సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-9

2
2

[dropcap]హో[/dropcap] మేరీ నావ్ చలే ధీరే ధీరే

మేరా బాపు ఖేవియా, మెరా భయ్యా ఖేవియా

హో, మెరీ నావ్ చలే ధీరే ధీరే……

‘ప్రేమ్‍నాథ్’ సంగీత దర్శకత్వంలో ‘చాంద్ సితారే’ సినిమాలో లత పాడిన సూపర్ హిట్ పాట ఇది. పాట బాణీ అత్యంత మధురంగా ఉంటుంది. అలలపై ఓ పడవ ఆతి నెమ్మదిగా ప్రయణిస్తున్నట్టుంటుందీ పాట వింటుంటే. ఈ పాట 1948లో విడుదలయింది. పాట లతా మంగేష్కర్ పాడింది అని గుర్తుపట్టటం కష్టం కాదు. కానీ పాట వింటుంటే, లత స్వేచ్ఛగా తాను మామూలుగా పాడేట్టు కాక, మరెవరిలాగానో పాడాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. పాట వింటుంటే ఆ కాలం నాటి ఇతర గాయనిలు పాట పాడే విధానం గుర్తుకు వస్తుంది. పదాలు పలకటం, రాగాలు తీయటం, వాక్యం ముగించే విధానం వంటి విషయాలలో హఠాత్తుగా నూర్జహాన్ గుర్తుకు వస్తుంది. శంషాద్ బేగంలా అనిపిస్తుంది. రాజ్‍కుమారి,కానన్     దేవిలు పాడినట్టు పాడాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది.

సినిమా విడుదలయిన తేదీ ఆధారంగా పాటను పాడిన సంవత్సరాన్ని నిర్ణయిస్తారు. 1948లో పాట ‘చాంద్ సితారే’ సినిమాలో పాడింది అని అంటారు. కానీ ఈ పాట అంతకు ఓ సంవత్సరం, రెండు సంవత్సరాల ముందు రికార్డు అయి ఉండవచ్చు. సాధారణంగా, మన సినిమాలలో పాటలు ముందే రికార్డయిపోతాయి. స్క్రిప్టు తయారీ దశలోనే పాటలు ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తారు. అక్కడి నుంచీ గేయ రచయిత, సంగీత దర్శకుడి పని ప్రారంభమవుతుంది.సందర్భాన్ని, నటీనటులను ఆధారంచేసుకొని  బాణీలు సృజించి పాటను ఎవరు పాడితే బాగుంటుందో నిర్ణయిస్తారు. గాయనీ గాయకులను నిర్ణయించటంలో అనేక అంశాలు పరిగణనలోకి వస్తాయి.

నటీనటులు తమ పాటలు తామే పాడేవారయితే సమస్య లేదు. బాణీని సైతం ఆయా నటీనటుల ప్రతిభ అధారంగా సృజించే వీలుంటుంది. నేపథ్య గాయనీ గాయకులు రంగప్రవేశం చేశాక పరిస్థితి మారింది. తెరపై కనబడే నటుడే పాడుతున్న భ్రమను కలిగించాల్సి ఉంటుంది. అంటే తెరపై కనిపించే నటుడి ఆకారానికి, హావభావాలకు, తెరవెనుక నుంచి వినపడే గాయకుడి స్వరం తగ్గట్టు అనిపించాలి. అతడే పాడుతున్న భ్రమ కలగాలి. లేకపోతే పాట అభాసుపాలవుతుంది. ప్రేక్షకులు మెచ్చరు. నేపథ్యగానం ఆరంభమయిన కొత్తల్లో ప్రేక్షకులు వేరే ఎవరి గొంతుతోనో తెరపై కనబడే నటీనటులు పాడుతున్నట్టు నటించటాన్ని నిరసించారు. హేళన చేశారు. నవ్వారు. కానీ పాటల మాయజాలం ఎలాంటిదంటే కొద్ది కాలానికి పాటల మాధురీ ప్రవాహంలో పడి కొట్టుకుపోయారు. ఇక్కడే నటుడికీ, గాయకుడి స్వరానికి కల అనుబంధం తెరపైకి వచ్చింది. ఒక నటుడిని చూడగానే, అతని స్వరంగా నిలచిన గాయకుడు గుర్తుకువస్తాడు. ఈ రకంగా, ఆ కాలంలో నటులందరికీ ఓ ప్రత్యేకమైన గాయకుడి స్వరం నిర్ణయమయింది. రాజ్‍కపూర్ అనగానే ముకేష్ గుర్తుకు వస్తాడు. దిలీప్ కుమార్ అనగానే తలత్ మహమూద్ గుర్తుకువస్తాడు. దేవ్ ఆనంద్‍ వాడినన్ని గొంతులు మరే నటుడు వాడలేదు. కానీ దేవ్ ఆనంద్ అంటే ప్రధానంగా కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీలే గుర్తుకువస్తారు. ఇలా నటుడు, గాయకుడి నడుమ అనుబంధం వ్యాపారపరంగా కూడా లాభకరం. నటుడి విలువ పాటలవల్ల పెరుగుతుంది. గాయకుడికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అభిమానులు లభిస్తారు. దాంతో గాయకుడి వల్ల కూడా సినిమాకు అదనపు ఆకర్షణ కలుగుతుంది. అంటే గాయనీ గాయకుల స్వరాలు వినబడగానే ఆయా నటీనటులు కళ్ళముందు నిలబడాలన్నమాట.  కాబట్టి నాయకుడిని  కానీ నాయకను కానీ  ప్రతిబింబించే స్వరం కావాల్సి ఉంటుంది. నాయకుల విషయంలో పెద్ద సమస్య లేకుండా ముకేష్, రఫీ (కిషోర్ కుమార్ తనకు, దేవ్ ఆనంద్‍కు మాత్రమే పాడేవాడు) తలత్ మహమూద్, మన్నాడే వంటి వారున్నారు. కానీ నాయికల విషయంలో సమస్య వచ్చింది. ఈ సమస్య స్వరూపం అర్థం కావాలంటే ఒక్కసారి లత కన్నా ముందు ఉన్న గాయనిలు, లత సమకాలీకుల గురించి టూకీగా తెలుసుకోవాల్సి ఉంటుంది.

1931 నుండి 1943 వరకూ పదమూడు సినిమాలలోనే నటించిన ఖుర్షీద్ సినిమా పాటలపై తనదైన ముద్రవేసింది. 1947లో పాకిస్తాన్ వెళ్ళిపోయిన ఖుర్షీద్ అప్పటి ఆనవాయితీ ప్రకారం తన పాటలు తాను పాడుకునేది. కానీ ఖుర్షీద్‌కు సంగీతంలో ఎలాంటి శిక్షణ లేదు. ఆమె స్వరం మరీ బలంగా ఉండేది కాదు. మరీ బలహీనం కాదు. ఆమె స్వరం సాదాసీదాగా ఉండేది. పాటలు విన్నవారికి శాంతిగా అనిపించేది. ఆమె పెద్దగా హై పిచ్‍లో పాడగలిగేది కాదు. అందుకే ఆమె తన గానప్రతిభ వల్ల కాక స్వరమాధుర్యం వల్లనే చక్కటి గాయనిగా గుర్తింపు పొందింది. ఆమె దీర్ఘంగా రాగాలు తీయగలిగేది కాదు. ఎప్పుడైనా రాగం తీయవలసి వస్తే స్వరంలో వణుకు స్పష్టంగా తెలిసేది. పాటలు ఎలా పాడమంటే అలా పాడేది తప్ప, గాయనిగా తనవైపు నుంచి బాణీకి ప్రత్యేకతను ఆపాదించగలిగేది కాదు. అందుకే ఖేమ్‌చంద్ ప్రకాశ్ ‘ముంతాజ్’ (1943) సినిమాలో ‘దిల్‍ కో ధడ్‌కన్ బనాలియా’ పాటలో ఒక పాదం ఖుర్షీద్ పాడగానే, దానికి అనుబంధంగా వాయిద్యాలతో పాటను సుందరం చేయాలని ప్రయత్నించాడు. అయితే, తన పాటలు తానే పాడుకునేది కాబట్టి ఆమెను నేపథ్య గాయనిగా పరిగణించే వీలులేదు.

అమీర్‍బాయి కర్ణాటకి నటిగా తెరపైకి వచ్చినా గాయనిగానే ఆమెను సినీ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. 1940 నుండి 1950 నడుమ ఆమె దాదాపుగా 225 పాటలు పాడింది. ఆ కాలంలో గొప్ప హిట్ పాటలు పాడింది. కిస్మత్ (1943) సినిమాలో ‘ధీరే ధీరే ఆరె బాదల్’; రతన్ (1944) సినిమాలో ‘మిల్‍కే చిఛడ్ గయే అఖియాన్’; సమాధి (1950)లో ‘గోరే గోరే ఓ బాన్కే చోరే’ వంటి హిట్ పాటలు పాడింది అమీర్ బాయి కర్ణాటకి. ఈమె కూడా శిక్షణ పొందిన గాయని కాదు. ఆమె స్వరం శక్తివంతమైనది. ఈమె పాటలలో భావాన్ని స్పష్టంగా వ్యక్తపరిచేది. ఈమె పాటల్లో పదాలను కాస్త నెమ్మదిగా ఉచ్చరించటం ద్వారా గొప్ప ప్రభావాన్ని సృజించేది. ‘కిస్మత్’ సినిమాలో “ఘర్ ఘర్ మే దివాలీ’ పాటలో పలు భావాలను ఒకేసారి సమర్థవంతంగా పలికించి మెప్పించింది. అయితే 1940 దశకం చివరికి వచ్చేసరికి ఈమె కుటుంబపరంగా వ్యక్తిగత సమస్యలలో చిక్కుకుంది. పాటలపై దృష్టి పెట్టలేక పోయింది. దాంతో నెమ్మదిగా సినీ పరిశ్రమకు దూరమయింది. కానీ విశ్లేషకులు లత తెరపైకి రావటం, అమీర్ బాయి కర్ణాటకి కెరీరును దెబ్బతీసిందని వ్యాఖ్యానిస్తారు. కానీ అది పొరపాటు. 1950లో ‘సమాధి’ సినిమాలో లత గోరెగోరె పాట – అమీర్ బాయి కర్ణాటకితో పాడే సమయానికే అమీర్ బాయి పాటలను తగ్గించింది వ్యక్తిగత సమస్యల వల్ల. సి. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటలో నాయిక నళినీ జయవంత్‍కు లత, కుల్దీప్ షార్‍కు అమీర్ బాయి పాడేరు. సాధారణంగా మన సినిమాలలో నాయికకు పాడే స్వరం నెంబర్ వన్ గాయనిది అయి ఉంటుంది. అంటే, అప్పటికే లత అగ్రస్థాయి గాయనిగా పరిగణనకు గురి అవుతోందన్నమాట.

బెంగాల్‍కు చెందిన గాయని అయినా నటి కానన్ దేవి పాటలో బెంగాలీ యాస కనబడేది కాదు. ఆమె స్వరం బలమైనది. హైపిచ్‍లో కీచు గొంతు వచ్చేది కాదు. విద్యావతి (1938) సినిమాలో ‘డోలే హృదయ్‍కీ నయ్యా’ పాటలో ఆమె హైపిచ్‍లో అద్భుతంగా పాడింది. లగాన్ (1943)లో ‘హమారీ లాజ్’ పాట, హాస్పిటల్ సినిమాలో ‘జరా నైనోంసె నైనా’ పాటలో కానీ హైపిచ్ నుంచి హఠాత్తుగా లోపిచ్‌కి సులభంగా ఎలాంటి ప్రయాస లేకుండా దిగుతుంది ఆమె స్వరం. ‘తరానా’ కూడా అద్భుతంగా పాడగలదని ‘విద్యాపతి’ సినిమాలోని ‘అంబువా కి డాలీ’ పాట నిరూపిస్తూంది. అలాగే, జవాబ్ (1942) లో ‘తుఫాన్ మెయిల్, దునియా యే దునియా’ లాంటి వేగవంతమైన పాటలను కూడా సులభంగా పాడగలదు కానన్ దేవి. అయితే ఆమె పాటలు సినిమాను దాటి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సంతరించుకోలేదు. కానీ 1946 వచ్చేసరికి కానన్ దేవి ప్రాభవం, ప్రాధాన్యం తగ్గిపోయాయి.

జోహ్రాబాయి అంబాలేవాలి రతన్ (1944) సినిమాలో ‘అఖియ మిలాకే’, ‘రుమ్‍ఝుమ్ బర్సే బాదర్‌వా’ పాటలతో అగ్రశేణి గాయనిగా గుర్తింపు పొందింది. 1941 నుండి 1950 నడుమ 1229 పాటలు పాడింది జోహ్రాబాయి. జోహ్రాబాయి కూడా పాట పాడటంలో శిక్షణ పొందలేదు. ఆమె స్వరం వేగవంతమైన పాటలలో అందంగా ధ్వనించటంతో సంగీత దర్శకులు ఆమెతో వేగవంతమైన పాటలు పాడించేందుకే ఉత్సాహం చూపారు. దాంతో ఆమెకు బాణీని అనుసరించి స్పష్టంగా పాడటం తప్ప తన ప్రతిభను ప్రదర్శించి, పాటకు మెరుపులు అద్దే వీలు చిక్కలేదు. అయినా సరే తనకున్న పరిమిత పరిధిలో అక్కడో పదాన్ని, ఇక్కడో పదాన్ని విభిన్నంగా ఉచ్చరించటం ద్వారా, పాటలో అభినయాన్ని ప్రదర్శించాలని ప్రయత్నించింది జోహ్రాబాయి. జీవన్ (1944) సినిమాలో ‘నైనోమే నైనా మత్‍డాల్’; చంద్రలేఖ (1948)లో ‘మేరా హుస్న్ లూట్ లియా’ వంటి పాటలు ఇందుకు చక్కని ఉదహరణలు. ‘సమఝ్‍లో నజర్ కే ఇషారే’ (కశ్మీర్), క్యా బతాయే కిత్ని  హస్రత్ (నాటక్), ఫిర్ ఆహ్ దిల్సే నిక్లీ (మేలా) వంటి ‘గజళ్ళు’ అద్భుతంగా పాడింది జోహ్రాబాయి. కానీ సంగీత దర్శకులు ఆమెను వేగవంతమైన పాటలకే అధికంగా పరిమితం చేయటంతో, విభిన్నమైన పాటలు పాడగలిగి ఉండి కూడా కొన్నిరకాల పాటలకే పరిమితమయింది జోహ్రాబాయి. ఈమె 1953లో సినిమాలలో పాడటం నుంచి విరమించుకుంది.

సురయ్య ‘తాజ్ మహల్’ సినిమాతో 1941లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే సురయ్య ప్రధానంగా తన పాటలు తానే పాడుకునేది. దాంతో నేపథ్య గాయనిలు ఎవరితో ఆమెకు పోటీ లేదు. గాయనిగా తనదంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. నటిగా పేరు ప్రఖ్యాతులు పొందింది. ఆరంభంలో ‘స్టేషన్ మాస్టర్’ (1942) సినిమాలో నేఫథ్య గాయనిగా పాడింది. ‘శారదా’ సినిమాలో ‘మెహ్తాబ్’కు ‘పంఛీ జా పీఛే రహాహై బచ్‍పన్’ అనే పాటను పాడింది. కానీ నటిగా పేరు సాధించిన తరువాత ఆమె తన పాటలు మాత్రమే పాడుకుంది. అంటే ఎందరు నేపథ్య గాయనిలు వచ్చినా ఆమెకు ఎవరితో పోటీలేదు. ఎవరికీ ఆమె పోటీ కాదు.

రాజ్‍కుమారి సైతం తన పాటలు తానే పాడుకునే నటిగా సినీ రంగంలో అడుగుపెట్టింది. కానీ 1938 నుండి ఆమె నటనకు స్వస్తి చెప్పి నేపథ్య గానం వైపు దృష్టి పెట్టింది. రాజ్‌కుమారికి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉంది. ముఖ్యంగా ‘టప్ప’ పాటల గానంలో శిక్షణ పొందింది. దాంతో రాగాలు తీయగలదు. ‘పల్టా’లు పాడగలదు. నాటకాలలో మైకు లేకుండా ‘హైపిచ్’లో పాడే అలవాటు ఉండటంతో హైపిచ్ పాడటంలో ఆమెకు ఎలాంటి సమస్య లేదు. అయితే ఆమె స్వరం పలు రకాల భావాలను పలకగలిగేది కాదు. ముఖ్యంగా పాటలో ‘నాసల్ టోన్’ రావటం ఇబ్బంది కలిగించేది. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రాజ్‌కుమారి ‘పాటలు పాడటంలో నా పరిధి పరిమితం’ అని చెప్పింది. అయితే 1950 దశకం ఆరంభం నుంచీ ఆమె పాటలు పాడటం తగ్గించింది. 1950 చివరికల్లా ఆమె స్వరం సినిమాల్లో వినపడటం మానేసింది. పాటలు పాడటం ఎందుకు తగ్గించుకున్నారన్న ప్రశ్నకు సమాధానంగా ‘నేను తగ్గించుకోలేదు. పాటలు పాడేందుకు సంగీత దర్శకులు నన్ను పిలవటం మానేశారు. కారణం తెలియదు’ అంది రాజ్‌కుమారి. 1960 దశకంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె ‘కోరస్’లో పాడేది. నౌషాద్ ఆమెకు అలా అవకాశాలిచ్చాడు కానీ సోలో పాటలు పాడే అవకాశాలు ఇవ్వలేదు.

నూర్జహాన్ సైతం తన పాటలు తానే పాడుకోవటం వల్ల, ‘హిట్ గాయని’గా నిలిచినా నేపథ్య గాయనిలకు ఆమె ఎలాంటి పోటీ కాదు. నేపథ్య గాయనిలు ఆమెకు పోటీ కాదు. పైగా ఆమె దేశవిభజన సమయంలో పాకిస్తాన్ వెళ్ళిపోవటంతో సినిమా పాటలపై ఆమె ప్రభావం మాత్రం  మిగిలింది,  అంతే.

లత సినీరంగంలో నిలద్రొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నపుడు ఉన్న ప్రధాన గాయకులు వీరు. వీరిలో ఒక రాజ్‌కుమారికి  తప్ప మరెవరికీ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేదు. గానంలో శిక్షణ లేదు. రాజ్‌కుమారికి పాట పాడటంలో శిక్షణ ఉన్నా, ఆమె స్వరానికి బహు పరిమితులున్నాయి. కాబట్టి ఆ కాలంలో లతకు గట్టి పోటీని ఇవ్వగలిగినవారు ఇద్దరే ఇద్దరు. ఒకరు లతకన్నా ముందు సినీ నేపథ్యగీతాల రంగంలో స్థిరపడినవారు. మరొకరు దాదాపుగా లతతో పాటు రంగప్రవేశం చేసినవారు. ‘శంషాద్ బేగం’ అగ్రశేణి గాయనిగా స్థిరపడింది. లతా మంగేష్కర్ శంషాద్ బేగం పాటలు, నూర్జహాన్ పాటలు పాడుతూ ఎదిగింది.

గీతారాయ్   కు సంగీతం వంశపారంపర్యంగా అందింది. ఆమె పండిత్ హీరేంద్రనాధ్ చౌదరీ వద్ద సంగీతంలో శిక్షణ పొందింది. 1942లో బెంగాల్‍లో పెరుగుతున్న మతకల్లోలాల నుంచి తప్పించుకుని, వారి కుటుంబం ఆస్తులన్నీ వదలుకుని బొంబాయి వచ్చింది. అయితే ఆమె సోదరులిద్దరూ ఉద్యోగాలు చేసేవారు. గీతారాయ్  ఇంట్లో సంగీత సాధన చేస్తుంటే విన్న పండిత్ హనుమాన్ ప్రసాద్ ఆమెను సినిమాల్లో నేపథ్య గాయనిగా పరిచయం చేశాడు. 1946లో ‘భక్త ప్రహ్లాద’లో ఆమె పాడిన రెండు పాదాలు అందరినీ ఆకర్షించాయి. 1947లో ఎస్డీ బర్మన్ ‘దో భాయ్’ సినిమాలో గీతారాయ్ ‘అంబువాకే  డాలీ పె కోయల్’, ‘అజీ ప్రీత్ కా నాతా టూట్ గయా’, ‘మేరీ పియాతో బస్ పర్దేస్’, ‘హమే ఛోడ్ పియా’ వంటి పాటలు పాడినా ‘మేరా  సుందర్ సప్నాబీత్ గయా’, ‘యాద్ కరోగీ’ పాటలు సూపర్ హిట్ అయి గీతాకు ప్రత్యేకమైన గుర్తింపు నిచ్చాయి. శంషాద్ బేగం తరువాత 1940 దశకంలో అగ్రశ్రేణి గాయనిగా గుర్తింపు పొందిన యువగాయని గీతారాయ్. ముఖ్యంగా ‘మేరా సుందర్ సప్‍నా’ పాట, గీతారాయ్  కోసం సంగీత దర్శకులు వరుస కట్టేట్టు చేసింది. పదహారేళ్ళ అమ్మాయి అంత గొప్పగా విఫలప్రేమలోని విషాదాన్ని పాటలో ప్రదర్శించటం ఒక అద్భుతంగా భావించారు. లత తరువాత సినీ ప్రపంచంలో ప్రవేశించినా, లత ఇంకా అవకాశాల కోసం వెతుక్కుంటున్న సమయంలో గీతారాయ్  సూపర్ హిట్ గాయనిగా ఎదిగింది. ఆమె పాటలో బెంగాలో యాస ఉన్నా  అది పాటకు అందాన్ని ఆపాదించేది తప్ప ఎబ్బెట్టుగా  ఉండేది కాదు. భజనలు పాడటం, విషాద గీతాలు పాడటంలో ‘గీతారాయ్’ ను మించిన వారు లేరన్న పేరు సంపాదించింది. ఇంతేకాదు ఆ కాలంలో ఇతర గాయనిలకన్నా ముందుండటంలో లతకు ఉన్న సౌలభ్యం గీతారాయ్ కూ ఉండేది.

పాటలు పాడాల్సిన అవసరం తీరటంతో సినిమాల్లో నాయికలకు అందమైన స్వరం ఉండాల్సిన  అవసరం తీరింది. దాంతో నాయికల అందంపై దృష్టి మళ్ళింది. నాయికలు అందంగా ఉన్నా నాయికకు నేపథ్యంలో పాడే స్వరం ఆ అందానికి తగ్గట్టు ఉండకపోతే పాట ప్రభావం తగ్గుతుంది. అంతవరకూ నేపథ్య గాయనిలుగా స్థిరపడి ఉన్నవారి స్వరాలు బలమైనవి. అందమైన నాయికల మౌగ్ధ్యాన్ని సున్నితత్వాన్ని ఆ స్వరాలు అంతగా ప్రతిబింబించలేవు. బయట విన్నప్పుడు అలరించినా తెరపై యువ నటీమణులపై ఆ పాటలు అలరించవు. నర్గీస్, శంషాద్ బేగం స్వరంలో ‘గమ్ క ఫసానా కిస్ కో సునాయే’ అని పాడటం, సినిమాలో నర్గీస్‍ను చూస్తూంటే అంతగా రుచించదు, ముఖ్యంగా క్లోజప్పులలో.  ఇది ఏ రకంగానూ శంషాద్ బేగమ్ గానాన్ని, స్వరాన్ని కించపరుస్తున్నట్టుగా భావించకూడదు. ఆ కాలంలో యువనాయికలు కొత్తగా వస్తున్నప్పుడు, అప్పటికి స్థిరపడి ఉన్న బలమైన గొంతులు ఈ యువ నాయికల నాజూకు ఆకారాలకు సరిపోలేదు. శంషాద్ బేగం గొంతులో ఎబ్బెట్టుగా అనిపించిన నర్గీస్, గీతాదత్ స్వరంలో ‘జోగన్’ సినిమా పాటలు పాడుతుంటే చూసి మైమరచిపోతాం. అంటే, నాజూకుగా తెరపై కనిపించే నాయికలకు బలమైన గొంతులకన్నా ఆ నాజూకుదనాన్ని స్ఫురింపచేసే సన్నని తీగలాంటి యువస్వరం అవసరమైందన్నమాట. ఆ సమయంలో హిందీ సినీ పరిశ్రమలో అలాంటి స్వరాలు రెండే రెండు. ఒకటి గీతారాయ్, రెండవది లతా మంగేష్కర్. ‘జోగన్’ సినిమాలో నర్గీస్‍కు గీతారాయ్ పాడిన పాటలు గీతాను అగ్రశ్రేణి గాయనిగా నిలిపాయి. ముఖ్యంగా ఆమె పాడిన మీరా భజనలు సినిమాకే  హైలెట్‍గా నిలిచాయి. బులో సి రాణి సంగీత దర్శకత్వంలోని ఈ సినిమా పాటలతో ఆ కాలంలో లతకు దీటుగా నిలబడిన ఏకైక గాయని గీతారాయ్.

‘గీతా’ తాను పాడిన తొలిచిత్రంలోని పాటతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు భిన్నంగా లత మంగేష్కర్ అవకాశాల కోసం కష్టపడాల్సి వచ్చింది. అప్పటికి అలవాటైన స్వరాలకు భిన్నంగా లత గొంతు బలహీనంగా ఉండటం లతను తిరస్కరించటానికి ప్రధానకారణమయితే, సినిమా పాటలకు అవసరమైన హంగు, ఆర్భాటాలు లతకు లేకపోవటం ఆమెను ఎవరూ అంతగా పట్టించుకోకపోవటానికి మరో కారణం.

లతా మంగేష్కర్ ఒక్కర్తే వారింట్లో సంపాదించేది. ఆమె సంపాదనపైనే ఇంట్లోని ఎనిమిదిమంది ఆధారపడి ఉన్నారు. లతా మంగేష్కర్‍కు ‘పాట’ ఒక్కటే జీవనాధారం. పాటలు పాడగా వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడవాలి. అందుకని డబ్బులను ఎంతో పొదుపుగా వాడాల్సి వచ్చేది. సినిమావాళ్ళు పాట పాడినందుకు డబ్బులివ్వగానే ఇంటికి పోతూ దారిలో కూరగాయలు, ఇతర వస్తువులు కొనేది లత. ఆ కాలంలో చీరలు రేషన్ షాపుల్లో ఇచ్చేవారు. ఒక్కో చీర రూ12.  అలా అవసరం కొద్దీ కట్టిన తెల్లచీరలు లత మంగేష్కర్‍కు గుర్తింపు దుస్తులుగా మారేయి. రికార్డింగ్ అయ్యాక రాత్రి ఇంటికి వచ్చి వాటిని ఉతుక్కుని, ఎండబెట్టి, ఎండిన తరువాత తలక్రింద మడచి పెట్టుకుని పడుకునేది లత. ఇస్త్రీ చేసిన భావన కలిగించేందుకు అలా చేసేది. అలాంటి దుస్తులు వేసుకుని రికార్డింగ్‍కి వచ్చే వ్యక్తి ఎంత గొప్ప స్వరం కలిగినదయినా గుర్తింపు రానంత వరకూ అవమానాలు, హేళనలు భరించటం తప్పనిసరి. అయితే, అలాంటి స్థితిలో కూడా లత ఎలాంటి అవమానాన్ని, అవహేళనను సహించేది కాదు. కెరీర్ ఆరంభంలోనే తన ప్రవర్తన ద్వారా తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. అందరితో స్నేహంగా ఉంటుంది తప్ప సాన్నిహిత్యాన్ని సహించదు,  తన చుట్టు పరిధి గీసుకుని ఎవరినీ దాన్ని దాటి రానివ్వదు అన్న విషయం సినీ ప్రపంచంలో స్పష్టమయ్యేట్టు చేసింది. తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‍ని సాధించింది.  అయితే , ఆరంభంలో లత పాడిన పాటలు వింటే భవిష్యత్తులో లత ఇంతగొప్ప గాయనిగా ఎదుగుతుందన్న ఆలోచన రావటం కష్టం.

1945లో ‘బడీమా’ సినిమాలోని పాటల్లో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. 1946లోని ‘చిడియా బోలే చున్ చున్’ పాట బాణీ ఆకర్షణీయంగా ఉంటుంది కానీ స్వరం లతా మంగేష్కర్‍ది అని గుర్తుపట్టటం కష్టం. ఆ కాలంలో వినిపిస్తున్న అనేక సాధారణ స్వరాలలో ఒక స్వరంలా ఎలాంటి ప్రత్యేకత లేనిదిలా అనిపిస్తుంది.  1947లో వచ్చిన ‘షహనాయి’ సినిమాలోని ‘జవానీకీ రేల్ చలీ జాయెరే’ పాట సి. రామచంద్ర, గీతారాయ్, రాజ్‍ కుమారి, లతలు కలిసి పాడారు. ఈ సినిమాలో నాయికకు గీతారాయ్ పాడుతుంది. మరో పాత్రకు రాజకుమారి పాడుతుంది. ఎవరో కూడా తెలియని నటికి లత పాడుతుంది. అనేకులు లత  స్వరాన్ని గుర్తించలేక ఈ పాటలో లత పాడలేదని అనుకుంటారు. అలా అస్సలు గుర్తించే వీలు లేకుండా ఉంటుంది లత స్వరం ఈ పాటలో. ఇందుకు ప్రధాన కారణం లత తనలాగా స్వాభావికంగా పాడకుండా, అప్పటి పేరుపొందిన ఇతర గాయనిలను అనుసరిస్తూ గాంభీర్యంగా, గట్టిగా పాడాలని ప్రయత్నించటం. అప్పటి గాయనిల్లా  పదాలను బలంగా పలకాలని ప్రయత్నించటంతో మనకు అలవాటయిన లత ఈ పాటల్లో కనబడదు.

లతా మంగేష్కర్‍కు చక్కటి గుర్తింపు తెచ్చిన ‘అనోఖా ప్యార్’ లోని పాటల్లో కూడా లత, నూర్జహాన్, శంషాద్ బేగంలలా పాడాలని ప్రయత్నించటం తెలుస్తుంది. ముఖ్యంగా ‘జీవన్ సప్నా టూట్ గయా’ పాట వింటే ఎంతగా నూర్జహాన్‍ను అనుకరిస్తూ తాను పదాలను పలికే విధానాన్ని, రాగాలు తీసే విధానాన్ని లత మార్చుకుందో అర్థమవుతుంది. అలాగే ‘యాద్ రఖ్నా చాంద్ తారో’ పాటలో కూడా అప్పటి గాయనిల్లా గొంతు వీలైనంత బలంగా అనిపించేట్టు పాడాలని ప్రయత్నించటం తెలుస్తుంది. స్వభావ సిద్ధమైన స్వరాన్ని ఇతరుల స్వరంలాగా పలికేట్టు చేయాలన్న లత ప్రయత్నాలు కొద్దివరకు సఫలమైనా, ఆమె స్వరంలోని మాధుర్యాన్ని కప్పిపుచ్చాయి. ఆమె స్వరం బలహీనంగా ఉందని తిరస్కరించటం, విమర్శించటం ప్రభావం వల్ల అందరూ కోరుతున్నటువంటి, ఆదరిస్తున్నటువంటి స్వరాలను అనుకరించి ఆమోదం పొందాలన్న ప్రయత్నాలు లత, ‘లత’లా ఎదగటాన్ని ఆలస్యం చేశాయి. ‘మోరి నావ్  చలే ధీరే’ పాటది చక్కటి బాణి. ఓ అంటూ ఆలాపన తీయటం నుంచి లత తన గొంతు మార్చాలని ప్రయత్నించటం తెలుస్తుంది. ‘జాయే’ అని దీర్ఘం తీసినప్పుడు, ‘బతాయె’ అంటున్నప్పుడు లతలా అనిపించదు. ఇదే పాటను లతా మంగేష్కర్ ఆత్మవిశ్వాసం సాధించిన  తరువాత పాడి ఉంటే ఇలా ఉండేది కాదు. ఒక మరపురాని పాటలా ఎదిగి ఉండేది.

దేశవిభజన పరిస్థితిని మార్చింది. నూతన నాయికలు రంగ ప్రవేశం చేయటంతో బలహీనంగా అనిపించే లత స్వరం మెరుపు తీగలాంటి స్వరంలా అనిపించసాగింది. సంగీత దర్శకులకు లత పాటలను త్వరగా నేర్చుకోగలగటం, వారు కోరినట్టు భావాలను పలికించగలగటం నచ్చింది. అంతేకాక, లత సమయాన్ని పాటించటం, ఎలాంటి గొప్పలకు పోకపోవటం, ఎన్నిసార్లంటే అన్నిసార్లు రిహార్సల్స్ చేయటం కూడా వారికి నచ్చింది. సంగీత దర్శకులకు లత నిజాయితీ, చిత్తశుద్ది మరింతగా నచ్చింది. ముఖ్యంగా సంగీత దర్శకుల సూచనలను అనుసరిస్తూ తనదైన ప్రత్యేకతను ప్రదర్శించాలని ప్రయత్నించటం వారిని మెప్పించింది. లతాకు శాస్త్రీయ సంగీతం తెలియటంతో, ఎలాంటి బాణీలనయినా సులువుగా గ్రహించి పాడటమేకాదు, శాస్త్రీయ సంగీతపుటలంకారాలు లలిత సంగీతంలో వేసి పాట ప్రభావాన్ని ఇనుమడింపచేయటం మరీ నచ్చింది. ఇది సంగీత దర్శకులకు సృజనాత్మక స్వేఛ్ఛ నిచ్చింది. బాణీలలో ప్రయోగాలు చేసే ధైర్యాన్నిచ్చింది.  అందుకే ఖేమ్‌చంద్ ప్రకాశ్, అనిల్ బిశ్వాస్, హన్స్‌రాజ్ బహల్, బులో సి రాణి, హుస్న్‌లాల్ భగత్ రామ్ వంటి వారు లతకు ప్రత్యేక శ్రద్ధతో పాటలు నేర్పేవారు. లత కూడా శ్రద్ధగా వారు నేర్పింది నేర్చుకుంటూ సాధన చేస్తూ, సంగీతం తప్ప మరో విషయాన్ని పట్టించుకోకుండా ఉండటంతో, ఆమె వారి అభిమానాన్ని చూరగొంది. పైగా, మధుబాల, నర్గీస్, గీతాబాలి  వంటి యువతులు సినిమాల్లోకి అడుగుపెట్టటంతో వారి రూపానికి తగ్గట్టు సన్నగా, నాజూకుగా, ఒక రకమైన vulnerability ని ప్రదర్శిస్తున్న సన్నని తీగలంటి స్వరం అవసరమయింది. దాంతో, అంతవరకూ బలహీనంగా ఉంది అని కొట్టివేసిన లత స్వరం మెరుపుతీగ అయి కొత్త వెలుగులతో దర్శనమిచ్చింది. అందుకే 1948 నుండి లత పాటలు పాడే విధానం మారిపోయింది. ఇతరుల అనుకరణ మాని తన ప్రత్యేక పద్ధతిలో పాటలు పాడటం ఆరంభమయింది.

లత సినీ జీవితంలో 1949వ సంవత్సరం అత్యంత ప్రత్యేకమైనది. ఈ సంవత్సరంలో అడుగుపెట్టేముందు, 1949 కన్నా ముందు లత కొన్ని అనుభవాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 1946 నుండి 1949 వరకూ లత ఎదుర్కొన్న అనుభవాలు, తరువాత ఆమె ఆలోచన రీతిపై, ప్రవర్తనపై ప్రభావం చూపించాయి. ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. లత అగ్రశేణి గాయనిగా ఎదిగిన తరువాత ఆమె ప్రవర్తన అర్థం కావాలంటే ఆమెపై ఉన్న అపోహలు తొలగాలంటే ఈ ఎదుగుతున్న కాలంలో లత అనుభవాలను తెలుసుకొని విశ్లేషించాల్సి ఉంటుంది.

lata, meena, geeta

‘అనిల్ బిశ్వాస్’ ఆ సమయంలో మీనా కపూర్‍తో సన్నిహితంగా ఉండేవాడు. ఒక సినిమాలో  పాటలు ఆమెతో పాడించాలనుకున్నాడు. కానీ పాటల రికార్డింగ్ సమయంలో ఏవో కారణాల వల్ల మీనా కపూర్ రాలేకపోయింది. అందుకని లతా మంగేష్కర్‍కు శిక్షణ నిచ్చి, ఆమెతో పాడించాడు. రికార్డు చేశాడు. ఆ తరువాత ఆ పాటలను మీనాకపూర్‍కు వీలు చిక్కినప్పుడు మళ్ళీ ఆమె స్వరంలో రికార్డు చేశాడు. ఆ సమయంలో ఒకే పాటను రెండుమార్లు రికార్డు చేసేవారు. ఒకసారి సినిమాకోసం, రెండోసారి రికార్డు కంపెనీల కోసం. లత పాటలను రికార్డు కంపెనీలకు ఇచ్చి, మీనాకపూర్ పాటలను సినిమాలో వాడేడు అనిల్ బిశ్వాస్.

తరువాత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందిన తరువాత రెండుమార్లు రికార్డు చేసే పద్ధతి ఆగిపోయింది. కానీ తాము అనుకున్న ప్రధాన గాయని అందుబాటులో లేకపోతే, షూటింగ్ ఆగకూడదని, ఆ పాటను మరొకరి స్వరంలో రికార్డు చేసి, గాయని అందుబాటులోకి రాగానే ఆమెతో ఆ పాటలను మళ్ళీ పాడించే పద్దతి ఇప్పటికీ కొనసాగుతుంది. ఒకోసారి కొందరు గాయనీ గాయకులు అలా వేరేవారితో రికార్డయిన పాటలను విని మెచ్చి ఆ పాటలను అలానే ఉండనీయమనటంతో, కొత్త గాయనీ గాయకుల పాటలు సినిమాల్లో వాడేవారు. అలా కొత్తవారికి అవకాశం లభించేది.

1985లో ‘ప్యార్ ఝుక్తా నహీ’ అన్న సినిమాలో ఓ పాటను సంగీత దర్శకులు లక్ష్మీకాంత్ – ప్యారేలాల్‍లు లత స్వరంలో రికార్డు చేయాలనుకున్నారు. 1977 నుంచి లత అందుబాటులో లేనప్పుడు ఆమె పాటలను లక్ష్మీ ప్యారేలు యువగాయని కవిత కృష్ణమూర్తి స్వరంలో రికార్డు చేసేవారు. తరువాత లత ఆ పాటను తన స్వరంలో రికార్డు చేసేది. ఇలా తాను పాట పాడిన విధానానికి, అదే పాటను లత పాడిన విధానానికి తేడాను గమనించి, పాటను ఎలా పాడాలో కవిత నేర్చుకునేది. యువ గాయనీగాయకులు ఇలా పాట పాడే విధానాన్ని తెలుసుకుంటూ తమకు పాడే అవకాశం దొరకటం కోసం ఎదురుచూస్తూంటారు. ఎప్పటిలాగే లక్ష్మీ ప్యారే లత పాటకోసం కవితను పిలిచారు. తరువాత ఈ పాటను లత పాడుతుందని చెప్తారు. కవిత ఆ పాటను పాడింది. లత అందుబాటుకు రాగానే కవిత పాడిన రికార్డును లతకు పంపారు. ఆ రికార్డును విని లత వెంటనే వెనక్కు పంపేసింది. కంగారుగా లక్ష్మీ ప్యారే లతను కలిశారు. ‘ఈ పాటను నేను మళ్ళీ పాడనవసరం లేదు. ఈ అమ్మాయి బాగా పాడింది. అదే ఉంచండి’ అంది లత. అలా ‘ప్యార్ ఝుక్తా నహీ’ సినిమాలో సూపర్ హిట్ సోలో పాట ‘తుమ్సే మిల్‍కర్ నా జానే క్యూ’ కవితా కృష్ణమూర్తి స్వరంలో విడుదలయింది. ఆమె కెరీర్ ఎదుగుదలకు దోహదపడింది. ఇలా ఒకరి స్వరంలో రికార్డు చేసి మరొకరితో డబ్ చేయించడం సర్వసాధారణం. కానీ ‘ఆ సినిమా విషయంలో   లతకు తన పాటలు మీనాకపూర్ స్వరంలో డబ్ చేస్తారన్న విషయం తెలియదు. సినిమా విడుదలయ్యేంతవరకు ఆమె తన పాటలే సినిమాలో ఉంటాయనుకుంది. ఈ అవమానం లత మరిచిపోలేదు.

‘ఫిల్మిస్తాన్ స్టూడియో’లో ‘షహీద్’ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులవి. ఓ పాట పాడేందుకు గులామ్ హైదర్, లతను పిలిచాడు. స్టూడియో చేరిన తరువాత తాను యుగళగీతం పాడుతున్నానని లతకు తెలిసింది. తనతో పాడేది ఆ స్టూడియో యజమాని ‘రాయబహదూర్ చున్నీలాల్’ కొడుకు అని తెలిసింది. ‘స్టూడియో యజమాని కొడుక్కు సంగీతంతో పనేంటి? తండ్రి యజమాని కాబట్టి, కొడుకుకు అవకాశం లభించటంలో ఆశ్చర్యం ఏముంది? దొరకక దొరకక ఒక యుగళగీతం పాడే అవకాశం లభించింది. అదీ సంగీత బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్త గాయకుడితో. ఇక నా పాట పనయినట్టే’ అని లత బాధపడింది. విషాదచిత్త అయింది. ఇంతలో యువకుడు వచ్చాడు. బాగున్నాడు. మర్యాదగా మాట్లాడాడు. అది అన్నాచెల్లెళ్ళ పాట. ‘పింజ్‍రే మె బుల్‍బుల్ బోలే’ అన్నపాట. అతని స్వరం బాగానే ఉంది. బాగానే పాడేడు అనుకుంది లత. అతడితో అదే విషయం చెప్పింది. అతను సంతోషంతో మందహాసం చేసి ‘మీరు కూడా చాలా బాగా పాడేరు. నేను త్వరలో సంగీత దర్శకుడినవుతాను. త్వరలో సినిమా పని ఆరంభమవుతుంది. మీరు నా సినిమాలో పాటలు పాడాలి’ అన్నాడు. లత నవ్వి ఊరుకుంది. అంతేకాదు, ‘మనం అన్నా చెల్లెళ్ళ పాట పాడేము కాబట్టి ఈ రోజు నుంచి మీరు నా సోదరి’ అన్నాడు. ఆ యువకుడు లతతో అత్యద్భుతమైన పాటలు పాడించిన సంగీత దర్శకుడు మదన్ మోహన్!  అయితే ఆయన  తొలిసారి సంగీత దర్శకత్వం వహించిన సినిమా ‘ఆంఖే’లో లత పాట లేదు. తరువాత లత పాటలేని సినిమాకు ఆయన సంగీత దర్శకత్వం వహించలేదు! తన సినీ జీవితంలో ఎందరో సంగీత దర్శకులు అత్యద్భుతమయిన పాటలెన్నో తనతో పాడించారు కానీ, ఏదో ఒక సందర్భంలో అందరూ తనని కాదన్నారు, వదిలేరు. కానీ, ఒక్క మదన్ మోహన్ మాత్రమే ఆరంభం నుంచి చివరి వరకూ తనతో స్నేహంగా వుంటూనేవచ్చాడనీ, ఎట్టి పరిస్థితులలో తనను వదలలేదనీ లత పలు ఇంటర్వ్యూలలో మదన్ మోహన్ తో తన ప్రత్యేక అనుబంధాన్ని వివరించింది.

అనిబిశ్వాస్ పాటలు మార్చిన ఆ సినిమా చేదు అనుభవం, లతకు గుణపాఠం నేర్పింది. అప్పటి నుంచి ఎవరైనా పాటకు పిలిస్తే, ముందుగానే పాట తన స్వరంలోనే ఉండాలన్న నిబంధన విధించేది. నిబంధనను ఉల్లంఘిస్తే మళ్ళీ ఆ సంగీత దర్శకుడితో కలసి పనిచేసేది కాదు.

అనిల్ బిశ్వాస్‍కు లత బాధపడ్డట్టు కూడా తెలియదు. ఆయన తన ధోరణిలో లతతో పాటలు పాడిస్తూ, లతకు పాటలు ఎలా పాడాలో నేర్పిస్తూ పోయాడు. మైకు ముందు సరిగ్గా నిలబడటం, మైకు పరిధి లోకి రాకుండా పాట మధ్యలో ఊపిరి తీయటం, ముఖ్యంగా హై పిచ్‌లో రాగం తీయాల్సి వచ్చినప్పుడు శ్రోత పసికట్టకుండా ఊపిరి పీల్చటం, పెద్ద వాక్యం పలకాల్సి వచ్చినప్పుడు పదాల నడుమ ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా ఊపిరి పీల్చగలగటం వంటి టెక్నిక్కులన్నీ అనిల్ బిశ్వాస్ లతకు నేర్పించాడు. అనిల్ బిశ్వాస్‌కు పాడిన ‘ప్రతిపాట తనకు ఒక పాఠం లాంటిది’ అంది లతా మంగేష్కర్ ఒక ఇంటర్వ్యూలో. కానీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 25 ఏళ్ళయిన సందర్భంగా ఉత్తమ పదిపాటలను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు అనిల్ బిశ్వాస్ పాటను ఎన్నుకోలేదు లత. ఇది అనిబిశ్వాస్ పాటలు మార్చిన ఆ సినిమా  ప్రభావం.

ఇక్కడ లత స్వభావంలో అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, ఆమె ఎవరైనా చేసిన మేలు మరిచిపోదు. చేసిన అవమానాన్ని క్షమించదు. సి. రామచంద్ర అయినా, అనిల్ బిశ్వాస్ అయినా, శంకర్ జైకిషన్ అయినా, రాజ్ కపూర్ అయినా, మహమ్మద్ రఫీ అయినా… లత అందరికీ విధేయురాలిగానే ఉంటుంది. కానీ ఎవరికీ కృతజ్ఞురాలు కాదు!

1948లో అనోఖా ప్యార్, ఆశా, గజ్రే, మజ్బూర్, జిద్ది సినిమాలలో లత పాడిన పాటలు సూపర్ హిట్ లయ్యాయి. ముఖ్యంగా ‘బేదర్ద్ తేరే దర్ద్ కో’ (పద్మిని, 1948), ‘చందారే జారె జా’ (జిద్ది 1948) వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. లత పాటలు హిట్ పాటలవుతాయన్న నమ్మకం కలిగింది. అందుకే 1949లో లత పాడిన పాటలు 157 విడుదలయ్యాయి. అంటే, దేశ విభజన జరగటం, నేపథ్యగానం స్థిరపడటం, యువ నటీమణులు రావటం, గులామ్ హైదర్, అనిల్ బిశ్వాస్‍లకు పాడిన పాటలు హిట్ కావటం లతకు లాభించాయన్న మాట.

లత సినీ సంగీత జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం 1949.

1949 సంవత్సరం హిందీ సినీ సంగీత చరిత్రలో స్వర్ణయుగానికి నాందీ సంవత్సరం. సినీ సంగీత ప్రపంచంలో అత్యద్భుతమయిన పాటల తూఫానుకు ఆరంభ సంవత్సరం. లతా పాటల మాధురీ కుంభవృష్టి ఆరంభమయిన సంవత్సరం. శంకర్ జైకిషన్ ప్రథమంగా సంగీత దర్శకత్వం వహించిన బర్సాత్ సినిమా పాటలు ప్రజలపై ఆనందపు వృష్టి కురిపించిన సంవత్సరం 1949.

జియా బేకరార్ హై, ఆయీ బహార్ హై

ఆజా మోరే  బాల్‍మా తేరా ఇంతజార్ హై

హస్రత్ జైపూరి రచించగా శంకర్ జైకిషన్, బర్సాత్ సినిమా కోసం రూపొంచిందిన ఈ పాట భారతీయ సినీ సంగీత చరిత్ర దిశను మార్చింది. హిందీ సినిమా పాట స్వరూప స్వభావాలను సంపూర్ణంగా రూపాంతర మొందించింది. ఈ పాట పాడుతూ లతా మంగేష్కర్ హిందీ సినీ సంగీత శిఖరాలను అతి సునాయాసంగా అధిరోహించింది.

1949 వరకూ లతా మంగేష్కర్ దాదాపుగా 60 పాటలను పాడింది. ఎవరైనా లతా మంగేష్కర్ కెరీర్‍ను ప్రతి సంవత్సరం ఆ సంవత్సరంలో పాడిన పాటల ఆధారంగా పరిశీలిస్తే,  విశ్లేషిస్తే 1947 అంతానికి ఆమె పాటలు విని, లతా మంగేష్కర్ సినీ నేపధ్యగాయనిగా నిలవలేదన్న అభిప్రాయానికి వస్తారు. గీతారాయ్  అగ్రశ్రేణి గాయనిగా ఎదుగుతుందని బల్లగుద్ది మరీ వాదిస్తారు. లతా మంగేష్కర్‍కు అవకాశాలు అంతగా రావటం లేదు. ఆమె పేదరికం ఆమె దుస్తులలో తెలుస్తుంది. ఆమె ఎవరితో అంతగా కలవదు. తన చుట్టూ గిరిగీసుకుని కూర్చుంటుంది. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా తనకు నచ్చనివారితో పనిచేసేందుకు నిరాకరిస్తుంది. ఉదయం రిహార్సల్స్ కి వచ్చిందంటే, రాత్రి రికార్డింగ్ అయ్యేవరకు స్టూడియోలోనే వుంటుంది. ఒక్క చాయ్ తాగటం తప్ప మరేమీ తీసుకోదు. ఆమెని వెంట పిలిచే ధైర్యం ఏ సాటి కళాకారుడికి లేదు. ఇవి సరిపోనట్టు, ముందుగా పాటలోని పదాలను తెలుసుకుని వాటిల్లో ఏమాత్రం ద్వంద్వార్థం ధ్వనించే పదాలున్నా పాట పాడేందుకు నిరాకరిస్తుంది.

సినీ ప్రపంచమే కాదు, మానవ ప్రపంచం సర్వం భిన్నంగా ఉన్నవారిని ఆదరించదు. వారిని హింసిస్తుంది. విరవాలని చూస్తుంది. విరగకపోతే వంచాలని చూస్తుంది. వీటన్నిటినీ తట్టుకుని నిలబడిన వాడిని గౌరవిస్తుంది. ఆదరిస్తుంది. అభిమానిస్తుంది. అనుసరిస్తుంది. కానీ ఆ దశకు చేరుకోవాలంటే వ్యక్తి ప్రతిభతో పాటు బలమైన వ్యక్తిత్వం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. అన్ని అడ్డంకులనూ తట్టుకుని తన ప్రత్యేకతను నిలుపుకునే శక్తి ఉండాలి. అన్నిటినీ మించి కాలం అనుకూలించాలి.

లతకు ఇవన్నీ ఉన్నాయి. తండ్రి మరణించిన తరువాత కుటుంబ బాధ్యతలను తలకెత్తుకోవటంలోనే ఆమె స్థైర్యం, విశ్వాసం తెలుస్తాయి. అదీ పదమూడేళ్ళ వయసులో. స్వరం తప్ప మరే ఆస్తి లేని స్థితిలో బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలంటే ఉండాల్సిన మనోస్థైర్యం మామూలుది కాదు. పైగా మహిళ. పురుష ఆధిక్య సినీ ప్రపంచంలో, ఎవరినుంచీ ఎలాంటి సహాయం ఆశించకుండా, ఎవరినీ దగ్గర రానీయకుండా, తన మాట నెగ్గించుకుంటూ మనగలగటం అసంభవం. అందుకే 1947 చివరిలో లత కెరీర్ మహా అయితే, ఒకటో, రెండో ఏళ్ళు అంతే, అన్నభావన బలంగా కలుగుతుంది.

ఈ సమయానికి గీతారాయ్  కెరీర్ తారాపథానికి దూసుకుపోతోంది. గీతారాయ్ తొలి సొలో పాట, 1946లో (ఈ సంవత్సరం లత కేవలం ఆరుపాటలు పాడింది) ‘ప్రీతి కిసికో నా ఛోడే’ అన్నది ‘సర్కస్ కింగ్’ అన్న సినిమాలో పాడింది. సంగీత దర్శకులు అభ్యంకర్ జోషి, నాగేశ్వరరావులు. అదే సంవత్సరం, గులామ్ హైదర్ సంగీత దర్శకత్వంలో ‘బైరమ్ ఖాన్’ సినిమాలో శంషాద్ బేగమ్, మునావర్ సుల్తానా, నసీమ్ బేగమ్‍లతో కలిసి ‘జబ్ చాంద్ జవాన్ హోగా’ అన్న పాట పాడింది. ‘మిలన్’ సినిమాలో రెండు పాటలు; ‘నయీమా’, ‘రసీలీ’ అన్న సినిమాల్లో ఇంకొన్ని పాటలు పాడింది. ఎస్.ఎన్ త్రిపాఠీ సంగీత దర్శకత్వంలో అద్భుతమైన జోలపాట ‘ఆజారే నిందియా ఆజా’ పాడింది. ఇదే సంవత్సరం బీనాపాణి ముఖర్జీ, రఫీలతో పాట పాడింది. రఫీతో ఈ సమయంలో ఏర్పడిన స్నేహం జీవితాంతం కొనసాగింది. సినీ పరిశ్రమ గీతారాయ్  ను విస్మరించిన సమయంలో కూడా రఫీ ఆమెకు అండగా నిలబడ్డాడు.

1947లో అనిల్ బిశ్వాస్ ‘భూక్’ సినిమాలో పాటలు గీతాకు    చక్కటి గుర్తింపునిస్తే, ‘దో భాయ్’ సినిమా పాటలు తారాపథంలోకి నడిపించాయి. రాజ్ కపూర్, మధుబాలల సినిమా ‘దిల్ కీ రాణి’ లో అయిదు పాటలు పాడింది గీతారాయ్. మధుబాలకు గీతారాయ్ స్వరం ఎంత చక్కగా కుదిరిందంటే మధుబాల పాటపాడితే అది ‘గీతారాయ్’ స్వరంలోనే అన్న భావన బలపడింది. ‘చిత్తోడ్ విజయ్’ అనే మధుబాల సినిమాలోనూ గీతారాయ్ పాడింది. ఈ సంవత్సరమే గీతారాయ్,  సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో ‘లీలా’ ‘సాజన్ ‘ ‘షహనాయీ’ సినిమాల్లో పాడింది. సజ్జాద్ హుస్సేన్ సంగీత దర్శకత్వంలో ‘కసమ్’, ‘మేరీ భగవాన్’ సినిమాల్లో పాడింది. ఇంకా గ్యాన్‍దత్, బులో సి రాణి, అజీజ్ ఖాన్, హన్స్‌రాజ్ బహెల్, జాఫర్ ఖుర్షీద్, ఖేమ్‌చంద్ ప్రకాశ్ వంటి సీనియర్ సంగీత దర్శకులు, చిత్రగుప్త, ప్రేమ్ నాథ్, స్నేహల్ భాట్కర్ (అప్పుడు వాసుదేవ్) వంటి యువ సంగీత దర్శకుల పాటలూ పాడింది. కేదార్‍శర్మ సినిమా ‘నీల్ కమల్’ లో అయిదు పాటలు పాడింది గీతాదత్. ఈ సంవత్సరం లత, గీతాలు తొలిసారిగా కలసి ‘జవానీ కీ రేల్’  పాట సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో పాడారు.

1947 చివరికి ఇదీ పరిస్థితి! 1947 చివరికి ప్రతి ఒక్క సంగీత దర్శకుడు, సీనియర్ అయినా యువకులు అయినా గీతారాయ్  తో పాటలు పాడించేందుకు ఉత్సాహం చూపించేవారు. గీతారాయ్‍కు ఆ సమయంలో బెంగాలీ తప్ప మరో భాష వచ్చేది కాదు. అయినా పాటను బెంగాలీలో రాసుకుని, గేయ రచయితలతో కూర్చుని పదాలు పలకటాన్ని తెలుసుకునేది. అభ్యసించేది. పెద్దగా శ్రమ పడకుండా భావాలను పలికించేది.

1948లో లతా మంగేష్కర్ 48 పాటలు పాడితే, గీతారాయ్   వందకు పైగా పాటలు పాడింది. మజ్బూర్, ఖిడ్కీ, షహీద్, సుహాగ్ రాత్, హీర్ రాంఝూ, సావరియా, మేరి కహానీ, పద్మిని, ఏక్ట్రిస్, అంజనా, గుణసుందరి, జీనేదో, చందా కే చాంద్‍నీ, వంటి సినిమాలలో గీత పాడిన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకర్షించాయి. గుజరాతీ భాషలో కూడా ఈ సంవత్సరం పాటలు పాడింది గీతా. ఎస్ ఎస్ వాసన్ మాగ్నమ్ ఓపస్ ‘చిత్రలేఖ’ లో పాటలన్నీ ఉమాదేవితో పాడించాడు. కానీ గీత పాటలు విన్న వాసన్, ఆమె పాట తన సినిమాలో తప్పనిసరిగా ఉండాలని పట్టుబట్టి ‘నాచే ఘోడా, నాచే ఘోడా’ అనే పాటను గీతాతో పాడించాడు.

గీతా గీతాల జైత్రయాత్ర 1949 లో కూడా కొనసాగింది. నర్గీస్ తల్లి జడ్డన్ బాయ్ నిర్మించిన ‘దారోగా జీ’ లో పన్నెండు పాటలు గీతాదత్ పాడింది. నౌషాద్ సంగీత దర్శకత్వంలో తొలిసారి ‘దిల్లగీ’ సినిమాలో పాటలు పాడింది. ‘హుస్న్‌లాల్ – భగత్ రామ్’ సంగీత దర్శకత్వంలో  ‘హమారీ మంజిల్’ సినిమాలో ఆరు పాటలు పాడింది. అయితే ఈ సంవత్సరం ‘ఏక్ థీ లడ్కీ’ అన్న సినిమాలో తొలి సారిగా, అగ్రశేణి గాయనిగా పోటీ లత, గీతల నడుమ జరుగుతుంది అన్న ఆలోచన వచ్చింది. ఈ సినిమాలో గీత ‘ఉన్సే కహెనా’ అన్న పాట పాడింది. ఇది కుల్దీప్ కౌర్‌పై చిత్రితమయింది. పెద్దగా ప్రజలను ఆకర్షించలేదు. కాని ఇదే సినిమాలో నాయిక ‘మీనాషోరి’ పై చిత్రితమైన ‘లారలప్ప’ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. మీనాషోరిని అందరూ ‘లారలప్ప గర్ల్’ అనటం ప్రారంభించారు. ఈ పాటను లత, దుర్రానీ, రఫీలతో కలిసి పాడింది. తొలిసారిగా లత స్వరం వీధి వీధినా మారు మ్రోగింది. ఈ సంవత్సరం సురేంద్రతో కలసి గీతా ‘మేరీ కహానీ’, ‘కమల్’ వంటి సినిమాలలో హిట్ గీతాలు పాడింది. ‘రామ వివాహ్’ సినిమాలో మన్నాడేతో తొలి యుగళగీతం పాడింది గీతా.

1949లో ‘బర్సాత్’, ‘అందాజ్’, ‘మహల్’ సినిమాలలోని పాటలతో ఒక్కసారిగా లత, గీతారాయ్‍ను అందుకుంది. ఈ విషయం గురించి లోతుగా చర్చించే కన్నా ముందు 1946 నుండి 1949 వరకూ లత, గీతలు పాడిన పాటల సంఖ్యను పోల్చి చూడాల్సి ఉంటుంది.

సంవత్సరం లత గీత
1946 6 20
1947 5 52
1948 48 105
1949 151 106

1946లో గానం ఆరంభించినప్పటి నుంచి గీతా దూసుకుపోతూనే వుంది. తొలిసారిగా 1949లో లత మంగేష్కర్ అటు వేగంగా ఎదుగుతున్న గీతాదత్‍పై, ఇటు అప్పటికే స్థిరపడి వున్న శంషాద్ బేగంపై ఆధిక్యాన్ని సాధించింది. పాపులారిటీలో లతను, భారతదేశ ప్రజలకు పెద్ద ఎత్తున పరిచయం చేసింది మహల్ సినిమాలోని ‘ఆయెగా ఆనెవాలా’ పాట. ‘ఎవరు లత?’ అని ప్రజలంతా ప్రశ్నిస్తున్న తరుణంలో ‘లత ఎవరు?’ అని మరెవ్వరూ ఇంకోసారి, ఎప్పటికీ అడిగే అవసరం లేకుండా లత పాటల కుంభవృష్టి కురిపించింది ‘బర్సాత్’ సినిమా.

‘బర్సాత్’ సినిమా రాజ్‍కపూర్ నిర్మించిన రెండవ చిత్రం. మొదటి సినిమా ‘ఆగ్’. ‘ఆగ్’ సినిమా నిర్మాణ సమయంలో పృథ్వీరాజ్ కపూర్, రాజ్‍ కపూర్‍కు సంపూర్ణ స్వేచ్ఛ్ నిచ్చాడు కానీ, సంగీత దర్శకుడిగా రామ్ గంగూలీని తీసుకోమని అన్నాడు. అందరూ కొత్తవారయినపుడు అనుభవజ్ఞుడయిన సంగీత దర్శకుడుంటే పాటలు ‘హిట్’ అవుతాయి. సినిమా విలువ పెరుగుతుందని ఆయన ఆలోచన. తండ్రి మాటను అనుసరించి రాజ్ కపూర్ ‘ఆగ్’ సినిమాకు  ‘రామ్ గంగూలీ’ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఆగ్‍లో పాటలు కొన్ని బాగా ప్రజలను ఆకర్షించాయి. ముఖ్యంగా రాజ్‍ కపూర్‍కు ముకేష్ పాడిన ‘జిందాహు ఇస్ తర్హా’ అనే పాట ఈనాటికీ వినపడుతుంది. నర్గీస్‍పై చిత్రితమైన శంషాద్ బేగమ్ పాడిన పాట ‘కాహే, కోయల్ షోర్ మచాయేరే’ కూడా ‘హిట్’ పాటగా నిలిచింది. ఈ సినిమాలో రామ్ గంగూలీకి అసిస్టెంట్లుగా పనిచేశారు శంకర్, జైకిషన్ అనే యువకులిద్దరూ.

శంకర్ సింఘ్ రఘువంశీ హైదరాబాదులో పెరిగాడు. కుస్తీ పై అమితమైన ఆసక్తి గల శంకర్ తబలాలో నిష్ణాతుడు. కథక్ నృత్యం నేర్చుకున్నాడు. డ్రామా ట్రూపుతో తిరుగుతూ బొంబాయి చేరాడు. పృథ్వీరాజ్ కపూర్ నాటక సంస్థ పృథ్వీ థియేటర్‍లో తబలా వాయిద్యానికి కుదురుకున్నాడు. పృథ్వీ థియేటర్‍లో సంగీతం సృజిస్తూ సినిమాలలో అవకాశం కోసం ప్రయత్నాలు చేశాడు. హుస్న్‌లాల్ భగత్ రామ్ వద్ద సహాయకుడిగా పనిచేశాడు. అవకాశాల కోసం తిరుగుతున్న కాలంలోనే ఓ ప్రొడ్యూసర్ దగ్గర అతనికి బహు సిగ్గరి అయిన యువకుడు జయ్ కిషన్ దయాభాయ్ పంచాలితో పరిచయం అయింది. వృత్తిరీత్యా కార్పెంటర్ అయిన జయ్ కిషన్‍కు సంగీతం అంటే ప్రాణం. వారిద్దరి నడుమ దోస్తీ కుదిరింది. జయ్ కిషన్‍కు కూడా పృథ్వీ థియేటర్‍లో ఉద్యోగం ఇప్పించాడు శంకర్. వీరిద్దరి నడుమ దాదాపుగా పదేళ్ళ తేడా ఉన్నా, వయసుతో పని లేకుండా, సంగీతం ఆధారంగా దోస్తీ కుదిరింది. జయ్‍కిషన్ సంగీత ప్రతిభను శంకర్ గుర్తించాడు.

రాజ్‍కపూర్ రెండవ సినిమా ‘బర్సాత్’ తలపెట్టినప్పుడు సంగీత దర్శకుడిగా రామ్ గంగూలీని ఎంచుకున్నాడు. కానీ రాజ్ కపూర్ సినిమా కోసం ఎంచుకున్న బాణీని రామ్ గంగూలి మరో నిర్మాతకు ఇచ్చాడన్న వార్త రాజ్ కపూర్‍కు తెలిసింది. రాజ్‌కపూర్ వ్యక్తిగతంగా చాలా అసూయాపరుడు. తనది అన్నది వేరేవారికివ్వడు. తన సినిమాకోసం తయారయిన బాణీని వేరే నిర్మాతకు ఇవ్వటం రాజ్‌కపూర్ సహించలేడు. అంతెందుకు, 1965 ప్రాంతానికి శంకర్‌జైకిషన్ నంబర్ వన్ సంగీత దర్శకులు. వారు సృజించిన బాణీలను రాజ్‌కపూర్ తన దగ్గర టేప్ లో దాచుకుని అవసరం వచ్చినప్పుడు వాడేవాడు. అలా, రాజ్‌కపూర్ కోసం సృజించిన ఒక బాణీని శంకర్‌జైకిషన్ ఆమ్రపాలి సినిమాలో వాడాలని నిర్ణయించారు. అది తెలిసి రాజ్‌కపూర్ నిర్మాత ఎఫ్‌సీ మెహ్రాకు ఫోను చేసి బెదిరించాడు. దాంతో చివరి క్షణంలో రిహార్సల్స్ అయిన పాటను వదలి వేరే బాణీతో మరో పాటను సృజించారు శంకర్‌జైకిషన్. అలా సృజించిన పాట జావొరీ జోగి తుం జావొరీ, తరువాత సినిమాలో వాడలేదు. రాజ్‌కపూర్ కొట్లాడి రక్షించుకున్న బాణీని మేరా నాం జోకర్ సినిమాలో కాటే నా కటే రైనా అన్న పాటగా రికార్డ్ చేయించుకున్నాడు. కానీ, ఆ పాటనూ సినిమాలో వాడలేదు. రాజ్‌కపూర్ అసూయను నిరూపించే ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.  దాంతో రాజ్ కపూర్, రామ్ గంగూలీని బర్సాత్ సంగీత దర్శకుడిగా తొలగించాడు. ఆ బాధ్యత శంకర్‍కి అప్పగించాడు. ఎందుకంటే రామ్ గంగూలీ వేరే వారికి ఇచ్చిన రాజ్ కపూర్ బాణీని కట్టింది శంకర్. అంతకుముందు ఆ బాణీని రాజ్ కపూర్‍కు వినిపించింది శంకర్. అప్పటికే రామ్ గంగూలీ నిర్ణయమవటంతో అతనికిచ్చి ఆ బాణీని వాడమన్నాడు. అందుకని రామ్ గంగూలీని తొలగించగానే ఆ బాధ్యతను శంకర్‍కి అప్పగించాడు. నిజానికి ఆ బాధ్యతను శంకర్‌జైకిషన్ కు అప్పగించేకన్నా ముందు నౌషాద్ ను, రోషన్ నూ అడిగాడు. వారికి కుదరలేదు. పృథ్వీ రాజ్ కపూర్ సలహాననుసరించి శంకర్ ను ఎంచుకున్నాడు రాజ్ కపూర్.  అయితే తనతో పాటు జైకిషన్‍ని కూడా జోడీగా ఉండనిస్తే సంగీత దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తానని శంకర్ అన్నాడు. రాజ్ కపూర్ అందుకు ఒప్పుకున్నాడు. అలా ఏర్పడింది హిందీ సినీ ప్రపంచాన్ని సంపూర్ణంగా రూపాంతరం చెందించిన సంగీత విప్లవకారులు, హిందీ సినీ సంగీత సామ్రాట్టులైన శంకర్ జైకిషన్ జోడీ!

‘బర్సాత్’ సినిమా అవకాశం లభించగానే,   సినిమాలో పాటలు పాడేందుకు అప్పుడప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లతా మంగేష్కర్ పేరును సూచించాడు శంకర్. శంకర్ గతంలో హుస్న్‌లాల్ – భగత్‍రామ్‌ల వద్ద వాయిద్యకారుడిగా పనిచేశాడు. వారు పాటలకు బాణీలు కట్టే పద్ధతిని శంకర్ ఆకళింపు చేసుకున్నాడు. లతా మంగేష్కర్ కోసం వారు సృజించిన బాణీలను విశ్లేషించాడు. లత స్వరంలోని ప్రత్యేకతను గ్రహించాడు. ఆమె ఎలాంటి పాటనైనా పాడగలదనీ, రాగాలు తీయటంలోనూ, ఉచ్చస్వరంలో పాడటంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదనీ శంకర్ తెలుసుకున్నాడు. శంకర్ సూచనను రాజ్‍కపూర్ ఆమోదించాడు. ఆ తరువాత జరిగింది లతా మాటల్లో…..

“ఓ రోజు ప్రొద్దున్నే రాజ్ కపూర్ నుంచి పిలుపు వచ్చిందని, స్టూడియోకు తీసుకెళ్ళటానికి కార్లో ఓ యువకుడు వచ్చాడు. చిన్నపిల్లవాడిలా వున్నా అందంగా వున్నాడు ఆ యువకుడు. రాజ్ కపూర్ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా రాజ్ కపూర్‍లాగే అందంగా ఉంటారని అనుకున్నాను. అతడు బహు సిగ్గరి. దారిలో ఏమీ మాట్లాడలేదు. స్టూడియో చేరిన తరువాత తెలిసింది. అతడు ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న జోడి శంకర్ జైకిషన్‍లలో జైకిషన్ అని’. అలా రికార్డయింది. సినీ సంగీతాన్ని మలుపు తిప్పిన ‘జియా బేకరార్ హై’ పాట.

ఇలా కలిశారు హిందీ సినీ గీతాల దిశను మార్చే రాజ్‍ కపూర్, శంకర్ జైకిషన్, లత మంగేష్కర్‍లు. ఆ రోజునుంచి శంకర్ జైకిషన్‍ల సంగీతపు ప్రయాణంలో లత సహ ప్రయాణీకురాలైంది. ‘బర్సాత్’ లోని ఒక్కో పాటనూ  ఒక్కో  అద్భుతమైన గీతంలా శంకర్ జైకిషన్‌లు తీర్చిదిద్దితే ఆ అద్భుతమైన గీతాలకు తన స్వరంతో  ప్రాణం పోసింది లత. ‘హవామే ఉడతా జాయే’, ‘బిఛ్‍డే హువె పరదేశీ’, ‘అబ్ మేరా కౌన్ సహారా’, బర్సాత్ మే హమ్ సే  మిలే’, ‘ఛోడ్‍గయా బాలమ్’, ‘పత్లి కమర్ హై’, ‘మెరి ఆంఖోంమె బస్ గయే కోయీరే’, ‘ముఝే కిసీసే ప్యార్ హోగయా’ వంటి సూపర్ హిట్ పాటలతో ‘బర్సాత్’ సినీ ప్రపంచాన్ని సంగీత కుంభవృష్టితో తడిపి వేసింది. అదే సమయానికి పాటల వ్యాపార విలువను ప్రస్ఫుటం చేసింది ‘బర్సాత్’ . సినిమాతో సంబంధం లేకుండా పాటల అమ్మకాలతోనే రాజ్ కపూర్‍కు విపరీతమైన లాభాలు వచ్చాయి. రాజ్‍ కపూర్, శంకర్ జైకిషన్ లతో లతకు సన్నిహితమైన, స్వచ్ఛమైన స్నేహం ఏర్పడింది. శంకర్ ఆమెకన్నా ఏడేళ్ళు పెద్ద. జయ్‍కిషన్ నాలుగేళ్ళు చిన్న. రాజ్‍ కపూర్ అయిదేళ్ళు పెద్ద. అంటే, అందరూ దాదాపుగా సమవయస్కులే. శంకర్ జైకిషన్‍లకు సంగీత దర్శకులుగా ‘బర్సాత్’ తొలిచిత్రం. రాజ్ కపూర్‍కు దర్శక నిర్మాతగా రెండవ చిత్రం. లతా మంగేష్కర్ అప్పుడప్పుడే సినీ రంగంలో నిలద్రొక్కుకుంటోంది. దాంతో సమ వయస్కులంతా కలిసి దాదాపుగా ఒకేసారి తమ భవిష్యత్తును నిర్దేశించే సినిమా కోసం నిజాయితీగా, శాయశక్తులు ఒడ్డి పనిచేశారన్నమాట. వారి నడుమ ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది.

‘బర్సాత్’ లో తొలిపాట ‘జియా బేకరార్ హై’ రికార్డింగ్ పూర్తయిన తరువాత “తమ భవిష్యత్తు ఏమవుతుందో?’ ‘ఎలా ఉంటుందో?’ అని ఆలోచిస్తూ స్టూడియో బయట మెట్లమీద ఆలోచిస్తూ చాలాసేపు కూర్చున్నాం” అని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది లత.

‘బర్సాత్’ సినిమా తరువాత శంకర్ జైకిషన్, రాజ్ కపూర్‍ల సినిమాల్లో లత తప్పని సరి అయింది. శంకర్ జైకిషన్‍లు లతను దృష్టిలో ఉంచుకుని, అత్యద్భుతమైన బాణీలు, అతి క్లిష్టమైనవి, అత్యంత ఉచ్చ స్వరంలో పాడేవి  సృజించారు. లతతో కలిసి శంకర్ జైకిషన్‍లు హిందీ సినీ సంగీత జగత్తులో స్వర్ణయుగంపై తెర తీశారు. ‘బర్సాత్’ పాటలు ఎంత హిట్ అయ్యాయంటే, రికార్డుపై తన పేరు ఉండాలని లత పట్టుబట్టి సాధించుకున్నది. ‘రాయల్టీ’ కూడా రాజ్ కపూర్ దగ్గర సాధించుకుంది లత. అంటే ‘బర్సాత్’ వరకూ అగ్రశేణి గాయనిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న లత, బర్సాత్‍తో అగ్రశేణి గాయనిగా గుర్తింపు పొందింది. లతా మంగేష్కర్ ‘మహరాణి’ గా ఎదగటానికి కారణమయింది ‘బర్సాత్’.

అదే సంవత్సరం విడుదలయిన ‘అందాజ్’ లతను ‘మహరాణి’గా స్థిరపరిచింది. ఒకే సంవత్సరం ‘ఆయేగా అనేవాలా’ (మహల్), బర్సాత్, అందాజ్‍  పాటలు సూపర్ డూపర్ హిట్‍లు కావటంతో, అంతవరకూ లతకన్నా ముందున్న గీతారాయ్‍తో లత సమానం కావటమే కాదు, గీతారాయ్‍  కన్నా ఒక అడుగు ముందుకు వెళ్ళింది. గీతారాయ్ కూడా 1949లో అధిక సంఖ్యలో పాటలు పాడినా లత మంగేష్కర్ పాటలు పాడిన సినిమాలు అయినంత ‘హిట్’ గీతా రాయ్ పాటలు పాడిన సినిమాలు కాలేదు. దీనికి తోడు లత పాడిన పాటల సినిమాలు క్లాసిక్‍లుగా నిలిచిన సినిమాలు. పాటలు ఎంత బాగున్నా, సినిమా నడవకపోతే పాటలు అంతగా జ్ఞాపకాల్లో నిలవవు.

మహబూబ్ ఖాన్ సినిమా ‘అందాజ్’ సినిమాను ఈనాటికీ క్లాసిక్‍గా పరిగణిస్తారు. రాజ్‍కపూర్, నర్గీస్, దిలీప్ కుమార్‍లు నటించిన ‘అందాజ్’ సూపర్ హిట్ అవటంలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. నౌషాద్ సంగీత దర్శకుడు. 1949 వరకూ నౌషాద్ నాలుగు సినిమాల్లో 19 పాటలు లతతో పాడించాడు. 1948 వరకూ లతతో ఒక్కపాట పాడించని నౌషాద్ 1949లో అందాజ్, చాందినీరాత్, దులారీ, ఆయీయే అనే నాలుగు సినిమాలలో 22  పాటలు పాడించాడు. చాందినీరాత్ సినిమాలో ఒకే ఒక పాట పాడించిన నౌషాద్ ‘ఆయియే’లో ఏడుపాటలు, అందాజ్‍లో ఆరు పాటలు, దులారీలో ఎనిమిది పాటలు పాడించాడు. అంటే ఒక్కో సినిమాతో ‘నౌషాద్’ కు  లత ప్రతిభ పట్ల నమ్మకం పెరగటమే కాదు, లత నౌషాద్ సంగీతంలో ప్రధాన గాయనిగా ఎదిగిందన్న మాట. ఎంతగా అంటే, అప్పటివరకూ నౌషాద్ సంగీతంలో నాయికలకు పాటలు పాడుతున్న శంషాద్ బేగమ్, ‘దులారీ’లో రెండే పాటలు ‘న బోల్ పీపీ మోర్ అంగ్‍నా’ ‘చాంద్‍నీ ఆయీ బన్‍కే ప్యార్’ పాడింది. ఈ రెండూ హిట్ పాటలుగా నిలిచాయి. కానీ ‘దులారీ’ నాయిక ‘మధుబాల’ స్వరంగా లతను స్థిరపరిచాడు నౌషాద్. ఇది ఒకే సినిమాలో మధుబాలపై శంషాద్ బేగం, లతల స్వరాలు తెరపై చూస్తే స్పష్టమవుతుంది. అంతేకాదు, ఈ సినిమాలో ‘ఏయ్ దిల్ తుఝే కసమ్ హై’ పాటను నూర్జహాన్ పంథాలో పాడి మెప్పించింది లత. ఒక్క సంవత్సరంలో నౌషాద్‍కు లత ఎంత ప్రధాన గాయనిగా ఎదిగిందంటే ‘అందాజ్‍’లో శంషాద్ బేగం పాట ఒక్కటే, అదీ లతతో యుగళగీతం. నిజానికి ఆ పాట పాడటానికి నౌషాద్ నుంచి పిలుపు రావటంతో నాయికకు పాడుతున్నాననుకొని వచ్చిందట శంషాద్ బేగమ్. లతతో కలిసి పాడటం శంషాద్ బేగంకు కొత్త కాదు.

డర్నా మొహబ్బత్ కర్లే

1949లోనే లత, శంషాద్‍లు ‘పతంగ్’ సినిమా కోసం ‘ప్యార్ కా జహాన్ కీ నిరాలీ సర్కార్ హై’ అనే పాటను కలిసి పాడారు. సంగీత దర్శకుడు సి. రామచంద్ర. ఈ పాట రికార్డయిన సమయానికి శంషాద్ బేగం నెంబర్ వన్ గాయని. అందుకే శంషాద్ స్వరం నాయిక నిగర్ సుల్తాన్ కోసం, లత స్వరం సహయ నటి కోసం వాడేరు. కానీ ‘అందాజ్’ సినిమాలో ‘డర్‍నా మొహబ్బత్ కర్‍లే’ పాట రికార్డింగ్ సమయం వచ్చేసరికి నౌషాద్ లత స్వరాన్ని నర్గీస్ కోసం, శంషాద్ స్వరాన్ని సహాయనటి కోసం వాడేడు. ఒక కోణంలోంచి చూస్తే నౌషాద్ శంషాద్ బేగంకు చాలా అన్యాయం చేశాడనవచ్చు.

నౌషాద్ సంగీత దర్శకత్వంలో లత, శంషాద్ బేగంలు కలసి ఎప్పుడు యుగళగీతం పాడినా, శంషాద్ బేగంకు అన్యాయం జరిగింది. ముఖ్యంగా ‘దీదార్’ సినిమాలో ‘బచ్‌పన్ కే దిన్ భులానదేనా’ పాటలో లత స్వరాన్ని బాలనటి కోసం, శంషాద్ స్వరాన్ని బాలుడి కోసం వాడటంతో ‘శంషాద్ బేగం’ స్వరం ‘మగగొంతు’ అనీ, లత ‘ఆడగొంతు’ అనీ ప్రతీకాత్మకంగా చెప్పినట్టయింది. ఇది శంషాద్ బేగం కెరీర్‍ను దెబ్బతీసింది. నౌషాద్ సంగీత దర్శకత్వంలో 1952లో ‘ఆన్’ లో పాట “ఖేలో రంగ్ హమారే సంగ్’ లో కానీ, ‘బైజు బావరా’ లో ‘దూర్ కొయి గాయే’ తో కానీ లత స్వరాన్ని నాయిక కోసం వాడేడు నౌషాద్. పైగా లతతో యుగళ గీతాల్లో ‘తీగ’ లాంటి లత స్వరం ముందు శంషాద్ స్వరం మొరటుగా వినిపించేది. దాంతో లతతో యుగళ గీతం పాడినప్పుడల్లా శంషాద్ నష్టపోయింది.

శంషాద్ బేగమ్ ఒక్కర్తే కాదు, లత ప్రతిభ ఎలాంటిదంటే, లతతో యుగళగీతం పాడిన ఏ గాయని కూడా లాభపడలేదు. ఆ పాటల్లో లత స్వరం ముందు ఇతర స్వరాలు వెలతెలబోవటం, తేలిపోవటం జరిగేది. 1949లో ‘బడీబహెన్’ లో ‘చుప్ చుప్ ఖడే హో జరూర్ కోయీ బాత్ హై’ లో లతతో పాటు ‘ప్రేమలత’ అన్న గాయని పాట పాడిందని తక్కువమందికి తెలుసు. అలాగే ‘గోరీగోరీ’ (సమాధి, 1950)లో లతతో పాటు అమీర్ బాయి కర్ణాటకి పాడిందని చెప్తే కానీ గుర్తుకురాదు. అయితే లతకు దీటుగా పాడి యుగళగీతాల్లో కూడా లతతో సమానంగా, అప్పుడప్పుడు ఓ మోస్తరు ఎక్కువగా పేరు సంపాదించింది గీతా రాయ్ ఒక్కర్తే. అందుకే ఇతర గాయనిలతో కన్నా గీతారాయ్‍తో పాడేప్పుడు తాను మరింత ఎక్కువ శ్రమ పడతానని, జాగ్రత్తలు తీసుకుంటానని లత చెప్పింది. ‘అంతవరకూ బెంగాలీ యాసతో తప్ప హిందీ మాట్లాడలేని గీతా, మైకు ముందుకు రాగానే, హిందీ తప్ప మరో బాష రానిదానిలా, హిందీ మాతృభాష అయిన దానిలా అద్భుతంగా పదాలు పలుకుతుంది. అదేం మాయాజాలమో నాకు ఇప్పటికీ అర్థం కాదు’ అంది లతా మంగేష్కర్ గీతారాయ్‍తో తాను పాడిన అనుభవాన్ని స్మరిస్తూ. అందుకే లతతో కలసి యుగళగీతం పాడిన గాయని కెరీర్ దాదాపుగా సమాప్తమయినంత పని అవుతుంది. ‘గీతారాయ్’ లతతో దీటుగా నిలబడింది. ఆశా భోస్లే, లతతో కలిసి యుగళ గీతాలు పాడినా, ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకోవటం వల్ల కెరీర్ పరంగా నష్టం కలుగలేదు కానీ, లతముందు ఆశా స్వరం తేలిపోతుంది. నాయికకు తప్పనిసరిగా లత స్వరమే వాడటం వల్ల ఇద్దరిలో నెంబర్ వన్ గాయని ఎవరో స్పష్టంగా తెలుస్తూంటుంది.

1949లో ‘అందాజ్’లోని పాటలతో లత, శంషాద్ బేగమ్ కెరీర్ పతనానికి నాందీ ప్రస్తావన చేసింది. నర్గీస్ కోసం లత పాడిన ‘ఉఠాయే జా ఉన్ కీ సితమ్’ పాటను హిందీ సినీ సంగీత చరిత్రలో అద్భుతమైన గజల్‍గా పరిగణిస్తారు. నూర్జహాన్‍ను అనుకరిస్తూ పాడిన ఈ పాట గురించి ఈనాటికీ చర్చలు జరుగుతున్నాయి.

1949లోనే ఆయియేలో ‘దునియా బదల్ గయీ’, ‘బజార్’లో ‘సాజన్‍కీ గలియాన్ ఛోడ్ చలీ’, ‘బడీ బహెన్’లో ‘చలే జానా నహి నైన్ మిలాకే’, ‘జో దిల్ మే ఖుషీ బన్ కే ఆయా’; ‘లాడ్లి’లో ‘తుమ్హారే బులానేకో  జీ చాహ్తా హై’, ‘లాహోర్’ లో ‘బహారే ఫిర్ భి ఆయేంగీ’ వంటి పాటలు సూపర్ హిట్ పాటలుగా నిలిచాయి. ఒకే సంవత్సరం ఇలా వెంట వెంటనే హిట్ పాటలు రావటం, అదీ క్లాసిక్‍లుగా నిలచే సినిమాల్లో పాటలు పాడటం లతకు లాభించింది. ఒక సంవత్సరంలో గీతారాయ్‌తో పాటుగా అగ్రశ్రేణి గాయనిగా గుర్తింపు సాధించింది.

1947 అంతానికి, ఇంకో రెండు మూడేళ్ళలో కనుమరుగయి పోతుందనిపించిన గాయని, రెండేళ్ళ తరువాత చూస్తే, అగ్రశ్రేణి గాయనిగా గుర్తింపు పొందటమే కాదు, అంతవరకూ అగ్రస్థాయిలో ఉన్న ఒక గాయని, శంషాద్ బేగంను దాటిపోవటం, మరో గాయని, గీతారాయ్‍తో సమానంగా నిలవటం అనూహ్యమైన సత్యం. ఈ అనూహ్యమూ, అసంభవమూ అయిన అంశాన్ని సంభవం చేసింది లత తన స్వరంతో, పట్టుదలతో, నిజాయితీతో.

ఆరంభం నుంచీ లత కొన్ని నియమనిబంధనలలో పనిచేసింది. ఎవరికోసం వాటిని మార్చుకోలేదు. తనని ఎవరు చులకన చేసినా మౌనంగా సహించలేదు. ఎంతటి గొప్ప పేరున్న కళాకారుడైనా లెక్కచేయలేదు. దాంతో సినీ పరిశ్రమ అంతా లత గురించి ఒక ఇమేజీ ఏర్పడిపోయింది. అమె దగ్గరకు పాటలు పాడించుకోవాలని వచ్చేవారు ఆమె గురించి తెలుసుకునే వచ్చేవారు. ఆమె ప్రవర్తనకు సిద్ధమయ్యే వచ్చేవారు.

కెరీర్ ఆరంభంలోనే లత, ద్వంద్వార్థాల పాటలు, బూతుమాటలుండే పాటలు, రెచ్చగొట్టే నీచమైన పాటలు పాడనని స్పష్టం చేసింది. పాట పాడే అవకాశం వదులుకునేది కానీ, రాజీపడి అలాంటి పాటలు పాడలేదు. ఇది కూడా పరిశ్రమలో లత పట్ల గౌరవభావన కలిగించింది. ఖేమ్‌చంద్ ప్రకాశ్, గులామ్ హైదర్, నౌషాద్‍లు ఆమె ఈ నిర్ణయాన్ని మెచ్చారు. ఆమెను ఆదరించారు.

సినీ రంగంలో వ్యాపార విజయాన్ని మించిన దైవం మరొకటి లేదు. ప్రతి శుక్రవారం కళాకారుల అదృష్టానికి పరీక్షలాంటిది అంటారు. ప్రతి శుక్రవారం కొత్త హీరో పుట్టుకొస్తాడు. పాత హీరోలు జీరోలవుతారనీ అంటారు. అలాంటి విజయాన్ని ఆరాధించే ప్రపంచంలో వ్యక్తి విజయాన్ని సాధించే వరకే అతడిని అందరూ చులకన చేస్తారు. విజయం సాధించిన తరువాత అతనికి పాదాక్రాంతమవుతారు.

‘జహాన్ తక్ మేరా సవాల్ హై, మైనే హమేషా అప్‌నీ షర్తోం పర్ ఇస్ ఇండస్ట్రీ మే కామ్ కియాహై! ముఝే షూరూ సే హీ జో సంస్కార్ మిలే  థే, ఉస్ మే ఏక్ బాత్ పహలే సే హీ తై హో చుకే థీ, కి మై జో భీ కరూంగీ, ఉస్‍కా స్వరూప్, ఔర్, సీమాయే క్యా హోగీ’

ఓ ఇంటర్య్వూలో లత అన్న మాటలివి. అంటే ఇండస్ట్రీలో లత తనకు నచ్చిన నియమ నిబంధనల ప్రకారమే పనిచేసింది. తన ప్రతి చర్య స్వరూపం, పరిధులు తెలుసుకుని మరీ పని చేసింది. అందుకే ఆరంభంలోనే తన వ్యక్తిత్వాన్ని స్పష్టం చేసింది. తనకంటూ ఓ ఇమేజీని సృష్టించుకుంది. ఆరంభంలోనే తాను అశ్లీలమైన శబ్దాల పాటలు పాడనని నిర్ణయించుకోవటం వల్లనే అత్యద్భుతమైన భావాలున్న పాటలు పాడగలిగిందని లత నమ్మకం. రాజీపడని వాళ్ళు, వాళ్ళకి కావాల్సింది సాధిస్తారు. అదే లత విషయంలో జరిగింది. ఆమె అశ్లీల పాటలు పాడననే సరికి అత్యద్భుతమైన పాటలు ఆమె ఖాతాలోకి  వచ్చి చేరాయి. అందుకే నౌషాద్ ‘లత పాడితే క్లబ్బు పాట కూడా భజనలా పవిత్రంగా తోస్తుంది’ అని అన్నాడు.

1950 వచ్చేసరికి లతతో పోటీకి గీతారాయ్ ఒకర్తి మిగిలింది. 1950 గురించి చర్చించే కన్నా ముందు ఏయే సంగీత దర్శకుల వద్ద లత ఏమేం నేర్చుకుందో గమనిస్తే, ఆమె నేర్చిన విజ్ఞానం ఆధారంగా యువ సంగీత దర్శకులు చేసిన ప్రయోగాలు గమనించవచ్చు.

(ఇంకావుంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here