Site icon Sanchika

సంగీత సురధార-23

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 19

అలంకారములు:

[dropcap]వ[/dropcap]ర్ణ భేదము లనుసరించి స్వరములను చేర్చుటయే గాక గానమునకు అందమును కలుగజేయునట్టి భావగర్భితమగు సమ్మేళనము అలంకారము. ఇట్టి అలంకారము లేని గీతాదులు నిష్ప్రయోజనమని భరతాదులు చెప్పిరి. శార్ఞ్గ దేవుడు తన ‘సంగీత రత్నాకరము’లో అలంకారములు 5 విధములని చెప్పెను. అవి

  1. స్థాయి గతాలంకారము
  2. ఆరోహ్యాలంకారము
  3. అవరోహ్యాలంకారము
  4. సంచార్యాలంకారము
  5. సప్తాలంకారము

అహోబలుడు తన ‘సంగీత పారిజాతము’లో 7 అలంకారములు కలవని చెప్పెను. సూళాది మార్గములైన యీ 7 అలంకారములే ధ్రువాది సప్త తాళములుగా చెప్పబడుచూ, నేటి కాలమున అందరిచేత వాడబడుచున్నవి.

శ్రీ వేంకటమఖి ‘చతుర్దండి ప్రకాశిక’ గ్రంథంలో సూళాది సప్త తాళములకు మరియొక అలంకారము చేర్చి మొత్తము 8 అలంకారములు చెప్పెను. సూళ అనగా గీతమని అర్థము. సూళ అనునది దేశీ పదమగును. ‘లడ యోర భేదః’ అను ప్రమాణనున సూడ, శబ్దములో గల డ కారమునకు, ల కారము వచ్చి సూళ యైనదని చెప్పుదురు.

గమక నిర్వచనం – లక్షణములు:

శ్లో:

స్వరస్య కంపో గమకః శ్రోతృచిత్తసుఖావహః

అను ప్రమాణమున వినువారి చిత్తమును రంజింపజేయునట్లు

స్వరములను కదిలించి పాడుట ‘గమకము’ అనబడును. ఇవి 15 గలవు. వాటి పేర్ల వివరములు ఈ శ్లోకమందు కలవు.

శ్లో:

తిరుప స్ఫురితశ్చైవా కంపితో లీన మిత్యపి

ఆందోళితో వళిశ్చాదా త్రిభిన్నః కురుళాహతౌ

ఉల్లాసితః ప్లావితశ్చ హుంపితో ముద్రితస్తథా

నామితో మిశ్రితశ్చేతి భేదాః పంచదశ స్మృతాః

గమక వివరణము:

గానము చేయునపుడు సంగీత సంప్రదాయజ్ఞులు శుద్ధ, వికృతి భేదము గల స్వరములను సహజమైన ఆయా ధ్వనులందే గానము చేయక, వినుటకు రంజకము కలుగునట్లుగా కదిలించుటను గమకం అందురు.

అనగా ఏదైనా స్వరమును దాని సహజమైన ధ్వని యందే గాక, పక్కన ఉన్న మీది స్వరచ్ఛాయను కూడా పొందునట్లు చేయుటను గమకం అందురు. ఇట్టి గమకములు 15 రకములని శ్రీ వేంకటమఖి చెప్పియుండిరి. వీటినే పంచదశ గమకములని అందురు (ఛాయ=శోభ).

పంచదశ గమకములు:

1. కంపితము:

ఏదైనా స్వరము ఇరువైపులా నున్న స్వరము కదులునట్లుగా ఊపుచూ, పాడినా లేక వాయించినా అది కంపితమగును. ~~~ గుర్తుతో సూచించెదరు (కంపితం=కదిలింపు).

2. లీనము:

ఏదైనా స్వరమును 2 అక్షరాలను కదిలించి దానిని దగ్గర మీద స్వరము యొక్క ఛాయను రప్పించి, లయింప చేయుట ‘లీన’మని చెప్పబడును (లీనము=లయింపు లేక తుగుల చేయుట)

3. ఆందోళితము:

ఏదైనా స్వరమునకు 4 అక్షర కాలము వరకు కదిలించి, దానికి మీది స్వరము యొక్క ఛాయను రప్పించుట ఆందోళితం. (ఆందోళితం=ఊగుట)

4. ప్లావితము:

ఏదైనా ఒక స్వరమును 10 అక్షర కాలము కదిలించి, దానికి మీది స్వరము యొక్క ఛాయను రప్పించుట (ప్లావితము=తేలుట)

5. స్ఫురితము:

స స, రి రి జంట ప్రయోగములలో రెండవ స్వరము నందు కొట్టి చెప్పుట (స=సనిస). గుర్తు ∴ (స్ఫురితము=తోచుట లేక చలనము).

ప్రత్యాఘాతము: అరోహణ జంటను కొట్టుట. స స, అనుదానికి స రి స; స్ఫురితమునకు మారగా ‘డోలము’ అందురు. కదిలింపు అని. ముత్యములోని పొరలిన నీటి వలె యుండును.

6. తిరుపము:

అర అక్షర కాలం విరిచి, దాని అదిమి, మీది స్వరము యొక్క ఛాయను రాజేయుట ‘తిరుప’ నొక్కు (హింస ఏర్పర్చు అని అర్థం).

7. ఆహతము:

కొట్టుట. ఇది రెండు రకములు.

(అ) రవ – ఏదైనా స్వరము పై నుండి క్రిందకి దిగునప్పుడు పై స్వరము యొక్క ఛాయలో క్రింది స్వరమునకు దిగుట. ఉదా: పమ అని దిగునపుడు పపమ అని పలికించుట.

(ఆ) ఖండింపు: నడుమ స్వరమును ఖండించి క్రింది స్వరమునకు పైన ఖండింపబడిన, స్వరచ్ఛాయను గల్గు జేయుటను ఖండింపు అందురు. ఉదా: మ, రి అనుదానిని మ గ రి అనునట్లు పలికించుట.

8. వళి:

ఏదైనా ఒక స్వరమును సుడియించి పట్టి దాని మీద స్వరము యొక్క ఛాయను రాజేయుట.

9. ఉల్లాసితము:

దీనినే ‘జారు’ అందురు. ఇది రెండు రకములు.

(అ) ఎక్కు జారు. ఉదా: రి గ మ

(ఆ) దిగు జారు. ఉదా: మ గ రి

10. హుంపితము:

దీనినే గుంభితము అని కూడా అందురు. ఇది జారును పోలియుండును. బయలు వెడలినది మొదలు నిలుచు వరకు నాదము హుం అనునట్లుగా (ఆరోహణ, అవరోహణ యందు కూడా), అటులనే యుండును.

11. కురుళము:

ముంగురులు. ఇది రెండు విధములు

(అ) ఒదిగింపు: ఒక స్వరము నందే దానిపై స్వరముని లేదా రెండవ స్వరము గాని పలుకుట. ఉదా: రిషభము నందే గాం॥ గాని, మ॥ గాని పలుకుతున్నట్లు చేయుట. వీణలో పలికింతురు.

(ఆ) ఒరయిక: ఒరిక = రాచుట. ఉదా: సానీ దా పా – సా రి, వీ స, దా ని, పా గా, పలికించుట.

12. త్రిభిన్నము:

వీణావాద్యములో మీది 1, 2,3 తంత్రులను, ఎడమ చేతి వ్రేళ్ళతో నదిమి, కుడి చేతి వ్రేళ్ళతో ఒకేసారి రంజకమునకై మీటుట.

13. ముద్రితము:

నోటిని మూసుకుని స్వరములను కదిలించి పాడుట – గాత్రము.

14. నామితము:

నాదమును తగ్గించి, సూక్ష్మ ధ్వనితో పాడుట వలన గల్గు స్వరములు.

15. మిశ్రితము:

రెండు లేదా మూడు గమకములు కలిసి వచ్చునట్లు చేయుట.

***

స్థాయ అను శబ్దమునకు రాగావయవమని,

వాగమ అను శబ్దమునకు గమకం అని చెప్పబడును.

దశవిధ గమకమలు:

  1. ఆరోహణము
  2. అవరోహణము
  3. ఢాలు
  4. స్ఫురితం
  5. కంపితం
  6. ఆహతము
  7. ప్రత్యాహత్ము
  8. త్రిపుచ్ఛం
  9. ఆందోళితం
  10. మూర్ఛన

ఈ దశవిధ గమకముల వల్ల రాగములను సంపూర్ణముగా పోషించుటకే మాత్రము సాధ్యం కానేరదు. కనుకన్నే ‘నిశ్శంకుడు’ గమకము లనేకము లుండినను గాని రాగ స్ఫూర్తి కలుగదని స్పష్టీకరించి యుండుటకు కారణమైనదని గ్రహించవలెను.

(ఇంకా ఉంది)

Exit mobile version