[dropcap]పం[/dropcap]ఛి బనూ ఉడ్‍తె ఫిరూన్ మస్త్ గగన్ మే
ఆజ్ మై ఆజాద్ హూన్ దునియాకె చమన్ మే
‘చోరీ చోరీ’ సినిమాలో నర్గీస్ పాత్ర ఇష్టం లేని పెళ్ళి నుంచి తప్పించుకొనేందుకు ఇల్లు వదలి పారిపోతుంది. ఆ పారిపోవటం వల్ల తనకు స్వేచ్ఛ వచ్చిందని సంతోషంతో; పక్షినై ఆకాశంలో విహరిస్తానని ఆనందంగా పాడే పాట ఇది. ఈ పాట పాడిన సమయంలో లతకు స్వేచ్ఛ అన్నది ఒక కల మాత్రమే. ఇంటి భారాన్ని వహిస్తూ, సోదరీ సోదరుల బాధ్యతను వహిస్తూ ఆర్థిక భద్రత కోసం లత నిరంతరం పరిశ్రమిస్తున్న సమయం అది. కానీ తన నిత్య జీవితంలోని ఉద్విగ్నతలు, నిరాశలు లత ఎన్నడూ తన పాటలో కనబడనీయలేదు. ఎందుకంటే లత దృష్టిలో పాట పాడటం అన్నది డబ్బు సంపాదించే సాధనం మాత్రమే కాదు. ప్రజలను అలరించి పేరు సంపాదించే మాధ్యమం కాదు. లత దృష్టిలో ‘పాట’ అంటే ‘సంగీతం’, భగవదార్చన లాంటిది. ‘పాట’ ‘పూజ’ లాంటిది. “నేను జీవితంలో ఏదో సాధించాలనో, పేరు ప్రఖ్యాతులు పొందాలనో పాటల ప్రపంచంలో అడుగిడలేదు. సంగీత సాధన ద్వారానే నా జీవితం గడుస్తుందని, అభివృద్ధి సాధిస్తుందన్నది నా నమ్మకం. ఇది తప్ప ఇంకోటి నేను చేయలేను. ఇది ఈశ్వరుడి కృప. సమాజంలో నాకు గుర్తింపు లభించినా, గౌరవాభిమానాలు లభించినా సర్వం సంగీతం వల్లనే. అందుకని నా ప్రపంచం అంతా సంగీతమే” అంటుంది లతా మంగేష్కర్. అందుకే ఆమె పాట కోసం సర్వం త్యాగం చేసింది. పాటకు ఇచ్చిన ప్రాధాన్యం దేనికీ ఇవ్వలేదు. పాటకు ప్రతిబంధకంగా అనిపించిన ప్రతిదాన్నీ ఆమె త్యజించి, తిరస్కరించి, పాటే ప్రాణంగా, పాటే ఊపిరిగా , పాటే జీవితంలా , తన సర్వం పాటగా బ్రతికింది. లతకూ, లతను దాటి పోవాలని ప్రయత్నించే ఇతర గాయనిలకు, లత కన్నా తాము ప్రతిభావంతులమని భావిస్తూ, లత తమను చూసి భయపడిందని, తమను అణగద్రొక్కిందనీ ఆరోపించే వారికీ, ప్రధానమైన తేడా ఈ ‘అంకిత’ భావనలో ఉంది. సంగీతాన్ని ఈశ్వరుడిలా భావిస్తూ పాడే ప్రతి పాటనూ భగవదార్చనలా అనుభూతి చెందుతూ పాడటంలో ఉంది. ఇది ఒకరకంగా లత, పాటను గౌరవించటమే కాదు , తన స్వరాన్ని సైతం గౌరవించినట్టు అవుతుంది. అందుకే ఎలాంటి పాట అయినా, తానే పాట అయినట్టు పాడుతుంది లత. పాటను అనుభవిస్తూ, ఆ అనుభూతిని స్వరంలో పలికిస్తూ, ప్రతి శ్రోత హృదయం ఆ స్పందన ప్రభావంతో ప్రతిస్పందించి, ఆ అనుభూతిని స్వంతం చేసుకునే రీతిలో పాడుతుంది లత. పాటకు సంబంధించి లత చేసే ప్రతి పనిలో ఇదే శ్రద్ధ, నిబద్ధత, పట్టుదలలు, రాజీపడకపోవటం, అత్యుత్తమం తప్ప తక్కువను ఆమోదించని మొండితనాలు కనిపిస్తాయి. అందుకే ఇతరులెంత ప్రతిభావంతులైనా, వారందరి కన్నా ఒక మెట్టు పైనే కనిపిస్తుంది లత.
1970 దశకం నుంచీ సినీ సంగీతం స్థాయీ, నాణ్యతలు దిగజారటం మొదలైంది. స్వర్ణయుగం నాటి కళాకారులంతా ఒకరొకరుగా కనుమరుగై పోతుండటంతో సినీ సంగీత ప్రామాణికాల స్థాయి తగ్గిపోయింది. స్వర్ణయుగం సంగీత దర్శకుల కాలంలో తమ కెరీర్లు ఆరంభించిన వారు, ఆరంభంలో ఆ స్థాయి కళాకారులతో పోటీపడిన ఉత్తమ స్థాయి సంగీత దర్శకులు కూడా, వారి నిష్క్రమణ తరువాత పోటీ స్థాయి పడిపోవటంతో వారి సృజన స్థాయి కూడా తగ్గిపోయింది. ఆ స్థాయి ప్రామాణికాలను నిలపలేకపోయారు. అయినాసరే 1970-1987 నడుమ లత పాడిన పాటలు అత్యుత్తమ స్థాయికి చెందిన పాటలు. గతం పాటలతో పోలిస్తే, లత స్థాయి పాటలు కాకపోయినా, 1970-1987 నాటి సగటు స్థాయి కన్నా ఉత్తమ స్థాయి పాటలు. ప్రతి సంవత్సరం ఒకటో, రెండో సినిమాలు లత పాటల వల్ల హిట్ అవటంతో, ఆమె పాటలు పాడటం తగ్గించినా నిర్మాతలు, సంగీత దర్శకులు లత వెంట పడటం మానలేదు. యువ గాయనిలతో ఎన్ని పాటలు పాడించినా, లత పాటల స్థాయి వాటికి ఉండకపోవటంతో లతతో పాడించటం అన్నది ఒక గౌరవసూచకంగా, సంగీత దర్శకుడి ప్రతిభకు కొలబద్దగా మారింది.
1970లో ‘ఆన్ మిలో సజ్‍నా’, ‘ఆనంద్’, ‘అభినేత్రి’, ‘దస్తక్’ వంటి సినిమాలలో లత పాటలు సూపర్ హిట్ లయ్యాయి. ముఖ్యంగా ‘దస్తక్’ సినిమా పాటలకు జాతీయ స్థాయి అవార్డు లభించటం గమనార్హం. ‘ఆనంద్’ సినిమాలో ముకేష్ పాటలు హిట్ అయినా లత పాడిన ‘న లాగేనా తెరె బినా జియా’ పాట శ్రోతలను అలరించింది. ‘హీర్ రాంఝూ’లో ‘మిలోన తుమ్ తో హమ్ ఘబ్‌రాయే’ ఈనాటికీ వినబడే పాట. ‘జానీ మేరా నామ్’ ప్రధానంగా కిషోర్ కుమార్ పాటల సినిమా అయినా లత పాడిన ‘ఓ బాబుల్ ప్యారే’, ‘చుప్ చుప్ మీరా రోయే’ పాటలు శ్రోతల ఆదరణ పొందాయి. ‘కటీ పతంగ్’లో సైతం కిషోర్ కుమార్ సూపర్ హిట్ పాటల నడుమ ‘న కోయీ ఉమంగ్ హై’ సగర్వంగా నిలుస్తుంది. ‘ప్రేమ్ పూజారి’లో సైతం ‘రంగీలా రే’ పాట తనదైన ప్రత్యేక అస్తిత్వం సాధించింది. 1971లో ‘రేష్మా ఔర్ షేరా’, ‘తేరే మేరే సప్నే’, ‘మేరా గావ్ మేరా దేశ్’, ‘నయా జమానా’, ‘జల్ బిన్ మచ్ లీ నృత్యబిన్ బిజిలీ’ వంటి సినిమాలు లత అత్యద్భుతమైన పాటలున్న సినిమాలు. ‘అమర్ ప్రేమ్’ వంటి కిషోర్ కుమార్ పాటల ఆధిక్యం కల సినిమాలోనూ ‘బడా నట్ ఖట్ హై’, ‘రైనా బీతి జాయే’ వంటి సుమధురమైన పాటలతో లత తన ప్రత్యేకతను నిలుపుకుంది. 1972లో లత స్వరంలోని వైశిష్ట్యాన్ని అత్యద్భుతమైన మాధుర్యాన్ని ప్రదర్శించిన ‘పాకీజా’ సినిమా కేవలం లత పాటల వల్ల ఈనాటికీ సజీవంగా ఉందన్నది నిర్వివాదాంశం. 1973లో ‘అనామిక’, ‘అభిమాన్’ సినిమాలు; 1974లో ‘రజనీగంధ’, ‘రోటీ కప్‍డా ఔర్ మకాన్’; 1975లో ‘సన్యాసి’, ‘మౌసమ్’, ‘జూలీ’ వంటి సినిమాల్లో లత అద్భుతంగా పాడినా, గమనిస్తే, లత సోలో పాటల కన్నా యుగళ గీతాలు అధిక ప్రజాదరణ పొందటం తెలుస్తుంది. అక్కడొకటి, ఇక్కడొకటి సోలో పాట హిట్ అయినా, గతంలోలా లత పాటల కోసం సినిమాలు ప్రజాదరణ పొందటం తగ్గి, యుగళ గీతాల ప్రాధాన్యం పెరగటం గమనించవచ్చు. ఇది రాజేష్ ఖన్నా సూపర్ స్టార్‍గా ఎదగటం, అమితాబ్ యాంగ్రీ యంగ్‌మేన్‍గా స్థిరపడటంతో జతపరచి విశ్లేషిస్తే, సినిమాల్లో గాయనిల సోలో పాటల ప్రాధాన్యం గణనీయంగా తగ్గటంతో పాటు, మహిళ పాత్రలు కేంద్రంగా రూపొందే సినిమాల సంఖ్య కూడా తగ్గటం తెలుస్తుంది. గతంలో మీనా కుమారి, నూతన్, నర్గీస్, వైజయంతిమాల వంటి నాయికలకు లభించినటువంటి ప్రాధాన్యం కల పాత్రలు, విశిష్ట వ్యక్తిత్వం ఉన్న పాత్రలు దాదాపుగా అదృశ్యం అవటం తెలుస్తుంది. రేఖ, పర్వీన్ బాబీ, జీనత్ అమన్ వంటి వారి సినిమాల్లో గ్లామర్‍కు ఉన్న ప్రాధాన్యం వ్యక్తిత్వానికి లేకపోవటం తెలుస్తుంది. ఒక్క హేమమాలిని, రాఖీ సినిమాల్లో ఇంకా నాయికకు కాస్త ప్రాధాన్యం, గౌరవం ఉండటం తెలుస్తుంది. అంత సూపర్ హిట్ సినిమా ‘షోలే’లో మహిళ పాడే పాటలు రెండే. ఒక యుగళ గీతం ‘హోలీ కే దిన్ దిల్ ’, రెండోది సోలో ‘జబ్‍తక్ హై జాన్ మై నాచూంగీ’. ఇలాంటి సమయంలో ‘శంకర్ హుస్సేన్’ సినిమాలో ‘ఆప్ యూన్ ఫాస్‍లోంసే గుజర్తె రహే’ వంటి అత్యద్భుతమైన పాటను లత పాడింది. ‘ఆలాప్’ సినిమాలో లత పాడిన సరస్వతి ప్రార్థన ‘మాతా సరస్వతీ శారదా’ ఈనాటికీ సంగీత పాఠశాలల్లో వినిపిస్తుంది. ‘అప్నాపన్’లో లత పాటలు బాగుంటాయి. కానీ సాధారణంగా పాటల స్థాయి పడిపోవటం 1977 నుంచీ ప్రస్ఫుటం అయింది. అలాంటి పరిస్థితులలో కూడా లత అద్భుతమైన పాటలు, అర్థవంతమైన పాటలు, సంగీతపరంగా ఉత్తమ స్థాయిపాటలు పాడటం కనిపిస్తుంది.
ఇక్కడ మరో విశేషం ప్రస్తావించుకోవాలి. 1977లో సూపర్ హిట్ సినిమా ‘అమర్ అక్బర్ ఆంధోని’ లో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉన్నా హీరోయిన్లందరికీ కలిపి ఒకటే పాట ఉంది. ‘హమ్ కో తుమ్ సే హోగయా హై ప్యార్’ అనే పాటలో ముగ్గురు హీరోలకు ముగ్గురు గాయకులు ముకేష్, రఫీ, కిషోర్ కుమార్‍లు పాడతారు. కానీ ముగ్గురు హీరోయిన్లకు ఒకటే స్వరం, లతా మంగేష్కర్! ముగ్గురు హీరోయిన్ల వ్యక్తిత్వాలను అనుసరించి వారికి తగ్గట్టు లత పాడింది. పాట సూపర్ హిట్ అయింది. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నాయికల ప్రాధాన్యం ఏ స్థాయిలో తగ్గిపోయిందో, దానితో పాటుగా, పాటల స్థాయి ఏ మేరకు దిగజారిందో! 1978లో ‘బదల్తే రిష్తే ’, ‘ఘర్’, ‘మైన్ తులసీ తేరే ఆంగన్ కీ’, ‘సత్యం శివం సుందరం’, ‘తుమ్హారే లియే’ వంటి సినిమాలలో లత పాటల స్థాయి ఉత్తమంగా ఉంటుంది. ‘సత్యం శివం సుందరం’లో అధికంగా లత సోలో పాటలున్నాయి. 1979లో ‘ఆంగన్ కీ కలీ’లో ‘సయ్యాన్ బినా ఘర్ సూనా’, ఆత్మరామ్‍లో ‘తుమ్హారే బిన్ గుజారే హై కయీ దిన్’, ‘బాతో బాతోమే’ లో ‘ఉఠే సబ్‍కి కదమ్’ వంటి యుగళ గీతాలు అద్భుతంగా ఉంటాయి. కానీ ‘చంబల్ కీ కసమ్’లో రఫీతో పాడిన ‘సిమ్టీ హువి యే ఘడియా’ అనే యుగళ గీతం; ‘చందారే మేరే భయ్యా” అనే సోలో గీతాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఇలా ప్రతి సంవత్సరం లత పాడిన అత్యద్భుతమైన పాటలను 1970 దశకంలో వ్రేళ్లమీద లెక్కపెట్టవచ్చు కానీ, ఇదే 1950, 1960 సంవత్సరాలైతే కుదరదు. ప్రధానంగా తాను పాడే పాటల పట్ల లతలో అసంతృప్తి కలగటానికీ, సినిమా పాటలలో తనను ఛాలెంజ్ చేయగల పాటను సృజించే సంగీత దర్శకుడు లేడన్న అభిప్రాయం లతలో బలపడటానికి కారణం సులభంగా అర్థం అవుతుంది.
‘సర్ గమ్’, ‘ఏక్ దూజే కే లియే’, ‘ఆశా’, ‘సిల్సిలా’, ‘క్రాంతి’, ‘బసేరా’, ‘శక్తి’, ‘ప్రేమ్‍రోగ్’, ‘బాజార్’, ‘బేమిసాల్’, ‘రజియాసుల్తాన్’, ‘సౌతెన్’, బేతాబ్’, ‘అర్పణ్, ‘రామ్ తేరీ గంగా మైలీ’ సినిమాల్లో లత పాటలు ప్రజాదరణ పొందాయి. సినిమాల విజయంలో ప్రధానపాత్ర పోషించాయి. కానీ ఒక పదేళ్ళలో లత అద్భుతమైన పాటలు అధికంగా ఉన్న సినిమాలు ఇన్ని మాత్రమే అన్నది విషయం గుర్తిస్తే సినిమా పాటల ప్రపంచం ఏ స్థాయిలో దిగజారిందో, లత నిరాశ, అసంతృప్తులు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
మారుతున్న పరిస్థితులను తట్టుకుంటూ కూర్చునేవాడు అక్కడే ఉంటాడు. ప్రపంచం అతడిని వదలి ముందుకు సాగిపోతుంది. కానీ పరిస్థితులలో వస్తున్న మార్పులను ముందే గ్రహించి, వాటికి తగ్గట్టు తనను తాను మార్చుకునేవాడు కాలం అడుగుతో అడుగు కదిపి ప్రయాణించటం మాత్రమే కాదు కాలాన్ని దాటి ముందుకు వెళ్తాడు కూడా. ఇతరులకు మార్గదర్శకుడిగా నిలుస్తాడు. లతా మంగేష్కర్ అదే చేసింది.
తన స్థాయికి తగ్గ పాటలు రావటం లేదని బాధ పడుతూ కూర్చోలేదు. ముందుగా ప్రైవేట్ పాటలు పాడింది. హృదయనాథ్‍తో కలసి మరికొన్ని మీరా భజనలను రికార్డు చేసింది. భగవద్గీతను రికార్డు చేసింది. అంతకు ముందు కొన్ని అధ్యాయాలు రికార్డు చేసింది. తరువాత మరికొన్ని అధ్యాయాలు రికార్డు చేసింది. మరాఠీ రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత ‘గోనీద’ గా ప్రసిద్ధుడైన గోపాల్ నీలకంఠ దండేకర్, లతా మంగేష్కర్‍తో భగవద్గీత, ధ్యానేశ్వర్ మౌళి వంటివి రికార్డు చేసిన అనుభవాన్ని తన పుస్తకం ‘త్రిపది’లో వివరించారు. లతతో రికార్డింగ్ అనుభవాలను వివరించిన అధ్యయం పేరు “స్వర్ కాలిందీ చే తీర్’ అంటే ‘స్వర స్రవంతీ తీరం”లో అని అర్థం. ‘స్వర కాళిందీ నది తీరంలో’ అని మరో అర్థం.
“నేను రెండు మూడు రోజులు వేరే ఊళ్ళో గడిపి ‘తెలెగావ్’ తిరిగి వచ్చేసరికి నాకోసం ప్రత్యేకంగా పంపిన ఓ ఉత్తరం ఎదురుచూస్తోంది. ‘నాలుగో తారీఖులోగా బొంబాయి రావాలి. లతా మంగేష్కర్’ అని ఉందా ఉత్తరం పైన.
ఎందుకని బొంబాయి అంత హడావిడిగా రావాలో ఉత్తరంలో వివరణ ఉంది. ‘భగవద్గీత రికార్డింగ్ ఏప్రిల్ తొమ్మిదిన ఆరంభమవుతుంది. సంస్కృత పదాల సరైన ఉచ్చారణలో మీ అవసరం ఉంది. కనీసం ఏడవ తారీఖు కల్లా వస్తే ఉచ్చారణ సాధన చేసేందుకు సమయం ఉంటుంది. మీరు రాకపోతే రికార్డింగ్ కాన్సిల్ చేయాల్సి ఉంటుంది.’
అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. కొద్దికాలం క్రితం లత స్వరంలో భగవద్గీత పన్నెండవ అధ్యాయం, ధ్యానేశ్వర్ మౌళి రికార్డు చేయాలనుందని బాల్ (హృదయనాధ్) నాతో అన్నాడు. అప్పుడు అర్థమయింది నాకు లత ఎందుకంత తొందరగా బొంబాయి రమ్మంటుందో. నేను వెంటనే ఫోను చేసేందుకు పెద్దార్ రోడ్ పోస్ట్ ఆఫీసుకి వెళ్ళాను. లతనే ఫోను ఎత్తింది.
‘మీ కోసం అందరం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’ అంది.
అన్నిపనులు పక్కన పెట్టి బొంబాయి వెళ్ళాలని నిశ్చయించాను. ‘మధ్యాహ్నం కల్లా వస్తాను. నా కోసం ‘పిఠాలా బాత్’ (మహారాష్ట్రకు ప్రత్యేకమైన వంటకం) సిద్ధంగా ఉంచండి’ అన్నాను.
నేను బొంబాయి చేరేసరికి ‘దీదీ, బాల్’ తలుపు దగ్గరే ఉన్నారు. బాల్ నాకు వివరాలు చెప్పాడు. ‘రికార్డు ఒకవైపు పాసాయ్ దాన్ (పాసాయ్ దాన్ అంటే దైవం అందించే బహుమతి! ప్రసాదాన్ని స్వీకరించేందుకు దోసిలి పట్టటం. అందుకు చేసే ప్రార్థన. సంత్ జ్ఞానేశ్వర్ మరాఠీ భాషలో రచించాడీ ప్రార్థనను) తో పాటుగా మూడు అభంగ్‍లుంటాయి. మరోవైపు భగవధీత పదిహేనవ అధ్యాయం ఉంటుంది. రికార్డింగ్‍కు ముఫ్ఫై ఆరుగంటల సమయం ఉంది. పదిహేనవ అధ్యాయంలో ఇరవై శ్లోకాలున్నాయి. ఇవాళ పది, రేపు పది మనం సాధన చేయవచ్చు. ఇంత శ్రమ తట్టుకోగలరా?’ దీదీని అడిగాను.
“ఎందుకు తట్టుకోలేను?”
శ్లోకాన్ని గానం చేయటం ఒక కళ. మామూలు పాటలాగా కాదు. ప్రతి శబ్దాన్ని నెమ్మదిగా స్పష్టంగా పలకాలి. ఏ శబ్దానికి ఆ శబ్దం ప్రత్యేకంగా నిలవాలి. ఒక శబ్దం మరో శబ్దంతో కలవకూడదు. ముత్యాల మాలలోని ముత్యాలు ఒక చేతినుంచి మరో చేతిలోకి జాలువారినట్టు నెమ్మదిగా పదాలు పలకాలి.
గత కొన్నేళ్ళ క్రితం దీదీ (లత) పాండురంగ శాస్త్రి హర్దీకర్ నుంచి సంస్కృతం నేర్చుకుంది. ఆమె పలు విభిన్న భాషలలో పాటలు పాడి మన్ననలందుకుంది. సూక్ష్మగ్రాహి. కానీ ఇప్పుడు ఆమె మామూలు శ్లోకాలు ఆలాపించటం లేదు. మహర్షి వేదవ్యాసుడు రచించిన శ్రీకృష్ణుడి స్వరం నుండి వెలువడిన శ్లోకాలను తన స్వరం ద్వారా ప్రకటిస్తుంది.
ప్రపంచ శ్రోతల కోసం ఈ రికార్డును HMV ఇంగ్లీష్ వ్యాఖ్యానంతో విడుదల చేయాలనుకుంటోంది. ఇది కూడా ఒత్తిడి పెంచుతోంది.
దీదీ పని చేసే విధానం నాకు తెలుసు. సంగీత దర్శకుడిని రెండుమూడు మార్లు పాటను వినిపించమంటుంది. తరువాత తాను రెండు మూడు మార్లు పాడి వినిపిస్తుంది. అన్నీ బాగున్నాయనుకుంటే రికార్డింగ్‍కు సిద్ధమవుతుంటుంది. రెండు మూడు టేక్‍ల తరువాత పాట రికార్డయిపోతుంది.
అందుకని లతతో అన్నాను ‘దీదీ భగవద్గీత కొత్తకాదు. భగవద్గీతను పాసాయదాన్‍తో పాటు జ్ఞానేశ్వర్ అభంగ్‍లను కలిపి పాడుతున్నావు. నీకు అవి కూడా కొత్తకాదు. వీటిని ఎలా గానం చేయాలంటే పండితులు కూడా ఆనందంతో తలలూపాలి. నేను నెమ్మదిగా, స్పష్టంగా అధ్యాయంలో శ్లోకాలు చదువుతాను. నువ్వు నాతో పాటు నిశ్శబ్దంగా మనసులో శ్లోకాలను చదవాలి. “ శ్రీ భగవాన్ ఉవాచ….”
నేను చదవటం ఆరంభించాను. దీదీ ఏకాగ్రతతో వినటం ఆరంభించింది. “ఇప్పుడు నీ వంతు” అన్నాను.
స్వర సరోవరంలోని రాజహంస పాఠాలు నేర్చుకుంటోంది! నేను పదాలను ఉచ్చరిస్తూంటే, ఆమె నిశ్శబ్దంగా పెదిమలు కలుపుతూ నాతో పాటు ఉచ్చరిస్తోంది.
“గట్టిగా పాడు”
ఆమె నవ్వింది. తన దివ్య స్వరంలో మధురంగా పాడింది. “ఊర్థ మూలం అధః శాఖం….”
అది నమ్మశక్యం కాని అనుభూతి! నేను ఇందాక ఎలా చదివానో దాని ప్రతిధ్వనిని వింటున్నట్టనిపించింది. నేను ఏయే పదాలను ఎలా ఒత్తి పలికానో అలాగే ఆమె పలుకుతోంది. నేను ఆమెకు పదాల ఉచ్చారణల్లోని సంక్లిష్టతను సరిగ్గా పలకటాన్ని వివరించాను.
లత లాంటి అత్యద్భుతమైన గ్రహణ శక్తి కలవారికి పాఠం చెప్పటం ఒక అద్భుతమైన అనుభవం. దాన్ని మాటలలో వర్ణించటం కుదరదు. ఒక్కో పాదం అయిదారు సార్లు సాధన చేసింది. అలా ఒక శ్లోకంలోని నాలుగు పాదాలూ పాడింది. ఆపై మరో అయిదుమార్లు శ్లోకాన్ని మొత్తం పాడింది. అప్పుడు మరో శ్లోకానికి వెళ్ళాం.
ఇది చెప్తూంటే సులభంగా అనిపిస్తుంది. కానీ ఆచరణలో కష్టసాధ్యం. గదిలో టెలిఫోను ఉంది. అది మాటిమాటికీ మ్రోగుతుంటుంది. లత స్వరం వినేందుకు కొందరు, లతతో మాట్లాడేం అని గొప్పలు చెప్పుకునేందుకు కొందరు ఇలా వస్తూంటాయి ఫోన్లు. అలాగని ఫోనును కట్టేయలేం. ఎందుకంటే ఎప్పుడు ఇంపార్టెంట్ కాల్ వస్తుందో తెలియదు. టెలిఫోన్ మ్రోగినప్పుడల్లా మా సాధనకు అంతరాయం కలిగేది.
తను తప్పు పాడినప్పుడల్లా నేను తల అడ్డంగా ఊపేవాడిని.
“ఏం తప్పయింది?” చిన్నపిల్లలా అడిగేది.
“అది ‘అధశ్చోర్ధ్యమ్’. ‘అధిశ్చ్వర్థ’ కాదు”
ఆమె నవ్వి చెవులు పట్టుకుని “క్షమించండి. మరోసారి ఈ పొరపాటు చేయను” అని ఆ పదాన్ని పది పదిహేను సార్లు సరిగ్గా ఉచ్చరించేది.
ఆమె స్వరం పారిజాత పుష్పం తేనెలాంటి తీయనిది. ఒక పొరపాటు జరిగితే ఏముంది? అని నేనంటే లత ఒప్పుకునేది కాదు. పొరపాటు జరగకూడదు, అంతే అనేది.
అలా పది శ్లోకాలు నేర్చుకునేసరికి ఆరుగంటలు పట్టింది. ఆ తరువాత హృదయనాథ్ నాకోసం ఎదురుచూస్తున్నాడు. అతని గదికి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో వివేకానంద పటం ఉంది. పండితుల పుస్తకాలు వరుసగా అమర్చి ఉన్నాయి. అతని ఆరు తీగల తాన్పురా, హార్మోనియం ఉన్నాయి. ఆయన శ్లోకాలకు తగ్గ బాణీ కుదర్చాలని ప్రయత్నిస్తున్నాడు. కాస్సేపటికి గదిలో రాగ్ భూప్ స్వరాలు నిండిపోయాయి. అతని సహాయకుడు దిలీప్ ధోలకియా కూడా సృజన ప్రక్రియలో వచ్చి చేరాడు.
“బాణీలో ఏదైనా పదం ఒదగక పోతే చెప్పండి. ఎక్కడైనా హ్రాస్వం – దీర్ఘాలలో లోపం జరిగితే చెప్పండి” అన్నాడు హృదయనాథ్.
నాకు గర్వంగా అనిపించింది. కానీ బాణీ ఎంతకీ సంతృప్తికరంగా రావటం లేదు. ఇంతలో లత గదిలోకి వచ్చింది. అతని బాణీ విన్నది. వెంటనే శ్లోకాన్ని బాణీలో ఒదిగిస్తూ పాడింది. ఆశ్చర్యం! ఇంతవరకూ బాణీలో కుదరలేదనిపించిన శ్లోకం, ఆ బాణీ కోసమే రాసినదనిపిస్తోందిప్పుడు! ( from english translation by Veena Sathe Pathak: Lata Online)
ఇలా ఒక్కో పదం స్పష్టంగా సరిగ్గా పలకటం కోసం కృషి చేస్తూ ఎక్కడా పొరపాటు దొర్లకూడదన్న పట్టుదలతో, తపనతో ఒక యజ్ఞంలా లత భగవద్గీతను, అభంగ్‍లను రికార్డ్ చేసింది. ఇవి రికార్డు చేసే సమయానికి ఆమె 30 ఏళ్ల పైగా పాటలు పాడుతోంది. ఆమెకు ఉన్న అనుభవం, నైపుణ్యం ఎవ్వరికీ లేవు. అయినా సరే అప్పుడే పాటలు నేర్చుకుంటున్న విద్యార్థినిలా ఆమె భక్తిభావంతో, అంకిత భావంతో పాటను సరిగ్గా పాడటం కోసం శ్రమించటం- ఎందుకని లత ఇన్నేళ్ళు నెంబర్ వన్ గాయనిగా నిలవటమే కాదు, ప్రజల హృదయాల్లో దైవత్వ భావనలను జాగృతం చేస్తూ ఒక మహామనిషిలా నిలిచిందో తెలుపుతుంది.
ఇలా ప్రైవేట్ రికార్డులను పాడుతూ తనలోని తృష్ణను చల్లార్చుకుంటూ, అసంతృప్తిని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు విదేశాలలో పాటలు పాడే టూర్‍కి లతకు ఆహ్వానం అందింది.
లత తొలిసారిగా విదేశాలలో సంగీత సభలో 1974లో పాల్గొంది. లండన్ ‘ఆల్బర్ట్ హాల్’లో జరిగింది సభ. లత స్నేహితుడు ఎస్.ఎన్. గౌరిసారియా, దౌత్య ప్రతినిధి వి.కె. కృష్ణమీనన్‌లు ఈ సభను ఏర్పాటు చేశారు. సభలో నటుడు దిలీప్ కుమార్ లతను పరిచయం చేశాడు. “నేను వేదికమీద అడుగుపెట్టి, ప్రేక్షకులను చూసినప్పుడు నా స్వరంలో వణుకు ఆరంభమయింది. నా గొంతులోంచి శబ్దం బయటకు రాలేదు. నాకేం చేయాలో తోచలేదు. సరిగ్గా పాడాలన్న ఒత్తిడి ఫలితం ఇది. ఎలాగో అలాగ ఆరంభ శ్లోకం పాడేను. శ్లోకం పూర్తయ్యే సరికి నాకు భయం పోయింది” అంది లతా మంగేష్కర్ విదేశాలలో తన తొలి సంగీత సభ గురించి. లండన్ ‘ఆల్బర్ట్ హాల్’ లో పాడిన తొలి భారతీయ గాయని లతా మంగేష్కర్. ఆ ‘షో’ ఘన విజయం సాధించినప్పటి నుంచీ విదేశాలలో లత షోలు నిర్వహించాలని ఎంతోమంది పోటీపడ్డారు. కానీ లతా మంగేష్కర్ ఏ పని కూడా ముందు ఆలోచించకుండా చేయదు. ఆమె ఏ పని కూడా అత్యంత ఉన్నతమైన నాణ్యత ఉంటుందన్న నమ్మకం లేకుండా చేపట్టదు.
1974లో ముకేష్ అమెరికాలో ‘మ్యూజికల్ షో’ ప్రతిపాదన చేశాడు లతతో. అప్పటికి కిషోర్ కుమార్, ముకేష్, మహమ్మద్ రఫీ వంటి వారు విదేశాల్లో షోలలో పాల్గొంటున్నారు. లతకు అమెరికాలో 1969లో కలిగిన చేదు అనుభవం వల్ల అమెరికాలో షో అంటే భయం వేసింది. ఒప్పుకోలేదు. అదీగాక, లత ఇతర గాయకులలా చిన్న చిన్న వేదికలపై, స్కూళ్లలో, చిన్న చిన్న హాళ్లలో షోలు చేసేందుకు ఇష్టపడలేదు. తాను ఏం చేసినా అత్యున్నతమూ, అత్యుత్తమమూ అయి తన స్థాయికి తగినదై ఉండాలన్నది లత పట్టుదల. ‘రాజీపడకపోతే మనం కోరింది లభిస్తుంద’ని అంటారు. లత అందుకే ఏ విషయంలో రాజీపడలేదు. తాను కోరింది సాధించింది.
1975 నుండి 1998 వరకూ లత విదేశీ టూర్లను నిర్వహించి గాన సభలను ఏర్పాటు చేసిన ‘మోహన్ దియోరా’కు లతను పరిచయం చేస్తూ ముకేష్ ఓ మాట లత గురించి చెప్పాడు. ఆ మాటలు తాను ఎన్నటికీ మరచిపోలేనని మోహన్ దియోరా, లతతో విదేశీ టూర్ల నిర్వహణ అనుభవాలను వివరించే పుస్తకం ‘On Stage with Lata’లో రాశాడు.
“మోహన్ జీ, లతా మంగేష్కర్ గులాబ్ కే ఫూల్ కీ తరహ్ హైన్, ధ్యాన్ రఖియేగా కహీన్ ముర్‌ఝానే కా మౌకా న దేనా, వో బడీ నాజూక్ హై’ అన్నాడు ముకేష్. “మోహన్ గారూ, లతా మంగేష్కర్ గులాబీపూవు వంటిది. పూవు వాడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నట్టు చూసుకోవాలి. లత సున్నిత మనస్కురాలు” అన్నాడు ముకేష్. అయితే లత మానసికంగా ఎంత సున్నితమైనదో, పాటల విషయంలో కార్యక్రమ నిర్వహణ నాణ్యత విషయంలో అంత నిర్దయగా రాజీపడకుండా ప్రవర్తిస్తుందని మోహన్ దియోరాకు త్వరలోనే అర్థమయింది. ‘షో’కి అందే డబ్బుల విషయం దగ్గర నుంచి, ఏ హాలులో కార్యక్రమం జరుగుతుంది, ఏయే పాటలు ఎప్పుడు పాడాలి, హాలులో ధ్వని వ్యవస్థ ఎలా ఉంది వంటి ప్రతి విషయాన్నీ లత స్వయంగా నిర్ణయించి, పర్యవేక్షిస్తుంది. రిహార్సల్స్ లేకుండా పూర్తి తయారీ లేకుండా ఎవ్వరూ పాడేందుకు ఒప్పుకునేది కాదు లత. స్థానిక గాయనీ గాయకులు వచ్చి మధ్యలో పాడతామంటే లత అంగీకరించేది కాదు. ఎందుకంటే లతకు ఎప్పుడూ ఒకటే ఆలోచన. ఈ విషయం లత ‘On Stage with Lata’ పుస్తకం ముందుమాటలో స్పష్టంగా చెప్పింది.
“People have asked me if I have suffered from stage front. I do not believe that I have, but I was fearful of making a mistake. So I would prepare myself mentally and give myself ample time. Two hours before the show, I’d choose the sari I was going to wear, some times I got ready in the hotel and sometimes I would change at the venue itself. Then I’d sit in the green room thinking that I had to sing well, people should not say that Lata was nervous or scared. I didn’t want to hear people say ‘this went wrong that were wrong’. What I wanted to hear was, ‘Lata sang well’. It was the thought I had whenever I recorded a playback song. It was not my fear, rather the determination to get it right.”
“అది భయం కాదు. అన్నీ సరిగ్గా ఉండాలన్న పట్టుదల” అంటుంది లత మంగేష్కర్. అన్నీ సరిగ్గా ఉండాలన్న పట్టుదల వల్ల రిహార్సల్స్ చేయకుండా స్థానికులు ఎవరైనా వచ్చి స్టేజి మీద పాడతామంటే లత ఒప్పుకునేది కాదు. ముందుగానే ఏమేం పాటలు ఏ వరుసలో పాడాలో నిశ్చయించుకునేది. దాన్లో ఎలాంటి మార్పులకు ఒప్పుకునేది కాదు. ఇలా కార్యక్రమంలో ఎవరుపడితే వారు వచ్చి పాడనీయకపోవటం విమర్శలకు గురైంది. లతకు ఎవరైనా తనకన్నా బాగా పాడి ప్రేక్షకుల మెప్పు పొందుతారేమోనన్న భయంతో తన షోల్లో వేరేవారిని పాడనివ్వదు అని విమర్శించారు. “లతకు కొత్త గాయనీ గాయకులంటే భయం” అని తీర్మానించి దూషించారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే లత కొన్ని దశాబ్దాలుగా సినిమాల్లో అగ్రశ్రేణి గాయనిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె అభిమానులున్నారు. దేశ విదేశాల్లో ప్రేక్షకులు లత షోలను చూసేందుకు వచ్చేది ఆమె పాటలు వినేందుకే. అలాంటామె స్టేజీమీద రెండు నిమిషాలు పాడి కనుమరుగైపోయే వారిని చూసి బెదిరిపోయింది, వారికి పాడే అవకాశం ఇవ్వలేదు అని భావించటం మూర్ఖత్వానికి పరాకాష్ట అయితే, దాన్ని నమ్మి నోళ్ళు నొక్కుకునేవారు మూర్ఖాధమాధముల్లో ప్రథములు. కానీ లత లాంటి గాయని, మరో గాయనిని చూసి బెదిరి అణచివేస్తుందన్న కథనాలను నమ్మి బురద జల్లటం, ఆకాశంలో సూర్యుడిలా వెలిగే గాయని లాంతరు దీపాలను చూసి బెదిరి, అసూయపడి అణచేస్తుందన్న ఆలోచన రావటమే అసంబద్ధం, అనౌచిత్యం. చివరికి లత గురించి దుర్వ్యాఖ్యానాలు చేయటం ఏ స్థాయికి వెళ్ళిందంటే రైల్వే స్టేషన్‍లో అడుక్కుంటూ లత పాట పాడే ఓ అమ్మాయి వీడియో ఇంటర్నెట్‍లో వైరల్ అయి ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం లభిస్తే ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. “ఇతరులను అనుకరించటం కాదు స్వీయశైలిని ఏర్పాటు చేసుకోవాలి” అని లత వ్యాఖ్యానిస్తే,(ప్రతి యువ గాయనికి లతా ఇచ్చే సలహా ఇదే) ఆమెను చూసి లత అసూయపడుతోందని వ్యాఖ్యానించారు. ఇది జరిగింది 2018-2019లో. అప్పటికి లత పాటలు పాడటం మానేసింది. ఆమెకు అప్పటికి తొంభై ఏళ్ళ వయస్సు. అయినాసరే ఇలాంటి దుర్వ్యాఖ్యాలకు కొదువలేదు.
ఇంతకీ ‘రాణాఘాట్ లత’గా పేరుపొందిన రాణు మోండల్, హిందీ సినిమాల్లో మూడు పాటలు పాడిన తరువాత అదృశ్యం అయిపోయింది. ఆమెతో సెల్ఫీ దిగేందుకు అభ్యర్ధించిన అభిమానితో దురుసుగా ప్రవర్తించి విమర్శలకు గురైంది. ‘నడమంత్రపు సిరి నెత్తికెక్కింద’ని ఆమెని దూషించారు. ఇప్పుడామె మళ్ళీ పూర్వస్థితికి చేరుకుంది. అలాంటి ఆమెని చూసి అత్యున్నత శిఖరారోహణ చేసి, ఆ శిఖరంపై స్థిరంగా ఉన్న లత అసూయ పడుతున్నదని వ్యాఖ్యానించటం ఎంతటి అనౌచిత్యము, నైచ్యమో వ్యాఖ్యానించేవారికి తెలియకున్నా, ప్రచురించేవారికీ, నమ్మేవారికి తెలియకపోవటం ఆశ్చర్యకరమైన విషయం. లత తొంభై ఏళ్ళ వయసులో కూడా ఇలాంటి దుర్వ్యాఖ్యానాలు, కువిమర్శలు భరించాల్సి వచ్చిందంటే ఆమె చురుకుగా పాటలు పాడుతున్న సమయంలో ఆమె ప్రతి చర్యనూ పొరపాటుగా అర్థం చేసుకుని ఎంతగా నీలివార్తలు, గాలి వార్తలు సృష్టించి దుర్య్వాఖ్యానాలు చేసారో సులభంగా ఊహించవచ్చు. ఎవరెన్ని రకాలుగా వ్యాఖ్యానించినా, ఎన్ని రకాల విమర్శలు చేసినా, లత ఎందుకని మౌనంగా ఉండిపోయిందో కూడా అర్థం చేసుకోవచ్చు.
లత విదేశాలలో జరిపిన సంగీత సభలు అపురూపమైనవి. చరిత్ర సృష్టించినవి. అంతవరకూ ఎవ్వరూ విదేశాల్లో సభలు జరిపినా ప్రధాన హాళ్ళలో జరిపే వారు కారు. వారితో పాటు పెద్ద ఆర్కెస్ట్రా కూడా ఉండేది కాదు. కేవలం పాటటలతో ప్రేక్షకులందరినీ కొన్ని గంటల పాటు అలరించటం కష్టం అని భావించి, నడుమ నడుమ జోకులు, స్కిట్లు ఏర్పాటు చేసేవారు. కానీ లత మంగేష్కర్ అలాంటి వాటికి ఒప్పుకోలేదు. విదేశాలలో సభలు నిర్వహిస్తామన్న వారికి ముందుగా ఆమె విధించిన నియమం ఏమిటంటే, లండన్ ఆల్బర్ట్ హాల్‍లో పాడిన తరువాత మామూలు హాళ్ళలో పాడటం కుదరదు. కాబట్టి తాను ఏయే ప్రాంతాలలో పాటలు పాడుతుందో, ఆయా ప్రాంతాలలోని అత్యుత్తమమైన ఆడిటోరియమ్‍ల్లోనే కార్యక్రమం నిర్వహించాలన్న నిబంధన విధించేది.
విదేశాలలో కార్యక్రమాలలో పాల్గొనేముందు లత విధించిన నియమాలను మోహన్ దియోరా ‘On Stage with Lata’ పుస్తకంలో పొందుపరిచాడు.
“The first of her many requests involved us giving her list of cites and venues where the shows would take place. providing her with the names of local organizers and details about their background experience was Lataji’s next request. The third request was to give her two lists of fifty songs each. Songs that were popular in the US and like wise in Canada. (page no 19)”
“Another thing that concerned Lathaji was the concert venues. She wanted a list of the top auditoriums and to know what kind of sound systems they had, plans, details of the stage itself. No one had ever asked us these questions before (page 21)”. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తాను చేసే ప్రతి పని పద్ధతి ప్రకారం చేయటం, చేసే పని అత్యుత్తమ స్థాయిలో ఉండాలన్న లత పట్టుదలను. ఎట్టి పరిస్థితులలో ఏ విషయంలో రాజీపడకపోవటం అహంకారం కాదు, తన విలువ తెలిసి ఆ స్థాయిలో కళను జనరంజకంగా అందించాలన్న తపన అన్నది అర్థం చేసుకోవచ్చు.
ఈ సందర్భంలో మరో విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. విదేశాలలో లత షోలను నిర్వహించేవారు లతకు నిర్ధిష్టమైన సొమ్మును ఇవ్వాలని నిశ్చయించారు. కానీ లత అందుకు ఒప్పుకోలేదు. కార్యక్రమం ఖర్చులు పోగా వసూలైన సొమ్ములో 80:20 నిష్పత్తిలో డబ్బులు పంచుకోవాలని స్పష్టం చేసింది. 80 శాతం లతకు, ఇరవై శాతం కార్యక్రమ నిర్వాహకులకు. నిర్వాహకులు ఒప్పుకున్నారు. ఒప్పుకోకపోతే కార్యక్రమమే ఉండదు. ఇక్కడ లత వ్యక్తిత్వంలో కీలకమైన అంశాన్ని అర్థం చేసుకోవాలి.
లతా మంగేష్కర్‍కు తన విలువ తెలుసు. తన స్వరమాధుర్యం తెలుసు. దాన్ని ఇతరులు దోచుకోవటం, దాన్ని ఆధారం చేసుకుని, తనకు న్యాయంగా లభించవలసినది తనకు ఇవ్వకుండా, ఇతరులు లాభాలార్జించటం లతకు ఆమోదయోగ్యం కాదు. అంటే తన ప్రతిభ ఉచితం కాదు. అది కావాల్సిన వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే. అందుకే కెరీర్ ఆరంభం నుంచీ తనకు లభించవలసిన ధనం విషయంలో లత స్పష్టంగా, నిక్కచ్చిగా ఉంది. రాయల్టీ విషయంలో మొత్తం సినీ పరిశ్రమను ఎదిరించి నిలబడింది. సాధించింది. తన ప్రతిభకు పరిమితులు విధించాలనుకున్న వారికి గుణపాఠాలు నేర్పించింది. తనను చులకన చేయాలని ప్రయత్నించిన వారికి, అవమానించిన వారికి జీవితాంతం మరచిపోలేని రీతిలో సమాధానాలిచ్చింది. కోట్లలో వ్యాపారం నడిచే నిర్దయ, నిర్లజ్జ అయిన పురుషాధిక్య పరిశ్రమలో ఒంటరిగా ఎవరికీ తలవంచక, రాజీపడక పరిశ్రమ మొత్తం తనకు విధేయంగా ఉండేట్టు ఒకటి కాదు, రెండు కాదు, ఆరు దశాబ్దాల పాటు అగ్రశ్రేణి గాయికగా నిలవటం సమస్త దేశ ప్రజల గౌరవ మన్ననలు పొందటం మామూలు విషయం కాదు. ప్రతి విషయంలో అది ఎంత చిన్నది అయినా సరే, తనకేం కావాలో స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పటం, రాజీపడకుండా సాధించటం లత ప్రత్యేకత. ఇందువల్ల ఎవరికి నష్టం కలిగినా, కష్టం కలిగినా పట్టించుకోలేదు. అందుకని లత అంటే ఇన్ని విమర్శలు, ఇంత దుర్వ్యాఖ్యాలు, ఇన్ని అపార్థాలు, ఇంత ద్వేషం వెలిగ్రక్కుతారు. విజయం సాధించిన వ్యక్తి అంటేనే సాధారణంగా సమాజంలో ఓ రకమైన అసూయ ద్వేషాలుంటాయి. ఆ విజయానికి ఎవరినీ లెక్కచేయనితనం తోడైతే ఆ వ్యక్తి సాధించిన విజయానికి తలవంచుతూనే, ప్రతిభకు దాసోహం అంటూనే అసూయ ద్వేషాలు ప్రదర్శిస్తారు మనుషులు. సినీ సంగీత ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించి అందరి గౌరవ మన్ననలందుకుంటున్న లతపై ఆరోపణలు చేయటం, విమర్శలు గుప్పించటం అందుకే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లత అస్సలు పట్టించుకోలేదు.
అమెరికాలో ‘ఫోర్డ్ ఆడిటోరియం’ను లత షో నిర్వహించేందుకు అడిగినప్పుడు ‘లత ఎవరు?’ అని, ‘మీరు నష్టపోతారు’ అని చులకనగా మాట్లాడిన మేనేజర్ లత షో ప్రకటించగానే అమెరికాలో నివసిస్తున్న భారతీయులలో కలిగిన సంచలనం టికెట్ల కోసం డిమాండ్‍ను చూసి లత ఎవరో, ఏమిటో అర్థం చేసుకున్నాడు. అంతేకాదు భారతీయులు ఎప్పుడు ఆలస్యంగా వస్తారన్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ లత షోలు సరిగ్గా అన్న సమయానికి ఆరంభమయ్యేవి. ప్రేక్షకులు కూడా షో ఆరంభమవటానికి గంట ముందే వచ్చేవారు. లత షోకు రెండు గంటల ముందే హాలుకు వచ్చేది. ఇంత త్వరగా ఎందుకు వచ్చారని అడిగితే ‘సమయం ఎంతో విలువైనది. దాన్ని వ్యర్థం చేయకూడదు. నా సమయం ఎంత విలువైనదో, శ్రోతల సమయం కూడా అంతే విలువైనది. వారి సమయాన్ని కూడా వ్యర్థం చేయకూడదు’ అని సమాధానం ఇచ్చింది లత.
ఆరంభంలో విదేశీ షోలలో లత ఎక్కువ మాట్లాడేది కాదు. కాని రాను రాను మాట్లాడటం, పాటల గురించి వివరించటం కూడా చేసేది లత. ఇలాంటి ప్రయాణంలోనే, ఆమెరికాలో ముకేష్ గుండెనొప్పితో హఠాత్తుగా మరణించాడు. రాను రాను లత షోలలో పాల్గొనటం నటీనటులు ఎంతో గౌరవంగా భావించారు. అమితాబ్‍తో సహా పలువురు నటీనటులు లత షోలో పాల్గొన్నారు. అయితే 1995లో తల్లి మరణం తరువాత లతకు షోలు చేయటంపై ఆసక్తి పోయింది. 1998లో లత అమెరికా, కెనడాల్లో చివరి సంగీత సభలలో పాల్గొంది.
ఇలాంటి ఓ సభలో పాల్గొన్న వహీదా రహమాన్ “నేను మరో జన్మ ఎత్తితే గాయనిగా జన్మించాలని కోరుకుంటాను. నటీమణుల కెరీర్ ముప్పయి దాటగానే అయిపోతుంది. కానీ గాయకులైతే అరవై, డెబ్బై ఏళ్ళకు కూడా పాడగలుగుతారు. లత ఇప్పటికీ పదిహేడేళ్ళ హీరోయిన్‌కి పాడగలుగుతుంది” అని వ్యాఖ్యానించింది. అయితే అందరూ లతా మంగేష్కర్‍లు కాలేరు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
విదేశాలలో లత చుడీదార్‍లు వేసుకునేది. కేసినోలకు వెళ్ళి జూదం ఆడేది. అది ఆమెకు ఎంతగానో నచ్చింది. అయితే ఈ అంశం ఆధారంగా దేశంలో కొన్ని పత్రికలు వివాదాన్ని సృష్టించాయి. లత జీన్స్ వేసుకుని తిరుగుతోందని కొందరు, లత జూదరి అయిపోయిందని ఇంకొందరు పలురకాల వ్యాఖ్యాలు చేశారు. అయితే లత ఇవన్నీ పట్టించుకోలేదు. ‘నా ఇష్టం’ అని ఒక్కమాటలో అన్నీ కొట్టిపారేసింది.
ఇలా విదేశీ గాన సభలలో పాడిన పాటలను కాసెట్లుగా, రికార్డులుగా చేసి మ్యూజిక్ కంపెనీలు విడుదల చేశాయి. అవన్నీ హాట్ కేక్స్‌లా అమ్ముడైపోయాయి. లత ప్రతి షో సూపర్ హిట్ అయి, ఆడిటోరియంలు క్రిక్కిరిసిపోవటంతో అందరూ లాభాలు పొందారు. దీని ఆధారంగా కూడా వివాదాలు లేవదీశారు. లతకు అందుతున్న ఆదాయాన్ని, సంపాదిస్తున్న డబ్బుని లెక్కలు వేసి మరీ విమర్శలు చేశారు.
ఓ వైపు మన దేశంలో సంగీత విమర్శకులు, పెద్దలు ‘లత స్వరం పాడైపోయింది. ఆమె పాటలు పాడటం మానేయాలి’ అని 1970 దశకం ఆరంభం నుంచీ అరుస్తూంటే లండన్‍లో పోలాడియం థియేటర్‍లో లత చేసిన కార్యక్రమం రికార్డులు అయిదు వారాల్లో 25,000 అమ్ముడుపోయాయి. ఆ కాలంలో ఒక్కో రికార్డు వెల రూ. 100/-
ఈ సమయంలోనే అంటే సినిమా పాటలు తగ్గించుకున్న సమయంలో లత తన సంగీత సభలలో పాడే పాటల రికార్డులు విడుదల చేసింది. ఈ పాటల వల్ల నిర్మాతలతో సంబంధం లేకుండా పదిశాతం రాయల్టీ తిన్నగా లతకే అందుతుంది. లండన్ ఆల్బర్ట్ హాల్‍లో లత కార్యక్రమం రికార్డులు 133000 కాపీలు అమ్ముడుపోయాయి. అమెరికాలో సభల ద్వారా లత 180,000 డాలర్లు (14.4 లక్షలు) సంపాదించిందని గుండెలు బాదుకున్నారు విమర్శకులు. 1979లో దుర్గపూజ సమయంలో లత విడుదల చేసిన బెంగాలీ పాటల రికార్డులు మూడు నెలల్లో 13000 కాపీలు అమ్ముడుపోయాయి. ఇలా లెక్కలు కట్టి విదేశీ టూర్ల ద్వారా, ఆ టూర్ల రికార్డుల అమ్మకాల ద్వారా లత ఎన్ని డబ్బులు సంపాదించిందో లెక్కలు కట్టి ‘లతకు డబ్బు పిచ్చి’ అనీ, ‘పిసినారి’ అనీ, ‘పైసా కూడా వదలద’ని ప్రచారం చేశారు. వీటన్నింటికీ లత సమాధానం మౌనమే!
ఒక దశలో అన్నీ వదలి సామాజిక కార్యక్రమాలలో జీవితం గడపాలనుకున్న లతకు, సంగీతం ద్వారా సంపాదించిన ధనాన్ని సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగించమని వీర సావర్కర్ సలహా ఇచ్చాడు. లత ఆ సలహాను తు.చ. తప్పకుండా పాటించింది.
లత పైకి ప్రకటించకుండా పలు సేవా కార్యక్రమాలకు విరాళాలిచ్చింది. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించింది. ఆస్పత్రులు కట్టించింది. బహుమతులిచ్చింది. తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క పైసను కూడా లత వదలలేదు. అలా సంపాదించిన ధనంతో ఆమె ఐశ్వర్యంతో తులతూగలేదు. సాదాసీదాగానే బ్రతికింది. కానీ కూడబెట్టిన ధనమంతా తన తదనంతరం ఛారిటీలకు ఇచ్చింది. అదీ లతా మంగేష్కర్ వ్యక్తిత్వం.
అయితే లత విదేశీ టూర్ల ప్రణాళిక వేయటం, తేదీలు నిర్ణయించటం, నిర్మాతలతో మాట్లాడటం, ఆమె వెంట విదేశీ ప్రయాణాలలో తోడుగా ఉండటం అంతా రాజస్థాన్ రాజకుంటుంబానికి చెందిన ఓ 45 ఏళ్ళ వ్యక్తి చూసేవాడు. విమర్శకులు, జర్నలిస్టులు లతను ఏదో వివాదంలోకి లాగి ఆమెపై బురద జల్లి, ఇమేజీని పాడు చేయటమే పనిగా పెట్టుకున్న వారంతా రాజస్థానీ రాజకుటుంబీకునికి లతకూ నడుమ ఏదో ఉందని ఊహాగానాలు ఆరంభించారు. తమ మెదళ్ళలో ఉన్న కుళ్ళు ఆలోచనలన్నీ తమ మాటల్లో రాతల్లో ప్రకటించసాగారు.
గమనిస్తే ఇలాంటి వివాదాలు లతకు కొత్తకాదు. హుస్న్‌లాల్ భగత్ రామ్‍లలో హుస్న్‌లాల్‍ను లత ప్రేమించిందన్నారు. సి. రామచంద్రను ప్రేమించిందని, పెళ్ళి చేసుకొమ్మన్నందుకు అతడి జీవితాన్ని నాశనం చేసిందన్నారు. శంకర్ జైకిషన్‍లలో జైకిషన్‍తో ఏదో ఉందన్నారు. ఆయన పల్లవిని వివాహం చేసుకున్నందుకు ప్రతీకారంగా వారి కెరీర్‍ను నాశనం చేసిందన్నారు. హేమంత్ కుమార్‍తో సంబంధం అంటగట్టారు. చివరికి భూపేన్ హజారికా మరణించిన సంవత్సరం తరువాత అతనితో వేరుపడ్డ భార్య ప్రియంవద, భూపేన్ హజారికాకూ లతకూ నడుమ వ్యవహారం నడిచిందని, హజారికానుంచి వేరు పడటంలో అదీ ఒక కారణమనీ , భూపేన్ హజారికా భార్య, తన కళ్ళముందే భూపేన్ లతలు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారని, “ఇదేమిటని?” భర్తను అడిగితే “బొంబాయి ప్రపంచంలో నిలబడాలంటే ఇవన్నీ తప్పనిసరి” అన్నాడని ఆరోపించింది. . ఈ జాబితాలోకి కొత్తగా చేరింది ఆ రాజస్థాన్ రాజవంశపు వ్యక్తి పేరు. అతని పేరు రాజ్‌సింగ్ దుంగార్పూర్!
(ఇంకా ఉంది)