Site icon Sanchika

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-3

[dropcap]సు[/dropcap]నో ఛోటీసీ గుడియాకి లంబీ కహానీ

జైసీ తారోంకీ బాత్ సునీ రాత్ సుహానీ

‘సీమా’ (1955) సినిమాలోని ఈ పాట వింటే లతా మంగేష్కర్ జీవిత గాథ గుర్తుకువస్తుంది. ‘ఛోటీసీ గుడియా’ అన్నపదం గమ్మత్తయినది. ‘గుడియా’ అంటే బొమ్మ. చిన్నపిల్లలు బట్టలు వేసి అలంకరించి ఆడుకునే బొమ్మ. ‘ఛోటీసీ గుడియా’ కీ లంబీ కహానీ’. ‘గుడియా’ అన్నపదాన్ని పిల్లలకు సంబోధించేందుకు వాడతారు. ‘బుట్టబొమ్మ’ అన్న అర్థంలో వాడతారు. ‘చిన్నపిల్ల పెద్దకథ’ అని వినండి అంటున్నాడు హస్రత్ జైపురి. ఎలా వినాలంటే అందమైన రాత్రి తారల మాటలు ఎలా వింటుందో అలా వినండీ చిన్న బొమ్మలాంటి పిల్ల కథ అంటున్నాడు కవి హస్రత్.

అందమైన బొమ్మలాంటి పాప శనివారం సెప్టెంబర్ 28, 1929న ఇండోర్ లోని వాఘ వకీల్ వాడాలోని సిక్కు మహిళల ప్రసూతి ఆస్పత్రిలో పుట్టింది. అప్పుడే పుట్టిన  ఆ శిశువును ఎత్తుకున్న డాక్టర్ మోతాబాయి కలలో కూడా  ఇంకా కళ్ళు తెరవని ఆ శిశువు, భవిష్యత్తులో భారతరత్న అవుతుందనీ, తన గానంతో తరతరాల భారత ప్రజలను ఉర్రూతలూగిస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు.

ఆ ఛోటీసీ గుడియా తండ్రి ప్రఖ్యాత గాయకుడు, ఉత్తమ నటుడు,  ‘బలవంత్ సంగీత మండలి’ వ్యవస్థాపకుడు దీనానాధ్ మంగేష్కర్, తల్లి సుధామతి, నిజానికి దీనానాధ్ మంగేష్కర్ ‘హర్దీకర్’ వంశానికి చెందినవారు. దీనానాధ్ మంగేష్కర్ తండ్రి పేరు గణేష్ భట్ అభిషేకి. తల్లి యేసూబాయి రాణీ. గణేష్ భట్ అభిషేకి పూజారి వంశానికి చెందినవాడు. గోవాలోని మంగేషి గ్రామంలోని ‘మంగేష్’ (శివుడు) దేవుడిని పూజలు నిర్వహించటం, అభిషేకాలు చేయటం వారి వంశాచారం. గణేష్ భట్ యేసూబాయిని వివాహం చేసుకోలేదు. కలిసి ఉన్నారు. ఆమె గోమంతక్ మరాఠా సమాజానికి చెందినది. గోమంతక్ మరాఠా సమాజానికి చెందినవారిలో రెండు రకాలున్నారు. కళావంతినులు, భావినులు. కళావంతినులు కళాకారులు. సంగీతం, నాట్యం వంటి వాటిలో ప్రవేశమున్నవారు. వీరికి సంఘంలో గౌరవం ఉండేది. ఎందుకంటే వీరు దేవాలయంలోనే సంగీత నృత్యాలు చేసేవారు. వారు పూజారులతో సహవాసం చేసేవారు. భావినులు, దేవాలయంలో దీపాలు వెలిగించేవారు. పల్లకిలకు దీపాలు పెట్టేవారు. చామరాలు వీచేవారు. వీరిని పవిత్రులుగా భావించేవారు. యేసుబాయి కళావంతిని.

గణేష్ భట్టు అభిషేకి బ్రాహ్మణులలో కర్హాద బ్రాహ్మణులు. వీరు ఋగ్వేద బ్రాహ్మణులు. వీరిలో ‘భట్టప్రభు’లు ప్రధానంగా కొంకణి ప్రాంతంలో ఉంటారు. వీరు అధికంగా పూజారులుగా ఉండేవారు. అలా పూజారిగా ఉన్న గణేష్ భట్టు అభిషేకి, యేసూబాయితో కలసి ఉండటంతో వారి సంతానానికి అంటే దీనానాథ్‍కు బ్రాహ్మణ కులం రాలేదు. ఇంటిపేరు రాలేదు. దాంతో దీననాథ్ తనకంటూ ప్రత్యేకమైన ‘ఇంటిపేరు’ పెట్టుకున్నాడు. తన వారసత్వాన్ని మరచిపోకుండా ఉండేందుకు, తను కుంటుంబం మంగేష్ దేవుడి పూజారులన్న విషయాన్ని గుర్తుచేస్తూ ‘మంగేష్కర్’ అన్నపేరును ఇంటిపేరుగా స్థిరపరుచుకున్నాడు. దీననాథ్, దీనానాథ మంగేష్కర్ అయ్యాడు.

దీనానాథ్‍కు బాల్యం నుంచి సంగీతం, నాట్యాలపై ఆసక్తి ఉండేది. అతని తల్లి యేసుబాయి దేవాలయంలో పాటలు పాడేది. నృత్యాలు చేసేది. ఆనాటి ప్రజలలో ఆమె అంటే అభిమానం, ఆదరణ ఉండేది. బహుశా ఇది దీనానాథ్‍లో నాటకాలు, గానం పట్ల ఆసక్తిని రగిల్చి ఉంటుంది. ఈ ఆలోచనతోనే ఆయన పద్నాలుగేళ్ళ వయసులో గోవా వదలి మహారాష్ట్ర వచ్చాడు. బొంబాయిలో ఆయనకు బల్వంత్ పాండురంగ్ కిర్లోస్కర్‍తో పరిచయం అయింది.

‘అన్నా సాహెబ్’ అన్నపేరుతో ఆదరంగా పిలిచే బల్వంత్ పాండురంగ్ కిర్లోస్కర్ 1879 – 80 ప్రాంతాలలో ‘కిర్లోస్కర్ నాటక మండలి’ ని స్థాపించాడు. ఆ కాలంలో ప్రజలకు నాటకాలు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేవి. ప్రజలకు పురాణాల అంతరార్థం అత్యంత సులువుగా బోధిస్తూ, వారిలోని సృజనాత్మకతను జాగృతం చేసేవి. ఈ కాలంలో క్రికెట్ ఆటగాళ్ళు సినీ కళాకారులు పొందుతున్న అభిమానం కన్నా అధికంగా అభిమానాన్ని పొందేవారు నాటక కళాకారులు. ‘కిర్లోస్కర్ మండలి’ మహారాష్ట్ర లోని వీధుల్లో నాటకాలు ఆడుతూ మరాఠీ భాషను, నాట్యాన్ని, సంగీతాన్ని ప్రజలకు చేరువచేసింది. బాలగంధర్వ, మాస్టర్ కృష్ణారావు, పండిత భాస్కర్ బువా బఖలే, బాపూ సాహెబ్ పెణ్ధార్కర్, గోవింద్ బల్లాల్ దేవల్, గోవిందరావు టెంబే, గణపతిరావు వంటి ప్రముఖులు ఆ కంపెనీలో పనిచేశారు. ఈ కిర్లోస్కర్ నాటక కంపెనీలో చేరాడు దీనానాథ్ మంగేష్కర్. ఈ సమయంలోనే బాలగంధర్వ పాల్గొన్న ‘మానాపమాన్’ నాటకం మహారాష్ట్ర ప్రజలను ఉర్రూతలూపింది. 1918లో దీనానాథ్ మంగేష్కర్ ‘కిర్లోస్కర్ కంపెనీ’ వదలి తన మిత్రులు చింతామణిరావు కోల్హాట్కర్, కృష్ణారావు కోల్హాపురెలతో కలిసి ‘బల్వన్త్ సంగీత్ మండలి’ని స్థాపించాడు. తనదైన పద్ధతిలో పాటలు జోడించి ‘ఇదే ‘మానాపమాన్’ నాటకాన్ని ప్రదర్శించి మన్ననలందుకున్నాడు.(మానాపమాన్ నాటకంలోని పాటలు లతాకు ఎంతగా నచ్చాయంటే 1990లో లేకిన్ సినిమా నిర్మించినప్పుడు ఆ సినిమాలోని మైన్ ఏక్ సదీసే బైఠీ హూన్ అన్న పాటను భారీ చంద్ర్ ఉసే ధరీ లా అన్న మానాపమాన్ పాట బాణీలో తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ రూపొందించేట్టు చేసింది. )

దీనానాథ్ మంగేష్కర్ అందగాడు. అతనిది  ఆకర్షణీయమైన గాత్రం. దాంతో ఆయన  అచిరకాలంలో మహారాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. సాటి కళాకారుల గౌరవ మన్ననలందుకున్నాడు. ఆయన అడుగుపెట్టిన చోట పూల వర్షాలు కురిశాయి. అతనికి నీరాజనాలందించేందుకు సామాన్యులతో పాటు పండితులు, ఉస్తాద్‍లు పోటీలు పడ్డారు. దీనానాథ్ మంగేష్కర్ ఎంతటి గౌరవాభిమానాల పాత్రుడయ్యాడో ఆ సమయంలో అతని తోటి కళాకారుడు ‘కిర్లోస్కర్ నాటకమండలి’కి చెందిన బాల గంధర్వ చేసిన వ్యాఖ్య నిరూపిస్తుంది. ‘ఒకవేళ దీనానాథ్ మంగేష్కర్ కనుక మా కంపెనీలో చేరతానంటే మా కంపెనీకి నడిచివచ్చే దారంతా గులాబీ పూలు పరుస్తాను. దారంతా ఆయనపై పన్నీరు చల్లుతూంటాను. నా హృదయాన్ని చీల్చి మాలలా మలిచి ఆయన మెడలో వేసి మా నాటక సమాజానికి ఆహ్వానిస్తాను’ అన్నాడు బాలగంధర్వ. ఈ వ్యాఖ్య చాలు ఆ కాలంలో దీనానాథ్ మంగేష్కర్‍కు ఎంత గౌరవ మర్యాదలుండేవో, ఆయన మహారాష్ట్ర నాటక సమాజంలో ఎంతటి ఉచ్చస్థాయిలో ఉండేవాడో తెలుసుకునేందుకు ప్రత్యర్థి నాటకమండలి వాడైనా బాలగంధర్వ, దీనానాథ్‍లు ఎంతో స్నేహంగా ఉండేవారు. జీవితాంతం కొనసాగిన ఈ స్నేహం దీనానాథ్ మరణం తరువాత లతపై కరుణలా ప్రసరించింది.

దీనానాథ్ 1922లో, హరిదాస్ రామదాసు లాద్ అనే గుజరాతీ వ్యాపారి కూతురిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక పాప కలిగింది. లతిక  అని పేరు పెట్టారు. కాని ఆ పాప ఎక్కువ కాలం బ్రతుకలేదు. ఆ విచారంలో అతని మొదటి భార్య మరణించింది. మొదటి భార్య చెల్లెలిని అందరి సమ్మతంతో దీనానాథ్ వివాహం చేసుకున్నాడు,  1927లో. ఆమె ద్వారా అతనికి అయిదుగురు సంతానం కలిగారు. లత, మీనా, ఆశా, ఉష, హృదయనాథ్ మంగేష్కర్‍లు.

దిల్ మె యె అర్మాన్ థే ఎక్ ఛోటాసా బంగ్లా హో

చాందీసీ ధర్తీపర్ సోనే కా జంగ్లా హో

ఖేల్ హో జీవన్ కీ యహా మేల్ హూ జీవన్ కే

గయా బచ్‍పన్ తో ఆసూభరీ ఆయా జవానీ…..

లతా మంగేష్కర్ బాల్యం నుంచి అల్లరిపిల్ల. దీనానాథ్ మంగేష్కర్ ఆమెను ఎంతో గారాబం చేసేవాడు. తల్లి దగ్గర ఆమెకు అమితమైన ప్రేమ లభించేది. దాంతో లతా మంగేష్కర్ బాల్యం నుంచీ తనకు కావాల్సింది సాధించే తెగువ, మొండితనాలుండేవి. దీనానాథ్ ఇంట్లో సంగీతం నేర్పించేవాడు. బయట ఆడుకుంటున్నా లత ఇంట్లో తండ్రి నేర్పుతున్న విషయాలపై ఓ చెవి వేసి ఉంచేది. తండ్రి లేనప్పుడు వంటింట్లో , తల్లి వంట చేస్తుంటే , తాను విన్నదంతా అమ్మకు వినిపించేది. వాళ్ళమ్మ ఆనందిస్తూ వింటుండేది.

లతకు నాలుగైదేళ్ళ వయసున్నప్పుడు ఓ రోజు తండ్రి విద్యార్థికి పూరియా ధనుశ్రీ రాగం నేర్పించి సాధన చేయమని చెప్పి బయటకు వెళ్ళాడు. ఆ విద్యార్థి పొరపాటుగా సాధన చేస్తుంటే ఛోటీసీగుడియా లత వెళ్ళి అతని తప్పును సరిదిద్దింది. తన తండ్రి అతడు సాధన చేస్తున్నట్టుకాక ఎలా నేర్పించాడో తాను పాడి చూపించింది. బయటకు వెళ్ళిన దీనానాథ్ ఎందుకో వెనక్కి వచ్చాడు. తన కూతురు నేర్పినదంతా విన్నాడు. ‘ఇంట్లోనే గాయనిని పెట్టుకుని ఊరంతా గానం నేర్పిస్తున్నానని’ నాలిక కరుచుకున్నాడు. ఆ రోజు నుంచీ లతకు పద్ధతి ప్రకారం శాస్త్రీయ సంగీతం నేర్పటం ప్రారంభించాడు. అలా మొదలయింది సంగీత ప్రపంచంలో లత తొలి అడుగులు వేయటం.

పండిత దీనానాథ్ మంగేష్కర్ సజ్జనుడు. సంగీతం విషయంలో ఎలాంటి రాజీ పడేవాడు కాదు. సంగీతం సరస్వతి అన్నది ఆయన విశ్వాసం. లతలో కూడా ఈ విశ్వాసాన్ని బలంగా నాటాడు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, తన తండ్రి ఎంత గొప్పవాడో ప్రజలు అతడిని ఎంతగా గౌరవించి, అభిమానించి, ఆదరించేవారో లత ప్రత్యక్షంగా చూసింది. తండ్రి పలికిన ప్రతి పదాన్ని దైవ వాక్కులా భావించి పాటించిందామె. ఇది ఆమె ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా తెలుస్తుంది.

“నేను చిన్నప్పుడు చాలా అల్లరిపిల్లను. మేము ఇంట్లో పిల్లలందరం అల్లరి చేస్తే మా నాన్నగారు అందరినీ కోపంగా పిలిచేవారు. ఆయన పిలుపు వినగానే మా గుండెలు జారిపోయేవి. అందరం భయం భయంగా వణుకుతూ వెళ్ళి ఆయన ముందు నిలబడేవాళ్ళం. ఆయన అందరినీ వరుసగా నిలబడమనేవాడు. అందరం నిలబడిన తరువాత ‘నేనెందుకు పిలిచానో తెలుసుకదా?’ అనడిగేవారు. ‘తెలుసు’ అని సమాధానం ఇచ్చేవాళ్ళం. ‘ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకండి’ అని పంపేసేవారు. తప్పు చేస్తే కొట్టేవారు కాదు కానీ ఆయన చూసే చూపు మరోసారి తప్పు చేయనిచ్చేది కాదు” అంది లతామంగేష్కర్.

తండ్రి నేర్పిన విలువల గురించి చెప్తూ ఓ సంఘటనను ప్రస్తావించింది లత. ఆమె చిన్నప్పుడు ఓ దుకాణం నుంచి సబ్బు  కొనటానికి వెళ్ళిన అబ్బాయి ఉట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చాడు. ఎందుకంటే అతడికి ఇచ్చిన రెండణాల నాణెం చెల్లనిది. అది చూసిన లత ‘నేను తెస్తాను’ అని నాణెం తీసుకుని పరుగెత్తింది. దుకాణం చేరి నాణెం గల్లా పెట్టెలో పారేసి తనకు కావాల్సింది తెచ్చింది. గర్వంగా ఇంట్లో తన ఘనకార్యం చెప్పింది. అది విన్న దీనానాథ్ లతను మందలించాడు. “నువ్వు దీనానాథ్ కూతురివన్న గౌరవంతో దుకాణందారు నిన్ను ఏమీ అనలేదు. నిన్ను నమ్మాడు. దీనానాథ్ కూతురు అబద్ధం చెప్పదన్న విశ్వాసం అది. కాబట్టి నువ్వు చేసే పొరపాటు, నువ్వు చెప్పే అబద్ధం ప్రభావం నాపై పడుతుంది” అని మంచి నాణెం ఇచ్చి దుకాణానికి పంపాడు. జరిగింది చెప్పి క్షమార్పణలు వేడుకుని డబ్బులిచ్చి రమ్మన్నాడు. ఈ సంఘటన లత మనస్తత్వంపై తిరుగులేని ప్రభావం చూపింది. భవిష్యత్తులో ఆమె తన ప్రతిచర్య ప్రభావం తన తండ్రి ప్రతిష్ఠపై ఉంటుందన్న గ్రహింపు ప్రదర్శించటానికి ఇలాంటి అనేక సంఘటనలు కారణం.

తండ్రి దగ్గర మాల్కౌస్, హిండోళం, జయజయవన్తీ, పూరియా ధనుశ్రీ వంటి రాగాలు నేర్చుకుంది లత మంగేష్కర్. ఇన్నేళ్ళ తరువాత కూడా పలు ఇంటర్వ్యూలలో ఆమె తన తండ్రి జైజయవంతి రాగంలోని ‘తన్ జహాజ్ మన సాగర్’ను గానం చేస్తూ రాగం ఎలా తీయాలో నేర్పించిన విధానం వినిపిస్తుంది. ‘హిండోల్’లో ‘కాంచన్ బరన్ హిండోళా’ను ఎలా పాడేదో వినిపిస్తుంది. విలంబిత్ లయలో మాల్కౌస్  రాగంలో ఎలా పాడాలని నేర్పాడో చెప్తుంది. ఖంభావతీ రాగంలోని ‘ఆవీరీ మై జాగీ సారీనైనా’ను తండ్రి ఎలా నేర్పేడో అలా పాడి వినిపిస్తుంది.

 

సంగీతం నేర్పిస్తూ, బాల లతకు దీనానాథ్ ఇచ్చిన సలహా ఆమె జీవితాంతం మరిచిపోలేదు.   నేపథ్యగాయని అయి, ప్రపంచాన్ని తన గానంతో పాదాక్రాంతం చేసుకోవటంలో ఈ సలహా ఉపయోగపడిందని, ప్రతిపాటను పాడే సమయంలో ఈ సలహా తన చెవులలో మారుమ్రోగుతుందనీ, లత పలు సందర్భాలలో చెప్పింది. ‘ఎలాగైతే కవితలోని ప్రతి పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుందో, అలాగే పాటలోని ప్రతి స్వరానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. పాట పాడేటపుడు పాటలోని పదాల అర్థాలతో పాటు స్వరాల అర్థాలు కూడా ప్రస్ఫుటం కావాలి’ ఈ సలహాను సంపుర్ణంగా అర్థం చేసుకుని తన గానంలో ప్రదర్శించటం వల్లనేమో లత పాటలలో పదాల అర్థాలకు స్వరాల అర్థాలు తోడై పాట మరింత తేజోమయం అవుతుంది. భాషరాని వారు కూడా పాట భావనను అనుభవించి పలకరిస్తారు. పదాలకు భాష కానీ స్వరానిది మానవ మనస్సు భాష కదా!

తండ్రి వద్ద సంగీతం నేర్చుకుంటున్న లత, తండ్రితో పాటు నాట్య వేదికను ఎక్కటం అత్యంత స్వాభావికంగా జరిగిపోయింది.

లత మంగేష్కర్ తన సోదర సోదరీమణులతో కలిసి తండ్రి లేని సమయంలో ఇంట్లో నాటకాలు వేస్తూండేది. అంతేకాదు. అప్పుడప్పుడు తండ్రి అనుమతితో చూసిన భక్తి సినిమాలూ ఆడుతూండేది. ‘తుకారాం’ సినిమా చూసి ‘తుకారాం’ బొందితో స్వర్గం వెళ్ళే దృశ్యాలను నకలు చేస్తూండేది. దిళ్ళను కొండలా పెట్టి దానిపై ఎక్కి తుకారాంలా పాటలుపాడేది. పక్కగదిలోంచి ఆమె చెల్లెళ్ళు మమ్మల్నీ వెంట తీసుకెళ్ళూ అని సినిమాలోలానే పాడేవారు.  వీళ్ళ సినిమా ఆటలన్నీ తండ్రి ఇంట్లో లేనప్పుడే.   దీనానాథ్‍కు సినిమాలంటే ఇష్టం లేదు. దీనికి కారణం ఉంది.

ఆ కాలంలో సినిమాల పట్ల దురభిప్రాయం ఉండేది. మహాత్మ గాంధీ సైతం సినిమాలను ఇష్టపడేవారు కాదు. పైగా సినిమావాళ్ళు మంచి కుటుంబాల నుంచి రారని వారి నడవడి మంచిది కాదన్న అభిప్రాయం ప్రచారంలో ఉండేది. దీనికి తోడు దీనానాథ్ నాటక రంగానికి చెందిన వాడవటం వల్ల కూడా సినిమాలంటే ఆయనకు వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే సినిమాలు ప్రధానంగా నాటకాల మనుగడను ప్రమాదంలోకి నెట్టేయి. అంతవరకు నాటకాలను ఆదరించిన ప్రజలు సినిమాలను పెద్ద ఎత్తున ఆదరించటంతో నాటకాల ఆదరణ సన్నగిల్లటం ఆరంభమయింది. ఇది తిన్నగా దీనానాథ్ జీవితంపై ప్రభావం చూపించింది.  ఇది కూడా ఆయనకు సినిమాలంటే విముఖతను పెంచింది.   ఇంట్లో సినిమాపాటలు పాడటాన్ని, సినిమాలు చూడటాన్ని ఆయన నిషేధించాడు. పిల్లలందరికీ శాస్త్రీయ సంగీతంలో స్వయంగా శిక్షణ నివ్వటం ఆరంభించాడు.

అందుకే లత తండ్రి అకాలమరణం చెందకుండా ఉంటే లత జీవితం ఎలా ఉండేదన్న ప్రశ్నకు లత సమాధానం ఆసక్తి కలిగిస్తుంది. “మా తండ్రి దీర్ఘకాలం బ్రతికి ఉంటే నేను సినిమాల్లోకి వచ్చేదాన్నే కాదు. నాన్నకు సినిమాలు చూడటం, పాటలు పాడటం ఇష్టం ఉండేది కాదు. కాబట్టి నాకు శాస్త్రీయ సంగీతం నేర్పేవారు. తరువాత పెళ్ళి చేసేసేవారు” అంటుంది లత.

కానీ భారతరత్నగా ఎదిగి, తన గానంతో తరతరాల ప్రజలకు సాంత్వనను, ఆనందాన్ని ఇవ్వగల మామూలు గృహిణిగా మిగలటం విధి ఒప్పుకోదు. అందుకే బాల్యం నుంచీ విధి ‘లత’ను వేదికపైనే నెడుతోంది.

లత ప్రధమంగా ‘షోలాపూర్’కు చెందిన ‘నూతన్ థియేటర్’ అధ్వర్యంలో తండ్రి సమక్షంలో స్టేజిపై పాడింది. నిజానికి తానూ పాడతానని పేచీ పెట్టింది. అంతకు ముందు తండ్రి సభలలో పాడుతూంటే శ్రోతలు ‘వన్స్ మోర్’ అనటం చూసింది. తాను ‘వన్స్ మోర్’ సంపాదించాలని కోరిక ఆమెకు. అందుకని పేచీపెట్టి మరీ వేదిక ఎక్కింది. ఆరోజు ఆమె తల్లి తెల్లటి ఫ్రాక్ వేసి తలలో పూలు పెట్టి లతను తయారుచేసింది. తండ్రి చూస్తూండగా ‘ఖంభావతీ’ రాగంలో పాటలు పాడింది. వన్స్ మోర్‍లు కరతాళ ధ్వనులు సాధించింది. తరువాత స్టేజీమీదనే తండ్రి ఒళ్ళో పడుకుని నిద్రపోయింది. దీనానాథ్ ఆ రాత్రంతా తన గానంతో శ్రోతలను పరవశింప చేశాడు.

తరువాత తండ్రితో నాటకాలలో వేషాలు వేసింది, పాటలు పాడింది. అందరి ప్రశంసలు అందుకుంది. 1940-41 ప్రాంతాలలో తండ్రి చేయి పట్టుకుని తొలిసారిగా రికార్డింగ్ కోసం ఆల్ ఇండియా రేడియోలో అడుగుపెట్టింది. రేడియోలో ఖంభావతి, యమన్  రాగాలలో పాటలు పాడి మెప్పించింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఆమె తండ్రి ‘లతా’ను ‘తతాబాబా’ అని ముద్దుగా పిలిచి ఏడిపించేవాడు. ఆమె జాతకాన్ని పరిశీలించిన దీననాథ్ ‘లత గొప్పగాయని అయి ఉన్న శిఖరాలు అధిరోహిస్తుంది, కానీ వివాహం చేసుకోక ఒంటరిగా మిగిలిపోతుందని’ చెప్పాడు. తనతో పాటు నాటకాలకు తీసుకువెళ్ళటం, నాటకాలలో పాత్రలు వేయించటం, పాటలు పాడించటం చేశాడు. ఆ రకంగా లతకు ప్రాథమిక శిక్షణను దీనానాథ్ ఇచ్చాడు.

బలవంత్ సంగీత మండలి ప్రదర్శించిన ‘సౌభద్ర’ నాటకంలో దీనానాథ్ అర్జునుడిగా, తొమ్మిదేళ్ళ లత నారదుడి వేషం వేసింది. అందుకోసం వాళ్ళమ్మ  లత చేతికి చిన్న తంబుర ఇచ్చి పీతాంబరాలు ధరింపచేయటం పలు ఇంటర్వ్యూలలో లత గుర్తు చేసుకుంది. తన కూతురు గానానికి ప్రేక్షకులు ‘వన్స్ మోర్’లు కురిపించటం చూసిన దీనానాథ్ ఆమె కోసం పాటలు అధికంగా కల  ‘గురుకుల్’ అనే నాటకం రాయించాడు. ఇది కృష్ణ సుదామల కథ. ఈ నాటకంలో లత, కృష్ణుడి వేషం వేసింది. మీనా సుదామ వేషం వేసింది.

ఇలా అంచెలంచెలుగా లతకు గుర్తింపు వస్తున్న సమయంలో దీనానాథ్‍కు కష్టాలు మొదలయ్యాయి. ప్రజలకు నాటకాలపై ఆసక్తి తగ్గింది. రెండవ ప్రపంచ యుద్ధ వాతావరణం అలుముకుంది. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుదిపివేసింది. దాంతో దీనానాథ్ తాగుడుకు అలవాటుపడ్డాడు. కుటుంబానికి గడ్డుదినాలు ఆరంభమయింది. ఇదంతా లత మనస్సుపై, ఆలోచనలపై ప్రభావం చూపింది.

ఒక వ్యక్తి ఎంత విజయం సాధిస్తే అంత గౌరవం పొందుతాడు. ప్రజలు నీరాజనాలు పడతారు. అతడిని ఒక్కక్షణంసేపయినా చూడాలని తహతహలాడతారు. కానీ అదే వ్యక్తికి దుర్దశ వస్తే ఎవ్వరూ పట్టించుకోరు. ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందోనని ముఖం చాటేస్తారు. వ్యక్తి సైతం మానసికంగా దిగజారుతాడు. పతనమౌతాడు. ఇది వ్యక్తికే కాదు అతడిపై ఆధారపడిన వారికీ కష్టం కలుగజేస్తుంది. అయితే లతామంగేష్కర్‍కు తండ్రిపైన అమితమైన గౌరవం ఉంది. అమితమైన ప్రేమ ఉంది. ఇది కూడా ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది ప్రవర్తనను నిర్దేశించిన అంశం.

ఏదోరకంగా రోజులు గడుస్తున్న సమయంలో అనుకోని రూపంలో మృత్యువు దీనానాథ్‍ను కబళించింది. ఏప్రిల్ 24, 1942న దీనానాథ్ మరణించాడు.

‘సునో చోటీసీ గుడియా’ పాటలోలాగా వెన్నెల పల్లకి, మెరుపుల వాయిద్యాలు, చక్కటి బంగళా, వెండి కిటికీలు, ఆటలాంటి జీవితం అని ఊహిస్తూ కలలుగంటున్న తరుణంలో ‘గయాబచ్ పన్ తో ఆసు భరీ ఆయి జవానీ’ అన్నట్టు బాల్యం కనుమరుగు కాగానే దుఃఖంతో కూడిన యవ్వనం వచ్చింది. తండ్రి మరణించినప్పుడు లతకు పదమూడేళ్ళు. అప్పుడప్పుడే బాల్యం వీడి యవ్వనంలోకి అడుగుపెడుతోంది.

అంతవరకూ ఆటలు, పాటలు, సంగీత సాధన, నాటకాలలో వేషాలతో సాగిన లత జీవితం కళ్ళుమూసి తెరిచేలోగా అనూహ్యమైన రీతిలో మారిపోయింది. తండ్రి మరణించాడు. పెద్దగా ఆస్తులు లేవు. తల్లికి ఇది అనుకోని దెబ్బ. ఆమె మానసికంగా కృంగిపోయింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని నిస్తేజ స్థితిలోకి దిగజారింది. బంధువులు ముఖాలు చాటేశారు. నలుగురు ఆడపిల్లలు మరి! కళ్ళుమూసి తెరిచేలోగా కలలు, ఊహలు, ఆశలు అన్ని కాలి బూడిదైపోయాయి. ఆనంద నౌక పయనించు వేళ శోకల సంద్రాల ముంచేవులే;  అన్నట్టు లత జీవితం శోకాల సంద్రాలలోనే కాదు కడగండ్ల తుఫానులలోనూ చిక్కుకుంది. ఇల్లు గడవటం కోసం ఒకటొకటిగా విలువైన వస్తువులు తాకట్టు కొట్టుకి తాత్కలికంగా చేరి అక్కడే స్థిరపడిపోతున్నాయి. ఇంట్లోని విలువైన వస్తువులన్నీ అయిపోతున్న కొద్దీ లతకు ఒక విషయం స్పష్టమయింది. ఇల్లు గడవాలంటే, తానే పూనుకుని ఏదో చేయాలి. తల్లికి ఏమీ తెలియదు. అమాయకురాలు. మీనా, ఆశా, ఉష, హృదయనాథ్ ఇంకా చిన్నవారు. ఇంటికి పెద్దగా ఇల్లు నడిపే బాధ్యత లతదే! కానీ లతకు చదువు సరిగ్గా లేదు. ఏదైనా ఉద్యోగం చేసే వయసూ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పోషణ భారం భుజ స్కంధాల మీద వేసుకుంది లత. భవిష్యత్తు ఏమౌతుందో, ఎలా ఉంటుందో ఏ మాత్రం తెలియకుండా అడుగు ముందుకు వేసింది.

టూటే పల్   భర్ మే సప్నోంకి మోతీ భీ, లూట్ గయి జ్యోతీ భీ

రహగయే అంధేరే, ఉజ్‍డే హువే సవేరే

బాత్ యే పూరీ థీ ఔర్ ఫిర్ భి, అధూరీ థీ

హోగా అంజామ్ క్యా, ఖబర్ ఖుద్ భీ న  జానీ

సునో ఛోటీసీ  గుడియాకి లంబి కహానీ….

క్షణంలో స్వప్నాలు ముక్కలయిపోయాయి. జ్యోతినెవరో దోచుకున్నారు. చీకటి మిగిలింది. ఉదయం కూడా నాశనం అయిపోయింది. కథ పూర్తయినట్టుంది కానీ పూర్తికాలేదు. ఇక దీని ఫలితం, ముగింపు ఎలా ఉంటుందో తనకు కూడా తెలియదు.

భవిష్యత్తులో ఏముందో తెలియని లత భవిష్యత్తును ఎలా ఎదుర్కొందో, ఎన్నెన్ని చేదు అనుభవాలను ఎదుర్కొందో, ఆ అనుభవాలు ఆమె వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో వచ్చేవారం.

***

Photo Credits: Internet

Exit mobile version