దునియామె హమ్ ఆయే హై తో జీనా హీ పడేగా
జీవన్ హై అగర్ జహర్ తో పీనా హీ పడేగా
[dropcap]’మ[/dropcap]దర్ ఇండియా’లోని అత్యద్భుతమైన, స్ఫూర్తివంతమైన, అర్థవంతమైన పాటలలో అగ్రస్థానం వహిస్తుందీ పాట. మామూలు పదాలతో అత్యంత లోతుగా భారతీయ సామాజిక మనస్తత్వాలలో ఇమిడి ఉన్న తాత్త్వికతను ప్రదర్శించిన అత్యద్భుతమైన గేయం ఇది. షకీల్ బదాయుని రచించగా నౌషద్ ఈ పాటకు బాణీని రూపొందించాడు. ఈ పాట సినిమాలో నర్గీస్, తానే నాగలి పట్టుకుని పొలం దున్నుతుంటే, ఇద్దరు చిన్నపిల్లలు ఆమెకు సహాయంగా నాగలి దిశను నిర్దేశిస్తూంటారు. పాట పాడుతూ, పాట ద్వారా తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ,
మాలిక్ హై తేరే సాథ్ న డర్ గమ్ సె తూ ఏయ్ దిల్
మెహనత్ కరె ఇన్సాన్ తో క్యా కామ్ హై ముష్కిల్
భగవంతుడిపై భారం వేసి ముందుకు సాగుతారు. ఈ పాటను లతతో పాటు ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్‌లు పాడేరు. ఈ పాట వింటుంటే దీనానాథ్ మరణం తరువాత, కుటుంబంతో లత బొంబాయి చేరి, బొంబాయి సినీ ప్రపంచంలో నిలదొక్కుకునే సమయంలో బహుశా ఇలాంటి ఆలోచనలే ఆమెకు ధైర్యం ఇచ్చి ఉంటాయేమో అనిపిస్తుంది. ! ఇలాంటి ఆలోచనలే ఈ పాటను పాడుతున్నప్పుడు ఆమె మదిలో జ్ఞాపకానికి వచ్చి ఆమె స్వరంలో పలుకుతున్న భావాలకు ఆర్థ్రతను అపాదించి ఉంటాయేమో! దేవుడు తన వెంట ఉన్నాడన్న నమ్మకంతో, కష్టపడిన వాడికి ఫలితం లభిస్తుందన్న విశ్వాసంతో, ప్రతి తిరస్కారాన్ని, ప్రతిబంధకాన్ని మరింత సాధనతో మరింత పట్టుదలతో ఎదుర్కొనే ధైర్యాన్ని సాధించిందేమో అనిపిస్తుంది. ఆమెను చులకన చేసినా, చదువు రాదని హేళన చేసినా, గొంతు పనికి రాదని తిరస్కరించినా, పాటలు పాడటం రాదని ఈసడించినా, ప్రతి తిరస్కారాన్ని భవిష్యత్తులో ఆమోదంగా రూపాంతరం చెందించగలనన్న ధైర్యంతో సాగేందుకు ప్రేరణ దైవంపై విశ్వాసం, విధిపై నమ్మకం కలిగించాయేమో!
గిర్ గిర్ కె ముసీబత్ మె సంభల్ తేహీ రహేంగే
జల్ జాయె మగర్ ఆగ్ పె చల్‌తే హీ రహేంగె
గమ్ జిస్‍నే దియె హై వహి గమ్ దూర్ కరేగా!
లత మంగేష్కర్ బొంబాయిలో, అడుగుపెట్టే సమయానికి ఆమె వయస్సు కేవలం పదమూడు! ఇంటి బాధ్యత మొత్తం ఆమెదే. ఆమెతో పాటు మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు. వారిలో ఆమె తల్లి, తల్లి చెల్లెలు తప్ప మిగతావారందరూ చిన్నపిల్లలే. కానీ ఇంటికి పెద్ద లత మంగేష్కర్. ఆమెకు చదువులేదు. ఒక్కరోజు పాఠశాలకు వెళ్ళి ‘శ్రీ గణేశాయ నమః’ రాసిన తరువాత రోజు నుంచీ పాఠశాల మొహం చూడలేదు. చెల్లెలు ఆశాను స్కూలుకు తీసుకురావద్దన్నందుకు మళ్ళీ స్కూలు మొహం చూడలేదు. అంత ఆత్మగౌరవం ఆ వయసులోనే ప్రదర్శించింది. అది నిర్మాణాత్మకమైన ఆత్మగౌరవమా, స్వీయ విధ్వంసకారిణి అయిన అహంకారమా? అన్నది ఆలోచించదగ్గ విషయం. కానీ జీవితాంతం లత పలు సందర్భాలలో ఇలాంటి ఆత్మగౌరవం ప్రదర్శించింది! ఎలాగైతే ‘దునియామె హమ్ ఆయాహై తో’ పాటలో లతతో గొంతు కలిపి, లత అన్న మాటలను తాము బుద్ధిగా అన్నారో, అలాగే నిజ జీవితంలో కూడా లత మంగేష్కర్ అడుగుతో అడుగు కలిపి నీడలా వెన్నంటి ఉన్నారు మీనా, ఉషా మంగేష్కర్ లు.
‘మా అక్కలో ఏదో ప్రత్యేకత ఉన్నదని మాకు చిన్నప్పుడు మేమంతా సంగీత సాధన చేసే సమయంలో తెలిసేది. అక్క స్వరంలో, పాట పాడే విధానంలో అందరి కన్నా భిన్నత్వం గోచరించేది’ అంటాడు హృదయనాథ్ మంగేష్కర్ బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ. అయితే తండ్రి మరణంతో లత ప్రత్యేకత పోయింది. విశాలమైన ప్రపంచంలో తనకన్నా శక్తివంతమైన స్వరాలతో, తనకన్నా అందమైన వ్యక్తులతో, అధిక విద్యావంతులతో, పెద్దపెద్ద వారితో సంబంధం, అనుబంధం ఉన్నవారితో, తనను ప్రత్యేకంగా కాక మామూలు మనిషిలా చూసే వారితో పైకి కనబడే ఆకారం, దుస్తుల ఆధారంగా అభిప్రాయాన్ని ఏర్పరచుకునేవారితో వ్యవహరిస్తూ , పోటీపడి, తన ప్రత్యేకతను నిరూపించుకోవాల్సిన అవసరం లతకు వచ్చింది. ఈ ప్రత్యేకత నిరూపించుకోవటం కూడా జీవిక కోసం పోరాటంలో భాగమవటం అత్యంత దురదృష్టం. ఎవరినైనా నిరాశా పాతాళంలోకి నెట్టివేసే పరిస్థితి ఇది.
లతకు మాస్టర్ వినాయక్ రావు కేవలం తన సినిమా కంపెనీలో ఉద్యోగం ఇవ్వటమే కాదు, దీనానాథ్ మంగేష్కర్‌తో ఉన్న అనుబంధం వల్ల ఆమె బాగోగులు చూసే సన్నిహిత బంధువులా వ్యవహరించాడు. ఆమెను సంగీత సాధన కొనసాగించమన్నాడు. గురువును చూపించటమే కాదు, గురువుకు చెల్లించాల్సిన ఫీజును కూడా ఆమెకిచ్చే జీతంలో భాగం చేశాడు. ఆమెను చదువుకోమన్నాడు. ముఖ్యంగా హిందీ భాషను నేర్చుకోమన్నాడు. మహారాష్ట్రలో భాగం అయినా బొంబాయి హిందీ సినిమాకు కేంద్రం. కాబట్టి బొంబాయిలో నెగ్గుకు రావాలంటే ‘హిందీ’ తప్పనిసరి అని ఆయన గ్రహించాడు. అయితే స్కూలుకు వెళ్ళి చదువుకునే వీలులేదు కాబట్టి లత ప్రైవేటుగానే హిందీ నేర్చుకుంది. అది లత జీవితంలో నిర్ణయాత్మకమైన సమయం. 1942 నుండి 1948 వరకు లత పడ్డ కష్టాలు, చేసిన సాధన ఆమె భవిష్యత్తుకు మార్గాన్ని ఏర్పాటు చేశాయి. ‘కష్టాన్నిచ్చినవాడే కష్టాన్ని తొలగిస్తాన్నట్టు’ ఒకటొకటిగా కష్టాలు తొలగిపోయాయి. లత పాడిన ‘ఎక్ ప్యార్ క నగ్మా హై’ పాటలోని ఓ చరణంలో పంక్తిలో అన్నట్టు
తూఫాన్ కొ అనాహై
ఆకర్ చలె జానా హై
బాదల్ హై యే కుఛ్ పల్ కా
ఛాకర్ ఢల్ జానా హై
పర్ఛాయియాన్ రహజాతీ
రహజాతీ నిషానీ హై…..
తుఫాను రావాలి. వస్తుంది. వచ్చి వెళ్ళిపోతుంది. ఆకాశంలో అలుముకున్న నల్లటి మేఘాలు కాసేపటి తరువాత తొలగిపోతాయి. కానీ ఆ తుఫాను తాలూకు అనుభవాలు, జ్ఞాపకాలు మిగిలిపోతాయి. అది మనసులో చేసిన గాయం తాలూకు అనుభూతుల చిహ్నాలు మిగిలిపోతాయి. ఈ ఆరేళ్ళ కాలంలో లత ఎదుర్కొన్న తుఫానులు, దట్టమైన నల్లటి మేఘాలు కలిగించిన భయాలు, వేదనలు ఆమె వ్యక్తిత్వాన్ని నిర్దేశించాయి. ఇది ఆ కాలంలో ఆమె అనుభవాలను తెలుసుకుంటే స్పష్టమవుతుంది.
దీనానాథ్ మరణంతో లత శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం ఆగిపోయింది. తండ్రి నేర్పించిన రాగాలనే ఆమె అధ్యయనం చేస్తూండేది. చదువు లేకపోవటంతో ‘పాట’ తప్ప మరో ఆధారం లేని పరిస్థితి. నటన ఇష్టంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తెరపై కనిపించింది తప్పించి ఆమెకు తెరపై కనబడటం కష్టంగా వుండేది. పైగా, నటించేప్పుడు పదిమంది దృష్టి తనపై వుండటం కూడా ఆమెకు ఇబ్బందిగా వుండేది. ఇది మాస్టర్ వినాయక్‍కు కూడా తెలుసు. అందుకని ఆయన లతను సంగీత సాధన కొనసాగించమని ‘ఉస్తాద్ అమాన్ అలీఖాన్ భేండీ బజార్ వాలే’ దగ్గర శిష్యురాలిగా పంపించాడు. ఆగష్టు 11, 1945న ఆమెను ఉస్తాద్ శిష్యురాలిగా స్వీకరించాడు. ఒక గురువు వద్ద శిష్యురాలిగా చేరటం అంటే గురువును సంపూర్ణంగా స్వీకరించటం, గురువు మాటను దైవాజ్ఞలా భావించటం. ముఖ్యంగా, ‘సంగీత దీక్ష’ స్వీకరించటం అంటే గురువు నేర్పిన గాన పద్ధతిని అనుసరించి మాత్రమే గానం చేయటం. దీన్ని ‘గండా బంధన దీక్ష’ అంటారు. 1945లో లత ఉస్తాద్ అమాన్ ఆలీఖాన్ భేండీ బజార్ వాలా నుంచి ‘గండా బంధన దీక్ష’ ను స్వీకరించింది. ఆయన ‘హంసధ్వని రాగం’తో శిక్షణ ఆరంభించాడు. అయితే లత అంతకు ముందే ఈ రాగం తండ్రి దగ్గర నేర్చుకుంది. సాధన చేసింది. దాంతో ఆమె త్వరగానే గురువు అభిమానం పొందింది. లత అతి త్వరగా విషయాన్ని గ్రహించటంతో ఉస్తాద్ ఆమెకు ఎంతో శ్రద్ధగా, ఆప్యాయంగా, తన్మయత్వంతో పాఠాలు చెప్పడం ప్రారంభించాడు.
ఆయన అప్పుడు చెప్పిన పాఠాలు లత మనసులో ఎంత లోతుగా నాటుకున్నాయంటే, ఇప్పటికీ ఆ పాఠాలు మరిచిపోలేదు. ఆ రాగాలు విన్నప్పుడల్లా ఆయన స్వరం తన చెవుల్లో ప్రతిధ్వనిస్తూందని లత ఇంటర్వ్యూలో చెప్పింది.
“ఆయన ‘విలంబిత లయలో’ ‘పతిదేవన్ మహాదేవన్’, ద్రుత్ లయలో ‘లాగీ లగన్ పతి సఖీ సంగ్’ అన్న ‘బందిష్’ లు నేర్పారు” అని చెప్పి పాడి చూపించింది లత. ఆ తరువాత ఆయన , యమన్, తోడీ వంటి రాగాలను నేర్పించాడు. లతను తన కూతురిలా చూసుకున్నాడు. ఆ కాలంలో లత, సన్నగా బలహీనంగా ఉండేది. భవిష్యత్తు పట్ల బెంగ ఓ వైపు బాధిస్తూంటే మరోవైపు ఆ చిన్న వయసులోనే ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాల్సి రావటంతో ఆమె శారీరకంగా, మానసికంగా అలసిపోయేది. అది గమనించిన ఉస్తాద్ ఆమె కోసం రొట్టెలు, ఆమ్లెట్‍లు తెచ్చేవాడు. ‘ఇవి తిన్న తరువాత పాఠం చెప్తాను. పాట పాడాలంటే బలం కావాలి’ అనేవాడు. దగ్గరుండి తినిపించేవాడు. రోజుకు కనీసం రెండుగంటలు పాఠం నడిచేది. ఉస్తాద్ అమాన్ ఆలీ ఖాన్ భేండీ బజార్ వాలా, బొంబాయి విడిచి తన స్వంత ఊరు వెళ్ళిపోయాడు. మళ్ళీ మాస్టర్ వినాయక్ ఉస్తాద్ అమానత్ ఖాన్ దేవాసవాలే అనే మరో గురువును కుదిర్చాడు. ఈయన సినిమావాళ్ళందరికీ సంగీతం నేర్పించాడు. ఈయన దగ్గర సంగీతం నేర్చుకున్న వారిలో నర్గీస్ తల్లి జడ్డన్ బాయి, నర్గీస్ కూడా ఉన్నారు. అయితే ఏదో పనిమీద ఇండోర్ వెళ్ళిన అమానత్ ఖాన్ మళ్ళీ బొంబాయి రాలేదు. దాంతో మళ్ళీ లత సంగీత అధ్యయనంలో విఘాతం ఏర్పడింది. వీరిద్దరూ అంటే, ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్ భేండీ బజార్ వాలా, ఉస్తాద్ అమానత్ ఖాన్ దేవా సవాలే లిద్దరూ బొంబాయిలో లతకు సంగీతం నేర్పిన గురువులు.
అమాన్ అలీఖాన్ స్వంత ఊరు వెళ్ళిపోవటంతో లత సంగీత విద్య మళ్ళీ వెనుకపడింది.
‘మా నాన్నగారి మరణం వల్ల నా జీవితంలో ఏ లోటు ఏర్పడిందో, ఆ లోటును నా జీవితంలో గురువులు పూడ్చారు. కానీ నా గురువులు నాకు దూరమైనప్పుడు కూడా నాకు నా తండ్రి దూరమైనంత వేదన కలిగింది’ అంటుంది లత. ఆ తరువాత మాస్టర్ వినాయక్ మరణంతో లతకు మళ్ళీ జీవిక కోసం పోరాటం ఆరంభించాల్సి వచ్చింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం కన్నా సినీ సంగీతం పాడే విధానం నేర్చుకోవాల్సి వచ్చింది.
లత సినీరంగంలో ప్రవేశం గురించి, నిలద్రొక్కుకోవటం గురించి చర్చించేకన్నా ముందు ఒక అప్రియమైన, కానీ ఆవశ్యకమైన విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆవశ్యకం ఎందుకంటే, లత మరణం తరువాత, తెలుగుతో సహా అన్ని భాషల మీడియాలు లత కళ కన్నా, ఆమె అధూరే ప్రేమ కథనాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. ఒక పేరున్న తెలుగు జర్నలిస్టు మామూలు ఇతర జర్నలిస్టులకన్నా ఒక అడుగుముందుకెళ్ళి, లేని ప్రేమగాథను ఊహించి, ఆమెకు అంటగట్టాడు. అత్యంత ఘోరము, దౌర్భాగ్యకరము, గర్హనీయమైన విషయము ఇది. భారతరత్న గురించి, సరస్వతీ దేవిగా భావించి గౌరవించే వ్యక్తి గురించి, ఒక పరమాద్భుతమైన గాయని, కొన్ని వేల సంవత్సరాలలో ఒక్కసారి అరుదుగా జన్మించే ప్రతిభావంతురాలైన గాయని మరణిస్తే, ఆమెకు నివాళిగా రాసిన రాతలు చదువుతుంటే తెలుగు జర్నలిజం ఏ స్థాయిలో ఉందో బాధ కన్నా ఆవేశం కలుగుతుంది. ‘కుదేందు తుషార హార ధవళ’ అని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ ఆమె పాటలు వినే అదృష్టం కలిగినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆమె ద్వారా ప్రకటితమైన సరస్వతీ స్వరూప ప్రతిబింబంలాంటి అద్వితీయము, అమోఘము, అలౌకికమైన కళను అనుభవించి, పలవరించి, ఆ కళలోని ఔన్నత్యాన్ని తమ కలం ద్వారా లక్షలాది మంది చదివి ఆనందించే పత్రికల ద్వారా విస్తరింపచేసే బదులు, శుభ్ర వస్త్రాన్విత అయి ఆకాశంలో ఉన్న ఆ కళాకారిణిపై అశుద్ధాన్ని విసరాలని ప్రయత్నించే నైచ్యం, దుర్మార్గం ప్రదర్శిస్తున్న జర్నలిస్టు రచయితల రాతలు చూస్తూంటే ప్రజలను ప్రభావితం చేయగల మేధావి వర్గంగా పరిగణనకు గురయ్యే మెదళ్ళ దౌష్ట్యం పట్ల పట్టరాని ఆవేశం కలుగుతుంది. ఆకాశ మార్గాన పయనించే రాయంచను మురికి కాలవలోకి లాగి పారేసి ఆనందించాలన్న వీరిని చూసి అసహ్యం కలుగుతుంది. ఒక మనిషి గురించి ఏమాత్రం తెలుసుకోకుండా, ఆ మనిషి ఔన్నత్యం, ఉత్తమత్వాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా ఎవరో ఏదో రాశారని పచ్చ కామెర్ల దృష్టితో అది నిజమనుకుని వ్యక్తి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, ఆ వ్యక్తి ‘ఇలాంటిదా?’ అని ఆమెని గౌరవించి, అభిమానించేవారు బాధపడేలా కొందరు రాస్తే, మరికొందరు మదోన్మత్తోన్మత్త దురూహశాలులు తామేదో ఊహించి, ఊహను నిజమని నమ్మి, చేతిలో పత్రికలో ఉంది, తానేం రాసినా పట్టించుకోని యాజమాన్యం ఉంది, ఏం రాసినా నమ్మే లక్షలాది పాఠకులున్నారు, ‘ఇదేమిటని’ అడిగేవారు లేరు, దేనికీ జవాబుదారీ లేదని, జర్నలిస్టులు తమకు తోచిన వారితో ,లత కు లేని ప్రేమ కలాపాలు ఊహించి రాసేసి, ఉన్నత వ్యక్తిపై, అత్యుత్తమ కళాకారిణిపై, భారతరత్నపై, సరస్వతీదేవి స్వరూపంపై బురద జల్లుతున్నారు. అమాయకులు ఇది చదివి ‘లత మంగేష్కర్ ఇలాంటిదా?’ అని ఆశ్చర్యపోయి బాధపడుతున్నారు. ఇందుకు ఉదాహరణలు ‘సాక్షి’ దినపత్రికలో లతకు నివాళిగా రాసిన వ్యాసంలోని బాక్స్ ఐటమ్, స్వాతి మాసపత్రికలో లతకు శ్రద్ధాంజలి అర్పిస్తూ వ్రాసిన వ్యాసంలోని ఓ పేరా. కనీసం స్వాతిలో రాసినవి గతంలో ఎందరో ప్రస్తావించినవి. అయితే కిశోర్ కుమార్ సంఘటనను ప్రేమకథల్లో రాయటం, రచయిత అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తుంది. కిషోర్ ఆమెకు భయ్యా . కిషోర్ దా!!!
‘సాక్షి’ వ్యాసంలో ‘లత మంగేష్కర్ – సి. రామచంద్ర, రాజ్ సింగ్ దుంగార్పూర్, సాహిర్ లూథియాన్వీలు సన్నిహితులు’ అంటూ లాహోర్‍కు చెందిన అద్భుత గాయకుడు సలామత్ అలీఖాన్ ప్రస్తావన చేశారు. “ఆయన గానం ఆమెకు వెర్రి. పెళ్ళి ఆలోచన వరకూ వెళ్ళింది” అని రాస్తూ సలామత్ ఖాన్‍కు అప్పటికే పెళ్ళి అయింది. పిల్లలున్నారు. పైగా దేశవిభజన గాయాలు తాజాగా ఉన్నాయి. హిందూ, ముస్లిం వివాహం వల్ల గొడవలవుతాయని సలామత్ అలీఖాన్ పాపం వెనక్కు తగ్గాడని అద్భుతంగా ఊహించి, లేనిది సృష్టించి, ఓ ఎద కరిగే ప్రేమ కథను అత్యంత సృజనాత్మకంగా రాశాడు బాక్స్ ఐటమ్ రచయిత.
ఇది లక్షలాది మంది పాఠకులు చదివేరు. చదివిన వారిలో అధికులకు లత గురించి తెలియదు. ఆమె పాట గురించి తెలుసు. కానీ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల దిగజారుడు ప్రవర్తనను సులభంగా నమ్ముతారు. ఇది చదివి ఎందరు సంతోషంగా ‘లత కూడా’ అనుకుని బుగ్గలు నొక్కుకున్నారో. అందరికీ ఇంత ఆనందం కలిగించిన ఆ జర్నలిస్టోత్తమత్త చిత్తుడికి, దాన్ని ప్రచురించిన సాక్షి పత్రిక సంపాదక వర్గానికి, యాజమాన్యానికి, లేని ‘ప్రేమగాథ’ను సృష్టించినందుకు ఉత్తమ సృజనాత్మక ఫాల్స్ స్కూప్ జర్నలిజం అవార్టులివ్వాల్సి ఉంటుంది. ఇది తెలుగులో రాశారు కాబట్టి ఎవ్వరూ నోరు మెదపటం లేదు. ఇదే ఇతర ఏ భాషలో రాసినా ఆ పత్రిక యాజమాన్యంతో బహిరంగంగా క్షమార్పణలు చెప్పించేవారు. మరోసారి ఇలాంటి రాతలు రాయకుండా చూసేవారు.
ఇంతకీ ఎవరీ సలామత్ ఖాన్? లత అతని దగ్గర పాట నేర్చుకుని అతని పాటకు వెర్రి అయి పెళ్ళి చేసుకోవాలనిపించేంత అద్భుతమైన గాయకుడు ఎవరు? పాఠకులను నమ్మించేందుకు సలామత్ అలీఖాన్ బొమ్మ కూడా వేశారు.
ఇంతకీ ఎవరీ సలామత్ అలీఖాన్? ఈయన లతకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పాఠాలు నేర్పించాడని పరిశోధిస్తే, లత ఏ ఇంటర్వ్యూలో కూడా ఇతని ప్రసక్తి కనబడదు. ఆమె ప్రస్తావించిన ఇద్దరు ఉస్తాద్‍ల గురించి మనం తెలుసుకున్నాం. ఇద్దరూ ఆమెపై పుత్రిక వాత్సల్యం కనపరిచారు. వారిద్దరూ దూరమైనప్పుడు తన తండ్రి దూరమైనంతగా బాధపడ్డానని లత పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. లత గురువుల గురించి పలువురు పలు పరిశోధనలు చేశారు. లత గురించి తెలుసుకోవాలంటే. లత పాట గురించి తెలుసుకోవాలంటే లత పాటను అర్థం చేసుకోవాలంటే ఆమె గురువుల గురించి తెలుసుకోవటం తప్పనిసరి. ఎందుకంటే Lata’s gurus are suggestive of what she brought into her singing in a totally different genre – that of film song (Hindi film song, music beyond boundaries by Ashok Da. Ranade, page no 403). లత తండ్రి దగ్గర హిందుస్తానీ సంగీతంలో పాటియాలా ఘరానా గానంలోని మెరుపులు, విరుపులు, చమక్కులు నేర్చుకుంది. అమాన్ అలీఖాన్ భేండీ బజార్ వాలా దగ్గర భేండీ బజార్ ఘరానాలోని నృత్యగీతం లాంటి గాన పద్ధతి, పదాల విరుపుల గాన పద్ధతిని నేర్చుకుంది. వీటన్నిటికీ తనదైన సృజనాత్మకతను జోడించి ప్రత్యేక గాన శైలిని ఏర్పాటు చేసుకుంది. కాబట్టి, లత గాన సంవిధానాన్ని అర్థం చేసుకోవాలంటే ఆమెపై ఆమె గురువుల ప్రభావం విశ్లేషించటం తప్పనిసరి. అందుకని ఆమెకు సంగీతం నేర్పిన గురువులందరి గురించి పలు పరిశోధనలు జరిగాయి.
మాస్టర్ వినాయక్ మరణం తరువాత లత కొన్నాళ్ళు పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ బడేగులామ్ అలీఖాన్ శిష్యుడు పండిత తులసీశర్మ వద్ద శిష్యరికం చేసింది. ఆమెకు గులామ్ హైదర్ నుంచి అనిల్ బిశ్వాస్, శంకర్ జైకిషన్, ఎస్.డి. బర్మన్ వరకు ఎందరో సంగీత దర్శకులు పాటలు పాడటం నేర్పించారు. ముఖ్యంగా హుస్న్ లాల్ భగత్ రామ్ సంగీత జంటలో హుస్న్ లాల్ లతకు ప్రత్యేకంగా, పాట పాడే విధానం నేర్పించాడు. రోజూ ఉదయం నాలుగు నుంచి ఆరువరకు ఆయన ఇంటికి వెళ్ళి సంగీత సాధన చేసింది లత. ఆమెపట్ల హుస్న్ లాల్ చూపిస్తున్న శ్రద్ధ నచ్చక హుస్న్ లాల్ భార్య అభ్యంతరం వ్యక్తం చేస్తే, హుస్న్ లాల్ లతకు పాట నేర్పటం మానేశాడు. అంతేకాదు లత పాటలు రికార్డు కూడా తన బదులు భగత్‍రాం తో చేయించాడు. దీన్ని అవమానంగా, తన వ్యక్తిత్వంపై మచ్చలా భావించిన లత తరువాత హుస్న్ లాల్ భగత్ రామ్‍లకు పాడటం తగ్గించింది. కొన్నేళ్ళ తరువాత, తమ అసిస్టెంట్లుగా ఆరంభించి అగ్రశ్రేణి సంగీత దర్శకులైన శంకర్ జైకిషన్‍ల వద్ద వాయిద్యకారులుగా పనిచేసే స్థితికి దిగజారారు హుస్న్ లాల్, భగత్ రామ్‍లు. అంటే, ఒకరు తన ప్రవర్తనపై వేలెత్తి చూపితే సహించదన్న మాట లత. అయితే అప్పటినుంచి మరణించేవరకూ తనను ఎవరు ఏమన్నా, ఎంతగా దూషించినా, ఎన్నెన్ని నేరారోపణలు చేసినా లత ఒక్క విషయంలోకూడా నోరెత్తి ఒక్క మాట అనలేదు. ఎలాంటి స్పందన ప్రదర్శించలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి మాట్లాడితే తప్పు. మాట్లాడకుంటే తప్పు. మాట్లాడితే ఎదుటివారి పనికిరాని ఆరోపణలకు ప్రామాణికత కల్పించినట్టవుతుంది. కాబట్టి మౌనంగా వుండటమే ఉత్తమమని , ఎవరెన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా లత మౌనాన్నే ఆశ్రయించింది. ఈ మౌనాన్ని కూడా వివాదాస్పదం చేయాలని ప్రయత్నించారు కొందరు.
లత మౌనాన్ని అత్యద్భుతంగా వివరిస్తుందీ అదాలత్ సినిమాలో లత పాడిన గజల్…….
ఉన్ కో యే షికాయత్ హై కె హం కుచ్ నహీ కహెతే
అప్నీ తో యే ఆదత్ హై కె హం కుచ్ నహీ కహెతే
కుచ్ కహెనెసే తూఫాన్ ఉఠాలేతి హై దునియా
అబ్ ఇస్ పె కయామత్ హై కె హం కుచ్ నహి కహెతే…
ఆమె సినిమా పాటలు పాడే కొత్తల్లో ఓ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు ఆమె మెడలోని గొలుసు గురించి ఏదో వ్యాఖ్య చేశాడన్న మాట లతకు ఎవరో చెప్పారు. దాంతో ఆమె రికార్డింగ్ వదలి వెళ్ళిపోవడమే కాదు, కొన్నాళ్ళు ఆ సంగీత దర్శకుడి పాటలు పాడలేదు. తరువాత ఇది ఎవరో కావాలని చెప్పిన మాయమాటలని తెలియటంతో మళ్ళీ ఆ సంగీత దర్శకుడి పాటలు పాడింది. అప్పటి నుంచీ ఆమె తన మెడ కూడా కనబడకుండా కొంగు నిండుగా కప్పుకోవటం ఆరంభించింది. అంత సెన్సిటివ్ లతమంగేష్కర్. అలాంటి లత ఓ లాహోర్‍కు చెందిన అద్భుతగాయకుడి దగ్గర పాట నేర్చుకుంటూ అతడి పాటంటే వెర్రి పెంచుకుని, అతడితో వివాహానికి సిద్ధమయిందన్న ఊహ రావటమే అత్యంత నీచమయిన విషయం.
లత వెర్రిగా అభిమానించే ఆ లాహోర్ గాయకుడు సలామత్ అలీఖాన్ జన్మించింది డిసెంబరు 12, 1934లో. అంటే దేశవిభజన సమాయానికి అతనికి పదమూడేళ్ళు. ఈయన విలాయత్ అలీఖాన్ కొడుకు. ఈయనకు పన్నెండేళ్ళ వయసులోనే సోదరుడితో కలిసి పాట పాడటం నేర్పటం ఆరంభించాడు తండ్రి. తరువాత వీరు ‘అలీ బ్రదర్స్’ గా ఖ్యాతి పొందారు. పన్నెండేళ్ళకు పాట నేర్చుకోవటం ఆరంభించిన సలామత్ అలీఖాన్ లతకు ఎప్పుడు పాట పాడటం నేర్పించాడు? ఎప్పుడు అతని పాట విని లత వెర్రి అభిమాని అయింది? దేశ విభజన సమయంలో పదమూడేళ్ళ సలామత్ అలీఖాన్ పద్దెనిమిదేళ్ళ లతను పెళ్ళిచేసుకోవాలని ఎలా అనుకున్నాడు? పన్నెండేళ్ళకే అతనికి పెళ్ళయి పిల్లలున్నారా? దేశ విభజన సమయంలో హిందూ, ముస్లిం ఉద్విగ్నతల వల్ల వివాహం అలోచనను విరమించుకున్నాడా? ఇంతకీ ఈ హిందూ ముస్లిం ఉద్విగ్నత అన్న సన్నాయి నొక్కు ముస్లింలకు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం, వారెంత అభద్రతా భావంలో బ్రతుకుతున్నారో చూపించి అభ్యుదయలౌకిక మైనరిటీ భావాల ముద్ర , ఆమోదం పొందేందుకా? ఇంతకీ సాక్షి ప్రస్తావించింది ఈ 13ఏళ్ళ సలామత్ అలీ ఖాన్ యేనా అన్న సందేహం లేకుండా బొమ్మ కూడా వేశారు. ఈయన జీవితంలో బొంబాయి 1956లో తొలిసారి వచ్చాడు.
లత జీవితంలో కలవని సలామత్ అలీ ఖాన్ తో ఆమె ప్రేమవ్యవహారాన్ని ఊహించి, మసాలాచల్లి రాసిన ఈ అనృత ప్రేమ కథకు ఆ జర్నలిస్టు సమాధానమిస్తాడా? సాక్షి సంపాదకవర్గం సంజాయిషీ ఇస్తుందా? యాజమాన్యం సమాధానమిస్తుందా? ఇలాంటి తప్పుడు కూతల రాతలు రాయటం వల్ల ఎవరికి ఏం లాభం వచ్చింది? ఒక వికృత మానసికానందం తప్ప, ఓ ఉన్నత స్థాయి వ్యక్తిని దిగజార్చుదామనే తుచ్ఛ పైశాచిక ఆనందం తప్ప ఏం సాధించారు ఇలాంటి పనికిరాని రాతలు ఓ మహా కళాకారిణి, భారతరత్న లతా మంగేష్కర్ గురించి రాసి?
అంటే ఒక కళాకారిణి మరణిస్తే ఆమె కళను అనుభవించి ఆనందించే సౌకుమార్యం, సున్నితత్వం లేని బండ హృదయాలు, ఆమెకు లేని అధూర ప్రేమ కహానీలు, ఎవ్వరికీ తెలియని, లేని ప్రేమ గాధలను ఊహించి సృష్టించి రాసేస్తారన్న మాట! ఇది తెలుగు జర్నలిజం పట్ల, పత్రికల పట్ల గౌరవం, నమ్మకాలను సడలిస్తుంది. లత పాట కన్నా ఆమె ప్రేమ ఆటలపైనే వీరి దృష్టి అన్నమాట! గ్రద్ద ఆకాశంలో ఎంత ఎత్తు ఎదిగినా, దాని దృష్టి నేలపైని తిండిపైనే ఉంటుందన్నట్టు వ్యక్తులు ఎంత ఎదిగినా వారి మెదళ్ళు అధోస్థాయి దాటలేదని నిరూపిస్తాయి ఇలాంటి రచనలు. లేక ప్రపంచానికి తెలియని సలామత్ అలీఖాన్ లతను ప్రేమించాడని సాక్షి జర్నలిస్టులు ఏదయినా స్కూప్ లాగితే, ఆ ఋజువులు ప్రపంచానికి ప్రకటిస్తే, లత ఎప్పుడూ ప్రస్తావించని, సీక్రెట్ గా వుంచిన ఓ ప్రేమికుడిని ప్రపంచానికి పరిచయం చేసిన ఖ్యాతి ఆ జర్నలిస్టు, సంపాదకవర్గం పొందవచ్చుగా??
అయితే ఈ రచనలలో వారు ప్రస్తావించిన ఇతర వ్యక్తులతో లత ప్రేమ కథలగురించి సందర్భాన్ని బట్టి ప్రస్తావిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది.
మాస్టర్ వినాయక్ మరణం తరువాత మళ్ళీ లత పరిస్థితి మొదటికి వచ్చింది.. అంతవరకూ ఆమెకు మాస్టర్ వినాయక్ కంపనీ నుంచి జీతం అందేది. ఆయన మరణం తరువాత లత ఇప్పుడు స్టూడియోల చుట్టూ సంగీత దర్శకుల చుట్టూ అవకాశం కోసం తిరగాల్సి వచ్చింది. అయితే తెలిసినవారి కంపెనీలో కలసి పనిచేయటం వేరు. అనామకురాలిగా పరిచయం లేని వ్యక్తులను అవకాశం అడగటం వేరు. పైగా ఆ కాలంలో నేపథ్యగానం అప్పుడప్పుడే ఆరంభం అవుతుంది.
ఇంకా నటీనటులు తమ పాటలు తామే పాడుకుంటున్న కాలం. నేపథ్యగాయనిగా శంషాద్ బేగం సంచలనం సృష్టిస్తున్న కాలం అది. నటిగా, గాయనిగా నూర్జహాన్ ఏకఛత్రాధిపత్యం ఏలుతున్న కాలం. దీనికి తోడు ఆ కాలంలో సినీ పరిశ్రమ వాతావరణం ఇప్పటిలా ఉండేది కాదు. స్టూడియోల కాలం అది. స్టూడియో అధినేత ఇష్టాయిష్టాల ఆధారంగా వ్యక్తులకు అవకాశాలు దొరుకుతుండేవి.
లత మంగేష్కర్ సినీ ప్రపంచంలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న కాలంలో సినీ పరిశ్రమలోని వాతావరణం గురించి అన్ని అడ్డంకులను దాటుకుని లత అడుగు ముందుకు వేయటం గురించి…. వచ్చేవారం.
***
Photo Credits: Internet