సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-8

3
2

[dropcap]యె[/dropcap] కౌన్ ఆయా, యె కౌన్ ఆయా

కర్‍  కే యే సోలా సింగార్, కౌన్ ఆయా

ఆఖోం మే రంగీన్ బహారే  లియే, లూట్ లియా

లూట్‍లియా యె కిస్‍నే దిల్‍ కా కరార్

మేరే దిల్ కా కరార్, తన్ మన్‍మే ఛాయా ప్యార్

ప్రేమ ధవన్ రాయగా,  ఖేమ్‌చంద్ ప్రకాశ్ బాణీ కుదిర్చిన ఈ పాట 1948లో విడుదలైన సినిమా ‘జిద్దీ’ లోని యుగళగీతం. దేవ్ ఆనంద్ హీరోగా నటించిన తొలి సినిమా ఇది. కామినీ కౌశల్ నాయిక.  ఈ సినిమాలోని మొత్తం తొమ్మిది పాటలలో లత ఆరు పాటలు పాడింది. ‘చందారే జారె’ పాట ఈనాటికీ వినిపిస్తూ శ్రోతలను పరవశులను చేస్తుంది. ఈ సినిమాతో కిషోర్ కుమార్ సినీరంగ ప్రవేశం చేశాడు. ‘మర్‌నే కి దువాయే క్యూన్ మాంగూ’ అంటూ దేనానంద్ స్వరంగా నిలిచాడు. ఈ సినిమాలో కిషోర్ కుమార్ లతల ప్రథమ యుగళగీతం ‘యె కౌన్ ఆయా’ ఓ రకంగా సినీ ప్రపంచం లత గురించి పాడిన పాట అనిపిస్తుంది. ఈ పాట రికార్డింగ్ వెనుక ఓ కథ ఉంది.

ఆ కాలంలో లతా మంగేష్కర్‍కు ఓ అలవాటుండేది. ఎవరైనా తన దగ్గర ఉన్న ఏదైనా వస్తువు ‘చాలా  బాగుంది’ అని పొగిడితే ‘ఇది మీరు ఉంచుకోండి’ అని ఆమె వాళ్ళకి ఆ వస్తువు ఇచ్చేసేది. ఆ కాలంలో ‘నక్షాబ్ జర్చవి’ అనే గేయ రచయిత ఉండేవాడు. ‘జర్చవి’ అన్నది ఉత్తర ప్రదేశ్‍లో ఆయన జన్మ స్థలం. ఆయన 1940లో బొంబాయి వచ్చాడు. 1945లో ‘జీనత్’ సినిమాలోని ఖవ్వాలి సూపర్ హిట్ అవటంతో ఆ ఖవ్వాలి రచయితగా ‘నక్షాబ్’ మంచి పేరు సంపాదించాడు. ‘మహల్’లో ‘ఆయెగా ఆనెవాలా’ పాటల రచయితగా ఈయన చిరకీర్తి నార్జించాడు. 1946 నుండి 1950 నడుమ ఈయన అయిదు సినిమాల్లో రాసిన పదమూడు పాటలను లత పాడింది.

మహల్ పాట రాయక ముందరి సంఘటన ఇది.

నక్షాబ్ రాసిన పాట పాడేందుకు లత రిహార్సల్స్ చేస్తోంది. అప్పుడప్పుడే లత పేరు సినీరంగంలో వినబడుతోంది. లత  సంగీత దర్శకుడు హన్స్‌రాజ్ బహల్ వద్ద పాట  నేర్చుకుంటుండగా పక్కనే ఉన్న ‘నక్షాబ్’,  మాటిమాటికీ లత వద్ద పార్కర్ పెన్‍ను పొగడటం  ఆరంభించాడు. ఆ పెన్ మీద లత పేరు చెక్కి ఉండేది. అతడు పొగుడుతూంటే, అలవాటు ప్రకారం ‘మీకు అంత నచ్చితే పెన్ను మీరు ఉంచుకోండి’ అని లత అతనికి పెన్ను ఇచ్చేసింది. దానిపై తన పేరు ఉన్న విషయం మరిచిపోయింది. లత ఇచ్చిన పెన్ను తీసుకుని ‘నక్షాబ్’ అందరికీ చూపుతూ, తనకూ లతకూ నడుమ ఎంతో సాన్నిహిత్యం ఉందని అందరికీ చెప్పటం ప్రారంభించాడు.  లత పేరున్న పెన్ను అతని దగ్గర ఉంది.  ఇది లతను ఇబ్బందిలో పడేసింది. ఎవ్వరూ వేలెత్తి చూపకుండా తన వ్యక్తిత్వాన్ని ఆమె కాపాడుకుంటూ వస్తోంది. పైగా, ఒక్కసారి దురభిప్రాయం ఆమె గురించి సినీ ప్రపంచంలో ఏర్పడిందంటే ప్రతి ఒక్కరూ వెర్రి వేషాలువేయటం తమ హక్కు అనుకుంటారు( ఇది కేవలం సినీ రంగంలోనే కాదు, రంగం ఏదయినా ప్రతిమహిళకూ వర్తిస్తుంది.)  పైగా లత అప్పుడప్పుడే పేరు సంపాదిస్తున్నది. ఆయన అప్పటికే పేరు పొందిన గీత రచయిత. ఆకాలంలో  సినిమాలలో పనిచేసే వారిపై మంచి అభిప్రాయం అంతగా ఉండేది కాదు.

సాదత్ హాసన్ మాంటో రాసిన ‘Stars of another Sky’ చదివితే ఆ కాలంనాటి సినీ కళాకారులంటే ఎందుకని మంచి అభిప్రాయం ఉండేది కాదో అర్థమవుతోంది. ‘మాంటో’ రచనలో కూడా ఒక ‘చులకన అభిప్రాయం’ కనిపిస్తుంది. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన జెర్రీ పింటో ‘It is equally difficult  to tell from the pieces where Manto stood on the issue of women. The male gaze is deployed time and again, sometimes slyly, some times directly’ అనకుండా ఉండలేకపోయాడు.

ఉదాహరణకు నూర్జహాన్ గురించి రాస్తూ ‘And Finally Saadat Hasan Manto who cannot stand the sight of her awful brassiere, what beauty she sees in her upturned  front bumpers and why Syed Shaukat Hassan Rizvi permits this gross violation of taste, I am unable to say’ అంటూ తేలిక భావన కలిగేలా రాస్తాడు మాంటో. ‘మల్లికా-ఎ-తరన్నుమ్’ గా అందరి మన్ననలందుకుంటూ, వివాహమై,  పిల్లలున్న నూర్జహాన్ గురించి ఓ ప్రఖ్యాత రచయిత ఈ రకంగా ఆలోచిస్తే ఇంకా పేరు పొందని 16 – 17 ఏళ్ళ యువతి గురించి , ఓ పేరు పొందిన గేయ రచయిత ఎలా ఆలోచిస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో ఊహించటం కష్టం కాదు. ఎంత గొప్పదైనా సినీరంగంలో స్పాట్‍బాయ్ నుంచి సామాన్య ప్రేక్షకుడి వరకూ ‘మహిళ’ అంటే చులకన అన్నది కాదనలేని ‘చేదునిజం’. అయితే ఎవరెంత చులకన చేసినా తన ప్రవర్తన మహిళకు రక్షణ, గౌరవం అన్నదీ కాదనలేని సత్యం.

తమ గురించి లేనిపోని సాన్నిహిత్యం కథలు కల్పిస్తూ, చెప్తూ, తిరుగుతున్న నక్షాబ్‍ను లత మౌనంగా భరించింది. ఇంకా స్థిరపడకముందే ‘చెడ్డపేరు’ (సినీరంగంలో మహిళ చెడ్డపేరును ప్రత్యేకంగా నిర్వచించనవసరం లేదు) సంపాదించటం, జీవితం కోసం సినిమాలపై ఆధారపడ్డ తనకు కూడదని భావించింది లత.

ఓసారి నౌషాద్ సంగీత దర్శకత్వంలో నక్షాబ్ పాట రికార్డింగ్ అవుతోంది. అది ప్రేమ గీతం. నక్షాబ్ విజృంభించాడు. అందరిముందు ప్రేమను పాటలో ఎలా ఒలకబోయాలో నేర్పించటం మొదలుపెట్టాడు. పాటలోని పంక్తులలోని శృంగార రసాన్ని అత్యంత ఆనందంగా వివరిస్తూ ‘నువ్వు నాలాంటి వాడినెవరినో గాఢంగా ప్రేమిస్తున్న నీ అనుభవంలోంచి రసాన్ని చిలకరించాలి’ వంటి భావం వచ్చేట్టు మాట్లాడేడు. స్టూడియోలో అందరిముందు గొడవ ఎందుకని అతని పిచ్చిమాటలను భరిస్తూ లత రికార్డింగ్ పూర్తి చేసింది.

కొన్నాళ్ళకు అతను చెప్పాపెట్టకుండా లత ఇంటికి వచ్చాడు. అప్పుడు లత వాళ్ళు ‘నానాచౌక్’ రెండు గదుల ఇంట్లో ఉంటున్నారు. వరండాలో చెల్లెళ్ళతో ఆటలాడుతున్న లత,  చెప్పాపెట్టకుండా  ఊడిపడ్డ నక్షాబ్‍ను చూసింది. సినిమా కలుషిత వాతావరణం నుంచి తన కుటుంబాన్ని దూరం ఉంచాలన్నది మొదటి నుంచి లత నిర్ణయం. అందుకే ఆమె రికార్డింగులకు ఒంటరిగా వెళ్ళేది. నిజం చెప్పాలంటే, లతకు తోడుగా రికార్డింగ్‍లకు వచ్చేందుకు ఎవరూలేరు. ఇది కూడా లత పట్ల కొందరికి చులకన అభిప్రాయం కలగటానికి కారణం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సినిమాల్లో మహిళ కళాకారుల వెంట సాధారణంగా ఎవరో ఒకరు ఉంటారు తోడుగా. శంషాద్ బేగం వెంట ఆమె చాచా వచ్చేవాడు. గీతాదత్ వెంట ఆమె తండ్రి వచ్చేవాడు. లత ఒంటరిగా వెళ్ళి వచ్చేది.

ఇంటికి వచ్చిన నక్షాబ్‍ను ఆమె ఇంటికి దూరంగా తీసుకువెళ్ళింది. కొంగు నడుములో దోపి, రోష కషాయిత  నేత్రాలతో… ‘ఆప్‍ నే ముఝ్‍సే పూఛే బగైర్ యహాన్ ఆనే కీ హిమ్మత్ కైసీ కీ? అగర్ దుబారా యహాన్ నజర్ భీ ఆయేతో టుక్డే టుక్డే కర్వాకే ఇసీ నాలీమే ఫెక్ దూంగీ జాన్తే హౌ న, మై మరాఠా ఔరత్ హూ’ అంది. లత మాటల్లోనే చెప్పాలంటే ‘నా అనుమతి లేకుండా ఎలా ఇక్కడికి వచ్చే ధైర్యం చేశారు? ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే ముక్కలు ముక్కలు చేసి ఈ నాలాలో పారేయిస్తాను. నేను మరాఠీ మహిళను’  అంది(లతా దీదీ: అజీబ్ దాస్తాన్  హై యే By హరీష్ భిమానీ Page No. 214).

ఈ కథ ఇంతటితో అయిపోలేదు. లత ఒంటరిగా స్టూడియోకి వచ్చేప్పుడు, రికార్డింగులు పూర్తి చేసుకుని రైలులో ఇంటికి వెళ్ళేప్పుడు  ఆమెని వెంబడించేవాడు నక్షాబ్. ఆమె ఎదురుగా కూర్చుని ఏదో మాట్లాడుతుండేవాడు. ప్రేమ కవితలు వినిపించేవాడు. చివరికి ఒకరోజు ఈ విషయం లత ఖేమ్‍చంద్ ప్రకాశ్‍కు చెప్పింది. అది వింటూనే ఖేమ్‌చంద్ ప్రకాశ్ కోపం పట్టలేకపోయాడు. నక్షాబ్‍ను ఛడామడా తిట్టాడు. అతడి దగ్గర నుంచి పెన్ను లాక్కుని లతకు ఇచ్చేశాడు. అంతేకాదు, ఆ రోజు నుంచి రికార్డింగ్ పూర్తయిన తరువాత లతను ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యత, ఇంటినుంచి స్టూడియో వరకూ తెచ్చే బాధ్యతను భోలా శ్రేష్ట (శుష్మశ్రేష్ఠ తండ్రి) కు అప్పగించాడు ఖేమ్‍చంద్ ప్రకాశ్. నక్షాబ్‍ నుంచి తన పెన్ను తన దగ్గరకు రాగానే లత సముద్రంలోకి ఆ పెన్నును విసిరేసింది. అంతేకాదు, ఆ తరువాత ఆమె జీవితాంతం పార్కర్ పెన్నును వాడలేదు. కొనలేదు. ఈ నక్షాబ్ తరువాత నిర్మాత కూడా అయ్యాడు. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ సినిమాలు నిర్మించాడు. ఈయన ‘నాషాద్’ అనే సంగీత దర్శకుడిని కూడా పాకిస్తాన్ రప్పించుకున్నాడు

 ఓ రోజు అనుకోకుండా లత ఒంటరిగా రైలులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఆమెను ప్లాట్‌ఫారం పై నుంచి ఓ యువకుడు వెంబడించాడు. రైలులో ఆమె ఎదురుగా కూర్చున్నాడు. రైలు దిగిన తరువాత టాంగా ఎక్కింది లత. అతనూ టాంగాలో వెంబడించాడు. లత గబగబా స్టూడియోలోకి వెళ్ళింది. ఆ యువకుడూ స్టూడియోలోకి వచ్చాడు. తిన్నగా ఖేమ్‌చంద్ ప్రకాశ్‍ వద్దకు వెళ్ళింది. వెన్నంటి వచ్చాడు యువకుడు. అతడిని చూపించి ఖేమ్‍చంద్ ప్రకాశ్‍కు ఫిర్యాదు చేసింది. ‘ఇతడెవరో కాదు, మన స్టూడియో యజమానుల్లో ఒకడైన అశోక్ కుమార్ సోదరుడు కిషోర్ కుమార్. ఇతడే నీతో ఈ రోజు యుగళగీతం పాడేది’ అని పరిచయం చేశాడు ఖేమ్‍చంద్ ప్రకాశ్. కిషోర్ కుమార్ తన వెనుక పడ్డాడని లత భ్రమించేందుకు అంతకు ముందు నక్షాబ్‍తో ఉన్న చేదు అనుభవం కారణం (ఈ సంఘటనను ఓ తెలుగు పత్రిక లత ప్రేమ కథగా భావించింది.)..

‘నక్షాబ్’ ఉదంతాన్ని ధృవీకరిస్తూ నౌషాద్ మరో సంఘటనను చెప్తాడు. ‘చాంద్‌నీ రాత్’ అనే సినిమాకు నౌషాద్ సంగీత దర్శకుడు. ఆ సినిమాలో లత ప్రఖ్యాత గాయకుడు దుర్రానీతో పాట పాడాల్సి ఉంది. గులామ్ ముస్తఫా దుర్రానీ, జి.ఎం దుర్రానీగా పేరుపొందిన గాయకుడు. సైగల్ లాంటి గాయకుడి సమకాలికుడై కూడా తనదైన గాన సంవిధానాన్ని నిలుపుకున్నాడు దుర్రానీ. ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫీకి ఆదర్శం జి.ఎం. దుర్రానీ . దుర్రానీని అనుసరిస్తూ తన గాన శైలిని రూపొందించుకున్నాడు రఫీ. అంత ప్రఖ్యాతి పొందిన  దుర్రానీతో, కొత్త గాయని లత పాట పాడాలి.

ఆ కాలంలో రెండే మైకులుండేవి. ఒకటి వాయిద్యకారులకు, రెండవది గాయనీ గాయకుల కోసం. యుగళగీతం పాడాలంటే గాయనీ గాయకులు ఎదురు బదురుగా ఉండి పాడేవారు. కొత్త అమ్మాయిని చూస్తూనే దుర్రానీ అల్లరి ప్రారంభించాడు. తనవంతు పాడేసి లత పాడే సమయంలో అల్లరి చేసేవాడు.

‘కొత్త అమ్మాయి. నువ్విలా చేస్తే అమ్మాయి భయపడుతుంది. సరిగ్గా పాడలేదు. నీవంతు పాడేసి నిశ్శబ్దంగా కదలకుండా నిలబడు. కళ్ళు దించుకో’ అని నౌషాద్ అతడికి సలహా ఇచ్చాడు. కానీ దుర్రానీ సౌషాద్ మాటలను పట్టించుకోలేదు. అల్లరి చేస్తూనే పోయాడు. చివరికి లత దుస్తులపై వ్యాఖ్యానించాడు. “లతా!…. రికార్డింగ్‍కి వచ్చేటప్పుడు కాస్త సంతోషాన్ని సూచించే బట్టలు వేసుకుని రావాలి. తెల్లటి ధోతి చుట్టుకుని  రొమాంటిక్ పాటలు పాడటానికి వస్తే ఎలా?” అన్నాడు.

ఒకటి దుస్తులపై వ్యాఖ్యానించాడు, రెండు ఏకవచన ప్రయోగం చేశాడు. ‘ఇతనికి పాటతో పనా? నా బట్టలతో పనా?‘ అనుకుంది లత. ఇక ఇతనితో కలిసి పాడకూడదని నిశ్చయించుకుంది. ఆ కాలంలో లత అప్పుడప్పుడే పైకి వస్తున్న గాయని. దుర్రాని ఎంత ఫేమస్ అంటే, అతనికి మూడు కార్లుండేవి. అందులో ఒక కారు ‘మొబైల్ బార్’ లాంటిది. అలాంటి వాడితో ఇక పాటలు పాడనని ప్రకటించటం అంటే ఆత్మహత్య చేసుకున్నట్టే. కానీ లత స్వాభిమానం తనకు మర్యాదనివ్వని వాడితో కలసి పాటలు పాడనివ్వలేదు. నౌషాద్ ఆమెకు ఎంతగానో నచ్చచెప్పాలని చూశాడు. ‘ఇంకా నీ కెరీరు ఆరంభంలోనే ఉంది. నువ్వు ఈ రంగంలో స్థిరపడిన తరువాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇష్టం వచ్చిన వారితో పాడు. లేనివారికి పాడకు. కానీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం మంచిది కాదు. కాస్త ఓపిక పట్టు’ అని ఎంతగానో చెప్పాడు. కానీ ‘నౌషాద్ నా తండ్రిలాంటి వాడు’ అంటూనే లత తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. చివరికి నౌషాద్ పాట రికార్డింగ్ ను కేన్సిల్ చేయాల్సివచ్చింది.

లత ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో దుర్రానీ అగ్రస్థాయి నేపథ్య గాయకుడు. సైగల్ మరణంతో తిరుగులేని గాయకుడిగా ఎదిగాడు దుర్రానీ. ఆ కాలంలో దుర్రానీ పాట పాడటానికి రావటం మహాభాగ్యంలా భావించేవారు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు స్టూడియోకు వచ్చేవాడు. అలాంటి వాడితో ఇంకా పాటల ప్రపంచంలో సరిగ్గా అడుగు కూడా పెట్టని అమ్మాయి పాడకూడదని నిర్ణయం తీసుకోవటం ‘ఆత్మాభిమానం’ అని సమర్థించాలని ప్రయత్నించినా ‘మూర్ఖత్వం’ లాంటిదే. కానీ లత మంగేష్కర్ నిర్ణయం తీసుకుంది. అతనితో పాటలు పాడలేదు. అయితే భవిష్యత్తులో లత అగ్రశ్రేణి గాయనిగా ఎదిగింది. దుర్రానీతో కలిసి ‘కోరస్’లో పాడటమే ‘మహాభాగ్యం’లా భావించిన యువగాయకుడు మహమ్మద్ రఫీ, కొన్నాళ్ళకి అగ్రశ్రేణి గాయకుడయ్యాడు. దుర్రానీకి పాటలు పాడే అవకాశాలు లభించక కనుమరుగయ్యాడు. కొన్నాళ్ళకి చిన్న చిన్న వేషాలు వేసే స్థితికి దిగజారాడు దుర్రానీ. చివరి దశలో ‘వరలీ నాకా’ దగ్గర బీడీ తాగుతూ రోడ్డుమీద నుంచుని కనిపించేవాడు. హిందీ సినీ పరిశ్రమలో దుర్రానీ పాడిన చివరి పాట ‘హమ్ సబ్ చోర్ హై’ సినిమాలో ‘హమ్ కో హస్తే దేఖ్ జమానా జల్తాహై’ . ఈ పాటను దుర్రానీ రఫీతో కలిసి పాడేడు.

మరో సంఘటన:

శ్యాం సురిందెర్ అనే సంగీత దర్శకుడు ఆకాలంలో ఎంతో ఫేమస్. రఫీని బొంబాయి ఆహ్వానించిందీయననే. ఈయనకు తాగుడు అలవాటుండేది. తాగి మ్యూజిక్ సిట్టింగుల్లో కూచునేవాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు. అతని ధోరణి నచ్చక లతా అతనికి పాడనని బయటకు వచ్చేసింది. కేరీరు ఆరంభంలోనే లతా ఎవ్వరికీ లొంగదని, పిచ్చివేషాలు సహించదన్న ఇమేజీని సాధించింది. ఈ ఇమేజీ వల్ల ఆమె అంటే అందరికీ గౌరవం పెరిగింది. ఆ గౌరవాన్ని ఆమె నిజాయితీ పెంచింది. ఆమె స్వరం ఇనుమడింపచేసింది.

ఇలాంటిదే మరో సంఘటన:

ఖుర్షీద్ అన్వర్ అనే సంగీత దర్శకుడు ఉండేవాడు. ఈయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూ సినిమాల్లోకి వచ్చాడు. 1943లో ‘ఇషారా’ సినిమాతో హిట్ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. తరువాత కాలంలో పేరుపొందిన సంగీత దర్శకుడు రోషన్ ఈయన సహాయకుడు. శంకర్ జైకిషన్ ద్వయంలోని శంకర్ ఈయన వద్ద పనిచేశాడు. అలాంటి ఖుర్షీద్ అన్వర్ నుంచి లతకు పిలుపు అందింది. అప్పటికి ‘మహల్’ వంటి సినిమాల విడుదల చాలా దూరంలో ఉంది. ఖుర్షీద్ అన్వర్ పిలుపునందుకుని అతని దగ్గరకు వెళ్ళేసరికి ఖుర్షీద్ అన్వర్ గదిలో లేడు. ఆ గదిలో ఇద్దరే ఉన్నారు. ఒకరు హార్మోనియంతో, మరొకరు సారంగితో. వారిలో హార్మోనియం అతను లతను కూర్చోమన్నాడు. కూర్చోగానే ‘పాట నేర్పుతాన’న్నాడు. ‘మీరు ఖుర్షీద్ సాహెబ్ గారా?’ అనడిగిండి లత.

“ఖుర్షీద్ సాహెబ్ బాణీ తయారుచేసి ఇస్తాడు. అతడికి హార్మోనియం వాయించటం రాదు. పాట పాడటం రాదు. నేర్పించటం రాదు. అతడికి సహాయకుడిని నేను. పాటను నేను నేర్పిస్తాను’ అన్నాడు.

‘పాటను వాయిద్యంపై వినిపించి కానీ, పాడి కానీ నేర్పించని సంగీత దర్శకుడి పాటలు నేను పాడను’ అంటూ లేచి వచ్చేసింది లతా మంగేష్కర్ మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా. ఇది స్వాభిమానమా? స్వేచ్ఛా ప్రవర్తననా? అహంకారమా? మూర్ఖత్వమా? లత విజయం సాధించి అగ్రశ్రేణి గాయనిగా నిలిచింది కాబట్టి, లత ప్రవర్తనను ఆత్మాభిమానంగా పరిగణించాల్సి వస్తుంది. కానీ లత విజయం  సాధించక పోయి ఉంటే, ఈ ప్రవర్తనను అహంకారంగా, మూర్ఖత్వంగా భావించి ఉండేవారు. అయితే లత కానీ, మహమ్మద్ రఫీ కానీ 1947 తరువాత నుంచి ఉత్తమ శ్రేణి గాయనీ గాయకులుగా గుర్తింపు పొంది, అచిరకాలంలోనే అగ్రశ్రేణి గాయనీ గాయకులుగా ఎదగటానికి కారణాలు 1940 – 50 నాటి సినీ రంగంలోని పరిస్థితులు, అప్పటి గాయనీ గాయకులు, సంగీత దర్శకులతో సహా పరిశీలిస్తే స్పష్టమవుతాయి. ఒక రకంగా సినీరంగం ఈ ఇద్దరు విజయం సాధించటం కోసం పరిస్థితులను సిద్ధం చేస్తోందనిపిస్తుంది, ఇప్పుడు వెనుతిరిగి చూస్తూ అప్పటి పరిణామాలను పరిశీలిస్తే.

హిందీ సినిమాలలో పాటలు ప్రజాదరణ అందుకుంటున్న సమయంలో, కోల్హాపూర్‍లో నాలుగేళ్ళ లత, బంధువు ఇందిర వద్ద హిందీ నేర్వటం ప్రారంభించింది. లత ఇంట్లో విఠల్ అనే సేవకుడు మరాఠీ నేర్పించటం ప్రారంభించాడు. అయితే తండ్రితో డ్రామాలలో తిరుగుతూండటం వల్ల ఆమె చదువు సక్రమంగా సాగలేదు. బొంబాయి చేరుకున్న తరువాత, మాస్టర్ వినాయక్ రావు పిల్లలకు హిందీ నేర్పే మాస్టర్ లేఖరాజ్ శర్మనే, లతకు హిందీ నేర్పాడు. హిందీని లత తప్పనిసరిగా నేర్వాలని మాస్టర్ వినాయక్ ఆదేశించాడు. ప్రఫుల్ల పిక్చర్స్ లోని డైరెక్షర్ రామ్ గబాడే లతకు ఇంగ్లీషు నేర్పించాడు. హిందీ, ఇంగ్లీషు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించాడు. తరువాత ‘హర్దీకర్’ అనే పూజారి వద్ద లత సంస్కృతం నేర్చుకుంది. సంస్కృతం నేర్పటం వల్ల ఏ భాష పదాన్నయినా స్పష్టంగా, సరిగ్గా ఉచ్చరించే వీలు కలుగుతుంది. దీనికితోడు లత ఉర్ధూ భాషలో ప్రావీణ్యం సాధించేందుకు దారితీసిన సంఘటన పలువురు ఉదాహరిస్తారు. సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్‍తో లత రైలులో ప్రయాణిస్తున్నప్పుడు,  ఆ రోజు , వారి ఎదురుగా దిలీప్ కుమార్ ఉన్నాడు. బిశ్వాస్ లతను దిలీప్‍కు పరిచయం చేశాడు. లత మరాఠీ అమ్మాయి అని తెలుసుకున్న దిలీప్ కుమార్ చులకనగా ‘మరాఠీ అమ్మాయి ఉర్దూ ఏం పాడుతుంది? వీళ్ళ ఉర్దూలో పప్పన్నం (దాల్ భాత్) వాసన వస్తుంది. ఉర్దూ పరిమళం వీళ్ళకి ఏం తెలుస్తుంది ?’ అన్నాడు అహంకారం ఉట్టిపడుతుండగా. ఆ సమయంలో లత మౌనంగా ఉండిపోయింది.

ఇక్కడ లత స్వభావంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆమెకు తన పనిలో ఎవరయిన తప్పు చూపించే అవకాశం ఇవ్వడం ఇష్టం ఉండదు. తన పనిలో తప్పు చూపించటం అంటే, తన తండ్రి శిక్షణలో లోపాన్ని ఎత్తి చూపించటం. అది తండ్రికి అవమానం. అందుకని ఆమె తప్పు చేయకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. “Sometimes I Think people like Lataji, Ghalib, Beethoven and Shakespeare are far removed from the normal chain of human civilization. If they were first role models how come no one was able to achieve an iota of their perfection! They are intruders of civilization who came as reminders of the rule of mediocrity that prevails. Lathaji belong to a different league’  అంటాడు జావేద్ అక్తర్ ఎలాంటి పొరపాట్లు లేకుండా, ఒకరు వేలెత్తి చూపించే అవకాశం లేకుండా పాడాలన్న లతా మంగేష్కర్ తపన, ఫలితంగా గానంపై సాధించిన సంపూర్ణమైన పట్టు గురించి.

ఆ కాలంలో ‘హిందీ’ సినిమాలలో ఉర్దూ వాడకం అధికంగా ఉండేది. ‘ఉర్దూ’ పదాలు సంభాషణల్లోనూ, పాటల్లోనూ అధికంగా వాడేవారు. అందుకే వాటిని ఉర్దూ హిందీల కలగలుపు ‘హిందుస్తానీ’ సినిమాలు అనేవారు. అంతకుముందు ‘బడీ మా’ షూటింగ్ సమయంలో రచయిత జియా సర్హదీ, ఉర్దూ ఉచ్చారణను సరిచేసుకోమని ‘బేటా! జరా అప్‍  తలప్ఫుజ్ ఠీక్ కరో! తుమ్ మేరీ పాస్ ఆకర్ బైఠా కరో, మై తుమ్హే సహీ జుబాన్ సిఖావూంగా’ అన్నాడు. కానీ అప్పుడు అతని దగ్గర ఉర్దూ నేర్చుకునే తీరిక లతకు చిక్కలేదు. ఇప్పుడు దిలీప్ కుమార్ అదే ప్రస్తావన తెచ్చి హేళన చేయటంతో లతకు పట్టుదల హెచ్చింది. అదే రోజు సంగీత దర్శకుడు మహమ్మద్ షఫీ దగ్గరకు వెళ్ళి ఉర్దూ నేర్పించమని  అడిగింది. ఆ సమయంలో మహమ్మద్ షఫీ అనిల్ బిశ్వాస్, నౌషాద్‍లకు సహాయ సంగీత దర్శకుడిగా ఉండేవాడు. షఫీ లతాకు మౌల్వీ ఉస్తాద్  మహబూబ్‍ను పరిచయం చేశాడు. ఆయన ఉర్దూ సాహిత్యాన్ని, షేర్ షాయరీని, గజళ్ళను లతకు పరిచయం చేశాడు, నేర్పించాడు. రికార్డింగ్‍కు, రిహార్సల్స్‌కు రైళ్ళలో వెళ్ళేటప్పుడు లత హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు సాహిత్యం చదువుతూ వెళ్ళేది. ఆ రకంగా, లత హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ఎలాంటి పాఠశాల చదువు లేకుండా, డిగ్రీలు లేకుండానే ప్రావీణ్యం సంపాదించింది. శాస్త్రీయ సంగీతం, లలిత గీతాలు, సాహిత్యంలలో ప్రావీణ్యం సంపాదించటం ఒక రకంగా లతను ఇతర సమకాలీన గాయనీ గాయకుల కన్నా కొన్ని అడుగుల ముందు ఉంచిన అంశం.

1946లో ‘సుభద్ర’ అనే సినిమాకు లత పనిచేస్తూండేది. ఆ సినిమాలో నాయిక శాంతా ఆప్టే. ఆమె మాటలలో తాను తమిళ భాషలో పాటను రికార్డు చేశానని లతకు చెప్పింది. అప్పటికి లతకు పదిహేను, పదహారేళ్ళుంటాయి. శాంతా ఆప్టే మాటలు లత హృదయంలో తిష్ట వేసుకున్నాయి. భవిష్యత్తులో తానూ పలు భాషలలో పాడాలని కోరిక కలిగింది. ఫలితంగా ఆమె దాదాపుగా 36 భాషలలో పాటలు పాడింది. ఈ రకంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం, నిరంతరం దానికోసం శ్రమించటం, ఆ లక్ష్య సాధన కోసం సర్వశక్తులను కేంద్రీకరించి, ఇతర విషయాలన్నిటినీ విస్మరించటం లత విజయం సాధించటానికి ఎంతగానో దోహదపడిన అంశం.

లత సినీరంగంలో అడుగుపెట్టే నాటికి నేపథ్య గానం అభివృద్ధి చెందుతోంది. కానీ నటీనటులు తమ పాటలు తామే పాడుకోవటం పూర్తిగా అంతరించలేదు. ఎందుకంటే నేపథ్య గానానికి సౌకర్యం ఉన్నా పాడేందుకు సరైన గాయనీ గాయకులు లేరు. అప్పటి గాయనీ గాయకులకు పాటలు పాడటంలో శిక్షణ అవసరం అయ్యేది. మైకు ముందు నుంచుని పాడటం నేర్పించాల్సి వచ్చేది. గాయనీ గాయకులకు స్వరం బాగున్నా స్వరంపై నియంత్రణ ఉండేది కాదు. స్వరం భావాలు పలికినా పాట స్థాయిని పెంచే రీతిలో అలంకారాలు వేయగలిగేవారు కారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ లేకపోవటం వారిలో ప్రధాన లోపం. దానితో సంగీత దర్శకులు బాణీల సృజనలో పలు ప్రతిబంధకాలను ఎదుర్కొనేవారు. పలు సందర్భాలలో సంగీత దర్శకులు తామే పాటలు పాడేవారు. గాయకులు పాడిన పాటలు వారికి సంతృప్తినిచ్చేవి కావు.

అనిల్ బిశ్వాస్‌కు గాయకుడిగా ముకేష్ పరిచయమయ్యాడు. అతడికి అవకాశం ఇవ్వాలని అనిల్ బిశ్వాస్ ప్రయత్నించాడు. కానీ ముకేష్ పాడిన పాట అనిల్ బిశ్వాస్‍కు సంతృప్తినివ్వలేదు. దాంతో ఆ పాట తానే పాడాలనుకున్నాడు. అది ముకేష్‍కు నిరాశ కలిగించింది. ‘ఇక సంగీత దర్శకులే పాటలు పాడుకుంటే మాలాంటి నేపథ్య గాయకులకు అవకాశాలు ఎవరిస్తారు?’ అన్నాడు. అప్పటికే సంగీత దర్శకుడు సి. రామచంద్ర, చితల్కర్ పేరుతో పాటలు పాడుతున్నాడు. ముకేష్ అన్నమాటలు అనిల్ బిశ్వాస్‍కు సమంజసం అనిపించాయి. దాంతో నిర్మాత మాటను కాదని ‘పహలీ నజర్’ సినిమాలో ముకేష్‍తో ‘దిల్ జల్తా హై  తో జల్నేదో’ పాటను పాడించాడు. సైగల్ పంథాలో ముకేష్ పాడిన ఈ పాట ముకేష్‍కు గాయకుడిగా గుర్తింపు నిచ్చింది. అంటే, అప్పటికే నేపథ్య గానం సినీరంగంలో ప్రవేశించినా, తమ పాటలు తామే పాడుకునే నటీనటులు అగ్రస్థానంలో ఉండటంతో నేపథ్యగానం అంతగా ప్రాచుర్యం పొందలేదు. సురయ్య ఆరంభంలో నేపథ్యంలో ఓ పాట పాడినా (మహ్తాబ్ అనే నటికి)తన పాటలు తానే పాడుకునేది. సురయ్య, నూర్జహాన్, సైగల్, సురేంద్ర, అశోక్ కుమార్ వంటి నటీనటులు అగ్రస్థాయికి చెందినవారు. తమ పాటలు తామే పాడుకోవటంతో నేపథ్య గాయనీ గాయకులకు అంతగా ప్రాధాన్యం లేని పరిస్థితి నెలకొని ఉండేది. అందుకే అప్పుడు రికార్డులపై గాయనీ గాయకుల పేర్లు ఉండేవి కావు.

1936లో రేడియో పనిచేయటం ప్రారంభించింది. గ్రామఫోన్ కంపెనీల గ్రామఫోన్లు సామాన్యులు కొనలేకపోయేవారు. వారికి రేడియోల్లోని పాటలు వినటమో, సినిమా మళ్ళీ మళ్ళీ చూడటమో తప్ప గత్యంతరం ఉండేది కాదు. రేడియోల్లో కూడా సినిమా పాటలను ప్రసారం చేయటం పాట ప్రాధాన్యం పెంచింది. పాటలు విని సినిమాలు చూడాలని తహతహలాడటం పాటల వ్యాపార విలువను పెంచింది.

లత మంగేష్కర్‍కు రేడియో కొనాలని ఎంతో కోరికగా ఉండేది. రేడియో కొని ఆ రేడియోలో పాటల ప్రకటనలో తన పేరు వినాలని, తన గొంతు రేడియోలోంచి వస్తూంటే వినాలని ఆమెకు ఎంతో కోరికగా ఉండేది. అతికష్టం మీద డబ్బులు జమ చేసుకుని రేడియో కొన్నది. ఎంతో ఆశగా రేడియో పెట్టుకుని పాటలు విందామనుకున్న లతా మంగేష్కర్‍కు రేడియోలో ప్రథమంగా వినిపించింది సైగల్ మరణవార్త! దాంతో ఆమెకు రేడియోపై ఆసక్తి చచ్చిపోయింది. ఎక్కువ ధరను పెట్టి కొన్న రేడియోను మరుసటి రోజు తక్కువ ధరకు అమ్మేసింది. మళ్ళీ రేడియో ప్రసక్తి తేలేదు. అయితే సైగల్ మరణంతో, నేపథ్య సంగీతంకి ఉన్న పెద్ద అడ్డు తొలగిపోయింది. గాయకులకూ అవకాశాలు మెరుగయ్యాయి. కొత్త కొత్త నటీమణులు రంగ ప్రవేశం చేస్తూండటంతో గాయనిలకూ అవకాశాలు పెరిగాయి.

మారుతున్న ట్రెండ్‍ను సూచిస్తూ తన పాటలు తానే పాడుకునే నటిగా రంగ ప్రవేశం చేసిన అమీర్ బాయి కర్ణాటకి నటనకు స్వస్తి చెప్పి నేపథ్యగానం వైపు దృష్టి పెట్టింది. ఈమె నర్సీ భగత్ సినిమాలో, శంకర్ రావ్ వ్యాస్ సంగీత దర్శకత్వంలో ‘వైష్ణవ జనతో….” పాట పాడి మహాత్మ గాంధీ ప్రశంస పొందింది.

‘రతన్’ సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో హిట్ పాటలు పాడి ‘జోహ్రాబాయి అంబా లేవాలి’ హిట్ గాయనిగా పేరు పొందింది.

రాజ్ కుమారి కూడా ఆరంభంలో తన పాటలు తానే పాడుకుంటూ సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె అమ్జాద్ ఖాన్ తండ్రి జఖారియా ఖాన్ (జయంత్)తో పలు చిత్రాలలో నటించింది. అయితే అందంగా సన్నగా కనిపించేందుకు కష్టాలు పడటం నచ్చక నటన మాని నేపథ్య గానంపైనే దృష్టి కేంద్రీకరించింది రాజ్ కుమారి.

ఇలా, నటనతో సినీ జీవితం ఆరంభించిన వారు నేపథ్యగానం వైపు మళ్ళుతూంటే, శంషాద్ బేగం వంటివారు ‘నేపథ్య గానం’ కోసమే సినీరంగంలో ప్రవేశించారు. నూతన గాయనీ గాయకులు ఇలా ఒకరొకరుగా సినిమా రంగంలో అడుగుపెడుతున్న సమయంలోనే భవిష్యత్తులో సినీ సంగీత ప్రపంచాన్ని రూపాంతరం చెందించే సంగీత దర్శకులు, గేయ రచయితలు వాయిద్యకారులు ఒకరికొకరు తెలియకుండా ఒకరికొకరు పరిచయం లేకుండా సినీ రంగం వైపుకు వచ్చారు.

లత సినీరంగంలో అడుగుపెట్టేసరికి నౌషాద్ అన్‍మోల్ ఘడీ, రత్తన్ వంటి సూపర్ హిట్ సినిమాలతో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. గులామ్ హైదర్, అనిల్ బిశ్వాస్, ఖేమ్‌చంద్ ప్రకాశ్ వంటి వారు సంగీత రంగంలో తన ప్రతిభను ప్రదర్శించి స్థిరపడ్డారు. దీనానాథ్ మధోక్, కిదార్ శర్మ, కవి ప్రదీప్ వంటి వారు గేయ రచనలో తమ ప్రతిభను ప్రదర్శించి అగ్రశ్రేణి గేయ రచయితలుగా పరిగణనకు గురవుతున్నారు. వీరిలో కేదార్ శర్మ కవిగానే కాదు, స్క్రిప్టు రచయితగా, దర్శకుడిగా గొప్ప పేరు పొందాడు. ‘చిత్రలేఖ’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు కేదార్ శర్మ. ఈ రకంగా ‘తొలితరం’ సంగీత దర్శకులు గేయ రచయితలు 1940 నుండి 1950 వరకూ రాజ్యం చేశారు. వీరు రాజ్యం చేస్తున్న కాలంలోనే నూతన తరం రంగ ప్రవేశం చేసింది.

1943లో ఖేమ్‌చంద్ ప్రకాశ్ ‘తాన్‌సేన్’ సినిమా పాటలతో సినీ ప్రపంచం ఉలిక్కిపడేటట్టు చేశాడు. ‘తాన్‌సేన్’ సినిమాకు ప్రతిధ్వని లాంటి సినిమా 1953 లోని ‘బైజుబావరా’, 1944లో ‘సజ్జూద్ హుస్సేన్’ ‘దోస్త్’ సినిమాతో సంగీత దర్శకుడిగా పేరు సంపాదించాడు. తొలి చిత్రంలోనే ‘నూర్జహాన్’ తో హిట్ పాటలు పాడించి అగ్రశేణి సంగీత దర్శకుడి స్థాయి పొందాడు. అయితే సజ్జాద్ హుస్సేన్ ఎవరినీ లెక్కచేసే మనిషి కాదు. దాంతో నూర్జహాన్ భర్తతో కొట్లాడి ఇక జీవితంలో నూర్జహాన్‌తో పాటలు పాడించనని శపథం పట్టాడు. సజ్జాద్ హుస్సేన్‍కి నూర్జహాన్ తరువాత తన పాటకు ప్రాణం పోసేందుకు సరైన స్వరం లభించలేదు. దాంతో అతను సరైన నేపథ్య గాయని అన్వేషణలో ఉన్నాడు, ‘లత’ గొంతు విప్పే సమయానికి.

1942లో ‘సుఖీ జీవన్’ సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఎదిగిన సి. రామచంద్ర సంప్రదాయ పద్ధతులలో ఒదగని వాడు. పాట ‘హిట్’ అవటానికి ప్రాధాన్యం తప్ప, అది ఏ రాగంలో ఉంది, రాగం ఎంత శుద్ధమైనది, పాశ్చాత్య బాణీతో కలిసిందా అన్నది సి. రామచంద్రకు అనవసరం. అలాగే పాటలో పదాలతో కూడా పట్టింపు లేదు సి. రామచంద్రకు. సి. రామచంద్ర కూడా ఎవ్వరి మాట వినేవాడు కాదు. ఆయనకు కె.ఎల్. సైగల్ తో పాటలు పాడించే అవకాశం వచ్చింది. కానీ సైగల్ రీతి నచ్చక ఆ సినిమా వదిలేశాడు సి. రామచంద్ర. ‘ఆయన సైగల్ అయితే నేను సి. రామచంద్రను’ అని వ్యాఖ్యనించాడు. అలాగే ‘షహనాయి’ సినిమాలో ‘ఆనా మేరీ జాన్ సండే కి సండే’ పాటను మీనాకపూర్, శంషాద్ బేగంలతో పాడించాడు. ఆ పాట విని పాశ్చాత్య బాణీని హిందీ సినిమాల్లో వాడటాన్ని పలువురు నిరసించారు. సి. రామచంద్ర గురువు అనిల్ బిశ్వాస్ ఫోన్ చేసి నిరసన వ్యక్తపరుస్తూ ‘ఇదేమిటి?’ అనడిగితే, ‘సూపర్ హిట్ పాట’ అని సమాధానం ఇచ్చాడు సి. రామచంద్ర. గులామ్ హైదర్ దగ్గర సహాయ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నప్పుడు లత పాట విన్నాడితడు. భవిష్యత్తులో లత ఉత్తమ గాయనిగా స్థిరపడటంలో ప్రధాన పాత్ర పోషించాడు సి. రామచంద్ర.

1934లో ‘హీరేన్ బోస్’ సహాయంతో బొంబాయిలో అడుగుపెట్టిన అనిల్ బిశ్వాస్, 1935లో ‘ధరమ్ కీ దేవి’ సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుడయ్యాడు. 1937లో మహబూబ్ ఖాన్ సినిమా ‘జాగీర్దార్’తో ‘హిట్’ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఔరత్ (1940), బహెన్ (1942) లతో అగ్రశేణి సంగీత దర్శకుడయ్యాడు. 1943లో ‘కిస్మత్’ పాటలతో సినీ సంగీతంలో కొత్త ట్రెండ్ సృష్టించాడు. ముకేష్, తలత్ మహమద్ వంటి గాయకులకు మార్గదర్శనం చేశాడు. లతా మంగేష్కర్ అత్యుత్తమ గాయనిగా ఎదగటంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించాడు.

ఇంతవరకూ ప్రస్తావించిన సంగీత దర్శకులు లత కన్నా ముందు సినీరంగంలో స్థిరపడ్డారు. వీరు లత స్వర మాధుర్యాన్ని గుర్తించి, భవిష్యత్తులో లత ఉత్తమ గాయనిగా ఎదగగలదన్న విశ్వాసంతో ఆమెకు అవకాశాలు ఇచ్చినవారు. మైకు ముందు నిలుచుని సరిగ్గా పాడటం దగ్గరనుంచి, భావాలను పలకటం, శబ్దం కాకుండా ఊపిరి పీల్చటం, పల్లవిని సరిగ్గా ఎత్తుకోవటం, పదాలను విరవటం, అలంకారాలు వేయటం వంటివి నేర్పినవారు. అంటే వజ్రాన్ని సానపెట్టి ధగధగ మెరిసేట్టు చేసినవారన్న మాట వీరు.

ఈ అత్యుత్తమ సంగీత దర్శకులు స్వేచ్ఛగా తమకు నచ్చిన గాయనిని ఎంచుకుని, తమకు నచ్చిన విధంగా బాణీలు రూపొందించి, తమకు నచ్చినట్టు పాటలను రూపొందించటంలో తోడ్పడిన ప్రధానమైన అంశం స్టూడియో పరిస్థితి తొలగి ఆ స్థానాన్ని డిస్ట్రిబ్యూటర్ల పద్దతి ఆక్రమించటం.

స్టూడియో పద్ధతిలో సంగీత దర్శకుడి స్వేచ్ఛ పరిమితం. ఒకోసారి స్టూడియోతో ఒప్పందంలో ఉన్న ఇతర సంగీత దర్శకులు కూడా జోక్యం చేసుకునేవారు. పైగా ప్రతీదీ స్టూడీయో పెద్ద అనుమతి పొందాలి. కానీ స్టూడియో పద్ధతి పోయి పంపిణీదార్లపై ఆధారపడే వ్యవస్థ రావటంతో పంపిణీదార్లను ఒప్పించి, పెట్టుబడి సాధించగల ప్రతివాడూ సినిమా నిర్మించే వీలు చిక్కింది. దాంతో స్టూడియోలకు కాంట్రాక్టు వల్ల బద్దులైన సంగీత దర్శకులు స్టూడియోలను వదలి స్వేచ్ఛగా, స్వతంత్ర సంగీత దర్శకులయ్యారు. అంటే ‘ఫ్రీలాన్స్’ సంగీత దర్శకులన్నమాట. ఇప్పుడు తమకు నచ్చిన వారిని ఎంచుకుని పాడించే స్వేచ్ఛ సంగీత దర్శకులకు లభించింది. ఎందుకంటే ఏ కళాకారుడికి ‘మార్కెట్’ ఉందో, ఆ కళాకారుడు ఉంటే పంపిణీదార్లు సులభంగా పెట్టుబడులు పెడతారు. దాంతో 1940 దశకం చివరలో అనేక నిర్మాణ సంస్థలు ఆరంభమయ్యాయి. కేదార్ శర్మ, అనిల్ బిశ్వాస్ వంటి వారు  అంతవరకూ పని చేస్తున్న స్టూడియోలను వదలి ‘ఫ్రీలాన్స్’ సంగీత దర్శకులయ్యారు.

ఇలా కళాకారులు ‘ఫ్రీలాన్స్’ అవ్వటం వల్ల అందరికన్నా అధికంగా లాభం పొందింది లతా మంగేష్కర్. ఆమెకు ఏ స్టూడియోతో ఒప్పందం చేసుకోవల్సిన అవసరం పడలేదు. స్టూడియోతో ఒప్పందం ఉంటే, ఆ స్టూడియోలోని సంగీత దర్శకులకే పరిమితమవ్వాల్సి వచ్చేది. కానీ ‘ఫ్రీలాన్స్’ అవటంతో ఇప్పుడు ఏ సంగీత దర్శకుడితో నైనా కలిసి పనిచేసే అవకాశం లభించింది. డిస్ట్రిబ్యూటర్ల పద్ధతి వల్ల లాభం ఏమిటంటే, పాటలు ఎంత హిట్ అయితే, ఆ సంగీత దర్శకుడికి, గేయ రచయితకు, గాయనీ గాయకులకు అంత విలువ పెరుగుతుంది. వారుంటే పెట్టుబడులు సులభంగా వస్తాయి. ఎవరైనా గెలుపు గుర్రం మీదనే పందెం పెడతారు. ఆ కాలంలో ఇతరులెందరున్నా ‘గెలుపు గుర్రం’ గాయనిలలో ఎవరో అందరికీ తెలుసు. అప్పటికే పాటల్లో సూక్ష్మ అంశాలను త్వరగా గ్రహిస్తుందని, బాణీని త్వరగా పడుతుందని, భావాలు అద్భుతంగా పలుకుతుందని ఆమె స్వరం అందమైన నాయికల ఆకారాలకు  ఉద్దీపననిస్తూందని, ఆమె పాటలో ఇతరుల పాటల్లో లేని ప్రత్యేకమైన ఆకర్షణ ఏదో ఉందని అందరూ గ్రహించారు. అంతేకాదు ఆమె స్వరంలోని స్వచ్ఛత, తేనెలు చిలికే మాధుర్యం, అమృతమయమైన భావం, స్వచ్ఛము, ఉత్తమము, అయిన భారతీయ నారి ఆలోచనకు అతి దగ్గరగా ఉన్న భావన కలిగిస్తుంది. దాంతో ప్రతి పంపిణీదారు లత స్వరం ఉంటే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావటంతో లతకు లాభించింది.

ఇంతలో పృథ్వీరాజ్ కపూర్ పెద్ద కొడుకు రాజ్ కపూర్ తన రెండవ సినిమా ‘బర్సాత్’ నిర్మాణం తలపెట్టటం, ఆ సినిమాకు సంగీత దర్శకులుగా శంకర్ జైకిషన్ అనే కొత్త సంగీత జంటను ఎంచుకోవటం; వీరిలో శంకర్- హుస్నలాల్ భగత్ రామ్ దగ్గర వాయిద్యకారుడిగా పనిచేస్తున్నప్పుడు లత స్వరం వినటం వల్ల ‘బర్సాత్‍’లో పాటలు పాడేందుకు శంకర్ జైకిషన్‍లు లతను పిలవటంతో హిందీ సినీ గేయ ప్రపంచంలో ఒక ఉజ్జ్వల సంగీత శకానికి నాందీ ప్రస్తావన జరిగింది. ఒక దశాబ్దం పాటు శంకర్ జైకిషన్, లతల కలయికలో పరమాద్భుతమైన సంగీత రస ప్రవాహం సినీ సంగీత ప్రపంచాన్ని ముంచెత్తింది. ఉర్రూతలూగించింది. స్వర్ణయుగం పై తెర తీసింది. లతను అత్యుత్తమ సంగీత శిఖరాలు అధిరోహింపచేసి తాము అత్యున్నత సంగీత శిఖరాలు అధిరోహించారు శంకర్ జైకిషన్. అయితే ఇదంతా సాధ్యమయింది 1946 నుంచి 1949 వరకూ లతతో పాటలు పాడించి ఆమె శిఖరారోహణకు శిక్షణ నిచ్చి మార్గం సుగమం చేసిన సంగీత దర్శకుల వల్ల కాబట్టి 1946 నుండి 1949 వరకూ లత పాడిన పాటలను విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందులో కొట్టొచ్చినట్టు కనబడేదేమిటంటే ‘లత’ స్వరంలా అనిపించని ‘లత’ స్వరం. లత ఆరంభ పాటలు వింటే ఈ స్వరంలో గొప్పదనాన్ని గుర్తించటమే కాక, సినీ ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోగలిగే శక్తిని గుర్తించిన గులామ్ హైదర్‍కు నీరాజనాలర్పించాలనిపిస్తుంది. గులామ్ హైదర్ ఎంపికపై విశ్వాసం ఉంచి  లతకు అవకాశాలిచ్చి తమ సృజన విహంగాలతో లత స్వరాన్ని అలంకరించి వినీల విశాల విహాయసంలో విశృంఖలంగా విహరింపచేసిన ఖేమ్‍చంద్ ప్రకాశ్, అనిల్ బిశ్వాస్, హన్స్‌రాజ్ బహెల్, వంటి వారికి శతకోటి ప్రణామాలర్పించాలనిపిస్తుంది. ఒక శిల అందమైన శిల్పంగా రూపుదిద్దుకున్నట్టు నిరంతర సాధనతో, నిజాయితీతో పరిశ్రమతో, నిత్య విద్యార్థిలా లత ఒక్కో పాటతో ఒక్కో మెట్టు ఎదిగి, 1949 కల్లా ఇతర గాయనిలందరినీ క్రిందకి విడిచి అందనంత ఎత్తులకెదిగిన విధానాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. 1946 నుండి 1949 వరకూ లత పాడిన పాటలను విమర్శించాల్సి ఉంటుంది. (ఇది వచ్చేవారం).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here