[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]
అధ్యాయం 23
కృతి – కీర్తన భేదాలు:
[dropcap]ఏ[/dropcap]దేని క్రొత్తగా సృష్టించిన పదము, పెద్దది గాని లేక చిన్నది గాని వాఙ్మయమున ‘కృతి’ అనబడును. సంగీతమునందు కృతి రచన వేరు. తాళ నిబంధనలు, సాహిత్య భావనల నిబంధనలును ఏవియు కృతి రచయితను బంధింపవు. రాగమును తన ఇష్ట ప్రకారం ఏరుకొనవచ్చును. తాళము, నడక అన్నియు అతని ఇష్టములే. రాగము యొక్క భావములు ఎన్ని విధముల ఎన్ని స్వరూపముల, ఎన్ని ఫక్కీలలో రూపించుటకు వీలున్నదో అట్లు చూపుటయే ‘కృతి’ రచయిత ధర్మము. మెదడు నుండి పొరలివచ్చు తన సాహిత్యముతో తనలోని భావములు విపులముగా జూపుటకు ఇతనికి వీలున్నది. గడచిన రెండు శతాబ్దములుగా సంగీత రచయిత లందరును కృతులనే రచించియున్నారు.
కృతి రచయిత తన మనస్సు తన భావములు ఎట్లెట్లు పారునో అట్లెల్ల అతను కృతిని తన స్వంత సృష్టిగా, నూతనముగా రచించును. గనుక ఈ రచనకు కృతియని పేరిడినారు.
కృతి లక్షణము:
కృతికి కనిష్టము, పల్లవి, అనుపల్లవి, చరణము అను అంగములు ఉండవలెను. చరణ ఉత్తర భాగము సాధారణంగా అనుపల్లవిని పోలి ఉంటుంది. సాహిత్యము దేవతాస్థుతి గానైనను, రాజపోషకుని స్థుతిగా నైనను, లేదేని వేదాంతముతో కూడుకొన్నది నైనను ఉండవచ్చును. కృతి లోని సాహిత్యము రాగ భావమును వెదజల్లు యంత్రముగా ఉంది. గాబట్టి మిత పదములతోనే కృతి రచయిత తృప్తిపడును. 1½ నుండి 2 స్థాయిలలో కృతి రచింపవచ్చును. చరణము ఒక్కటైనను ఉండవచ్చును. లేక 4,5 చరణములు ఉండవచ్చును. కృతులలో రచయిత అతీత, అనాగత గ్రహములతో చాకచక్యము చూపుటకు వీలున్నది. సాధారణ రాగములే కాక అపూర్వ రాగములతో కూడా కృతులను రచింపవచ్చును. కృతికి చాలా ముఖ్యమైన అంగము ‘సంగతి’. సంగతి లేనిదే కృతి రాణింపదు. సంగతులు లేనిది కృతి సాహిత్య భావము అన్ని ఫక్కీలతో మనకు గోచరింపజాలదు. మేడ మెట్ల వలె ఈ సంగతులు, సాహిత్యములోని భావమును ఒక్కొక్క ఫక్కీతో ప్రారంభించి కట్టకడపటి పై శిఖరమున చేర్చును. ఒక్క సంగతి లోపించిననూ, భావమునకంతకునూ లోపమే. సంగతి అను అంగమును మొట్టమొదట శ్రీ త్యాగరాజుల వారే కల్పించిరి. వారికి మనమెంతయో కృతజ్ఞులము.
(1) కొన్ని కృతులలో సంగతులు చివరి నుండి ప్రారంభించుట మనము చూచుచున్నాము. క్రమేణ చివరినుండి కొంచెము కొంచెముగా ప్రాకి ఆవర్త ఆరంభమునకు వచ్చి శోభించును.
చివరి నుండి ప్రారంభించు సంగతి – ప్రవృద్ధి:
___________ 1. సంగతి
___________ 2. సంగతి
___________ 3. సంగతి
___________ 4. సంగతి
___________ 5. సంగతి
ఉదాహరణ: ‘గిరిపై నెలకొన్న’ – ‘శహన’ -ఆది – త్యాగయ్య
(2) రెండవ రకం సంగతులు ఆవర్త ప్రారంభములోనే ప్రారంభించి కొద్ది కొద్దిగా చివరి వరకు ప్రాకును.
___________ 1. సంగతి
___________ 2. సంగతి
___________ 3. సంగతి
___________ 4. సంగతి
___________ 5. సంగతి
ఉదాహరణ: శ్రీ రఘువరాప్రమేయ – కాంభోజి – ఆది – త్యాగయ్య.
(3) మూడవ రకము సంగతులు ఆవర్త మధ్యలో ప్రారంభించి కొద్దికొద్దిగా ఇరుప్రక్కల ప్రాకునవి.
ఉదాహరణ: చేతులార శృంగారము – భైరవి – ఆది – త్యాగయ్య.
దీనిలో శృంగారము అను భాగము మారదు.
పల్లవి, అనుపల్లవి, చరణము, కృతికి ముఖ్యాంగములు. ఆ ముఖ్యాంగములలో కొన్ని కృతులు ఉన్నాయి. అవి – చిట్ట స్వరము, స్వరసాహిత్యము, మధ్యమకాల సాహిత్యము, శోల్‌కట్టు స్వరము, స్వరాక్షరము, మణి ప్రవాళ సాహిత్యము.
(1) చిట్ట స్వరము:
అనుపల్లవి తరువాతను, చరణము తరువాతను చిట్ట స్వరము పాడుట వాడుక. చిట్ట స్వరము 2,4,8 ఆవర్తముల స్వరముల చిన్ని రచన. సాధారణముగా మధ్యమ కాలముగా పాడదగియుండుట, కొన్ని కృతులకు కృతి రచయితుడు కాక మరియొకరు రచియించి పొంకించుటయు కద్దు. రఘువంశ అను కదన కుతూహల కృతి యందును, కృంగార లహరి అను నీలాంబరి కృతి యందును, బ్రోచేవారెవరురా అను ఖమాస్ కృతియందును, ఇంకను చాలా కృతులలో చిట్ట స్వరములు కాననగును.
చిట్ట స్వరములోనే విలోమ చిట్ట స్వరము అనునొక రకము ఉంది. ఆరోహణ, అవరోహణాలలో ఒకే స్వరములుగా ఉండి, ఆరోహన అవరోహణములు, ఒకే రకముగా (అనగా రెండును సంపూర్ణములు గానో, షాడవములు గానో, ఔఢవములు గానో) నుండినవే. ఇటువంటి చిట్ట స్వరము రచించుటకు సాధ్యమగును. ఈ రకపు చిట్ట స్వరమును మొదటి నుండి చివర వరకూ పాడిననూ, చివరి నుండి మొదటికి పాడిన రాగము చెడక యుండవలెను. దీనికి ఉదాహరణ ముత్తుస్వామి దీక్షియుల వారి కళ్యాణి కృతి ‘కమలాంబాంభజరే’లో కాననగును. ఇటువంటి చిట్ట స్వరము రచించుట అంత సులభం కాదు. కనుక ఇటువంటివి ఎక్కువ లేవు.
(2) స్వర సాహిత్యము:
చిట్ట స్వరము వలెనే ఇవియు స్వరము, దానికి సాహిత్యము కలిగి యుండును. అనుపల్లవి చివరను, చరణము చివరయు పాడు అంగము. ఒక్కొక్కప్పుడు స్వరము అనుపల్లవి కనుక వెనుకను, సాహిత్యము చరణము పాడిన వెనకనూ పాడుట కొన్ని కృతులకు ఆచారములై యున్నవి. ‘ఓ జగదంబ’ అను ఆనందభైరవి కృతిలో ఈ రకముగా పాడు స్వర సాహిత్యమున్నది.
సాహిత్యము లోని పదముల అర్థము చరణములోని సాహిత్యము యొక్క అర్థమును పాడుచేయక పొంకముగా నుండును. ‘దురుసుగా’ అను సావేరీ రాగ కృతియు ఈ జాతికి చెందినదే.
(3) మధ్యమ కాల సాహిత్యము:
అనుపల్లవి తరువాతనో లేక చరణాంతముననో మధ్యమ కాల సాహిత్యములు రచింపబడును. ఈ సాహిత్యము కృతి కాలము కన్న త్వరగా పాడు అంగము. ముత్తుస్వామి దీక్షితుల కృతులన్నింటిలోనూ ఈ అంగమును కాననగును. ముత్తుస్వామి దీక్షితుల కృతులు చాలా నెమ్మదిగా నడుచునవి. మధ్యమ కాల సాహిత్యము వీరి కృతులకు విలువ లేని శోభ యిచ్చును.
(4) శోల్‌కట్టు స్వరము
ఇది చిట్ట స్వరమే కాని చిట్ట స్వరము లోని కొన్ని స్వరములకు బదులు జతులను కూర్చి యుండును. ‘ఆనంద నటన ప్రకాశం’ అను కేదార కృతియందు కాననగును. పా నీ నీ స తకఝనుత స నీ నీ ఝంతరిత సమగమ మొదలగునవి.
(5) స్వరాక్షరము
స్వరాక్షరము అనగా స్వర భాగములోని స్వరములును సాహిత్య భాగములోని అక్షరములు ఒక్కొక్కటిగానే యుండుట. అనగా ‘మా మా’ అని స్వర భాగమందున్న ‘మామ’ అని సాహిత్యములోనూ సాహిత్యార్థము చెడక యుండుటకు ‘స్వరాక్షర’ మందురు. ఇటువంటి అంగమును రచించుటకు భాషయందు చాలా పాండిత్యము కలిగి యుండవలెను. చాల కొద్ది రచయితలు ఈ రక అంగమును ప్రయత్నించిరి. స్వాతి తిరుణాల్ మహారాజు గారు ఈ రకము అంగములలో చాల వరకు తన కృతుల నలంకరించిరి.
కొన్ని ఉదాహరణలు:
- {ప ద సా – ప ద సా} స ని దా – బ్రాకెట్లు వేసినది స్వరాక్షరము. ఇది నవ రాగ మాలికా వర్ణము లోని చరణారంభము.
- శ్రీరామ {పా ద మా – పాదమా} అను అమృత వర్షిణి కృతి.
- {నీ దా రి ని ద ప గ మ ని ని} – నీ దారిన దప్పక మానిని – యున్నది.
- {నీ స రి స} నీ సరి సమాన – భైరవిలో మణిప్రవాళ కృతి
- {స రి గ పా గా – సరిగపాగా} ఇచ్చెనే {సా దా పా గా – సాదాపాగా} ఇచ్చెరా గా యున్నది.
6. మణి ప్రవాళము:
సాహిత్యములో వ్యాకరణ నిబంధనలు చెడకుండా రెండు మూడు భాషలు కలిపి సాహిత్యమును రచించునది మణిప్రవాళము. ముత్తుస్వామి దీక్షితుల వారి ‘వేంకటాచలపతే’ అను కాఫీ రాగ కృతి; సంగీత కళా శిఖామణి ప్రొఫెసర్ సాంబమూర్తి గారి కృతులు ‘నీ సరిసమాన’ అను భైరవ రాగ కృతి, శ్రీ త్యాగరాజస్వామి ‘నీ మహిమ’ అను వాచస్పతీ రాగ కృతి ప్రశంశనీయములు.
కొన్ని కృతుల సాహిత్యములో ప్రాసములు, యతులు చాలా చక్కగా యున్నవి. ‘ఎదుట నిలిచి’ అను శంకరాభరణం రాగ కృతి చరణములో,
తరాన దొరకని పరాకు నా యెడ
నిరామ జేసితే సురాసురులమె
త్తురా ఇపుడు ఈ హరామితనమే
లరా భక్త త్యాగ రా జనుత
అని రకారము గంభీరముగా త్యాగరాజు వాడి ఈ కృతిని ఎంతో చక్కగా రచించియున్నారు.
పైన చెప్పిన అంగములు చాలా మట్టుకు ప్రయత్నించి రచింపదగిన అంగములు. ఈ అంగములు లేకపోయిననూ కృతికి లోపము కలుగజాలదు. కాని ఈ అంగములుండుట వల్ల కృతికి మరియొక క్రొత్త భూషనము తొడిగినట్లగును.
కృతి యొక్క రచన మనకు ఒక్కసారిగా సంగీత ప్రపంచమున అందజేయలేదు. కృతికి పునాది కీర్తన. కొందరు కీర్తన, కృతి రెండునూ ఒక్కటే అనవచ్చును. కాని ఈ రెంటికీ కొన్ని భేదములున్నవి. కీర్తన పురాతన రచన. కీర్తనలు మతమును భక్తిని వ్యాపన చేయుటకై మన పూర్వులు చేయూతగా తీసికొనిన రచన. కీర్తన పూర్తిగా పుణ్య రచన అని చెప్పవచ్చును. భక్తిని, మతమును వ్యాపింపజేయదలచి ఆ భావమును సంగీతముతో ఏదో ఒక మెట్టులో రచించి జనుల నాకర్షించిరి. కీర్తనలో సంగీతము కంటే సాహిత్యము ప్రధానము. కృతిలో సంగీతమే ప్రధానము. కీర్తన ఉపయోగములోనికి 15వ శతాబ్దమున వచ్చినట్లు శ్రీ సాంబమూర్తి గారు వారి గ్రంథమున సెలవిచ్చి యున్నారు. కీర్తన లోని సాహిత్యము, భక్తుల గురించి గాని తెలుపునదియై యుండును. సాహిత్యములో పదము లెక్కువగా నుండును. సాధారణముగా ఒక్క స్థాయిలోనే ఇమిడి యుండును. అనుపల్లవి ఉంది తీరవలెనను నిబంధన లేదు. చరణముల మెట్టు పల్లవిని పోలి కొన్ని కీర్తనలలో ఉన్నాయి. కీర్తన నడక నెమ్మది. సంగీతపు ఫక్కీ చాలా సులువుగానూ, సాధారణముగాను సామాన్య రాగములలో రచింపబడుటచే వినికిడితో చేర్చుకొనుటకు సులభముగా యున్నవి.
కొందరు రచయితలు కొన్ని అనగా 7, 9, 5 కృతులను ఒక గుంపు క్రింద, రచించి యున్నారు. ముత్తుస్వామి దీక్షితులవారు నవగ్రహ కృతులను, నవావర్ణ కృతులని, పంచలింగస్థల కృతులని, కమలాంబానవావర్ణములని కొన్ని గుంపులను, త్యాగరాజుల వారు పంచరత్నములు, కొవ్వూరు పంచరత్నములు, తిరుత్తియూరు పంచరత్నములు అను గుంపులు రచించియున్నారు.
కీర్తనలలో కూడా శ్రీ త్యాగరాజులవారు దివ్య నామ కీర్తనలని, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలని, కొన్ని గుంపులు రచించి యున్నారు. శ్రీ త్యాగరాజులవారు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, శ్రీ స్వాతి తిరుణాల్, ఆనయ్య, పల్లవి గోపాలయ్య, వీణ కుప్పయ్య, సుబ్బరాయ శాస్త్రి, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్, పల్లవి శేషయ్య, మైసూరు సదాశివరావు, గోపాల కృష్ణ భారతి, రామస్వామి శివన్ మొదలగువారు కృతి రచయితలు.
రామదాసు, పురందరదాసు అన్నమయ్య, తాళ్ళపాక చిన్నయ్య, తీర్థ నారాయణ స్వామి, సదాశివ బ్రహ్మేంద్ర, రామచంద్ర యతీంద్ర, త్యాగరాజు, అరుణాచల కవిరాయర్, కవికుంజర భారతి, గిరిరాజకవి, విజయగోపాలస్వామి, గోపాలకృష్ణ భారతి మొదలగువారు కీర్తన రచయితలు.
కృతికీ కీర్తనకు వ్యత్యాసములు:
కీర్తన | కృతి | |
1 | వైదిక గానమునకు చెందినది. | లౌకిక గానమునకు చెందినది. |
2 | ఇందు సాహిత్య భావము ముఖ్యము. భక్తిని వ్యాపింపజేయుటకై సాహిత్యమును ఒక మెట్టులో పెట్టబడినది. | సాహిత్యము అంత ముఖ్యం కాదు. సంగీతపు మెట్టు ముఖ్యం. |
3 | సాధారణ రాగములలో మాత్రము రచింపబడును. | అఫూర్వ రాగములలో కూడా రచింపబడును. |
4 | సంగతులు ఉండవు. | సంగతులు ముఖ్యము. |
5 | 6 ముఖ్య అంగములు – చిట్ట స్వరము, స్వరసాహిత్యము, మధ్యమకాల సాహిత్యము, శోల్‌కట్టు స్వరము, స్వరాక్షరము, మణి ప్రవాళ సాహిత్యము ఉండవు. | 6 ముఖ్య అంగములు ఉండును |
6 | ఒక్క స్థాయిలో ఇమడ్చబడి యుండును | మధ్య, మంద్ర, తార స్థాయిలకు వ్యాపించి యుండును. |
7 | సాహిత్యములో పదములు ఎక్కువగా వుండును. | సాహిత్య భాగములో పదములు చాలా తక్కువగా ఉండును. |
8 | అనుపల్లవి లేకయు ఉండవచ్చును. | అతీత, అనాగత గ్రహములతో ప్రజ్వలించును. అనుపల్లవి లెక యుండుట చాలా అరుదు. |
9 | చరణములు ఎక్కువగా ఉండును. | సాధారణముగా 3 చరణములకు మించవు. |
10 | వినికిడి వల్ల నేర్చుకొనవచ్చును. | వినికిడి వల్ల నేర్చుకొనుట చాలా కష్టము. |
11 | నిరవల్ గాని, కల్పన స్వరములు గాని పాడుటకు వీలు లేదు. | నిరవల్, కల్పన స్వరములు అఖండముగా పాడవచ్చును. |
12 | పురాతన రచన. | నవీన రచన. |
13 | గుంపులు గుంపులుగా చేరి పాడుటకు వీలున్న రచన. | గుంపులు గుంపులుగా పాడుటకు వీలు లేని రచన. |
(ఇంకా ఉంది)