భారత రత్నకి అక్షరమాల – ‘సంగీత సరస్వతి లతా మంగేష్కర్’

1
2

[కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘సంగీత సరస్వతి లతా మంగేష్కర్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ కోవెల సంతోష్‍కుమార్.]

[dropcap]ఒ[/dropcap]క విచిత్రమైన పరిస్థితి. హిందీ సినిమా సంగీతాన్ని ఆసాంతం అవపోశన పట్టి.. సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, గేయ రచయితల భావోద్వేగాలను, అనుభవాలను తానుగా అనుభూతి చెంది.. ప్రతి పాటలోని ప్రతి సంగతిని పట్టుకొని విశ్లేషించ గల సమర్థుడు ఒక మహా గాయకురాలి జీవితాన్ని అద్భుతంగా అక్షర గానం చేస్తే.. సినిమా గురించి కానీ, అందులోని పాటల గురించి కానీ, ఆయా గాయనీ గాయకుల గాత్ర వైభవం గురించి కానీ ఓనమాలు కూడా తెలియని నాలాంటి వాడు సమీక్ష చేస్తాననడం నిజంగా అన్యాయమే. ఒక పుస్తకం రాయడానికి రచయితకు ఆ విషయంపై ఎంత సాధికారత ఉండాలో.. దాన్ని సమీక్షించే వ్యక్తికి కూడా ఆ విషయంపై అంతే సాధికారత ఉండాలని నా నమ్మకం. అభిప్రాయం కూడా. అయినా సరే.. ఏదో ఉత్సాహంతో కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘సంగీత సరస్వతి లతా మంగేష్కర్’ రచనను సమీక్షించడానికి పూనుకున్నాను. ఇది సాహసమే అయినా ఏదో ఉత్సాహం అంతే.

విశ్వమంతా గర్వంగా కీర్తించే ఒక మహా వ్యక్తి గురించి రాయడానికి పూనుకోవాలంటే.. అందుకు ముందుగా కావాల్సింది ధైర్యం. ఆ వ్యక్తి గురించి మనం సాధికారికంగా రాస్తున్నామంటే.. ఆ జీవితంలోని ప్రతి మలుపు గురించీ.. ఉత్థాన పతనాల గురించి పూర్తిగా అవగాహన ఉండి తీరాలి.

హిందీ సినిమాను ప్రేమిస్తున్నామని చెప్పుకోవడం కాదు.. నిజంగా ఆత్మతో ప్రేమించేవాళ్లు.. ఆ రంగంలోని ఒక మహా మనీషి గురించి.. ఆ మనీషిలో నుంచి ఉబికివచ్చిన స్వరరాగ గంగా ప్రవాహాన్ని ఒడిసి పట్టుకొని రాస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ ‘సంగీత సరస్వతి లతా మంగేష్కర్’.

లతా మంగేష్కర్ అంటే మామూలు నేపథ్య గాయని కాదు. అందరూ సంగీతం వెంట పడితే.. సంగీతమే ఆమె వెంటపడింది. సరస్వతీ దేవి వీణ కచ్ఛపి స్వయంగా భూమ్మీద లతగా అవతరించిందేమో అన్నంతగా సమస్త స్వరాలు ఆమె గళంలో నర్తించాయి. అలాంటి లతా మంగేష్కర్ గురించి రాయాలంటే.. బయోడేటా రాస్తే సరిపోతుందా.. పది పాతిక పాటల గురించి రాస్తే సరిపోతుందా? పొగడ్తలు.. వర్ణనలు సరిపోతాయా? మురళీకృష్ణ తన ముందుమాటలోనే చెప్పినట్టు 72 ఏళ్ల సినీ జీవితం గురించి రాయాలంటే.. హిందీ సినిమా సంగీతం చరిత్రనంతా రాయడమే అవుతుంది. ముందే చెప్పినట్టు సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, సినీ గీతాల గురించి వస్తున్న ప్రతి పుస్తకం చదివిన నేపథ్యంలో ఈ గ్రంథాన్ని సాధికారికంగా రాయడానికి మురళీకృష్ణ మరింత శ్రమించారు. పాత సినిమా పత్రికల దగ్గరి నుంచి అనేక గ్రంథాలను పరిశీలించారు. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అనేక మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. స్వయంగా లతా మంగేష్కర్ స్వీయ అనుభవాలను ఆమె ఇచ్చిన పలు ఇంటర్వ్యూల నుంచి సేకరించారు. దాదాపు ఆరు నెలల మహా యజ్ఞం నుంచి 424 పేజీల మేర లతా మంగేష్కర్ విరాడ్రూపం ఆవిష్కారమైంది.

ఈ పుస్తకం చదువుతుంటే.. లతా మంగేష్కర్ గురించి మాత్రమే చదువుతున్నట్టు అనిపించదు. భారతదేశంలో హిందీ సినిమా చరిత్ర ఈ గ్రంథంలో ఆవిష్కారమవుతుంది. ముఖ్యంగా హిందీ సినిమా సంగీత చరిత్ర ఆసాంతం ఇందులో మనకు కనిపిస్తుంది. వందేళ్లకు పైగా జీవించి హిందీ సినిమాలో 72 సంవత్సరాల జ్ఞాపకాలు తొణికిసలాడుతాయి. ‘తూ జహా జహా చలేగా.. మేరా సాయా సాథ్ హోగా’ అన్న మాటతో ఈ రచనకు నాంది పడింది. నీవు ఎక్కడికైనా పోవచ్చేమో కానీ.. లతా మంగేష్కర్ పాట మాత్రం నిన్ను వదలదు అన్న తొలి పలుకు అక్షర సత్యం. ఒక వజ్రపు తునక లతా మంగేష్కర్. ఒక సాధారణ కుటుంబంలో మహిళగా బాధ్యతలు మోయాల్సిన పరిస్థితిలో తనకు తెలిసిన పాటతోనే ప్రస్థానం ప్రారంభించి.. ఆమె పాట లేని ప్రపంచాన్ని ఊహించుకోవడమే సాధ్యం కాని దశకు ఎదిగిన లత గురించిన ఎన్‌సైక్లోపీడియా ఇది. దీన్ని రివ్యూ చేయాలంటే ప్రతి పేజీని స్పృశించాల్సిందే. ఏ ఒక్క పేజీని వదిలేసినా అది అసమగ్రమే అవుతుందేమో అని అనిపిస్తుంది. ముందే చెప్పినట్టు ఇది కేవలం లత జీవిత చరిత్ర మాత్రమే కాదు. ఎందుకంటే.. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో రెండు దేశాలకు వలసలు పెద్ద ఎత్తున సాగిపోయిన నేపథ్యంలో హిందీ సినిమా పరిస్థితి ఎలా ఉన్నదో మురళీకృష్ణగారు చక్కగా వివరించారు. భారతీయ సినిమా చీలిపోవడం.. పాకిస్థానీ సినిమా ఆవిర్భవించడం, నూర్జహాన్, జియాసర్హది, గులాం మహమ్మద్, సాదత్ హాసన్ వంటి వారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవడం, గుల్జార్, గోవింద్ నిహలానీ, బీఆర్ చోప్రా, యశ్ చోప్రా వంటి వారు భారత్‌కు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో లత తొలి అడుగులు సినీ ప్రపంచంలో ఎలా పడ్డాయో వివరించారు. లత స్వరం పీలగా ఉన్నది.. సినిమాల్లో పనికిరాదు అన్న చోటే.. అద్భుతాలు సృష్టించిన ఆమె స్వరప్రయాణం గురించి అణువణువూ చక్కగా కూర్చుకొంటూ వెళ్లారు.

‘సినీ పరిశ్రమ ఎలాంటిదంటే వెయ్యి విజయాలైనా ఒక్క పరాజయంతో ముద్ర వేసి పక్కకు నెట్టేస్తారు. మళ్లీ నిలదొక్కుకోవాలంటే ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. దీనికి తోడు అవకాశం లభించాలంటే కేవలం ప్రతిభ కాక ఇంకా అనేక అంశాలు ప్రాధాన్యం వహిస్తాయి.. ఇలాంటి బొంబాయి సినీ ప్రపంచంలో లతా మంగేష్కర్ 1945లో పదహారేళ్ల వయసులో అడుగుపెట్టింది. ఆమె తండ్రి స్నేహితుడు మాస్టర్ వినాయక్ నాటక సంస్థ బొంబాయికి మారడంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న లత కూడా బొంబాయి రావాల్సి వచ్చింది.. 1946లో ఆప్ కీ సేవా మే అనే సినిమాలో పా లాగూ కర్ జోరీ అనే పాటతో హిందీ సినిమాలో అడుగు పెట్టింది.. మాస్టర్ వినాయక్ మరణించడంతో లత పరిస్థితి సంకటంలో పడింది. జీవితం సాగించేందుకు ఏ ఆధారం లేదు. పైగా లతకు పాట తప్ప మరొకటి తెలియదు. రాదు. సన్నిహితులు అన్నవారు లేని పరిస్థితి.. అవకాశం లభిస్తే మింగేసే మొసళ్లు, ముక్కలుగా చీల్చే సొరచేపలు, కన్నుమూసి తెరిచేలోగా మాయచేసి ముంచేసే సుడిగుండాలు..’ (పేజీ 14, 15). అప్పటి హిందీ సినిమా పరిస్థితిని ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పగలరు? వాస్తవానికి ఇప్పటి సినిమా పరిశ్రమ.. అంటే కేవలం హిందీ సినిమాయే కాదు.. భారతీయ సినిమా రంగం ఇంతకంటే ఘోరంగా, దారుణంగా మారిపోయింది. తప్పటడుగులు, సందేహాలు, సంక్లిష్టతలు, సంఘర్షణల నడుమ ప్రారంభమైన లత గీత ప్రస్థానం మహల్ సినిమాలో ఆయేగా ఆనేవాలా అన్న గీతంతో ఏ విధంగా కొత్త పుంతలు తొక్కిందో.. యావత్ సినీ సంగీత ప్రపంచాన్ని ఏవిధంగా ఉర్రూతలూగించిందో.. ఆ ఒక్క పాట సినీ నేపథ్య గాయనీ గాయకులకు ఏవిధమైన పేరు తీసుకొచ్చిందో అద్భుతంగా వివరించారు మురళి.

1929లో అందమైన బొమ్మలాంటి పాపగా జన్మించడం దగ్గరి నుంచి.. హిందీ సినీ ప్రపంచంలో తిరుగులేని మహారాణిలా లతా మంగేష్కర్ ఎదిగిన అన్ని దశలలో ఏ ఒక్క దశనూ విస్మృతికి గురిచేయకుండా పడుగు పేకలాగా కూర్చడం రచయితలో ఉన్న గొప్ప శైలీ నిర్మాణం, ధారణకు నిదర్శనం. లతా మంగేష్కర్ జీవితాన్ని దర్శింపజేస్తూనే.. ఆమె తానుగా చెప్పిన అనేక విషయాలను సందర్భం వచ్చిన ప్రతి చోటా ప్రస్తావిస్తూ వచ్చారు. ‘నేను చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లను. మేము ఇంట్లో పిల్లలందరం అల్లరి చేస్తే మా నాన్నగారు అందరినీ కోపంగా పిలిచేవారు. ఆయన పిలుపు వినగానే మా గుండెలు జారిపోయేవి. ఆయన మా అందరినీ వరుసగా నిలబడమనేవారు. అందరం నిలబడిన తరువాత నేను ఎందుకు పిలిచానో తెలుసుకదా.. అని అడిగేవారు. తెలుసు అని సమాధానం ఇచ్చేసే వాళ్లం. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకండి.. అని పంపేసేవారు. ఆయన చూపు మమ్మల్ని మరో తప్పు చేయనిచ్చేది కాదు.’ లత తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఉదాత్తమైన ఉన్నతమైన వ్యక్తిత్వం గురించి ఇంతకంటే తార్కాణం మరొకటి ఉండదు. తన తండ్రి తనకు తెలియజెప్పిన విలువలు.. అవి ఆమె భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాయో.. ఈ మోనోగ్రాఫ్ చాలా చక్కగా వివరించింది. ‘బాల్యం నుంచి నాకు నేను పండిత దీనానాథ్ మంగేష్కర్ కూతురిని కావడం వల్ల ఇతరుల కన్నా భిన్నం అన్న భావన కలిగింది’ అని లత పేర్కొనడమే.. తన తండ్రి పట్ల ఆమెకున్న గౌరవం.. ఆమెపై ఆమెకున్న ధిషణను తెలియజేస్తున్నది.

లతా మంగేష్కర్ సినీ సంగీత ప్రస్థానాన్ని గురించి ఈ మోనోగ్రాఫ్ ప్రతి అణువూ ప్రస్తావించింది. లతకు తొలి అవకాశం ఇచ్చిన గులాం హైదర్ దగ్గరి నుంచి ఆమెతో పాటలు పాడించుకొన్న వందలాది సంగీత దర్శకుల గురించి.. వారితో లతకు ఉన్న అనుభవాల గురించి మురళీకృష్ణ గారు చాలా వివరించారు. తొలి తరం గాయని నూర్జహాన్‌తో లతకు ఉన్న అనుంబంధాన్ని గురించి వివరంగా ప్రస్తావించారు. తండ్రి చనిపోయిన తరువాత లత కుటుంబ బాధ్యతలు తీసుకొని.. కొల్హాపూర్ నుంచి బొంబాయికి వచ్చిన తరువాత ఎదుర్కొన్న సమస్యల గురించి రచయిత లోతుగా చర్చించారు. లత గురించి తెలుసుకోవాలంటే లత పాట గురించి తెలుసుకోవాలంటే, లత పాటను అర్థం చేసుకోవాలంటే.. లత గురువుల గురించి తెలుసుకోవాలంటారు రచయిత. తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్, అమాన్ అలీఖాన్ తదితరుల దగ్గర ఏమేమి నేర్చుకొన్నదో.. తన గాన సంవిధానాన్ని ఎలా తీర్చిదిద్దుకొన్నదో వివరించారు. ‘మాస్టర్ వినాయక్ మరణం తరువాత లత కొన్నాళ్లు పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ శిష్యుడు పండిత తులసీ శర్మ వద్ద శిష్యరికం చేసింది. ఆమెకు గులాం హైదర్ నుంచి అనిల్ బిశ్వాస్, శంకర్ జై కిషన్, ఎస్ డీ బర్మన్, వరకు ఎందరో పాటలు పాడటం నేర్పించారు. హుస్న్‌లాల్ భగత్ రామ్ సంగీత జంటలో ఒకరైన హుస్న్‌లాల్ లతను ప్రత్యేకంగా పాట పాడే విధానాన్ని నేర్పించారు’ అని వివరించారు.

ఈ గ్రంథం హిందీ సినిమా సంగీత చరిత్రను ప్రతిఫలింపచేస్తున్నదని ఎందుకు చెప్పానంటే అనేక ఉదాహరణలను మురళీకృష్ణ ఇందులో పొందుపరిచారు. అలాంటిదే ఒక ఉదాహరణ ఇది. ‘ఒకసారి స్టూడియో వెనుక ఉన్న అడవిలో రాత్రిపాట చిత్రీకరణ జరుగుతోంది. ఉమా శశి అనే నటి ఒక పూల చెట్టు దగ్గర నిలబడి పాట పాడాలి. ఇది ట్రాలీ షాట్ కావటంతో వాయిద్యకారులు కెమెరా దృష్టిలో పడకుండా స్థలం దొరకడం కష్టం అయింది. సంగీత దర్శకుడు ఆర్సీ బోరాల్ ఎంతో వెతకగా దగ్గరలో నీరు నిండిన గుంటలో వాయిద్యకారులు ఉండేందుకు స్థలం దొరికింది. అయితే ఫ్లూటు, క్లారినెట్ వాయించేవారికి మోకాలి లోతు నీళ్లలో నుంచుని వాయించటం కష్టం కాలేదు. కానీ తబలా, హార్మోనియం వాయించే వారికి వాయిద్యాలను నడుముకు కట్టుకొని నీటి మట్టంపై ఉంచుతూ వాయించడం ఎంతో కష్టం. అయినా సరే అది తప్ప వేరే మార్గం లేకపోవడంతో పాట చిత్రీకరణ ఆరంభించారు. అంతా సవ్యంగా సాగిపోతున్నది. చివరలో నాయిక పాట ముగింపుగా లయను మంద్రం చేసి పాడాలి. అందుకు తగ్గట్టుగా వాయించే బదులు తబలా వాయించే అలీ హుస్సేన్ లయ వేగాన్ని పెంచుతూ పోయాడు. ఆర్సీ బోరాల్ సూచనలను అతను పట్టించుకోలేదున. పాట చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు సంతృప్తి చెందాడు. కానీ బోరాల్ కోపంగా అలీ హుస్సేన్ చివరలో లయ పెంచినందుకు అతనిపై విరుచుకుపడ్డాడు. అంతా అయిన తరువాత అలీ హుస్సేన్ అసలు విషయం చెప్పేసరికి నవ్వీ నవ్వీ అందరికీ కన్నీళ్లొచ్చాయి. తబలా వాయిస్తున్న సమయంలో అతని ధోవతి లోకి ఒక చేప దూరింది. తబలా ఆపితే చిత్రీకరణ అంతా వ్యర్థమై మళ్లీ మొదలు పెట్టాలి కాబట్టి అలాగే కొనసాగించాడు’.. ఆనాటి సినిమా కష్టాలకు ఇదీ ఉదాహరణ.

మహా నటుడు రాజ్ కపూర్ అహం, గొప్ప సంగీత దర్శకుడు ఎస్ డీ బర్మన్‌తో వివాదం, మహమ్మద్ రఫీతో సమస్యలు, కొద్ది రోజుల పాటు ఆయనతో కలిసి యుగళ గీతాలు పాడకపోవటం.. శంకర్ జై కిషన్‌లతో ప్రయాణం.. వంటి అనేక సన్నివేశాలను మురళీ కృష్ణ ఈ రచనలో వివరిస్తూ వెళ్లారు.

లతా మంగేష్కర్ పాట వెనుక ఆమెకున్న స్వర జ్ఞానాన్ని, రాగ లక్షణాన్ని కూడా మురళిగారు అద్భుతంగా వివరించారు. ‘లత తొలి హిట్ పాటగా ‘చందా జారే జారే’ పాటను పరిశీలిస్తే ఈ పాటలో లత సంపూర్ణ లయజ్ఞానం, స్వరజ్ఞానం ప్రదర్శించటమే కాదు.. ఎక్కడ ఏ అలంకారం వేయాలో తెలిసి ఉండటం ప్రదర్శిస్తుంది. ఆలాపన తరువాత పాటను ఆరంభిస్తూనే.. ‘చందా’ దగ్గర ‘ఖట్కా’ అలంకారం వేస్తుంది. ఖట్కా అంటే ప్రధాన స్వరాన్ని స్పష్టంగా ఆలపిస్తూ.. దాని తరువాత వచ్చే రెండు మూడు స్వరాలను ఒకేసారి పలికేయటం.. అంటే ప్రధాన స్వరంతో ఇతర స్వరాలను గుదిగుచ్చి గొలుసులుగా చేయటం అన్న మాట. సంగీతం తెలియని వారు కూడా లత ‘చం’ దగ్గర నుంచి ‘దా’ దగ్గరకు వచ్చేందుకు రాగం తీయటాన్ని ఆనందంతో అనుభవిస్తారు’ అని పేర్కొనటం.. లత స్వర జ్ఞానాన్ని, లయ జ్ఞానాన్ని ఈ గ్రంథ రచయిత కూడా ఏ విధంగా ఒడిసి పట్టుకున్నాడో అర్థమవుతుంది. ఈ పాటను రచయిత విశ్లేషించిన తీరు.. ప్రతి పదాన్ని.. ప్రతి సంగతిని గురించి వివరించిన తీరు.. హిందీ సినీ సంగీతంపై ఆయనకు ఉన్న పట్టును విస్పష్టంగా ప్రకటిస్తున్నది.

సంగీత దర్శకులు లతా మంగేష్కర్ కోసం ఎంత ఆరాట పడేవారో.. ఎంత తపన పడేవారో.. ఆమె లేకపోతే సినిమా తీయడమే వృథా అన్న పరిస్థితులు ఎలా తలెత్తాయో.. ఈ గ్రంథంలో పేర్కొన్న ఒక్కో సన్నివేశం చదువుతుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ తప్పక ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే.. లత కోసం సంగీత దర్శకత్వాన్నే వదులుకున్న సందర్భమిది. ‘అనార్కలి సినిమా నిర్మాత శశిధర్ ముఖర్జీ లతా మంగేష్కర్ స్వరం బలహీనంగా ఉన్నదని తిరస్కరించిన వాడీయన. గీతాదత్ స్వరానికి ప్రాధాన్యం ఇచ్చిన వాడు. ఆయన అనార్కలి నిర్మిస్తూ.. సీ. రామచంద్రను సంగీత దర్శకత్వం వహించాలని కోరాడు. కానీ.. రామచంద్ర అందుకు ఒక షరతు పెట్టాడు. పాటలన్నీ లత పాడాలని ఆయన షరతు. శశిధర్ ముఖర్జీ అందుకు ఒప్పుకోలేదు. గీతాదత్ పాడాలని పట్టుబట్టాడు. దాంతో రామచంద్ర సంగీత దర్శకత్వ అవకాశాన్ని వదులుకొన్నాడు.’ రామచంద్ర తరువాత ఇద్దరు దర్శకులను మార్చినా.. రకరకాల కారణాల వల్ల వారూ తప్పుకోవడంతో చివరకు రామచంద్రే దిక్కయ్యాడు. దీంతో ఆయన షరతులకు ఒప్పుకొని సంగీత బాధ్యతలు అతడికి అప్పగించారు. ఆ సినిమాలో 3 పాటలు గీతా దత్ పాడగా.. మిగతా 9 పాటలు లత పాడింది. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. లత అంటే ఇష్టం ఉన్నా.. లేకపోయినా.. ఆమెతో వివాదాలు ఉన్నప్పటికీ.. సినిమా నడవాలంటే ఆమెతో పాడించడం తప్పనిసరి అయిన పరిస్థితులు కల్పించిన మహా గాయని ఆమె. ఆమెతో ఎన్ని వివాదాలున్నా.. గట్టిగా ఏదైనా మాట్లాడినా సరే.. పట్టించుకోకుండా.. ఆమెతో పాటలు పాడించుకొన్న సందర్బాలు కూడా ఉన్నాయని రచయిత పేర్కొన్నారు. అంటే.. హిందీ సినిమా సంగీతంపై లత ముద్ర అంత బలంగా పడిందన్నమాట. బహుశా ఏ గాయనీ గాయకులకు ప్రపంచంలోనే ఈ స్థాయి గౌరవం దక్కలేదేమో.

మనం తెలుగు వాళ్లం కాబట్టి ఇవాళ్టి తెలుగు సినిమా గురించి ఒకటి రెండు మాటలు చెప్పాలని ఉన్నది. తెలుగు సినిమా పాటలకు ఇప్పుడు నటీనటులు పెదాలు కదిపించడం కూడా దాదాపుగా మానేశారు. క్లోజప్ షాట్ ఉంటే తప్ప ఏదో ఒక రకంగా పెదాలు తిప్పుతున్నారు. విచిత్రమేమిటంటే.. పాడేవాళ్ల స్వరానికి.. నటీనటుల స్వరానికి నప్పకపోవడం వల్ల కృతకత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మధ్య ఒక సినిమాలో ఒక హీరో విషాద పాటను పాడుతుంటాడు. సాధారణ సమయంలో అతడి స్వరం చాలా గంభీరంగా ఉంటుంది. అతడికి పాడే గాయకుడి స్వరం పీలగా ఉండటంతో.. కృత్రిమత్వం ఆ సన్నివేశాన్ని దెబ్బ తీసింది. గతంలో ఘంటసాల అయినా, బాల సుబ్రహ్మణ్యం అయినా.. మరో గాయనీ గాయకులైనా.. వారు పాడుతున్నారంటే.. నటీ నటుల స్వరాలకు ప్రాణం పోసినట్టుండేది. ఇప్పుడు పాటకు, గాయకుడికి, పాత్రధారులకు ఎలాంటి లంకె లేకుండా పోయింది. ఇదే విషయమై లత మాటలను రచయిత ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ‘మామూలు పాటలు పాడే సమయంలో సందర్భాన్ని బట్టి నటి రూపాన్ని నటనను, పదాలు పలికే విధానాన్ని దృష్టిలో ఉంచుకొని పాడాల్సి ఉంటుంది. కానీ.. ఆత్మలు పాడే పాటలు, నేపథ్యంలో వచ్చే పాటలు, లేక లాంగ్ షాట్‌లో నటి రూపం అస్పష్టంగా కనిపించే పాటలు పాడటం సులభం. ఆ పాటలు నేను నాకోసం పాడుతున్నట్టు పాడుకొంటాను. ఎంతో హాయిగా పాడుతాను’ అని లత అన్నారు. తాను పాడిన పాట ఏ నటిపై చిత్రితమవుతుందో దృష్టిలో ఉంచుకొని ఆ నటి స్వరానికి నప్పేలా పాడటం వల్ల ఆ పాట వింటున్నప్పుడు ఆ నటే పాడుతున్న అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు. అప్పుడు సినిమా సహజత్వానికి భంగం వాటిల్లదు. నాటి సైరాబాను నుంచి నిన్న మొన్నటి ఐశ్వర్యారాయ్ వరకు లత స్వరాన్నిచ్చిన ఏ పాట కూడా ఆ నటీమణుల స్వరాలకు దూరంగా పాడినట్టు ఎంత మాత్రం కనిపించదు. ఆమె పాటలు ఆయా తారల ఇమేజిని మరింత పెంచాయి.

ఈ రచనలోని మరి కొన్ని అంశాలలో మరొక అంశం.. గాయనీ గాయకుల గాన సంవిధానం గురించి కస్తూరి మురళీకృష్ణ అద్భుతంగా వివరించారు. మన్నాడే ఒక విషాద గీతాన్ని పాడితే.. ఆ పాట విన్నప్పుడు ఆ విషాద భావనను ఎలా అనుభూతి చెందుతామో.. అలాగే రఫీ ఏడుపు పాటలు పాడుతున్నప్పుడు ఏ విధంగా పాడుతారో.. ఇతర గాయకులు ఎలా పాడతారో వివరించారు. లత సంతోషకరమైన పాట పాడినా, అల్లరి పాట పాడినా, విషాద గీతం పాడినా.. పాడే విధానంలోనే అనుభూతిని కలిగించడం ఒక గొప్ప నైపుణ్యమని మురళీకృష్ణ వివరించిన తీరు అద్భుతం. లత, మహమ్మద్ రఫీలు యుగళ గీతాలు పాడినప్పుడు వారిద్దరి మధ్య తారతమ్యాన్ని కూడా రచయిత ప్రస్తావించారు. ఇతర గాయనిలతో పాడుతున్నప్పుడు రఫీ వ్యవహరించే తీరు.. లత దగ్గర మాత్రం ఒద్దికగా మారడాన్ని వివరించారు. వారిద్దరు యుగళగీతాలు పాడటంలో ఒకరితో ఒకరు పోటీ పడటాన్ని చక్కగా పేర్కొన్నారు. కాలంతో పాటు తనను తాను మార్చుకొంటూ.. పాడే తీరును మార్చుకొంటూ ముందుకు సాగిన లత ప్రస్థానం అప్రతిహతం. ‘అతి సున్నితంగా తన గాన శైలిని మార్చింది. 1965 తరువాత లత పాటలను జాగ్రత్తగా గమనిస్తే ఆమె పాటల్లో అంతకు ముందు మృదువుగా, పాటలో అంతర్లీనం (implicit) గా భావ ప్రకటన చేసిన లత.. 1965 తరువాతి పాటల్లో కొద్దిగా explicit అయింది. అంతకు ముందు లేని హొయలు, నక్రాలు, భావాన్ని వ్యక్తపరిచే తీరులో మార్పు తెలుస్తుంది. అలాగని ఆమె పాటలలోని భావంతో పదాల నాణ్యతతో రాజీ పడలేదు. గతానికి భిన్నంగా పాటలోని శృంగార భావాన్ని మరింత ప్రస్ఫుటం చేస్తూ అతి సున్నితంగా శృంగార భావనలను ఉద్దీపితం చేస్తూ కాస్త చిలిపిగా, కాస్త చలాకీగా పాడటం ప్రారంభించింది’. ఏ రంగంలోనైనా ఎప్పటికప్పుడు కొత్త నీరును అందిపుచ్చుకొంటూ ముందుకు సాగిపోతేనే.. కెరీర్ సుదీర్ఘ కాలం సాగుతుంది. సినిమా రంగమూ అందుకు మినహాయింపేమీ కాదు. లత కూడా తనను తాను పరివర్తింపజేసుకొంటూ ముందుకు సాగిపోయింది. 90వ దశకంలో సైతం లత పాడిన పాటలు సూపర్ హిట్ కావడం ఆమె స్వరానికి వయసు లేనే లేదని నిరూపించింది. లేకిన్, మైనే ప్యార్ కియా, చాంద్‌నీ, మాచీస్, దిల్ తో పాగల్ హై, దిల్ సే, మొహబ్బతే వంటి అనేక సినిమాల్లో ఆమె పాడిన పాటలు ఎందరో యువ గాయనిల స్వరాల కంటే అద్భుతంగా హిట్ అయ్యాయి. 86 ఏండ్ల వయసులో 2015లో జీనా క్యాహై జానా మైనే పాటతో తన హిందీ సినీ గాన ప్రస్థానానికి పుల్ స్టాప్ పెట్టిన లత 2019లో సైన్యం కోసం నీరాజనాలు అర్పిస్తూ.. సౌగంధ్ ముఝే ఇస్ మిట్టీకీ అనే పాట పాడింది. ఈ పాట పాడేనాటికి ఆమె వయస్సు 90 సంవత్సరాలు. ఇక్కడే ఆమె జీవితాన్ని రచయిత వర్ణించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆమె పాడిన మొదటి పాట భగవంతుడి పాదార్చన కాగా.. చివరి పాట దేశభక్తి గీతం కావడం.. ఈ రెంటి నడుమ అంతులేని అసంఖ్యాకమైన భావనల మహా సముద్రం అని లత జీవితాన్ని రచయిత ఆవిష్కరించారు. ఈ రచయిత విపరీతమైన సంగీత అభిమాని, అంతకుమించి అద్భుతమైన సృజనాత్మక రచయిత, పైగా లత పాటలంటే అణువణువూ ఆనందంతో పొంగిపోయే మనసున్నవాడు. ఇలాంటి రచయిత.. అలాంటి భారత రత్నానికి సమర్పించుకొన్న పూలమాల ఎలా ఉంటుందో ఏమని వర్ణించగలం.. హిందీ సినిమా గురించి.. హిందీ సినిమా సంగీతం గురించి హిందీ సినిమా పాటల గురించిన చరిత్రను తెలుసుకోవాల్సిన వారు ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే. ఎందుకంటే.. ఇంతకంటే సమగ్రంగా గతంలో మరే గ్రంథమూ బహుశా రాలేదు కాబట్టి.

***

సంగీత సరస్వతి లతా మంగేష్కర్
రచన: కస్తూరి మురళీకృష్ణ
పుటలు: 424
వెల: ₹ 300.00
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643. 9849992890
ఆన్‍లైన్‌లో తెప్పించుకునేందుకు:
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1298&BrandId=82&Name=Lata+Mangeshkar

https://www.amazon.in/Lata-Mangeshkar-Kasturi-Muralikrishna/dp/B0C6Y8QW1Z

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here