సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-27

2
1

[dropcap]నా[/dropcap]మ్ గుమ్ జాయేగా,  చెహెరా యే బదల్ జాయేగా

మేరీ అవాజ్ హీ పహెచాన్ హై, గర్ యాద్ రహే!

లతా మంగేష్కర్ ‘గుర్తింపు’ పాటగా ఎదిగిన ఈ పాట ‘కినారా’ సినిమాలోది. గుల్జార్ రాసిన ఈ పాటకు సంగీతం రూపొందించింది ఆర్డీ బర్మన్. పేరు మరచిపోతారు. రూపం మారిపోతుంది. కానీ గుర్తుంచుకుంటే నా స్వరమే నాకు గుర్తింపు అవుతుంది. అంటే ‘నా స్వరం ద్వారానే నేను గుర్తుంటాను’ అన్న అర్థం వచ్చే పాట ఇది. పాటను రూపొందిస్తున్నప్పుడు కానీ,  రికార్డు చేసిన తరువాత కానీ పాట ఎంతగా హిట్ అవుతుందో ఎంతకాలం నిలుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి ఎంతో గొప్పగా ఉన్న పాటలు అంతగా శ్రోతలను ఆకర్షించవు. ఒక్కోసారి ఏదో మామూలుగా ఉన్నాయనుకున్న పాటలు సూపర్ హిట్ అవటమే కాదు తరతరాలను ఉర్రూతలూగిస్తూ తరాలకొద్దీ కళాకారులకు స్పూర్తి నిచ్చే గీతాలుగా నిలుస్తాయి.

‘నాగిన్’ సినిమాలో ‘మన్ డోల్ మోర్ తన్ డోల్’ పాట రికార్డు చేస్తున్నప్పుడు ఎవ్వరూ ఆ పాట అంతగా అలరిస్తుందని అనుకోలేదు. కానీ ఈనాటికి కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఆ పాట అందరినీ అలరిస్తోంది. పామును ఆడించేందుకు నాగిన్ బాణీ సమ్మోహనకరమైన స్వరంగా ఎదిగింది. ఆ పాట అంతగా హిట్ అవుతుందని కూడా ఊహించలేదంటుంది లతా మంగేష్కర్. కాబట్టి ఏ పాట ఎలా ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుందో కాలం దాన్ని ఏ రూపంలో నిలుపుతుందో ఎవరూ ఊహించలేరు. ‘నామ్ గుమ్ జాయేగా’ పాటను రూపొందిస్తున్నప్పుడూ కూడా భవిష్యత్తులో ఈ పాట లతా మంగేష్కర్ సంతకం పాటలా నిలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. నిజానికి ఈ పాట యుగళగీతం . లతతో పాటు గాయకుడు భూపేంద్ర కూడా పాడేడు. కానీ ఎలాగైతే ‘అవాజ్ దే కహాన్ హై’ యుగళ గీతమైనా నూర్జహాన్ గుర్తింపు గీతంగా నిలుస్తుందో అలా ‘నామ్ గుమ్ జాయేగా’ లత సంతకం గీతంలా నిలుస్తుంది. కాలం మారినా లత స్వరం మారదన్న అర్థాన్నిచ్చే ఈ పాట యమన్ రాగంపై ఆధారితమైన పాట. 1977లో ఈ సినిమా విడుదలయ్యే సమయానికి హిందీ సినీ పాటల ప్రపంచం మొత్తం లత, రఫీల నడుమ ఎవరు ఎక్కువ పాటలు పాడేరన్న వివాదంతో అట్టుడికిపోతోంది.

1974లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పుస్తకంలో ప్రపంచ చరిత్రలో అత్యధిక సంఖ్యలో 25000 పాటలను రికార్డు చేసిన ఏకైక గాయనిగా లతా మంగేష్కర్ పేరు నమోదయింది. 1948 నుండి 1974 నడుమ ఇరవై భారతీయ భాషల్లో, సోలోలు, యుగళ గీతాలు, కోరస్ పాటలు అన్నీ కలిపి 25000 పాటలు పాడిందని గిన్నీస్ బుక్ పేర్కొంది. వెంటనే దేశం సంబరాలు ఆరంభించింది. ఎవ్వరికీ లతా మంగేష్కర్ 25000 పాటలు పాడిందన్న విషయంలో సందేహం రాలేదు. ఎందుకంటే రేడియోలో నిరంతరం వినిపించే స్వరం లతాదీ. ప్రతి సినిమాలో లత పాటలుంటాయి. భజనలు పాడింది. ప్రైవేట్ పాటలు పాడింది. పలు భాషల్లో పాటలు పాడింది. కాబట్టి లత 25000 పాటలు పాడిందనగానే అందరూ ఆమోదించారు. కానీ లతతో పోటీ పడే ఏకైక గాయకుడు  రఫీ , లత తనకన్నా ఎక్కువ పాడిందన్న విషయాన్ని ఆమోదించలేకపోయాడు.

రఫీకి తెలుసు, లత ఎక్కువ పాటలు పాడినట్టనిపించినా 1974 సంవత్సరానికి తానే లత కన్నా ఎక్కువ పాటలు పాడేడని.  ఎందుకంటే   లత పలు కారణాల వల్ల “వారికి పాడను, వీరికి పాడను” అంటూ అనేక అవకాశాలను వదలి వేసుకుంది. పలువురు నిర్మాతలు, సంగీత దర్శకులు వీలైనంత తక్కువగా లతతో పాడించారని తెలుసు. దీనికి తోడూ రఫీతో యుగళ గీతం పాడనని లత రాయల్టీ వివాదం సమయంలో ప్రకటించినప్పుడు ఆమె పాటల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ సమయంలో లతను దాటి తాను పాటలు పాడేనని రఫీ గ్రహించాడు. అందుకే రఫీ లత కన్నా తాను ఎక్కువ పాటలు పాడేనని, తాను 28000 పాటలు పాడేనని,  కాబట్టి లత పేరు తొలగించి అత్యధిక సంఖ్యలో పాటలు పాడిన గాయకుడిగా తనను గుర్తించాలని కోర్టును ఆశ్రయించాడు. లత అభిమానులు ఒకవైపు, రఫీ అభిమానులు మరొకవైపుగా వాదవివాదాలు చెలరేగాయి. వాతావరణం వేడెక్కింది. అయితే లత కానీ, రఫీ కానీ ప్రత్యక్షంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎలాంటి ఉద్విగ్నతను ప్రదర్శించలేదు. ఇద్దరూ స్నేహంగానే ఉన్నారు. అవకాశం లభించినప్పుడు కలసి అత్యద్భుతమైన యుగళ గీతాలు పాడేరు. ఎందుకంటే 1960లో ఉన్న పరిస్థితి 1970 దశకంలో లేదు. అప్పుడు లత మహరాణి అయితే మహమ్మద్ రఫీ కిరీటం లేని మహారాజు. పైగా 1960 దశకం రఫీ దశకం. లతకు కూడా ఎదురులేదు. కాబట్టి ఒకరితో ఒకరు పాడకపోయినా పెద్దగా నష్టం కలుగలేదు. మరీ నష్టం కలిగే వీలుందనిపించగానే ఇద్దరూ రాజీపడ్డారు. కానీ 1970 దశకంలో పరిస్థితి మారిపోయింది. 1969లో ‘ఆరాధన’ సినిమాతో కిషోర్ కుమార్ యుగం ఆరంభమయింది. రఫీ స్వరంగా నిలిచిన హీరోలు తెర మరుగై పోయారు. రఫీ లోకంగా తమ బాణీలు సృజించిన సంగీత దర్శకులు కనుమరుగైపోయారు. నిర్మాతల కొత్తతరం వేదికపైకి వచ్చింది. వీరికి ‘రఫీ’ కన్నా కిషోర్ కుమార్ స్వరం పైన మక్కువ కలిగింది. ఎందుకంటే 1970 దశకంలో రఫీ స్వరం మారింది. గతంలోని ‘శక్తి’ తగ్గింది. దాంతో గంభీరంగా, బలంగా వినిపించే కిషోర్ కుమార్ స్వరం కొత్తగా అందంగా ధ్వనించింది.

పైగా కొత్త సంగీత దర్శకుల అలవాట్లు రఫీకి ఇబ్బందిగా ఉన్నాయి. అందుకే ‘ఆర్డీ బర్మన్’ లాంటి యువ సంగీత దర్శకులు రఫీ ఒక్కసారి బాణీ నేర్చుకున్న తరువాత చివరి క్షణంలో బాణీలో కాస్త మార్పులు చేస్తే వెంటనే పాడలేడు,  కొన్నిమార్లు రిహార్సల్స్ చేయాల్సి వస్తుంది, కిషోర్ కుమార్ అలా కాదు, చివరి క్షణంలో మార్చినా సులువుగా పాడేస్తాడు అని రఫీని పక్కనపెట్టి కిషోర్ కుమార్ వాడకాన్ని సమర్థించుకున్నారు. కానీ ఇదే రఫీతో నౌషాద్, శంకర్ జైకిషన్, ఎస్డీ బర్మన్, చిత్రగుప్త, రోషన్, మదన్ మోహన్, రవి, సి. రామచంద్ర వంటి సంగీత దర్శకులు అద్భుతమైన పాటలు సృష్టించారన్న సందేహానికి ఆ కాలం వేరు అన్న సమాధానం వస్తుంది. కాబట్టి 1970-75 దశకంలో రఫీ పాటలు గణనీయంగా తగ్గిపోయాయి. మళ్ళీ ఉషాఖన్నా సంగీత దర్శకత్వంలో ‘తేరీ గలియోం మే న రఖేంగే కదమ్’ పాటతో హిట్ పాట నిచ్చిన రఫీ, 1976లో మదన్ మోహన్, జయదేవ్‍ల సంగీత దర్శకత్వంలోని ‘లైలా మజ్నూ’ సినిమా పాటలతో యువ నటుడు  రిషీకపూర్ స్వరంగా సూపర్ హిట్ పాటల నివ్వటంతో కిషోర్ కుమార్‍కు పోటీగా నిలవటమే కాదు, 1980లో మరణించే నాటికి నెంబర్ వన్ గాయకుడిగా ఎదిగాడు మళ్ళీ. సినీ పరిశ్రమ కనీ వినీ ఎరుగని అద్భుతం అది. సినీ రంగంలో ఒకసారి పతనమైన తరువాత మళ్ళీ శిఖరారోహణం అంటూ ఉండదు. అది సాధ్యమయింది రఫీ ఒక్కడికే! కానీ 1970 -75 నడుమ రఫీ గతంలో పాడినంత ఎక్కువ సంఖ్యలో పాటలు పాడలేదన్నది నిజం!

రఫీ, లతల నడుమ ఎవరు అధికంగా పాటలు పాడేరన్న వివాదం తీవ్ర స్థాయికి చేరుకునే సరికి పరిశోధకులు రంగంలో దిగారు. లత కన్నా తానే అధిక సంఖ్యలో పాటలు పాడేనని రఫీ అనటంతో గిన్నీస్ బుక్ వారు, లతను అత్యధిక సంఖ్యలో పాటలు పాడిన గాయనిగా పేర్కొంటూ పక్కనే లత కన్నా అధిక సంఖ్యలో పాటలు తాను పాడేనని మహమ్మద్ రఫీ ప్రకటిస్తున్నారన్న విషయాన్ని, ఈ విషయంలో వివాదం ఉన్నదని పొందుపరిచారు.

1984లో , మహమ్మద్ రఫీ మరణించిన నాలుగేళ్ల తరువాత గిన్నీస్ బుక్,  లతా మంగేష్కర్ అత్యధికంగా 30,000 పాటలు పాడిందని, మహమ్మద్ రఫీ 1944-1980 నడుమ 28,000 పాటలు పాడేనంటున్నాడనీ నమోదు చేసింది. అయితే పరిశోధకులు లత కానీ, రఫీ కానీ ఇద్దరిలో ఎవరూ 10,000 పాటలు దాటి పాడే వీలు లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఉదాహరణకు 1944- 1980 నడుమ రఫీ 28000 పాటలు పాడినది నిజం అనుకుంటే సంవత్సరానికి 777 పాటలు పాడాల్సి ఉంటుంది. వీటిలో రఫీ తక్కువగా పాటలు పాడిన సంవత్సరాలను పరిగణనలోనికి తీసుకుంటే, సంవత్సరానికి దాదాపుగా వెయ్యి పాటలు పాడాల్సి ఉంటుంది. అంటే రోజుకి 2.74 పాటలు పాడితే కానీ 36 ఏళ్ళలో 28000 పాటలు కావు. ఇది అసాధ్యం కాబట్టి, మహమ్మద్ రఫీ 28000 పాటలు పాడటం అసంభవం అని తేల్చారు. ఇదే విధంగా లతా మంగేష్కర్ కూడా 1946 నుండి 1978 నడుమ 32 ఏళ్ళలో 25000 పాటలు పాడటం కూడా అసంభవం అన్నది స్పష్టమయింది. ఎందుకంటే సంవత్సరానికి లత 893 పాటలు సగటున పాడాల్సి ఉంటుంది. రోజుకు 2.5 పాటలు రికార్డు చేయాల్సి ఉంటుంది. కాబట్టి లత కానీ, రఫీ కానీ మనకు అసంఖ్యాకమైన పాటలు పాడినట్టు  తోస్తుంది కానీ నిజంగా లెక్కలు తీస్తే అన్ని పాటలు పాడలేదని, అన్ని పాటలు పాడటం అసంభవం అన్నది స్పష్టమయింది.

ఇంతలో హరమందిర్ సింగ్ హమ్‌రాజ్ అనే కాన్పూర్‍‍కు చెందిన సినీ పాటల పరిశోధకుడు 1931 నుండి 1970 వరకూ రికార్డయిన విడుదలైన హిందీ సినిమా పాటల జాబితాను సంవత్సరాల వారీగా నాలుగు పుస్తకాలలో ‘ఎన్‍సైక్లోపీడియా ఆఫ్ ఫిల్మ్ సాంగ్స్’ అన్న పేరిట ప్రచురించాడు. 1971 నుండి 1980 నడుమ పాటల జాబితాను అయిదవ పుస్తకంలో పొందుపరచి 1991లో విడుదల చేశాడు. దాంతో ఎవరు ఏ సంవత్సరం, ఎన్ని పాటలు పాడేరు, ఏ సంగీత దర్శకుడు ఎన్ని పాటలు రూపొందించాడు, ఏ గాయకుడికి ఎన్ని పాటలు రూపొందించాడు, ఏ గేయ రచయిత, ఏ సంగీత దర్శకుడికి ఎన్ని పాటలు రాశాడు వంటి గణాంక వివరాలన్నీ తయారుచేసే వీలు చిక్కింది. తరువాత విశ్వాస్ నెరుర్కర్ లతా మంగేష్కర్ పాటల పట్టిక తయారుచేశాడు. ‘గాంధార్ స్వరయాత్ర’  అనే పుస్తకంలో. ఇందులో 1946నుంచి 1989 వరకూ లత పాడిన పాటల జాబితాను పొందుపరచాడు. ‘అతుల్స్ సాంగ్ ఆఫ్ ఎ డే’ బ్లాగులో సెప్టెంబర్ 27, 2020 నుండి వరుసగా 63 రోజులు – లత సినీ రంగంలో అడుగు పెట్టినప్పటి నుంచి చివరి పాట పాడేవరకూ  పాడిన పాటల గణాంక వివరాలను రోజుకో సంవత్సరం వివరాలు చొప్పున పొందుపరిచాడు. ‘హరమందిర్ సింగ్’, విశ్వాస్ నెరుర్కర్లు గణాంక వివరాలు తయారు చేసేనాటికి వెలుగు చూడని పాటలు, మరుగున పడిన పాటలను కూడా పొందుపరచి, దాదాపుగా లత పాటల వివరాలన్నీ ఒకచోట చేర్చారీ బ్లాగులో. ఈ రకంగా మనకు ఏ సంవత్సరం వరకూ ఎవరెన్ని పాటలు పాడారో ఖచ్చితంగా తెలుసుకునే వీలు చిక్కింది.

ఈ గణాంక వివరాలన్నీ వెలికి వచ్చేసరికి 1980 నాటికి లత కేవలం 4500 పాటలు పాడిందనీ, ఇది రఫీ పాడిన 4965 పాటల సంఖ్య కన్నా తక్కువ అనీ తేలింది. 1991 వరకు లత 5250 పాటలు పాడిందనీ, 1980 తరువాత రఫీ మరణించటం వల్ల కొత్త పాటలు రికార్డు కాకపోవటం వల్ల రఫీ కన్నా ఎక్కువ పాటలు పాడిందని తేలింది. దాంతో 1991లో గిన్నీస్ బుక్ వాళ్ళు 30 వేల పాటలు పాడినట్టు ఋజువులు చూపించమని లతను కోరారు. లత ఈ విషయంలో ఎలాంటి ప్రతిస్పందనను తెలుపలేదు. దాంతో గిన్నీస్ బుక్ నుంచి లత, రఫీల పేర్లు తొలగించారు. అత్యధిక సంఖ్యలో 10,200 పాటలు పాడిన గాయనిగా ఆశా భోస్లే పేరు గిన్నీస్ పుస్తకంలోకి ఎక్కింది. ఇది రఫీ, లతల చివరి వివాదం. అయితే మరణించే నాటికి రఫీకి తాను 30,000 పాటలు కాదు, 4965 పాటలు పాడేనని, లత కన్నా ఎక్కువ పాటలు పాడేనన్న విషయం తెలియదు.

ఈ వివాదం నుంచి తేరుకునే సరికి అనురాధ పౌడ్వాల్ లత పనైపోయిందంటూ వివాదాన్ని ఆరంభించింది. 1980 ప్రాంతంలో ‘డిస్కో’ పాటల ట్రెండ్ తీవ్రమైంది. బప్పీ లహరి ‘డిస్కో కింగ్’గా ‘మిధున్ చక్రవర్తి’ డిస్కో రాజుగా ఎదిగారు. జితేంద్ర జంపింగ్ జాక్ అయ్యాడు. బప్పీ సృష్టించిన డిస్కో తుఫానులో ప్రతి ఒక్క సంగీత దర్శకుడు కొట్టుకుపోయాడు. మెలోడీని, శాస్త్రీయ రాగాలను వదలి డిస్కో బజాయించాల్సి వచ్చింది అందరికీ. కొత్త కొత్త గాయనిలు కూడా డిస్కోల పాటలు జోరుగా పాడేరు. అయితే బప్పీ పాటలతో ఆశా భోస్లే ముందుకు దూసుకు పోయింది. ఈ సమయంలో కూడా లతా మంగేష్కర్ నాణ్యత విషయంలో పాటల్లో పదాల విషయంలో రాజీపడలేదు. దాంతో ఈ డిస్కో పాటల ఎడారిలో కూడా ఒయాసిస్సుల్లా లతా మంగేష్కర్ పాటలు నిలిచాయి. ముఖ్యంగా డిస్కో ట్రెండును అనుసరిస్తూ కూడా మూలాలకు దూరం కాకుండా, మెలోడీకి ప్రాధాన్యం ఇస్తూ అతి చక్కని పాటలను రూపొందిస్తూ లక్ష్మీ ప్యారే, తమ అస్తిత్వాన్ని నిలుపుకున్నారు. వారి పాటలు పాడూతూ లత కూడా తన స్థానాన్ని, తన స్థాయిని నిలుపుకుంది.

“మై ఏక్ డిస్కో, తూ ఏక్ డిస్కో” అంటూ పాడినా లక్ష్మీ ప్యారేతో సహా అనేక ఇతర సంగీత దర్శకులు లత కోసమే ప్రత్యేకంగా అత్యద్భుతమైన పాటలు రూపొందించారు. 1975లో బప్పీకి తొలిసారి ‘జక్మీ’ సినిమాలో ‘ఆవో తుమ్హె చాంద్ పె లేజాయె’ అనే పాట పాడింది లత. ఇదే సమయంలో ‘అభీ అభీ థీ దుష్మనీ’ అన్న పాట అందరి దృష్టిని ఆకర్షించింది. బప్పీ పాటలు బాణీ కూర్చే విధానం లతకు నచ్చింది. దాంతో లక్ష్మీ ప్యారే, రాజేష్ రోషన్‍లతో పాటు బప్పీని కూడా తన పాటలు పాడేందుకు ఇష్టపడే సంగీత దర్శకుల జాబితాలో చేర్చి ప్రతినెల కొన్ని తేదీలు బప్పీ కోసం అట్టిపెట్టటం ఆరంభించింది లత. లత, బప్పీల కలయికలో వచ్చిన అద్భుతమైన గీతం ‘ఆంగన్ కే కలి’ సినిమాలోని ‘సయ్యాన్ బినా ఘర్ సునా’ పాట.   అప్నే పరాయే, పతిత, జ్యోతి వంటి సినిమాలలో పాటలు సూపర్ హిట్లయ్యాయి. ముఖ్యంగా ‘పతిత’ సినిమాలో ‘థోడా రేషమ్   లగ్తాహై’ పాట ఎంత హిట్ అయిందంటే, రీమిక్స్ కూడా హిట్  అయింది. అలాగే ‘జ్యోతి’ సినిమాలో ‘బైఠెబైఠె యాద్ ఆయి’ పాట బప్పీ సృజించిన మధురమైన పాటలలో ఒకటిగా నిలుస్తుంది. బప్పీ అత్యంత సృజనాత్మక గీతాలు లత పాడినవే!

ఇలా యువ సంగీత దర్శకుల అత్యుత్తమ గీతాలు పాడుతున్నా, లక్ష్మీ ప్యారేలకు అత్యద్భుతమైన గీతాలు పాడింది లత. ముఖ్యంగా 1981లో విడుదలైన ‘ప్యాసా సావన్’ సినిమాలో ‘మేఘారే మేఘారే’ పాట నిజంగానే డిస్కో మండుటెడారిలో కురిసిన విరిజల్లు. ఇదే సినిమాలోని ‘తెరా సాథ్ హైతో’ గతించిన గోల్డెన్ ఎరాను గుర్తుకు తెచ్చే పాట. ఇంతలో లక్ష్మీ ప్యారేల నడుమ విభేదాలు వచ్చాయి. తమ ఇంటికి వేరే పేర్లు పెట్టుకుంటే లక్ష్మీకాంత్, ప్యారేలాల్ అని వేర్వేరుగా పెట్టుకోవాల్సి వస్తుందని ఇంటిముందు పేర్లు కూడా పెట్టుకోనటువంటి స్నేహితుల నడుమ విభేదాలు వచ్చాయి. ఓ విదేశీ టూర్లో ఉన్నప్పుడు తానింక లక్ష్మీకాంత్‍తో కలసి పనిచేయనని ప్రకటించాడు ప్యారేలాల్. ఇతరులతో కలసి నేరుగా కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించాడు. ఇది వారి పాటల నాణ్యతపై ప్రభావం చూపించింది. దాంతో మనోజ్ కుమార్, సుభాష్ ఘయ్, లతా మంగేష్కర్‍లు జోక్యం చేసుకుని వారిద్దరి నడుమ సంధి కుదిర్చారు. మళ్ళీ ఇద్దరూ కలసి పని చేయటం ఆరంభించారు. అయితే ఎందుకని వీరిద్దరి నడుమ విభేదాలు వచ్చాయన్న విషయంలో పలు కథనాలు వినిపిస్తాయి. దేన్లో ఎంత నిజముందో ఎవరి విచక్షణను బట్టి వారు నిర్ణయించుకోవాల్సిందే.

సుభాష్ ఘయ్ ప్రకారం,  ఇద్దరు వ్యక్తులు లక్ష్మీకాంత్ గురించి ప్యారేలాల్‍కూ, ప్యారేలాల్ గురించి లక్ష్మీకాంత్‍కూ గాలి వార్తలు చేరవేస్తూ ఇద్దరి నడుమ విభేదాలు సృష్టించారు. సుభాష్ ఘయ్ వారి అసలు రూపును బయట పెట్టటంతో లక్ష్మీప్యారేలు కలసిపోయారు. మరో కథనం ప్రకారం విదేశీ టూర్‍లో ఉన్నప్పుడు లక్ష్మీకాంత్ భార్య, ప్యారేలాల్ భార్యల నడుమ వాదన జరిగింది. దాని ఫలితంగా లక్ష్మీప్యారేలు వేరుపడ్డారు. లతా మంగేష్కర్, ఇతరులు జోక్యం చేసుకుని వివాదాన్ని అంతం చేశారంటారు. “నాకు గ్లాసు నీళ్ళు ఇచ్చేవారు కూడా లేరు. కానీ అందరూ లక్ష్మీకాంత్ చుట్టూ మూగి ఉన్నారు. నన్నెవరూ పట్టించుకోలేదు. నాకు అవమానం అనిపించింది” అన్నాడు ప్యారేలాల్ తరువాత ఓ సందర్భంలో వివాదాన్ని ప్రస్తావిస్తూ.

“ప్యారేకు ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు” అన్నాడు లక్ష్మీకాంత్ గుంభనగా. ఎవరూ అధికంగా ప్రస్తావించని కారణం ఏమిటంటే అనురాథ పౌడ్వాల్, ఆమె సమర్థకులు కొందరు లక్ష్మీప్యారేల నడుమనే కాదు, లక్ష్మీ ప్యారే లతల నడుమ కూడా విభేదాలు సృష్టించాలని ప్రయత్నించారంటారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌ల నడుమ లతను వాడటం తగ్గించి, యువ స్వరాలు, ముఖ్యంగా అనూరాధ పౌడ్వాల్‌కు అవకాశాలు ఎక్కువ ఇచ్చే విషయంలో భిన్నాభిప్రాయాలుండటంతో దీన్ని ఆధారం చేసుకుని లతను దెబ్బ తీయాలన్న ప్రయత్నాలు జరిగాయంటారు. ఈ విషయంలో ఎలాంటి నిర్థారణ లేదు. ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. కానీ లక్ష్మీప్యారేల నడుమ సయోధ్య కుదిరిన తరువాత లతా మంగేష్కర్ తాను పాటలు పాడటం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం వస్తున్న పాటల నాణ్యత విషయంలో అసంతృప్తి వ్యక్తపరచి, తనకు పాడాలన్న ఉత్సాహాన్ని ప్రేరణను ఇచ్చే చక్కని పాటలు మాత్రమే పాడతానని ప్రకటించింది. పాటలు పాడటం తగ్గించింది. విదేశీ పర్యటనలపై, ప్రైవేట్ పాటలు పాడటం వైపు దృష్టి మరల్చింది.

ఓవైపు ఇలాంటి సంఘటనలు జరుగుతుండగా, మరోవైపు తనకు సరైన అవకాశాలు రావటం లేదని, పరిశ్రమలో పెద్దలు తనని అణగద్రొక్కుతున్నారని నిరాశకు గురవుతూ, సినీ పరిశ్రమను వదలి వెళ్ళిపోవాలనుకుంది అనూరాధ పౌడ్వాల్. ఈ సమయంలో ఆమెకు టి.సిరీస్ సంస్థతో పరిచయం అయింది. అనూరాధ పౌడ్వాల్ స్వరం నచ్చటంతో వారు తమ సంస్థ రూపొందించే పాటలు పాడమని అనూరాధను ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించింది అనూరాధ.   టి.సిరీస్‍లో నిర్ణయాత్మకమైన స్థానాన్ని ఆమె ఆక్రమించింది. ఇక అప్పటి నుంచీ ఒక పద్ధతి ప్రకారం అనూరాధ పౌడ్వాల్ సినీ సంగీత ప్రపంచంలో స్థిరపడి ఉన్న వ్యక్తులు, పద్ధతులపై దాడి ప్రారంభించింది.

టి.సిరీస్ సంస్థ యువ సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో కొత్త ఒరవడి సృష్టించాలని నిర్ణయించుకుంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన పాటలను రూపొందించి అందించాలని నిశ్చయించింది. దీనిలో భాగంగా తాను గతంలో కలసి  పాడిన ఓ యువ గాయకుడిని టీ.సిరీస్‌కి అహ్వానించింది అనూరాధ. అప్పటికే అరకొర పాటలు పాడుతూ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ యువ గాయకుడు టి.సిరీస్ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేందుకు సంతోషంగా అంగీకరించాడు. ఆ యువ గాయకుడు ఉదిత్ నారాయణ్. అనూరాధ పౌడ్వాల్ తనకు పరిచయం ఉన్న యువ సంగీత దర్శకుల జంట ఆనంద్-మిళింద్‌లను టి.సిరీస్‌కి ఆహ్వానించింది. ఈ సమయానికి ఆర్డీ బర్మన్ వెనుక పడ్డాడు. మూట ముల్లె సర్దుకుని పాటలు మానేసి ఖాండ్వా వెళ్ళిపోదామనుకున్న కిషోర్ కుమార్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. కళ్యాణ్‌జీ ఆనంద్‌జీల సినిమాలు తగ్గిపోయాయి. వాళ్ళ పాటలలో మాధుర్యం కూడా అరుదైపోయింది. పాటలన్నీ అరుపులు, కేకలు, డిస్కోలు అయిపోయాయి. ఈలాంటి పరిస్థితిలో అప్పటి ట్రెండ్‍కు భిన్నమైన మధురమైన పాటలతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది టి.సిరీస్.

1988లో ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమా పాటల విడుదలతో మళ్ళీ హిందీ సినిమా పాటలలో ‘మెలోడీ’ కి సముచిత స్థానం లభించింది. యువ జంటకు యువ సంగీత దర్శకులు, యువ స్వరాలతో కూర్చిన పాటలు పెద్ద సంచలనం సృష్టించాయి. దాదాపుగా ఎనిమిది మిలియన్ క్యాసెట్ల పైన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ పాటలు అమ్ముడైపోయాయి. దాంతో సినీ రంగంలోకి మెరుపులు ఉరుములతో టి.సిరీస్ అడుగుపెట్టింది. టి.సిరీస్‍తో పాటు దాని డైరెక్టర్‍గా, టి-సిరీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన అనూరాధ పౌడ్వాల్ ఇప్పుడు ఇతరుల భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి ఎదిగింది.

సినీ రంగాన్ని ఊపు ఊపేందుకు టి.సిరీస్ కొత్త పథకం వేసింది. ఇది రెండు మూడు వైపుల నుంచి ఒకేసారి జరిపే అత్యద్భుతమైన దాడి. మన సినిమాలలో పాటలు వచ్చే సందర్భాలు పరిమితం. కాబట్టి గేయ రచయితలతో ఆయా సందర్భాలకు తగ్గట్టుగా  పాటలను రాయించి రికార్డు చేసేస్తారు. సినీ నిర్మాత, దర్శకులకు అవసరమైనప్పుడు రికార్డయిన పాటలను వినిపిస్తారు. వాటిల్లోంచి నిర్మాత, దర్శకులు వారికి ఇష్టమైన పాటలను ఎంచుకుంటారు. ఇలా రూపొందించే పాటలు వీలైనంత ఆకర్షణీయంగా,  విన్నవారికి  సులభంగా పట్టేసేలా ఉంటాయి. ఇది నిర్మాతకు లాభం. సంగీత దర్శకుడిని నిర్ణయించుకుని, వారికి అడ్వాన్స్ లిచ్చి రికార్డు చేయించటానికి కొన్నినెలలు వ్యర్థం అయ్యే బదులు రెడీమేడ్ పాటలు, అన్ని విధాలుగా తయారైన పాటలు సులభంగా దొరుకుతున్నాయి. దాంతో ఇంతకు ముందులా గాయనీ గాయకులకు కుదరకపోయే రికార్డింగ్ కేన్సిల్ చేయటం, అనవసరమైన ఖర్చు వంటివి ఉండవు. ఇది నిర్మాతలకు లాభకరమైన విషయం. దాంతో ముందే రికార్డయిన పాటల ఆధారంగా కథలల్లటం, అల్లిన కథలో కుదిరే పాటలనే ఎంచుకోవటానికే నిర్మాతలు ఇష్టపడ్డారు.

ముందే పాటలను రూపొందించేందుకు యువ గాయనీ గాయకులను, సంగీత దర్శకులను టి-సిరీస్ ఎంపిక చేసింది. సోను నిగమ్, కుమార్ సాను, నదీమ్ శ్రావణ్, అభిజిత్, విపిన్ సచ్‌దేవ్, బేలా సులాఖే, బబ్లా మెహ్తా వంటి కళాకారులందరితో టి.సిరీస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ‘ట్రైబ్యుట్ అల్బమ్స్’ పేరిట పాత పాటలన్నిటినీ కొత్త గాయనీ గాయకులతో పాడించి, రికార్డ్ చేసి, అతి తక్కువ ధరకు మార్కెట్‍లో అమ్మటం ప్రారంభించింది టి.సిరీస్. ఇవి చాలా పాపులర్ అవటమే కాదు, అసలు పాటల కన్నా ఈ పాటలు వింటూ ఇవే అసలు పాటలని ప్రజలు భ్రమపడే స్థితికి వచ్చారు. లత పాటలన్నిటినీ తాను పాడుతూ లతలా పాడాలన్న కోరికను తీర్చుకోవటమే కాదు, లత కన్నా తానే బాగా పాడేను అని అందరితో అనిపించుకుంటూ సంతృప్తి చెందింది అనూరాధ పౌడ్వాల్. ఒరిజినల్ పాటల రికార్డుల ధర అధికంగా కావటంతో తక్కువ ధరకు లభించే ఈ ట్రైబ్యుట్ కవర్ వెర్షన్లు వింటూ ఉర్రూతలూగిపోసాగారు శ్రోతలు. భజనల మార్కెట్‍లో స్థానం లేదని పెద్ద పెద్ద మ్యూజిక్ కంపెనీలు తనకు అవకాశం ఇవ్వకపోవటం అనూరాధ పౌడ్వాల్ మరచిపోలేదు. భజనల మార్కెట్‍‍ను విశిష్టమైన భజన కాసెట్లతో తుఫాను అలలా తాకింది అనూరాధ పౌడ్వాల్ – దుర్గ వందన, జగన్నాథ భజన, గణపతి ఆరతి, దేవిభక్తి, విష్ణు సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, శివపురాణం గానంతో దేశం నలుమూలల స్థానిక భజన మార్కెట్‍ లను హస్త గతం చేసుకుంది టి.సిరీస్. ముఖ్యంగా వైష్ణోదేవి అంటే గుల్షన్ కుమార్ మాత్రమే గుర్తొచ్చే రీతిలో ప్రచారం జరిగింది. భజనల మార్కెట్‍ను టి.సిరీస్ ఎంతగా హస్తగతం చేసుకున్నదంటే అప్పటివరకూ క్యాసెట్ల మార్కెట్‍లో మకుటం లేని మహారాజుల్లా వెలుగుతున్న హెచ్.ఎం.వి., పాలిడార్, మ్యూజిక్ ఇండియా లిమిటెడ్ వంటి వారికి ఊపిరి అందని పరిస్థితి నెలకొంది. కొత్తగా వ్యాపారంలో అడుగుపెట్టిన టిప్స్, వీనస్ వంటి వారి మనుగడ ప్రశ్నార్థకం అయింది. ఇంతటితో ఆగలేదు అనూరాధ. ప్రతి క్యాసెట్‍పై తన బొమ్మ ముద్రించుకుంది. ప్రప్రథమంగా ఒక గాయని ఫోటో క్యాసెట్‍పై ఉండటం టి.సిరీస్‍తో ఆరంభమయింది. అదీ అనూరాధ పౌడ్వాల్ ఫోటో . అనూరాధ పౌడ్వాల్ తెలివైనది. సినీ పరిశ్రమలో మనగలగాలంటే ఒక అండ అవసరం అని విఫలమైన గాయనీ గాయకుల అనుభవాల నుండి గ్రహించింది. అందుకని టి.సిరీస్ అండ లభించగానే తనదంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. పెద్ద పెద్ద మ్యూజిక్ కంపెనీలతో సహా నిర్మాతలను, సంగీత దర్శకులను లెక్క చేయకుండా స్వీయ ప్రచారం విస్తృతంగా చేసుకుంది. ఇప్పుడు ఆమె అవకాశాలను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎందుకంటే టి.సిరీస్ దాదాపుగా ఆమెదే! అక్కడ ఆమె నిర్ణయాలను ఎదిరించేవారు లేరు. దీనికి తోడు ఇప్పుడు ఆమె యువ కళాకారులకు అవకాశాలిస్తూ వారిని వెలుగుకు తెస్తూ, వారి భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంది.

ఓవైపు టి.సిరీస్ పాటలు దేశాన్ని ఊపేస్తూండగా మరోవైపు లక్ష్మీప్యారేల పాటలతో 1988వ సంవత్సరం ‘అనూరాధ పౌడ్వాల్’ సంవత్సరంగా గుర్తింపు పొందింది. తొలిసారిగా లతా మంగేష్కర్, ఆశా భోస్లే పాటలు కాక మరో గాయని పాటలు అధిక సంఖ్యలో ప్రజాదరణ పొంది సినిమాల విజయంలో ప్రధాన పాత్ర పోషించిన అపురూపమైన అరుదైన సంవత్సరం అది. ఆజ్ ఫిర్ తుమ్ సే (దయావాన్), న న కర్తే (రామ్ అవతార్), పూల్ గులాబ్ కో (బివీ హో తో ఐసీ), కహెదో కె తుమ్ (తేజాబ్), జీవన్ సుఖ్ దుఖ్ కే ఏక్ సంగం (పాప్ కో జలా కర్ రాఖ్ కర్ దూంగా) వంటి హిట్ పాటలు లక్ష్మీప్యారే అనూరాధ పౌడ్వాల్ కోసం రూపొందించారు. అయితే అనూరాధ విజయంలోనే  పరాజయం బీజాలు ఉన్నాయి. అది కాలక్రమేణా కానీ తెలియలేదు. ఈ వైపు అనూరాధ పౌడ్వాల్ ఇలా హిట్ పాటలు వరుసగా పాడుతూ, అటు సినిమా ప్రపంచాన్ని ఇటు భజనల ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో ‘అల్కా యాగ్నిక్’ – ‘ఏక్ దో తీన్’ పాటతో సూపర్ హిట్ గాయనిగా గుర్తింపు పొందింది.

1989వ సంవత్సరం వచ్చేసరికి గుల్షన్ కుమార్ టి-సిరీస్ ద్వారా  పరిచయమైన నూతన సంగీత దర్శకులు సినీ రంగంలో అధికమై పోయారు.  వీరు సినీ పాటల రూపు రేఖలను మార్చేయసాగారు. వీరు యువ గాయనిలకే ప్రాధాన్యం ఇవ్వసాగారు.  బప్పీ లహరి, కళ్యాణ్‍జీ ఆనంద్‌జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍లకు సినిమాల సంఖ్య తగ్గిపోయింది. ఆర్డీ బర్మన్ అయితే సినిమాలు లేని దుస్థితిని అనుభవించాల్సి వచ్చింది. గుల్షన్ కుమార్ సృజించిన ‘మ్యూజిక్ బ్యాంక్’ పథకంతో సినీ సంగీత పరిశ్రమ అస్తవ్యస్తం, అతలాకుతలం అయిపోయింది.

గుల్షన్ కుమార్ దీనితో ఆగలేదు. తక్కువ ఖర్చుతో వీడియో క్యాసెట్లు తన దగ్గర ఉన్న పాటలతో తయారు చేయటం ఆరంభించాడు. అప్పుడప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలు ఆరంభమయ్యాయి. టీ.వీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు ఛానళ్ళు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ‘ఎంటివి’ వంటి మ్యూజిక్ ఛానెళ్ళు, ‘మ్యూజిక్ వీడియో’ల సంస్కృతిని దేశానికి పరిచయం చేశాయి. ఈవైపు ముందుగా దృష్టి పెట్టినవాడు గుల్షన్ కుమార్. తక్కువ బడ్జెట్‍లో మ్యూజిక్ వీడియోలు తీయటమే కాదు, సినిమాలు తీయటం కూడా ఆరంభించింది టీ.సిరీస్. సినిమాల స్థాయి ఎలా ఉన్నా, పాటలు అత్యంత ప్రజాదరణ పొంది సినిమాలు హిట్ అయ్యేవి. అలా తయారైన ‘లాల్ దుపట్టా మల్‍మల్ కా’ అనూహ్యంగా సూపర్ హిట్ అయింది. ‘క్యా కర్తే థే సాజ్‍నా’, ‘న జానే దిల్ క్యూన్ బేకరార్’ వంటి పాటలు సూపర్ హిట్లయి ఆనంద్ మిళింద్, అనూరాధ పౌడ్వాల్, ఉదిత్ నారయణ్ లను సూపర్ స్టార్లను చేశాయి.

అన్ని టి.సిరీస్ పాటల నడుమ లక్ష్మీప్యారే సంగీత దర్శకత్వంలో ‘రామ్ లఖన్’ సినిమాలో పాడిన ‘తెరా నామ్ లియా’ అనూరాధ పౌడ్వాల్‌కు మరింత పేరు తెచ్చింది. హిందీ సినీ ప్రపంచంలో ఆ కాలంలో జరుగుతున్న సంఘర్షణను ‘రామ్ లఖన్’ సినిమా చక్కగా ప్రదర్శిస్తుంది.

‘సుభాష్ ఘయ్’ సినిమాలకు ‘లక్ష్మీప్యారే’ సంగీత దర్శకత్వం వహించటం అనవాయితీగా మారింది. కానీ సినిమాలు లేకుండా ఉట్టిగా ఉండీ నిరాశలో కూరుకుపొతున్న ఆర్డీ బర్మన్‍కు ఆత్మవిశ్వాసం ఇచ్చే ఉద్దేశంతో ‘రామ్ లఖన్’ సినిమాకు ఆర్డీ బర్మన్‍ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు సుభాష్ ఘయ్. ఆ రకంగా ప్రకటన కూడా చేశాడు. వెంటనే ‘లక్ష్మీప్యారే’లు అలర్టయ్యారు. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ సినిమా పాటల రికార్డింగ్ ఆరంభమయ్యే వరకూ ఆర్డీ బర్మన్‌కు ‘రామ్ లఖన్’ సంగీత దర్శకుడు తాను కాదు ‘లక్ష్మీప్యారే’ అన్న విషయం తెలియదు. ఈ మోసాన్ని తట్టుకోలేక ఆర్డీ బర్మన్‍కు గుండె పోటు వచ్చిందంటారు. ఇది ఆ కాలంలో సంగీత దర్శకులు సినిమా అవకాశాల కోసం ఎలా తపించేవారో తెలుపుతుంది.

‘రామ్ లఖన్’ పాటల రూపకల్పనలో లక్ష్మీప్యారేలకు సమస్య ఎదురైంది. వారు అంతవరకూ అండగా నిలిచిన అనూరాధ పౌడ్వాల్ ఇప్పుడు ఆమెనే ఎంతో మందికి అండ అయింది. పైగా ఆమె డైరెక్టర్‍గా వ్యవహరిస్తున్న సంస్థ, లక్ష్మీప్యారే సంగీతాన్ని అమ్మే సంస్థకు పోటీ. అలాంటప్పుడు ఆమెని ప్రోత్సాహించటం, హిట్ పాటలు ఇవ్వటం అంటే అనూరాధ డిమాండ్‍ను పెంచటమే కాదు తమని దెబ్బ తీస్తున్న సంస్థకి శక్తి నిచ్చినట్టు. అందుకని అంతకు ముందు రికార్డు చేసిన పాటలు అలాగే ఉంచి, మిగతా పాటలు యువగాయని కవిత కృష్ణమూర్తితో పాడించారు. ఎలాగైతే అనూరాధ పౌడ్వాల్‍కు ఒకప్పుడు అవకాశాలిచ్చి ప్రోత్సాహించారో, ఇప్పుడు ఆ అనూరాధ పౌడ్వాల్‍కు పోటీగా అల్క యాగ్నిక్‌కూ, కవిత కృష్ణమూర్తికి అవకాశాలు ఇవ్వటం ఆరంభించారు. అలాగని వారికి తల్లి లాంటి లతను వారు విస్మరించలేరు. కాబట్టి లత కోసం ప్రత్యేకంగా యమన్ రాగంలో ‘ఓ రామ్ జీ బడా దుఖ్ దీనా’ అనే అత్యద్భుతమైన పాటను రూపొందించారు. మండుటెండల నడుమ చల్లటి జల్లులాంటిదీ పాట. లత మంగేష్కర్ పాడిన అత్యద్భుతమైన పాటలలో ఒకటిగా నిలుస్తుందీ పాట.

1989లో టీ.సిరీస్ కోసం సంగీత దర్శకులు నదీమ్ శ్రావణ్‍లు 24 పాటలను రూపొందించారు. ఈ పాటలన్నింటిలో గాయని అనూరాధా పౌడ్వాల్. ఈ పాటలలో అధిక శాతం పాటలను దర్శకుడు మహేష్ భట్ ఎంచుకున్నాడు. అలా ఎంచుకున్న పాటలలో కొన్ని పాటలను 1990లో విడుదలైన ‘ఆషికీ’ సినిమాలో వాడాడు. ‘ఆషికీ’ సినిమా పాటలు దేశాన్ని ఊర్రూతలూగించాయి. కుమార్ సాను, సమీర్, నదీమ్ శ్రావణ్‍లను సూపర్ స్టార్లను చేశాయి. ఆనూరాధా పౌడ్వాల్‌ను అగ్రస్థాయికి చేరువ చేశాయి. ‘ఆషికీ’ పాటల కేసెట్‍ లు  ఇరవై మిలియన్లకి పైగా అమ్ముడయి చరిత్ర సృష్టించాయి.

అనూరాధకు  ‘నజర్ కే సామ్‌నే’ పాటకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. ‘ఆషికీ’లో వాడగా మిగిలిన పాటలను మహేష్ భట్, 1991లో విడుదలైన ‘దిల్ హై కీ మాన్తా నహీ’ సినిమాలో వాడేడు. ఈ సినిమా కూడా పాటల వల్ల హిట్ అయింది. పాటలు ఎంతగా హిట్ అయ్యాయంటే, ఓ సీనియర్ లత పని అయిపోయిందని బహిరంగంగా ప్రకటించాడు. అయితే, అనూరాధ విజయం సాధిస్తూ శిఖరారోహణం చేస్తున్న తరుణంలోనే ఆమె పరాజయానికి బీజాలు పడ్డాయి. ఇది గమనించి అర్థం చేసుకున్నది లతా మంగేష్కర్.

నిజానికి 1990 నాటికి లతా మంగేష్మర్ అధిరోహించాల్సిన శిఖరాలు లేవు. ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. ఆమె పాడని పాట లేదు. అమె పలకని భావం లేదు. ఆమె అధిరోహించని ఎత్తులు లేవు. పాటల స్థాయిలో లత దరిదాపులకు కూడా ఎవ్వరూ రాలేదు. ఇతరులు ఎంతగా హిట్ పాటలు పాడినా లత పాటల్లా ఎల్లప్పటికి తాజాగా ఉంటూ, తరతరాలను అలరించే స్థాయిలో ఉండవు. ఇదంతా లతకు తెలుసు. కానీ టి.సిరీస్ పై తనకున్న అధికార గర్వంతో, గుల్షన్ కుమార్ అండ తనకు ఉన్నదన్న అహంకారంతో కొత్తవారిలోని ప్రతిభను గుర్తించి అవకాశాలనిచ్చి వారికి జీవితాన్ని ప్రసాదిస్తున్న తీవ్రమైన దర్పంతో అనురాథ పౌడ్వాల్ గమ్యం ఇంకా పూర్తిగా చేరకముందే గమ్యం తనదైనట్టు, తనకు ఎదురు లేనట్టు ప్రవర్తించటం ప్రారంభించింది.

లత, ఆశాలు తనకు అవకాశాలను ఏ రకంగా రానివ్వలేదని ఆరోపించిందో, తన పాటలను చివరి క్షణంలో వారు పాడి, తన పాటలు విడుదల కానివ్వలేదని ఆరోపణలు చేసిందో, సరిగ్గా అనురాద అలానే ప్రవర్తించటం ఆరంభించింది. తానే టి.సిరీస్, టి.సిరీస్ అంటే తాను అన్నట్టు అహంకరించింది. ‘దిల్’ సినిమాలో అల్కా యాగ్నిక్ పాటలను చివరి క్షణంలో అనూరాధ డబ్ చేసి పాడింది. ఇది అల్కాకు కోపం తెచ్చింది. నిరాశ నిస్పృహలతో ఆమె బహిరంగంగా అనూరాధను దూషించి టి.సిరీస్‌కు దూరమైంది. టి.సిరీస్‍తో పడని ఇతర మ్యూజిక్ సంస్థల సంగీత దర్శకులంతా అల్కాను దగ్గరతీశారు.

జరుగుతున్న దాన్ని చూస్తూ లత మౌనంగా తనకు నచ్చిన పాట పాడుతూ ఏమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా విదేశాలలో సంగీత సభలు జరుపుతూ, ప్రైవేట్ ఆల్బమ్‍లు పాడుతున్న లతను అనూరాధ తీవ్రంగా అవమానించింది. 1949 ప్రాంతంలో అనిల్ బిశ్వాస్ సంగీత దర్శకత్వంలో ‘అనౌఖా ప్యార్’ సినిమాలో లత పాటలను మీనా కపూర్ డబ్ చేసిన తరువాత మళ్ళీ అలాంటి సాహసం సినీ పరిశ్రమలో ఎవ్వరూ చేయలేదు. ఆ దుస్సాహసం అనూరాధ చేసింది.

అనూరాధ భర్త అరుణ్ పౌడ్వాల్ సంగీత దర్శకత్వం వహించిన ‘రాధ కా సంగం’ సినిమాలో లత పాడిన పాటలన్నిటినీ చివరి క్షణంలో అనూరాధ పౌడ్వాల్ పాడింది. రికార్డులు అనురాధ పాటలతో విడుదలయ్యాయి. యువ నాయికకు తన స్వరం సరిగ్గా సరిపోతుందని ప్రకటించి మరీ ఈ పని చేసింది అనూరాధ. అది నిద్రిస్తున్న సింహాన్ని రెచ్చగొట్టినట్టయింది. అంతవరకూ ఏం జరుగుతున్నా చూస్తూ చూడనట్టు ఊరుకున్న లత ఇక ఉపేక్షిస్తే లాభం లేదని నిశ్చయించుకుంది. విజేతలకు, గెలుపు అంచులకు చేరి పరాజయం పొందేవారికీ ఇదే తేడా. లత, అనురాధను విమర్శించలేదు. “అయ్యో ఇలా జరిగింది” అనలేదు. ఎవరెంతగా ప్రశ్నించినా చిరునవ్వు సమాధానం ఇచ్చింది తప్ప ఒక్కమాట తూలలేదు. కానీ అనూరాధకు తన స్వరంతో సమాధానం ఇచ్చింది. అదీ ఎలా! ఆ సమాధానం శక్తికి అంతవరకూ శిఖరాన్ని చేరుకుంటున్న విజయ గర్వంతో ఉన్న అనూరాధ కళ్ళు మూసి తెరిచేలోగా నేలజారేట్టుగా! పరాజితుడు అనవసరమైన మాటలతో శక్తిని వృథా చేసుకుంటాడు. విజేత మాట్లాడడు. సర్వ శక్తిని చేతలలో పెట్టి చూపిస్తాడు. లత అదే చేసింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here