సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-31

2
2

[dropcap]ఏ[/dropcap]య్ – దిల్ – ఎ – నాదాన్, ఏయ్ – దిల్-ఏ-నాదాన్

అర్జూ క్యా హై? జుస్తూజు క్యా హై?

“ఓ నా అమాయక హృదయమా? ఏమిటి నీ కోరిక? ఏమిటీ ఈ తీవ్రమైన తపన?” జాన్ నిసార్ అఖ్తర్  రాసిన అత్యంత సున్నితము, ఆలోచనాత్మకము అయిన ‘రజియా సుల్తాన్’ సినిమాలోని ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించింది ఖయ్యామ్. ఖయ్యామ్‍కు లతా మంగేష్కర్ పాట పాడే విధానం నచ్చలేదు. అతని పాటలో స్వరం మృదువుగా ఉండాలి. పిచ్ మంద్ర స్థాయిలో ఉండాలి. లత పిచ్ ఎక్కువ. అందుకని చాలా ఏళ్ళు ఖయ్యామ్ లతతో కానీ, రఫీతో కాని అధికంగా పాడించలేదు. ఎప్పుడైతే ‘అఖ్రీఖత్’ సినిమాలో ‘బహారో, మేరా జీవన్ భీ సవారో’ పాట లతతో పాడించాడో, అప్పటి నుంచీ ఖయ్యామ్‍  లత అభిమాని అయిపోయాడు. కభీ కభీ, త్రిశూల్, ఖాన్‌దాన్, బజార్ వంటి సినిమాలలో లతతో అతి చక్కని పాటలు పాడించాడు. ఖయ్యామ్ కోసం లత పాడిన పాటలన్నింటిలోకి ‘రజియా సుల్తాన్’ సినిమాలోని పాటలు ప్రత్యేకం. వీటిల్లో లతకు ఎంతో ఇష్టమైన పాట ‘ఏయ్ దిల్ – ఏ- నాదాన్’. ప్రేమ కోసం తపిస్తూ ప్రపంచమనే ఎడారిలో ప్రేమ అనే ఒయాసిస్సు అందుబాటులో ఉన్నా అందుకోలేని, దప్పిక తీర్చుకోలేని నిస్సహాయ హృదయవేదనను, సందిగ్దాన్ని అత్యంత మధురమైన రీతిలో ప్రదర్శించే ఈ పాట లత హృదయవేదనను ప్రతిబింబిస్తుంది. పలు సందర్భాలలో తనకు మామూలు గృహిణిలా, మామూలు జీవితం గడపాలని ఉన్నదని ప్రకటిస్తూ వచ్చింది లత. లతా మంగేష్కర్‍గా అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ప్రపంచ ప్రజల గౌరవమన్ననలు, ప్రేమాభిమానాలు లభిస్తున్నాయి. కానీ ఏదో తెలియని ఆవేదన, తెలియని లోటు, ఏదో  కోల్పోయిన భావన కలుగుతూంటాయి. సరిగ్గా ఆ భావనలను ప్రతిబింబిస్తూందీ పాట. ప్రతి మనిషి అంతరంగం లోలోతులలో వుడే ఒంటరితనపు వేదనని, అనీ వున్నా ఇంకేదో లేదన్న విషాదభావాన్ని, తపనను అత్యంత మృదువుగా ప్రదర్శిస్తుందీ పాట.

హమ్ భటక్ తే హై, క్యూన్ భటక్ తే హై, దష్త్-ఓ-సహరా మే

ఐస  లగ్తాహై, మౌజ్ ప్యాసీ హై, అప్‌ని దరియామే

కైసి ఉల్‌ఝన్ హై, క్యూన్ యె ఉల్‌ఝన్ హై

ఏక్ సాయాసా  రూహ్ బరూ క్యా హై..

‘భటక్‌నా’ అంటే గమ్యం లేకుండా తిరగటం, దారితప్పి ఎటు వెళ్తున్నామో తెలియకుండా వెళ్ళటం. ఎందుకని ప్రయాణిస్తున్నామో తెలియని ప్రయాణం, ఏం కావాలో, ఏం వెతుకుతున్నామో తెలియని వెతుకులాట ఇది. ఈ అడవిలో, ఈ శూన్యంలో దేనికోసం అన్వేషిస్తూన్నామో తెలియని అన్వేషణ ఇది. అందరి దాహం తీరుస్తుంది నది నీరు. ఆ నదిలోనే జనించిన ఒక దాహంతో అల్లల్లాడే తరంగంలాంటి దాన్ని నేను అంటోంది నాయిక ఈ పాటలో. ఎందుకీ సంచలనం? ఎందుకీ అమోమయం? ఏమిటీ సందిగ్దం? నా కళ్ళ ఎదుట ఎవరిదీ నీడ? అంటూ ప్రశ్నిస్తోంది. ఆమె అయోమయం, సందిగ్ధం  ఒక నీడలా ఆమె కళ్ళముందు నిలచిందన్నమాట.

సినిమాలో రజియా సుల్తానా  రాణి. సుల్తాన్. పురుషులు మాత్రమే సుల్తానులుగా ఉండాలని నమ్మే ప్రపంచంలో, మహిళ నాలుగు గోడల నడుమ, పరదాల మాటున దాగి ఉండాలని విశ్వసించే ఛాందస భావాల మధ్యయుగంలో పురుషుల సింహాసనాన్ని ఆక్రమించి, సంప్రదాయపు సంకుచిత సంకెళ్ళలను త్రోసిరాజని సింహాసనాన్ని అధిష్టించిన మహిళ రజియా. ఆమెను సింహాసనం నుంచి దింపాలన్న కుట్రలు ఎన్నో జరిగాయి. ఆమె ఆధిక్యాన్ని సహించని, ఆమోదించని వారు అనుక్షణం ఆమె ప్రాణాలు హరించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.   ఈ కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొంటున్న సమయంలోనే ఆమె మనసులో ప్రేమ ఉదయించింది. అబీసినియాకు చెందిన బానిస వీరుడు జమాలుద్దీన్ యాకుత్ వైపు ఆమె ఆకర్షితురాలైంది. ఆమె సుల్తాన్. అతను బానిస. ఆమె ప్రతి అడుగునూ గమనిస్తూ దెబ్బ తీయాలనే శత్రువులు ఓ వైపు పొంచి ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆమె మనసులోని సందిగ్దాన్ని నిస్సహాయతను అత్యంత అద్భుతంగా ప్రదర్శిస్తుందీ పాట.

క్యా ఖయామత్ హై, క్యా ముసీబత్ హై

కహ్ నహీ సక్తే  కిస్ కీ ఆర్మాన్ హై

జిందగీ జైసె  ఖోయీ ఖోయీ హై

హైరాన్ హైరాన్ హై

యే జమీన్ చుప్ హై, ఆస్మాన్ చుప్ హై

ఫిర్ యే  ధడ్‌కన్ సీ చార్ సూ క్యాహై

ప్రేమ సర్వ వినాశిని  వంటిది. ఒక సమస్య లాంటిది. ఏమిటీ పరిస్థితి అని వాపోతుంది హృదయం. ఎవ్వరికీ తన కోరికను చెప్పుకోలేదు. కానీ జీవితంలో ఏదో కోల్పోయిన భావన రగులుతోంది. అశాంతిగా ఉంది. భూమ్యాకాశాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ హృదయం ఎవరి కోసమో కొట్టుకుంటోంది. ఎవరికీ చెప్పుకోలేని, అర్థంకాని భావనలతో హృదయం సతమతమవుతుంది.

ఏయ్ దిల్ – ఎ – నాదాన్, ఐసి రాహోం మే, కిత్నే కాంటే హై

ఆర్జూ నే హర్ కిసీ దిల్ కా దర్ద్ బాంటే  హై

కితనె ఘాయల్ హై, కిత్‍నే బిస్మిల్ హై

ఇస్ ఖుదాయీమే ఏక్ తూ క్యా హై

ఏయ్ దిల్ – ఎ – నాదాన్

ఓ నా అమాయక హృదయమా, ఈ ప్రేమ దారి కంటాకాకీర్ణం మార్గం. ఏ హృదయానికైనా కోరికలు బాధను, దుఃఖాన్నే మిగిల్చాయి. ఎన్నో హృదయాలు గాయపడ్డాయి. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. ఈ ప్రాకృతిక శక్తి ముందు నిస్సహాయంగా నిలిచింది నువ్వొక్కర్తివే కాదు. నువ్వు ఒంటరికాదు. గాయపడ్డవారు, బాధలుపడుతున్నవారు ఎందరో నీకుతోడుగా వున్నారు,  ఓ  నా అమాయక హృదయమా!

రజియా సుల్తానా మానసిక వేదనను, సందిగ్ధాన్ని జాన్ నిసార్ అఖ్తర్ ఎంతో గొప్పగా, అత్యద్భుతంగా తన పాటలో ప్రదర్శించాడు. భావానికి తగ్గ బాణీని ఖయ్యామ్ కుదిర్చాడు. అయితే పాటకు ప్రాణం పోసి, ఆత్మ అంతరంగ వేదనను, అత్యంత అద్భుతంగా, విన్న ప్రతి ఎద దేనికోసమో పరితపిస్తూ అలవి కాని ఆవేదనతో, అలవి కాని ఆనందంతో పలవరిస్తూ, పల్లవిస్తూన్న భావనకు ధ్వని నిచ్చింది లత హృదయస్పందన ఆమె స్వరం ద్వారా!

ఆలోచిస్తే లత పరిస్థితి కూడా రజియా సుల్తానా లాంటి పరిస్థితి అనిపిస్తుంది. భౌతికంగా, మానసికంగా పురుష ఆధిక్యం కల సినీ పరిశ్రమలో ‘మహారాణి’లా నిలిచింది లత. ఆమె ఆధిక్యాన్ని హర్షించని వారు, సహించని వారు పలురకాలుగా ఆమెని పడద్రోయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆమెపై లేనిపోని అభాండాలు మోపారు. ఆమెని క్రూరురాలిగా, రాక్షసిగా, అసూయా పరురాలిగా ప్రచారం చేశారు. ఆమె ప్రతి చర్యలో, ప్రతి కదలికలో లేని అర్థాలు చూసి దుష్ప్రచారాలు చేశారు. ఆమెకు ప్రత్యామ్నాయంగా గాయనిలను నిలపాలని విఫల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు విఫలమవగానే లత అణగద్రొక్కుతోంది, యువ గాయనిలు అభివృద్ధిని అడ్డుకుంటోంది అని ప్రచారాలు చేశారు, ఆమెకు లేనిపోని సంబంధాలను అంటగట్టి ఆమె ఇమేజీని పాడుచేయాలని చూశారు. కానీ లత అన్నిటినీ తన స్వర శక్తితో తట్టుకుని నిలబడింది. మౌనంతో అడ్డుకుని విజయం సాధించింది. లతకు ‘ఏయ్- దిల్- ఎ- నాదాన్’  అత్యంత ఇష్టమైన పాటగా నిలవటానికి ఆ పాటలోని భావంతో లత తాదాత్మ్యం చెందటం ఒక కారణం కావచ్చు.

లత హిందీ సినీ జగత్తులో అడుగుపెట్టినప్పుడు సినీ ప్రపంచంలోని కళాకారుల పట్ల పలు దురభిప్రాయాలు ప్రచారంలో ఉండేవి. తాటిచెట్టు క్రింద నుంచుని పాలు తాగినా కల్లు తాగినట్టనుకుంటారు. కాబట్టి అప్పటి సినీ పరిశ్రమలోని వారిపట్ల ఉన్న దురభిప్రాయం తనపట్ల ప్రసరించకుండా లత ఆరంభం నుంచీ అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఆమె ప్రవర్తన ఖచ్చితంగా, నిర్దుష్టంగా, నిర్దయగా ఉండటంతో చెవులు కొరుక్కున్నా, నోళ్ళు నొక్కుకున్నా వెనుకనే తప్ప ధైర్యంగా ఆమె ముందు ఒక్కరూ ఏమీ అనలేకపోయారు. పలురకాల ప్రశ్నలడిగి అందరినీ ఇబ్బంది పెట్టే జర్నలిస్టులు కూడా లత ముందు నోరిప్పలేకపోయారు. అలాగని లత నోరిప్పి ఒక్కరినీ ఏమీ అనలేదు. ఒక్కసారి కూడా పరుషంగా మాట్లాడలేదు. కేవలం తన ప్రవర్తన వల్ల, తన చుట్టూ ఆమె కట్టుకున్న కోట వల్ల, సృజించుకున్న ఇమేజీవల్ల ఎవరైనా ఆమడ దూరంలో నిలబడి, అవనత శిరస్కులై మాట్లాడేవారు తప్ప అహంకారం ప్రదర్శించగలిగే వారు కాదు. లత ఈ ఇమేజీని సృష్టించుకోవటంలో ఆమె స్వరం ఎంతగానో తోడ్పడింది. ఆమె పాడిన పాటలు, పాటలను పాడిన విధానం ఆమె ఇమేజీని మరింత పెంచాయి.

“Lata style has become the ultimate measure of sweetness in a woman’s voice, its characteristic was the skilled use of a particular kind of falsetto which did not exist in quite the same way before her coming.”

తనకన్నా ముందున్న గాయనిలకు భిన్నమైన గాన సంవిధానం ద్వారా లత భారతీయ మహిళను ప్రతిబింబించే స్వరంగా ఎదిగింది. ఆమె స్వరంలోని స్వచ్ఛత, పవిత్రత, అమాయకత్వం, దృఢ్వత్వం వంటి లక్షణాలు అత్యుత్తమము, ఉన్నతము అయిన భారతీయ ఆదర్శ మహిళ స్వరంలా ఆమెను నిలిపాయి. ముఖ్యంగా ‘మదర్ ఇండియా’ సినిమాలోని ‘దునియా మే హమ్ ఆయే హై తో జీనా హి పడేగా’ పాటలో భారతీయ నారీ ధర్మాన్ని ప్రకటిస్తూ, లత తన స్వర బలంతో ఆ ధర్మానికి ప్రతీకలా నిలిచింది.

ఔరత్ హై జో ఔరత్ దునియా కె షరమ్ హై

సంసార్ మె బస్ లాజ్ హి నారీన్ ధరమ్ హై

‘లాజ్’ అంటే సాధారణంగా ‘సిగ్గు’ గా భావిస్తారు. కానీ ‘లాజ్’ అంటే ‘మాన సమ్మానం’, ‘ప్రతిష్ఠ’, గౌరవం వంటి అర్థాలున్నాయి. ప్రపంచానికి ప్రతిష్ఠ, గౌరవం వంటిది స్త్రీ. ఆ ప్రతిష్ఠను నిలుపుకోవటమే స్త్రీ అత్యున్నత ధర్మం. సినీ ప్రపంచంలో స్త్రీ ఆత్మగౌరవానికి, ఆత్మ విశ్వాసానికి, ఆత్మ శక్తికి నిదర్శనంగా నిలచింది లతా మంగేష్కర్.  అందుకే నౌషాద్ ‘Very heart of India throbs in her (Lata) voice’ అన్నాడు. భారతీయ హృదయం లత స్వరంలో ధ్వనిస్తుందన్నాడు నౌషాద్. ఈ స్థాయికి ఎదగటం కోసం లత సర్వం త్యాగం చేసింది.

వివాహబంధం గాయనిగా తనపై పరిమితులు విధిస్తుందని గ్రహించింది. అందుకే ఆమె తల్లి ఎన్ని సంబంధాలు చూసినా తిరస్కరించింది లత. వివాహం పాట నుంచి దృష్టిని మళ్ళిస్తుంది. అప్పుడు ‘పాట’ కన్నా ‘సంసారం’ ప్రధానం అవుతుంది. అందుకని ప్రేమను, పెళ్ళిని తిరస్కరించింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా  ప్రేమ, పెళ్ళిళ్ళ జంజాటంలో పడలేదు. ఎందుకంటే ఈ మాయాజాలాలలో చిక్కుకుని పాట దారినుంచి వైదొలగి సర్వ నాశనం చేసుకున్న వారిని లత తన కళ్ళతో చూసింది. గీతాదత్ ఇందుకు ప్రధాన దృష్టాంతం. సాహిర్ వెంటబడటంతో సినీ రంగం నుంచి వైదొలగింది సుధ మల్హోత్ర. అనురాధ పౌడ్వాల్, అల్నా యాగ్నిక్ వంటి వారు కూడా వివాహం తరువాత సమస్యల వల్ల పాట దారి తప్పారు. అరుణ్ పౌడ్వాల్ మరణం అనురాధ కెరీర్ పై ప్రభావం చూపింది. లతకు ఇది తెలుసు. అందుకని ఆమె ఎట్టి పరిస్థితులలో పాట నుంచి దృష్టిని పక్కకు తప్పించే వైపు దృష్టిని ప్రసరింపచేయలేదు. దీనికి తోడు ద్వంద్వార్థాల పాటలు, క్లబ్బు డాన్సు పాటలు, విచ్చలవిడి భావాల పాటలు పాడకపోవటం కూడా లతకు ఒక చక్కటి ఇమేజీనిచ్చింది. ‘ఏయ్ మేరే వతన్ కే లోగోం’ పాటతో ఆమె భారతీయ ఆత్మ గౌరవ స్వరంగా ఎదిగింది. అందుకే పాట కోసం లత త్యాగాన్ని వివరిస్తూ ‘Lata has too often forsaken her sexuality, domesticity for devotion to a greater cause, namely, the endorsement of national pleasure through a redefinition of modern Indian feminine identity’ అన్న అభిప్రాయాన్ని ‘రాఘవ మీనన్’ వ్యక్తపరిచాడు.

‘Her (Lata) voice was clear and soft. Like that of a girl on the threshold of adolescence’ (In search of Lata Mangeshkar by Harish Bhimani, Page 34) అంటాడు హరీష్ భిమాని.

అంటే ఆ కాలంలో సినీ పరిశ్రమపై పలువురికి ఉన్న దురభిప్రాయాలను పటాపంచలు చేస్తూ సినీ పరిశ్రమ అనే పంకంలో ‘పద్మం’ లా, ఏ కళాంకమూ, ఎలాంటి దుర్గంధమూ అంటని పవిత్ర పుష్పంలా లతను ఆమె స్వరం నిలబెట్టిందన్నమాట. ఒకే సినిమాలో  తల్లిలా, చెల్లిలా, ప్రేయసిలా, భార్యలా వెరసి స్త్రీ, బహు భిన్న రూపాలను ధ్వనింపచేసే స్వరంలా నిలుస్తూ, భారతీయ మహిళ స్వరంలా నిలిచిందన్నమాట లత స్వరం.

It is this heterosexual male fantasy of a Hindu adolescent girl – both controllable ever ready to please that is an over whelming aspect of the desire that congregates around Lata’s voice and in keeping with the unbridled possibilities of fantasies, the voice that confines the pliable adolescent girl also concurrently facilitates the invocating gesture that imagines the ‘mother’ అంటాడు సంజయ్ శ్రీవాస్తవ ‘Voice, Gender and Space in Time – The Idea of Lata Mangeshkar’ అన్న వ్యాసంలో [Economic and Political Weekly, Vol 39. No 20 (may 15-21, 2004].

సంజయ్ శ్రీవాస్తవ ‘Lata Mangeshkar: The Pure Woman’ (Business Line, May 3, 2019) అనే వ్యాసంలో ‘Through Lata’s artistry, the disrespectableness of ambiguous tonalities and the threat of uncertain femininity was brought into alignments with the discourses the pure and controllable Hindu womanhood’ అన్న అభిప్రాయం వ్యక్తపరిచాడు. అంటే ఒక పురుషుడు మహిళలో వాంఛించే అమాయకత్వం, బోళాతనం, ప్రేమభావన, పట్టుదల, చిలిపితనంతో సహా మాతృత్వ భావనలను లత స్వరం పలికించటం వల్ల ఆమె ‘భారతనారి’కి, ‘భారతీయాత్మకు’ ప్రతిబింబంలా ఎదిగిందన్న మాట. అంటే తన స్వర మాధుర్యం ద్వారా, గాన ప్రతిభ ద్వారా, సినీ కళాకారులకు అంటిన ‘పంకాన్ని’ పరిశుభ్రం చేసి, కళాకారులకు ఒక గౌరవాన్ని ఆపాదించింది. అందుకే లతకు భిన్నంగా పాటలో ప్రత్యక్షంగా భావనలను ప్రకటించే స్వరాలు నాయికల స్వరాలుగా కాక ‘ఇతర’ పాత్రల స్వరాలుగా గుర్తింపు పొందాయి. ఆశా భోస్లే, శంషాద్ బేగం , ఇలా అరుణ్ వంటి వారు ఎంత ప్రయత్నించినా నాయికల స్వరాలుగా,  లతలా గుర్తింపు పొందలేకపోయారు. చివరికి ‘సునిధి చౌహాన్’ ఈ ఇమేజీని మారుస్తుందనుకునేలోగా, లత లాంటి గాన సంవిధానాన్ని నిలబెడుతూ ‘శ్రేయా ఘోషల్’ రంగ ప్రవేశం చేసి అగ్రస్థానంలో నిలవటం ద్వారా లత ఆరంభించిన ‘తీయటి స్వరం’ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేమిటంటే లతకు తన స్వరం గొప్పతనం తెలుసు. ఎలాంటి భావానికైనా శక్తిని, పవిత్రతను ఆపాదించగల తన గాన ప్రతిభాశక్తి తెలుసు. ఆ స్వరానికి తగ్గ ఇమేజీని లత ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేస్కుని నిలబెట్టుకుంది. ఇందుకోసం ఆమె ఇమేజీని దెబ్బతీసే ప్రతి విషయాన్నీ విస్మరించింది. ఎంత ఇష్టమైనా దాన్ని త్యాగం చేసింది. తన దుస్తులు, మాటతీరు, ప్రవర్తన, నడక, చూపు – సర్వం ఆ ఇమేజీలో ఒదుగుతాయి. ఆమె ఎంచుకున్న పాటలు, పాటలు పాడే తీరు, ఎంతటి చిలిపి పాటనైనా, అత్యంత చమత్కారంగా, అర్థవంతంగా, మరో అర్థం ధ్వనించకుండా పాడటం సర్వం లత ఇమేజీని పెంచుతాయి. అందుకే అమె ఇమేజీని దెబ్బతీయటం ద్వారా లతను దెబ్బ తీయవచ్చన్న ప్రయత్నాలు జరిగాయి. ఆమె మరణం తరువాత కూడా ఆమె ప్రతిభను ప్రస్తావిస్తూ, పాటల ద్వారా దివ్యానందాన్ని అనుభవించే బదులు, లత ప్రేమగాథలను ప్రస్తావిస్తూ, ఆమె ఇమేజీని దిగజార్చే విఫల ప్రయత్నాలు పలువురు చేయటం చూడవచ్చు. కానీ లత స్వరంలో ప్రకటితమౌతున్న దివ్యత్వం, పవిత్ర భావనల ముందు అన్ని ప్రయత్నాలు వెలవెలబోతున్నాయి. రాజ్‌సింగ్ దుంగార్పూర్‍తో లతకు సంబంధాన్ని అంటగట్టి వారిద్దరి నడుమ ఏదో నడిచిందని నిరూపించాలన్న ప్రయత్నాలు కూడా అందుకే సఫలం కాలేదు. పైగా, ఈ ప్రయత్నాలు లత ఇమేజీని మరింత ఇనుమడింపచేశాయి. రజియా సుల్తానాను గద్దె దింపాలని చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. కానీ లతా మంగేష్కర్‍ను భారతీయ ప్రజల హృదయ సింహాసనం నుంచి దింపాలన్న ప్రయత్నాలు విఫలమవటమే కాదు లతను మరింత శక్తిమంతురాలని చేశాయి. ఆమె పై అభిమానాన్ని ద్విగుణీకృతం చేశాయి. రజియా సుల్తానా తన బలహీనతను ప్రదర్శించింది. పరాజయం పాలయింది. లతా మంగేష్కర్ బలహీనత అన్న ఆలోచననే దరిదాపులకు రానీయలేదు. లక్ష్యం నుంచి దృష్టి మరల్చలేదు. విజేతగా నిలచింది.

రాజ్‌సింగ్ దుంగార్పూర్ రాజస్థాన్‍లోని ‘దుంగార్పూర్’ రాజ్యంలో డిసెంబర్ 19, 1935న జన్మించాడు. అంటే లత కన్నా ఆరేళ్ళు చిన్న. హృదయనాథ్ మంగేష్కర్ అక్టోబర్ 26, 1937 జన్మించాడు. అంటే హృదయనాథ్, రాజ్‌సింగ్ దాదాపుగా సమవయస్కులు. లతకు సోదర సమానుడు అన్నమాట రాజ్‌సింగ్. ‘దుంగార్పూర్’ రాజు ‘మహర్వార్ లక్ష్మణ్ సింగ్’ చిన్నకొడుకు రాజ్‌సింగ్. అతనికి బాల్యం నుంచి క్రికెట్ అంటే అభిమానం. దాదాపుగా ఎనభై ఆరు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‍లు ఆడేడు రాజ్‌సింగ్. భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‍గా పనిచేశాడు పలుమార్లు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా రెండుమార్లు ఉన్నాడు.

లత మంగేష్కర్‍కు సంగీతంతో పాటు క్రికెట్ అంటే కూడా ఇష్టం. ఆమె వీలు కుదిరినప్పుడు హృదయనాథ్‍తో క్రికెట్ ఆడుతూండేది. వారు వాకేశ్వర్  హౌస్‌లో క్రికెట్ ఆడేవారు. 1959లో రాజ్‌సింగ్ దుంగార్పూర్ బొంబాయి వచ్చాడు. క్రికెటర్ దిలీప్ సర్దేశాయి బంధువు ‘సోపన్'(సందీప్) రాజ్‌సింగ్ మిత్రుడు. క్రికెట్ ఆడకుండా ఉండలేకపోతున్నానని అతనితో రాజ్‌సింగ్ చెప్పాడు. ‘వాకేశ్వర్  హౌస్’ లో తప్ప ఎక్కడా క్రికెట్ ఆడే స్థలం లేదని, అక్కడ లత, హృదయనాథ్‍లు ఆడతారు కాబట్టి ఇతరులకు అవకాశం లేదని సందీప్ చెప్పాడు. “అక్కడ ఎవరు ఆడతారో, ఆడరో నాకు సంబంధం లేదు. నేను క్రికెట్ ఆడాలంతే!” అని రాజ్‌సింగ్ మొండిపట్టు పట్టాడు. ‘వాకేశ్వర్ హౌస్’లో ఆడటం ఆరంభించాడు. అక్కడ అతనికి లత, హృదయనాథ్‍లతో పరిచయం అయింది. ఐతే ఆ కాలంలో లత రికార్డింగ్‍లతో బిజీగా ఉండేది. ఎప్పుడో అవకాశం దొరికినప్పుడు కాసేపు ఆడి వెళ్ళిపోయేది. రాజ్‌సింగ్ కూడా ఆమె సినిమా పాటలు పాడుతుందన్న అంశం ఆధారంగా కుతూహలంగా ఉండేది తప్ప ఆమెని పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయాలు 2009 సంవత్సరంలో ‘మిడ్ డే’ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో రాజ్‌సింగ్ స్వయంగా చెప్పాడు. అంటే రాజ్‌సింగ్, క్రికెట్ ఆడేవాడు వెళ్ళిపోయేవాడు. లతను పట్టించుకోలేదు. లత అతడిని పట్టించుకోలేదు. హృదయనాథ్ ద్వారా రాజ్‌సింగ్ గురించి వింటూ ఉంటే లతకు అతడిని చూడాలనిపించి ఓ రోజు ‘చాయ్ ‘కని ఇంటికి పిలిచింది. అలా లతా మంగేష్కర్‍తో రాజ్‌సింగ్ పరిచయం కలిగింది. ఆ రోజు లత ఇంటికి వెళ్ళిన రాజ్‌సింగ్, ఆమెను చూస్తూండిపోయాడు. సినిమాలలో పలు అందమైన హీరోయిన్ల అందానికి అందమైన ఆభరణంలా నిలచి వారి అందాన్ని ఇనుమడింపచేసే లత స్వరానికీ, రూపానికీ అనుసంధానం చేస్తూ ఆశ్చర్యంతో ఆమెనే చూస్తూండిపోయాడు. ఈ విషయం రాజ్‌సింగ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. కళలో ప్రదర్శితమౌతున్న రసాస్వాదన వల్ల కళాకారుడి పట్ల కలిగే గౌరవం, అభిమానాల స్పందన ఫలం అది. అతడు వెళ్ళిపోతూంటే లత అతడికి తన కారు ఇచ్చి పంపించింది. అలా రాజ్‌సింగ్ లత పాటల పట్ల ఉన్న ప్రేమ, లతకు క్రికెట్ అంటే ఉన్న ఇష్టం వారిద్దరి నడుమ స్నేహాన్ని పెంచింది. అప్పుడప్పుడు అతను లతతో రికార్డింగ్‍లకు వచ్చేవాడు. లత క్రికెట్ మ్యాచ్‍లకు వెళ్ళేది. వారు అధికంగా హృదయనాథ్ ఇంట్లో కలిసేవారు. రాజ్‌సింగ్, హృదయనాథ్, లతలు కలసి మాట్లాడుకునేవారు. ఐతే వారిద్దరి నడుమ రొమాన్స్‌ను ఊహించటం కుదరని పని. వారిద్దరి సాన్నిహిత్యం చర్చకు వచ్చేసరికి లత వయసు యాభై దగ్గర పడుతోంది. అయితే రామచంద్ర ‘Prince’ అంటూ 1977లో రాసినప్పటి నుంచీ వీరిద్దరి సంబంధం గురించి ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే ఎవరెన్ని వ్యాఖ్యలు చేసే, ఎంతగా పరిశోధనలు చేసినా, రాజ్‌సింగ్, లతలు స్నేహితులు, సన్నిహితులు అన్న విషయం తప్ప మరో విషయాన్ని నిర్ధారణగా చెప్పలేకపోయారెవరూ.

లత విదేశీ యాత్రలు ఆరంభించినప్పటి నుంచీ అందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ రాజ్‌సింగ్ చూసేవాడు. లతకు తోడుగా విదేశీ యాత్రలకు వెళ్ళేవాడు. లతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్థిక లావాదేవీలు చూసేవాడు. సలహాలు ఇచ్చేవాడు. 1983లో భారత్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచినప్పుడు వారిని సరైన రీతిలో సత్కరించేందుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వద్ద నిధులు లేకపోతే వారి గౌరవార్థం రాజ్‌సింగ్ సలహాననుసరించి లత ‘చారిటీ షో’ నిర్వహించింది. బి.సి.సి.ఐ.కు నిధులు సమకూర్చి పెట్టింది. లత మంగేష్కర్ తండ్రి పేరుమీద ఆస్పత్రి నిర్మిస్తున్నప్పుడు రాజ్‌సింగ్ దానికి నిధులు సమకూర్చి పెట్టాడు. అంతేకాదు, తాను అనారోగ్యం పాలైనప్పుడు లత ఆస్పత్రిలోనే చేరేవాడు. లత కూడా అతనికి సపర్యలు చేసేది. చివరి సంవత్సరాలలో రాజ్‌సింగ్ అల్జీమియర్ వ్యాధితో బాధపడ్డాడు. 12 సెప్టెంబర్, 2009 లో రాజ్‌సింగ్ మరణించాడు. మరణానికి కొన్ని నెలల ముందునుంచీ, ముఖ్యంగా రెండు నెలల ముందు నుంచీ రాజ్‌సింగ్ మాట పడిపోయింది. అతడిని ఎలా మాట్లాడించాలో ఎవరికీ తెలియలేదు. ఎంత ప్రయత్నించినా ఏదీ  గుర్తు పట్టలేకపోయేవాడు. మాట్లాడలేకపోయేవాడు. చివరికి అతని బంధువు శైలేంద్ర సింగ్ దుంగార్పూర్ ‘డాన్ బ్రాడ్‌మన్’ బొమ్మ చూపించి ‘డాన్’ అన్నాడు. దానికి తల అడ్డంగా ఊపి ‘డాన్ కాదు, డోనాల్డ్ జార్జ్ బ్రాడ్‌మన్’ అన్నాడు రాజ్‌సింగ్. అదే అతను మాట్లాడిన చివరిమాట.

రాజ్‌సింగ్ బ్రతికి ఉన్నంతకాలం తనకూ, లతా మంగేష్కర్‍కూ నడుమ స్నేహం తప్ప మరేమీ లేదని చెప్తూనే ఉన్నాడు. లండన్ అల్బర్ట్ హాల్‍లో లత ‘షో’ నిర్వహించటంలో సహాయపడింది రాజ్‌సింగ్. కాని షోలో ఆఖరి వరుసలో కూర్చుని లత పాటలు విన్నాడు తప్ప ‘నేనే షో ఏర్పాటు చేశాన’ని విర్రవీగలేదు.

లతకు భారతరత్న అవార్డు ఇస్తున్నట్టు ప్రకటన వెలువడినపుడు లత లండన్‍లో ఉంది. ఫోనులకు సమాధానాలివ్వటంలోనే ఆమె సమయం గడుస్తూంటే ఆమెకు ‘కాఫీ’ పెట్టిచ్చింది రాజ్‌సింగ్. అంతేకాదు భారతరత్న అవార్డు పొందిన అనుభూతి గురించి ఆమెను ప్రశ్నించాడు. దానికి ఆమె సమాధానం ‘బహుత్ అఛ్ఛా లగ్తాహై!’.

రాజ్‌సింగ్ జీవిత చరిత్రను సమర్ సింగ్, హర్షవర్దన్‍లు రాశారు. అందులో రాజ్‌సింగ్, లతల అనుబంధం గురించి కొన్ని విశేషాలున్నాయి. రాజ్‌సింగ్ లండన్‍లో లార్డ్స్ క్రికెట్ మైదానం కనిపించేట్టుండే ప్లాట్‍ను కొన్నాడు. లత, రాజ్‍లు సమయం దొరికినప్పుడు ఎయిర్ ఇండియాలో ‘బిజినెస్ క్లాస్’లో ప్రయాణించి లండన్ చేరుకునేవారు, ఆ ప్లాట్ బాల్కనీలో కూర్చుని క్రికెట్ చూస్తూ కబుర్లాడుకునేవారని రాశారు. మరో సందర్భంలో తాను లతను దుంగార్పూర్‍తో కలసిన అనుభవం గురించి హర్షవర్దన్ ప్రస్తావించాడు.

‘Once both of them were in Udaipur, we all stayed at the same hotel located by the side of a lake named after Raj. At afternoon tea at its terrace, Lata stood up from her wicker chair to receive me with folded hands, to melt down the stiff aura heard of Bollywood personas, humble, generous and just appealing, all smiles, she put a few questions about the tiger crisis. Raj stood by her side, like a coach at a practice session’.

రాజ్‍సింగ్ దుంగార్పూర్ జీవిత చరిత్ర రాసేందుకు పరిశోధిస్తూ హర్షవర్దన్ రాజ్‍తో స్నేహం ఉన్న పలువురు క్రికెటర్లను ఇంటర్వ్యూ చేశాడు. పెళ్ళి కాకముందు క్రికెటర్  పటౌడీ దుంగార్పూర్‍తో ఉండేవాడనీ, వారు లత ఇంటికి వెళ్తే వారిద్దరికీ లత స్వయంగా పకోడీలు చేసి పెట్టేదని పటౌడీ చెప్పాడు ఇంటర్వ్యూలో. అలాగే దుంగార్పూర్ 65వ పుట్టినరోజు నాడు హర్షవర్దన్ – దుంగార్పూర్‍తో కలసి సిద్ధివినాయక్ మందిరానికి వెళ్ళినప్పుడు లత ఇల్లు చూపిస్తూ “అ ఇంట్లో లత ఉంటుంది” అని చెప్పాడని గుర్తుచేసుకున్నాడు హర్షవర్ధన్. అంటే, రాజ్‌సింగ్ దుంగార్పూర్, లతల నడుమ సాన్నిహిత్యం ఉందని అందరికీ తెలుసు. కానీ ఆ సాన్నిహిత్యానికి ఏ పేరూ పెట్టలేని పరిస్థితి ప్రతి ఒక్కరూ ఎదుర్కొన్నారు. ‘హాథ్ సే భూత్ ఇసే రిష్తోంక్ ఇల్జామ్ నదో’ అని లత స్వరం అందరినీ హెచ్చరిస్తూ వచ్చింది.

లతా, రాజ్ సింఘ్ దుంగార్పూర్‌ల సంబంధం గురించి ఈటీవీ భారత్ ఒక పరిశోధనాత్మక కథనం చేసింది. అందులో భాగంగా రాజ్ సింఘ్, లతలు సన్నిహితంగా పరిచయం వున్న కొందరిని ఇంటర్వ్యూ చేశారు. రాజ్ సింఘ్ తో సహా అతని సోదరీ సోదరుల గురువు పండిత్ కాంతినాథ్ భట్. ఈయన రాజ్ సింఘ్ తండ్రి మహారావల్ లక్ష్మణ్ సింఘ్ కు సెక్రెటరీగా కూడా వున్నారు. అతని కొడుకు గోపేంద్ర నాథ్ భట్- రాజ్ సింఘ్, లతాల గురించి చెప్తూ వారు కలసి మాట్లాడుకునేవారనీ, వారి గురించి పత్రికలు పెళ్ళిచేసుకోబోతున్నారని అవాకులు, చవాకులూ రాసినా వారు పట్టించుకోలేదనీ చెప్పారు. వారిది స్వఛ్ఛమైన స్నేహం అని అన్నారు. వార్తలను ఖండించవచ్చుకదా అని అడిగితే, ఖండించటమంటే అబద్ధపువార్తలకు ప్రామాణికత కల్పించినట్టవుతుందని అన్నారనీ చెప్పాడు. వారు సామాజిక బంధనాలకు ఆవలవుంటూ,ఒకరినొకరు గౌరవిస్తూ చక్కని స్నేహాన్ని నెరపారని అన్నాడాయన. అంతేకాదు, వారు సంతోషాలకన్నా, కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలచి ధైర్యాన్నిచ్చారని చెప్పాడు. ముంబాయిలోని తన ఆస్తిలో అధికభాగం దీనానాథ్ మంగేష్కర్ ట్రస్ట్‌కి ఇచ్చాడు రాజ్ సింఘ్. రాజ్యసభ సభ్యురాలిగా వున్నప్పుడు ఎంపీ నిధులు రాజ్ సింఘ్ చేపట్టే అనేక సాంఘిక సంక్షేమ కార్యకలాపాలకు అందచేసింది లత.
ముంబాయికి చెందిన డాక్టర్ భండారీ -లతా, రాజ్ సింఘ్‌లకు సన్నిహితుడు. ఆయన వారిద్దరు ఎప్పుడూ క్రికెట్ గురించి చర్చించుకునేవారనీ, 2001 సంవత్సరంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ సింఘ్ గెహ్లాత్‌  ముంబాయి వచ్చినప్పుడు లతా, రాజ్ సింఘ్‌లు గెహ్లాత్‌ను కలిసి రాజస్థాన్‌కు సంబంధించిన అనేక విషయాలు చర్చించారని చెప్పారు. వారిద్దరూ గణేష్ భక్తులనీ, గణేష్‌పైన రాసిన  పుస్తకానికి లత ముందుమాట రాసిందనీ ఆయన చెప్పారు.
రాజ్ సింఘ్ చివరి దశలో ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో వున్నప్పుడు కూడా లతా అతడిని పూనాకు తెచ్చి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నదని ఆయన చెప్పారు. వారిద్దరినడుమ సంబంధం ఆత్మికమైనదన్న అభిప్రాయం ఆయన వెలిబుచ్చారు. అంతేకాదు, సంచలనాత్మకమైన వార్తల వేటలో సంస్కార రహితులు వీరి స్వఛ్ఛమైన స్నేహాన్ని నీచంగా చిత్రించి పాడుచేస్తారేమోనని లత, రాజ్ సింఘ్ సన్నిహితులంతా బాధపడుతున్నారనీ చెప్పారాయన.

స్త్రీ పురుష సంబంధాన్ని లైంగిక చర్య ప్రాతిపదికన మాత్రమే అర్థం చేసుకోగలిగే  సమాజం, ఇలాంటి స్నేహాలను అర్థం చేసుకోలేదు. ఎంత ప్రయత్నించినా చేయితో తాకి, కళ్ళల్లో కనబడే పరిమళానికి ఏదో సంబంధం అంటగట్టనిదే తోచదు. అందుకే ప్రతి ఒక్కరూ ‘లత దుంగార్పూర్ లవ్ ఎఫైర్’ అనీ, ‘లత రొమాంటిక్ లవ్’ అనీ, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ లవ్- ఆన్ సంగ్ సాగా ఆఫ్ లతా’  అనీ పలు వ్యాఖ్యలు చేస్తారు. కానీ ఎలాంటి లైంగిక వికార భావనలు లేకుండా స్త్రీ పురుషుల నడుమ పరస్పర గౌరవాభిమానాలతో కూడిన సాన్నిహిత్య భావన, విశ్వాసాలు ఉండగలవన్న స్పృహను ప్రదర్శించటం లేదు ఈనాటికీ. పలు ఇంటర్వ్యూలలో రాజ్‌సింగ్‌ను ‘మీరు వివాహం ఎందుకు చేసుకోలేదు?’ అని అడిగేవారు. “నేను పెళ్ళిచేసుకోలేదని ఎవరంటారు? నాకు పెళ్ళయిపోయింది, క్రికెట్‍తో” అని చమత్కారంగా సమాధానం ఇచ్చేవాడు రాజ్‌సింగ్!

“మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు?” అని లతను ప్రతి ఇంటర్వ్యూలలో అడిగేవారు. దానికి ఎల్లప్పుడూ లత సమాధానం ఒక్కటే.

“పెళ్ళి గురించి ఆలోచించే తీరిక నాకు లేదు. పదమూడేళ్ల వయసులో పనిచేయటం ఆరంభించాను. కుటుంబ బాధ్యత నాపై ఉంది. నాపై తొమ్మిది మంది ఆధారపడ్డారు. పెళ్ళి ధ్యాస నాకు లేనే లేదు’ అంటుంది.

ఎవరైనా మరీ మరీ గుచ్చి గుచ్చి అడుగుతూ “మీకు ఒంటరిగా అనిపించదా?” అని అడిగితే,  “అనిపించదు, నన్ను ఒంటరితనం ఎప్పుడూ బాధించలేదు. పెళ్ళి చేసుకోనందుకూ బాధ లేదు. ఎందుకంటే నాకు సంగీతమే ప్రాణం. నాకు ఒంటరిగా బతకటమే ఇష్టం. పూజ చేయటం, సంగీత సాధన చేయటం తప్ప నాకు మరొకటి అనవసరం. ఒకవేళ కర్మకాలి పెళ్ళి చేసుకున్నా అది విడాకులతో సమాప్తమయ్యేది” అంటుంది నవ్వుతూ.

ఆమెను రాజ్‌సింగ్ దుంగార్పూర్ గురించి ప్రత్యక్షంగా అడిగే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. కొందరు ధైర్యం చేసి అడిగారు. వారికి ఆమె సమాధానం సరళంగా, సూటిగా ఉంటుంది. ‘కొన్ని సంబంధాల గురించి అడగకూడదు. వాటిని వర్ణించటానికి పదాలు లేవు”- ‘సిర్ఫ్ ఎహ్‍సాస్ హై యే రూహ్ సె మహ్‌సూస్ కరో’ అని స్పష్టంగా చెప్తోందన్నమాట. అయినా ఇంకా పలువురు రాజ్‌సింగ్, లతల సంబంధం గురించి కళ్ళెగరేస్తారు. తమ సంస్కారాన్ననుసరించి వ్యాఖ్యానించి కాలర్లెగరేస్తారు. రాజ్‌సింగ్ దుంగార్పూర్ బంధువు, బికనేర్  రాకుమారి రాజశ్రీ తన జీవిత చరిత్ర ‘Palace of Clouds – A Memory’ అన్న పుస్తకంలో రాజ్‌సింగ్, లతలు ప్రేమించుకున్నారని, రాజ్‌సింగ్ తండ్రి వారి పెళ్ళికి  ఒప్పుకోలేదని, అందువల్ల వారు వివాహం చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోయారనీ రాసింది. అయితే ఈ పుస్తకం 2018 సంవత్సరంలో విడుదలైంది. అప్పటికి రాజ్‌సింగ్ మరణించాడు. లత ఎప్పటిలాగే మౌనంగా ఉంది. కానీ దుంగార్పూర్ కుటుంబీకులు మాత్రం అలాంటిదేమీ జరగలేదని, ఇదంతా రాజశ్రీ రొమాంటిక్ ఊహ మాత్రమే అని ఖండించారు. నిజం ఏమిటో ఎవరికీ తెలియదు కానీ రాజశ్రీ రాసిన విషయం మళ్ళీ కొన్నాళ్ళు రాజ్‌సింగ్, లతల సంబంధం గురించి ఊహాగానాలు చెలరేగటానికి దారితీసింది.

రాజ్‌సింగ్, లతల నడుమ సాన్నిహిత్యం ఉన్నదన్న విషయంలో సందేహం లేదు. లత రాజ్‌సింగ్‌ను విశ్వసించిందన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ వారి సాన్నిహిత్యం ఎలాంటిదన్న విషయం రాజ్‌సింగ్, లతలకు తప్ప మరెవరికీ తెలియదు. వారెన్నడూ ఎక్కడా అనుచితంగా ప్రవర్తించలేదు. మరో రకమైన ఆలోచనలకు తావీయలేదు. ఇద్దరూ పరిణితి చెందిన వయస్సువారు. ఖచ్చితంగా తమకేం కావాలో తెలిసినవారు. పరిణత మనస్కులని తమ సంబంధం గురించి వారు చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి. కాబట్టి వారిద్దరి నడుమ లేనిదేదో ఉన్నట్టూ ఊహించి, ఊహలన్నీ నిజమనుకుని బురద జల్లి తమ కుసంస్కారానికి రెక్కలిచ్చి సమాజంలో వదిలే బదులు, వారిద్దరి నడుమ ఉన్న ఆరోగ్యకరమైన పరిణత స్నేహం గురించి ప్రస్తావించుకోవటం ఉత్తమం.

ప్రతి స్త్రీ, పురుష స్నేహం లక్ష్యం లైంగికం కాదు. కొన్ని స్నేహాలు లింగ భేద భావాన్ని దాటి ఆత్మీయమైన ఆత్మిక బంధాలుగా ఎదుగుతాయి. అలాంటి సంబంధాలలో ఒకరినొకరు గౌరవించుకోవటం, అర్థం చేసుకోవటం ఉంటాయి తప్ప ఒకరినుంచి మరొకరు ఏదో ఆశించటం, ఆధిక్య భావనలు, లైంగిక ప్రచోదనల ప్రసక్తి ఉండదు. అలాంటి స్నేహ సంబంధం ప్రతి వ్యక్తి కల. కానీ కొందరు  అదృష్టవంతుల కలలే ఇలలో నిజమౌతాయి. మిగతా సంబంధాలన్నీ ఏదో ఒక దశలో భౌతిక స్థాయికి దిగజారతాయి. లేకపోతే సమాజం వాటిని పాడుచేస్తుంది. దాంతో ఆ సంబంధాలు దెబ్బతింటాయి. కానీ లత, రాజ్‌సింగ్ విషయంలో ఇద్దరూ సర్వ స్వతంత్రులు. తమకేం కావాలో స్పష్టంగా తెలుసుకొన్నవారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల పరిణత మనస్కులు. కాబట్టి ‘ఒక అద్భుతమైన ఆత్మిక భావనను ఆ భావనలాగే ఉండనివ్వాలి తప్ప ఏదో పేరుపెట్టి దాన్ని సామాన్య స్థాయికి దిగజార్చకూడదు’. ‘ప్యార్ కో ప్యార్ హి రహనేదో కొయీ నామ్ నదో’.

రాజ్‌సింగ్, లతల అనుబంధం ప్రస్తావన ఇంతటితో వదలి లత పాటల ప్రస్థానం, మారుతున్న పాటల ప్రపంచం వైపు దృష్టి మళ్ళించాల్సి ఉంటుంది. ఎందుకంటే 1990 దశకంలో, ఆర్థిక సంస్కరణలు అమలవటం ప్రారంభమైన తరువాత ప్రపంచీకరణ ఊపందుకుంది. దాని ప్రభావం భారతీయ సినీ సంగీత ప్రపంచంపై కూడా పడింది. ముఖ్యంగా ఎం.టివి వంటి సంగీత ఛానెళ్ళు అంతర్జాతీయ   పాటల వీడియోలను పరిచయం చేయటంతో వాటి ఆధారంగా తమ సృజనాత్మకతకు రంగులద్దుకోవటం ప్రారంభించారు భారతీయ కళాకారులు. దీన్లో ఉత్తర భారతదేశం ఇంకా పాకిస్తానీ పాటలు, గజళ్ళను కాపీ కొడుతూ మూస పాటలు సృజిస్తున్న సమయంలో దక్షిణ భారత కళాకారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పాశ్చాత్య సృజనాత్మకత ప్రభావంతో జోడించి నూతన పోకడలు పోయారు. సినీ సంగీత సృజనలో దేశంలోని అన్ని భాషల కళాకారులకు మార్గదర్శకులయ్యారు. చిన్న చిన్న దృశ్యాల ముక్కలను కట్ చేసి ఒకదాని వెంట ఒక దృశ్యం వేగంగా చూపటం ద్వారా అద్భుతమైన భావనలను కలిగిస్తూ, ప్రతి పాటనూ ఒక ప్రత్యేకమైన కథాత్మక దృశ్యంలా రూపొందించటానికి మణిరత్నం ‘రోజా’ సినిమాలో ‘చిన్న చిన్న ఆశ’ పాట ద్వారా శ్రీకారం చుట్టాడు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని  వాడుతూ సినీ పాటల స్వరూపాన్ని సంపూర్ణంగా రూపాంతరమొందించాడు రోజా సినిమా సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్.

ఎ.ఆర్. రెహమాన్ ఆగమనంతో గాయనీ గాయకుల ప్రాధాన్యం తగ్గింది. ఎ.ఆర్. రహమాన్‌కు స్వర మాధుర్యంతో పనిలేదు. దాంతో గతంలోలా పాట, పదాలు, నటీనటులు, సందర్భం, మూడ్ వంటివన్నీ అటకెక్కాయి. రిథమ్, బీట్, ఆర్కెస్ట్రా  వంటివి ప్రాధాన్యం వహించాయి. వీటికి తోడు మణిరత్నం, ఎం.టివిల ప్రభావంతో మ్యూజిక్ వీడీయోలు రంగ ప్రవేశం చేశాయి. అంటే గాయని స్టూడియోలో మైకు దగ్గర కదలకుండా నుంచుని పాడితే సరిపోదన్నమాట. ఇప్పుడు గాయనీ గాయకులు తెరపైకి రావాలి. నృత్యాలు చేయాలి. పాటలో భావాలు ప్రదర్శించాలి. ‘మైకేల్ జాక్సన్’ లా పాడుతూ ఆడాలి. ఆడుతూ పాడాలి. దాంతో గాయనీ గాయకులకు అందంగా కనిపించి, ఆడుతూ పాడాల్సిన అవసరం పడింది. ‘ఇండీపాప్’ అన్న పదం చలామణిలోకి వచ్చింది. షరోన్ ప్రభాకర్, అలిషా చినాయ్, అల్తాఫ్ రజా, దలేర్ మెహంది, లక్కీ అలీ, నజియా హసన్, జోయెబ్ హసన్ వంటివారి పాటల అమ్మకాలు సినీ పాటల అమ్మకాలను మించి సినీపాటల మనుగడను ప్రమాదంలోకి నెట్టేశాయి.  దాంతో సినిమా పాటలు పాడేవారికీ ఈ ట్రెండ్‍ను అనుసరించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ ట్రెండు వచ్చేసరికి లత వయస్సు అరవై దాటింది. అప్పటికే ఆమె స్వరంలో మాధుర్యం తగ్గటం ఆరంభమైంది. వయసు ప్రభావం స్వరంపై కనబడసాగింది. అప్పుడప్పుడు మోటుగా, బండగా ఆమె స్వరం ధ్వనించసాగింది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా కర్ణ కఠోరంగా అనిపించే పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, అందమైన గాయనిలతో పోటీపడుతూ మరో పదేళ్ళు లతా మంగేష్కర్ సినీ సంగీత ప్రపంచంపై తన ఆధిక్యాన్ని నిలుపుకుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here