[dropcap]హా[/dropcap]యే రే వో దిన్ క్యోం న ఆయే
జా జా కె ఋత్ లౌట్ ఆయే
జనసమ్మోహిని రాగం కర్ణాటక సంగీతానికి చెందిన రాగం. ఈ రాగాన్ని శివ కళ్యాణ రాగం అంటారు. ఉత్తర భారత శాస్త్రీయ సంగీతం లోంచి ఈ రాగం అదృశ్యం అయిపోయింది. పండిత్ రవిశంకర్ ఈ రాగాన్ని కర్ణాటక సంగీత విద్వాంసుల వద్ద విన్నాడు. సమ్మోహితుడయ్యాడు. విరహ వేదనను, గతకాలపు జ్ఞాపకాలను తలచుకుంటుంటే మనసులో కలిగే ఆవేదనను, భగవంతుడిపై అచంచల విశ్వాసాన్ని ప్రకటించే ఈ రాగం కళావతి రాగానికి అతి దగ్గరగా ఉంటుంది. పలువురు ఈ రాగాన్ని కళావతి రాగం అనుకుంటారు. కానీ కళావతి రాగంలోని స్వరాలకు ‘రి’ స్వరాన్ని జోడించటం వల్ల అది జనసమ్మోహిని రాగం అవుతుంది. ఉత్తర భారతంలో అదృశ్యమైపోయిన ఈ రాగాన్ని పండిత్ రవిశంకర్ జనసమ్మోహిని పేరుతోనే హిందుస్తానీ సంగీతంలో ప్రచారానికి తెచ్చాడు. ఈ రాగానికి ప్రాచుర్యం కల్పించటంలో భాగంగా ‘అనురాధ’ సినిమాలో, నాయిక గతాన్ని తలచుకుంటూ వగచే సన్నివేశంలో పాటను జన సమ్మోహని రాగంలో రూపొందించాడు. నిజంగా హృదయ సమ్మోహన గీతం ఇది. పాట వింటుంటే మనసులో తీయని వేదన కలుగుతుంది. లత తీసే రాగం హృదయ వేదనను తీగలాగా లాగుతుంది. మనసును వేదనతో మెలిపెడుతుంది. ఆనందం కలిగించే వేదన అది. గంధర్వ గానం సామాన్య మానవుల అనుభూతికి తెచ్చేందుకు దివి నుంచి భువికి వచ్చిన గంధర్వులు, సరస్వతిని స్వరంలో ఇముడ్చుకున్న లత స్వర వైశిష్ట్యాన్ని ప్రకటితం చేసేందుకు ఇలాంటి పాటలను రూపొందించి అందించారన్న నమ్మకం బలంగా కలుగుతుంది ఇలాంటి పాటలు అనుభవిస్తుంటే.
ఈ జగత్తు నిత్య చంచలం. నిత్య పరిణామ శీలి. ఇక్కడ ఏదీ స్థిరంగా ఉండదు. మారనిదంటూ ఏదైనా ఉంటే అది ‘ఏదీ మారకుండా ఉండదు’ అన్న సూత్రం. అందులో కోట్లలో వ్యాపారం జరుగుతూ వ్యక్తుల అదృష్టాలను నిర్ణయించే సినీ ప్రపంచంలో మార్పులు అనివార్యం. 1969లో విడుదలైన ‘ఆరాధన’ పాటలు సినీ సంగీత ప్రపంచంలో విపరీతమైన ప్రకంపనలు సృష్టించాయి. ‘మేరే సప్నోంకి రానీ కబ్’, ‘రూప్ తెరా మస్తానా’, ‘కోరా కాగజ్ థా’ వంటి పాటలతో కిషోర్ కుమార్ సినీ ప్రేమికులను ఉర్రూతలూగించాడు. రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ అయ్యాడు. రాజేష్ ఖన్నా పట్ల ప్రజలు ప్రదర్శించిన వెర్రి అభిమానం కనీవినీ ఎరుగనిది. అంతవరకూ దిలీప్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్‍లు అగ్రశ్రేణి హీరోలుగా చలామణీ అవుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ రాజేష్ ఖన్నా పట్ల ప్రజలు చూపిన వెర్రి అభిమానం అంతవరకూ సినీ పరిశ్రమ ఎరగనిది. రాజేష్ ఖన్నా స్వరంగా కిషోర్ కుమార్ ఎదిగాడు.
కిషోర్ కుమార్ మొదట మంచి గాయకుడిగా అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ పాటలు పాడటం కన్నా హీరోగా నటిస్తేనే డబ్బులు అధికంగా వస్తాయని అన్న అశోక్ కుమార్ తమ్ముడిని నటనవైపు మళ్ళించాడు. దాంతో ఎవ్వరూ గాయకుడిగా కిషోర్ కుమార్‍కు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. తన పాటలు, మిత్రుడు దేవ్ ఆనంద్ పాటలు మాత్రమే పాడేవాడు. చివరికి తన పాటలు పాడుకోవటానికి కూడా కొత్తల్లో కిషోర్ కుమార్ కష్టపడాల్సి వచ్చింది. సలిల్ చౌదరీ, గాయకుడిగా కిషోర్
శంకర్ జైకిషన్‍లలో జైకిషన్ మరణించటం, నౌషాద్, ఓ.పి. నయ్యర్ కెరీర్లు దాదాపుగా సమాప్తమైపోయిన పరిస్థితి రావటంతో కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, ఆర్డీ బర్మన్, లక్ష్మీ ప్యారేలు అగ్రశ్రేణి సంగీత దర్శకులుగా గుర్తింపు పొందారు. వీరిలో కళ్యాణ్‌జీ ఆనంద్‍జీ లత స్వరం వాడటం కన్నా ఆశా భోస్లే, ఇతర యువ గాయనిలతో పాడించేందుకు మొగ్గు చూపించటం ప్రారంభించాడు. ఆర్డీ బర్మన్, ఆశా భ్లోస్లేల జోడీ 1970లలో పాటలకు ప్రతీకగా ఎదిగింది. ‘దమ్ మారో దమ్’, ‘పియా తూ అబ్ తో ఆజా’, ‘దునియామే లోగోంకో’ వంటి పాటలు దేశాన్ని కుదిపేశాయి. లక్ష్మీప్యారే మాత్రం లతకు విధేయులుగా ఉన్నారు. వారు లత కాక మరో గాయనివైపు చూశారంటే అర్థం ఆ పాట లత స్థాయి పాట కాదని అర్థం. ఈ దశకంలోనే వాణీ జయరాం, రూనా లైలా, సులక్షణా పండిత్, అనురాధా పౌఢ్వాల్ వంటి నూతన గాయనిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.
‘ఆ… జాన్ – ఎ-జా’ పాటతో 1970 దశకాన్ని ఆహ్వానించిన లత, తన స్వరంలో అతి సున్నితంగా వస్తున్న మార్పులను అర్థం చేసుకుంది. సినీ ప్రపంచంలో పాటలలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుంది. నాయికల ప్రాధాన్యం తగ్గిందన్న గ్రహింపు 1960 చివర్లోనే కలిగి ఉండాలి. కాబట్టి పాటల ఎంపిక విషయంలో కాస్త సడలింపు నిచ్చింది లత. అలా హిట్ పాటలు పాడటం వల్ల 1970 లోనూ నాయికల స్వరం తానే అని నిరూపించింది. అయితే సంగీత దర్శకుడు ఎవరైనా సరే, లతను తన పాటలు పాడమని అడిగేందుకు, లత స్థాయికి తగ్గ బాణీని రూపొందించి మాత్రమే లతను సంప్రదించేవారు. దాంతో లత పాడే పాటల సంఖ్య తగ్గినా, పాటలలో నాణ్యత తగ్గలేదు. పాటలు హిట్ కావటం మానలేదు. ఆశా భోస్లేకు అద్భుతమైన పాటలను రూపొందిస్తాడు ఆర్డీ బర్మన్ అన్న అభిప్రాయం ప్రచారంలో ఉన్నా, ఆర్డీ బర్మన్ కెరీరును గమనిస్తే, ఆర్డీ బర్మన్ ఆశాతో అధికంగా పాటలను సృజించినా, ఆర్డీ బర్మన్ సృజనాత్మక ప్రతిభ అధికంగా కనిపించేది లతా మంగేష్కర్ పాటలలోనే అన్నది స్పష్టమవుతుంది. ఆర్డీ బర్మన్ తన కెరీరులో లతతో 321 పాటలు పాడించాడు. 321 పాటలలో అధికశాతం సూపర్ హిట్‍లు అవటమే కాదు హిందీ సినీ సంగీత చరిత్రలో అద్భుతమైన గీతాలుగా నిలుస్తాయి.
‘ఆర్డీ బర్మన్ చలాకీ పాట సృజిస్తే ఆశాతో పాడిస్తాడు. శాశ్వతంగా నిలిచే రాగ ఆధారిత మధురమైన గీతం సృజిస్తే లతతో పాడిస్తాడు’ అన్నది సినీ విమర్శకులంతా అంగీకరించిన విషయం. ఇది ఆర్డీ బర్మన్ మాత్రమే కాదు, దాదాపుగా ప్రతీ సంగీత దర్శకుడుఆమోదించు, ఆచరించిన విషయమే.
‘లత దీదీని పాట పాడమని అడగాలంటే నా పాట బాణీ మీద నాకు నాకు ఎంతో నమ్మకం ఉండాలి. అప్పుడే పాట పాడమని అడిగే దైర్యం వస్తుంది. అల్లాటప్పా పాటలతో లత దీదీ దగ్గరకు వెళ్ళటం, అశుభ్రంగా దైవం దగ్గరకు వెళ్ళినట్లు’ అన్నాడు ఓ యువ సంగీత దర్శకుడు. దాదాపుగా సినీ సంగీత ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అంగీకరిస్తారు.
1974లో రాజేష్ రోషన్ ‘కున్వారా బాప్’ సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుడు అయ్యాడు. ఆ సినిమా నిర్మాత మహమూద్. ఆ సినిమాలో ‘ఆ రి ఆజా నిందియా’ పాటను లతతో పాడించాలని మహమూద్ నిశ్చయించాడు. రాజేష్ రోషన్‍ను వెంట తీసుకుని లతను కలిశాడు మహమూద్. ‘ఇతను నాకు కొడుకు లాంటి వాడు’ అని పరిచయం చేశాడు. చిరునవ్వుతో పాట పాడేందుకు అంగీకరించింది లత. అది తన జీవితంలో మరపురాని క్షణం అంటాడు రాజేష్ రోషన్.
రాజేష్ రోషన్‍కు సంగీత దర్శకుడిగా గుర్తింపు నిచ్చిన సినిమా ‘జూలీ’ (1975). ఈ సినిమాలో రొమాంటిక్ యుగళ గీతం ‘భూల్ గయా సబ్ కుఛ్’ లత, కిషోర్‍లు అత్యద్భుతంగా పాడారు. యువతను వెర్రెక్కించిన రొమాంటిక్ పాట ఇది. ఇలాంటి seductive పాటలు సాధారణంగా ఆశాతో పాడిస్తారు. కానీ ఈ పాటను లతతో పాడించాలని రాజేష్ రోషన్ నిశ్చయించాడు. కానీ ఇలాంటి పాటను పాడమని లతను అడగటం అంత సులభం కాదు. ముఖ్యంగా తెరపై, నాయికా నాయకులు సన్నిహితంగా ఉండే పాట ఇది. అయినా ధైర్యం కూడగట్టుకుని రాజేష్ రోషన్ లతను కలిశాడు. పాట విషయం చెప్పాడు. లతకు బాణీని వినిపించాడు. కిషోర్ కుమార్‍తో యుగళ గీతం అనీ చెప్పాడు. భయం భయంగా లత సమాధానం కోసం ఎదురుచూశాడు.
1970 ఆరంభంలో లత స్వరంలో అతి సున్నితమైన మార్పు వచ్చింది. గతంలోని మౌగ్ధ్యం, సౌకుమార్యం స్థానాన్ని పరిణతి ఆక్రమించింది. స్వరంలో మాధుర్యం పెరిగింది. గతంలో లాగ మెరుపు తీగలాగ ధ్వనించే బదులు, ఇపుడు వర్షంతో నిండిన మేఘాల నడుమ విరిసే హరివిల్లులా ధ్వనించడం మొదలైంది. మాధుర్యం తగ్గలేదు. భావ ప్రకటనలో తేడా వచ్చింది. గతంలో లేని తీయదనంతో పాటు ఒక రకమైన పరిణతి ధ్వనించడం ఆరంభమయింది. అయితే లత తన స్వరంలో వచ్చిన ఈ మార్పులను గమనించింది. ఆ మార్పులను అతి సృజనాత్మకంగా వాడుతూ మైమరచే రీతిలో భావాన్ని ప్రకటించటం ప్రారంభించింది. ఇది ‘భూల్ గయ సబ్ కుఛ్’ పాటలో స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా పాట మూడ్‍ను గమనించి, యవ్వనంలో పురుష ప్రథమ స్పర్శకు స్పందించి, మైమరచిన యువతి, ఓ వైపు వయసు ముందుకు తోస్తుంటే , విచక్షణ వెనక్కు లాగుతుంటే, హృదయానికీ, బుద్ధికీ నడుమ జరిగే సంఘర్షణ కలిగించే సందిగ్ధాన్ని తన స్వరంలో లత ధ్వనింపచేసిన తీరు లతకు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు.
మారుతున్న హీరోయిన్ల వ్యక్తిత్వాలను, రూపాలను గమనించిన లత తన గాన సంవిధానాన్ని 1970లో పూర్తిగా మార్చేసింది. ఆశా పరేఖ్, షర్మిలా టాగోర్, ముంతాజ్ వంటి వారికి లత పాడిన పాటలలో వినిపించే లత స్వరానికీ, డింపుల్ కపాడియా, లక్ష్మి, టీనా మునిమ్ వంటి యువ హీరోయిన్లకు పాడిన పాటలలో వినిపించే లత స్వరానికీ, హేమమాలిని, మౌసమీ ఛటర్జీ వంటి నాయికలకు వినిపించే లత స్వరానికీ, పాట పాడే విధానానికి తేడా స్పష్టంగా తెలుస్తుంది. అంతే కాదు, బచ్చే మన్ కే సచ్చే, ఫూలోంకా తారోంకా వంటి చిన్నపిల్లలు పాడేపాటలను అచ్చు చిన్నపిల్లల స్వరం అనిపించే రీతిలో పాడి, లత వయసు పెరుగుతున్నకొదీ ఆమె స్వరం వయసు తగ్గుతున్నట్టుందన్న భావనను కలిగించింది.
ముఖ్యంగా ‘బాబీ’లో డింపుల్ కపాడియాకు పాడిన ‘ఝాట్ బోలె కవ్వా కాటే’, ‘హమ్ తుమ్ ఎక్ కమరే మె బంద్ హో’ పాటలు వింటుంటే ఒక నలభై ఏళ్ళ గాయని నేపథ్య గానం అందించిందంటే నమ్మటం కష్టం. వెనుక వినిపించే నేపథ్య
అలాగే టీనా మునిమ్‍కి పాడిన పాటల్లో ‘షాయద్ మేరే షాదీ కె ఖయాల్’ (సౌతేన్), ‘మై సోల బరస్‍కీ’ (కర్జ్) పాటల్లో లత స్వరం ప్రియుడిని ఇంటికి పిలిచేటప్పుడు హొయలు, అచ్చు పదహారేళ్ల పిల్లల్లా ధ్వనించటం గమనించవచ్చు. పాటలో మధ్యలో మాటాడాల్సి వచ్చినప్పుడు కూడా అమాయకంగా ఆశ ధ్వనించే యువతి లేత మనసును ధ్వనింపచేస్తుంది లత. అయితే ఈ పాటలు ఎంత అద్భుతంగా పాడినా, పాటలు సూపర్ హిట్ అయినా ఏ సభలోనూ లత పాడలేదు. చివరికి కిషోర్ కుమార్‍తో చేసిన కార్యక్రమంలో శ్రోతలు ఎంతగా బ్రతిమిలాడినా ఈ రెండు పాటలు లత పాడలేదు. కిశోర్ కుమార్ అభ్యర్థనను కూడా మన్నించలేదు.
ఇలా ఒకో యువనటికి లత పాట పాడే విధానాన్ని గమనిస్తూ పోతే ఆశ్చర్యం వేస్తుంది. ఆశా పారేఖ్‌కు ‘న కోయీ ఉమంగ్ హై’, షర్మిలకు ‘బడ నట్‌ఖట్ హై’, ‘రైనా బీతీ జాయే’; రాఖీకి ‘మేఘ ఛాయి ఆధీ రాత్’, ‘దిల్ తో హై దిల్’, హేమమాలినికి ‘ఓ ఘటా సాంవరే’, ‘చల్ సన్యాసీ మందిర్ మే’; జయప్రదకు ‘డప్లీ వాలే డప్లే బజా’, రతి అగ్నిహోత్రికి ‘తేరే మేరే బీచ్ మే’ – ఇలా ఒకటా? రెండా? ఎలాంటి సందర్భంలో ఎలాంటి భావాన్ని, ఏ నాయికకు పలికినా ఆ నాయికనే పాడుతుందనిపించేలా ధ్వనించేట్టు పాడే అత్యద్భుతమైన స్వర మాయాజాలం 1970 దశకంలో లత ఆరంభించింది. ఆ మాయాజాలం చేసి చూపించింది. ప్రజలను మంత్రముగ్దులను చేసింది. కాలం మారుతుంది. సినిమా స్వరూపం మారుతుంది. సినిమా సంగీతం మారుతుంది. నాయికా నాయికలు మారుతారు. గాయనీ గాయకులు మారుతారు. ఇతర కళాకారులూ మారుతారు. నిర్మాతలు, దర్శకులు మారుతారు. కానీ మారనిది లత స్వరం. మారనిది లత మంగేష్కర్ స్వరం కలిగించే మంత్రముగ్దులను చేసే మాయాజాలం.
‘One was the way she stressed certain words at a crucial point of a song. She always knows where to punctuate a song. She miraculously found space to provide her own punctuation in the rhythm of the song. There is no other singer in the world who can do this the way she can ‘, అంటాడు రాజేష్ రోషన్. రాజేష్ రోషన్ యువ సంగీత దర్శకుడు. అప్పటికి రెండు దశాబ్దాలు గడిపింది లత సినీ ప్రపంచంలో. సాధారణంగా యువ కళాకారులకు పాత తరం కళాకారులకు నడుమ ఆలోచనల్లో, అభిప్రాయాలలో, పనితీరులో తేడా ఉంటుంది. కళాకారులు అనేకులు ఈ మార్పులకు, అంతరాలకు తట్టుకోలేరు. కానీ లతా మంగేష్కర్ తనకన్నా పెద్ద వయసు వారితో ఎలా పనిచేసిందో, ఎంత సౌలభ్యంగా పనిచేసిందో, తన వయసు వారితోనూ అలాగే పనిచేసింది. అంతే హాయిగా ఎలాంటి అంతరాలు లేకుండా తన ముందు పుట్టి పెరిగిన వారితోనూ పనిచేసింది.
ఇక్కడ ఓ విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. మహమ్మద్ రఫీ లాంటి గాయకుడు మరొకరు లేరు. కానీ 1970 దశకంలో యువ సంగీత దర్శకులకు పాటలు పాడటంలో రఫీ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1970 నుంచి సంగీత దర్శకుల పనితీరు మారింది. సినీ నిర్మాణంలో వేగం పెరిగింది. కళాకారుల నడుమ పోటీ పెరిగింది. పాట నాణ్యత కన్నా, మాధుర్యం కన్నా, పాట హిట్ అవటం ప్రాధాన్యం పెరిగింది. దాంతో పాటల సృజన రీతి మారింది.
1970 కన్నా ముందరి సంగీత దర్శకులు పాట కోసం తపస్సు చేసేవారు. వారి దృష్టిలో సంగీతం సరస్వతి. పాట దైవ స్వరూపం. ఒక పాటను రూపొందించేందుకు నెలలు శ్రమ పడేవారు. ఆ తరువాత నెలల తరబడి రిహార్సల్స్ చేసేవారు. రిహార్సల్ అయి పాట ఎలా ఉండాలో నిర్థారితమైన తరువాత రికార్డు చేసేవారు. అంటే పాట నిర్ణయం అయిన తరువాత రికార్డింగ్ దశలో మార్పులుండేవి కావన్నమాట. రఫీ ఈ పద్ధతికి అలవాటు పడినవాడు. నౌషాద్ లాంటి సంగీత దర్శకుల ప్రభావంతో తన గాన సంవిధానాన్ని దిద్దుకున్నవాడు. రిహార్సల్స్ చేయటానికి వెనుకాడని వాడు.
‘ఉడన్ ఖాటోలా’ సినిమాలో ఓ పాట రికార్డు అయిన తరువాత నౌషాద్‍కు సంతృప్తి అనిపించలేదు. రఫీతో పాట మళ్ళీ రిహార్సల్స్ చేయించి పాడించాడు. రఫీ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఎన్ని అంటే అన్ని రిహార్సల్స్ చేశాడు. అలా రూపొందిన పాట ‘ఓ దూర్ కే ముసాఫిర్’. కానీ 1970 దశకంలో సంగీత దర్శకులకు అంత తీరిక, ఓపికలు లేవు. ఒకటి రెండు రిహార్సల్స్‌తో పాటను ఫైనల్ చేస్తారు. కానీ రికార్డింగ్ సమయంలో పాటలో మార్పులు చేస్తారు. ఒకసారి ఓలా పాడాలని నిర్ణయమైన తరువాత హఠాత్తుగా చివరి క్షణంలో చేసిన మార్పులను రఫీ పాటలో పొందుపరచలేక పోయేవాడు. టేకులు ఎక్కువ అవసరం అయ్యేవి. టేకులు ఎన్ని అయితే అంత ఖర్చు, అంత సమయం వ్యర్థం. దాంతో యువ సంగీత దర్శకులు రఫీతో పాడించటం తగ్గించటమే కాదు, అవమానించేవారు కూడా.
కానీ 1970లో హిందీ సంగీత ప్రపంచం స్వర్ణయుగం అంత్య దశలో ఉంది. పాత సంగీత దర్శకులందరూ నెమ్మదిగా తెర వెనక్కు వెళ్ళిపోతున్నారు. రాజేష్ ఖన్నా ‘సూపర్ స్టార్’గా సినిమాల్లో రొమాన్స్‌ను నిలిపినా అమితాబ్ బచ్చన్ – ‘ఆంగ్రీ యంగ్‌మాన్’గా రంగప్రవేశం చేయటంతో సినిమాల్లో నాయిక ప్రాధాన్యం తగ్గింది. పాటల ప్రాధాన్యం తగ్గింది. ‘డిష్యుం డిష్యుంకు ఉన్న ప్రాధ్యాన్యం ఇప్పటి సినిమాలో సరిగమపలకు లేదని’ ఓ పాత కాలం సంగీత దర్శకుడు కసిగా వ్యాఖ్యానించాడు 1970 దశకం పాటల గురించి.
అయితే స్వర్ణయుగం నాటి ఊపు 1970 దశకం అర్ధ భాగం వరకూ కొనసాగింది. ఎస్డీ బర్మన్, మదన్ మోహన్, సలిల్ చౌధరీ వంటి వారు స్వర్ణ యుగాన్ని సజీవంగా నిలిపే బాణీలను సృజించారు. లత స్వరం ఆ బాణీలకు ప్రాణం పోసి సినీ గీతాల ప్రపంచంలో మెలోడిని సజీవంగా నిలిపింది. పాత తరం వారికి సాంత్వననిస్తూ, కొత్త తరం వారికి నాణ్యమైన పాటల రుచి చూపిస్తూ, చుట్టూ పడి ఉన్న స్వర్ణయుగ భవనం శకలాల నడుమ ‘అచలం’లా నిశ్చలంగా నిలిచింది లత. లతతో పాడించటం ఒక ‘అదృష్టంలా’, భాగ్యంలా భావించే సంగీత దర్శకులు, లతతో పాట పాడించటం వల్ల తామూ ఉత్తమ సంగీత దర్శకుల జాబితాలో చేరవచ్చని సంగీత దర్శకులు లత కోసం పాటలు ప్రత్యేకంగా రూపొందించటంతో 1970 దశకంలో గాయనిలు పాడిన అత్యంత నాణ్యమైన పాటలలో తొంభై శాతం పాటలు లత పాడిన పాటలే అయ్యాయి.
ఓవైపు లత ఇలా అసాధారణమైన ఎత్తుకెదిగి హిమాలయంలా సినీ సంగీత ప్రపంచంలో నిలచి ఉన్న సమయంలో మరోవైపు కళ్ళనిండా ఆశలను నింపుకుని, స్వరంలో మాధుర్యాన్ని ఒలకపోస్తూ ఎందరో నూతన గాయనీమణులు సినీ రంగంలో ప్రవేశించారు. ఒకటి రెండు పాటల్లో మెరుపులా మెరిశారు. కానీ సూర్యుడి ముందు దివిటీల్లా వెలవెలపోయారు. హిమాలయం ముందు మట్టిగుట్టలా మిగిలారు. ఒక రకంగా చూస్తే లతతో పోటీ పడటం అంత సులువు కాదు. ఇతర గాయనిలంతా సరస్వతీ దేవి ఆశీస్సులు పొందినవారైతే, లతా మంగేష్కర్ స్వరంలో సరస్వతి నివాసం ఉంటుంది. అలాంటి లతకు ధీటుగా నిలబడటం మానవులకు సాధ్యం కాదు. ఒక్క కాలమే లత స్వరానికి ఎదురు. కానీ కాలంతో పాటు లత స్వరం వయసు తగ్గుతూండటంతో కాలం కూడా లత ముందు ఓడిపోతుందన్న భావన లత అభిమానులలో కలిగింది.
“It is amazing how she molded her voice in every decade. The way she sounded in the 1950’s was very different from her voice in the 1960’s. And in the 70’s and 80’s she again molded her voice into a different sphere. How she reinvented herself in each decade to sound better and better is a subject worth of a thesis’ అంటాడు రాజేష్ రోషన్.
1970 దశకంలో లతపై విమర్శలు వెల్లువెత్తాయి. లతతో పోటీపడలేక పక్కకు తప్పుకున్న యువ గాయనిలు లతను విమర్శించారు. తమ కెరీర్లను లత దెబ్బతీసిందని దూషించారు. కొందరు జర్నలిస్టులు కూడా లత పట్ల ద్వేషం ప్రకటించారు. ముఖ్యంగా రాజు భరతన్ అయితే ‘లత 1970 తరువాత పాటలు పాడటం మానేస్తే మంచిది’ అని వ్యాఖ్యానించాడు. ఈ విషయాల గురించి చర్చించే కన్నా ముందు 1973లో జరిగిన ఒక సంఘటన ప్రస్తావించుకోవాల్సి
(ఇంకా ఉంది)