. అందుకే పాట పూర్తయిందన్న సంతోషంతో నేను తెర  వెనక్కాల రిలాక్సవుతున్నాను. ‘లత ఎక్కడ? లత ఎక్కడ?’ అంటూ మహబూబ్ ఖాన్ నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ‘పండిత్ జీ నిన్ను పిలుస్తున్నారు’ అన్నారు. ఆయన వెంట నేను పండిత్ జీ దగ్గరకు వెళ్లాను. అప్పటికే అక్కడ ఇందిరాగాంధీతో సహా ఇతర జాతీయ నాయకులు ఉన్నారు. మహబూబ్ సాహెబ్ నన్ను పండిత్ జీ కి పరిచయం చేశారు. అప్పుడు ఆయన నాతో అన్నారు ‘బేటా తుమ్ నే ఆజ్ ముఝే రులాదియా (తల్లీ, నువ్వు ఈ రోజు నా కంట నీరు తెప్పించావు/నా హృదయాన్ని కదిలించావు  ). నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు నాతో ఇంటికి వచ్చి చాయ్ తాగి వెళ్లు’ అన్నారు మే మందరమూ ఆయన నివాసం తీన్‌మూర్తి భవన్‍కు వెళ్లాం. ఆ రోజుల్లో అది ప్రధాన మంత్రి గృహం. నేను మౌనంగా ఓ మూల కూర్చుని ఉన్నాను. ఇందిరా గాంధీ నా దగ్గరకు వచ్చారు. ‘మీరు ఇక్కడే ఉండండి. నేను మీ పాటను మెచ్చే ఇద్దరిని మీకు పరిచయం చేస్తాను. వాళ్లు ఎప్పుడూ మీ పాటలు వింటునే ఉంటారు. మిమ్మల్ని కలిసి సంతోషిస్తారు’ అంది. కాస్సేపటికి ఆమె తన ఇద్దరు పిల్లలను వెంట బెట్టుకుని వచ్చింది. ‘ఈ ఇద్దరూ రాజీవ్, సంజయ్ లు మీ ఫాన్లు’ అని రాజవ్ గాందీ, సంజయ్ గాందీలను పరిచయం చేసింది. నేను వారిద్దరినీ ముద్దు చేశాను. ఆ తరువాత అందరం చాయ్ నాస్తా చేసి పండిత్ జీతో ముచ్చట్లాడి వీడ్కోలు తీసుకున్నాం.”

‘ఏయ్ మేరే వతన్ కే లోగోం’ పాట ప్రభావం అది. ఆ పాట పండిత్ నెహ్రూనే కాదు, సమస్త భారతీయ ప్రజలను కదిలించింది. ముఖ్యంగా ఇతర గీతాల లాగా, దేశం గొప్పతనమో, దేశభక్తి ప్రాధాన్యమో ప్రదర్శించకుండా యుద్ధంలో సైనికుల పోరాట పటిమ, త్యాగం, దేశభక్తి, వంటి విషయాలను సూటిగా హృదయాన్ని తాకేదిలా ఉండటంతో పాట ప్రజలందరినీ కదిలించింది. సైనికుల త్యాగాలను మరవకూడదని చెప్పే ‘జై హింద్ కీ సేనా’ నుంచి చివరికి ‘జై హింద్’  అంటూ ముగియటం పాట మనస్సులను హత్తుకునేట్టు చేసింది. నిజానికి పాట ఏ మేరే వతన్ కే లోగోం, జర ఆంఖ్మే భర్లో పానీ, అంటూ ఆరంభమవుతుంది. కానీ, పాటముందు తుం ఖూబ్ లగాలో న్యారా అన్నది కవి ప్రదీప్ చివరి క్షణంలో జోడించి రికార్డ్ చేసిన టేప్ లతకు అందించాడు.

పాట పూర్తయి పండిత్ జీని కలిసిన తరువాత లత వెంటనే కొల్హాపూర్ వెళ్లిపోయింది. అక్కడ ఆమె సోదరి ‘మీనా’ వివాహం జగుగుతోంది.  ఆ తరువాత లత తీరా బొంబాయి వచ్చిన తరువాత కానీ ‘ ఏ మేరే వతన్ కే లోగోం’  పాట ఎంతగా దేశ ప్రజలను కదిలించిందో వారి హృదయాలను కదిలించిందో  లతకు తెలియలేదు.  HMV వారు వెంటనే ‘ఏ మేరే వతన్ కే లోగోం’ పాట,  78rpm  డిస్క్‌ను విడుదల చేశారు. సినిమా పాటలకన్నా అధికంగా అమ్ముడు పోయిందీ పాట రికార్డు. ఈ పాట వల్ల వచ్చే రాయల్టీని కళాకారులంతా దేశభద్రతా నిధికి సమర్పించారు.

ఇప్పటికి లత ‘ఏయ్ మేరే వతన్ కే లోగోం’ పాట పాడి 59 ఏళ్లవుతోంది. కానీ పాట ప్రాధాన్యం తగ్గలేదు. లత ఎక్కడ పాటలు పాడినా ఈ పాట పాడందే గాన సభ పూర్తి కాదు. 1964లో,  లత ఢిల్లీలో ‘ఏయ్ మేరే వతన్ కే లోగోం’  పాట పాడిన కొన్ని నెలల తరువాత బొంబాయి లోని బ్రాబోర్న్ స్టేడియంలో   ఓ ఛారిటీ షో లో పాటలు పాడుతున్నప్పుడు ఆమెకు పండిత్ నెహ్రు సభకు వస్తున్నట్టు సూచన అందింది. అంతే కాదు, ఆయన ‘ఏమ్ మేరే వతన్ కే లోగోం’ పాట వినాలనుకుంటున్నట్టు చెప్పారు. నెహ్రు సభకు రాగానే లత నెహ్రు కోరికను అనుసరించి పాట పాడింది. పాట అయిపోయిన తరువాత వెళ్లిపోతూ నెహ్రూ లతను కలవాలని కబురు పంపారు. లత స్టేజీ వదలి ఆయన కారు దగ్గరకు వెళ్లింది. కారులో ఆయనతో పాటు విజయలక్ష్మీ పండిత్ కూడా ఉంది. “నువ్వు ఇక్కడ పాడుతున్నావని  తెలిసి ‘ఏయ్ మేరే వతన్ కే లోగోం’ పాట వినేందుకు వచ్చాను” అన్నారు నెహ్రు లతతో. ఆ తరువాత ఆమెను ఆశీర్వదించారు. తరువాత కొద్ది నెలలకే ఆయన హఠాన్మరణం చెందారు.

పాట అద్భుతమైనది. అందరి ఎదలను కరగించగలది. పైగా ప్రధానికి నచ్చింది. ప్రధాని కంట నీరు తెప్పించింది. దాంతో ఈ పాట ప్రాధాన్యం మరింత పెరిగి పోయింది. చలన చిత్రాలలో నేపథ్య గాయనిగా లత సంపాదించిన ఖ్యాతి అంతా ఒక ఎత్తు, ‘ఏయ్ మేరే వతన్ కే లోగోం’ పాట ద్వారా లతకు అందిన ప్రేమాభిమానాలు మరో ఎత్తు. హిమాలయాలంత ఎత్తు ఎదిగిన లత ఈ పాటతో భారత మాత స్వరానికి ప్రతీకగా ఎదిగింది. భారతదేశంలో ఒక గంగా నది, ఒక హిమాలయం, ఒక లత అని ప్రజలు ముక్త కంఠంతో ప్రకటించే స్థాయికి ఎదిగింది లత.

‘ఏయ్ మేరే వతన్ కే లోగోం’ పాట ఇంతగా ప్రజలను ఆకర్షించటంతో పాటకు సంబంధించిన పలు గాథలు ప్రచారం లోకి వచ్చాయి. పలు వివాదాలు తెరపైకి వచ్చాయి. పలువురు లత ఈ పాటను ఆశా నుంచి దొంగిలించిందని ఆరోపించారు. సి.రామచంద్ర సైతం దాదాపుగా అలాంటి అర్థాన్ని కలిగించే మాటలన్నాడు. రాజూ  భరతన్ లాంటి జర్నలిస్టు  లత ఈ పాట ‘సోలో’ అయితేనే పాడతానన్న నియమం విధించిటం వల్ల ఆశాకు పాడే అవకాశం పొయిందని ఆరోపించాడు. ఇలా పలు కథనాలు లతను ‘దోషి’ గా చూపిస్తూ ప్రచారంలోకి వచ్చాయి. చెల్లెలిని పాడనీయకుండా ఖ్యాతి అంతా తనకే రావాలన్నట్టు స్వార్థంతో లత వ్యవహరించిందని పలు వ్రేళ్లు లతను దోషిగా నిర్ధారిస్తూ చూపించాయి లత వైపు. ఆశా భోస్లే ఈ వివాదం గురించి   ప్రస్తావించలేదు. తనకు జ్వరంగా ఉండటం వల్ల, రిహార్సల్స్ సరిగా చేయలేక పోవడం వల్ల పాటను పాడే సాహసం చేయలేదని అశా వివాదాన్ని చల్లబరచాలని చూసింది. కాని ఆమె మాటల్లో వేరే అర్థాన్ని తీశారు జర్నలిస్టులు. దీనికి తోడు, లత ఎప్పుడు ‘ఏయ్ మేరే వతన్ కే లోగోం’ పాట పాడినా ఇది కవి ప్రదీప్ పాట అని చెప్తుందే తప్ప ఈ పాటకు సంగీతం సి.రామచంద్ర అని రామచంద్ర పేరు ఎన్నడూ చెప్పదు. లతకే కాదు, లత ఎదురుగా ఈ పాటను ప్రకటించేప్పుడు సి.రామచంద్ర పేరు ఎవ్వరూ తలవరు. ఇది కూడా అనేక వివాదాలకు దారి తీసింది. ఈ పాట సృజనకు దారి తీసిన పరిస్థితులు, పాట గురించి లతా మంగేష్కర్, ప్రదీప్‌లు స్వయంగా చేప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని జరిగింది ఎవరెవరి సంస్కారాన్ని అనుసరించి వారి వారి ఊహలకు వదిలేయాల్సి ఉంటుంది.

ఢిల్లీలో ప్రధాని సమక్షంలో కళాకారుల కార్యక్రమం ఏర్పాటువుతోందని, ఆ కార్యక్రమంలో పాడేందుకు పాటను తయారు చేసుకోవలసిందనీ సి.రామచంద్రకు ఆహ్వానం అందినప్పుడు, ఆయనకు ఏం చేయాలో తోచలేదు. ఇతర కళాకారులంతా వారు సినిమాల్లో వాడిన, లేక వాడబోయే పాటలను పాడుతున్నారు. ఈ సందర్భానికి తగ్గ పాట సి.రామచంద్ర వద్ద లేదు. కాబట్టి కవి ప్రదీప్‌ను కలిసి ఈ సందర్భానికి తగ్గ పాటను రాయమని కోరాడు సి.రామచంద్ర. సి.రామచంద్ర కవి ప్రదీప్‌ల నడుమ చక్కని దోస్తీ ఉంది. కవి ప్రదీప్   చక్కని గేయ రచయిత. దేశభక్తి గేయాలు, తాత్వికగీతాలు అత్యద్భుతంగా రచిస్తాడు. వీరిద్దరూ కలసి ‘నాస్తిక్’ సినిమాలో సూపర్ హిట్ పాటలను రూపొందించారు. ముఖ్యంగా ‘దేఖ్ తెరే సంసార్ కి హాలత్’ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. అంతకు ముందే ‘జాగృతి’ సినిమాలో  ‘హమ్ లాయే హై తూఫానోం సే’,  ‘దేదీ  హమే ఆజాదీ బినా ఖడ్గ్’, ‘ఆవో బచ్చోం తుమ్హే దిఖాయే ఝాంకీ హిందుస్తాన్ కీ’ వంటి అతి గొప్ప దేశభక్తి పాటలను రచించాడు. కాబట్టి సి.రామచంద్ర పాట రాయమని ప్రదీప్‌ను అడగటంతో ఆశ్చర్యం లేదు. దానికి ప్రదీప్ జోక్ చేస్తూ, నిష్ఠూరంగా  ‘ఫోకట్ కే కామ్ హో తో ఆతే హో’ (ఉచితంగా చేయల్సిన పని ఉంటేనే వస్తావు) అన్నాడు. ఈ మాట అనడానికి నేపథ్యం ఉంది. సి.రామచంద్ర అధికంగా రాజేందర్ క్రిషన్‌తో పని చేశాడు. ‘అనార్కలి’ సినిమాకు వేరే గేయ రచయితలతో పని చేశాడని అలిగి రాజేంద్ర క్రిషన్ సి.రామచంద్రకు పాటలు రాయటం మానేశాడు. అప్పుడు ‘భరత్ వ్యాస్’ను గేయ రచయితగా తీసుకున్నాడు సి.రామచంద్ర. అదీ ప్రదీప్ ఎత్తిపొడుపు వెనుక కారణం. అయితే జాతీయ స్థాయిలో గౌరవం పొందే ప్రతిష్ఠాత్మకమైన అవకాశాన్ని పోనివ్వటం ప్రదీప్‌కు కూడా ఇష్టం లేదు.

తాను పాట రాసే ముందు,  కార్యక్రమంలో ఇతరులు పాడే పాటలను గమనించాడు ప్రదీప్. అన్నీ వేగవంతమైనవి, ఉత్తేజం కలిగించేవి, దేశభక్తి చెప్పేవి. దాంతో వాటికి భిన్నంగా, సైనికుల త్యాగాన్ని ప్రతిబింబిస్తూ, వారి వీరోచిత గాథను తన పాటలో ప్రదర్శించాలని అనుకున్నాడు. ప్రదీప్ పాట రాయటమే కాదు, పాట పాడతాడు, దానికి బాణీని కూడా సూచించాడు. అయితే ప్రదీప్ పాటలో ప్రదర్శించాలనుకున్న అంశం అందరూ పాడుతున్న పాటలలోని అంశాలకు భిన్నమైనది.  ‘కర్ చలే హమ్ ఫిదా’ పాట తన కర్తవ్యాన్ని నిర్వహించి, దేశాన్ని తరువాతి తరానికి అప్పగించి వెళ్తున్న సైనికుడి హృదయ గీతం. కాబట్టి, ప్రదీప్ అనుకున్న అంశానికి భిన్నమైనదవుతంది. ఎంతో ఆలోచన తరువాత ‘ఏయ్ మేరే వతన కే లోగోం’ పాట పదాలు స్ఫురించాయి ప్రదీప్ కు . రాస్తూనే పాట గొప్పతం కవికి అర్థమయింది. ఈ పాటను రహస్యంగా ఉంచాలని, పాడే రోజే మాత్రమే  ప్రపంచం ఆ పాటను వినాలని ప్రదీప్ భావించాడు. సి.రామచంద్ర అందుకు ఒప్పుకున్నాడు. ఆ సమయంలో లత, సి.రామచంద్రలు కలిసి పని చేయటం లేదు. కాబట్టి ఆశాతో పాడించాలని నిర్ణయించాడు రామచంద్ర. ఆశాతో రిహార్సల్స్ కూడా ప్రారంభించాడు.

ప్రదీప్ ప్రకారం, ఢిల్లీలో పాట పాడేందుకు ఆరు రోజుల ముందు లత, ఈ పాట పాడటానికి ఒప్పుకుంది. సి.రామచంద్ర ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. ఈ రకంగానయినా లతతో తన సంబంధాలు పునరుద్ధరించుకోవచ్చని అతను ఆశ పడ్డాడు. అయితే అంత వరకూ ఆశాతో రిహార్సల్స్ చేయించాడు కాబట్టి ఆశ, లత కలసి యుగళ గీతంలా పాడాలని రామచంద్ర అన్నాడు. రెండు రోజుల తరువాత ప్రదీప్ లతకు, ఆశాకు పాటను ఇచ్చాడు. రిహార్సల్స్ ఆరంభమయ్యే సమయానికి తనకు ఆరోగ్యం బాలేదని తాను పాట పాడలేనని ఆశా భోస్లే చెప్పింది. రామచంద్ర ఎంత బ్రతిమలాడినా ఆమె పాట పాడేందుకు ఒప్పుకోలేదు. అయితే, రామచంద్ర ఢిల్లీ వెళ్లాల్సి రావటంతో, పాటను ప్రదీప్ స్వరంలో రికార్డు చేసి లతకు టేపు పంపించాడు రామచంద్ర. ఆ టేపు విని లత, తిన్నగా స్టేజి మీద పాట పాడింది, చరిత్ర సృష్టించింది అంటాడు ప్రదీప్.

‘మేరే వతన్ కే లోగోం’ పాట లతనే పాడాలని కవి ప్రదీప్ పట్టుపట్టాడని, ఆశాతో పాడించాలని రామచంద్ర అనుకున్నా ప్రదీప్ కోసం రాజీ పడక తప్పలేదు. అయితే ప్రదీప్ ఎంతగా బ్రతిమిలాడినా లత, రామచంద్రతో కలసి పని చేసేందుకు ఇష్టపడలేదు. చేసేది లేక ఆశాతో పాడించేందుకు ప్రదీప్ ఒప్పుకున్నాడు. ఇంతలో హఠాత్తుగా ఓ రోజు ఉదయం లత, ప్రదీప్‌కు ఫోన్ చేసి ‘పాటను పాడతాను. కానీ యుగళగీతంలా కాదు. సోలోగా ’ అన్న నియమం విధించింది. దాంతో చేసేదిలేక ఆశాను వదలి లతతోనే పాటను పాడించారు. ఈ రకంగా రామచంద్రకు  తన పై ఉన్న ప్రేమను ఆధారం చేసుకుని లత పాట తానే పాడి, పాట వల్ల వచ్చిన  ఖ్యాతినంతా తన స్వంతం చేసుకున్నదని రాజు భరతన్ పలు వ్యాసాల్లో రాశాడు.

లత కథనం ఇంకో రకంగా ఉంటుంది.

పాట రాసిన ప్రదీప్ ఈ పాటను లతనే పాడాలి అని నిర్ణయించుకుని లతకు ఫోను చేశాడు. పాట పాడమని అభ్యర్ధించాడు. కానీ తాను బిజీగా ఉన్నానని, ఒక్క పాట కోసం సమయం తాను వెచ్చించలేనని లత   తిరస్కరించింది. ఆ సమయంలో ఆమె రోజుకు నాలుగయిదు పాటలు రికార్టు చేస్తుండేది. పైగా సోదరి మీనా వివాహం కూడా నిశ్చయమయింది. వివాహ బాధ్యత అంతా లతదే! అయితే ప్రదీప్ లతను వదలలేదు. ప్రదీప్ పట్ల లతకు అమితమైన గౌరవం. చివరికి లత పాట పాడేందుకు ఒప్పుకుంది. కానీ అంతవరకూ ఆశా రిహార్సల్స్ చేసింది కాబట్టి తానూ ఆశా కలసి యుగళగీతంలా పాడతామంది లత. అయితే ప్రదీప్ అందుకు ఒప్పుకోలేదు. అది సోలో గానే బాగుంటుందన్నాడు. దాంతో ఆశా పాటను పాడటం నుంచి విరమించుకుంది. ఆశాను నిర్ణయం మార్చుకోమని లత ఒత్తిడి చేసింది. కానీ ఆశా తన పట్టు విడవలేదు. దాంతో లత ఒక్కర్తే పాట పాడేందుకు ఢిల్లీ వెళ్లింది. ఆమె రిహార్సల్స్ కూడా చేయలేదు. ఢిల్లీ వెళుతూ విమానంలో ప్రదీప్ పాడి పంపిన టేప్ విన్నది. ఢిల్లీలో పాట పాడింది. భారతీయుల హృదయాలను గెలుచుకుంది. వారి మనస్సులలో ప్రతిష్ఠితమయింది. ఇది లతా పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. ‘ఏ మేరే వతన్ కే లోగోం’ పాటను లత  పాడాలని ప్రదీప్ పట్టుబట్టాడని అతని కూతురు కూడా చెప్పింది.

ఉచితంగా పాట అవసరమైతే నా దగ్గరకు వస్తావని సి.రామచంద్రతో హాస్యం చేసినా కవి ప్రదీప్ వంద చరణాలు రాసిచ్చాడు. వాటిల్లోంచి  ఇప్పుడు మనకు వినిపిస్తున్న నాలుగు చరణాలను ఎంచుకున్నాడు సి.రామచంద్ర. అయితే, ఈ పాటను సావనీర్ కోసం ఇంగ్లీషుకి అనువదించిన హృదయనాథ్ చటోపాధ్యాయ, కొన్ని పదాలను మార్చాడు. పాట రాసిన రచయితగా తన పేరే ఉంచాడు. ప్రదీప్ ప్రసక్తే లేదు. అంటే, ‘ఏ మేరే వతన్ కే లోగోం’ పాట రాసిన గేయ రచయితకు కానీ, సంగీత దర్శకుడు సి.రామచంద్రకు గానీ ఈ పాట వల్ల లభించాల్సినంత గుర్తింపు, ఖ్యాతి లభించలేదు. కానీ ‘ఏయ్ మేరే వతన్ కే లోగోం’ దేశభక్తికి, దేశభక్తిని ప్రతిబింబించే మూర్తిగా లతకు పర్యాయపదంగా మారింది.

1965లో పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినప్పుడు మళ్లీ కవి ప్రదీప్, సి.రామచంద్ర కలసి ఓ దేశభక్తి గీతాన్ని రూపొందించారు. ఈ సారి పాటను ఆశా భోస్లేతో పాడించారు. కానీ ఆ పాట కాలగర్భంలో కలసిపోయింది. ఇప్పుడు, అలాంటి పాట ఒకటుందని కూడా అనేకులకు తెలియదు.

మళ్లీ 1972లో బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం పాకిస్తాన్‌తో యుద్ధం జరిగిన తరువాత ఢిల్లీలో రామ్‌లీలా మైదాన్‍లో లత ‘ఏయ్ మేరే వతన్ కే లోగోం’ పాట పాడింది. మరో సారి దేశం మొత్తం ఈ పాట ప్రభంజనం ముందు ఊగిపోయింది. ఒక పాటను సంగీత దర్శకుడు సృజించినా, గేయ రచయిత రచించినా, గాయకుడి స్వరం పాటను ప్రజలకు చేరువ చేయటంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుందని లత పలు మార్లు నిరూపించింది. ‘ఏయ్ మేరే వతన్ కే లోగోం’ పాట ద్వారా తిరుగులోని రీతిలో నిరూపించింది. ఇప్పుడు ఈ పాట వందేమాతరం, జనగణమణ గీతాల్లా  ప్రతి లత కార్యక్రమం చివరలో తప్పనిసరిగా పాడాల్సిన గీతంలా నిలుస్తోంది.

1963లో   అనిల్ బిస్వాస్ రేడియోలో పని చేయటం ఆరంభించాడు. ఆయన రేడియో కోసం, పండిత్ నరేంద్రశర్మ రచించిన గేయాలను లతతో పాడించాడు. ‘యుగ్ కీ సంధ్యా’, ‘భూల్ ఆయే భూల్ జాయే’ వంటి మధురమైన గీతాలను పాడించాడు.

ఈ రకంగా లతా మంగేష్కర్ సినీ పాటల ప్రపంచంలోనూ, సినిమా యేతర పాటల ప్రపంచంలోనూ, జాతీయ స్థాయి దేశభక్తి గీతాల ప్రపంచంలోనూ తనకు ఎదురు లేదని నిరూపించింది 1960 దశకంలో.

1970 దశకం వచ్చేసరికి లతకు 40 ఏళ్లు నిండాయి. ఆమె స్వరం గమనించలేని రీతిలో మారటం ఆరంభమయింది. సినీ పరిశ్రమలో పరిస్థితులు స్పష్టంగా మారసాగాయి. ఒక తరం కళాకారులు తెరమరుగవుతూండగా, మరో తరం కళాకారులు తెరపైకి వస్తున్నారు. కొత్త తరం తనతో పాటు కొత్త పద్ధతులు, కొత్త అభిలాషలు, కొత్త అభిరుచులను సినీరంగంలో స్థిరపరుస్తోంది. హీరోలు, హీరోయిన్లు మారిపోతున్నారు. సంగీత దర్శకులు, గేయ రచయుతలు మారుతున్నారు. గాయనీ గాయకుల అదృష్టాలలో మార్పులు వస్తున్నాయి. కొత్త కొత్త గాయనీగాయకులు రంగప్రవేశం చేస్తున్నారు. సామాజిక పరిస్థితులు మారుతున్నాయి. రాజకీయాల స్వరూపం మారుతోంది. సాంఘిక జీవితంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలు మారుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. ఈ నిత్య పరిణామశీలి అయిన ప్రపంచంలో సమస్తం అనుక్షణం మార్పు చెందుతూన్న పరిస్థితిలో, మార్పును అహ్వనించటమే కాదు, మార్పును అనుసరిస్తూనే, ఆ మార్పును తనకనుగుణంగా మలచుకోగలిగిన వాడే విజయం సాధిస్తాడు. ఈ సత్యం లత తన కెరీరును 1960 దశకం నడుమ నుంచీ నెమ్మదిగా మార్చుకుంటూ వస్తూ, 1970లో సంభవిస్తున్న పెను మార్పులను తట్టుకుని ఏ మాత్రం తొణకకుండా నిలబడిన ఏకైక కళాకారిణిగా నిలిచిన విధానం అత్యద్భుతమైనది. మార్పుకు తగ్గ మార్పులు తన గాన సంవిధానంలో చేసుకుంటూ, ఆ మార్పులను తనకు అనువుగా లత మార్చుకున్న వైనం ఏ వ్యక్తిత్వ వికాస పాఠ్య పుస్తకాలలోనూ దొరకదు. అది కేవలం లత జీవితాన్ని అధ్యయనం చేయటం ద్వారానే తెలుస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version