Site icon Sanchika

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-6

ఆజ్ నహీతో కల్ బిఖర్ జాయేంగే యే బాదల్

హస్తే హువే చల్, మేరే మన్ హస్తే హువే చల్

ఇస్ దేశ్‍కి నారీ కో కోయీ కహ నా దే దుర్బల్

హస్తే హువే చల్, మేరే మన్ హస్తే హువే చల్

[dropcap]క[/dropcap]వి ప్రదీప్ అత్యద్భుతమైన భావాలతో కూర్చిన ఈ స్ఫూర్తివంతమైన పాట ‘మషాల్’ (1950) సినిమాలోది. ఎస్డీ బర్మన్ సంగీత దర్శకుడు. ఆగష్టు 19, 1947న మాస్టర్ వినాయక్ మరణంతో భవిష్యత్తు అంధకారమైనప్పుడు బహుశా ఇలాంటి భావాలే లత మనస్సులో చెలరేగి ఉంటాయి. ఈ దేశపు మహిళను ఎవ్వరూ అబల అని అనకూడదని నిరూపించాలని నడుం కట్టినట్టు పదిహేడేళ్ళ యువతి, ఎలాంటి సహాయం ఎవరినుంచీ ఆశించక తన కుటుంబాన్ని పైకి తేవటమే కాకుండా పురుషాధిక్య ప్రపంచమైన సినీ ప్రపంచంపై చెరగని ముద్రవేసి తిరుగులేని రీతిలో ప్రభావం చూపించటమన్నది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు కాకుంటే రేపైనా అలుముకున్న మేఘాలు తొలగిపోతాయి. కాబట్టి ధైర్యంతో ముందుకు సాగాలి అని తనకు తాను ఎంతగా ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగిందో ఊహకందని విషయం. పట్టుదల, మొండితనం, ఆత్మవిశ్వాసాలతో, నిరాశ నిస్పృహలను, వేదనలను తట్టుకుని నిలబడి ముందుకు సాగింది లత.

మాస్టర్ వినాయక్ మరణం లత కుటుంబానికే కాదు ఆయన నిర్మాణ సంస్థను నమ్ముకుని బొంబాయి వచ్చిన వారందరికీ పెద్ద షాక్. ఆయన మరణించే సమయానికి అసంపూర్తిగా ఉన్న సినిమాని దినకర్ పాటిల్ పూర్తిచేశాడు. మాస్టర్ వినాయక్ మరణించిన కొద్దిరోజులకు ప్రపుల్ల పిక్చర్స్ మేనేజర్ నానాచౌక్‍లో ఆ నిర్మాణ సంస్థ వాళ్ళుంటున్న ఇళ్ళ దగ్గరకు వచ్చాడు. ‘కంపెనీ మూత పడింది. మీరంతా ఇళ్ళు ఖాళీ చేయాలి’ అని ఆజ్ఞలు జారీచేశాడు.

ఒక్కక్షణం ఆగి ఆలోచిస్తే పరిస్థితి తీవ్రత బోధపడుతుంది. లత వాళ్ళింట్లో చెల్లెళ్ళు, అమ్మతో పాటు ఇందిర అనే బంధువు, వాళ్ళ ఇద్దరు పిల్లలూ ఉండేవారు. వీరంతా ఎక్కడికి పోతారు? పైగా వినాయక్ మరణంతో లతకు బొంబాయిలో తెలిసినవారు, సహాయం చేసేవారు ఎవ్వరూ లేని పరిస్థితి.. సినీ పరిశ్రమలో అవకాశాలు రావటం ఎంతో కష్టం. కొన్నివేలమంది స్టూడియోల చుట్టూ, నిర్మాత, దర్శకుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతున్నా, పడిగాపులు కాస్తున్నా అవకాశాలు దొరకటం కష్టం. అవకాశం దొరికినా సరైన అవకాశాలు దొరకటం కష్టం. అవకాశం కోసం నానాగడ్డీ కరవాల్సి ఉంటుంది. కరుణాకటాక్ష వీక్షణాలు తమపై పడేందుకు చకోర పక్షిలా ఎదురుచూడాల్సి ఉంటుంది. పైగా లత సినిమాల్లో నటించేందుకు కాదు, నేపథ్య గానం కోసం ప్రయత్నిస్తోంది.

‘ఆలంఆరా’తో సినిమాలకు గొంతు వచ్చింది. కానీ ఆరంభంలో నటీనటులు తమ పాటలు తామే పాడుకునేవారు. పైగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కాకపోవటంతో పాటలను రికార్డు చేయటానికి నానాతంటాలు పడేవారు.

In the early sound era, songs were filmed with synchronous sound, which was recorded on the optical track of the negative with two microphones, one directed at the singer and the other at the small number of off screen musicians” – (A Brief History of Bollywood Songs by Nasreen Munni Kabeer)

అందుకనే ఆ కాలంలో నటీనటులు ఒకచోట నుంచునో, కూచునో పాటలు పాడేవారు. దేవదాసులో సైగల్ ‘బాలమ్ ఆయో బసోమోర మన్‍మే’ ఓ చెట్టుక్రింద కూర్చుని పాడతాడు. నటుడు కదుల్తూ పాడటం పెద్ద తంటా. ‘స్ట్రీట్ సింగర్’ సినిమాలో సైగల్ ‘బాబుల్ మొరా’ అని పాడుతూ హర్మోనియం వాయిస్తూ నడుస్తూ పాడతాడు. ఆయనతో పాటుగా కెమెరా కంట పడకుండా, పక్కనే నడుస్తూ వాయిద్యాలు వాయిస్తూంటారు వాయిద్యకారులు. ముందుగా పాట రికార్డ్ చేసి తరువాత చిత్రీకరించే పద్ధతి అప్పటికి రాలేదు. కాబట్టి, పాట రికార్డింగ్ దృశ్యం చిత్రీకరణ ఒకేసారి అవ్వాల్సివచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు చిన్న తప్పుచేసినా, మళ్ళీ మొదటినుంచి చిత్రీకరించాల్సివచ్చేది. అందుకని ఆరోజుల్లో పాటల్లో వాయిద్యాలు తక్కువగా వుండేవి. పాడే నటీనటుల కదలికలు తక్కువగా వుండేవి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుసుకుంటే హాస్యంగా, అప్పుడు కష్టంగా అనిపించే  సంఘటనలెన్నో సంభవించేవి. అలాంటి ఒక సంఘటన కేదార్ శర్మ జీవిత చరిత The One and Lonely Kidar Sarma edited by Dr. Vikram Sarma   లో పొందుపరచారు.
ఒకసారి స్టూడియో వెనుక ఉన్న అడవిలో రాత్రి పాట చిత్రీకరణ జరుగుతోంది. ఉమాశశి అనే నటి ఒక పూలచెట్టు దగ్గర నిలబడి పాటపాడాలి. అది ట్రాలీషాట్ కావటంతో వాయిద్యకారులు కెమేరా  దృష్టిలో పడకుండా స్థలం దొరకటం కష్టం అయింది. సంగీత దర్శకుడు ఆర్‌సీ బోరాల్ ఎంతో వెతకగా దగ్గరలో నీరునిండిన గుంటలో వాయిద్యకారులుండేందుకు స్థలం దొరికింది. అయితే ఫ్లూటు, క్లారినెట్ వాయించేవారికి మోకాలులోతు నీళ్ళల్లో నుంచుని వాయించటం కష్టం కాలేదు. కానీ, తబలా, హార్మోనియం వాయించేవారికి వాయిద్యాలను నడుముకు కట్టుకుని నీటిమట్టంపై వుంచుతూ వాయించటం ఎంతో కష్టం. అయినా సరే అది తప్ప మరో మార్గంలేకపోవటంతో పాట చిత్రీకరణ ఆరంభించారు. అంతా సవ్యంగా సాగిపోతోంది. చివరలో నాయిక పాట ముగింపుగా లయను మంద్రంచేసి పాడాలి. అందుకుతగ్గట్టుగా వాయించేబదులు తబలావాయించే అలీహుస్సేన్ లయవేగాన్ని పెంచుతూపోయాడు. ఆర్‌సీ బోరాల్ సూచనలను అతను పట్టించుకోలేదు. పాట చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు సంతృప్తిచెందాడు. కానీ, ఆర్‌సీ బోరాల్ కోపంగా అలీ హుస్సేన్ చివరలో లయ పెంచినందుకు అతనిపై విరుచుకుపడ్డాడు. అంతా అయిన తరువాత అలీ హుస్సేన్ అసలువిషయం చెప్పినప్పుడు నవ్వీ నవ్వీ అందరికీ కన్నీళ్ళువచ్చాయి. చివరివరకూ బాగానేవుందికానీ, పాట చివరికి వచ్చేసరికి ఒక చేప అతని ధోవతీలోకి దూరింది. దానికోసం ఆయన తబలా ఆపితే అంతవరకూ చిత్రించింది వ్యర్ధమై మళ్ళీ మొదలుపెట్టాలి. కాబట్టి లోపల ఆచేప కదలికలను సహిస్తూ తబలా వాయిస్తూన్నాడు. అయితే అతని తబలా లయ పాటకుతగ్గట్టుకాకుండా, లోపల చేప కదలికలననుసరించింది. అదీ కథ!!! ఈ సంఘటననుబట్టి తెలుసుకోవచ్చు ఆ కాలంలో ఎలాంటి కష్టాలను సహిస్తూ పాటలను అందించేవారో!!!
పైగా పాటలు పాడే నటీనటులు శిక్షణ పొందిన గాయనీ గాయకులు కారు. దాంతో సంగీత దర్శకులు కూడా బాణీలను తేలికగా ఉంచేవారు. నేపథ్యగానం సాధ్యమైన తరువాత పాటలు పాడే బాధ నటీనటులకు తప్పింది. లత బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు ఇంకా నేపథ్యగానం అంతగా ప్రాచుర్యం పొందలేదు. సైగల్, సురేంద్ర, నూర్జహన్, సురయ్య వంటి వారు తమ పాటలు తామే పాడుకునేవారు. శంషాద్ బేగం వంటి వారు రంగప్రవేశం చేసి పేరు సంపాదిస్తున్నారు. ఆ కాలంలో రికార్డింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందక పోవటంతో పాటలు పాడేవారి గొంతులు బలంగా ఉండాల్సిన అవసరం ఉండేది. దాంతో నేపథ్యగాయనిగా అవకాశాలు లభించటమూ బలహీనమైన గొంతు కల లతవంటి వారికి కష్టమే.

ఆ కాలంలో సినిమా సంగీత రంగంలో ముఠాలుండేవి. గోవింద్ రావ్ తెంబే, కేశవ్ రావ్ భోలే, మాస్టర్ కృష్ణారావ్, పండిత్ బి.ఆర్ దేవధర్ వంటివారు మహారాష్ట్ర సంగీతాన్ని సినీ సంగీతంగా భావించేవారు. ఆర్ సి బోరాల్, పంకజ్ మల్లిక్, కె.ఎల్. సైగల్, కానన్ దేవి  , కె.సి.డే, పహారి సన్యాల్, పన్నాలాల్ ఘోష్, అనిల్ బిశ్వాస్ వంటివారు బెంగాలీ సంగీతానికి చెందినవారు. గులామ్ హైదర్ పంజాబీ సంగీతానికి, నౌషాద్  ఉత్తర ప్రదేశ్ సంగీతానికి చెందినవారు. గాయనీ గాయకులు ఈ సంగీత ముఠాల్లో ఏదో ఒకదానికి చెందితే వారికి అవకాశాలు అధికంగా లభించే వీలుంటుంది. శంషాద్ బేగం పంజాబీ, ఉత్తర ప్రదేశ్ సంగీత దర్శకుల మనిషిగా పేరు పొందింది. బెంగాలీవారికి  పారుల్ ఘోష్,వుండేది.  1946లో గీతాదత్ స్వరం లభించింది. మహారాష్ట్ర సంగీత దర్శకులకు వారి గాయనిలుండేవారు. దాంతో లత మంగేష్కర్ ఏ జట్టుకూ చెందనిదయింది. పైగా వినాయకరావు ‘మనిషి’గా ముద్రపడటంతో ఇతరులు ఆమెను ఆదరించేందుకు సిద్ధంగా లేరు. చేతిలో డబ్బు లేదు, ఉండటానికి ఇల్లు లేదు. వినాయకరావు నేత్రుత్వంలో పనిచేస్తున్న కంపెనీ దుర్దశలో ఉండటంతో ఆరునెలలుగా జీతాలు లేవు. ఎలాగైతే తండ్రి మరణించిన ఎనిమిదవ రోజునే ముఖానికి రంగు వేసుకుని వినాయక  రావు కంపెనీ సినిమాలో నటించాల్సి వచ్చిందో, అలాగే మళ్ళీ వినాయక్ రావు మరణంతో సినిమా అవకాశాల కోసం వెతకాల్సి వచ్చింది.

సినిమాలకు ఎక్స్‌ట్రాలను అందించేవారినీ అవకాశాల కోసం అడిగింది. కానీ వారు నటన అవకాశాలిప్పించగలరు కానీ పాట పాడే అవకాశాలు ఇప్పించలేరు. లతకు నటించటం ఇష్టం లేదు. దీనికితోడు కొత్త ఇల్లు వెదుక్కోవాలి. బొంబాయిలో ఇళ్ళు దొరకటం కన్నా అడ్వాన్సులు ఇవ్వటం కష్టం! ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో లతకు కెమెరామేన్ ‘పాపా బుల్బులే’ సహాయం చేశాడు. ఈయన మాస్టర్ వినాయక్ ఫిల్మ్ కంపెనీలో పనిచేసేవాడు. లత మంగేష్కర్ వాళ్ళుంటున్న ఇళ్ళ వరుసలోనే ఉండేవాడు.

“నాకు తెలిసిన ఓ సంగీత దర్శకుడు కొత్త స్వరం కోసం వెతుకుతున్నాడు. నీకు పాడాలని ఉంటే నాతో రా. పాడే అవకాశం లభిస్తుంది” అన్నాడు. పాడే అవకాశం కన్నా పాడితే వచ్చే డబ్బు ఆ సమయంలో ఎంతో అవసరం. అందుకని లత అతనితో ‘తార్దియో’ లోని సెంట్రల్ స్టూడియోకు వెళ్ళింది. అక్కడ లతను హరిశ్చంద్ర బాలికి పరిచయం చేశాడు ‘పాపా బుల్బులే’.

హెచ్.సి బాలిగా ప్రసిద్ధి పొందిన హరిశ్చంద్ర బాలి 1933లో ‘నక్ష-ఎ-సులైమాని’ అనే సినిమాలో నటుడిగా తన కెరీర్‍ను ఆరంభించాడు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన వాడవటంతో సినీ సంగీత దర్శకత్వం వైపు మళ్ళాడు. ‘ఔరత్ కె దిల్’ (1933) సంగీత దర్శకుడిగా ఇతని ప్రథమ చిత్రం. ఇరవై ఆరు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడీయన. లత కలసినప్పుడు ఈయన ‘లవ్ ఈజ్ బ్లైండ్’ అన్న సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ కాలంలో హెచ్.సి బాలికి గొప్ప పేరుండేది. కుందన్‍లాల్ సైగల్ అనే యువకుడి పాటను విని మెచ్చి, సంగీత దర్శకుడు ఆర్. సి. బోరాల్‍కు ఆ యువకుడిని పరిచయం చేశాడు హెచ్. సి బాలి. అంతకు ముందే ఓ సిగరెట్టు దుకాణం వద్ద ఓ యువకుడి పాట విని మెచ్చాడు ఆర్.సి. బోరాల్. కానీ అతడి పేరు తెలుసుకోలేదు. హెచ్.సి. బాలి పరిచయం చేసింది ఆ యువకుడినే. అలా టైప్ రైటర్‍లు అమ్మే ఉద్యోగం చేస్తున్న సైగల్ సినీ ప్రపంచంలో గాయకుడిగా తరతరాలను ప్రభావితం చేసేందుకు కారణమయ్యాడు హెచ్.సి. బాలి. ఆయన లత పాట విని మెచ్చి ‘లవ్ ఈజ్ బ్లైండ్’ సినిమాలో కొన్ని పాటలు లతతో పాడించాడు. ఆ సినిమా అసంపూర్ణంగా మిగిలిపోయింది. పాటలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ లతకు అత్యంత అవసరమైన సమయంలో అవకాశం ఇచ్చి ఆదుకున్నట్టయింది. హెచ్. సి బోరాల్‍కు దీనానాథ్ మంగేష్కర్‌తో పరిచయం, అభిమానం ఉన్నాయి.

‘లవ్ ఈజ్ బ్లైండ్’ పాటలు రికార్డు చేస్తున్న సమయంలో కొత్త గాయని గురించి సినీ పరిశ్రమలో తెలిసింది. ఆమెకు మాస్టర్ గులామ్ హైదర్ నుంచి పిలుపు వచ్చింది.

సినీ రంగంలో ఆ కాలంలో ‘గులామ్ హైదర్’ నుంచి పిలుపు అంటే, విజయానికి దారి దొరికినట్టే. అంతకు ముందు 1941లో  సంగీతంలో శిక్షణ లేని, శంషాద్ బేగంతో  ‘ఖజాంచి’ సినిమాలో పాటలు పాడించాడు గులామ్ హైదర్. ‘ఖజాంచి’ పాటలు సినీ సంగీత ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యాయి. అంతవరకూ శాస్త్రీయ రాగాల ఆధారిత బాణీలనే సినీ పాటలకు కుదిర్చేవారు సంగీత దర్శకులు. కానీ గులామ్ హైదర్ శాస్త్రీయ రాగాలను స్వేచ్ఛగా తనకు నచ్చినట్టు వాడి మెప్పించటంతో సంగీత దర్శకులకు ‘సృజనాత్మక స్వేచ్ఛ’ లభించింది. ఈయన అసిస్టెంట్‌గా పనిచేసిన సి. రామచంద్ర తాను స్వతంత్ర సంగీత దర్శకుడైనప్పుడు శాస్త్రీయ రాగాలకు, పాశ్చాత్య లయను జోడించి సినీ సంగీతాన్ని సంపూర్ణంగా రూపాంతరం చెందించాడు. ఇలా రూపాంతరం చెందిస్తూ అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా సి. రామచంద్ర ఎదగటంలో అతనికి బాణీలకు ప్రాణం పోసి ‘చిరంజీవులు’గా నిలిపిన స్వరం లతది. లతను తొలిసారిగా సి. రామచంద్ర, గులామ్ హైదర్ పాటల రిహార్సల్స్ సందర్భంలోనే కలిశాడు. నూర్జహాన్ తొలి సినిమా ‘ఖాన్‌దాన్’ సంగీత దర్శకుడు కూడా గులామ్ హైదరే!

గతంలో లత ‘ఖజాంచి’ సినిమా పాటల పోటీలో పాల్గొని విజయం సాధించింది. ఆ ‘ఖజాంచి’ సంగీత దర్శకుడి నుంచి పిలుపు రావటం లత నమ్మలేకపోయింది. గులామ్ హైదర్ లాహోర్‍ సంగీత దర్శకుల జట్టుకు చెందినవాడు. అందుకే అతడిని కలిసేందుకు అతని ముందు పాట పాడేందుకు లత ఉద్విగ్నతను అనుభవించింది. గులామ్ హైదర్ సంగీత దర్శకత్వం వహించిన ‘హుమయూన్’ సినిమాలోని ‘మై తో ఓఢూ గులాబీ చునరియా ఆజ్ రే’ అనే పాటను, ‘జీనత్’ సినిమాలో నూర్జహాన్ పాడిన ‘బుల్బులో మత్ రో యహాన్’ అనే పాటను పాడింది. అయితే ఉద్విగ్నత వల్ల పాడటంలో పొరపాట్లు చేసింది. ‘నీకు సంగీతంలో శిక్షణ ఉందా?” అనడిగాడు గులామ్ హైదర్ పాటలు విని.

“ఉంది”

“ఎవరు నీ గురువు?”

“అమానత్ ఖాన్ దేవసాలే” సమాధానం ఇచ్చింది లత.

“ఖాన్ సాహెబ్ దగ్గర శిష్యరికం చేశావు. బాణీకి తగ్గట్టు లయ బద్ధంగా పాడటం రాదా?’ అన్నాడు గులామ్ హైదర్ నవ్వుతూ.

ఆ సమయంలో లత మనస్సులో చెలరేగిన నిరాశా తుఫానులను ఊహించటం కష్టం. గులామ్ హైదర్ మెప్పు పొందటమంటే మాటలు కాదు. శంషాద్ బేగం, నూర్జహాన్ వంటి వారిలో ప్రతిభను గుర్తించి, వారికి అవకాశాలిచ్చి ‘సూపర్ సింగర్లు’గా నిలిపినవాడు గులామ్ హైదర్. అలాంటి వాడికి పాట వినిపించే అవకాశం రావటం అదృష్టం. కానీ పాటలు తప్పుగా పాడటం దురదృష్టం. చేతికి అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్న భావన లతకు కలిగి ఉంటుంది. నిరాశకు గురయ్యి ఉంటుంది.

శశధర్ ముఖెర్జీ

ఇక్కడ  గులామ్ హైదర్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో హిందీ సినీ సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణిగా లత నిలుస్తుందని విధి నిశ్చయించింది. దానికి తిరుగులేదు. పాటను తప్పుగా పాడినా లత స్వరంలోని గొప్పతనాన్ని, ఆమె ప్రతిభను గుర్తించాడు గులామ్ హైదర్. అప్పుడు ప్రచలితంలో ఉన్న స్వరాలన్నిటికీ లత స్వరం భిన్నమైనది. బలహీనమైనది. కానీ ఆ స్వరంలోని మాధుర్యాన్ని, సినీ సంగీత ప్రపంచాన్ని పాదక్రాంతం చేసుకోగల ‘శక్తి’ని గులామ్ హైదర్ గుర్తించాడు. అదే రోజు లతను తీసుకుని ఫిల్మిస్థాన్ స్టూడియోకు తీసుకువెళ్ళాడు. ఆ కాలంలో ఫిల్మిస్థాన్ స్టూడియో నెంబర్ వన్ స్టూడియో. శశిధర్ ముఖర్జీ లేదా ఎస్. ముఖర్జీ ‘బోంబె టాకీస్’లో నిర్మాత. చక్కని చిత్రాల నిర్మాతగా పేరుపొందాడు. అతని భార్య సతీదేవికి ముగ్గురు తమ్ముళ్ళు. అశోక్ కుమార్, కిషోర్ కుమార్, అనూప్ కుమార్లు! అప్పటికే అశోక్ కుమార్ పెద్ద స్టార్. హిమాన్షురాయ్ మరణం తరువాత ‘బోంబే టాకీస్’ విషయంలో దేవికారాణితో భేదాభిప్రాయాలు రావటం వల్ల ఎస్. ముఖర్జీ, అశోక్ కుమార్‍లు- రాయ బహదూర్ చున్నీలాల్, గ్యాన్ ముఖర్జీలతో కలిసి ‘ఫిల్మిస్థాన్ స్టూడియో’ను స్థాపించారు. సాదత్ హాసన్ మాంటో, ఇస్మత్ చుగ్తాయ్ వంటివారు కూడా ‘ఫిల్మిస్థాన్’లో చేరారు. దాంతో ఆ కాలంలో ‘ఫిల్మిస్థాన్’ కు పెద్ద పేరుండేది. గులాం హైదర్ ఫిల్మిస్తాన్ స్టూడియోకు లతను తీసుకువెళ్ళినప్పుడు ఎస్.ముఖెర్జీ షహీద్ అన్న సినిమా నిర్మాణంలో వున్నాడు.

గులామ్ హైదర్ లతను ఎస్. ముఖర్జీకి పరిచయం చేశాడు. లత పాట విన్నాడు ముఖెర్జీ. లత పాట ఎస్. ముఖర్జీకి నచ్చలేదు. ‘ఆమె గొంతు సినిమా పాటలకు పనికిరాదన్నా’డు. సినిమాలో నాయిక కామినీ కౌశల్‌కు సరిపోదన్నాడు. అప్పటికే అతను ఆ పాటకు గీత రాయ్ ను ఎంచుకున్నాడు.  ఆయన లత స్వరాన్ని తిరస్కరించేందుకు, అప్పటికే తాను నిర్మిస్తున్న సినిమాలో పాట  గీతాదత్‌తో పాడించాలని ఆయన నిర్ణయించటమేనని అంటారు. పద్నాలుగేళ్ల వయసులో గీతాదత్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలో తొలిపాట పాడింది. పాడింది రెండు లైన్లే అయినా ఆమె గొంతు అందరికీ నచ్చింది. పైగా ఆమె బెంగాల్‍కు చెందింది కావటం కూడా ఎస్. ముఖర్జీ ఆమె వైపు మొగ్గు చూపటంలో తన వంతు పాత్ర పోషించింది.

ఎస్. ముఖర్జీ తిరస్కారం గులామ్ హైదర్‍కు ఆగ్రహం కలిగించింది.

“ఈ పిల్ల నూర్జహాన్‍ని సైతం మరపిస్తుంది చూడు” అన్నాడు. ఆమెను తీసుకుని మలాద్ లోని ‘బోంబే టాకీస్’ కు బయలుదేరాడు. అప్పుడాయన మజ్బూర్ అనే సినిమాకు పాటలను రూపొందిస్తున్నాడు.. ‘గుర్గావ్’ రైల్వే స్టేషన్‍లో ఆమెకు 555 సిగరెట్ పెట్టెపై తాళం వేస్తూ  దిల్ మెరా తోడా పాట   బాణీ నేర్పాడు. బయట వర్షం పడుతోంది. రైళ్ళు వస్తూ పోతున్నాయి. ప్రయాణీకులు రైళ్ళు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ప్లాట్‌ఫాం తినుబండరాలు అమ్మేవాళ్ళ అరుపులతో దద్దరిల్లుతోంది. అయినా సంగీత దర్శకుడు గులామ్ హైదర్, గాయని లత మంగేష్కర్ ఆ ప్లాట్‌ఫాంపై, ఆ రణగొణ ధ్వనుల నడుమ సర్వం మరచి పాటలో లీనమయ్యారు. లతకు పాట సరిగ్గా వచ్చిందని నిర్థారణ అయ్యాక, ఆమెను వెంట తీసుకుని స్టూడియోకు రికార్డింగ్‌కు వెళ్ళాడు గులామ్ హైదర్.

అత్యంత అద్భుతమైన ఘట్టం అది!

అందరూ ఆమె స్వరాన్ని తిరస్కరించారు. ఆమె కూడా నిరాశకు గురవుతోంది. భవిష్యత్తు అంధకారంగా అనిపిస్తోంది. దొరకక దొరకక ‘గులామ్ హైదర్’ లాంటి సంగీత దర్శకుడికి తన స్వరం వినిపించే అవకాశం వస్తే, అక్కడా పొరపాట్లు చేసింది. అయినా ఆమె స్వరంపై విశ్వాసంతో పెద్ద నిర్మాత దగ్గరకు వెళ్తే ఆయన ఆమె స్వరాన్ని తిరస్కరించాడు పనికి రాదని. అలాంటి పరిస్థితిలో వారిద్దరూ రైల్వే ప్లాట్‍ఫారంపై నిలబడి సర్వం మరిచి పాటను సాధన చేయటం ఊహిస్తేనే ‘అద్భుతం’ అనిపిస్తుంది.

అంతగా ఆమెతో సాధన చేయించటం ఎందుకంటే, ఈసారి ఆమెని ఇతరులకు పరిచయం చేసి పాడించినప్పుడు ఆమె పొరపాటు చేయకూడదని, విన్నవాళ్ళు ఆమె పనికిరాదని అనకూడదని. ఇక్కడే మానవాతీతమైన శక్తిని నమ్మాల్సి వస్తుంది. ప్రపంచం ఎంతగా ‘యాదృచ్ఛికం’ అనుకున్నా వ్యక్తి విజయానికి అతని ప్రతిభ  ఎంతగా కారణం  అనుకున్నా కనబడని చెయ్యి నడిపించే నాటకం ఈ ప్రపంచం అనిపిస్తుంది.

భగవంతుడు ‘లత’కు అద్భుతమైన స్వరాన్ని ఇచ్చాడు. అది లేకపోతే ఈనాడు ‘లత’ గురించి మాట్లాడుకునే అవసరమే లేదు. ఆమె తండ్రి మరణం వల్ల జీవిక కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. మాస్టర్ వినాయక్ కోల్హాపూర్ వదలి బొంబాయి రావటం ఒక మలుపు. ఆయన మరణంతో మళ్ళీ పోరాటం ఆరంభం. దీనానాథ్ మంగేష్కర్ దీర్ఘకాలం జీవించి ఉంటే లత బయటి ప్రపంచానికి తెలిసే వీలుండేది కాదు. మాస్టర్ వినాయక్ అకాల మరణం సంభవించకుండా ఉంటే, లతకు బొంబాయిలో అవకాశం కోసం వెతకాల్సిన ఆవశ్యకత ఉండేది కాదు. ఆమె ‘వినాయక్’ కంపెనీలోనే సంతృప్తిగా ఉండేది. పైగా వినాయక్ జట్టుకే పరిమితమై పోయేది. ఒక జట్టుకు చెందినదానిగా ముద్రపడిపోయేది. కానీ వినాయక్ రావు హఠాన్మరణంతో మళ్ళీ లతకు బొంబాయిలో ఒంటరిగా అవకాశాల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె హెచ్.సి బాలి దగ్గర పాటల సాధన చేస్తున్న విషయం పరిశ్రమలో పదిమందికి తెలిసింది. ఫలితంగా గులామ్ హైదర్ నుంచి పిలుపు వచ్చింది. గులామ్ హైదర్ లత స్వరంలోని గొప్పతనాన్ని, మాధుర్యాన్ని, ఇతరులకు భిన్నమైన అలౌకికత్వాన్ని గుర్తించటం ఒక గొప్ప మలుపు. అయితే ఎస్. ముఖర్జీ, కామినీ కౌశల్‌కు లత స్వరం సరిపోదని తిరస్కరించటంతో అహం దెబ్బతిన్న గులామ్ హైదర్ లత స్వరాన్ని తానే ప్రపంచానికి పరిచయం చేయాలని, ఆమె గొప్పతనాన్ని తానే ప్రదర్శించాలని నిశ్చయించుకోవటం నిర్ణయాత్మకమైన ఘట్టం.

ఆ కాలంలో ఎంతోమంది నిష్ణాతులైన సంగీత దర్శకులు ఉండేవారు. కానీ గాయనీ గాయకుల స్వరాల మాధుర్యాన్ని, ప్రతిభను గుర్తించటంలో గులామ్ హైదర్‍ను మించినవారు లేరు. ఈ సందర్భంగా గులామ్ హైదర్ ‘శంషాద్ బేగం’ స్వర మాధుర్యాన్ని గమనించి ఆమెను తొలి నేపథ్య గాయనిగా సినీరంగానికి పరిచయం చేసిన విధానాన్ని స్మరించాల్సి ఉంటుంది.

శంషాద్ బేగం సాంప్రదాయిక ‘ముస్లిం జాట్’ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రికి శంషాద్ బేగం పాడటం ఇష్టం లేదు. కానీ ఆమె చాచా  అమీరుద్దీన్ ఆమెను పాడేందుకు ప్రోత్సహించాడు. ‘జియెన్ – ఓ – ఫోన్’ సంస్థ గాయనిల కోసం అన్వేషిస్తున్నప్పుడు ఆమె ‘చాచా’ ఆమెను ‘ఆడిషన్’ కోసం తీసుకుని వెళ్ళాడు. అతికష్టం మీద శంషాద్ బేగం తండ్రిని ఒప్పించాడు. ఆయన కొన్ని నియమాలు విధించాడు. ఎట్టి పరిస్థితులలో పాట తప్ప మరో పని చేయకూడదు. పాడి వెంటనే ఇంటికి వచ్చేయాలి. ఫొటోలకు ఫోజులివ్వకూడదు. పార్టీలకు వెళ్లవద్దు. స్టూడియోకు వెళ్ళటం, పాడటం ఇంటికి వచ్చేయటం. అంతే….  షరతులకు ఒప్పుకొని శంషాద్ అడిష‍న్‌కు వెళ్ళింది. ఆమె అడిషన్‍కు వెళ్ళిన కంపెనీ సంగీత దర్శకుడు గులామ్ హైదర్! అడిషన్‍ లో  శంషాద్ బేగం, బహదూర్ షా జఫర్ గజల్ ‘మేరా యార్ గలే మిలే’ పాడింది. ఆ తరువాత జరిగింది శంషాద్ బేగం ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

“మాస్టర్ గులామ్ హైదర్ నా స్వరం విని ముగ్ధుడయ్యాడు. నన్ను పన్నెండు పాటల ఒప్పందంపై సంతకం పెట్టమన్నాడు. పాటకు రూ.12.50/- ఆ కాలంలో అతి పెద్ద మొత్తం. సంతకం పెట్టేముందు నేను ‘తాలీమ్?’ (శిక్షణ) అని అడిగాను. నాకు శిక్షణ అవసరం లేదన్నాడు. చెప్పినట్టు పాడితే చాలన్నాడు. నాకు అప్పుడు 12 ‌- 13 ఏళ్ళు. మాస్టర్ జీ చాలా గొప్పవాడు. ప్రతిభను క్షణంలో గుర్తిస్తాడు. ఆయన నన్ను చౌముఖియా (బహుముఖ ప్రజ్ఞాశాలి) అనేవాడు. ఎలాంటి పాటనైనా సమర్థవంతంగా పాడతానని నమ్మేవాడు. మేరా ఉస్తాద్ జన్నత్ మే ఝాలే (నా గురువు స్వర్గంలో సుఖంగా ఉండాలి’)”.

ఒక 12 – 13 ఏళ్ల వ్యక్తిని, సంగీతంలో ఎలాంటి శిక్షణ లేని అమ్మాయి ప్రతిభను గుర్తించి ఆమెను సినీరంగానికి పరిచయం చేయటం గులామ్ హైదర్ సహృదయానికి నిదర్శనం. ఆ తరువాత శంషాద్ బేగం ఎంతో పేరు సంపాదించింది. తొలి నేపథ్య గాయనిగా (First professional playback singer) గుర్తింపు పొందటమే కాదు అగ్రశ్రేణి గాయనిగా నిలిచింది. నూర్జహాన్ తొమ్మిదేళ్ళ బాలికగా ఉన్నప్పుడు ఆమె స్వరంలోని మాధుర్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించాడు గులామ్ హైదర్. 1935లో ‘పింద్ ది కురి’ సినిమాలో తన ఇతర సోదరీలతో కలిసి నూర్జహాన్ పాడింది. ఆ పాటలో నూర్జహాన్ స్వరం విన్న గులామ్ హైదర్ ఆమెకు   పాటలు పాడే అవకాశం ఇచ్చాడు. 1942లో ప్రాణ్ హీరోగా, నూర్జహాన్ నాయికగా నటించి పాడిన ‘ఖాన్‍దాన్ ‘ సినిమాతో గుర్తింపు పొందింది.

ఇలా ఇద్దరు ప్రసిద్ధ గాయనిలను పరిచయం చేసిన గులామ్ హైదర్ దృష్టిలో లత పడటం, ఆయన లతకు అవకాశాలు ఇవ్వటం ఎంత యాదృచ్ఛికం అనుకున్నా, ‘అదృష్టం’, ‘విధి’ లాంటి పదాలు గుర్తుకు రాక తప్పదు. గుర్గావ్ రైల్వే ప్లాట్‍ఫారం పైన గులామ్ హైదర్ పాడి లతకు నేర్పిన పాట ‘దిల్ మెర తోడ’. ఆ తరువాత ఇద్దరూ మలాద్ లోని స్టూడియోకు వెళ్ళారు. మూడు రోజుల రిహార్సల్స్ తరువాత పాట రికార్డయింది. ‘మజ్బూర్’ సినిమాలోని ‘దిల్ మెరా తోడ’ పాటతో హిందీ సినీ సంగీత ప్రపంచంలో లత అడుగుపెట్టింది. భవిష్యత్తులో హిందీ సినీ సంగీత ప్రపంచానికి ‘మహరాణి’గా లత స్థిరపడేందుకు నాందీ ప్రస్తావన ‘మజ్బూర్’ సినిమా పాటల రికార్డింగ్ సమయంలోనే జరిగింది.

శంషాద్ భేగం, నూర్జహాన్‍ల తరువాత గులామ్ హైదర్ మరో కొత్త గాయనిని పరిచయం చేస్తున్నాడన్న వార్త సినీ ప్రపంచంలో విస్తరించింది. ‘ఎవరీ అమ్మాయి?’ అన్న కుతూహలం జనించింది. దాంతో పాటల రికార్డింగ్ సమయంలో లత స్వరం వినేందుకు నౌషాద్, ఖేం  చంద్ ప్రకాశ్, అనిల్ బిశ్వాస్ వంటి ప్రఖ్యాత సంగీత దర్శకులు వచ్చారు. లత స్వరం విన్నారు.

అంతకుముందే దత్తాదావ్జేకర్ సంగీత దర్శకత్వంలో ‘ఆప్ కీ సేవామే’ సినిమాలో ‘పా లాగూన్ కర్ జోరీ’ అనే పాట పాడింది. ఆ పాటతో శాస్త్రీయ గానంలో తన ప్రతిభను ప్రదర్శించింది. 1945లో నూర్జహాన్‌తో కలిసి నటించిన సినిమా ‘బడీమా’లో ‘మాతా తేరే చరణోమే’ అన్న భజన పాడింది. అదే సమయంలో ‘సుభద్ర’ సినిమాలో పాటల రికార్డింగ్ అప్పుడు సంగీత దర్శకుడు వసంత దేశాయ్‍తో లతకు పరిచయం అయింది. ‘మజ్బూర్’ సినిమా పాటల సందర్భంగా ముకేశ్‌‌తో పరిచయం అయింది. ‘అబ్ డర్ నే కీ కోయీ బాత్ నహీ’ అనే పాట పాడింది ముకేష్‌తో. కానీ ‘మజ్బూర్’ సినిమాలో గులామ్ హైదర్ లతతో పాటలు పాడించటంతో, లతా మంగేష్కర్ జీవితంలో సంఘర్షణాత్మక దినాల అంతానికి ఆరంభం అయింది. మరో రకమైన సంఘర్షణకు నాందీ ప్రస్తావన అయింది. ‘మజ్బూర్’ సినిమా నిజానికి లత సినీ సంగీత జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా. ‘మహల్’ సినిమా లోని ‘ఆయేగా ఆనెవాలా’ పాటతో లత ‘సూపర్ సింగర్’ గా గుర్తింపు పొందింది. కానీ ‘మహల్’ సినిమాలో ఖేం చంద్ ప్రకాశ్ లతకు అవకాశం ఇవ్వటం వెనుక ‘మజ్బూర్’ సినిమా రికార్డింగ్ సమయంలో ఆయన లత స్వరం వినటం ప్రధాన పాత్ర పోషించింది. లతకు సౌషాద్ అవకాశాలు ఇవ్వటం వెనుక ‘మజ్బూర్’ సినిమా పాటల రికార్డింగ్ సమయంలో ఆయన లత పాటను వినటం ప్రధాన పాత్ర పోషించింది. ‘అనిల్ బిశ్వాస్’ లతతో పాటలు పాడించేందుకు ప్రధాన కారణం గులామ్ హైదర్ లతను పాడేందుకు ఎంచుకోవటం. ఒక్క ‘మజ్బూర్’ సినిమాతో లత ఆనాటి సినీ సంగీత ప్రపంచంలో ఉన్న అన్నిరకాల సంగీత జట్టుల ప్రతిబంధనాలను అధిగమించింది. అడ్డుగోడలను ఛేదించింది. బెంగాలీ స్కూలుకు చెందిన అనిల్ బిశ్వాస్, ఉత్తర ప్రదేశ్‍ బాణీల నౌషాద్, శాస్త్రీయ సంగీత రాగాల ఖేంచంద్ ప్రకాశ్, శాస్త్రీయ పాశ్చాత్య రాగాల మిశ్రమ సంగీతం సృజించే సి. రామచంద్ర వంటి వారు లత స్వరం విన్నదీ, ఆమె ప్రతిభతో పరిచయం అయిందీ ‘మజ్బూర్’ సినిమా పాటల రికార్డింగ్ సమయంలో. అంటే నేపథ్య గాయనిగా లత జీవితాన్ని మలుపుతిప్పిన సంఘటన ‘మజ్బూర్’ సినిమా పాటలు పాడేందుకు గులామ్ హైదర్ లతను ఎంచుకోవటం!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఉంది. ఎస్. ముఖర్జీ  ‘షహీద్’ సినిమాలో ఏ పాట కోసం లతను కాదని గీతాదత్‍ను ఎంచుకున్నాడో ఆ పాట ‘ఆజా బేదర్దీ బాల్‍మా’,  ఇప్పుడు ఎవరూ అంతగా వినరు. ఆ కాలంలో పెద్ద హిట్. కానీ ‘షహీద్’ సినిమాలో అవకాశం తప్పిపోవటం, ‘మజ్బూర్’లో అవకాశం లభించటం సినీరంగంపై లత తిరుగులేని రీతిలో తన ముద్ర వేసేందుకు భూమికను కల్పించింది. ఆ తరువాత జరిగిన దేశవిభజన లత శిఖరారోహణకు మార్గం సులభతరం చేసింది. వేగవంతం చేసింది. అందుకే ఓ సినీ విమర్శకుడు ‘మజ్బూర్’ (బలహీనత) సినిమా లతను మజ్బూత్ (శక్తివంతం) చేసిన సినిమా’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య వెనుక ఉన్న నిజం 1945 నుంచి 1950 వరకూ ప్రతి సంవత్సరం విడుదలైన సినిమాల్లో లత పాడిన పాటల సంఖ్యను గమనిస్తే స్పష్టమవుతుంది.

మార్చ్ 12, 1971 ఫిల్మ్‌ఫేర్ సంచికలో సంవత్సరం వారీగా లత పాటల జాబితాను ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం 1945 నుంచి 1950 వరకూ లత పాడిన పాటలు మొత్తం 363.

సంవత్సరం పాడిన సినిమాల సంఖ్య పాడిన పాటల సంఖ్య సోలో
1945 1 1 1
1946 3 6 4
1947 3 5 3
1948 17 48 42
1949 40 151 105
1950 36 152 93
100 366* 248

*- ఫిల్మ్ ఫేర్ ప్రకారం లత పాటలు పాడిన సంఖ్య కూ, పైన ఇచ్చిన టేబిల్ లో సంఖ్యకూ తేడా (3)కి కారణం, ఆ జాబితా తయారయిన తరువాత లత పాడిన మూడు కొత్త పాటలు లభించటం వల్ల.

ఫిల్మ్‌ఫేర్ అందించిన వివరాలతో హర్‍మందిర్ సింగ్ రూపొందించిన ‘ఎన్‍సైక్లోపీడియా ఆఫ్ హిందీ ఫిల్మ్ సాంగ్’ అన్న పుస్తకంలోని వివరాలు  పోల్చి జతపరిస్తే సంవత్సరం వారీగా 1945 నుండి 1950 వరకూ లత ఎన్ని సినిమాలలో పాడింది, వాటిల్లో ఎన్ని పాటలు పాడింది, ఎన్ని పాటలు లత ఒంటరిగా (సోలో) గా పాడింది అన్న వివరాలు తెలుస్తాయి.

ఈ వివరాలను,  సంగీత కళావిహార్, అక్టోబర్ 1977లో సురేష్ బాద్వాంకర్ ప్రచురించిన గణాంక వివరాలతో పోలిస్తే అద్భుతమైన సత్యం స్పష్టమవుతుంది. 1941 – 50 నడుమ 1236 సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో 11124 పాటలున్నాయి. అంటే సంవత్సరానికి సగటున 123.6 సినిమాలలో 1112.4 పాటలు ఉంటున్నాయి. వాటిలో 1945లో ఒక పాట, 1947లో ఐదు పాటలు పాడిన లత 1948 కల్లా 48, 1949 కల్లా 151, 1950 కల్లా 152 పాటలు పాడటం,  ఎంత త్వరగా, ఒకటి రెండు సంవత్సరాలలో లతా మంగేష్కర్ అగ్రస్థానానికి చేరుకున్నదో స్పష్టం చేస్తుంది. తన స్వర మాయాజాలంతో సంగీత దర్శకులను, ప్రేక్షకులను సమ్మోహితులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. 1946లో లత వసంతదేశాయ్, డి.సి దత్ అనే సంగీత దర్శకులకు పాటలు పాడింది. 1947లో ముగ్గురు సంగీత దర్శకులు దత్త  దావ్జేకర్ (డి.సి. దత్), పండిత్ రమాకాంత్ పైన్‍గాన్ కర్, సి. రామచంద్రల సంగీత దర్శకత్వంలో పాటలు పాడింది. 1948లో 15 సంగీత దర్శకుల పాటలు పాడింది. అనిల్ బిశ్వాస్, ఖేంచంద్ ప్రకాశ్, హన్స్‌రాజ్ బహల్, సి. రామచంద్ర, గులామ్ హైదర్ వంటి సంగీత దర్శకుల పాటలు పాడింది లత. అంటే 1946లో ‘మజ్బుర్’ పాటలు రికార్డయ్యి, 1948లో సినిమా విడుదలయ్యేలోగా ఇతర సంగీత దర్శకులు లతతో పాటలు పాడించటానికి ఉత్సాహం చూపిస్తూ, ఆమె స్వరంతో తమ బాణీలకు ప్రాణం పోసుకోవటం ప్రారంభించారన్నమాట.

దేశవిభజన లత కెరీర్‍పై ప్రభావం చూపించటం గణాంక వివరాలు విస్పష్టం చేస్తాయి. 1949లో లత 151 పాటలు పాడింది. 1946లో, 1947లో మూడు సినిమా పాటలు పాడిన లత, 1948లో పదిహేడు, 1949లో నలభై సినిమాలకు పాడటం, 1950లో 36 సినిమాలకు పాడినా మొత్తంగా ఆ సంవత్సరం 152 పాటలు పాడడం ఏ రకంగా దేశవిభజన తరువాత, సినీ సంగీత రంగంలో లోటు ఏర్పడిందో, ఆ లోటును లత ఎంత సమర్థవంతంగా తన స్వరంతో భర్తీ చేసిందో చెప్పకనే చెప్తూంది. 1946లో ఇద్దరు సంగీత దర్శకులకు పాడిన లత 1948 కల్లా పద్నాలుగు, 1949లో పదిహేను, 1950లోనూ పదిహేను సంగీత దర్శకుల పాటలు పాడటం ఎంతగా సంగీత దర్శకులు లతను ఆదరించటం ప్రారంభించారో తెలుపుతుంది. అంతేకాదు 1946 నుంచి 1950 నడుమ 31మంది సంగీత దర్శకులు లతతో పాటలు పాడించారన్న నిజాన్ని గమనిస్తే, అంతవరకూ సినీ సంగీత ప్రపంచంలో ఉన్న బెంగాలీ జట్టు, మరాఠీ జట్టు, పంజాబీ జట్టు, ఉత్తర ప్రదేశ్ జట్టు వంటివన్నీ అదృశ్యమై ఒక్క లతా మంగేష్కర్ జట్టు మాత్రం మిగిలిందని అర్థమవుతుంది. ఇలా ఎలాంటి తేడాలు, భేదభావాలు లేకుండా అందరినీ తన స్వరప్రభావానికి గురిచేసి, తన్మయులను చేసి ఆకర్షించటం వల్ల తిరుగులేని రీతిలో ఎదురులేని గాయనిగా నిలిచింది. ఏ ఒక్క నిర్మాణ సంస్థకో పరిమితం కాకుండా, ఏ ఒక్క సంగీత దర్శకుడి అండనో ఆశించకుండా తన స్వర మహిమతో, ఎవరి దయాదక్షిణ్యాలు అవసరం లేకుండా స్వతంత్ర్యంగా నిలవటం లత శక్తి, ఆమె బలం. ఆమె ఆత్మ విశ్వాసం. ఆమె అహంకారం!

భగవంతుడు ‘లత’కు ఇచ్చిన అమూల్యమైన వరం ఆమె స్వరం. అదే లేకపోతే ఎవరెంత సహాయం చేసినా ఎన్ని అవకాశాలిచ్చినా ఎంత ప్రచారం చేసినా ‘లత’ ‘లత’గా ఎదగలేకపోయేది. భగవద్దత్త స్వరం ప్రజలను మంత్రముగ్ధులను చేయటంలో ఆశ్చర్యం లేదు. ఆ స్వరం ప్రజలను చేరటంలో సహాయపడిన వారంతా విధి చేతిలో సాధనాలు తప్ప మరేమీ కాదు. ‘నేను లత విజయానికి కారణం’, ‘నేను లతను గొప్ప గాయనిని చేశాను’ అని ఎవరైనా అనుకుని అహంకరిస్తే అది వారి అజ్ఞానం వల్ల కలిగిన అపోహ తప్ప వాస్తవం కాదు. ఎందుకంటే లతకు భగవద్దత్తమైన మహాద్భుతమైన స్వరం లేకపోతే వారెంత తల్లక్రిందులుగా తపస్సు చేసినా ఆమెను ఆగ్రశ్రేణి గాయనిగా నిలపటం సాధ్యమయ్యేది కాదు. భవిష్యత్తులో కొందరు సంగీత దర్శకులు ‘తామే లత విజయానికి కారకులు’ అన్న భ్రమలో ఇతర గాయనిలను లతకు పోటీగా నిలపాలని ప్రయత్నించి భంగపడ్డప్పుడు కూడా లత ఎలాంటి స్పందనను ప్రదర్శించలేదు. బహుశా వారి అహంకారాన్ని, అపోహలను అర్థం చేసుకుని మౌనంగా నవ్వుకుని ఉంటుంది. ‘లతకు నేనిది నేర్పించాను’, ‘నేను అది నేర్పించాను’ అనే వారి ప్రకటనలను కూడా లత ఎప్పుడూ ఖండించలేదు. స్పందించలేదు. నిజం తెలిసిన తరువాత ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా ఏమీ లాభం లేదు. అందుకే లత ‘యతీంద్ర మిశ్ర’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ముఝే భీ కహీ న కహీ బచ్‌పన్ సే హీ మన్ మే యహ దబా – ఛి ప ఎహసాస్ బనా రహా హై కి మై సిర్ఫ్ ఇసీలియే కుఛ్ అలగ్ హూ కి మై పండిత్ దీనానాథ్ మంగేష్కర్ కీ బేటీ హూ’ అంది (సురగాథ – పేజీ నెం. 218).

‘బాల్యం నుంచీ నేను పండిత్ దీనానాథ్ మంగేష్కర్ కూతురిని కాబట్టి, ఇతరుల కన్న భిన్నం అన్న భావన నా మనసులో ఉంది’ . అందుకే కొందరు ‘ఆయగే అనేవాలా’ తో లత జీవితం మలుపు తిరిగిందన్న అభిప్రాయం ప్రకటించినా లత కాదనలేదు. కానీ తనకు అవకాశం దొరికినప్పుడల్లా ‘నా లెక్క ప్రకారం మాస్టర్ గులామ్ హైదర్ వల్లనే సినీ సంగీత ప్రపంచంలో నాకు గుర్తింపు లభించింది. ఆయన వల్లనే నాకు ఇతరుల మద్దతు లభించింది. ఆయన వల్లనే నాకు ఖేంమ్‌చంద్ ప్రకాశ్, అనిల్ బిశ్వాస్ వంటి వారు పరిచయం అయింది. ‘మజ్బూర్’ సినిమా తరువాత పరిశ్రమలో నన్ను అందరూ గుర్తించటం ప్రారంభించారు. అడగకుండానే నాకు అవకాశాలు లభించాయి. అందరు సంగీత దర్శకులు, ఎవరో కొత్త అమ్మాయి లతా మంగేష్కర్‍ట, ఆమెను గులామ్ హైదర్, ఖేంచంద్ ప్రకాశ్‍లు మెచ్చి అవకాశాలు ఇస్తున్నారట అని అనుకునేవారు. ‘మజ్బూర్’ తరువాత నాకు ఏ సినిమాలో పాడే అవకాశం వచ్చినా దానికి కారణం మాస్టర్ గులామ్ హైదర్’  అని స్పష్టం చేస్తుంది లతా మంగేష్కర్.

దేశవిభజన సమయంలో మాస్టర్ గులామ్ హైదర్ పాకిస్తాన్ వెళ్ళాడు. అయితే అక్కడ సినీ పరిశ్రమలో సరైన స్వరాలు లభించక, అవకాశాలు లభించక ఆయన నిరాశచెందాడు. నవంబర్ 9, 1953న 45 ఏళ్ళ వయసులో గులామ్ హైదర్ మరణించాడు.

లత-గులాం హైదర్
లత-ఖేంచంద్ ప్రకాశ్

లత మంగేష్కర్ తన జీవితంలో ఎవరికి ఋణపడిఉండాలో, ఎవరెవరికి విధేయురాలై జీవితాంతం కృతజ్ఞత ప్రదర్శించాలో వారంతా ఒకరొకరిగా, ఆమె జీవితంలో తమవంతు పాత్ర పోషించి నిష్క్రమించారు. పండిత దీనానాథ్ మంగేష్కర్, మాస్టర్ వినాయక్‌లు మరణించారు. ఆమె గురువులు తమవంతు పాత్ర పోషించి వెళ్ళిపోయారు. గులామ్ హైదర్ ‘లత’ సినీరంగంలో స్థిరపడేందుకు మార్గం ఏర్పరచి వెళ్ళిపోయాడు. లత సినీరంగంపై ఏకఛత్రాధిపత్యం సాధించేందుకు దారి సిద్ధం చేసి ఖేంచంద్ ప్రకాశ్ వెళ్ళిపోయాడు. ఈ రకంగా లత ఎవరెవరి పట్ల జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలో వారంతా వెళ్ళిపోవటంతో,  లత,  తనకు అవకాశాలిచ్చిన వారికి, తాను విజయ పథంలో ప్రయాణించేందుకు తనతో పాటు ప్రయాణించిన వారికి  విథేయురాలిగా ఉంది తప్ప ఎన్నడూ ఎవరికీ కృతజ్ఞురాలిగా  ఉండలేదు. ఎవరెంతగా సన్నిహితులైనా ‘లత నా మాట వింటుంది. నేను చెప్పినట్టు చేస్తుంది’ అనేంత చనువు, ధైర్యం ఎవరికీ లేవు. జీవితంలో పోరాటాలన్నీ లత ఒంటరిగా చేసింది. ఈ పోరాటాలన్నిటిలో లత వెంట నిలిచింది, ఆమెకు తోడుగా ఉన్నదీ, ఆమె శక్తి, ఆమె విశ్వాసం,  ఆమె స్వరం మాత్రమే. అందుకే లత దైవాన్ని నమ్ముకుంది.  తన స్వరాన్ని నమ్ముకుంది. స్వరాన్నే ఆయుధంలా ప్రయోగించింది. తన స్వరంతోనే ప్రజలపై రసవృష్టి కురిపించింది. తన స్వరంతోనే తనను అవమానించినవారికి పాఠాలు నేర్పింది. స్వరంతోనే ప్రత్యర్ధులను మట్టికరిపించింది.  ప్రతి వ్యక్తికీ సన్నిహితురాలై, హితురాలై మార్గదర్శనం చేసింది. ఎవరికీ తలవంచలేదు. ఎవరినుంచీ ఏమీ ఆశించలేదు. అభ్యర్థించలేదు. తన పద్ధతిలోనే జీవించింది. తనకు నచ్చినపని నచ్చినట్టు చేసింది. నచ్చినవారితో పనిచేసింది. నచ్చనివారితో పనిచేయలేదు. ఒక్కసారి అమే కాదు అన్నతరువాత ఎవరెంతగా బ్రతిమిలాడినా ఆమె అవును అనలేదు. ఆమెని బెదిరించే ధైర్యం ఎవరికీలేదు. ఆమెకు ప్రత్యామ్నాయగాయనిలను నిలపాలని ప్రయత్నించి భంగపడ్డవారిని ఆమె ఏమీ అనలేదు. క్షమించింది. వారు మళ్ళీ తమకు పాడమన్నప్పుడు పాడింది. దీన్ని ప్రపంచం అహంకారంగా, ఆధిక్యంగా అనుకుంటే అనుకొమ్మంది. తానేమిటో తెలిసినవాడు  ఇతరుల మెప్పు  కోరడు. అపోహలను, విమర్శలను పట్టించుకోడు.  అందుకే లతా మంగేష్కర్ కష్టకాలం అధిగమించి విజయపథం వైపు సాగిపోతూ ‘ఆర్తి’ సినిమాలో రోషన్ స్వరపరచగా మజ్రూహ్ సుల్తాన్‍పురి రచించిన ఈ పాట పాడుతున్నదనిపిస్తుంది. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిమంతంగా నిలుస్తుంది.

కభీతో మిలేగీ, కహీతో మిలేగీ

బహరోంకి మంజిల్, రాహీ….

ఓ పథకుడా ఎప్పుడో, ఎక్కడో నీకు గమ్యం లభిస్తుంది. నడుస్తూ పోవటమే నీ పని.

లంబీ సహీ దర్ద్ కి రాహే, దిల్ కీ లగన్ సే కామ్ లే

ఆంఖోంకి ఇస్ తుఫాన్‍కో పీజా, ఆహోంకె బాదల్ థామ్‍లే

దూర్‍ తో హై పర్, దూర్ నహీ హై

నజారోంకి మంజిల్, రాహీ….

బాధలు కఠినం  కావచ్చు, మనోబలంతో,  దీక్షతో ముందుకు సాగాలి. కళ్ళల్లో చెలరేగుతున్న తుఫానులాంటి కన్నీళ్ళను పట్టించుకోవద్దు. నిరాశానిట్టూర్పుల మేఘాలను అదిమిపట్టు. నిజానికి సుందరమైన దృశ్యాల (సుఖసంతోషాల) గమ్యం ఎంతో దూరం ఉంది. కానీ నిజంగా  అంత దూరం కాదు. ముందుకు సాగిపో… 1945లో మాస్టర్ వినాయక్ మరణంతో అంధకారంగా, ఆగమ్యగోచరంగా అనిపించిన భవిష్యత్తు 1948 కల్లా స్పష్టమయింది. 1950 కల్ల లత అగ్రశ్రేణి గాయనిగా నిలిచింది. ‘దూర్ తో హై…. పర్ దూర్ నహీ హై’!!!

మానా కె హై గెహరా అందేరా

గమ్ హై డగర్ కీ చాంద్‌నీ

మైలీ నహో, ధుంధ్ లీ పడేనా

దేఖ్  నజర్‍ కీ చాంద్‍నీ

డాలే    హువే హై రాత్ కి చాదర్ 

సితారోంకి మంజిల్, రాహీ….

అత్యద్భుతమైన స్ఫూర్తివంతమైన కవిత్వం.

అంధకారం దీర్ఘతమం. దారిలో పరచుకున్నది వేదనామయమైన వెన్నెల. అంటే వేదనకే దారి చూపించే వెలుగుగా మలచుకొమ్మంటున్నాడు. కళ్ళల్లోని వెన్నెల తగ్గకూడదు, మలినం కాకూడదు. కళ్ళలో వెన్నెల అంటే ‘ఆశ’,  ఆత్మ విశ్వాసం. రాత్రి తారకల దుప్పటి పరచింది. ముందుకు సాగిపో నిరాశకు తావివ్వకుండా….

ఎంతో ధైర్యవంతులు కూడా భయపడి బలహీనమయ్యేటటువంటి పరిస్థితులను తట్టుకుని పోరాడి విజయశిఖరాలను అధిరోహించింది లతా మంగేష్కర్. అయితే అంకెల్లో , గణాంక వివరాలలో ఎంతో సులభంగా లతా మంగేష్కర్ విజయ సోపానాల్ని అధిరోహించింది అనిపించవచ్చు కానీ గణాంక వివరాలకు భావనలుండవు. అవి మనస్సు లేనివి. గణాంక వివరాల పొరలను తొలగించి చూస్తే, రెండు మూడు సంవత్సరాలలో అతి సులువుగా విజయం సాధించినట్టు కనబడినా, ఈ విజయం వెనుక లత పడిన శ్రమ, సాధన, అనుభవించిన ఆశ, నిరాశలు కనిపిస్తాయి. రికార్డింగ్ వ్యవస్థలో సాధించిన సాంకేతిక అభివృద్ధి ఏ రకంగా లత విజయానికి మార్గం సుగమం చేసిందో అన్న విషయాన్ని  పరిశీలిస్తే కానీ లతా మంగేష్కర్‍ను అర్థం చేసుకోవటం కుదరదు. వచ్చేవారం దృష్టి ఈవైపు.

***

Photo Credits: Internet

Exit mobile version