సంగీత సురధార-31

0
1

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 24

రాగమాలిక:

[dropcap]మా[/dropcap]లిక అనగా మాల (లేదా) హారము. హారము రంగు రంగుల పుష్పములచే అందముగా కట్టబడి యుండి చూచుటకు కన్నులకు సొంపుగా నుండును. అదే రీతిన రాగమాలికయు రాగముల యొక్క హారము. ఒక్కొక్క అంగము (పల్లవి, అనుపల్లవి మొదలగునవి) ఒక్కొక్క రాగములో రచించబడి రచన యొక్క నడకను గానీ భావమును గాని చెడపక, సౌందర్యమును పెంపొందించునట్లు రచింపబడిన రచన రాగమాలిక.

లక్షణము:

రాగమాలిక అనునది ప్రత్యేక సంగీత రచన. తాళము, మారక రాగము మాత్రము అంగ అంగమునకు మారుచుండు రచన రాగమాలిక. పల్లవి, అనుపల్లవి, కొన్ని చరణములుండును. 4 రాగముల కంటే తక్కువ రాగములతో రాగమాలిక ఉండుట అరుదు. అనగా రాగమాలికకు కనీసము నాలుగు రాగములుండవలెను. కొన్ని రాగమాలికలలో అనుపల్లవి లేకుండుటయు కలదు. ఒక్కొక్క రాగము తరువాత ఆ రాగ చిట్టస్వరమును, తరువాత పల్లవిని అందుకొనుటకు వీలుగా యుండుట కొరకు పల్లవి రాగములోని చిట్టస్వరములోని కొంత భాగము నుండుట కలదు. కాబట్టి ప్రతి రాగమును పాడిన తరువాత ఈ వంతెన చిట్టస్వరము వల్ల పల్లవిని అందుకొని పాడుట సులువగుచున్నది. కొన్ని రాగమాలికలలో చిట్టస్వరములే ఉండవు. ఒక్కొక్క రాగము యొక్క పేరు సాహిత్యములోని పదములతో అర్థము చెడకుండా కూర్చి వారి నైపుణ్యమును చూపు రాగమాలికా రచయితలు కొందరు కలరు.

కళ్యాణి రాగమయినపుడు ‘నిత్యాకళ్యాణీ నిగమాగమ సంచారిణీ’ అని అర్థము చెడకుండా పొంకముగా నున్నది. కొన్ని రాగమాలికలలో రాగ నామములు సాహిత్యములో లేక యుండుట ఉంది. ఒక రాగము నుండి ఇంకొక రాగమునకు మారుట వల్ల రసములు మారినను, మార్పు చాల సునిశితముగా నుండునటుల రచయిత రచించును. ఒక్క రాగము నుండి ఇంకొక రాగమునకు మారునపుడు ఆ మార్పు మన చెవులకు ఎంతో క్రొత్త ఆనందమునిచ్చును. పెద్ద పెద్ద రాగమాలికలు కొన్ని భాగములుగా భాగింపబడి ఒక్కొక్క భాగము స్వతంత్రముగా ఉంచబడుచున్నవి. సాహిత్యము దైవ ప్రార్థనగాను, రాజపోషకుని స్తోత్రముగాను లేక శృంగారముగాను ఉండవచ్చును.

కొన్ని రాగమాలికలు – దాని వివరములు:

  1. నిత్యకల్యాణి: 8 రాగములు కల రాగమాలిక. రచయిత సీతారామయ్య. ప్రతి రాగము యొక్క పేరును సాహిత్యములో నిమిడ్పబడియున్నది.
  2. అంబా నిన్ను నెరనమ్మితి: 8 రాగముల రచన, చిట్టస్వరములు లేవు. శ్యామశాస్త్రి రచన.
  3. పన్నగేంద్రశయన: 8 రాగముల రచన. స్వాతి తిరుణాళ్ గారు రచించింది.
  4. సానంతం: 4 రాగముల రచన. చిట్టస్వరములు కలవు. స్వాతి తిరుణాళ్ గారి రచన. రాగముల పేర్చు సాహిత్యమున కూర్చబడినవి.
  5. చతుర్దశ రాగమాలిక: 14 రాగముల రచన. ముత్తుస్వామి దీక్షితార్ రచన.
  6. పక్షమాలిక: 15 రాగముల రచన.
  7. 72 మేళకర్త రాగమాలిక: మహావైద్యనాధయ్యర్ గారు.
  8. 72 రాగాంగ రాగమాలిక: సుబ్బరామ దీక్షితులు, కృష్ణకవి గార్లు రచించింది.
  9. ఆరభిమానమ్‌: తమిళము 16 రాగముల రచన. ట్రాక్విబార్ పంచనాదయ్యర్ రచన.
  10. శతరాగ రత్నమాలిక: త్యాగరాజులవారి అఖండ భిక్ష. 100 రాగములలో 100 కీర్తనలు.
  11. నక్షత్రమాలిక: శ్రీ స.చ.పార్థసారథి గారిచే రచింపబడింది. 72 రాగములచే అలంకరింపబడింది. లఘువు ఒక రాగములోను, రెండు దృతములు మరియొక రాగములోను రచింపబడింది.

రాగమాలిక రచననే కాక వర్ణములలోను, కీర్తనలలోను పలురాగములుండుట వలన రాగమాలికా వర్ణములు, రాగమాలికా కీర్తనలు అగుచున్నవి. ‘జయ జయ గోకుల బాల’ అను తీర్థ నారాయణస్వామి గారి కీర్తన కురంజీ రాగములో సామాన్య మెట్టులో పూర్వులు పాడినప్పటికీ, ప్రస్తుతం రాగమాలికా కీర్తనగా పాడబడుచున్నది.

మనోధర్మ సంగీతములో కూడా మనము రాగమాలికను వినుచున్నాము. ఎట్లనగా శ్లోకములు పాడునపుడు రాగములను మార్చి గాయకుడు కొన్ని రాగములతో శ్లోకమును పెంచుచున్నాడు. ఇదియు రాగమాలికయే. తానమును ప్రస్తరించునపుడును, కల్పస్వరములు పాడునపుడును పలురాగములతో పాడిన యెడల అది రాగమాలిక యగుచున్నది.

తాళము మారక రాగము మారి పలు రాగములతో నుండు రచన రాగమాలిక. రాగము మారక తాళము అంగ అంగమునకు మారునది తాళమాలిక. ఇది మనోధర్మ సంగీతములోనే సాధ్యము. కొన్ని పల్లవులను తిరుత్తియూర్ త్యాగయ్యరు గారు తాళమాలికగా పాడి తన సభా ప్రేక్షకులను ఆశ్చర్యపెట్టుచుంఛెనట.

ఒక్కొక్క అంగములోను తాళము, రాగము మార్పబడియుండు రచన రాగతాళమాలిక. దక్షిణ సంగీతములో రామస్వామి దీక్షితుల వారి 108 రాగతాళమాలిక ఒక్కటే యున్నది. ప్రతి భాగములోను సాహిత్యములో తాలము యొక్కయు రాగము యొక్కయు పేరు అతి సుందరముగా కూర్చబదినది. ఇటువంటి రచన రచించుట చాలా కష్టము.

సంగీత రచనలలో రాగమాలికా రచనము పొడుగు రచన.

పదము:

పదము అను శబ్దము భక్తి కీర్తనలకు ఉపయోగింపబడుచున్నది. ‘దాసర పదగళు’ అని పురందరదాసుల వారి జ్ఞానపాటలకు పేరు. రాయలసీమలో సామాన్య జనులు “ఒక పదం పాడమ్మా” అనేది అలవాటు. పదము అనగా భక్తికి సంబంధించిన పాట అని అర్థము. కళగాను, శాస్త్రముగాను జనులకు తెలియక పోయినను, మతమును వ్యాపించుటకై దైవ భక్తిని జనుల హృదయంలో పెంపొందింప జేయుటకై అనేక రకములైన పాటలను మన పూర్వులు రచించిరి. వాటిలో కలుపు తీసేవారు ‘కలుపు పాటలు’, దంపుళ్ల వారికి ‘దంపుడు పాటలు’, జోలపాట, మొదలగునవి ఉన్నాయి. చాల వరకు జానపదములు నాయకా నాయకీ భావములతోనే రచించబడినవి కానీ కొంతవరకు యివన్నియు భక్తి పాటలే. శృంగార రసములోనే దేవుని ధ్యానించుట పూర్వము నుండి మన దేశములో ఉంది. పరమాత్ముడు నాయకుడుగను, జీవాత్మను నాయకిగను రచయిత మనస్సులో పెట్టుకొని ఈ రచనల రచించెను. ఆ శాఖకు చెందినదే ఈ ‘పదము’ ఆను రచన. ఇది సంగీత రచనలో ఒకటి, జానపదములతో కాక శాస్త్ర నిబంధనలలో రచింపబడింది.

లక్షణము

ఇది పల్లవి, అనుపల్లవి, చరణములను అంగములను కలిగి యుండును. ఒక్క చరనమైననూ ఉండవచ్చును. లేదా పెక్కు చరణములను కలిగియూ ఉండవచ్చును. కఠిన సంచారములు గాని ఎక్కువ సంగతులు కాని పదములందు ఉండకూడదు. చాల నెమ్మదిగా పాడదగిన రచన. రాగ భావము ఉట్టిపడుచుండును. ఇందు సాహిత్యము సామాన్య వాడుక భాషలో రచింపబడి యుండును. చరణములు ఒకే ధాతులో పాడునవిగా నుండును.

సాహిత్యము లోని పదములు ద్వందార్థములు కలవిగా నుండును. కొన్ని పదములు నాయకుడు పాడునవిగానూ, కొన్ని నాయకి పాడునవిగాను, కొన్ని సఖితో నాయకుడో, నాయకీయో పాడినట్లు గాను ఉండును. నాయకానాయకీ భావముతో సాహిత్యము రంజితముగా నుండును.

క్షేత్రజ్ఞుల వారు విజయ రాఘవ నాయకులను తంజావూరు రాజులపై, ‘విజయ రాఘవ పంచరత్నములు’ అను పేర ఐదు పదములను రచించిరి.

తెలుగు పద రచయితలు

కేత్రజ్ఞ, పెద్ద దాసరి, పరిమళరంగ, సారంగపాణి, కస్తూరిరంగ, ఘనం శీనయ్య, శోభనాద్రివారు, ఘటపల్లివారు, జటపల్లివారు, ఇనుకొండవారు, వీరభద్రయ్య, కవి మాతృ భూతయ్య మొదలగువారు.

తమిళ రచయితలు

ఘనం కృష్ణయ్యర్, వైదీశ్వరన్, కోయిల్ సుబ్బరామయ్యర్, కవికుంజర భారతి, మాంబళి, కవిరాయర్.

కొన్ని పదములు

అలిగితే,  మంచిదినము, ఏమందునమ్మా, ఏ రీతి బొంకేవు ఇందెందు, మగవాడని.

జావళి

జావళి కర్ణాటక సంగీతంలో ఇటీవల ప్రబలిన రచన. ఈ రచన ఆకర్షణీయమైన మెట్టులో రచియింపబడుటచే సంగీత ప్రపంచమున వ్యాప్తి చెందినది. జావళీలు సామాన్య రాగములోనూ, సాధారణ తాళములోను రచియింపబడినవి. కేవలం శృంగారమే దీని సాహిత్య భావము. పల్లవి, అనుపల్లవి, ఒకటి లేక కొన్ని చరణములను కలిగి యుండును. ఈ రచనలో నాయకా నాయకీ భావములే కాని, ద్వందార్థములు గాని, భక్తి మార్గము గాని ఏమియు లేవు. భాష సామాన్య వాడుకలో నుండు భాష. కొన్ని చోట్ల కొంత బూతులు కూడ కాననగును. పదము వలె కాక చాల చురుకుగా పాడదగిన రచన. తేలిక రచన ఇది.

ధర్మపురి సుబ్బరాయర్, పట్నము సుబ్రహ్మణ్యయ్యర్, పట్టాభిరామయ్య, రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్ మొదలగువారు ప్రముఖ జావళీల రచయితలు.

కొన్ని జావళీలు

  1. మరులుకొన్నదిరా – ఖమాస్
  2. అపుడు మనసు – ఖమాస్
  3. వేగనీవు – సురటి
  4. నిరుపమాన – బేహాగ్
  5. వద్దని నేనంటిని – హిం.కాఫీ
  6. ఏమందునే – ముఖారి

తిల్లాన

పల్లవి, అనుపల్లవి, చరణములను అంగములు కలిగి మధ్యమ కాలములో పాడదగిన రచన ఇది. దీని సాహిత్యము జతులతోను స్వరముల తోను విరాజిల్లును. ఇది చురుకైన రచన. ఉద్రేకింపజేయు రచన.

హెచ్.హెచ్. స్వాతి తిరుణాల్, మైసూరు సదాశివరావు, రామ్నాడు శ్రీనివాసయ్యంగార్, పల్లవి శేషయ్య, పొన్నయ్య పిళ్ళే గార్లు ముఖ్య తిల్లాన రచయితలు.

కొన్ని తిల్లానలు

  1. ఉదరినదీం – కాఫీ – పల్లవి శేషయ్య
  2. ఉదన – ఆఠాణ – పొన్నయ్య పిళ్ళై
  3. తానోంతనన – ఫరజు – రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్
  4. ధీంతతర – బిలహరి – ఆరియకుడి రామానుజయ్యంగార్

దరువు

నృత్య నాటకములోను, సంగీత నాటకములోను పాడబడు రచన ఇది. పల్లవి, అనుపల్లవి, చరణము కలిగి ఉండును. ఇందు సాహిత్యము ముఖ్యము. సాహిత్యము శృంగారము గాను (లేక) రాజ పోషకుని స్తుతి గానో ఉండవచ్చును.  ధ్రువ అను పురాతన రచనలో నుండి ఇది వచ్చినట్లు తెలియుచున్నది.  కొన్ని దరువులు సాహిత్యములో జతులు కూడా కాననగును.

సాహిత్యములోని అర్థమును బట్టి దరువులను ఈ క్రింది విధముగా విభజించవచ్చును.

1) సంవాద దరువు:

ఇందు ఇద్దరికి సంవాదము లేక డైలాగ్ జరుగును. దీనిలో సంవాదము జరుగు ఇద్దరికిని కడపటికి ఒక ముగింపు ఉండును.

2) స్వగత దరువు:

తనలో తాను ఒక విషయమును గూర్చి తలపోసుకొను రచన. ఈ రచన కొంచెం చౌకగా వుండును.

3) పాత్ర ప్రవేశ దరువు:

ఇది నృత్య నాటకములోని ఒక్కొక్క పాత్రను ప్రేక్షకులకు పరిచయము చేయనది.

4) వర్ణన దరువు:

ఒక స్త్రీని గాని, పురుషుని గాని, వనమును గాని, యుద్ధమును గాని, మరి దేనిని గాని వర్ణించునది.

5) కోలాట దరువు:

కోలాటమునకు ఉపయోగించునది.

6) ఉత్తర ప్రత్యుత్తర దరువు:

వాగ్వాదము, దీనిలో ఒట్టి వాగ్వాదమే యుండును.

7) జిక్కిని దరువు:

మధ్యమ కాలములో ప్రవేశించునట్లు తోచును. మొదటి భాగములో పూర్తిగా జతులు, రెండవ భాగములోనే సాహిత్యము కాననగును. ఈ రకపు దరువ్పులో అక్కడక్కడ దరువులు చాలా ఆకర్షణీయముగా యుండును. కొన్ని అపూర్వ తాళములు కూడా చూడగలము. కురు ఝంపె  అనగా 015 13 (10 అక్షరముల కాలము ఒక ఆవర్తనమునకు) గల కాల గతులను కూడా మనము ఇటువంటి రచనలలో కాంతుము.

8) ఓరడి దరువు:

పల్లవి, అనుపల్లవి, చాలా పొడవైన చరణము గల తమిళ రచన. పెద్ద పట్టణములుగాని, విషయవర్ణనలను గాని వర్ణించుచూ పెద్ద పెద్ద చరణములతో యుండును. ధాతువు ఒకే మెట్టుగా యుండును. సాహిత్యములో విషయము వేరువేరుగా ఉండడం బట్టి ధాతు క్రమము విసుగును చెందింపదు. కొన్ని దరువులలో చరణములో మధ్యమ కాల సాహిత్యముండును.

సాధారణముగా దరువులు మధ్యమ కాలములో పాడదగినవిగా యుండును. ఒక్కొక్క దరువులో ఒక్కొక్క తమిళ సామెతను చేర్చియున్నారు. అన్నాస్వామి శాస్త్రి గారు కేదారగౌళ రాగం – రూపక తాళములో – ‘కామించి యున్నదిరా’ అని ఉడయారుపాలెం జమీందారు పై రచించిన దరువు ప్రఖ్యాతి చెందినది. బాలస్వామి దీక్షితులు వేంకటేశ్వర మట్టెంద్ర మహారాజుల వారిపై వసంత రాగములో ‘సామికి సరి మివ్వరే’ అను దరువును రచించి యున్నారు. ఇందులో చరణాంత జతులతోను, స్వరములతోనూ అందంగా కూర్చబడినది. మెడట్టూరు వేంకటరామ శాస్త్రి తెలుగులో చక్కటి దరువులను రచించి యున్నారు.

అష్టపది:

సంగీత నాటకములు హిందూ దేశములో చాలా పురాతన కాలము నుండి ఉనట్లు తెలియుచున్నది. నాటకములను సాహిత్యముగా చదవగలము. కానీ సంగీత నాటికను సభాస్థలమందు వేదిక పైన దుస్తులతోను తగిన ఏర్పాట్లతోను ప్రదర్శించినప్పుడు కన్నుల పండుగగాను, వీనుల విందుగాను యుండును. సంగీతము నాటకమంతయూ నిండి యుండును. ఇటలీలో సంగీత నాటకము మొదట పైకి కనిపించిననూ, హిందూ దేశములో 12వ శతాబ్దములోనే కనబడినది. అదియే ‘గీత గోవిందము’. దీనిని శ్రీ జయదేవులు రచించిరి. ‘శృంగార మహా కావ్యము’ అని దీనికి పేరు. ఇది సంస్కృతమునందు రచింపబడి యున్నది. దీనిలో 12 భాగములున్నవి. ఒక్కొక్క భాగమునకు సర్గమని పేరు. ఈ కావ్యములఓ 24 రచనలున్నవి. దీనిలో వచ్చు ముఖ్యపాత్రలు రాధ, కృష్ణుడు, సఖి. ఒక్కొక్క రచన ఆరంభంలోనూ, తుది లోనూ ఒక్కొక్క శ్లోకముండును. వచన భాగము వల్ల కథ మనము తెలిసికొనగలము. ఇందలి రచనకు అష్టపది అని పేరు. ఏలన, ఒక్కొక్క అష్టపదికి 8 చరణములున్నవి. కాని చరణము మొదట పాడి తరువాత పల్లవి వలె యుండు అంగమును పాడవలెను. జయదేవుని కాలమున కృతి వంటి రచనలు లేవు కాబట్టి అష్టపదులకు పల్లవి, అనుపల్లవి వంటి అంగములు లేవు. పల్లవి వంటి అంగముకు ‘ధ్రువం’ అని పేరు. కీర్తన అను రచనకి ముందు రచన అష్టపది అనవచ్చును. ఉదాహరణ – శేఖరేంద్ర సరస్వతి గారి శివాష్టపది, రామకవి రామాష్టపది, వేంకటమఖి గాఇర్ త్యాగరాజాష్టపది మొదలైనవి.

గీతగోవిందములో నాయకీనాయక భావమున్నది. రాధాకృష్ణులు నాయికానాయకులు. మొదట అష్టపది ‘దశావతార’ అష్టపది. జయదేవుడు బుద్ధిని ఒక అవతారముగా చేర్చియున్నాడు. శ్రీకృష్ణుని పరబ్రహ్మగా నెంచెను. కనుకనే శ్రీకృష్ణుని దశావతారములలో చేర్చలేదు. త్యాగయ్య గారు కూడా శ్రీరాముల వారిని పరబ్రహ్మముగానే నెంచెనని తోచుచున్నది. అష్టపదులు కూడా భక్తి రచనలలోనే చేర్చబడును. అష్టపదులే మొట్టమొదటి సంగీత రచనలు. పలు విధములైన భావములు, రసములు బాగుగా అష్టపదులలో చూపబడినవి. 12వ అష్టపదికి ‘సంజీవినీ’ అష్టపది అని పేరు.

తరంగము:

నారాయణ తీర్థుల వారి సంగీత నాటకమగు శ్రీ కృష్ణలీలా తరంగిణిలోని రచనలకు తరంగములు అని పేరు. ఈ నాటకములో 12 భాగములన్నవి. ఒక్కొక్క భాగములో కొన్ని రచనలున్నవి. దీనిలోనూ శ్లోకములు, వచన భాగములు యున్నవి. కృష్ణ లీలలతో ప్రారంభించి, రుక్మిణీ కల్యాణముతో ముగియును. ఒక్కొక్క కీర్తనకు పల్లవి, అనుపల్లవి, కొన్ని చరణములు అను భాగములున్నవి. కొన్ని కీర్తనలలో జతులు కూడా వున్నవి. తరంగము యొక్క భాష సంస్కృతము.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here