1977 సంవత్సరం నాటికి హిందీ సినీ సంగీతంలోంచి అధికశాతం మాధుర్యం ఆవిరైపోయింది. ఆకర్షణీయమైన బాణీలోకి ఒదిగే అర్థం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అనే పదాలతో కూడిన పాటలు సర్వ సాధారణమయ్యాయి. హమ్ కిసీ సే కమ్ నహీ, పర్వరిష్, అమర్ అక్బర్ ఆంథీనీ, ధరమ్ వీర్, ఆప్ కీ ఖాతిర్ వంటి సినిమాల నడుమ అమితాబ్ నటించిన ‘ఆలాప్’ సినిమా విడుదలైంది. విఫలమయ్యింది. జయదేవ్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు చెవులకు ఇంపుగా, మనసుకు మధురంగా ఉండి అలౌకికానందాన్ని కలిగిస్తాయి. ఆ సినిమాలోని పాటలన్నిటికీ తలమానిక మనదగినటువంటి సాంప్రదాయిక సరస్వతీ భజన గీతం ‘మాతా సరస్వతీ శారదా’. భైరవి రాగానికి పాఠం లాంటి ఈ పాటను సరస్వతీ స్వరూపమైన లతా మంగేష్కర్, దిల్‌రాజ్ కౌర్‍తో కలసి పాడింది. మామూలుగా సరస్వతీ ప్రార్థనలా అనిపించే ఈ భజనలోని పదాలు లత స్వరంలోంచి వెలువడుతూనే ఒక పవిత్రతను, అత్యద్భుతమైన శక్తిని ప్రదర్శిస్తాయి. మనసును ప్రశాంతంగా మలుస్తాయి. బుద్ధిని పవిత్రం చేస్తాయి. అలౌకికానందపు రహదారుల్లో, ధ్వని తరంగాల శృంగాలపై నడయాడుతూ ప్రయాణించేట్టు చేస్తాయి. సరస్వతీదేవి తన ప్రార్థన ఎలా చేయాలో నేర్పించేందుకు తన స్వరాన్ని లత ద్వారా ప్రతిధ్వనింపచేస్తున్నదన్న అద్భుతమైన భావనను కలిగిస్తుందీ గీతం.
కీజే సుదృష్టి, కీజే సుదృష్టి
సేవక్ జాన్ అప్‌నా, ఇత్‌నా వరదాన్ దీజే
తాన్, తాల్, ఔర్, ఆలాప్, బుద్ధి అలంకార్ శారదా
హే మాతా సరస్వతీ శారదా!
మమ్మల్ని నీ సేవకులుగా భావించి కరుణారస దృష్టి ప్రసరించు తల్లీ. శృతి, లయ, ఆలాపనలు, అలంకారాలు తప్పకుండా శుద్ధంగా ఉండేట్టు వరం ప్రసాదించు తల్లీ. సంగీతం నుంచి మరలని బుద్ధి జ్ఞానం ప్రసాదించు తల్లీ.. సరస్వతీ!
లతా మంగేష్కర్ జీవితం గమనిస్తే, ఆరంభం నుంచీ ఆమెకు సరస్వతీదేవి శృతి, లయ, ఆలాపన, అలంకారాలు నిరంతరం శుభ్రంగా, శుద్ధంగా ఉండే వరం ప్రసాదించిందన్న నమ్మకం కలుగుతుంది. అందుకే బడే గులాం ఆలీ ఖాన్, లత పాటలు వింటూ ఆనందంతో ‘ఖంబఖ్త్ బేసురీహీ నహీ హోతి’ అన్నాడు. లత స్వరం మారినా, వార్దక్య లక్షణాలు స్వరంలో దొర్లుతున్నా లత మాత్రం ఎన్నడూ శృతి తప్పలేదు. లయ తప్పలేదు. అందుకే లత మంగేష్కర్ సినీరంగంలో అడుగుపెట్టటంతోటే సినీ గీతాల బాణీల స్వరూపం సంపూర్ణంగా మారిపోయింది. పాటల్లో రాగాలు, అలంకారాలు, హై పిచ్ – లో పిచ్‍ల ఆటలన్నీ పెద్ద ఎత్తున ప్రవేశించాయి. అనేక ప్రతిభావంతులైన సంగీత దర్శకులకు తమ సృజనాత్మక ప్రతిభను విశృంఖలంగా ప్రదర్శించగల స్వేచ్ఛను లతా మంగేష్కర్ దివ్య స్వరం ప్రసాదించింది. అందుకే లతా మంగేష్కర్ ఏ ఒక్క సంగీత దర్శకుడికో, ఏ ఒక్క సినీ నిర్మాతకో, ఏ ఒక్క కళాకారుడికో పరిమితం కాలేదు. హిందీ సినీ ప్రపంచంలోని సృజనాత్మక సంగీత దర్శకులంతా ( ఓ.పి నయ్యర్ మినహా) లతా మంగేష్కర్ స్వరంతో తమ సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు. లత స్వరం అనంతమైన ఆకాశమైతే, ఆ అనంతాంబరంలో ఏయే కళాకారుడు ఎంతెంత స్థాయిలో తమ అత్యుత్తమ కళా ప్రదర్శన చేయగలడో, అంత అత్యుత్తమ కళా ప్రదర్శన కావించాడు.
తన సినీ సంగీత జీవితంలో లత మొత్తం 3766 సినిమాలలో 5243 పాటలు పాడింది. వీటిల్లో 3388 సోలోలు, 1854 యుగళ గీతాలు పాడింది. లతా మంగేష్కర్ తన సినీ సంగీత జీవితంలో అధిక సంఖ్యలో పాటలు, 664 లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వంలో పాడింది. శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో 457 పాటలు పాడింది. ఆర్డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో 332, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ సంగీత దర్శకత్వంలో 307, సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో 275, చిత్రగుప్తకు 239, మదన్ మోహన్‍కు 204, ఎస్డీ బర్మన్‍కు 179, నౌషాద్‍కు 146, రోషన్‍కు 144, హేమంత్ కుమార్‍కు 127, అనిల్ బిశ్వాస్‍కు 120, బప్పీ లహరితో 112, రాజేష్ రోషన్‍కు 111, సలిల్ చౌదరీకు 109, హుస్న్‌లాల్ భగత్‌రామ్‍లకు 108, వసంత్ దేశాయ్‍కు 104 పాటలు పాడింది. అంటే లత పాడిన 5243 పాటలలో ఈ 17 మంది సంగీత దర్శకులు మొత్తం 3742 పాటలు సృజించారు. అంటే లత పాడిన పాటలలో 71 శాతం పాటలు ఈ 17 మంది సంగీత దర్శకులు రూపొందించినవే. లతకు ఒకటి, రెండు పాటలు రూపొందించిన సంగీత దర్శకులు కూడా లత పాడిన ఆ పాటల వల్ల సినీ జగత్తులో ఈనాటికీ సజీవంగా వున్నారు.
లతా మంగేష్కర్ పలు విభిన్నమైన రకాల గీతాలు తన సినీ జీవితంలో పాడింది. శాస్త్రీయ రాగ ప్రధాన పాటలు, భజనలు ప్రధానంగా అత్యంత ప్రజాదరణ పొందిన గీతాలు. మన సినిమాలలో అధికంగా ప్రేమ గీతాలు, విరహ గీతాలు ఉంటాయి. కాబట్టి లత పాడిన అనేకానేక ప్రేమ గీతాలు, విరహ గీతాలు ఈనాటికీ ప్రజల గుండెల్లో మార్మ్రోగుతూ సాంత్వననిస్తున్నాయి. దేశభక్తి పాటలు కూడా అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇవి కాక లత ఇంకా అనేక విభిన్నమైన ప్రక్రియలలో పాటలు పాడింది.
హిందీ సినిమాలలో గర్బా నృత్యం ఆధారంగా రూపొందించిన తొలి పాట ‘కాన్‌హా బజాయే బన్సూరీ’. సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో లత పాడింది. ఈ పాట అత్యంత సుందరమైనది. ఈ పాట హిట్ అయిన తరువాత ‘గర్బా’ పాటలు హిందీ సినీ జగత్తులో సాధారణమైపోయాయి. అలాగే ‘సలిల్ చౌదరీ’ సంగీత దర్శకత్వంలో లత అద్భుతమైన జోల పాటలు పాడింది. అయితే జోల పాట అనగానే ఇప్పటికీ ‘అల్బేలా’ సినిమాలోని ‘ధీరేసే ఆజారి అఖియన్ మే’ పాట గుర్తుకు వస్తుంది ముందుగా. లత అధికంగా పాడని, పాడటానికి ఇష్టపడని గాన ప్రక్రియ ‘ముజ్రా’ గీతాలు. లత ముజ్రా గీతాలు పాడేందుకు ఓ పట్టాన ఒప్పుకునేది కాదు. ఆమెను ముజ్రా గీతాలు పాడేందుకు ఒప్పించటం కష్టం అయ్యేది. మొఘలు పాలన కాలంలో నవాబుల, ఆనందం కోసం నృత్యగత్తెలు పాడే పాటలను ‘ముజ్రా’లంటారు. అయితే ఇలాంటి ముజ్రాలు పాడేకన్నా ముందు లత, పాట సందర్భం తెలుసుకునేది. పాటలో పదాలు పరిశీలించేది. భావాన్ని గ్రహించేది. ఆ తరువాతనే తన ఆమోదం తెలిపేది. అలా ఆమె పాడిన కొన్ని ముజ్రాలు కూడా సూపర్ హిట్లయ్యాయి. ‘దేవదాసు’ సినిమాలో ‘ఆగే తేరీ మర్జీ’, ‘పాకీజా’ సినిమాలో ‘థాడే రహియో’, ‘మమతా’ సినిమాలో ‘చాహెతో మేరా జియా’ వంటి పాటలను అద్భుతంగా పాడింది లత. కేవలం ప్రేక్షకులను ఆకర్షించేందుకు సరైన సందర్భం లేకుండా, రెచ్చగొట్టే పదాలతో ఉండే ‘ముజ్రా’ పాటలను నిర్మొహమాటంగా తిరస్కరించేది లత. ‘బేనజీర్’ సినిమాలో ఎస్డీ బర్మన్ ‘బహరోం కీ మహఫిల్’ అనే ముజ్రాను గజల్ పంథాలో రూపొందించాడు. లతకు ‘ముజ్రాలు’ పాడటం ఇష్టం ఉండదు కాబట్టి మదన్ మోహన్ వంటి వారు నాయికలు వేశ్య గృహంలో పాడే పాటలను అత్యద్భుతమైన సాహిత్యంతో కూడిన గజళ్ళుగా మలచేవారు. ‘రహతే థే కభీ ఉన్‍కీ దిల్ మే’; ‘ఉన్ కో యే షికాయత్ హై’ వంటి పాటలు వేశ్య గృహంలో పాడే పాటలు. అలాగే పాకీజాలో ‘చల్తే చల్తే’ పాటను ఎవ్వరూ వేశ్య గృహంలో పాడే పాటగా పరిగణించరు. పాట వింటూ అలౌకిక ఆనందం పొందుతారు. ‘ఇన్హీ లోగోంకీ’ పాట కూడా అంతే. ఈ రకంగా తనకు అంతగా ఇష్టంలేని ‘ముజ్రా’ పాటలను కూడా అత్యద్భుతంగా పాడి ఆ పాటలకు అంటిన దురభిప్రాయాన్ని తొలగించి పరిశుద్ధ పరచింది లత స్వరం.
లతా మంగేష్కర్, ఆశాతో కలసి పాడిన తొలి యుగళ గీతం ‘దామన్’ అనే సినిమాలో 1951 సంవత్సరంలో ‘యే రుకీ రుకీ హవాయే’ అనే పాట. అయితే లతతో కలవటం ఆశా భోస్లే భర్తకు ఇష్టం ఉండేది కాదు. అందుకని ఆరంభంలో లత ఆశాలు కలసి తక్కువ సంఖ్యలో యుగళ గీతాలు పాడేరు. తరువాత కూడా ఆశా భోస్లే తనదంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన తరువాత కూడా అధికంగా కలసి పాడలేదు. అయితే, ఎప్పుడెప్పుడు ఇద్దరూ కలసి పాడినా ఒప్పందం ప్రకారం లత నాయికకు పాడటంతో ఇతరులకు ఆశా పాడేది. అందుకని లత, ఆశాలు కలసి పాడాల్సినన్ని పాటలు పాడలేదు. కానీ వారు పాడిన పాటలు మాత్రం మరపురానివి. శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో ‘మన్ భావన్ కే సింగ్’ (చోరీ చోరీ), ‘ఆజీ చలే ఆవో’ (హలామ్), ‘క్యాహువా’ (జిస్ దేశ్‍మే గంగా బహతీ హై), ‘నాచెరె మాన్ బతకమ్మా’ (రాజ్ కుమార్), ‘జబ్ సే లగీ తో సే నజరియా’ (షికారి), ‘కర్ గయా రే’ (బసంత్ బహార్), ‘యే బర్ఖాబహార్’ (మయూర్ పంఛ్), ‘ఆంఖో ఆంఖోమే’ (జాన్వర్) వంటి చక్కటి పాటలు పాడేరు లత, ఆశాలు.
సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో ‘ఓ చాంద్ జహా వో జాయే’ (శారదా), రోషన్ సంగీత దర్శకత్వంలో ‘సాజన్ సలోనా మాంగ్ లో’ (దూజ్ కా చాంద్), ‘పడ్ గయ్ ఝూలే’ (బహు బేగమ్), ‘సఖిరే సున్ బోలే ఏపిహో’ (మిస్ మేరీ); హేమంత్ కుమార్ సంగీత దర్శకత్వంలో పాడేరు లతా, ఆశాలు. ‘దో పూల్’ సినిమాలో వసంత్ దేశాయ్ రెండు యుగళ గీతాలు లత, ఆశాలతో పాడించాడు. ‘రూఠీ జాయేరే గుజరియా’, ‘బచ్‌పన్ కే తేరా మేరా ప్యార్’ అనే ఈ పాటలు ఇద్దరు పిల్లలపై చిత్రితమయ్యాయి. పిల్లవాడికి ఆశా స్వరం, బాలికకు లత స్వరం నేపథ్యంలో పాడుతుంది. లక్ష్మీ ప్యారేలు ‘ఆయే దిన్ బహార్ కే’ సినిమాలో ‘ఏయ్ కాష్ కిసీ దీవానే కో’ ను ఖవ్వాలీ తరహా బాణీలో లత, ఆశాలతో పాడించాడు. ‘మై తులసీ తేరే ఆంగన్ కీ’ సినిమాలో లత, ఆశాలు అమీర్ ఖుస్రో గీతం ‘ఛాప్ తిలక్’ పాటను అద్భుతంగా పాడేరు. ఈ పాట తాము పాడిన యుగళ గీతాలన్నిటిలోకీ తమకు ఇష్టమైనదని లతా, ఆశాలిద్దరూ పోటీపడి పాడేరు. ఆర్డీ బర్మన్ లత, ఆశాలతో ‘పడోసన్’ సినిమాలో ‘మై చలీ మై చలీ’; ‘సారే షహర్ మె ఏక్ హసీనా హై’ (ఆలీబాబా 40 చోర్) వంటి సినిమాలలో పాడించాడు. అయితే లత ఆశాలు పాడిన యుగళ గీతాలలో ‘జహాన్ ఆరా’ సినిమాలోని ‘జబ్ జబ్ తుమ్హే భులాయే’ పాట పరమాద్భుతమైనది. కానీ వారిద్దరూ కలసి పాడిన అతి క్లిష్టమైన పాట ‘సంగీత సామ్రాట్ తాన్‌సేన్’ సినిమాలో ఎస్. ఎన్. త్రిపాఠి రూపొందించిన ‘మేహా ఆలోరే’ అని లత ఆశాలిద్దరూ పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన శాస్త్రీయ సంగీత ఆధారిత గీతం ఇది. లతా, ఆశాలు మరాఠీలో ఒకే యుగళ గీతం పాడేరు. హృదయనాథ్ మంగేష్కర్ సంగీత దర్శకత్వంలో ‘అంత్ రీచ్ దివా’ అనే సినిమాలో ‘యేషిల్ కథ పర్తూన్ జీవ్లగ’ అనే పాటను అత్యద్భుతమైన యుగళ గీతంగా పరిగణిస్తారు.
లత ఆశాలు ఆరంభ దినాల్లో కలసి పాడకపోవటాన్ని కూడా కొందరు వివాదాస్పదం చేశారు. లతకు ఆశా అంటే పడదని, ఆమెతో పాడటం ఇష్టంలేదని వ్యాఖ్యానించారు. ఇద్దరూ కలసి పాడే సమయంలో లత కుడివైపు చూస్తే, ఆశా ఎడమవైపు చూస్తుందనీ, ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా పాడతారనీ కొందరు ప్రచారం చేశారు. కానీ, అలాంటిదేదీ లేదని వారిద్దరి రికార్డింగుల్లో పాల్గొన్నవారు చెప్తారు. పైగా వారిద్దరూ కలసి నవ్వుకుంటారని చెప్తారు. జిస్ దేశ్ మే గంగా బహెతీహై సినిమాలో ‘ఒ ముఝే క్యాహువా’ పాట తమకు నచ్చలేదనీ, సిల్లీగా అనిపించిందనీ, అందుకే బాగా నవ్వుకున్నామాపాటపాడే సమయంలో అని, లతా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. జర్నలిస్టులు కల్పించినంత పోటీ వారిద్దరినడుమలేదని లత, ఆశాలు సన్నిహితంగా తెలిసినవారంతా చెప్తారు. 1998లో సాయి పరాంజపే, ‘సజా’ అని ఓ సినిమా తీసింది. ఆ సినిమా లతా, ఆశాల నడుమ వున్న పోటీని ప్రతిబింబిస్తుందని అందరూ వ్యాఖ్యానించారు. ఎప్పటిలాగే , లత ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ, 2013లో ఆశాకు పండిత్ హృదయనాథ్ మంగేష్కర్ అవార్డును ప్రదానం చేసి తమ నడుమ ఎలాంటి వివాదాలులేవని నిరూపించింది. అంతేకాదు, ‘నా కన్నా ఎక్కువ వైవిధ్యంవున్న గాయని ఆశా’ అని ప్రకటించింది.
గీతాదత్‍తో లతకు వ్యక్తిగతంగా చక్కటి స్నేహం ఉండేది. ‘షహనాయి’ సినిమాలో సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో ‘జవానీ కి రైల్’ పాట ఇద్దరూ రఫీతో కలసి పాడేరు. వారిద్దరు కలసి పాడిన పాటల్లో ‘గూంజ్ ఉఠీ షహనాయి’ సినిమాలో ‘అఖియ భూల్ గయీ హై సోనా’ సూపర్ హిట్ పాట. ఈ పాటలో గీతాదత్ ఎంత ఉత్సాహంగా పాడుతుందో, లత అంత అమాయకంగా పాడుతుంది. ‘యహుదీ’లో ‘బేచైన్ దిల్ ఖోయీ సి నజర్’ మరో హిట్ యుగళగీతం. ఈ పాటలో లత, గీతాలిద్దరూ పోటీ పడిపాడటం కనిపిస్తుంది.
శంషాద్ బేగం సినీ సంగీత కెరీర్ దెబ్బతినటంలో దోహదపడిన ప్రధాన అంశం, లతతో శంషాద్ బేగం పాడిన యుగళ గీతాలు. ఈ యుగళ గీతాలలో శంషాద్ బేగం స్వరం మొరటుగా, లత స్వరం మృదువుగా, తీయగా ధ్వనించటంతో అతి సులువుగా లత ఆధిక్యాన్ని సాధించగలిగింది. మొరటుగా ధ్వనించే స్వరాన్ని నాయికలు ఇష్టపడలేదు. అంతవరకూ శంషాద్ బేగం పాటలకు నటించిన నాయికలు కూడా లతనే తమకు పాడాలని పట్టుబట్టారు. ‘అందాజ్’లో ‘డర్నా మొహబ్బత్ కర్లే’, ‘దీదార్’ లో ‘బచ్‌పన్ కే దిన్’, ‘బైజు బావరా’లో ‘దూర్ కోయీ గాయే’ వంటి పాటలు హిట్ పాటలు. ‘మొఘల్ -ఎ-ఆజమ్’ సినిమాలోని ఖవ్వాలీ ‘తేరీ మహఫిల్ ‘ లత పాడిన అరుదైన ఖవ్వాలీలలో ఒకటి. సూపర్ హిట్ పాట ఇది.
ఇంకా అమీర్‌బాయి కర్ణాటకితో ‘గోరె గోరె’ (సమాధి), కమల్ బారోత్‌తో ‘హస్తహువా నూరానీ చెహరా’ (పారస్మణి); ప్రేమలతతో ‘చుప్ చుప్ ఖడే హో’ (బడీ బహెన్) వంటివి లత పాడిన కొన్ని హిట్ యుగళ గీతాలు. ఇంకా సురయ్య, రాజ్ కుమారి, జోహ్రాబాయి, ముబారక్ బేగమ్ వంటి వారితో కూడా యుగళ గీతాలు పాడింది లతా మంగేష్కర్. ఉషా మంగేష్కర్‍తో కలసి పాడిన యుగళ గీతాలలో ‘అప్లమ్ చప్లమ్’ (ఆజాద్), ‘తుమ్ కో పియా దిల్ దియ’ (షికారి) వంటి యుగళ గీతాలు ఈనాటికీ శ్రోతలను అలరిస్తూన్నాయి. ఉషా మంగేష్కర్‍కు లత అంటే దైవం. అందుకని ఆమె వివాహం చేసుకోకుండా లతకు నీడలా ఉండిపోయింది. లత మరణం వల్ల ఒంటరిదైపోయింది. జీవితాంతం లతతో పాటు ఉంటూ ఆమె బాగోగులు చూడటమే లక్ష్యంగా బ్రతికింది ఉషా మంగేష్కర్. లతా మంగేష్కర్ మరణంతో ఉషా మంగేష్కర్ జీవితం లక్ష్యరహితం అయిపోయింది. ఇతరులందరికీ వారి వారి కుటుంబాలున్నాయి. కానీ ఉషా మంగేష్కర్ కుటుంబం లతా మంగేష్కర్ మాత్రమే. లత జీవించినంత కాలం సంగీతం తప్ప మరో విషయం వైపు దృష్టి పెట్టలేదు.
లతా మంగేష్కర్‍కు ‘ఠుమ్రీ’ పాటలంటే ఎంతో ఇష్టం. అందుకని సినిమాలలో ఠుమ్రీ పాటలు వచ్చినప్పుడు ఇష్టంగా పాడేది లత. ముఖ్యంగా ‘సయ్యా బినా ఘర్ సునా’ లాంటి ఠుమ్రీలను మనసుతో పాడింది. అయితే యుగళ గీతాలలో మహమ్మద్ రఫీతో పోటీ పడి పాడాల్సి వచ్చేది. అందుకే వారిద్దరి యుగళ గీతాలు ప్రత్యేకతతో ఉంటాయి. సాధారణంగా లత పాడిందంటే ఆమెతో పాడిన ఇతర గాయనీ గాయకులు ఎంతగా ప్రతిభావంతులైనా, ఎంత గొప్పగా పాడినా లత ఆధిక్యత స్పష్టంగా తెలిసేది. అయితే ‘టాండెమ్’ పాటలుగా ప్రసిద్ధి పొందిన పాటలలో మాత్రం గాయకుల ఆధిక్యం స్పష్టమవుతుంది.
‘టాండెమ్’ అంటే ఇద్దరు కలసి పనిచేయటం. ఇద్దరు సమన్వయం, సఖ్యత సాధించటం. సైకిళ్ళపై రెండు సీట్లలో ఇద్దరూ కూర్చుని సైకిల్‍ను కలసి తొక్కటం ‘టాండెమ్’ అంటారు. సినిమా పాటల సందర్భంలో ‘టాండెమ్’ పాటలంటే అర్థం వేరు. ఒకే పాటను గాయనీ గాయకులు వేర్వేరుగా పాడే పాటలను ‘టాండెమ్’ పాటలంటారు. అంటే గాయకుడు పాడిన బాణీలోనే గాయని కూడా పాడాలన్నమాట. ఇలాంటి ‘టాండెమ్’ పాటలు అధికంగా పాడటమే కాదు, కొన్ని సందర్భాలలో గాయకుడి పాట కన్నా లత పాడిన పాటనే అధికంగా ప్రజాదరణ పొందేట్టు పాడింది లత. టాండెమ్ పాటలలో గాయకుడికి ఒక సౌలభ్యం ఉంటుంది. గాయకుడు హీరోకి పాడతాడు. అందరి దృష్టి హీరోపై ఉంటుంది కాబట్టి గాయకుడి పాట, అదే బాణీలో ఉన్నా, గాయని పాటకన్నా అధికంగా ప్రజాదరణ పొందటం స్వాభావికం. అలాంటి పాటలలో కూడా లత, గాయకుడికి భిన్నంగా పాటను పాడి తన ప్రత్యేకతను చూపించింది. పదాల విరుపులో, విరామం ఇవ్వటంలో, రాగాలాపనలో గాయకుడికి భిన్నంగా పాడి, గాయకుడి పాట హిట్ అయినా, గాయని పాట ఏ మాత్రం తీసిపోని విధంగా పాడింది లత. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ముకేష్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ వంటి గాయకులు పాడిన పాటలను సినిమాలో మళ్ళీ లత పాడింది అధికంగా. వీరిలో కిషోర్ కుమార్, ముకేష్‍లు పాడిన పాటలు, లత స్వరంలో వింటే, లత ఎంత విభిన్నంగా పాడిందో బోధపడుతుంది. ముఖ్యంగా ‘మహబూబా’ సినిమాలో లత, కిషోర్‍లు విడివిడిగా పాడిన ‘మేరే నైనా సావన్ భాదో’ వింటే, లత ఎంత గొప్పగా పాడిందో తెలుస్తుంది. కిషోర్ కుమార్‍కు శాస్త్రీయ సంగీత గాన పద్ధతులు తెలియవు. కాబట్టి తన స్వర ప్రతిభతో పాటను అద్భుతంగా పాడేడు. లతకు శాస్త్రీయ సంగీతం తెలుసు. పాటలో అలంకారాలు పొందుపరచటం తెలుసు. అందుకని ఆరంభం ఆలాపన నుండి చివరి పదం వరకూ లత అత్యద్భుతంగా పాడిందీ పాట. సంగీతంతో ఏమాత్రం పరిచయం ఉన్న వారెవరైనా ఈ తేడాను సులభంగా గ్రహించగలుగుతారు. కిషోర్ కుమార్ సంగీత పరిజ్ఞాన రాహిత్యం , లత సంగీత ప్రతిభల నడుమ తేడా తెలుస్తుంది. ముకేష్ పాడిన ‘లౌట్ కె ఆజా మెరే మీత్’, ‘ముఝ్ కో ఇస్ రాత్ కి’, ‘రాత్ ఔర్ దిన్ దియా జలే’, ‘చందన్ స బదన్’, ‘కభీ కభీ మెరె దిల్ మే’ వంటి పాటలలో కూడా పాటలలో అలంకారాలు వేసి, గాయకుడి పాటకు భిన్నంగా తాను పాడే పాటను తీర్చిదిద్దటం తెలుస్తుంది. మహమ్మద్ రఫీకి శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం ఉంది. దాంతో లతతో సమానంగా పాటలో అలంకారాలు వేయగలడు. గాయకుడవటంతో హైపిచ్‍లో కూడా సులువుగా పాడగలడు. హైపిచ్‍కి వెళ్తే గాయని గొంతు కీచుగా ధ్వనిస్తుంది. అందుకని రఫీ, లతలు పాడిన అనేక ‘టాండెమ్’ పాటలలో రఫీ ఆధిక్యత స్పష్టంగా తెలుస్తుంది. రఫీకి భిన్నంగా ఎన్నిరకాలుగా లత పాడాలని ప్రయత్నించినా, హైపిచ్ దగ్గర రఫీ శిఖరం సులభంగా ఎక్కేస్తాడు. ఎహెసాన్ తెరా హోగా ముఝే పర్ (జంగ్లీ), జియా హో జియా కుఛ్ బోల్ దో (జబ్ ప్యార్ కిసీసే హోతా హై), ఓ మేరే షాహఖూబా (లవ్ ఇన్ టోక్యో), ‘మేరే మహబూబ్ తుఝే’ (మేరే మహబూబ్), ‘తేరీ ఆంఖోకే సివా’ (చరాగ్) లు; ‘తుమ్ ముఝే యూన్ భూలా నా పావోగే’ (పగ్లా కహీన్ కా) వంటి పాటలు ఎంత అద్భుతంగా పాడినా, రఫీ పాటకు భిన్నంగా ఎన్ని అలంకారాలు వేసినా, రఫీ పాటలు అధికంగా ప్రజాదరణ పొందాయి. కానీ ‘ఆజీ రూఠ్ కర్ అబ్’ (ఆర్జూ) పాటలో మాత్రం లతదే పైచేయి. పాట ఆరంభం నుంచీ లత అనేక చమత్కారాలు, అద్భుతాలు చేస్తుంది. హైపిచ్‍లో కూడా అలంకారాలు వేసి ఆశ్చర్య పరుస్తుంది. అయితే ఈ పాట రఫీ ఒకటే చరణం పాడతాడు. కానీ రాను రాను సినిమాల్లో ఇలాంటి టాండెమ్ పాటలు తగ్గిపోయాయి. లతతో పోటీ పడే గాయకుడు లేకపోవటం, సినిమాలలో అలాంటి సందర్భాలు తగ్గిపోవటం, నాయికల ప్రాధాన్యం దిగజారటం, సంగీత దర్శకులు మెలోడీ కన్నా హిట్ పాట సృజనకే ప్రాధాన్యం ఇవ్వటం వల్ల కూడా ‘టాండెమ్’ పాటలు సినిమాలలోంచి అదృశ్యం అయ్యాయి. 1970వ దశకంలో ‘సంజోగ్’ లో ముకేష్, లత ‘మేరి తమన్నా వోంకి తక్దీర్’, ‘ఫిర్ కభీ మిలోగీ’ లో ‘కహీన్ కర్తీ హోగీ’, ‘కభీ కభీ’ లో, ‘కభీ కభీ మేరే దిల్ మే’, బాలసుబ్రహ్మణ్యం, లతల ‘తేరే మేరే బీచ్ మే కైసా హై యే బంధన్ అంజానా’ (ఏక్ దూజే కే లియే), కిషోర్ కుమార్, లతలు చందా వో చందా( లాఖోన్ మే ఏక్), ‘జిందగీ ప్యార్ కా గీత్ హై (సౌతెన్), ‘హమే ఔర్ జీనేకీ’ (అగర్ తుమ్ న హోతే), ‘రింజిం గిరె సావన్’ (మంజిల్) వంటి పాటలు ప్రజాదరణ పొందాయి. కమలేష్ అవస్థి (ముకేష్ లా పాడతాడు) లతలు పాడిన ‘తెరా సాథ్ హై తో’ (ప్యాసా సావన్) హిట్ అయినా లత పాట ముందు కమలేష్ అవస్థి పాట తేలిపోవటం తెలుస్తుంది. అలాగే 1990 దశకంలో ‘మాయా మేమ్ సాబ్’ సినిమాలో కుమార్ సాను, లతల ‘ఏక్ హసీన్ నిగాహాకా’ పాటలు వింటే లత పాట విన్న తరువాత కుమార్ సాను పాట వినటం కష్టం అవుతుంది.
1990 దశకంలో లతను దాటిపోయే ప్రయత్నంలో అనురాధ పౌడ్వాల్ – కుమార్ సానుతో ‘టాండెమ్’ పాటలు పాడింది. అయితే ఈ పాటలు సరళమైన పాటలు, దాంతో గాయనీ గాయకుల పాటలు రెండూ సమానంగా ప్రజాదారణ పొందాయి. ‘సాసోంకీ జరూరత్ హై జైసే’ (ఆషికీ), ‘దిల్ హైకి మాన్‍తా నహీ’ (దిల్ హైకి మాన్‍తా నహి), ‘తుమ్హే అప్నా బనానేకీ కసమ్’ (సడక్), ‘బహూత్ ప్యార్ కర్తే హై’ (సాజన్) వంటి పాటలు శ్రోతలను ఉర్రూతలూపాయి. కానీ ఇప్పటికీ టాండెమ్ పాటలంటే అధికంగా రఫీ లతల పాటలే గుర్తుకు వస్తాయి. ఒకరితో ఒకరు పోటీపడి, ఎవరికెవరూ తీసిపోని రీతిలో ఇద్దరు అత్యంత ప్రతిభావంతులు పాడిన పాటలవి. ఒక చేయి వెనక్కి కట్టుకుని బాక్సింగ్ చేసినట్టు, లత గాయనిగా తన పరిమితులను అధిగమించి మరీ పాడిన పాటలు ‘టాండెమ్’ పాటలు. గీతాదత్, హేమంత్ కుమార్‍ల టాండెమ్ పాట ‘నయె చాంద్ హోగా’ (షర్త్); ఆశా, మహేంద్ర కపూర్‍ల పాట ‘దిల్ లగాకర్ హమ్ యే సమ్‍ఝే’ (జిందగీ ఔర్ మౌత్); హేమంత్ కుమార్, సుమన్ కళ్యాణ్‍పుర్‍లు పాడిన ‘న తుమ్ హమె జానో’ (బాత్ ఎక్ రాత్ కీ) వంటివి ఇతర గాయనీ గాయకుల హిట్ టాండెమ్ పాటలు.
ఈ సందర్భంలో ఒక ప్రత్యేక టాండెమ్ పాట గురించి చెప్పుకోవాలి. 1970 దశకం ఆరంభంలో వచ్చి ‘హరే రామ హరే కృష్ణ’ సినిమాలో లత, కిషోర్‍ల టాండెమ్ పాట ‘పూలోం కా తారోం కా’ సూపర్ హిట్ పాట. ఇందులో లత బాల దేవానంద్‍కు పాడుతుంది. అచ్చు చిన్నపిల్లలా, గొంతును మరింత తియ్యగా చేసి, పదాలు పట్టిపట్టి పలుకుతూ అద్భుతంగా పాడుతుంది లత. ఆమె పాట ముందు గంభీరంగా ఉండే కిషోర్ స్వరం మరింతగా ‘ఎలివేట్’ అవుతుంది.
లత పాటలు పాడటంలో అందరూ గమనించింది, పలువురు వ్యాఖ్యానించేది ఆమె కదలకుండా పాడటం, మైకు ముందు స్థిరంగా నిలుచుని, చేయి, తల మాత్రమే అవసరమైనప్పుడు మాత్రమే కదులుతూ, తన స్వరంతో నృత్యం చేయించే లత గాన సంవిధానం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే లత దృష్టిలో సంగీతం భగవంతుడిని గ్రహించి, మోక్షం పొందేందుకు ఒక మార్గం. అంటే పైకి వినిపించే స్వరం హృదయ లోలోతుల్లోంచి జనించాలి. తద్వారా హృదయంలో స్పందనలు కలగాలి. అది ఆత్మతో అనుభవించాలి. శరీరం కదలటం వల్ల ఆ అనుభూతి అదృశ్యం అవుతుంది. ఒక ఆధ్యాత్మిక అనుభూతి భౌతిక స్థాయిలోనే మిగులుతుంది. అందుకే లత పాడిన అధికమైన పాటలు మనసును ఊపుతాయి. లత పాడిన కొన్ని పాటలు వింటూంటే మనసు చైతన్యవంతమై రెక్కలు కట్టుకుని అంతరిక్షంలో విహరిస్తుంది. శరీరం చైతన్యంతో తొణికిసలాడుతూ కూడా కదలలేనంత సౌఖ్యాన్ని, ఆనందాన్ని అనుభవిస్తుంది.
‘తుమ్ క్యా జానో తుమ్హారి యాద్ మె’ (షిన్ షినాకీ బబ్లూ బూ), ‘సాజన్‍కీ గలియాన్ ఛోడ్ చలీ’ (బజార్), ‘చంద్రమా మద్ భరా’ (పట్రాణి), ‘యే జిందగీ ఉసీకి హై’ (అనార్కలి), ‘చుప్ గయ కోయీరే’ (చంపాకలి), ‘సారీ సారీ రాత్ తేరీ యాద్ సతాయే’ (ఆజ్ బస్ షుక్రియా), ‘చాంద్ ఫిర్ నిక్లా’ (పేయింగ్ గెస్ట్), ‘ఫైలి హూయీ హై సప్నోంకి బాహే’ (ఘర్ నెం 44), ‘ఓ బసంతీ పవన్ పాగల్’ (జిస్ దేశ్ మె గంగా బహతీ హై).. ఒకటా రెండా.. కొన్నివేల ఇలాంటి పాటలు, విభిన్నమైన భావాలను ప్రదర్శిస్తూ మనసును మురిపిస్తూ, ఆత్మను కదిలిస్తూ అనంతమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ పాటలకు శరీరం ఊగదు. మనసు సుందర సుదూర తీరాల్లో విహరించటం ఆపదు. అత్యంత అద్భుతమైన అనుభవం లతా పాటలు వినటం. ముఖ్యంగా లత, మదన్ మోహన్‍ల కలయికలోని పాటలు ‘లగ్ జా గలే’, ‘ఆప్ కీ నజ్రోం నే సమ్‍ఝూ’, ‘నైనోమే బద్‍రా ఛాయీ’, ‘తు జహా జహా చలేగా’, ‘వో జో మిల్తే థే కభీ’, ‘రుకే రుకే సె కదమ్’ వంటివి ఎన్నిమార్లు విన్నా అనుభూతి మరింత సాంద్రమై, చిక్కనౌతుంది తప్ప పలుచన కాదు. తన గానం ద్వారా తరతరాలకు ఇంత ఆనందాన్ని, సౌఖ్యాన్ని, సాంత్వనను ఇచ్చే లతా మంగేష్కర్ మౌలికంగా ఒంటరి. తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో తప్ప ఇంకెవరితోనూ అంతగా కలవలేదు. లత నివాసం బొంబాయిలోని ప్రభుకుంజ్‍లో. ఒక అంతస్తు మొత్తం లత కుటుంబ సభ్యులకు చెందింది. ఆ అంతస్తులో అయిదు ఫ్లాట్లు ఉంటాయి. లత సోదరి, సోదరులు, ఇతర బంధువులు వాటిల్లో ఉంటారు. లత ఏ విషయాన్నయినా సహిస్తుంది కానీ, తన కుటుంబ వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకున్నా, తన కుటుంబ సభ్యులను వివాదాలలోకి ఈడ్వాలని ప్రయత్నించినా సహించదు. ‘I can’t stand if people start ctriticising my family’ అని స్పష్టం చేసింది లత. అందుకే లత గురించి ఎన్ని వివాదాలు చెలరేగినా అవి లతకు పరిమితమయ్యాయి తప్ప కుటుంబ సభ్యులను తాకలేదు. అలాగే లతపై ఎన్ని వ్యాసాలు, పుస్తకాలు వచ్చినా అవి లతకు పరిమితమయ్యాయి తప్ప వాటిల్లో ఆమె కుటుంబ సభ్యుల వివరాలు కనబడవు.
లతకు దైవభక్తి అధికం. సాంప్రదాయమంటే గౌరవం. ‘ప్రభుకుంజ్’ లో మంగేష్కర్ కుటుంబం ఉండే అంతస్తులో ఒక్క గది మాత్రం లతా మంగేష్కర్‍ది. ఆమె గది చూస్తే ఆమె అన్ని రకాల భౌతిక సంబంధిత వ్యవహారాలను, సుఖాలను వదుల్చుకుని తనలో తాను ముడుచుకుపోతున్న భావన కలుగుతుందని ఆ గదిని దర్శించిన ఆంతరంగికులు అంటారు. ఆమె గదిలో సింహభాగం పూజగది ఆక్రమించుకుంటుంది. నియమం తప్పకుండా పూజ చేస్తుంది. అందుకే లత రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఎల్.కె. అద్వానీ రథయాత్ర చేపట్టినప్పుడు రథయాత్రకు సంబంధించిన పాట పాడింది. ‘రామ మందిర నిర్మాణం’ జరగటం నిశ్చయమని తెలియగానే హర్షం వ్యక్తం చేసింది. లతకు రాజకీయాలు నచ్చవు కానీ, పండిత జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, అటల్ బీహారీ వాజ్‍పేయి, నరేంద్ర మోడీ లంటే ఇష్టం. నరేంద్ర మోడీ దేశానికి మంచి చేస్తున్నాడన్న విశ్వాసాన్ని ఆమె పదే పదే ప్రకటించింది.
పాట తరువాత లతకు క్రికెట్ ప్రాణం. క్రికెట్‍లో సునీల్ గవాస్కర్ అన్నా, సచిన్ టెండూల్కర్ అన్నా లతకు ఇష్టం. క్రికెట్ ఆటను ఆమె ఎంతో ఏకాగ్రతతో చూస్తుంది. ఆటలో భారత్ ఓడిపోతే ఆమె మూడ్ పాడైపోతుంది. ఆ రోజు భోజనం చేయదు. అంతగా క్రికెట్ అంటే ఇష్టం ఆమెకు.
లతకు ప్రభుకుంజ్ ఇల్లు కాక ఇంకా మూడు ఇళ్ళున్నాయి. ‘పూనా’ నగరంలో ఒక ఫ్లాట్ ఉంది. ముంబాయి నుంచి విశ్రాంతి కావాలనిపించినప్పుడు ‘పూనా’ నగరంలోని ఫ్లాట్‍లో విశ్రాంతి తీసుకుంటుంది. ‘కోల్హాపూర్’లో కోట లాంటి తమ ఇంటిని లత అలాగే ఉంచింది. అక్కడ ఎలాంటి సేవకులు లేరు. కోల్హాపూర్ ప్రజలు స్వచ్ఛందంగా ఆ ఇంటిని శుభ్రపరుస్తారు. లత పట్ల కోల్హాపూర్ ప్రజల ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనం. కోల్హాపూర్ వెళ్తే వారాల తరబడి లత అక్కడే ఉండిపోతుంది. లతకు లండన్‍లో ఓ ఫ్లాట్ ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా లండన్ వెళ్తుంది లత. లత తల్లి మరణం తరువాత ఒక రకంగా లత, పద్ధతి ప్రకారం అన్ని వ్యవహారాలకూ దూరమయింది. విదేశాల్లో గాన సభలు మానేసింది. దేశంలో కూడా సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కోసం అవసరమైన నిధుల కోసం సంగీత కార్యక్రమాల్లో పాల్గొంది. సినిమా పాటలు తగ్గిపోయిన తరువాత ఆమె పాటలు నిత్యం వినిపిస్తున్నా, లత అంతగా బయటకు రావటం మానేసింది. 1999లో ఫిల్మ్‌ఫేర్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “మీరు సమయం ఎలా గడుపుతారు?” అన్న ప్రశ్నకు సమాధానంగా “పూజలో” అంది లత. “నేను మా కుల గురువు మంగేష్ (శివుడు) ను పూజిస్తాను. కృష్ణుడిని అధికంగా పూజిస్తాను. అందుకే మీరాబాయితో తన్మయం చెందుతాను” అంది లత.
లత మంగేష్కర్ అత్యంత సన్నిహితులుగా భావించే స్నేహితులు మంగళా షీరోడ్కర్, డాక్టర్ నళినీ మ్హాత్రే. డాక్టర్ నళిని కెనడాలో ఉంటుంది. “వీరిద్దరితో పాటు నా తల్లి నాకు అత్యంత సన్నిహితురాలైన స్నేహితురాలు” అంటుంది లత. వీరు ముగ్గురూ మరణించటంతో లత ఒంటరిదైపోయింది. ముఖ్యంగా తల్లి మరణం లతను తీవ్రంగా బాధించింది.
లతా మంగేష్కర్ అనుక్షణం తన తండ్రిని స్మరిస్తూంటుంది. తన స్వరం ద్వారా తండ్రి స్వరం ప్రకటితమౌతుందని విశ్వసిస్తుంది. అందుకే పాట పాడేముందు, అంత సవ్యంగా సాగాలని, తాను చక్కగా పాడాలని తండ్రిని ధ్యానిస్తుంది. పదమూడేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయి, ఇంటి బాధ్యతను బరువునెత్తుకున్న ఓ బాలిక కేవలం భగవదత్తమైన స్వరం తప్ప మరొక తోడులేని స్థితిలో, హిందీ సినీ ప్రపంచాన్నే కాదు, భారతీయ సంగీత ప్రపంచంతో పాటు, విశ్వ సంగీత ప్రపంచంలో కూడా తనదైన ప్రత్యేకతను నిలుపుకుని, ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో జీవికను సాగించి, సమస్త ప్రజల గౌరవాభిమానాలను, ఆదరణను పొందగలగటం సామాన్య విషయం కాదు. ప్రజల సుఖ దుఃఖాలలో భాగమై, నిరాశ, వేదనలలో కన్నీరు తుడిచి, ధైర్యం చెప్పి మార్గదర్శనం చేస్తూ భారతీయుల ‘దీదీ’గా, భారత రత్నగా ఎదగటం మామూలు విషయం కాదు. సరస్వతీ కటాక్షం లేనిదే ఇది సాధ్యం కాదు.
ఫిబ్రవరి 6, 2022న సరస్వతీ పూజ తరువాత రోజు, వసంత పంచమి జరుపుకున్న తరువాత లతా మంగేష్కర్ భౌతిక శరీరం వదలి వెళ్ళిపోయింది. ఒక కళాకారుడి అసలు మరణం అతని కళా స్రవంతి ఇంకిపోవటంతో సంభవిస్తుంది. కళను సృజించలేకపోవటాన్ని మించిన మరణం కళాకారుడికి మరొకటి లేదు. భౌతిక శరీరం నశించటం అన్నది ఒక ప్రాకృతిక చర్య తప్ప మరేమీ కాదు. అత్యద్భుతమయిన కళాప్రదర్శనకు ఒక మాధ్యమం మాత్రమే భౌతిక శరీరం. కాబట్టి కళాకారుడు భౌతిక శరీరం వదలి వెళ్ళినప్పుడు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఆ కళాకారుడు వదలి వెళ్ళిన కళను అనుభవిస్తూ, ఆనందిస్తూ, విశ్లేషిస్తూ, స్ఫూర్తిని పొందుతూ, ప్రేరణనిస్తూండటాన్ని మించిన ‘నీరాజనం’ మరొకటి లేదు. వ్యక్తిగా, కళాకారిణిగా లతా మంగేష్కర్ వ్యక్తిత్వాన్ని, కళను ప్రజలకు చేరువ చేయటమనే ఈ ప్రయత్నం లతకు ఒక సృజనాత్మక రచయితగా, సంగీతాభిమానిగా, లతా మంగేష్కర్ పాటల అభిమానిగా, లతలోని కళకు, ఆ కళను ప్రదర్శించేందుకు మాధ్యమంగా నిలిచిన వ్యక్తికి, వ్యక్తిత్వానికీ నీరాజనాలు అర్పించటం. లత పాడిన పాటలు వింటూ, అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తూ, లతా గీతామృతాన్ని పానంచేస్తూండటాన్ని మించిన నీరాజనం మరొకటిలేదు. కళాకారుడి శరీరం నశిస్తుంది కానీ, అతని కళ నిత్యం సజీవంగా వుంటుంది. సరస్వతీ మాత పాదంవద్ద సజీవపుష్పంగా పరిమళాలు వెదజల్లుతూంటుంది.