దూర్ తుమ్ సే హోన జాయే, పాస్ ఆవో, గల్ సే లగాలో..
జతిన్ లలిత్ సంగీత దర్శక జంట బాణీని కూర్చిన ఈ యువ జంట ప్రేమ పాటను రాసింది ఆనంద్ బక్షి. ‘మొహబ్బతే’ (2001) సినిమా కోసం యుగళ గీతాన్ని పాడింది ఉదిత్ నారాయణ్, లతా మంగేష్కర్‍లు. ఈ పాట పాడే సమయానికి లత వయసు డైభై ఏళ్ల పైన. అయినా సరే, ఆమె వయసులో మూడువంతులు చిన్న అయిన నాయికలకు ఆమె స్వరాన్ని ప్రజలు స్వీకరించారు, ఆమోదించారు, ఆనందించారు. పాటను సూపర్ హిట్‍గా నిలిపారు. కానీ లత కెరీరును ఆరంభం నుంచీ గమనిస్తూ, ఆమె స్వర మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వస్తున్న అభిమానులు మాత్రం ఈ దశలో, అంటే , ముఖ్యంగా 1990 దశకంలో లత పాడిన కొన్ని పాటలు వింటూ ఇబ్బంది పడ్డారన్నమాట వాస్తవం. ‘లత పాటలు పాడటం మానేస్తే బాగుంటుందేమో ఇకపై’ అని భయం భయంగా మనసులో అనుకున్నారన్నమాట కూడా చేదు నిజం. సరస్వతీదేవి ప్రసాదంగా లభించిన శుద్ధ స్వరం, వయసు ప్రభావంతో దెబ్బ తినటాన్ని అర్ధంచేసుకుని, ఎక్కడా ఒక్క చిన్న పొరపాటు దొర్లటాన్నీ సహించని లత, దిగజారుతున్న స్వరంతో పాడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే కాలాన్ని బట్టి, వయసును బట్టి , వ్యక్తుల శరీరాల్లో మార్పులు వచ్చినట్టే, వారి స్వరాలు కూడా మారతాయి. లత ఇందుకు భిన్నం కాదు. అయితే నిబద్ధత, క్రమశిక్షణ, సాధన వంటి విషయాల ద్వారా ఆమె తన స్వరం చెందిన మార్పులను చాలా ఏళ్ళు కప్పి పుచ్చగలిగింది. అదిమి పట్టగలిగింది. అక్కడక్కడా హఠాత్తుగా మార్పు తాలూకు ఆనవాళ్ళు కనిపించినా అవి తాత్కాలికమే అన్న భావనను దీర్ఘకాలం కలిగించగలిగింది లత. కానీ కాలం ముందు ఎవ్వరూ నిలవలేరు. కాలం ప్రభావానికి ఎలాంటి వారైనా తలవంచక తప్పదు. 1987 నాటికే లత స్వరంలో మార్పులు బహిరంగమవ్వసాగాయి. అంతకుముందు కూడా మార్పులు తెలుస్తూన్నా, 1987నుంచీ పలు సందర్భాలలో లత స్వరంలో మార్పులు స్పష్టంగా తెలియసాగాయి.
‘చాంద్‌నీ’ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యి శ్రీదేవి కెరీరుకు ఊపునిచ్చాయి. అలాగే యువ గాయనిలు తెరపైకి వస్తున్నా లత ‘నాయికల అసలు స్వరం’ అన్న భావనను స్థిరపరిచాయి చాంద్‍నీ సినిమా పాటలు. కానీ చాంద్‌నీ పాటలలో లత స్వరంలో మునుపటి మాధుర్యం లేదు. స్నిగ్ధత్వం లేదు. మార్దవం లోపించింది. తీగలా వంగే గుణం తగ్గటం తెలిసింది. ‘మేరే హాథోమే నౌ నౌ చూడియాన్ హై’ పాట వింటుంటే తొలిసారిగా ‘లత ఇలాంటి పాటలు పాడకపోతే బాగుండేదేమో’ అనిపిస్తుంది. ఆ పాటలో మెలికలు తిరగాల్సిన చోట లత స్వరం భారంగా కదలటం తెలుస్తుంది. అయితే పాట హిట్ అయింది అన్నది వదిలేస్తే, లతకు సైతం ఈ పాట నచ్చలేదు అన్నది గమనించాల్సిన అంశం. ఈ పాట పాడే సమయంలో తనకు జ్వరంగా వుందని, యాష్ చోప్రా అత్యవసరం అనటంతో పాడేనని, తనకు సంతృప్తి కలగలేదని చెప్పినా, చోప్రాకు నచ్చింది, బాగావుందన్నాడనీ తరువాత ఇంటర్వ్యూల్లో లత చెప్పింది. ఈ పాటను సభలలో పాడేందుకు ఇష్టపడలేదు. పాడినా అతి అయిష్టంగా పాడింది. ఈ పాట గురించి ప్రస్తావించేందుకు కూడా ఆమె ఇష్టపడలేదు. కానీ లత దివ్య స్వరం కూడా కాల ప్రభావానికి గురి అవక తప్పదన్న విషాదాన్ని కలిగించే నిజాన్ని గ్రహింపుకు తెస్తుందీ పాట. అయితే చాందినీ తరువాత వచ్చిన ‘లేకిన్’, చాందినీ కన్నా ముందు వచ్చిన ‘రామ్ తేరీ గంగా మైలీ’ వంటి సినిమాల పాటలలో లత స్వరం తేనెలొలుకుతూ, మాధుర్యాన్ని చిలుకుతూ అలౌకికానందాన్ని కలిగించటాన్ని పరిగణనలోకి తీసుకుంటే, తన స్వరంపై నియంత్రణ సాధించి వయసు ప్రభావాన్నుంచి తప్పించుకుంటూ, ఆ ప్రభావం తన స్వరంపై పడకుండా లత ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో, ఎంత శ్రమ పడిందో ఊహించవచ్చు. అయితే 1980 దశకం చివర నుంచి లత కేవలం తన స్వరంపై వయసు ప్రభావం కనపడకుండా జాగ్రత్త చూసుకునే విషయమే కాదు. ఇంకా పలు అంశాలలో ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ప్రతిబంధకాలను దాటుకుంటూ ముందుకు సాగాల్సి వచ్చింది.
ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణల ప్రభావంతో సినిమాలతో సంబంధం లేని ప్రైవేట్ పాటల మ్యూజిక్ వీడియోలు తెరపైకి వచ్చాయి. ఈ వీడియోలన్నీ అధిక భాగం యువతను ఆకర్షించేవే. దాంతో మ్యూజిక్ వీడియోల సంగీతం ‘యువతరం సంగీతం’ అయింది. ఇది యువ గాయనీ గాయకులకు, ముఖ్యంగా అందంగా కనిపిస్తూ, ఆడి పాడగలిగే యువతీ యువకులకు అవకాశాల ద్వారాలు తెరిచింది. దాంతో కొన్నాళ్ళు ‘ఇండిపాప్’ సినీ సంగీతాన్ని వెనక్కి నెట్టి మరీ
‘లేకిన్’ సినిమాతో ఏ యువ గాయని ఎన్ని హిట్ పాటలు పాడినా నాణ్యత విషయంలో, ప్రతిభ విషయంలో తన స్వరం దరిదాపులకు కూడా రాలేరన్న నిజాన్ని లత నిరూపించింది. 1992లో ‘శ్రద్ధాంజలి’ అన్న క్యాసెట్‍ను, తనపై ప్రభావం చూపించినవారు, తనతో కలసి పాడిన వారికి నీరాజనాలర్పిస్తూ విడుదల చేసింది లత, HMV వారితో కలసి. ఈ క్యాసెట్‍లో లత పంకజ్ మల్లిక్, సైగల్, కె. సి. డే వంటి వారి పాటలతో పాటు రఫీ, ముకేష్, కిషోర్ కుమార్, హేమంత్ కుమార్ పాటలు పాడింది. ‘Legend sings the legendary songs of legends’ గా పరిగణనకు గురైన ఈ క్యాసెట్ విపరీతంగా ప్రజాదరణ పొందింది. ఈ క్యాసెట్ రూపకల్పనలో అత్యుత్తమ విలువలు, ప్రామాణికాలు పాటించి, తన అత్యుత్తమ స్థాయిని మరోసారి చాటి చెప్పింది లత.
ఆరంభంలోనే తాను పాటలు పాడే గాయకుల గొప్పతనం వివరించింది. వారి స్వభావాన్ని గొప్పతనాన్ని వివరించింది.
అయితే ‘శ్రద్ధాంజలి’ క్యాసెట్‍ను కూడా లత విమర్శకులు వివాదాస్పదం చేశారు. లత స్వరం బాగా లేదన్నారు. ఒరిజినల్ పాటలను మరపింపచేయాలని లత ప్రయత్నిస్తోందని దూషించారు. ఆ మహా గాయకుల స్థాయి లతకు లేదన్నారు. ఆయా పాటలను లత పాడు చేసిందని ఆరోపించారు. అయితే ఇతరులు కవర్ వెర్షన్లు, రీమిక్స్‌లు చేసినప్పుడు నోరిప్పని వారంతా లత ‘శ్రద్ధాంజలి’ పాడగానే విమర్శలు గుప్పించటం, దూషించటం, ఆరోపణలు చేయటం, ‘శ్రద్ధాంజలి’ క్యాసెట్ ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుంది. అంతేకాదు అమ్మకాలలో, రీమిక్స్‌లు, కవర్ వెర్షన్‍లు డూప్లికేట్ పాటలను దాటి శ్రద్ధాంజలి దూసుకుపోవటం లత ఆధిక్యతను, స్వర ప్రతిభను మరోసారి స్పష్టం చేసింది.
1991లో జగజీత్ సింగ్‍తో కలసి ‘సజ్దా’ అనే గజల్ ఆల్బమ్‍లో పాడింది లత. జగజీత్ సింగ్, చిత్రసింగ్ భార్యాభర్తలు. ఎప్పటి నుంచో జగజీత్ సింగ్‌కు లతతో కలసి గజళ్ళు పాడాలని ఉండేది. కానీ అవకాశం దొరకలేదు. చివరికి 1991లో ఇద్దరూ కలసి పాడిన ‘సజ్దా’ పాటల ఆల్బమ్ విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఇది కూడా విమర్శలకు దారితీసింది. ఎప్పటి నుంచో జగ్జీత్ సింగ్, లతతో పాడాలనుకుంటున్నా అతని భార్య చిత్రసింగ్ అడ్డుపడిందనీ, ఇప్పుడు కూడా
‘గాయనీ గాయకులు మైకు వెనుక ఉండాలి తప్ప కెమెరా ముందుకు వచ్చి గెంతులు వేయాల్సిన అవసరం లేదు’ అన్న దాన్ని లత నమ్ముతుంది. అదీకాక అరవైయేళ్ళ వయసులో ఇరవై ఏళ్ల వయసు నాయికలకు స్వరం అయి వగలుపోగలదు, ప్రేమ చిలికించగలదు కానీ కెమెరా ముందుకు వచ్చి వీడియోల్లో యువ గాయనిల్లా పాడలేదు. అయినాసరే కొన్ని అభంగ్‍ల వీడీయో చిత్రీకరణలో పాల్గొంది లత. కానీ ఆమెకు అది నచ్చలేదు. అందుకని లత పాటలకు వీడియో ఆల్బమ్‍లు ఇతర యువ నటీనటులతో రూపొందించారు. కానీ ఆ వీడియోల రూపకల్పన తక్కువ స్థాయిలో ఉండి, అనౌచిత్యంగా, అసంబద్ధంగా ఉండటంతో పాటల కాసెట్లు అమ్ముడైపోయాయి. కానీ వీడియోలకు ఆదరణ లభించలేదు. ‘పాయోజీ మై నె రామ్ రతన్ ధన్ పాయో’, ‘ఠుమక్ చలత్ రామ్‍చంద్ర్’ వంటి పాటల వీడియోలు చూస్తే, ఏ రకంగా వీడియోలు అసంబద్ధంగా, అనౌచిత్యంగా ఉన్నాయో తెలుస్తుంది. దాంతో లత, వీడియోల రూపకల్పనపై ఆసక్తి చూపలేదు.
సినిమా పాటలు తగ్గించుకుని, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చే ‘ఛారిటీ షో’లలో పాడుతూ, తనలోని ‘తృష్ణ’ను తీర్చుకునేందుకు ప్రైవేట్ ఆల్బమ్‍లు పాడుతూ, ఏ నిర్మాత అయినా అత్యంత ఒత్తిడి తెస్తే, లత పాడకపోతే సినిమా నిర్మాణం ఆపేస్తామని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తే తప్ప లత పాటలు పాడేందుకు ఇష్టపడలేదు. 1987 నుంచి 2000 సంవత్సరం నడుమ లత పాడిన పాటల గణాంక వివరాలను పరిశీలిస్తే, నెమ్మదిగా, లత పాటల సంఖ్యను తగ్గించుకోవటమే కాదు, సినీ పరిశ్రమ నుంచి క్రమేణా దూరమవటం తెలుస్తుంది. ఈ సమయంలో కూడా లత పాడిన పాటలు సూపర్ హిట్‍లు అయ్యాయి. సినిమాలు విజయవంతం అవటంలో ప్రధాన పాత్ర వహించాయి. కానీ, లత స్వరంలో తేడా స్పష్టంగా తెలుస్తుంది. ‘జియా జలే జాన్ జలే’ పాట సూపర్ హిట్. పాట పాడటంలో తాను ఇబ్బంది పడుతున్నట్టు తెలియకుండా లత ఎంత జాగ్రత్త పడ్డా, జాగ్రత్తగా గమనిస్తే, పాట బాణీ వంపులు తిరగటంలో, పాటలో పదాలు అందుకోవటంలో, ఎత్తుకోవటంలో లత శ్రమ పడటం తెలుస్తుంది. అలాగే ‘హమ్ ఆప్ కే హై కౌన్?’ సినిమా పాటలు ఎంతో హిట్ అయ్యాయి. కానీ ఆ పాటలలో కూడా లత స్వరం వయసు తొంగి చూడటం తెలుస్తుంది. ‘దీదీ తేర్ దేవర్ దీవానా’ పాటలో లత ఆయాసపడటం ఎంతో జాగ్రత్తగా గమనిస్తే తప్పించి గ్రహించలేము. అంత గొప్పగా లత పాడింది. కానీ గమనిస్తే తెలిసిపోయే రీతిలో పాడటం కూడా లత స్థాయి కాదు. అందుకే ముఖ్యంగా 1995 తరువాత తన తల్లి మరణం తరువాత తాబేలు తన అంగాలు తనలో ముడుచుకున్నట్టు, లత సినీరంగం వదలి ముడుచుకుపోవటం గమనించవచ్చు.
1987 నుండి 2000 నడుమ లత పాడిన సినిమా పాటలు
సినిమాలు | మొత్తం పాటలు | సోలోలు | యుగళ | |
1987 | 12 | 44 | 22 | 22 |
1988 | 21 | 43 | 24 | 19 |
1989 | 19 | 38 | 20 | 18 |
1990 | 9 | 12 | 3 | 9 |
1991 | 16 | 57 | 35 | 22 |
1992 | 12 | 25 | 12 | 13 |
1993 | 14 | 49 | 22 | 27 |
1994 | 12 | 39 | 9 | 30 |
1995 | 4 | 8 | 3 | 5 |
1996 | 5 | 14 | 7 | 7 |
1997 | 5 | 21 | 2 | 19 |
1998 | 3 | 11 | 3 | 8 |
1999 | 7 | 14 | 6 | 8 |
2000 | 2 | 5 | 1 | 4 |
1995 తరువాత లత పాటలు పాడిన సినిమాల సంఖ్య పది కూడా దాటలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ స్థాయిలో లత పాటలు పాడటం తగ్గించి వేసిందో. రాజశ్రీ నిర్మాణ సంస్థ చిత్రాలు, యాష్ చోప్రా సినిమాలకు, గుల్జార్‍కు అధికంగా పాడింది ఈ కాలంలో. ఈ గణాంక వివరాలు మరో విషయాన్ని స్పష్టం చేస్తాయి. లత సోలో పాటల సంఖ్య క్రమంగా తగ్గుతూండటం తెలుస్తుంది. ఒకప్పుడు సోలోలే అధికంగా పాడే లత ఇప్పుడు యుగళ గీతాలు అధికంగా పాడటం గమనించవచ్చు. ముఖ్యంగా 1995 తరువాత యుగళ గీతాలే అధికంగా ఉండటం తెలుస్తుంది. ఈ సమయంలో ఉదిత్ నారాయణ్, లతతో చక్కని యుగళ గీతాలు పాడేడు.
1995-96 వచ్చేసరికి అనురాధ పౌడ్వాల్ సినిమా పాటలు పాడటం మానేసింది. అల్కా యాగ్నిక్, కవితా కృష్ణమూర్తి వంటి వారు అధిక ప్రాచుర్యం పొందారు. ఈలోగా సునిధి చౌహాన్ (1996) రంగప్రవేశం చేసింది. ఇలా యువ గాయనిలు సినీ పాటల ప్రపంచంలో అడుగిడి తమ ప్రతిభ ప్రదర్శనతో ప్రజాదరణ పొందుతున్న సమయంలో లత తక్కువ సంఖ్యలో పాటలు పాడినా, పాడిన పాటలు సూపర్ హిట్ పాటలుగా నిలిచాయి. లత డిమాండ్‍ను పెంచాయి. కానీ లత ఎలాంటి ప్రలోభంలో పడలేదు. తాను కాదనలేని వారికి మాత్రం పాడింది. 1995లో ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ పాటలు ప్రజలను ఉర్రూతలూపాయి. ‘కాజోల్’ కు పాడిన ‘మేరే ఖ్వాబోమ్ జో ఆయే’ ప్రజాదరణ పొందింది.
1996లో ‘మాచిస్’ సినిమా పాటలు సూపర్ హిట్ పాటలుగా నిలిచాయి. 1997లో ‘దిల్ తో పాగల్ హై’లో ఉదిత్ నారాయణ్‍తో పాడిన యుగళ గీతాలు దేశాన్ని ఒక ఊపు ఊపాయి. కానీ లత స్వరంలో మాధుర్యం, ఫ్లెక్సిబిలిటిలు తగ్గటం స్పష్టంగా తెలిసిందీ పాటలలో. ముఖ్యంగా ఉదిత్ నారాయణ్ శక్తివంతమైన స్వరం ముందు లత స్వరం వయసు మరింత ప్రస్ఫుటం అయింది. ఈ సినిమాలో లత తొమ్మిది యుగళ గీతాలు పాడింది ఉదిత్‍తో కలసి. 1998లో ‘దిల్ సే’ లో ‘జియా జలే’ పాట ప్రీతిజింటా కెరీర్‍కు ఊపునిచ్చింది. దుష్మన్, జబ్ ప్యార్ కిసీసే హోతా హై, సినిమా పాటలలో కాజోల్ స్వరంగా నిలిచింది లత. ఈ సినిమాల్లో పాటలు సూపర్ హిట్లయ్యాయి. 1999లో ‘హుతుతు’, ‘కచ్చే ధాగే’ సినిమాల్లో లత పాటలు హిట్ అయ్యాయి. గుల్జార్ దర్శకత్వం వహించిన చివరి సినిమా హుతుతు. ఆ తరువాత గేయ రచయితగా పనిచేశాడు, అధికంగా విశాల్ భరద్వాజ్ సంగీత దర్శకుడిగా. విశాల్ భరద్వాజ్ సినిమాల్లో కూడా లత ఇష్టంగా పాడింది. 2000 సంవత్సరంలో లత ‘మొహబ్బతే’ సినిమాలో పాడిన పాటలు కూడా హిట్ అయ్యాయి. ఈ సంవత్సరం వినిపించిన అయిదు లత పాటల్లో నాలుగు యుగళ గీతాలు ‘మొహబ్బతే’ సినిమాలోవే. అంటే ఇంతకాలం లత విమర్శకులు, లత నెంబర్ వన్ స్థానాన్ని పట్టుకుని వ్రేలాడింది, ఇతరులను రానీయలేదు, వారి కెరీర్లను దెబ్బ తీసిందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారో, అవన్నీ తప్పని లత ఎవరినీ తనతోనే పాడించాలని నిర్దేశించి, నిర్బంధం విధించలేదన్నది స్పష్టమయింది. లత గొంతు మారింది. పాటలు పాడటం దాదాపుగా మానేసింది. కొత్త కొత్త గాయనిలు తెరపైకి వస్తున్నారు. హిట్ పాటలు పాడుతున్నారు. అయినా సరే లతతోనే పాటలు పాడించాలని కొందరు పట్టుదల ప్రదర్శించారు. ఎంత వారించినా, వారు తమ సినిమాల్లో కనీసం ఒక్క పాటయినా లత పాట ఉండటాన్ని గొప్పతనంగా భావించారు. గమనిస్తే 1980 నుంచీ లత పద్ధతి ప్రకారం పాటలు తగ్గించుకుంటోంది. కానీ ఆమెతో పాటలు పాడించాలని ఉత్సాహం చూపే వారి సంఖ్య తగ్గలేదు. లతతో అధికంగా పాటలు పాడించి కెరీర్లు నిర్మించుకున్న సంగీత దర్శకుల తరం కనుమరుగైపోయింది. కొత్త తరం తెరపైకి వచ్చింది కానీ జతిన్ లలిత్, విశాల్ భరద్వాజ్, ఎ. ఆర్. రహమాన్ వంటివారు కనీసం ఒక్కపాట అయినా లతతో పాడించాలని తపన పడ్డారు. ఇది లత స్వర ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుంది. పాటలు పాడనని లత అన్నా పాడమని బలవంతం చేయటం నిర్దేశిస్తే జరిగేది కాదు. ఇది 2000 నుంచి 2022 నడుమ లత పాడిన పాటలను గమనిస్తే అర్థమవుతుంది. లత స్వరం పాడయింది. వయసు తెలుస్తోంది. మలుపులు మెలికలు తిరగలేకపోతోంది. అయినా, ఆమె స్వరానికి తగ్గట్టు పాటలను రూపొందించి, ఆమెతో పాటలు పాడించారు. ‘లగాన్’లో(2001) ‘ఓ పాలన్ హారే’ పాటను లతకోసం రూపొందించాడు ఏఆర్ రహెమాన్. ‘రంగ్ దే బసంతీ’ (2006) సినిమాలో ‘లుక్క ఛుప్పీ బహుత్ హూయీ’ పాటను లతతో కలసి పాడి ఎ. ఆర్. రెహమాన్ లతతో యుగళ గీతాన్ని పాడాలన్న కోరికను తీర్చుకున్నాడు.
2000 తరువాత లత పాటలు
సినిమాలు | పాటల సంఖ్య | సోలో | యుగళ గీతాలు | |
2001 | 6 | 12 | 6 | 6 |
2002 | 2 | 8 | 3 | 5 |
2003 | 0 | 0 | 0 | 0 |
2004 | 1 | 9 | 2 | 7 |
2005 | 3 | 4 | 3 | 1 |
2006 | 0 | 0 | 0 | 0 |
2007 | 1 | 1 | 0 | 1 |
2008 | 0 | 0 | 0 | 0 |
2009 | 1 | 1 | 1 | 0 |
2010 | 1 | 1 | 1 | 0 |
2011 | 1 | 1 | 1 | 0 |
2012 | 0 | 0 | 0 | 0 |
2013 | 0 | 0 | 0 | 0 |
2014 | 0 | 1 | 1 | 0 |
2015 | 1 | 1 | 1 | 0 |
2002 నుండి 2022 సంవత్సరాల నడుమ లత 44 పాటలు పాడింది. 2001లో లత పాడిన పాటల్లో ‘కభి ఖుషి కభి గమ్’, ‘లగాన్’, ‘జుబేదా’ సినిమాల్లో పాటలు హిట్ అయ్యాయి. ఈ సంవత్సరం లత పాడిన పన్నెండు పాటలలో ఆరు పాటలు ఎ.ఆర్. రెహమాన్ పాటలే! 2002లో లత రెండు సినిమాల్లో పాటలు పాడింది. వీటిల్లో ‘ముఝ్ సే దోస్తీ కరోగే’ సినిమాలో పాటలు ప్రజాదరణ పొందాయి. 2004లోని ‘వీర్ జారా’ సినిమా కేవలం లత పాటల కోసమే నిర్మించింది. సంగీత దర్శకుడు మదన మోహన్ టేపుల్లో లభించిన బాణీల ఆధారంగా రూపొందించిన పాటలతో సినిమాను తయారు చేశారు. తొమ్మిది పాటలు ఈ సినిమాలో లత పాడింది. పాటలన్నీ హిట్ అయ్యాయి. కానీ పాటలు పాడేందుకు లత కష్టపడటం, గొంతు సహకరించకపోవటం, స్వరాన్ని తీయగా, తీగలాగా ధ్వనించేందుకు చేసే ప్రయత్నంలో అప్పుడప్పుడు స్వరం కీచుగా, బండగా ధ్వనించటం ఈ పాటలలో తెలుస్తుంది. 2005లో పేజ్ 3లో పాట బాగా ప్రజాదరణ పొందింది. లత ఎలా పాడినా, పాడితే చాలు పాట హిట్ అన్న భావనను స్థిరపరచింది. 2006లో ‘రంగ్ దే బసంతి’ పాట సూపర్ హిట్ పాట. ‘వీర్ జారా’ కేవలం లత పాటల వల్ల హిట్ అయిన చివరి సినిమా.
1946లో ప్రారంభమైన పాటతో లత ప్రయాణం 2019లో స్వచ్ఛందంగా, ‘ఇదే చివరి పాట’ అని ప్రకటించటంతో ముగిసింది. 2022 ఫిబ్రవరి 6న లత శరీరం భౌతికంగా అదృశ్యం అయింది. కానీ గాయనిగా, తన స్వర మాధుర్యంతో సినీ గీతాలను ఉచ్చస్థాయికి చేర్చిన చివరి సినిమా ‘లేకిన్’. ఆ తరువాత హిట్ పాటలు పాడినా, ప్రజల అభిమానం సాధించినా, గాయనిగా లత కొత్తగా చేసింది, సాధించిందీ ఏమీ లేదు. సినిమాల్లో పాటల సందర్భాలు పరిమితమయిపోయి, నటీనటుల ఇమేజీకి తగ్గట్టు మాత్రమే పాటలుండే స్థితి రావాటంతో, ఇక తనతో కొత్తగా ఎవరూ ఏ ప్రయోగాలు చేయలేరన్న విషయం లత గ్రహించింది. లత స్థాయికి తగ్గ బాణీలను రూపొందించగలిగే సృజనాత్మకత ప్రదర్శించిన సంగీత దర్శకులులేరు. ఇది లతకు కూడా తెలుసు. అందుకే ‘లేకిన్’ సినిమాను స్వయంగా నిర్మించింది. ఇక తనలోని ప్రతిభను వెలికి తెచ్చేంత సృజనాత్మక ప్రతిభ ఉన్న కళాకారులు రావటం ‘అసంభవం’ అని లత గ్రహించింది. అందుకే అప్పటికే పాటలు తగ్గించుకుంటూ వస్తూన్నా ‘లేకిన్’ తరువాత ఇంకా తగ్గించేసింది. అయితే, 1995 తరువాత లత ప్రవర్తనలో ఒక మార్పు కొట్టచ్చినట్టు కనిపించింది.
ఆరంభం నుంచీ లత అంతగా ఇంటర్య్వూలు ఇచ్చేది కాదు. స్టేజీ షోలలో కూడా అంతగా మాట్లాడేది కాదు. చెప్పులు విడిచి స్టేజి ఎక్కేది. పాటను ప్రకటించగానే పాడేది. తాను పాడేపాటను స్వయంగా తానే రాసుకునేది. ఒక చేతిలో పుస్తకం ఉండేది. దృష్టి పుస్తకంపై ఉండేది. మనసు తాళంపై లగ్నమయ్యేది. అప్పుడప్పుడు చెయ్యి కదిలేది. తల కొద్దిగా కదిలేది అంతే. కానీ రాను రాను స్టేజీ మీద కాస్త మాట్లాడటం ప్రారంభించింది. 2001లో భారత రత్న అవార్డు లభించినప్పటి నుంచీ కొద్దిగా ఇంటర్వ్యూలు ఇవ్వటం ఆరంభించింది. ఇంటర్వ్యూలలో కూడా జాగ్రత్తగా మాట్లాడేది. ఇబ్బందికరమైన ప్రశ్నలను నవ్వుతో దాటవేసేది. ఎలాంటి వివాదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడేది. అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగానే ఇప్పుడు లత గురించి తెలుసుకోగలుగుతున్నాం. లేకపోతే లత గురించి ప్రచారంలో ఉన్న ఆరోపణలు, అపప్రధలు, గాలి వార్తల ఆధారంగానే లత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాల్సి వచ్చేది. ముఖ్యంగా లత మరణం తరువాత ఆమె గురించిన ఆరోపణలు వివాదాల గురించీ అందరూ అధికంగా ప్రస్తావించటం చూసిన తరువాత అసలు నిజాన్ని గ్రహించటంలో లత ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎంతగానో తోడ్పడ్డాయి. నస్రీన్ మున్ని కబీర్, యతీంద్ర మిశ్ర, హరీష్ భిమాని, మీనా మంగేష్కర్ వంటి వారు లత గురించిన విషయాలను గ్రంథస్థం చేయటం వల్ల లత వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని అంచనా వేసే వీలు చిక్కింది.
(ముగింపు వచ్చేవారం)