సంగీత సురధార-2

0
2

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం2 సంగీతం మోక్షదాయకం

[dropcap]”జం[/dropcap]తూనాం నరజన్మ దుర్లభం” అని పెద్దలు అన్నారు. జంతు శబ్దానికి మానవుడు కూడా అర్థమే. జననం కలిగినది ఏది ఉన్నదో అది అంతా జంతు శబ్ద వాచ్యమే. కావున మానవుడు కూడా జంతువు అనటంలో అనౌచిత్యం ఏమీ లేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము అంతా జంతు శబ్ద వాచ్యమే. మానవుని జన్మ లభించటమే కష్టం అన్నారు. ఎన్ని రకాల జన్మలో ఎత్తగా ఎత్తగా తుదకు మానవ జన్మ ప్రాప్తిస్తుంది. అటువంటిది మానవ జన్మను ఉత్తమమైనదిగా పెద్దలు పరిగణించారు.

అసలు భూత సృష్టి ప్రారంభం అయి ఎంత కాలం అయిందో మనకు తెలియదు.

‘అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాంతాని’ అని గీతా వాక్యము.

పరమాత్మ గర్భం అనే గృహం నుంచి ఈ జీవాత్మలు బయలుదేరినవి. (మానవ) సుకృత దుష్కృత రూపాలయిన అనేక కర్మలు చేసుకుంటూ వాటి వాటి ఫలితం అనుభవిస్తూ ఇనుప సంకెలలు, బంగారు సంకెలలు తగిలించుకొంటూ సుఖదుఃఖాలు అనుభవిస్తూ దుఃఖాలను సుఖాలను సుఖాలనుకొంటూ అనేక జన్మ పరంపరలలో పడి కొట్టుకుంటున్నారు జీవులంతా కూడా. వీరికి విశ్రాంతి జీవులకు జన్మరాహిత్యం కల్గడమే. అదియే మోక్షము. మోక్షము గానిది బంధం. బంధం వీడిపోవటమే మోక్షము. మోక్షానికి అనేక పర్యాయ పదాలు వున్నాయి. నిర్వాణం, నిశ్రేయసము, శ్రేయస్సు, అమృతం, ముక్తి, అపవర్గం, కైవల్యం. వ్యుత్పత్తిలో ప్రతి దానికి అర్థ భేదం వున్నా ఫలితంలో అన్నిటికి అర్థమొక్కటే.

ఈ ప్రపంచంలో దేని గురించి తెలుసుకోవాలన్నా 4 సాధనాలున్నాయి. అవి ప్రత్యక్షము, అనుమానం, ఉపమానం, శబ్దం.

ప్రత్యక్షము: తెలుసుకోగదిన వస్తువు, దానిని గ్రహించే ఇంద్రియము. ఇదే విధంగా శ్రవణాదులు.

అనుమానం: కనులకు కనబడని దాని ఉనికి.

ఉపమానం: పోలిక బట్టి తెలుసుకోవటం.

శబ్ద ప్రమాణం: వేద శబ్ద రూపమయిన ప్రమాణం. అది అలౌకికం.

మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ – అన్నిటిలో భక్తి గొప్పది. అనేక రూపాలలో ఉంటుంది. నవ విధ, అష్ట విధ అని కొందరు చెబుతారు.

‘పూజ్యేష్వను రాగః భక్తిః’

‘తైలధారా వద విచ్ఛిన్న స్మృతి సంతతః భక్తిః’ అని సూక్తి.

‘కలౌస్మరణాన్ముక్తిః’

కలియుగంలో స్మరించుట చేతనే ముక్తి అని కూడా అర్థం. ‘మోక్ష సాధనకు భక్తే’ ఏకైక మార్గం.

లలిత కళలలో సంగీతం చాలా శ్రేష్ఠమయినది.

‘గీతేన ప్రీయతే దేవః సర్వజ్ఞః పార్వతీ పతిః

.. తస్య గీతస్య మహత్మ్యం కే ప్రశంసితు మీశతె’ అని సంగీతం యొక్క ప్రాధాన్యం చెప్పారు.

గాన ప్రధాన లక్ష్యం జనరంజనమే. శ్రేయస్సే లక్ష్యం. అంటే ముక్తి. సంగీతం మోక్ష కారణమే కాక చతుర్విద పురుషార్థాలను కూడా ఇస్తుంది.

“ఏకైక ఫల దాస్సర్వేదాన యజ్ఞ జపాదయః

ఏకం సంగీతం విజ్ఞానం చతుర్వర్గ ఫల ప్రదం” అన్నారు.

సంగీతంలో వీణకే ప్రాధాన్యం.

“ధర్మార్థ కామ మోక్షాణాం ఇయమేవ..

సాధనం అశ్వమేధ ప్రకరణే వీణోక్తాధర్మ సాధనం

కామయన్తే హి గాయంతం స్త్రియ ఇత్యదితం

శ్రుతౌ గానస్య కామ హేతుత్వం”

‘ఉత్తరోత్తరం మునీనాం ప్రామాణ్యం’ అని సంగీత విషయంలో నాదోపాసనతో రామభక్తిని జోడించి దాన్ని ఒక యోగం క్రింద సాధించుకొన్న త్యాగయ్య ధన్యజీవి.

ద్రాక్షపాక, కదళీపాక, నారికేళ పాకాలున్నవి. ద్రాక్షపాకస్య కధితో బహిరంతస్ఫురద్రసః – అన్నది కవిత్వానికే కాదు, సంగీతానికి కూడా అన్వయించవచ్చు.

త్యాగయ్య దృష్టిలో సంగీత జ్ఞానమే ప్రధాన వస్తువు అని చెప్పారు.

మోక్ష సాధన సామాగ్రిలో స్మరణపూర్వకమైన గానకళోపాసన చేస్తూ మనస్సుకు నిరంజనత్వం సాధించుకుంటే దేహావసాన కాలంలో ఆ నిరంజనత్వం నిలుపుకున్నట్లయితే, ఆ గానకళోపాసకునికి తప్పక మోక్షం సిద్ధిస్తుంది.

అధ్యాయం3 కర్నాటక సంగీతం వర్తమాన పరిస్థితి: ఆధునిక కర్నాటక సంగీత స్థితిగతులు

కర్నాటక సంగీతానికి మరోపేరు శాస్త్రీయ సంగీతం. ఈ పేరు విద్యారణ్య స్వామి ఆనాడు దక్షిణ దేశానికి ఇచ్చినది. కర్నాటక సంగీతం ఉమ్మడి సొత్తు. దక్షిణ భారత రాష్ట్రాల ఉమ్మడి వారసత్వం. కర్నాటక శాస్త్రీయ సంగీతం మీద అధికారం, బాధ్యత – కర్నాటక, ఆంధ్ర, తమిళ, తెలంగాణ, కేరళ, కొంకిణి, కొంత ఒరిస్సా రాష్ట్ర ప్రజలందరికీ వుంది.

‘కర్నాటక’ అను పదం ఆవిర్భావన:

ఈ పదం కన్నడం వారిది. సంగీత సంపద తమిళ వాళ్ళది. తమిళనాడులో తంజావూరు పాలనలో వుండిన తెలుగు, తమిళ విద్వాంసులు అభివృద్ధి చేశారు. ఎక్కువగా Tamil Musicians యొక్క నైపుణ్యమే. సాహిత్యం (భాష) తెలుగు వారిది. రసాస్వాదన కేరళ ప్రజలది.

మొట్టమొదట ఆంధ్రదేశంలో శాస్త్రీయ సంగీతం వినేవారు, పాడేవారు తక్కువ. రాను రాను ఆ రెండూ కూడా తగుమాత్రంగా పెరిగిందని చెప్పవచ్చు.

1. బాణీ:

ఈనాటీ విద్వాంసుల, పాడేవారు, వినేవారు సంఖ్య పెరగడం; తంజావూరు బాణిని చక్కగా ఆకళింపు చేసుకోవడం జరుగుతున్నాయి. పూర్వం బాణీలు వీటికి భిన్నంగా వుండి అందులో కొన్ని బాణీలు పేలవంగా వెలవెలబోతు వుండేవి. ఈనాడు అందరిది ఒకే రకమైన శాస్త్రీయ కర్నాటక బాణీయే. సరియైన కర్నాటక బాణీ ఆంధ్ర ప్రదేశ్‍లో నెలకొల్పడానికి విద్వాంసులు, సభలు, గురువులు, సంగీత కళాశాలలు, రేడియో, మొదలైనవి (సాంకేతికమైనవి – TV, Gramophone, Records.. etc), సంస్థానాలు, సంస్థలు వారు చాలా దోహదం చేస్తున్నారు.

2. ఆదిగురువులు:

ఆంద్ర నుంచి తమిళం వెళ్ళి అక్కడ సంగీతాన్ని అభ్యసించి, తిరిగి మరల ఆంధ్రలో సంగీతాన్ని నలుమూలలా వ్యాప్తి చేశారు. వారిలో సుసర్ల దక్షిణామూర్తి గారు, రాజనాల వెంకటప్పయ్య గారు, దుడ్దు సీతారామయ్య గారు, బాపట్ల కాంతయ్య గారు, కలిగొట్ల కామరాజు గారు, బలిజేపల్లి సీతారామయ్య గారు, పిరాట్ల శంకరశాస్త్రి గారు ముఖ్యులు. వీరు గాక తెలుగు సీమలోనే వుండి సంగీత విద్యా బోధన చేసిన వారిలో హరి నాగభూషణం గారు, మునుగంటి వేంకటరావు పంతులు గారు, వారి పూర్వులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, తాటిపాక రామరాజు గారు, మంగళంపల్లి పట్టాభిరామయ్య తదితరులు.

3. సంస్థానాలు:

బొబ్బిలి, విజయనగరం, టెక్కలి, పిఠాపురం, వెంకటగిరి, ఉయ్యూరు, నూజివీడు సంస్థానాలలో తక్కిన కళలతో పాటు సంగీత సాహిత్యాలను పోషించేవారు. కాకినాడలో సరస్వతీ గాన సభ సభాదిపతి కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి.

4. గానసభలు:

Tamil Musicians అందరూ కాకినాడ సరస్వతీ గాన సభలో పాడినవారే. ఆ సభలో పాడిన వారికే తమిళ సభలో chance వుండేది. Viaz దుర్గారావు గారి గాన సభలు కూడా మంచి స్థాయి కలిగి సంగీతానికి దోహదం చేశాయి.

5. పూర్వం:

తంజావూరు ఆస్థానంలో పలుపులేటి రంగాజమ్మ గారి సంతతి, త్యాగయ్య, తాతగిరి రాజు, శ్యామశాస్త్రి, శొంఠి వేంకట రమణయ్య గారు, ఇంకా కొంతమంది అజ్ఞాత విద్వాంసులు కర్నాటక సంగీతాన్ని అభివృద్ధి చేశారు. శాస్త్రీయ సంగీతాకాశంలో ధ్రువతారలుగా శాశ్వత స్థానాన్ని పొందిన వారిలో నారాయణ తీర్థులు, సోమనాథుడు, క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య, రామరాజభూషణుడు మొదలైనవారు.

6. రేడియో:

సంగీతం విస్తృత వ్యాప్తికి మూల కారణం ఆల్ ఇండియా రేడియో సంస్థ వారు. National Programmes, సంగీత సమ్మేళనాల ద్వారా ప్రజలలో సంగీత స్థాయిని పెంచి, వారిలో చైతన్యాన్ని కలిగిస్తోంది.

7. వినికిడి:

1947 విజయవాడ రేడియో వారు ఒక వ్యానులో ఊరూరా తిరిగి కళాకారులను ఎంచి, రేడియోలో పాడేందుకు ఆహ్వానిస్తూ ఉండేవారు. రేడియో వినికిడిలో మంచి కర్నాటక బాణీ ప్రచారం అయింది. శాస్త్రీయ సంగీతానికి ఇది చాలా ముఖ్యం. విద్వాంసులలో కల్పన, శైలి, ప్రతిభ, విద్వత్తు స్థాయి, ఎవరిది వారిదే ప్రత్యేకంగా వుంటూ, బాణీలో మాత్రం అందరికీ ఒకటిగానే వుండటం అనేది ముఖ్యం. అదే స్వచ్ఛమైన కర్నాటక బాణీ. ఈ బాణీకి అంగాలు గమకాలు, శ్రుతులు, రాగ అవగాహన, మంచి విద్వాంసుల వినికిడి, బాణీని పరిశుద్ధం చేస్తాయి. బాణీ వీటితో కూడి రాణిస్తుంది. గమకం మొదలైన అంశాలలో ఏది లోపించినా ఈ బాణీ వన్నె లోపిస్తుంది. పూర్వం రేడియో, ప్రచార సాధనాలు, ప్రయాణ సౌకర్యాలు లేని కారణం చేత ఈ బాణీలలో వైవిధ్యం, విభిన్నతలు వుండేవి. ఉత్తర హిందుస్థానీలో కూడా హిందుస్థానీ సంగీత పద్ధతిలో అనేకమైన ఘరానాలు వుండడానికి కారణం కూడా ప్రయాణ సౌకర్యాలు లేకపోవడమే. అందుచేత ప్రాంతీయ బాణీలు విభిన్నంగా ఉండేవి.

8. సంగీత కళాశాలలు:

విజయనగరం సంగీత కళాశాల మనదేశంలో మొట్టమొదటిది. దానిని స్థాపించినవారు విజయరామ గజపతి. మొట్టమొదటి అధ్యక్షుడు హరికథా పితామహుడు, బహుభాషా కోవిదుడు, మహా వాగ్గేయకారుడు అయిన ఆదిభట్ల నారాయణదాసు గారు. వారి ప్రతిభ వర్ణనాతీతం. వారి తరువాత ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, అనేక మంది విద్యార్థులు విద్వాంసులుగా రూపొందారు. తరువాత ప్రభుత్వం వారి కళాశాలలు హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాలో వచ్చాయి.

9. ఆధునిక గురువులు:

ద్వారం దుర్గాప్రసాదరావు, విశాఖలో ఇవటూరి విజయేశ్వరరావు, ఐ.వి.ఎన్. శాస్త్రి గారు, అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు మొదలైనవారు. సంగీత కచ్చేరీల కన్నా సంగీత శిక్షణ ఇవ్వడం గొప్పతనం అనిపించుకుంటుంది. బోధన వల్ల గురువు చిరస్థాయిగా వుంటారు. శిష్యప్రశిష్యుల కచ్చేరీల ద్వారా శ్రీపాద పినాకపాణి గారు ముఖ్యులు. ఈనాటి శిష్యులు అందరూ వారి శిష్యులే. ఆయన వృత్తి డాక్టర్ అయినా ప్రవృత్తి  చేత సంగీతజ్ఞుడు. మంచి గురువు, మేధావి. తనదైన విశిష్టమైన ‘పాణి బాణీ’ అనే బాణీని కల్పించుకున్న ఉన్నతుడు. అహర్నిశం సంగీతంలోనే జీవించిన నిరాడంబర నాదయోగి.

10. గ్రంథాలు:

సంగీత సంప్రదాయ దర్శిని – సుబబ్రామ దీక్షితార్. ప్రచురించింది ఎట్టయపురం జమీందారులు. ఆంగ్లంలో అనేక గ్రంథాలు వ్రాసి ప్రచురించినది పి. సాంబమూర్తి గారు, అమరుడు. అరిపిరాల సత్యనారాయణమూర్తి, ఎన్.సి. పార్థసారథి దంపతులు, తచ్చూరి సింగరాచార్యులు, ఏకా సుబ్బారావు, కృతిమణి మాల రంగ రామానుజ అయ్యంగారు, కల్లూరి వీరభద్రశాస్త్రి మొదలైనవారు.

11. వైణికులు:

బొబ్బిలి ఆస్థానంలో వాసావారు, విజయనగర ఆస్థానంలో వీణ వెంకట రమణ దాసు గారు, గురాచార్యులు, పిఠాపురం ఆస్థానంలో ఈమని వారు, శిష్టు వారు, వారణాసి వారు – వీరందరూ వీణలో ప్రసిద్ధులు. తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారు వీణలో అవతార పురుషుడు.

12. ఉద్యోగాలు:

ఎంతో మంది విద్వాంసులు ప్రభుత్వ కళాశాలల్లో, ఆల్ ఇండియా రేడియోలోనూ వున్నారు. నిరాధారంగా వున్న విద్వాంసులు ఈనాడు తక్కువే అని చెప్పవచ్చు.

13. మృదంగ, వయొలిన్ విద్వాంసులు:

Side instruments ని చిన్నచూపు చూసేవారు, మద్దెలగాడు అని. కాని కోలంక వెంకట రాజు గారు ఒక ఉన్నతమైన అంతస్తుని కల్పించారని చెప్పవచ్చు. రామ్మూర్తి అశ్వధాటి, వారణాసి ఘంటయ్య గారు, మహాదేవ రాధాకృష్ణరాజు, క్రొవ్విడి హనుమంతరావు, ఎల్లా సోమన్నగారు, ముళ్ళపూడి లక్ష్మణరావు, చదలవాడ సుబ్బయ్య గారు; ఇప్పటి తరంలో దండమూడి రామమోహనరావు, కమలాకర రావు, ఎల్లా వేంకటేశ్వర్లు మొదలైనవారు. వీణలో చిట్టిబాబు, గాయత్రి తదితరులు; వయొలిన్‍లో ద్వారం వేంకటస్వామి నాయుడు గారు, తర్వాత సుబ్బారావు, పేరి సుబ్బారావు, వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి గారు తదితరులు. నాదస్వరం అప్పటివారల్లో దాలిపర్తి పిచ్చహరి గారు, చిన్న పీర్ సాహెబ్ వారు – ఇప్పటి వారిలో చిన మౌలానా గారు, చిట్టి అబ్బాయి గారు ప్రసిద్ధులు.

14. గురుకులాలు:

విజయవాడలో 20, 50 సంవత్సరాలు తన గృహమే ఒక విశ్వవిద్యాలయంగా తాను సద్గురువుగా వందలమందికి సంగీత భిక్ష, విద్యాదానం చేసినది పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. కర్నాటక, ఆంధ్ర దేశానికి ఎంతో సేవ చేశారు. డొక్కా శ్రీరామమూర్తి, సీతారామయ్య శాస్త్రి సంగీత ఉన్నతి కోసం పాటు పడ్డారు.

15. ఈమధ్య గాత్రజ్ఞులు:

ఆనాడు మహావాది వెంకటప్పయ్య గారు (వోకల్), క్రోవి సత్యనారాయణ గారు, ఓలేటి వెంకటేశ్వరులు గారు తదితరులు అపారమైన కృషి చేసి అమరులైరి. నేదునూరి కృష్ణమూర్తి, ఎం.ఎస్. బాలసుబ్రమణ్య శర్మగారు ప్రసిద్ధులు.

స్త్రీలలో మంచి స్థాయికి చెందిన సంగీత విదుషీమణులు శ్రీరంగం గోపాలరత్నం గారు, అరుంధతీ సర్కారు, టి.టి. సీత, మాలతీ పద్మనాభరావు గారు, జయలక్ష్మీ సంతానం తదితరులు.

16. వర్ధిష్ణు గాయకులు:

చాలామంది గాయకులలో మంచి శైలి, కల్పన, సంప్రదాయం, కీర్తన, పారాంతరములతో సంగీతానికి మంచి భవిష్యత్తు కల్పిస్తున్నారు.

17. స్వర్ణయుగం:

75-60 ఏళ్ళ మధ్య విద్వాంసులు, 60-40 ఏళ్ళ చక్కని ప్రతిభ కలవారు, 40-20 సంవత్సరాల యువ విద్వాంసులు చేరి చాలామంది వున్నారు. ఆంధ్ర దేశంలో ఒక స్వర్ణయుగం అనే భావన కల్గుతోంది.

18. శ్రోతలు:

విద్వాంసుల ప్రమాణాలు, స్థాయికి పోల్చినా శ్రోతల సంఖ్య స్థాయి చాలా తక్కువగా వుంది. సభలు కొన్ని. పాడేవారు, వినేవారు కొంతమంది. అందరు 40 ఏళ్ళు పైబడిన వారే. యువకులలో కర్నాటక సంగీతానికి శ్రోతలు అతి తక్కువ. అసలు లేరేమో అని కూడా చెప్పవచ్చు.

19. అభిరుచిని పెంపొందించే మార్గాలు:

మార్గాలు, పథకాలు, ఆచరణలో పెట్టడానికి ప్రభుత్వ సహకారం, సాంస్కృతిక సంఘాల సహాయం కావాలి. విద్యాలయాలు సహకరించాలి. విద్వాంసులు తీవ్రంగా ఆలోచించి ఆచరణకు నడుం కట్టాలి. ప్రాథమిక పాఠశాల నుంచి, విశ్వవిద్యాలయాల స్థాయికి అభివృద్ధి చేయాలి.

20. పాశ్చాత్య సంగీత ప్రభావం:

పాప్, రాక్ సంగీత ధోరణులను చవకబారుగా అనుకరణలు చేయటం, ఎలెక్ట్రానిక్ వాద్య పరికరాలతో తయారు చేస్తున్నారు. పశుప్రవృత్తిని ప్రేరేపించి, మానవ విలువలను దూరం చేస్తుంది.

21. సంగీత శిఖరాలు:

త్యాగయ్య, శ్యామశాస్త్రి, క్షేత్రయ్య, అన్నమయ్య, తీర్థులు, రామదాసు, ఆదిభట్ల నారాయణ దాసు, ఒక ద్వారం బాలమురళీకృష్ణ, పినాకపాణి, యు.శ్రీనివాసు తదితరులు. మకుటం లేని మహారాజు శ్రీ బాలమురళీకృష్ణ గారు.

22. నిజమైన శ్రోతలు:

శాస్త్రీయ సంగీతంలో సాహిత్యం విని ఆనందించేవారు, మనో ధర్మ, ఆలాపన, స్వర్గం, నెరవల్, పల్లవిని ఆకళింపు చేసుకున్నవారు నిజమైన శ్రోతలు.

23. బోధన:

శిష్యులకు వాత్సల్యంతో విద్య నేర్పడం.

24 విశ్వవిద్యాలయాలు:

ఆంధ్ర విశ్వవిద్యాలయం (వాల్తేరు) Diploma, BA, Matric, Intermediate లలో music ప్రవేశపెట్టింది. వేంకటేశ్వర యూనివర్శిటీ, తెలుగు యూనివర్శిటీ వారు కూడా వివిధ శాఖలతో కోర్సులు ప్రవేశపెట్టారు.

25. లలిత సంగీతం:

ప్రేమ, భావగీతాలు, రాగనియమం లేకపోడం జానపద, శాస్త్రీయ ఆధునిక గీతాల మీద ఆధారపడి ఉంది. ఆధునిక లలిత, భావ, భక్తి గీతాలు – ఈ లలిత సంగీతం మీద ఆధారపడి ఉన్నాయి. Applied music in light music కల్పించడానికి సంగీత జ్ఞానం వుండాలి. పాడడానికి ఎక్కువ సంగీత జ్ఞానం ఉండక్కర్లేదు. మంచి గాత్రం వుంటే చాలు.

26. గాన సభలు:

ఇది వరకు 3, 4 గంతలు కచేరీలు వుండేవి. ప్రజలకి సావకాశంగా వినే ఓపిక, ఉత్సాహం వుండేవి. పూర్వం రాగం-తానం-పల్లవి (RTP) వుండేది. ఇప్పుడు రాను రాను తగ్గిపోతోంది.

27. యుగళ్ బందీ:

గాత్రము, వాయిద్యాలు కలిపి యుగళ్ బందీలు వుండేవి. జాతీయ సమైక్యతను దృష్టిలో వుంచుకుని ఏర్పాటు చేసేవారు.

28. విమర్శకులు:

కళలలో ప్రవేశం వుండి, మంచి పాండిత్యము, రస హృదయము వుండాలి. అన్ని పత్రికా రంగాలలో విమర్శ చేయగలిగే సామర్థ్యం, నైపుణ్యం కలిగి వుండాలి.  ఆ స్థితి చెప్పగలిగే అర్హత కలిగి వుండాలి.

29. సంగీత కేంద్రాలు:

ఉ. విజయనగరము, విశాఖ, కాకినాడ, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, సికింద్రాబాద్ మొదలైన స్థలాలు కేంద్రాలుగా ఉండాలి.

30. భవిష్యత్తు:

ముందు తరాలకు భవిష్యత్తు ఇచ్చేటట్లుగా వుండాలి.

31. మాధుర్యం:

కర్నాటక సంగీతం ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నా, పాశ్చాత్య, హిందుస్థానీ తాకిడికి తట్టుకుని నిలబడడానికి  – కర్నాటక సంగీతంలోని మాధుర్యమే, గొప్పదనానికి కారణం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here