Site icon Sanchika

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-24

[dropcap]ఆ[/dropcap] జానె -ఎ-జాన్

ఆ మెరా, యె హుస్న్ జవాన్, జవాన్

తేరే లియే హై ఆస్ లగాయే, ఓ జాలిమ్ ఆజానా……

రాజిందర్ క్రిషన్ రచించిన ఈ ‘ఇంతెకామ్’ సినిమా పాటకు సంగీత దర్శకత్వం వహించింది లక్ష్మీకాంత్ ప్యారేలాల్. ‘ఇంతెకామ్’ సినిమాలో ఈ క్యాబరే పాటను లత పాడటం ఎంతో సంచలనం సృష్టించింది. తన కెరీర్ ఆరంభించినప్పటి నుంచీ లతా మంగేష్కర్ రెచ్చగొట్టే పాటలు, ద్వంద్వార్థాల పాటలు, నీచమైన అర్థానిచ్చే పాటలు,  పాత్రలు శుభ్రమైన దుస్తులు వేసుకోని పాటలు పాడనని స్పష్టం చేసింది. గేయ రచయితలతో కూర్చుని ప్రతి పదానికి అర్థం చర్చించి ఒకవేళ అవి మరో అర్థాన్నిచ్చేటట్టుంటే గేయ రచయితలతో వాదించి మరీ పదాలు మార్పించేది. ఒకవేళ గేయ రచయిత కానీ, సంగీత దర్శకుడు కానీ పదాన్ని మార్చేందుకు సిద్ధంగా లేకపోతే పాట పాడటం నుంచి లత తప్పుకునేది.

‘సంగం’ సినిమాలో ‘మై కా కరూ రామ్’ పాట పాడేందుకు లత ఇష్టపడలేదు. చిత్రీకరణ అసభ్యంగా ఉండదని రాజ్ కపుర్ హామీ ఇచ్చాడు. పాటలోని పదాలలో ఎక్కడా ద్వంద్వార్థం లేదని గేయ రచయిత హస్రత్ జైపురి వివరించాడు. పాట హుషారైన పాట, పాడమని శంకర్ భరోసా ఇచ్చాడు. అప్పుడు అద్భుతంగా పాడింది లత. పాటను ఎంజాయ్ చేస్తూ పాడింది. పాటను అభినయిస్తున్న వైజయంతీ మాల ముఖాన్ని కాస్త అమాయకంగా, కాస్త చిలిపిగా పెడితే చాలు, మిగతా అభినయమంతా నేపథ్యంలో లత స్వరం చేసింది. పాట హిట్ అయింది. సినిమా హిట్ అయింది. ఇప్పటికీ ‘షో షూరూ’ అన్న వైజయంతి మాల మాటలతో పాట దృశ్యాన్ని వాడటం నడుస్తోంది. కానీ రాజ్‍కపూర్‍కి పాడను, శంకర్ పాటలు పాడను అని ప్రకటించడానికి ఈ అసభ్యకరమైన పాటను తనతో పాడించారన్న వంక లతకు దొరికింది. ఈ పాటను పాడేందుకు అభ్యంతరం చెప్పిన లత ‘జబ్ జబ్ పూల్ ఖిలే’ సినిమాలో అత్యంత రొమాంటిక్ పాట, శృంగార భావాలు పొంగిపొర్లే రీతిలో ‘యే సమా, సమాహై యే ప్యార్ కా’ను అద్భుతంగా పాడింది. ఆ పాటలో లత వొలకబోసిన శృంగారం – లైంగికపరమైన వేదనకు తట్టుకోలేక ప్రియుడిని పిలుస్తున్న యువతి వేదన ఎంతో అద్భుతంగా ప్రదర్శించింది. నిజానికి అంతగా రెచ్చగొట్టే రీతిలో కనబడని నందా, ఆ పాటను లత పాడిన విధానానికి శృంగార రసాధి దేవతలా కనిపిస్తుంది. ఒక్కో పదాన్ని లత పలికిన తీరు, శృంగార భావాన్ని లత చిలికిన తీరు, అసభ్యం, అశ్లీలం అన్న ఆలోచనలు ఏమాత్రం దరిదాపులకు రాకుండానే ఉత్తేజితం చేసి మైమరపించి మత్తు కలిగేట్టు లత పాడిన తీరు పాట స్థాయిని పెంచింది. యవ్వన ప్రాదుర్భవ వేళ మదిలో  కలిగే అవ్యక్తము, అర్ధంకాని సంచలనాలను అర్థం చేసుకుంటూ ఆ సంచలనాన్ని వ్యక్తపరుస్తున్న యువతి హృదయ స్వరంలా ధ్వనిస్తుంది లత స్వరం. ఈ పాటతో లత Seductive పాటలు కూడా అత్యద్భుతంగా పాదగలదని నిరూపితమైంది. ఒకప్పుడు లత ఇలాంటి పాటలు కూడా పాడేందుకు ఇష్టపడేది కాదు. కానీ 1960 ప్రాంతంలో పరిస్థితి మారింది. మారిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తన మౌలిక సిద్ధాంతంతో రాజీపడక పోయినా, తన పరిస్థితిని కాస్త సడలించింది లత.

హిందీ సినిమాలో 1950 నుండి 1960 నడుమ గణనీయమైన మార్పులు వచ్చాయి. అత్యంత పవిత్రంగా, గృహిణిగా, కుటుంబం కోసం సర్వం అంకితం చేసే వ్యక్తిగా, భర్తను వెన్నంటి ఉండి ఆయన అన్ని దోషాలను ‘విధి’గా భావించి సహించే వ్యక్తిగా మాత్రమే అధికంగా సినిమాల్లో నాయికలుండేవారు. వారు ప్రేమగీతాలు పాడినా ఎంతో పవిత్రంగా, లైంగిక భావన దరిదాపులకు రాకుండా   హృదయ సంగమం, ఆత్మల కలయిక గురించే అధికంగా పాడేవారు. కానీ సినిమాలపై పాశ్చాత్య ‘క్రైమ్’ సినిమాల ప్రభావం అధికమవటంతో, క్లబ్బులో నృత్యమాడి ప్రతినాయకుడి పంచన ఉండే ఓ మహిళ పాత్ర   సినిమాలలో అనివార్యమయింది. అయితే నాయిక పవిత్రమైనది, నీతి నియమాలు, విలువలు కలది కాబట్టి ఆమెకు లత స్వరం వాడేవారు. ‘వ్యాంప్’ పాత్ర అంతగా బుద్ధిమంతురాలు కాదు కాబట్టి ఆమె కోసం సృజించే పాటలు కాస్త రెచ్చగొట్టేవిగా,  కాస్త లైంగికపరంగా ఉద్రేకం కలిగించేవిగా ఉండేవి. ఇలాంటి పాటలు లత పాడదు కాబట్టి, గీతాదత్, శంషాద్ బేగం, ఆశా భోస్లే వంటి గాయనిలతో పాడించేవారు. కొన్నాళ్లకు ఇతర గాయనిలను దాటి ఇలాంటి పాటలకు ‘ఆశా భోస్లే’ పెట్టింది పేరుగా ఎదిగింది. ‘చిలిపి పాటల’తో ఆశా ఎంతగా గుర్తింపు పొందిందంటే నాయికలు చిలిపి పాటలు పాడాల్సి వచ్చినా ఆశా భోస్లే తోనే పాడించటం ఆరంభించారు.

హిందీ సినిమాల్లో తొలి క్లబ్బు పాటను ‘ఆవారా’ సినిమా కోసం శంషాద్ బేగమ్ పాడింది. ‘ఏక్ దో తీన్ ఆజా మౌసమ్ హై రంగీన్’ ఆ పాట. పాట పాడేది క్లబ్బులో. కానీ పాటలో పదాలలో ఎలాంటి అనౌచిత్యం, అసభ్యం ఉండదు. అలాగే ‘బాజీ’ సినిమాలో హీరో దొంగ. క్లబ్బులో పేకాటలాడతాడు. ఓడిపోయిన హీరో వెనుతిరుగుతుంటే ఆ క్లబ్బులో నృత్యం చేసే ఆమె అతడిని ఛాలెంజ్ చేస్తూ పాట పాడుతుంది. అయితే ఆ వేషం వేసింది ప్రధాన నటి గీతాబాలి, పాట రాసింది సాహిర్ లూధియాన్వీ కావటంతో ఒక గొప్ప ప్రేరణాత్మకమైన గేయం, అతి గొప్ప క్లబ్బు పాటలా మారి ఈనాటికీ దేశాన్ని ఉర్రూతలూగిస్తోంది. ‘తద్బీర్ సే బిగ్‍డీ హూయీ తక్‍దీర్ బనాలే’ అనే ఈ పాట ఆ కాలంలో క్లబ్బు పాటలు కూడా ఏ స్థాయిలో ఉండేవో తెలుపుతుంది. అయితే రాను రాను క్లబ్బు పాటలు  క్లాసిక్ నుంచి క్లబ్బు స్థాయికి దిగజారేయి. ‘ఆయియే మెహర్బాన్’, ‘మేరా నామ్ చిన్చిన్చూ’, ‘హూ అభీ మై జవాన్’, ‘జాతా కహాన్ హై దీవానే’ వంటి పాటలు సూపర్ హిట్ అయి సినిమాల వ్యాపార విలువలు పెంచటంతో, ఇలాంటి పాటల విలువను గ్రహించిన కళాకారులు నెమ్మదిగా కబ్బు నృత్యాల కోసం ప్రత్యేకంగా పాటలను ఏర్పాటు చేయటం ప్రారంభించారు. నృత్యగత్తెగా ‘హెలెన్’ పేరు పొందటంతో, ఇలాంటి పాటల స్వరూపం మారిపోయింది. లతను ఇలాంటి పాటలు పాడమని అడిగే ధైర్యం ఎవ్వరూ చేయలేదు.   ఇలాంటి నృత్యాలు, రెచ్చగొట్టే పాటలు ప్రత్యేక నృత్యగత్తెలను దాటి నాయికల దగ్గరకు కూడా వచ్చాయి.

భర్త క్లబ్బులో కేబరేలు చూసేందుకు వెళ్తుంటే అడ్డుపడి ‘ఇంట్లోనే కేబరే చూపిస్తాన’ని నాయిక ‘మై కరూన్ రామ్ ముఝే బుడ్డా మిల్‍గయా’ అని పాడటంతో ట్రెండు మారింది. కొత్త నాయికలు రంగప్రవేశం చేయటంతో పేరు సంపాదించటం కోసం, సినిమాను ఏదో రకంగా హిట్ చేసి నిలద్రొక్కుకోవటం కోసం, నాయికలు కూడా చిలిపిపాటలు, రెచ్చగొట్టే  పాటలు ఆరంభించారు. ఇది లతను ఇబ్బందిలోకి నెట్టింది.

1950 దశకంలో అత్యధిక సంఖ్యలో పాటలు పాడిన లత పలు కారణాల వల్ల 1960 దశకంలో వెనుకపడింది. ఎస్డీ బర్మన్ పాటలు పాడననడం వల్ల కొంత, మహ్మమద్ రఫీతో యుగళ గీతాలు పాడకపోవటం వల్ల కొంత, శంకర్ జైకిషన్‍ల పాటలు పాడననటం వల్ల ఇంకొంత, రెచ్చగొట్టే పాటలు పాడననటం వల్ల మరికొంత, రాయల్టీ కోసం పోరాడటం వల్ల ఇంకాస్త లత డిమాండ్ తగ్గింది. కొత్త కొత్త గాయనిలు లత పాడాల్సిన పాటలు పాడుతున్నారు. ముఖ్యంగా ఏ గాయనితో పాడినా, ఆ గాయని అద్భుతంగా పాడిందనిపించే రీతిలో సహాయ సహకారాలందిస్తూ పాటను సూపర్ హిట్ చేసే మహమ్మద్ రఫీతో ఇతర గాయనిలు పాటలు పాడి ప్రాధాన్యం పొందుతున్నారు. ఇది కూడా లత పాటల సంఖ్యను తగ్గించింది. ఈ కాలంలో ముకేష్‍తో పాడిన కొన్ని యుగళ గీతాలు తప్ప లత పాడిన యుగళ గీతాలు ఇతర గాయనిలతో రఫీ పాడిన యుగళ గీతాల్లా సూపర్ హిట్‍లు కాలేదు. ముబారక్ బేగమ్ (ముఝ్ కో అప్నే గలే లగాలో) సుమన్ కళ్యాణ్‌పూర్ (దిల్ ఏక్ మందిర్ హై, కిత్‍నా  హై తుమ్ సె ప్యార్ ముఝే, ఆజ్ కల్ తెరె మెరె ప్యార్ కే చర్చె), శారద (జాన్-ఎ-చమన్ శోల బదన్) ఇలా అనేక గాయనిలతో రఫీ యుగళ గీతాలు హిట్ అవటం కూడా లత మంగేష్కర్‍ను అలోచనల్లోకి నెట్టింది. వీటన్నింటికీ తోడు నాయికలు కూడా చిలిపి పాటలు, వ్యాంపులను మించిన ద్వంద్వార్థాల పాటలు పాడటం, లత అలాంటి పాటలు పాడకపోవటం కూడా నిర్మాతలు ఇతర గాయనిల వైపు మళ్ళేట్టు చేసింది. ‘రాజ్ కుమార్’ సినిమాలో ‘ఆజా ఆయిబహర్’ అనే పాటను లత అద్భుతంగా పాడింది. కానీ ‘తుమ్‍నే పుకారా’ అనే యుగళ గీతం సుమన్ కళ్యాణ్‌పూర్ పాడింది. అదే సినిమాలో నిట్టూర్పులు, దీర్ఘంగా ఊపిరి పీలవటం ఉన్న ‘దిల్‍రూబా, దిల్ సే తూ’ పాటను రఫీతో ఆశా పాడింది. ఈ పాట కూడా నాయకుడు షమ్మీకపూర్, నాయిక సాధనాలపై చిత్రితమైంది. దాంతో సినిమా   పాటల రంగంలో నిలిచి ముందుకు సాగాలంటే   తన పద్ధతిని విశ్లేషించి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇదేనని లత గ్రహించింది. మహమ్మద్ రఫీతో రాజీపడింది. శంకర్ జైకిషన్‍లలో శంకర్ శారదను మరో లతగా మలుస్తానని శపథం చేశాడు కాబట్టి ఆయన పాటలు పాడకుండా జైకిషన్ పాటలు పాడేందుకు సిద్ధపడింది. అయితే తన కెరీర్‍ను తిరిగి సరైన దారిలో నడిపించేందుకు ఈ చర్యలు సరిపోవని గ్రహించింది లత. అతి సున్నితంగా తన గానశైలిని మార్చింది. అందుకే 1965 తరువాత లత పాటలను జాగ్రత్తగా గమనిస్తే ఆమె పాటల్లో అంతకుముందు, మృదువుగా, పాటలో అంతర్లీనంగా, implicit గా  భావప్రకటన చేసే లత, 1965 తరువాత పాటల్లో భావప్రకటన కొద్దిగా explicit  అయ్యింది.  అంతకు ముందులేని హొయలు, నక్రాలు, భావాన్ని వ్యక్తపరిచే తీరులో మార్పు తెలుస్తుంది. అలాగని ఆమె పాటలలోని భావంతో పదాల నాణ్యతతో రాజీపడలేదు. కానీ గతానికి భిన్నంగా పాటలోని శృంగార భావాన్ని మరింత ప్రస్ఫుటం చేస్తూ, అతి సున్నితంగా శృంగార భావనలను ఉద్దీపితం చేస్తూ, కాస్త చిలిపిగా, కాస్త చలాకీగా పాడటం ఆరంభించింది. ఇలా పాడటానికి నాందీ ప్రస్తావన లాంటిది. ‘యే సమా సమాహై యే ప్యార్ కా’ పాట. అంతవరకూ లత ఇలా పాడలేదు. ఈ పాటలో లత స్వరాన్ని ఓ విమర్శకుడు ‘The voice dripped in romantic honey of highest  grade  of seduction’ అన్నాడు. ‘గుమ్‍నామ్’ సినిమాలో హెలెన్‍పై చిత్రితమైన ‘ఇస్ దునియామే జీనా హైతో’ పాటను లత ఎంతో ఉత్సాహంగా, చలాకీగా పాడింది. ‘వాసనా’ సినిమాలో ‘జీనేవాలే ఝామ్ కే మస్తానే హో కే జీ’ అనే పాట కూడా లత ఇతర పాటలకు భిన్నంగా పాడింది. ‘ఏప్రిల్ ఫూల్’ సినిమాలో నాయిక సైరాబానుకు ‘మేరా నామ్ రీటా క్రిష్టినా’ అంటూ చలాకీగా, చిలిపిగా పాడింది. ‘అమన్’లో సైరాబానుకూ ‘ఐసురూ ఐసురూ’ అంటూ వగలుబోతూ, అతి చిలిపిగా పాడింది. ‘నైట్ ఇన్ లండన్’లో ‘ఔర్ మేరా నామ్ హై జమీలా’ అనే హెలెన్ పై చిత్రితమైన క్లబ్బు పాట పాడింది. ఈ పాటలో షర్టుల్లేని మొగవాళ్ళు లాగుతూ ఉండగా హెలెన్ నృత్యం చేస్తూ పాడుతుంది. లతా ఇలాంటి పాటలు పాడటం ఆరంభించింది కానీ ఇతర గాయనిల స్వరాల్లో పలికే ఉత్తేజితం చేసే ధ్వని,  రెచ్చగొట్టే లక్షణం, ఉద్రేకపరిచే భావం వంటివి లత పాడే పాటలలో లోపించాయి. కానీ 1960 దశకం చివరికి వచ్చేసరికి ఇలాంటి పాటలు ప్రత్యేకమైన నృత్యగత్తెలు కాక నాయికలే పాడటం మొదలైంది. షర్మిలా ఠాగోర్ స్విమ్ సూట్ వేసుకుని సంచలనం సృష్టించటమే కాదు ‘ఎన్ ఈనెవింగ్ ఇన్ పారిస్’లో పారిస్ నైట్ క్లబ్బుల్లో రెచ్చగొట్టే  దుస్తులలో పదాల్లోలేని  అసభ్యార్థాన్ని సూచించే కదలికలతో ‘జుబి జుబిజుబి’, ‘లేజా లేజా మేరా దిల్’ వంటి పాటలు పాడుతూ నృత్యాలు చేసింది. ఈ రెండు పాటలలో ఒకటి ఆశా భోస్లే పాడింది. మరొకటి శారద పాడింది. ఒకప్పటి నాయికలు తెర వెనక్కు వెళ్తూంటే శారీరక ప్రదర్శనతో, వ్యాంపులాంటి నృత్యాలతో ప్రేక్షకులను ఆకర్షించే నాయికలు తెరపైకి వస్తున్నారు. ముంతాజ్, తనూజ,  జీనత్ అమన్, రేఖ వంటి వారు ఒకవైపు; హేమామాలిని, జయాభాదురి, రాఖీ ,  మౌసమీ ఛటర్జీ,  వంటి వారొకవైపుగా కొత్త నాయికలు సినీరంగంపై పట్టు సంపాదిస్తున్నారు. దాంతో 1950, 1960 దశాబ్దాలలో నాయికల స్వరంగా నిలచిన లత, 1970 దశకంలోనూ నాయిక స్వరంగా నిలవాలంటే తన నియమాలను కొద్దిగా సడలించాల్సి వచ్చింది. ఫలితంగా ‘బిందియా చంకేగీ’, ‘హాయ్ హాయ్ యే మజ్బూరీ’, ‘బాహోంమే చలే ఆవో’, ‘దో ఘూంట్ ముఝే భీ పిలాదో ‘, ‘థోడాసా ఠహరో’, ‘ఛోటీసీ ఉమర్ మే లగ్ గయ రోగ్’, ‘బల్మా  సిపాహియా ‘, ‘థోడా రేషమ్ లగ్తాహై’, ‘దరియా కినారె ఏక్ బంగ్లా’, ‘కాంటా లగా’, వంటి పాటలు పాడాల్సి వచ్చింది లతకు. అయితే ఈ పాటలు కూడా క్లాసిక్‍లుగా నిలిచి, సూపర్ హిట్‍లయ్యే రీతిలో పాడింది. కానీ, ఇలాంటి పాటలు తప్పదు కాబట్టి పాడింది కానీ గతంలో పాటల్లా ఆనందిస్తూ మమేకమై పాడినట్టు తోచదు. అంతేకాదు ఈ పాటలు ఎంతగా సూపర్ హిట్‍లైనా లత ఎక్కడా ఇలాంటి పాటలను ప్రస్తావించదు. తాను పాడిన చక్కటి పాటల జాబితాలో ఈ పాటలను చేర్చదు. లత ఎక్కడ పాటలు పాడేందుకు వెళ్ళినా, ఎవరు ఎంతగా బ్రతిమిలాడినా, ఎంతటివారు కోరినా ఈ పాటలను లత ఎప్పుడూ స్టేజీమీద పాడలేదు. తాను ఇలాంటి పాటలు స్టేజీ మీద పాడనని స్పష్టం చేసింది.  అంతేకాదు, తాను స్టేజీమీద పాడుతూంటే ఎవరూ నృత్యం చేసేందుకు కూడా ఆమె అనుమతినివ్వదు. పాట  నచ్చితే, పాట అయినతరువాత కరతాళధ్వనులు చేయమంటుంది తప్ప, ఎలాంటి ఇతర ఆనందప్రదర్శనకూ లత ఒప్పుకోదు.  కానీ సినిమాల్లో లత ఇలాంటి పాటలు అయిష్టంగానైనా పాడటం వెనుక ఉన్న ప్రధాన కారణం, సినీ నేపథ్య ప్రపంచంలో తాను వెనుకపడకూడదన్న ఆలోచన మాత్రమే. అయితే ఇతర గాయనిలతో పోలిస్తే లత పాడిన పాటలు ఉద్రేకపరిచేవిగా ఉండవు. పాటల్లో నిట్టూర్పులు, ఆయాసాలు ఉండవు. పాటల్లో పదాల ధ్వని కూడా మరో అర్థాన్నిచ్చేదిగా ఉండదు. లత స్వరంలో కూడా ఎక్కడా వెకిలితనం కనబడదు. ‘బాహోమ్ చలే ఆవో’ పాటను ఇతర ఏ గాయని పాడినా అంత చక్కగా క్లాసిక్‍గా పవిత్రంగా అనిపించేది కాదు. అయితే లత ఇలాంటి పాటలు పాడటంలో కూడా శాస్త్రీయ సంగీయ ఛాయలు చిలికిస్తూ ఏమాత్రం అసభ్యంగా అనిపించే వీలులేకుండా, వింటుంటే చెవుల్లో అమృతం పోస్తూ, నాలికపై తేనె చిలికిస్తూన్నట్టుండే రీతిలో పాడటానికి నాందీ ప్రస్తావన చేసిన పాట ‘ఆ జాన్ -ఎ-జా’.

లత ‘ఆ-జాన్-ఎ-జా’ పాట పాడటం పెద్ద సంచలనం సృష్టించింది. ఆ పాడటం సంగీత దర్శకులు లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍ల కోసం అవటం ఇంకా పెద్ద సంచలనం సృష్టించింది. హిందీ సినీ సంగీత ప్రపంచంలో పెనుమార్పులు వస్తున్న కాలం అది. ఎలాగైతే నటీనటుల్లో ఒకప్పటి దిగ్గజాలు తెరమరుగై కొత్త తరం ముందుకు వస్తొందో, అలాగే దిగ్గజాలు  అనదగ్గ సంగీత దర్శకులు వెనుకపడి యువ సంగీత దర్శకులు ఉప్పెనల్లా విరుచుకుపడుతున్న కాలం అది. అనిల్ బిశ్వాస్ సినీరంగం వదిలేశాడు. సి. రామచంద్ర శకం అయిపోయింది. నౌషాద్ తన సంగీతాన్ని ఆధునీకకరణం చేయాలని విఫల ప్రయత్నాలు చేస్తూ భంగపడుతున్నాడు. ఎస్డీ బర్మన్ ఏనాడూ నెంబర్ వన్ కాదు. రోషన్ మరణించాడు. మదన్ మోహన్ చక్కని పాటలు రూపొందిస్తున్నా, వ్యాపారపరంగా ఆయన ఏనాడు గెలుపు గుర్రం కాదు. శంకర్ జైకిషన్‍లు తమ అంతః కలహాలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా శైలేంద్ర మరణం, శారద రంగప్రవేశం వారి సృజనను దెబ్బతీస్తున్న అంశాలు. ఈ సమయంలో కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, ఆర్డీ బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍లు పాత సూపర్ హిట్ సంగీత దర్శకులను అనుకరిస్తూనే తమదైన ప్రత్యేక గేయ నిర్మాణ శైలితో తెరపైకి వస్తున్నారు. వీరిలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍లు సంగీత రచనలోనే కాదు, వ్యాపారపరంగా కూడా తమ సృజనాత్మకతను, నిర్మాణాత్మక దృక్పథాన్ని ప్రదర్శిస్తూ నెంబర్ వన్ స్థానం వైపు దూసుకుపోతున్నారు. అయితే సంగీత దర్శకుల తరం మారుతున్నా లతకు పెద్దగా కష్టం కలగలేదు. కారణం వీరంతా లత స్వరం ఆధారంగా తమ కెరీర్లను నిర్మించుకుంటున్న వారు కావటం. వీరిలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ పూర్తిగా లతపైనే ఆధారపడినవారు. లత సైతం నిర్మాతలకు లక్ష్మీప్యారేల పేర్లు సూచించటం, వారి పాటలు పాడటంలో ప్రత్యేక శ్రద్ధ చూపటంతో పాటు, వారి పాటలు పాడేందుకు నియమాలు సడలించటం, సినీ రంగంలో చర్చనీయాంశం అయింది. లక్ష్మీ ప్యారేలు సృజనపరంగా అతి చక్కటి బాణీలు సృజిస్తూ తమ పాటల బలంతో సినిమాలను హిట్‍లు చేస్తూ వచ్చారు. వ్యాపారపరంగా వారు పెద్ద నిర్మాణ సంస్థలను తమవైపుకు ఆకర్షించి, ఒక్కసారి తమ దగ్గరకు వచ్చిన వారిని ఎటూ పోనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకున్నారు. శంకర్ జైకిషన్‍ నుండి రాజ్ కపూర్, ఎల్వీ ప్రసాద్, ఓం ప్రకాశ్, ఎస్. ముఖర్జీ వంటి నిర్మాతలను తమవైపు ఆకర్షించారు. కణ్యాణ్‌జీ ఆనంద్‌జీల నుంచి మనోజ్ కుమార్, మన్మోహన్ దేశాయ్, సుభాష్ ఘయ్ వంటి నిర్మాతలను ఆకర్షించారు. ఇలా ప్రతి పెద్ద నిర్మాణసంస్థను, నిర్మాతను తమవైపు ఆకర్షించటమే కాదు, అలా ఆకర్షించిన తరువాత వారు దశాబ్దాల తరబడి తమతోనే పనిచేసేట్టు సంతృప్తికరమైన సంగీతాన్ని అందించి తన అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. ఇందుకు లత ఎంతో సహాయం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ‘మై కరూ రామ్’ లాంటి పాట పాడించినందుకు రాజ్‍కపూర్, శంకర్ జైకిషన్‍లతో తెగతెంపులు చేసుకున్న లత, లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍ల కోసం ‘ఆ జాన్-ఎ – జా’ వంటి పూర్తి క్యాబరే పాటను అత్యద్భుతంగా పాడటం సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍లకు లత ఇతరుల కన్నా ప్రత్యేకంగా సహాయ సహకారాలందిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు సంగీత దర్శకులు లతపై అలిగారు కూడా. కానీ ‘గెలుపు గుర్రం’ మనదయినప్పుడు ఇతరులు ఎంతగా వ్యతిరేకమైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

లక్ష్మీప్యారేలతో తన అనుబంధాన్ని లత పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా వివరించింది.

“ప్రతి వ్యక్తికీ తనదైన ప్రత్యేక అదృష్టం అంటూ ఒకటి ఉంటుంది. ఆ వ్యక్తి జీవితం దాని ప్రకారం నడుస్తుంది. ఆ వ్యక్తి విజయం సాధించటం, పేరు ప్రఖ్యాతులు పొందటం అతని భాగ్యరేఖ మీద ఆధారపడి ఉంటుంది. ఒకోసారి కొందరు సంగీత దర్శకుల తొలిపాటలు నేను పాడతాను. అవి సూపర్ హిట్‍లు అవుతాయి. ఇలా వారికి పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అవుతుంటే కొందరికి నేను ఫలానా సంగీత దర్శకుడికి ప్రత్యేకంగా పాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే, లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍లు సినిమాల్లోకి రాకముందు నుంచీ నాకు తెలుసు. అరవయ్యవ శతాబ్దపు ఆరంభంలో హృదయనాథ్ మంగేష్కర్ ‘సురేల్ బాల కళాకేంద్రం’ను స్థాపించాడు. యువ గాయనీ గాయకులకు శిక్షణ నిచ్చి, ప్రొత్సహాన్నిచ్చేందుకే సంస్థను స్థాపించాడు. మీనా, ఉషాలు కూడా ఇక్కడ పాడేవారు. బొంబాయి పరిసర ప్రాంతాలలో ఉన్న యువ గాయనీ గాయకులు ఇక్కడికి వచ్చేవారు. లక్ష్మీకాంత్‍ను నేను తొలిసారిగా సైగల్ సోదరుడు మహేంద్ర సహగల్ దగ్గర మాండోలిన్ వాయిస్తూండగా చూశాను. అప్పుడతడికి పదేళ్ళు కూడా సరిగ్గా ఉండవు. ఇలాంటి ప్రతిభావంతులైన యువ కళాకారులకు ఏదైనా సహాయం చేయమని మహేంద్ర అభ్యర్థించాడు. ప్యారేలాల్‍ను నేను పలుమార్లు అతని తండ్రి పండిత్ రామ్ ప్రసాద్ శర్మతో చూశాను. అతడు వయోలిన్ అద్భుతంగా వాయిస్తాడు. ట్రంపెట్ కూడా వాయిస్తాడు. వీరిద్దరూ ‘సురేల్ బాల కళాకేంద్రం’లో చేరారు. అక్కడ నేను వారిద్దరి పనితీరును చూశాను. అలా లక్ష్మీప్యారే నాకు వారి బాల్యం నుంచీ తెలుసు. వారి ఎదుగుదలను నేను చూశాను. వారు స్వతంత్ర సంగీత దర్శకులుగా ఎదిగినప్పుడు, నేను ఇతర యువ సంగీత దర్శకులకు ఏ రకంగా సహాయం చేస్తానో, అలానే వారికీ సహాయం చేశాను. హృదయనాథ్‍తో కలసి పనిచేయటం వల్ల లక్ష్మీప్యారేలు మా ఇంటికి తరుచూ వస్తూ పోతూండేవారు. వాళ్ళ ప్రతిభను గమనించి నేను శంకర్ జైకిషన్, గులామ్  మహమ్మద్, నౌషాద్, మదన్ మోహన్ వంటి సంగీత దర్శకులకు వీరిద్దరినీ ఉపయోగించుకోమని సూచించాను. తరువాత లక్ష్మీప్యారేలు, కళ్యాణ్‍‍జీ ఆనంద్‌జీల వద్ద అసిస్టెంట్లుగా పనిచేశారు. ‘నాగిన్’ సినిమాలో ‘జాదూగర్ సయ్యాన్’, ‘లాజవంతీ’లో ‘కోయీ ఆయా ధడ్‌కన్ కహతీహై’ వంటి పాటలలో లక్ష్మీకాంత్ మాండోలిన్ వాయించాడు. ‘హకీకత్’లో పాట ‘మై యే సోచ్‍కర్’ కు వయోలిన్ వాయించింది ప్యారేలాల్. ఇది వారిద్దరి ప్రతిభను నిరూపిస్తుంది. నేను వారి పేర్లు సంగీత దర్శకులకు సూచించినా వారిలో ప్రతిభ లేకపోతే ఏ సంగీత దర్శకుడు కూడా వారిని ఆదరించడు. ప్రతిభ లేని వారు ఎంత దూరం పోగలరు? ప్రతిభ ఉన్నా అదృష్టం లేనివారు ఎంత కాలం నిలబడగలరు? కాబట్టి నేను లక్ష్మీ ప్యారే‍లకు ప్రత్యేకంగా పాడుతున్నానన్నది అర్థం లేని మాట. నేను లక్ష్మీప్యారేకు హిట్ పాటలు పాడుతున్న సమయంలోనే ఎస్డీ బర్మన్, చిత్రగుప్త, కళ్యాణ్‍జీ ఆనంద్ జీ, ఆర్డీ బర్మన్, బప్పీలహరిలకు కూడా అంతే హిట్ పాటలు పాడేను” అంటుంది లత. అంటే లత అందరికీ ఒకేలా పాడింది. కానీ కొందరి పాటలు అధికంగా హిట్ అవటం, వారు లత పట్ల విధేయత ప్రదర్శిస్తూ అధికంగా పాటలు లతతో పాడించటం వల్ల, సినీ పరిశ్రమలో వదంతులు వ్యాపింపచేసేవారు – లత ఒక సంగీత దర్శకుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్న వదంతిని లేవదీశారన్నమాట. అయితే ఇలాంటి వ్యాఖ్యలను, వదంతులను లత ఎప్పుడో పట్టించుకోవటం మానేసింది. ఇలాంటి వ్యాఖ్యలకు, ఊహలకు స్పందించటం వదిలేసింది. ఎవరైనా ఇంటర్వ్యూల్లో ఈ ప్రశ్న అడిగితే నవ్వి వదిలేసేది.

అయితే లక్ష్మీప్యారే, కళ్యాణ్‍జీ ఆనంద్‌జీ, ఆర్డీ బర్మన్ వంటి ఎదుగుతున్న సంగీత దర్శకులు తమ కెరీర్లు లతతో ప్రారంభించటం, లత కోసం ప్రత్యేకంగా బాణీలు సృష్టిస్తూండటంతో, పాత సంగీత దర్శకుల తరం వెనక్కు వెళ్ళిపోయినా కెరీరు పరంగా లతకు నష్టం కలగలేదు. అలలు వస్తూ పోతున్నా ఎలాంటి నష్టం లేకుండా గంభీరంగా నిలచే సముద్రంలా లత స్థిరంగా నిలచి ఉంది. వచ్చిపోయే అలల్లా ఒక తరం సంగీత దర్శకులు తీరాన్ని తాకి, తమ వంతు చక్కని పాటలను లతతో పాడించి, తమ పని అయిపోగానే వెనక్కి మళ్ళిపోతూ, దూసుకువస్తున్న నూతన తరం సంగీత దర్శకులకు దారి ఇస్తూ వెళ్ళిపోయారు. ఈ రకంగా గులామ్ హైదర్, ఖేమ్‌చంద్ ప్రకాశ్‍ల వంటి దర్శకులు, శంకర్ జైకిషన్, నౌషాద్, ఎస్డీ బర్మన్ వంటి ప్రతిభావంతులతో పనిచేస్తూ లత 1970 దశకంలో కళ్యాణ్‍జీ ఆనంద్ జీ, ఆర్డీ బర్మన్, లక్ష్మీ ప్యారేల పాటలు పాడుతూ, మారుతున్న సినీ ప్రపంచం మార్పులో తానూ భాగమవుతూ ముందుకు సాగింది. ‘బేటీ’  అనిపిలిచే సంగీత దర్శకులు పోయి, ‘లతా’ అని పిలిచే సంగీత దర్శకుల తరం దాటి ‘దీదీ’ అనే సంగీత దర్శకుల తరంతో  పనిచేయటం ఆరంభించిందన్నమాట లత.

1970 దశకంలో లత పాటలు పాడిన తీరు, మారుతున్న సినీ ప్రపంచంతో అడుగులో అడుగు కదుపుతూ ముందుకు సాగుతూ కూడా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న తీరును విశ్లేషించే కన్నా ముందు 1950-60 దశకాల్లో లత సినీ సంగీత జీవితంలో అంతగా అందరికీ తెలియని ఓ మహత్తర ఘట్టం గురించి ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా శాస్త్రీయ సంగీతం తెలిసిన గాయనీ గాయకులు ఏదో ఓ సందర్భంలో సంగీత దర్శకత్వం వహించి గీతాలను సృజిస్తారు. ఖేమ్‌చంద్ ప్రకాశ్ మరణం తరువాత ఆయన అసంపూర్తిగా వదలిన సినిమాలకు, మన్నా డే సంగీత దర్శకత్వం బాధ్యతలు వహించాడు. గాయకుడిగానే కాక సంగీత దర్శకుడిగా కూడా కిషోర్ కుమార్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సగీత దర్శకుడు ఎన్.దత్తకు గుండెపోటు వచ్చినప్పుడు సుధ మల్హోత్ర ‘తుమ్ ముఝే భూల్ భీ జావో’ అనే పాటను రూపొందించింది. హేమంత్ కుమార్ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా చక్కటి పేరు గడించాడు. ఎస్డీ బర్మన్, ఆర్డీ బర్మన్, రవి, లక్ష్మీకాంత్ వంటి వారు సంగీత దర్శకత్వం వహిస్తూ అప్పుడప్పుడు పాటలు పాడేరు. గాయకుడిగా రంగ ప్రవేశం చేసిన మదన్‍మోహన్ సంగీత దర్శకుడయ్యాడు. ఈ రకంగా గాయకుడికి ఏదో ఓ సందర్భంలో సంగీత దర్శకుడవ్వాలని ఉంటుంది. లతా మంగేష్కర్ అనేక సందర్భాలలో తాను పాడిన పాటలలోని ఆలాపనలను తానే సృజించేది. సంగీత దర్శకుల ఆమోదంతో పాటలలో ఆ ఆలాపనలను పొందుపరచేది. అలా లతా మంగేష్కర్ కొన్ని సినిమాలకు స్వతంత్ర సంగీత దర్శకురాలిగా కూడా పనిచేసింది!

మరాఠీ సినిమాల్లో పేరుగాంచిన నిర్మాత దర్శకుడు బాలాజీ పెండార్కర్ ‘మోహిత్సంచీ మంజులా’ అనే సినిమాను నిర్మిస్తూ ఆ సినిమాకు సంగీత దర్శకత్వం వహించల్సిందిగా లతను అభ్యర్థించాడు. ఆ సినిమా శివాజీ మహారాజు జీవితంపై ఆధారపడినది. నిజానికి ఆయన సినిమా నిర్మాణం తలపెట్టగానే తనతో ఎప్పుడూ కలసి పనిచేసే సంగీత దర్శకుడిని సంప్రదించాడు. ఆయన ఆ సమయంలో వేరే సినిమా పనిలో నిమగ్నమై ఉన్నాడు. అది పూర్తయితే కానీ బాలాజీ సినిమాకు పనిచేయలేనన్నాడు. కానీ బాలాజీకి సినిమా నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఉంది. ఈ విషయం తెలిసిన లత వారిద్దరి మిత్రుల మధ్య ‘అవసరమైతే నేను సహాయం చేస్తాన’ని అంది. విషయం తెలిసిన బాలాజీ పెండార్కర్ తన సినిమాకు సంగీత దర్శకత్వం వహించమని లతను కోరాడు. ఇది లతను ఇరుకున పడేసింది. ఎందుకంటే, సినిమాకు సంగీత దర్శకత్వం వహించటం పెద్ద సమస్య కాదు, కానీ పాటలు హిట్ కాకపోతే లత పరువు పోతుంది. ఆమెను వ్యతిరేకించే వారికి లతను విమర్శించేందుకు, తక్కువ చేసేందుకు ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టవుతుంది. అదీగాక, లత స్వతంత్రంగా సంగీత దర్శకత్వం వహించి ఓ సినిమాను హిట్ చేసిందన్న విషయం తెలిస్తే, ఇతర సంగీత దర్శకులు లతను తమకు పోటీగా భావించి ఆమె వాడకాన్ని తగ్గించే వీలుంది. హేమంత్ కుమార్ సంగీత దర్శకుడిగా బొంబాయి సినీ రంగంలో అడుగుపెట్టినప్పుడు, నిర్మాతలు ఆయనను ఆదరించారు. గాయకుడిగా పాటలు పాడినప్పుడు ఇతర సంగీత దర్శకులు   హేమంత్ కుమార్‍కు అవకాశాలిచ్చి చక్కటి పాటలు పాడించారు. ఎప్పుడైతే ‘నాగిన్’ సినిమాతో వ్యాపారపరంగా హిట్ సంగీతం ఇవ్వగలడు హేమంత్ కుమార్ అని నిరూపితమైందో, అప్పుడు సంగీత దర్శకులు హేమంత్ కుమార్ వాడకం తగ్గించడమే కాదు అతనికి పోటీగా అతనిలానే పాడే ‘సుబీర్ సేన్’ ను తెచ్చి అతనితో హిట్ పాటలు పాడించారు. దాంతో తనకు సరైన అవకాశాలు రావటం లేదని హేమంత్ కుమార్ స్వయంగా సినిమాలు నిర్మించటం ప్రారంభించాడు. అందువల్ల తమకు పోటీగా వస్తున్నాడని నిర్మాతలు సైతం హేమంత్ కుమార్‍ను వాడటం తగ్గించారు. ఈ రకంగా అన్నివైపుల నుంచి నష్టపోయి సినీరంగం వదలాల్సి వచ్చింది హేమంత్ కుమార్‍కు. కాబట్టి తానో సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తే తన నేపథ్య గాన కెరీరు దెబ్బతినే వీలుంటుందని లతకు తెలుసు. అందుకని ఆమె సందిగ్ధంలో పడింది.   లత తాను మారుపేరుతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరిస్తాననీ, అది ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉండాలని కోరింది. నిర్మాత అందుకు ఒప్పుకున్నాడు. ఫలితంగా ‘ఆనందఘన్’ అన్నమారు పేరుతో లత ‘మొహిత్సాంచీ మంజులా’ సినిమాకు సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించింది. ఇది మరాఠీ ‘సంత్ కవి’ రామదాసు స్వామీ కవితలోంచి ఎంచుకున్న పేరు. ఈ పదం అర్థం లతకు చాలా నచ్చింది. ‘ఆనందఘన్’ అంటే ‘ఆనందం వర్షించే మేఘం’ అని అర్థం.

ఓ వైపు ఇతర సంగీత దర్శకుల పాటలు రోజంతా పాడుతూ, మరోవైపు స్వతంత్రంగా సంగీత దర్శకత్వ బాధ్యతలు వహించటం అంత సులభం కాదు. పాటలోని పదాలను టెలిఫోన్‍లో ఆమెకు చెప్తూంటే సందర్భానికి తగినట్టు బాణీని ఆమె టెలిఫోన్‍లోనే తయారుచేసేది. తనకు సహాయ సంగీత దర్శకుడిగా ఉండమని లత, హృదయనాథ్‍ను అడిగింది. కానీ అతడు తిరస్కరించాడు. అందుకని తనతో తొలిసారి పాట పాడించిన సంగీత దర్శకుడు, సన్నిహితుడు అయిన ‘దత్తాడావజేకర్’ ను తనకు సహాయ సంగీత దర్శకుడిగా ఉండమని లత అభ్యర్థించింది. ఆయన అందుకు ఒప్పుకున్నాడు. ఈయననే లతకు సినిమాయేతర పాటలు పాడమని సలహా ఇచ్చింది. ఈ రకంగా ఈ సినిమా పాటలను లత రూపొందించింది. ఆశా, ఉషా, హృదయనాథ్‍లు ఈ సినిమాలో పాటలు పాడేరు. ఈ రకంగా ‘రామ్ రామ్ పాహ్ణీం’ (1950), ‘మొహిత్సాంచీ మంజులా’ (1962), ‘మరాఠా తితుకా మేలవాహి’ (1964), ‘సాధీ మాణసం’ (1965), ‘తాంబాడీ మాతీ’ (1969) సినిమాలకు  సంగీత దర్శకత్వం వహించింది. ఇందులో ‘రామ్ రామ్ పాహ్ణీం’ సినిమాకు మాత్రం లత పేరు మీదనే సంగీత దర్శకత్వం వహించింది.

అయితే ఇలా మారుపేరుతో సంగీత దర్శకత్వం వహించే ‘రహస్య నాటకం’ ఎక్కువ కాలం సాగలేదు. 1966లో మహారాష్ట్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో ఎనిమిది అవార్డులు ‘సాధీ మాణసం’ సినిమాకు లభించాయి. ఆ లభించిన అవార్డుల్లో ఉత్తమ సంగీత దర్శకత్వం అవార్డును ‘ఆనంద్ ఘన్’ కు ప్రకటించారు. దాంతో తెరవెనుక నుంచి లత బయటకు రాక తప్పలేదు. కానీ ఆ తరువాత ‘తాంబడీ మాతీ’ అనే ఒక్క సినిమాకు సంగీత దర్శకత్వం వహించి, సంగీత దర్శకత్వానికి స్వస్తి చెప్పింది లత.

లత కేవలం నేపథ్య గానంతో లభించిన ఖ్యాతితో సంతృప్తిపడలేదు. ప్రైవేటు పాటలు పాడింది. భజనలు పాడింది. సంగీత దర్శకత్వం వహించింది. ముఖ్యంగా తరాలు మారుతున్నా తాను మారనని మొండిపట్టు పట్టకుండా, మౌలిక విలువలతో రాజీపడకుండా నవతరం అడుగులో అడుగు కలుపుతూ, విశిష్టంగా పాడుతూ, నవతరం స్థాయిని పెంచుతూ ముందుకు సాగింది లత.

1970 దశకంలో లత ముందు చిన్నపిల్లలైన కళ్యాణ్‌జీ ఆనంద్‍జీ, ఆర్డీ బర్మన్, లక్ష్మీ ప్యారేలు పెద్ద సంగీత దర్శకులయ్యారు. లత ఎత్తుకుని పసి పిల్లలప్పుడూ ముద్దు చేసిన రాజేష్ రోషన్, బప్పీ లహిరీలు సినీ పాటల దిశను నిర్దేశించే స్థాయికి సంగీత దర్శకులయ్యారు. ఎస్డీ బర్మన్‍కు పాడిన లత ఆర్డీ బర్మన్‍కూ పాడింది. రోషన్‍కు పాడిన లత రాజేష్ రోషన్‌కూ పాడింది. అపరేష్ లహరితో కలసి పాడిన లత బప్పీ లహరితో పాడింది. చిత్రగుప్త సంగీత దర్శకత్వంలో పాడిన లత 1980-90లలో ఆనంద్ – మిళింద్‍ల సంగీత దర్శకత్వంలోనూ పాడింది. ప్యారేలాల్‍కు గిటార్ నేర్పటంలో సహాయం చేసిన లత, ప్యారేలాల్ దగ్గర గిటార్ నేర్చుకున్న జతిన్ – లలిత్‍కూ పాడింది. సులక్షణ  పండిత్, విజయేత  పండిత్‍లకు నేపథ్య గానం అందించిన లత, వారి సోదరులు జతిన్ – లలిల్‍లతోనూ పాడింది. నూతన్, తనూజలకు పాడిన లత – తనూజ కూతురు కాజల్‍కూ పాడింది. ఈ రకంగా నాయికలు వస్తున్నారు, పోతున్నారు, సంగీత దర్శకులు వస్తున్నారు, పోతున్నారు.  సహ గాయనీ గాయకులు వస్తున్నారు, పోతున్నారు, తరాలు మారుతున్నాయి. అభిరుచులు మారుతున్నాయి. ధోరణి మారుతోంది. అయినాసరే ‘లత’, ‘లత’లానే నిలుస్తూ – మారుతున్న కాలానికనుగుణంగా మారుతూ నిరంతరం, తరంతరం ప్రవహించే నదిలా, అందరి గౌరవ మన్ననలందుకుంటూ తన స్వరం బలంతో ప్రతిభా పాటవాలతో తరాల అంతరాలను అధిగమిస్తూ పాడుతూ ప్రవహిస్తూనే ఉంది. ‘మానోతో తోమై గంగా మా హూన్, న మానెతో బహతా పానీ’ అంటూ 1970లలో ప్రవేశించిన 1970లో పాడిన పాటలను,  లత గాన సంవిధానాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. సుదీర్ఘకాలం అగ్రస్థానంలో నిలిచిన కారణాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version